అవును నిజమే… స్వప్నమే కావాలి!

 

 శివలెంక రాజేశ్వరీదేవి  రాసిన కవితల పుస్తకం “సత్యం వద్దు స్వప్నం కావాలి” ప్రచురణని గురించిన వార్త  కనిపించిన ప్రతి సారి తప్పకుండ ఆ బుక్ చదివి తీరాలన్న కోరిక బలం గా పాతుకుంది. అలాగే సాయంకాలపు వడగాలుల్ని మహా నగరపు దూరాభారాల్నీ దాటి తార్నాక నుండి  అబిడ్స్ లోని  గోల్డెన్ థ్రెషోల్డ్ లో అడుగు పెట్టి బుక్ కొన్న తర్వాత గానీ ఆ లోలోపలి అశాంతి తగ్గలేదు. ఏదో అపురూపమైంది చదవడానికి దొరుకుతుందన్న నమ్మకం.  అప్పటికి అక్కడ వీర లక్ష్మి గారి ఉపన్యాసం వినిపిస్తోంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి ఉపన్యాసం ముగిసిందీ. అక్కడి వక్తల ప్రసంగాలేవీ చెవికెక్కలేదు. అప్పటికి ఒక పాతిక పుస్తకాల దాకా సేల్ అయినట్టున్నాయి. తెలిసిన వారందరికి హెల్లోలూ హాయ్ లు చెప్పేసి ఇంటికి వచ్చేసి, డిన్నరయ్యాక, స్థిమితంగా వెనక పరిచయాల వివరణల నుంచీ మొదలు పెట్టాను చదవడం. ముట్టుకుంటే చిట్లిపోతుందేమో అనిపించే గాజు బొమ్మ, రాత్రిని పగలు గా పగటిని రాత్రిగా మలుచుకున్న స్వాప్నిక, ప్రేమార్త హృదయం – ఇవీ అందులో అందరూ కామన్ గా రాజేశ్వరి గురించి ఉదహరించిన విశ్లేషణలు. మొదటి కవిత “ఊరికెనే” చదవడం మొదలు పెట్టాను.

 

ఎంతో మామూలుగా సామాన్య ధోరణిలో తేలికగా ఉపయోగించే పదం అది. చిన్న సంభాషణా పూర్వక దృశ్యాన్ని ఆవిష్కరించిన కవిత అది. వాక్యం తర్వాత వాక్యం చదివే సరికి, నా చుట్టూ ప్రపంచపు కోటి గొంతులు ప్రతిధ్వనించాయి. ప్రతి వాక్యమూ ప్రపంచపు కఠినత్వపు ధోరణి, మూగగా స్పందించే కవితాత్మక సుకుమారత్వమూ, కొంత బేలతనమూ, ఒక హృదయపు కోమలత్వమూ సాక్షాత్కరించాయి. మొదటి కవిత చదవడం పూర్తయ్యే సరికి, తెలియని గుండె భారం కళ్ళకు కమ్మి, పేజీలని ముందుకు కదలనివ్వలేదు.
 
ఈ కవితకి యే వ్యాఖ్యానమూ అక్కరలేదు. ప్రపంచపు పోకడలకీ కవయిత్రి పసి మనసుకి జరిగిన సంవాదమిది. అతి సులభంగా ప్రతి సున్నిత హృదయమూ తనని తాను చూసుకునే అద్దం. అందుకే యే వివరణ ఇవ్వకుండా – సూటిగా కవితనే ఇక్కడ పొందు పరుస్తున్నాను. అద్దం లో నెలవంక శీర్షికని తిరిగి మొదలు పెడదామని గత మూడు నెలలుగా చాలా ప్రయత్నిస్తున్నాను. రఫ్ స్కెచెస్ రాసుకున్న కవితలున్నాయి. కానీ తనను తాను గా ప్రవహింప చేసుకున్న చిక్కని భావాన్ని, తేట దనపు ప్రవాహాన్నీ ఒకే చోట చూసిన యీ కవిత చదవాక యీ కవితా సంపుటి గురించి తప్పక రాయాలి అనిపించింది. పరిమళానికి చిరునామాలు అవసరం లేదు. వ్యాపించడమే దాని పని. రాజేశ్వరి పరుచుకుంటూ వెళ్ళీన అక్షరాల వెంటా మన కళ్ళు పరుగెత్తిస్తే చాలు, అనేక అమూర్త భావాల మల్లెల పారిజాతాల పరిచయాలవుతాయి, నైట్ క్వీన్ డాఫోడిల్స్ ఆమె వెన్నెల ఏకాంతాల రహదారుల్లో సాక్షాత్కరిస్తాయి. వేదనా భరితమైనా, ఏకాంతమే స్వాంతన ఆ కవితాత్మక మూర్తికి!  ఆలస్యం గా నైనా ఆమె కవితలు ఇలా ఒక సంకలనంగా చదువరుల చేతికి అందించిన విషయమై  తెలుగు కవితాత్మక ప్రేమికులు నామాడి శ్రీధర్ గారికి ఋణపడివుంటారు!
 
