అమ్మ ఆరాధనలో కమ్మగా జీవించిన ట్రోజన్లు

 

స్లీమన్ కథ-30

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఈజిప్టు పూజారుల ద్వారా హెరోడొటస్ తెలుసుకున్న సమాచారం ప్రకారం, ట్రోజన్ యుద్ధం పూర్తిగా అర్థరహితం. ఎందుకంటే,  ట్రాయ్ పై గ్రీకులు దాడి చేసిన సమయంలో హెలెన్ కానీ, ఆమెను ఎత్తుకువెళ్లిన పారిస్ కానీ అసలు ట్రాయ్ లోనే లేరు. పారిస్ ఆమెను తీసుకుని ఈజిప్టు రాజధాని మెంఫిస్ కు పారిపోయాడు. వారిద్దరినీ నిర్బంధంలోకి తీసుకోమని ఫారో(ఈజిప్టు చక్రవర్తి)ఆదేశించాడు. పారిస్ ను విచారిస్తూ, నీ పక్కనున్న ఈ యువతికీ నీకూ ఏమిటి సంబంధమని ప్రశ్నించారు. పారిస్ ఆ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. దాంతో అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత హెలెన్ భర్త మెనెలాస్ మెంఫిస్ కు వచ్చి, హెలెన్ ను తన భార్యగా నిరూపించుకుని ఆమెతో కలసి గ్రీస్ కు తిరిగివెళ్ళాడు.

హెరోడొటస్ ఇలా అంటాడు:

ట్రాయ్ లో ఏం జరిగిందో చెప్పే గ్రీకుల కథనం నమ్మదగినదేనా అని పూజారులను అడిగాను. దానికి సమాధానంగా,  మెనెలాస్ స్వయంగా చెప్పినదంటూ వాళ్ళు కొంత సమాచారం ఇచ్చారు. దాని ప్రకారం, హెలెన్ ను ఎత్తుకువెళ్లినట్టు తెలిసిన గ్రీకులు, మెనెలాస్ కు మద్దతుగా పెద్ద సైన్యాన్ని పంపించారు. అది ట్రోజన్ గడ్డమీద అడుగుపెట్టి కుదురుకున్న తర్వాత రాచనగరుకు కొందరు దూతలను పంపించారు. వారిలో మెనెలాస్ కూడా ఒకడు. ట్రోజన్ల స్వాగతం అందుకున్న ఆ బృందం, హెలెన్ ను, పారిస్ అపహరించిన సొత్తును, తగిన పరిహారంతో సహా అప్పగించవలసిందిగా కోరింది.* హెలెన్ తమ వద్ద లేదనీ, ఆ సొత్తు కూడా తమ స్వాధీనంలో లేదనీ, హెలెన్ తప్పించుకుని ఈజిప్టుకు వెళ్ళగా అక్కడి రాజు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నాడనీ ట్రోజన్లు వారికి చెప్పారు. తమ అధీనంలో లేనివాటిని కోరుతూ తమను శిక్షించబోవడం అన్యాయమని వారు వాదించారు.

సత్యప్రమాణంగా ఇదీ జరిగింది అంటూ ట్రోజన్లు మొదటినుంచీ ఈ కథనానికే కట్టుబడి ఉంటూ వచ్చారు.  గ్రీకులు మాత్రం దీనిని కట్టుకథగా తోసిపుచ్చారు. నగరాన్ని ముట్టడించి అది కుప్పకూలేవరకూ పోరాటం సాగించారు. అయినా హెలెన్ జాడ వాళ్ళకు కనిపించలేదు. ఓడిపోయిన దశలో కూడా ట్రోజన్లు తమ మొదటి కథనాన్నే నొక్కి చెప్పారు. వాళ్ళ మాటల్లో నిజముందని గ్రీకులు ఎట్టకేలకు తెలుసుకున్నారు. మెనెలాస్ ను ఈజిప్టు చక్రవర్తి వద్దకు పంపించారు. మెనెలాస్ నదీమార్గంలో మెంఫిస్ కు చేరుకుని అసలు కథను వినిపించిన తర్వాత ఈజిప్టు అతన్ని ఆదరించి ఇతర సొత్తుతో సహా హెలెన్ ను అప్పగించింది.

