సారీ ! కమలినిని క్షమించలేను !!

 

మబ్బులతో నిండి ఉన్న ఆకాశం ఇక ఒక్క క్షణం కూడా ఆగలేనట్లు వర్షాన్ని పూల రేకుల్లా వెదజల్లుతూ ఉంటే , ఎక్కడి నుంచో ఓ శహన రాగం మనసు ని ముద్దాడి లోపలెక్కడో దాక్కున్న ప్రేమ ను ఒక్క సారి తీసుకొచ్చి ముందు నిలబెడితే…జీవితం మీద మళ్ళీ ఇష్టం మొదలవుతుంది. ఓ మంచి పుస్తకం చదవాలని ఆరాటం కలుగుతుంది. గొడుగులతో ఆపలేని వర్షం, ఆపకుండా చదివించే పుస్తకం, ఇంకేమీ అక్కరలేదని పించే నిలువ నీయలేని ప్రేమ, అతనినో, అతని అక్షరాన్నో చూస్తె చాలు మళ్ళీ మళ్ళీ ఆ ప్రేమ కోసమైనా జీవించాలని పించే క్షణాలు, ఒక కప్పు తాగితే కళ్ళ ముందు కవ్వించే కాఫీ తోటలు…. జీవితం గురించి ఎన్ని కలలున్నాయో….కథల గురించి కూడా అన్ని కలలున్నాయి. ఫేస్ బుక్ లైక్ లకు దూరంగా, వాట్స్ అప్ మేసేజీలకు నిర్లిప్తంగా…..సామాన్య తీసుకెళ్ళే పుష్ప వర్ణ మాసం లోకో, సింధు మాధురి చూపించే విభిన్న వింత లోకపు కలాపి సమక్షం లోకో ఒక్క సారి నిజంగా వెళ్లి చూసి రావాలని అనిపిస్తూ ఉంటుంది. సన్న జాజి పువ్వులా కురిసే వర్షాన్ని చూసినప్పుడో,  ప్రేమికుడి సున్నితమైన ముద్దు లా మురిపించే మంచుపువ్వుల కౌగిలింత ను వెచ్చగా అనుభవిస్తున్నప్పుడో, ఎడారి లా దుఃఖపెడుతున్న జీవితాన్ని మళ్ళీ ప్రేమతో ఆనందంగా జీవించమని ప్రపంచం లో ఏ మూలనో ఎవరో ఒకరికి ఓదార్పు భుజాన్నిచ్చే ఓ మంచి పుస్తకాన్ని చదివినప్పుడో, నా లోపలి మేఘమల్హార్ రాగాల సోయగాలు పోతూ ఉంటుంది. జీవితం పట్ల, సాహిత్యం పట్ల అంత ప్రేమ పెంచుకొన్నాక, ఇటీవల వచ్చిన ఓ కథ చదివితే దిగులేసింది . ప్రతి కథ రాయటానికి ( ఎంత చెత్త కథ అయినా సరే) రచయిత కు ఒక కారణం తప్పనిసరిగా ఉంటుంది . రీడర్ కి నచ్చటానికి, నచ్చక పోవటానికి ఒక్కటి కాదు, వంద కారణాలుంటాయి. ఈ కాలమ్ లో నేను రాసేది అందులో ఒకటి అయి ఉండొచ్చు.

kalpan profile photo-1(1) నాకిష్టమైన సమకాలీన  రచయితలలో సామాన్య ఒకరు. ఆమె ఏం రాసినా ఆసక్తి గా చదువుతాను. ఇటీవలి కథ ”

“ని కూడా అంతే ఇష్టం గా చదివాను. తన శైలి నాకు ఇష్టం. ప్రతి వాక్యం లో గుప్పున పరిమళించే కవిత్వం మరింత ఇష్టం. ఈ కథ లో కూడా ఆ రెండు పుష్కలం గా ఉన్నాయి కాబట్టి ఆ మేరకు   నచ్చింది. నచ్చనిదల్లా కథలోని అంశాలు.  కేవలం ఒకరికి నచ్చటం, మరొకరికి నచ్చకపోవటం లాంటి చిన్న అంశమే అయితే  “మేఘమల్హార్” లో రాయకనే పోదును. ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్నే పణం గా పెట్టి సామాన్య లాంటి రచయిత్రి  ఈ కథ రాసిందని బాధ కలిగింది.కథ   రాయటానికి ప్రతి రచయిత కి లాగానే సామాన్య కి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నాకు ఆ కారణం తో నిమిత్తం లేదు కానీ నా ” కథానుభవం” చెప్తాను.