అక్షరాల నిండా పరుచుకున్న రాజేశ్వరీదేవి వేదనాత్మక ప్రణయ పూరిత భావాల గాలుల్ని మనస్ఫూర్తిగా శ్వాసించిన మనసులన్నీ  ఆమెతో యీ విషయంలో ఏకీభవిస్తాయి…
  అవును నిజమే… సత్యం వద్దు, స్వప్నమే కావాలి!

 
“ఊరికేనే”

 
కవితా సంకలనం: సత్యం వద్దు స్వప్నమే కావాలి
కవయిత్రి: శివలెంక రాజేశ్వరీదేవి
ఎందుకలా వర్షం లో
డాబా మీదకి వెళతావ్ పాపా?
“ఊరికేనే”
ఎందుకలా పని ఆపేసి
పాట వింటావ్ పాపా
“ఊరికేనే”
ఎందుకనవసరంగా
వాళ్ళ దిగులు నీకు పాపా
“ఊరికేనే”
ఎందుకా టెలిఫోన్ టాక్ పాపా
“ఊరికేనే ఆ స్వరం తీయగా వుంటేను”
ఇక్కడ ఆగి అక్కడ ఆగి పనేమైనా వుందా?
“ఊరికెనే, పనేం లేదూ పలకరించి పోదామని”
ఇదిగో ఇదే చెపుతున్నా గుర్తుంచుకో పాపాయ్
పనేం లేకపోతే
ఊరికేనే పలుకరించకూడదు ఎవరినీ-
ఆ అలా చూడకు నా కళ్ళలోకి “ఊరికేనే”
అదో ప్రశ్నార్థకమై నన్ను భయపెడుతుంది
***

మీ మాటలు

  1. ఆమోద యోగ్యం కాని తన జీవన శైలికి లోక ఆమోదం ఆశించని, దేబిరించలేని ఐచ్ఛిక ఒంటరి రాజేశ్వరీదేవి. తన నిర్ణయ పర్యవసానాలు తెలిసిన వివేకా, వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తం కాని పసిపిల్లా ఏక కాలంలో ఆమే.
    ఇదే ఆమె కవితల్లో, కవితల్లాంటి డెస్పరేట్ సంభాషణల్లో, ప్రబల తాత్విక ప్రతిపాదనల్లాంటి బలమైన ప్రకటనల్లో, ఇంకా పూర్తి కాక మిగిలిపోయిన స్కెచెస్ లాంటి కవితా పాదాల్లోనూ వెల్లడి అవుతుంది.
    డియర్ జయశ్రీ ఆమె కవిత్వం, స్వభావం పైన మీ అంచనా చాలా ఆత్మీయంగా వుంది.
    ఇలాంటి ఒక్క చప్పట్లయినా ఆమె బతికి వున్నప్పుడే ఆమెకు అంది, దక్కి వుంటే ఎంత బాగుండేది కదా అని తరుక్కు పోయే తీవ్ర బాధతో గుండె కళుక్కుమంటోంది.
    మీరు ఆమె కవితలని మీకై చదువుకున్న తీరు నన్ను చాలా ఆకట్టుకుంది.ఆ తీరును చెప్పిన పద్ధతీ నచ్చింది.

  2. Jayashree Naidu says:

    థాంక్ యూ వెరీ మచ్!
    సాహిత్యం మనకోసం మనం పోషించుకోవలసిన అంశం. అదీ ఇలాంటి ఆత్మిక కవిత్వం విషయం లో మరీ తప్పని సరి. మీ ఆత్మీయ స్పందనకు మరో సారి ధన్యవాదాలు ANTU

మీ మాటలు

*