అయితే, ఈజిప్టు అంత ఆదరించినా మెనెలాస్ ఆ దేశంపట్ల కృతఘ్నతను చాటుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల పవనాలు వీస్తుండడంతో కొన్ని వారాలపాటు అతను ఈజిప్టులోనే ఆగిపోవాల్సి వచ్చింది. పవనాలను తనకు అనుకూలంగా మార్చుకోడానికి ఇద్దరు ఈజిప్టు బాలులను పట్టుకుని దేవతలకు బలి ఇచ్చాడు. ఈ దారుణం గురించి తెలిసిన ఈజిప్టువాసులు పగద్వేషాలలో రగిలిపోతూ అతన్ని వెంటాడారు. మెనెలాస్ ఎలాగో తప్పించుకుని లిబియాకు పారిపోయాడు. ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఈజిప్టుకు తెలియదు.

ట్రోజన్ యుద్ధం గురించిన హెరోడొటస్ కథనం ఇలా సాగుతుంది. అయితే దీనిని బొత్తిగా నిరాధారమని అనలేం. విచిత్రంగా హోమర్ పద్యాలలోనే ఇందుకు సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఫినీషియా లోని సైదున్(Sidon)కు పారిస్, ఈజిప్టుకు మెనెలాస్ ప్రయాణం చేసినట్టు అవి చెబుతున్నాయి. హోమర్ పై తనకు ఎంత ఆరాధనాభావం ఉన్నా; కేవలం హెలెన్ ను పారిస్ సొంతం చేసుకోవడం కోసం మొత్తం ట్రాయ్ నీ, ట్రోజన్లనూ బలిపెట్టేంత ఉన్మాదిగా రాజు ప్రియామ్ ను హెరోడొటస్ భావించలేకపోయాడు. “ఒకవేళ ప్రియామ్ స్వయంగా హెలెన్ ను వివాహమాడి ఉన్నా, అది ఇంతటి విధ్వంసానికి దారితీస్తున్నప్పుడు కూడా ఆమెను అప్పగించకుండా ఉంటాడంటే నేను నమ్మలేను” అని అతను రాశాడు. మొత్తానికి వాస్తవంగా ఏం జరిగిందో హెరోడొటస్ తో సహా ఎవరికీ తెలియదు. ఒకటి మాత్రం నిశ్చయం: ఊహించడానికి కూడా వీలులేనంత అర్థరహిత యుద్ధం అది. అదే సమయంలో, మిగతా యుద్ధాలను మించిన అర్థరహితం మాత్రం కాదు.**

ట్రోజన్ యుద్ధానికి దారి తీయించిన కారణాలు మనకు స్పష్టంగా తెలియకపోయినా, అందులో పాల్గొన్న వీరుల గురించి మాత్రం బాగా తెలుసు. ట్రోజన్ సమాధులేవీ బయటపడలేదు. మైసీనియాలో బయటపడిన సమాధుల విషయానికి వస్తే, అవి యుద్ధానికి ముందు కాలానికి చెందినవి. కానీ, నాటి సైనికుల గురించి మనకు బాగా తెలుస్తోంది. హోమర్ చిత్రణలు, తవ్వకాలలో బయటపడిన సాక్ష్యాలు ఒకేవిధంగా వారిని మనకు పరిచయం చేస్తున్నాయి. మైసీనియా తవ్వకాలలో స్లీమన్ గుర్తించిన కొందరు అజ్ఞాత రాజులు జీవించిన కాలానికీ, ట్రోజన్ యుద్ధం జరిగిన కాలానికీ మధ్య పెద్దగా మార్పు ఏమీ సంభవించలేదు. సైనికుల ఆహార్యం, ఆయుధాలు, యుద్ధం సాగించే తీరు, ప్రజలు ధరించే దుస్తులు, అలంకరణ, సాంఘిక ఆచారాలు, వ్యవసాయవిధానాలు, ఆహారపు అలవాట్లు, దేవతల కొలుపులు-అన్నీ ఇంచుమించు ఒకలాంటివే.