కమలిని ఒక శారీరక తప్పు ( ఆమె దృష్టి లో)   చేస్తుంది. పడక గది లో కూర్చొని ఆమె ఈ అపరాధ ఉత్తరం రాస్తుంటే యువ సామాజిక నాయకుడు, శాస్త్రవేత్త అయిన దీపూ అనబడే భర్త, భార్య కు ఇష్టమైన వంట వండుతూ ఉంటాడు. ఈ ఒక్క వూహ తప్ప కథ లో ఇంకేమీ కొత్తదనం లేదు. వివాహ బంధానికి  బయట మరో  అనుభవం పొందిన కమలిని ఇంటికొచ్చి పితృస్వామ్య వ్యవస్థ ప్రతినిధి గా మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, ఉత్తరం రాస్తుంది . ప్రతి దానికీ కార్య కారణ సంబంధాలు ఉంటాయా? అని అమాయకంగా అడుగుతూనే ఓ అనుభవాన్ని పాతివ్రత్యం, తప్పు, అనైతికత లాంటి భావజాలపు త్రాసు లో వేసి తూచి మాట్లాడుతుంది.

s1

తస్లీమా గురించి గౌరవం తో మాట్లాడే కమలిని కి తన పట్ల తనకు గౌరవం లేకపోవటమేమిటో మనకు అర్థం కాదు. తను ఎవరితో అనుభవం పంచుకుందో ఆ మనిషి మీద ప్రేమ కానీ, ఇష్టం కానీ ,గౌరవం కానీ లేకుండా “ అతనొట్టి స్త్రీ లోలుడు” అని చెప్తుంది. కమలిని పదహారేళ్ళ పడుచు కాదు. నడి వయసు ప్రౌడ. అతను ప్రేమోన్మాదం చూపించి ఆమె కోసం వల వేసి ఆమె చాంచల్యాన్ని బయటకు లాగాడు. కళ్ళు మూసుకొని భర్త పేరు నే కలవరిస్తూ ఆమె అతనితో ఓ అనుభవాన్ని పంచుకొని చీకటి తప్పు చేసి  భర్త దగ్గరకొచ్చి నన్ను క్షమించు. నేనిప్పుడు నెలసరి తో శుభ్ర పడ్డాను. నీ ముందు తప్పు ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను, నన్ను క్షమించు అని కాళ్ళా వేళ్ళా పడుతూ ఉత్తరం రాస్తుంది. ఓ భార్య మరొకరితో ఒక రాత్రి గడిపిన తప్పిదానికి భర్త క్షమించి ఆమె ను ఏలుకోవాలంటే తిక్కన కాఆల్సి వచ్చాడు. గురజాడ కావాల్సి వచ్చాడు. ఏ తప్పు చేయని సీత ను వదిలిన రాముడి ప్రస్తావన తెస్తుంది. తస్లీమా భర్త వైవాహికేతర సంబంధాల పట్ల తస్లీమా ఎంత బాధ పడిందో గుర్తు చేస్తుంది.

s2 (1)

ఒక స్త్రీ పర పురుషుడి తో ఓ అనుభవాన్ని పొంది భర్త దగ్గరకెళ్ళి  తానూ చేసిన తప్పును  ఒప్పుకోవటం మాత్రం అయితే ఇంత చర్చ లేకపోను. అది ఆ ఇద్దరికి , లేదా ముగ్గురికి, లేదా నలుగురికి సంబంధించి వ్యవహారం గా ఉండేది. కానీ కమలిని భావజాలం, వాడిన పదజాలం…ఆమె ఆలోచనలు అన్నీ  ఏ యుగాల నాటివో. నిజానికి అది కూడా నిజం కాదు. యుగాల నాడు కూడా ఎవరూ ఇలా ఇంత దీనం గా భర్త కాళ్ళు పట్టుకొని అడిగి ఉండరు. అహల్య కూడా గౌతముడి ముందు,  చేసినది తప్పని కానీ, చేయలేదని అబద్ధం కానీ ఆడలేదు. తాను చేసిన పని ని గౌతముడి ముందు గర్వం గానే ఒప్పుకుంది. ఆ అనుభవాన్ని మనసారా అనుభవించింది. కమలిని కి అటు అనుభవం పంచి ఇచ్చిన పురుషుడి మీద గౌరవం లేదు. అతని సమక్షం లో కళ్ళు మూసుకొని భర్త పేరు ని ఉచ్చరిస్తూ, అతనినే తలుస్తూ అతనిని అవమానించింది. పైగా భర్త కు అతని గురించి చెపుతూ అతనొట్టి స్త్రీ లోలుడని నిరసన చేస్తుంది.  తననే ప్రేమించే, గౌరవించే, అనుక్షణం తనతోనే మనసా, వాచా కర్మణా ప్రవర్తించే భర్త ను కూడా తప్పు చేసి బాధ పెట్టింది. గురజాడ దిద్దుబాటు లో ని కమలిని భర్త ను తెలివిగా మార్చుకున్నట్లు, ఈ రోజు నన్ను నువ్వు నా పొరపాటు కు క్షమించు అని అడుగుతుంది నాటకీయంగా.