వారి జుట్టు బుజాల వరకూ వేళ్లాడుతూ ఉండేది. బంగారు, వెండి సూత్రాలతో దానిని ముడేసుకునేవారు. వేసవిలో మగవారు చేతులున్న చొక్కాలను మోకాళ్ళ వరకూ ధరించేవారు. శీతాకాలంలో చేతులు లేని పెద్ద పెద్ద అంగరఖాల్లాంటివి ధరించి మెడ దగ్గర ముడేసుకునేవారు. అవి పడకమీద పరిచిన దుప్పట్లలా కూడా పనికొచ్చేవి. నడుములకు అలంకృత పట్టీలను(వడ్డాణాల లాంటివి), కర్ణాభరణాలను, మెడలో గొలుసులను, స్వర్ణహారకిరీటాలను, జడకట్టులను ధరించేవారు. అరచేతులకు తొడుగులు వేసుకునేవారు. వారికి ఉన్ని వాడకం తెలుసు. పూజారిణులు, సంపన్న మహిళలు మంచి కుట్టుపని చేసిన రంగురంగుల అంచులున్న కటివస్త్రాన్ని ధరించేవారు. ఒక్కోసారి కటివస్త్రం, అమ్మవారి స్వర్ణముద్రపై ఉన్న చిత్రంలో స్త్రీలు ధరించిన విధంగా విభజితమై ఉండేది. సైనికులు పంది దంతాలతో చేసిన శిరస్త్రాణాన్ని ధరించేవారు. మైసీనియాలో దొరికిన వంపుతిరిగిన పంది దంతాలు అచ్చం హోమర్ వర్ణించినట్టే ఉన్నాయి.

కుర్చీలు, బల్లలు ఉపయోగించేవారు. కానీ కంచాలలో భోజనం చేసేవారు కాదు. బల్ల మీదే పదార్థాలను పరచుకుని తినేవారు. ఆ తర్వాత బల్లను శుద్ధి చేసేవారు. మేక మాంసం, పంది మాంసం, చాలా అరుదుగా గొడ్డు మాంసం తినేవారు. వీటితోపాటు పెరట్లో కోళ్ళ పెంపకం ఉండేది. ఇళ్ళల్లో బాతులు తిరుగుతూ ఉండేవి. జింకలను, అడవి పందులను, అడవి మేకలను, కుందేళ్ళను, తోడేళ్లను వేటాడేవారు. చేపలు తినేవారు, నత్తగుల్లలను మరింత మక్కువతో తినేవారు. గోధుమ, బార్లీ, సజ్జలు, చిక్కుడు, బటానీ, కాయధాన్యాలను పండించేవారు. ద్రాక్షను, ఆలివ్ చెట్లను సాగుచేసేవారు. మద్యంలో తేనె కలుపుకుని సేవించేవారు.  తోటల్లో బేరి, అత్తి, యాపిల్, దానిమ్మ వగైరా పండ్లను పండించి ఇష్టంగా తినేవారు. పిల్లలు మాంసం, మజ్జ, వెన్న తినేవారు. పాల వాడకం తెలియదు. చీజ్ ను పేదలకు కూడా అందుబాటులో ఉండే పదార్థంగా భావించేవారు. పిల్లులు ఉండేవి కావు. క్రీ.పూ. 6వశతాబ్దిలోనే పిల్లి గ్రీస్ లో అడుగుపెట్టింది. వేటకుక్కలు, కాపలాకుక్కలు ఉండేవి.

తాము దైవసమానుడుగా భావించే రాజు చుట్టూ అల్లుకున్న నిరాడంబర, ఆదిమ సామాజికవ్యవస్థ వారిది. దాదాపు పరిశ్రమలంటూ ఏవీ లేవు. నాణేల వాడకం తెలియదు. ప్రతి తెగా విపరీతమైన స్వాభిమానంతో ఉండేది. ఇతర తెగలపట్ల అదే స్థాయిలో శత్రుత్వం వహించేది. అయితే, ఒక్కోసారి ఇతర తెగలతో మైత్రిని కల్పించుకుని శాంతి, సామరస్యాలతో జీవించడమూ వారికి తెలుసు.*** సర్ వాల్టర్ లీఫ్**** మాటల్లో చెప్పాలంటే, “అప్పటి వారి వ్యవస్థలు, మనుషుల గుంపులను బానిసలుగా మార్చుకుని చెప్పు చేతల్లో ఉంచుకోగలిగినంత బలమైనవి కావు”. ఇప్పటి జనసమూహాలతో పోల్చవలసివస్తే, వారు నేటి ఇండొనేసియాలోని బలిద్వీపవాసులకు దగ్గరగా ఉంటారు. ఈ ద్వీపవాసులు కూడా చండశాసనులైన రాజుల ఏలుబడిలో దేవతలు, రుతువుల పట్ల సామరస్యంతో నిరంతర శ్రమజీవనం గడుపుతూ ఉంటారు.

ట్రోజన్లు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు. వారి ఆరాధనలో ఆనందం వెల్లివిరుస్తూ ఉండేది. వారికి ఉపవాసాలు, పాపపరిహారాలు, ప్రాయశ్చిత్తాలు తెలియవు. వారిలో అపరాధభావన లేదు. అనాదికాలంలో ఒకానొక తోటలోని నిషిద్ధ ఫలాన్ని తిన్న నేరానికి తమకు ఏదో వినాశనం దాపురించబోతోందన్న భావన వారికి తెలియదు. వారిలో యవ్వనోత్సాహం, తాజాదనం తొణికిసలాడుతూ ఉండేవి. సూర్యకాంతి నిండిన ఒక ప్రాకృతిక ప్రపంచంలో వారు జీవించేవారు. అప్పటికింకా వారి దేహతంత్రులు పాలు గారుతూ సరికొత్తగా ఉండేవి. వారి చుట్టూ దివ్యత్వం తాండవిస్తూ ఉండేది. ***** దేవతలకు సొంతంగా ఒక హోదా, వారిలో తమవైన ఒక తారతమ్యక్రమం ఉండడం నాటి జనానికి పెద్ద విశేషంగా  కనిపించేది కాదు; వెండి విల్లు ధరించిన అపోలో “దేవతలందరిలోనూ బలవత్తరుడు”, అయితే, జియస్ కూడా అంతే బలవత్తరుడు. వారి దృష్టిలో దేవతలందరూ దాదాపు మర్త్యులే; అలాగే మనుషులందరూ దాదాపు దివ్యులే. మానవ జీవితపు అత్యున్నత సాఫల్యం దేవతల ప్రపంచంలోకి అడుగుపెట్టగలగడమే. మర్త్యుడైన దియోమెదెస్****** కూడా దేవత అఫ్రోడైట్ ను గాయపరచగలడు. దేవతలు సైతం విపణివీథిలో సంచరిస్తారు. మనుషుల్లానే వారు కూడా ప్రాకృతిక శక్తులముందు తలవంచుతారు. “మృత్యువు పాలించే చీకటి సామ్రాజ్యా”న్ని తలచుకుని వణకిపోతారు.

ట్రోజన్లు కాంతిని ప్రేమించేవారు, చీకటికి భయపడేవారు. దివ్యత్వం వారికి దాదాపు చేతికి అందేటంత దూరంలో ఉండేది. గాలిలో, స్పర్శలో, రాత్రిళ్ళు వేసుకునే చలిమంటలో, కంచు తళతళలలో, ప్రకాశించే ఆలివ్ చెట్లలో, మనుషుల ముఖాల్లో వారికి దివ్యత్వం గోచరించేది. జంటగొడ్డలి, చక్రాకార స్వస్తిక, అమ్మవారికి చెందిన చిన్న చిన్న మట్టిబొమ్మలు, చిత్రమైన బొంగరం ఆకృతులు వారికి దివ్యత్వ చిహ్నాలు. సాధారణంగా నీలిరంగు రాళ్ళతో మలచిన ఈ బొంగరం ఆకృతులు స్త్రీగర్భానికి, అంతుబట్టని సృష్టి ప్రారంభానికి ప్రతీకలు. ప్రతి చిన్న ప్రవాహాన్నీ అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs)ఉంటారు. *******ప్రతి ఉరుములోనూ వారికి ఒక అదృశ్యదేవత వాణి వినిపిస్తుంది. నదులు, సముద్రపు నురగ, పర్వతాలు, చెట్లు సహా అన్నింటిలోనూ దివ్యత్వం నిండి ఉంటుంది. అయితే అంత దివ్యత్వమూ మృత్యువు ముందు ఓడిపోతుంది. దేవతలు కూడా మృత్యువుకు తలవంచుతారు.  మనుషులు మృత్యువును తలచుకుని అంతులేనంతగా భయపడతారు. మృత్యువు, ప్రపంచపు ముఖాన లిఖించిన ఒక వక్రరేఖ. హోమర్ మృత్యుభయాన్ని చిత్రించినంత గాఢంగా, ప్రస్ఫుటంగా మరి దేనినీ చిత్రించలేదు.  ట్రోజన్ల ప్రత్యేక లక్షణమా అన్నట్టుగా దానిని వర్ణించాడు. అయితే ఆ మృత్యుభయాన్ని అంటిపెట్టుకుని ఒకవిధమైన గర్వమూ ఉంటుంది. భయపడుతూ, ద్వేషిస్తూనే మృత్యువును మెరిసే కళ్ళతో వారు పరిహసించనూగలరు.