కమలిని ఏం చేసిందో, ఎలా చేసిందో చెప్పే ఈ మాటలు ఏవీ నావి కాదు. కమలిని ఉత్తరం నుంచి ఆమె ను అర్థం చేసుకునే క్రమం లో ఆమె వాడిన పదాలతోనే ఆమె గురించి, ఆమె అనుభవం గురించి, ఆమె జీవితం గురించి నాకు కథ ద్వారా అర్థమయినది నేనిక్కడ చెప్తున్నాను.

మొత్తం ఈ కాలం స్త్రీల  తరఫున కమలిని పేరుతో, కథ పేరుతో  సామాన్య మాట్లాడింది. ఇవాళ ఈ ఫేస్ బుక్ లు, వాట్స్ అప్ లు, స్కైప్ లు, ఒంటరి విదేశీ ప్రయాణాలు …వీటన్నింటి లౌల్యాల మధ్య ఇలా జరగక తప్పటం లేదని కమలిని చేత వాపోయెలా చేసింది.  ఆడవాళ్ళ పొట్టి బట్టల వల్లే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని అంటున్న సమాజం లోని కొందరి మాటలకు , సామాన్య ఈ కథ లో మాట్లాడిన ఈ మాటలకు తేడా కనిపించటం లేదు కదా !? రెండూ ఒకే స్వరం నుంచి వచ్చినట్లు లేదూ!?

 

గత వందేళ్ళ  తెలుగు సాహిత్యం లో ఎన్నో మంచి కథలు, విశ్వ సాహిత్యం లో మరిన్ని మంచి కథలు ఇలాంటి సన్నివేశాల్లో, సంఘటనల్లో  ఆడవాళ్ళు ఎంత ఆత్మ విశ్వాసం తో ప్రవర్తించారో, ప్రవర్తించ వచ్చో చర్చిస్తే సామాన్య ఇంత అమాయకంగా కమలిని కథ ఎలా రాసిందా? అని నాకు ఆశ్చర్య మేసింది. పుష్పవర్ణ మాసం లోనూ, మొన్నటి దేవస్మిత లోనూ ఇంకొంచెం ఆధునికంగా ఆలోచించిన సామాన్య ఈ కమలిని పాతివ్రత్యపు భావజాలం లో ఎలా ఇరుక్కుపోయిందో మరి !

సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను.

*

(రేఖా చిత్రాలు: అక్బర్ , “ఆంధ్ర జ్యోతి” నుంచి)

 

మీ మాటలు

 1. Jhansi Papudesi says:

  Nizame…naakkooda kamalini Katha chadivina tharvatha kaastha avamanam pondinatluga anipinchindi. Thappu ane bhavana unnappudu…kattubatlaku convince ayinappudu…cheyyakundane undaalsindi. Aa kshanamlo nee pere thaluchukunna ani…Thappu chesa ani…deeniki karanam purushulatho samanamaina sthree sweccha ani…cheppukovadam dourbhagyam. Kaavalsinadaanni kori pondina ani cheppukuni vunte kamaliniki aa vuttharam valla kaastha gouravamaina dakkedi. Well reviewed kalpana gaaru.

 2. కథ ప్రచురింపబడ్డ తరువాత విషయపరంగా కథతో విభేదించిన అతికొద్ది మందిలో నేనొకడిని. మీ వ్యాసం నా భావాలకు చాలా దగ్గరగా ఉంది.

 3. Chaithanya says:

  పొట్టి బట్టల వల్లే రేప్ లు జరుగుతున్నయ్ అనే వారికీ, కమలిని కి ఏంటి తేడ? ఎంత బాగా అడిగారండి.. థాంక్ యు.. ఫర్ రెప్రేసేన్టింగ్ మెనీ అఫ్ అస్

 4. Bhavani Phani says:

  మంచి విశ్లేషణ కల్పన గారూ, ధన్యవాదాలు

 5. కె.కె. రామయ్య says:

  డా. సామాన్య గారు అంటే గుర్తుకొచ్చేది ‘మహిత’, ‘పుష్పవర్ణమాసం’ లాంటి వారి అసామాన్య కధలే. ‘కమలిని’ కధను విశ్లేషించిన కల్పన గారికి ధన్యవాదాలు.