హోమర్ ప్రకారం, ట్రోజన్లు, అఖియన్లు మృతులను దహనం చేసేవారు. బలిద్వీపవాసుల్లా చితిమంట చుట్టూ నృత్యం చేసేవారు. తన ఆప్తమిత్రుడు పెట్రోక్లస్ చనిపోయినప్పుడు చితిమీద అతని మృతదేహంతోపాటు గొర్రెలను, ఎద్దులను, గుర్రాలను, శునకాలనే కాక; పన్నెండుగురు ట్రోజన్ యువకులను కూడా ఉంచి అఖిలెస్ దహనం చేయించాడు. అయితే, ఇది ప్రాణమిత్రుడి గౌరవార్థం జరిగిన అరుదైన తంతే తప్ప తరచు జరిగేదిగా భావించలేము.  దేవుడు అపోలో జోక్యం చేసుకుని నివారించేవరకూ  పన్నెండు రోజులపాటు హెక్టర్ మృతదేహాన్ని అఖిలెస్ నానారకాలుగా అపవిత్రపరచడం కూడా ఇలాంటి అరుదైన సందర్భమే. మనకు అందుబాటులో ఉన్న ఇతర అనేక సాక్ష్యాల ప్రకారం, హోమర్ చిత్రించిన గ్రీకులు మృతులపట్ల అత్యంత భక్తిగౌరవాలను చాటుకునేవారు.********

హోమర్ చిత్రించిన చితిమంటలకూ, మైసీనియాలో బయటపడిన సమాధుల తీరుకూ ఎలాంటి పోలికా లేకపోవడాన్ని పండితులు ఎత్తిచూపారు. ట్రోజన్ యుద్ధానికి చాలా ముందునాటి నాగరికతకు చెందిన అంత్యక్రియల ఆచారాలకు అవి అద్దంపడుతున్నాయని వారు వాదించారు. స్వర్ణారాశులతో నిండిన ఆ సమాధులు ట్రోజన్ యుద్ధానికి ముందునాటివనడంలో సందేహం లేదు. అయితే, బంగారం దానికదే ఒక మంట లాంటిది. దహనం తర్వాత మాత్రమే మృతుల ఆత్మలను పితృదేవతల లోకంలోకి అనుమతిస్తారని హోమర్ నొక్కి చెప్పాడు. దానికి అనుగుణంగా బంగారపు ముసుగులనే ఒకవిధమైన చితిమంటకు చిహ్నంగా భావించడంలో తప్పులేదు. బంగారు ముసుగులతో మృతదేహాలను పాతిపెట్టడాన్ని దహనానికి ప్రత్యామ్నాయంగా గ్రీకులు భావించి ఉంటారు.

(సశేషం)

****

అథోజ్ఞాపికలు

*యుద్ధానికి ముందు శత్రువు వద్దకు దూతను పంపడం, ఆ దూతను గౌరవంగా చూడడం అనే పద్ధతీ, సంప్రదాయమూ రామాయణ, మహాభారతాలలో కూడా కనిపిస్తాయి.

**క్రీ.పూ. 4వ శతాబ్దికి చెందిన హెరోడొటస్ కూడా యుద్ధాలను ఇలా లాభ, నష్టాలు; హేతు, నిర్హేతుకల కోణంనుంచి చూడడం; ట్రోజన్ యుద్ధాన్ని అర్థరహితంగా భావించడం ఆశ్చర్యం గొలుపుతుంది. గణవ్యవస్థలోనూ, దానికి అతి సమీపంలోని ఇతిహాసకాలంలోనూ శత్రువు పట్ల పగప్రతీకారాలను తీర్చుకోవడం కంటే, అందుకు యుద్ధాలకు దిగడం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఏ లాభ, నష్టాల మీమాంసా, ఎలాంటి హేతు, నిర్హేతుకల పరిశీలనా అక్కడ పనిచేయదు. యుద్ధం చేయడం, ప్రాణత్యాగం చేయడం దానికదే ఒక ఉన్నతమైన విలువ. క్షత్రియుడిగా పుట్టినవాడికి యుద్ధం చేయడం, యుద్ధంలో చావడం ఎంతటి పుణ్యకార్యాలో మహాభారతం అడుగడుగునా చెబుతుంది. అర్జునుడు కానీ, ఇలియడ్ లోని హెక్టర్ కానీ యుద్ధానంతర విధ్వంసాన్ని తలచుకుని విషాదానికి లోనవడం మినహాయింపులు మాత్రమే. ఒకవైపు విషాదానికి లోనవుతూనే, మరోవైపు యుద్ధమూ, అది కలిగించే సర్వనాశనమూ అనివార్యాలన్న స్పృహా వారిలో ఉంది. వారు ఒకవిధంగా యుద్ధ అనుకూల-వ్యతిరేకతల సంధి దశను ప్రతిబింబిస్తూ ఉండచ్చు.

***అంతవరకూ ఒంటరిగా జీవించిన తెగలు, భిన్నమైన తెగలు తారసపడినప్పుడు వాటిపట్ల శత్రువైఖరి కనబరచేవి. యుద్ధాలకు దిగేవి. ఈ విధంగా చూసినప్పుడు యుద్ధమనస్తత్వానికి మూలాలు గణవ్యవస్థలో ఉన్నట్టు అర్థమవుతుంది. భిన్న తెగలతో మైత్రిని, సామరస్యాన్ని పెంచుకోడానికి గణవ్యవస్థలో సహజంగానే కొంత వ్యవధి పట్టి ఉంటుంది. గణవ్యవస్థ అంతరించిందని అనుకునే నేటి కాలంలోనూ ఆ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పలేం.

****సర్ వాల్టర్ లీఫ్(1852-1927): ఇంగ్లండ్ కు చెందిన ఒక బ్యాంకర్. వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ కు చాలా ఏళ్లపాటు డైరక్టర్ గా ఉన్నాడు. గ్రీకు ఇతిహాసాలలో పండితుడు, ఇలియడ్ ప్రామాణిక ముద్రణను తేవడంలో ముఖ్యపాత్ర పోషించాడు.

*****క్రైస్తవం, ఇస్లాంల ముందుకాలానికి చెందిన ట్రోజన్ల ఆరాధనావిధానాలలో, దేవీ, దేవుళ్ళలో, మతవిశ్వాసాలలో నేటి మన హైందవ లక్షణాలు కనిపిస్తాయి. మనకు ఇప్పుడు సైతం ఉన్నట్టే, వారిలోనూ అమ్మవారి ఆరాధన ఉండేది. దీని గురించి నా వెనకటి ‘పురా’గమన వ్యాసాలలో విస్తారంగా ప్రస్తావించాను. ఆసక్తిగలవారు చూడగలరు.

****** దియోమెదెస్: ట్రోజన్ యుద్ధంలో పాల్గొన్న ఒక గ్రీకువీరుడు.

*******మన పురాణ ఇతిహాసాలలోనూ  నదులను అంటిపెట్టుకుని అప్సరసలు(nymphs) ఉండడం తెలిసినదే.

********మహాభారతంలో తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుని శిరస్సును భీముడు కాలితో తన్నినప్పుడు. అది సహించని ధర్మరాజు భీముని మందలిస్తాడు. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత కూడా  తమ్ముడు విభీషణుడు అతనిని తూలనాడినప్పుడు. “మరణాంతాని వైరాని” అంటూ రాముడు అతన్ని మందలించి రావణుడి మృతదేహానికి అంత్యక్రియలు జరపమని కోరతాడు.