  డా. సామాన్య గారి ‘కమలిని’ కధ ప్రచురించబడ్డ ఆంద్ర జ్యోతి ఆదివారం అనుబంధం 17-ఏప్రిల్-2016 సంచిక కు లింకు ఇక్కడ.
  http://epaper.andhrajyothy.com/780578/Sunday/17.04.2016#dual/26/2

 6. దేవరకొండ says:

  సమీక్షలో ఆఖరి వాక్యం, “సారీ సామాన్య, నేనే కాదు తమ మీద తమకు గౌరవం ఉన్న ఏ ఆడపిల్లా నీ కమలిని మాటలను క్షమిస్తుందనుకోను.” నేటి మహిళను ప్రతిబింబిస్తోందా? దీనికి జవాబు “అవును”అయితే కథలో కేంద్ర బిందువైన నైతికత మీద ఇంకా స్పష్టత సమీక్షలోనే రావల్సి వుంటుంది. (నైతికత మీద తన వైఖరిని కథా రచయిత కథలోనే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి). కథలోనే కమలిని ఫ్రెండ్ చెప్పినట్లు ‘జరిగిందేదో జరిగింది మరింకేం మతిమాలిన పన్లుచేయకు ‘ అని ఏమీ జరగనట్లు దీపుతో కమలిని ఎప్పట్లా వుండిపోవడమే నేటి మహిళ వుండవల్సిన విధానమా?

 7. కల్పన గారి ` తన్ హాయీ ‘ నవలలో మ్రుదుల పాత్ర గురించి చెపుతూ , ` అతన్ని ఆ క్షణమే క్షమించలేదుగానీ , నీతో జీవితం వద్దు , నా జీవితంలో నువ్వుండక్కరలేదు అని అతన్ని తిరస్కరించలేకపోయింది . చాలా సమయాల్లో చాలామంది స్త్రీలు ఏం చేస్తారో మ్రుదుల కూడా అదే చేసింది ‘ అంటారు. భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నా , అతనితో తెగతెంపులు చేసుకొని జీవించడమెలాగో తెలియక ఉన్న పరిస్థుతులతో రాజీ పడి జీవితం గడపాలనుకుంటుంది .

  తన్ హాయీ నవలలో మ్రుదుల , కమలిని కథలో కమలిని నాకు ఒక్కలాగే కనిపించారు . సంసారపక్షమైన బేలతనాన్నే ప్రదర్శించారు . కారణాలు వేరైనా , కాపురాల్ని కూలగొట్టుకోవడానికి ఇష్టపడలేదు . సమాజం గురించి , తమ భవిష్యత్ జీవితం గురించి ఆలోచించి అలా ప్రవర్తించి వుండవచ్చు గదా ! రచయిత్రి ఒక కొత్త ముగింపు ఇవ్వడానికి చేసిన ప్రయత్నాన్ని పాతివ్రత్యపు భావజాలంలో ఇరుక్కుపోయి వ్రాసినట్లు ఎందుకనుకోవాలి !!

 8. వనజ తాతినేని says:

  కల్పన గారూ ! ఎన్నో మంచి కథలు వ్రాసిన సామాన్య గారు ఈ కథ అస్పష్టంగా వ్రాసారు. అన్నిసార్లూ అద్భుతాలు జరగవు కదా ! నడవాల్సింది నేల మీద అయినప్పుడు ఆకాశం వొంక చూసి నడుస్తూ పడిపోయినతర్వాత తప్పంతా నేలదే అన్నట్టు మాట్లాడినట్లున్న కమలిని మీరు మీ వ్యాసంలో బాగా చూపించారు. అభినందనలు. ఫేస్బుక్ లో కొందరి అభిప్రాయాలు,వాదనలు,సమీక్షలు (?) చూసిన తర్వాత అసలు ఈ కథ బావుందా – లేదా ఈ విషయం గురించి నాకు నాకే స్పష్టత రాలేదు. అంతా అయోమయంగా అనిపించింది. పాత్రల నేపధ్యం వేరైనా కమలిని పర పురుషుడి ఆకర్షణలో పడినప్పుడు చలం రాజేశ్వరిలా, భర్తని క్షమించమని ఉత్తరం వ్రాస్తున్నప్పుడు విశ్వనాధ రత్నావళి లా అనిపించింది నాకు. తను చేసిన తప్పు పై తానే స్టాండ్ బై కాలేని ఈ కమలిని లో చపలచిత్తం, గడసరితనం, పాపభీతి,పలయనా వాదం, ఆత్మ నూన్యత కూడా ఉంది. కమలిని లు చాలా మంది ఉంటారు. వారి గురింఛి వచ్చిన కథే అనుకుందాం. కమలిని ని క్షమించేద్దాం .