 

 

 

 

 

మీ మాటలు

  1. శ్రీనివాసుడు says:

    భాస్కరం గారూ!
    హైన్‌రిచ్ ష్లీమన్ ట్రాయ్ త్రవ్వకాలలో బయల్పడిన కొన్ని గుర్తులను తమ పూర్వీకుల ధార్మిక చిహ్నాలుగా భావించిన విషయాన్ని హిట్లర్ హైజాక చేసేడని చదివేను. ఆర్యులకు, ప్రాచీన భారతీయ సంస్కృతికి సంబంధం వున్నదని మొదట భావించింది ష్లీమన్ త్రవ్వకాలేనా?
    Schliemann discovered the hooked cross on the site of ancient Troy. He connected it with similar shapes found on pottery in Germany and speculated that it was a “significant religious symbol of our remote ancestors.”
    In the beginning of the twentieth century the swastika was widely used in Europe. It had numerous meanings, the most common being a symbol of good luck and auspiciousness. However, the work of Schliemann soon was taken up by völkisch movements, for whom the swastika was a symbol of “Aryan identity” and German nationalist pride

    This conjecture of Aryan cultural descent of the German people is likely one of the main reasons why the Nazi party formally adopted the swastika or Hakenkreuz (Ger., hooked cross) as its symbol in 1920.

    The Nazi party, however, was not the only party to use the swastika in Germany. After World War I, a number of far-right nationalist movements adopted the swastika. As a symbol, it became associated with the idea of a racially “pure” state. By the time the Nazis gained control of Germany, the connotations of the swastika had forever changed.

    The swastika would become the most recognizable icon of Nazi propaganda, appearing on the flag referred to by Hitler in Mein Kampf as well as on election posters, arm bands, medallions, and badges for military and other organizations. A potent symbol intended to elicit pride among Aryans, the swastika also struck terror into Jews and others deemed enemies of Nazi Germany.

  2. భాస్కరం కల్లూరి says:

    శ్రీనివాసుడుగారూ,
    స్వస్తికలపై నేను ఇంతవరకు ప్రత్యేకమైన పరిశీలన చేయలేదు. ఆధునిక వివరణలను చూడలేదు. ఆ మాట వేదకాలం నుంచీ ఉన్న సంస్కృత శబ్దమని మాత్రం తెలుసు. నా అవగాహన ప్రకారమూ, వివిధ సందర్భాలలో నా ‘పురా’గమన వ్యాసాలలో చెబుతూ వచ్చిన ప్రకారమూ ప్రాచీనకాలంలోకి వెడితే “ఇది భారతీయసంస్కృతికి చెందినది, ఇది పాశ్చాత్యసంస్కృతికి చెందినది” అని ఎంచి చూపడం అంత తేలిక కాదు.
    THE GOLD OF TROY పేరుతో స్లీమన్ జీవితచరిత్ర రాసిన Robert Payne ప్రకారం, స్లీమన్ ఒక పుస్తకం రాయడానికా అన్నట్టుగా స్వస్తికాలపై విస్తారమైన సమాచారాన్ని సేకరించిపెట్టుకున్నాడు. తన అధ్యయనంలో అతను తెలుసుకున్న సంగతులలో కిందిది ఒకటి:
    “నాజీ స్వస్తికాలలా కాకుండా అసలైన స్వస్తికాలు కుడి నుంచి ఎడమకు తిరుగుతాయి. ప్రపంచంలో అవి కనిపించని చోటు అంటూ లేదు. పురాతన చైనా చెక్కడాలపై, మిలాన్(ఇటలీ)లోని సెయింట్ యాంబ్రోస్ వేదికపై, నార్ఫిక్(ఇంగ్లండ్)లో కనిపించిన కెల్టిక్ అంత్యక్రియల కలశాలపై, రామాయణంలో వర్ణించిన ఓడల ముందు భాగంపై స్వస్తికచిహ్నాలు ఉన్నాయి.”

మీ మాటలు

*