 9. కల్పన గారు మీ సమీక్ష బాగుంది..కానీ పైన కొందరు చెప్పినవి మీరు చెప్పిన మాటలలో నేను ప్రశ్నించాలనుకున్నవి ఉన్నాయి.నేను ఈ కధని ప్రాతినిధ్యలో సమీక్షించాను..నేనూ అదే ప్రశ్నించాను…స్త్త్రీ పురుషులు వివాహేతర సంబంధాలలోకి వెళ్ళటం ఎప్పటినుంచో ఉన్నదే.కానీ తన్హాయీ నవలలో ప్రధాన పాత్ర కి ప్రేమ ఆకర్షణ ఉన్నాయి…పర పురుషుని ఎడల..కానీ ఎవాయిడ్ చేసినట్లే శారీరక సంబంధం మీరు చెప్పారు..అలాగే చలం రాజేశ్వరి వేరు….తన భర్త మీద అభిమానం ప్రేమ డెవలప్ కాలేదు..వారికీ తస్లీమా భర్త విషయానికసలు ఏమన్నా సంబంధం ఉందా…కమలిని కి భర్తంటే ఇష్టమంటారు…ప్రేమంటారు..గౌరవం అంటారు…కమలినికి తెలిసి భర్త కలాటి ఆకర్షణలూ లేవు…ఐనా కమలిని తనకోసం పడివచ్చే వారిపట్ల విపరీతమైన ఆకర్షణలకు గురయానంటుంది..సంబంధం పెట్టుకున్మవాడు సరైన వాడు కాదంటుంది…వద్దని చెప్పానంటుంది…మరల గడుపుతుంది.తన భర్త పేరు కలవరిస్తూ.ఆమే పాత్రను అప్పటిదాకా పరిపక్వత తో ఆలోచింపచేస్తూ…సడన్ గా పాత్రని దాని వ్యక్తిత్వాన్ని క్రిందకి తోసారు సామాన్య గారు…కనీసం అతనితో ఆకర్షణ నుంచి తప్పుకోలేకపోయాననీ ఒప్పుకోలేదు..శారీరక సంబంధాలే లేకపోతేనే ప్రాతివత్యమా….మానసిక వ్యభిచారం చేసినా ప్రాతివత్యం పోయినట్లు కాదా.తన్హాయి లో శారీరక సంబంధం వద్దనటానికి మీరు ఇంకా బలంగా ప్రేమలో కూరుకుపోయి తమని ప్రేమించే వారికి ..పాపకి అన్యాయం జరగకూడదనన్నా కారణం చూపించారు…ఇక్కడదీ లేదు..ఏ కారణం లేకుండా కూడా తప్పు అని అనుకుంటే వద్దని చెప్పగలిగే పరిస్ధితి లోనే ఉండీ వద్దనకపోగా ఇలా మాట్లాడటం బాగా అనిపించలేదు..కనీసం అన్ ఎవాయిడబుల్ పరిస్ెెధితులు చూపించినా చదువరులు కన్విన్స్ అయేవారేమో…కానీ మీకు మనకు నా ప్రశ్న .. కమలిని లాటి ఆడవారు మనము కాదు కదా?మనం తన తరపు ప్రతినిధులం కాదు..మన ఆలోచనా పరిధులు వేరు .మనమెలా కమలిని లాటి ఆడవారిని మన తరపు ప్రతినిెెధి గా తీసుకుంటాం?అసలెందుకు తీసుకోవాలి? సామాన్య గారు కూడా తీసుకోలేదు…కమలిని ఆలోచనలలా ఉన్నాయి…సామాన్యగారలా అనుకున్నా వారి అభిప్రాయం కదా అది ….క్షమించవలసింది.భర్త కాదు..మనమూ కాదు…అసలు .కమలిని తనని తను ముందు క్షమించుకోగలగాలి..తన వ్యక్తిత్వ బలహీనతల వలన తను పోగొట్టుకున్న దానికి తనని తను క్షమించుకోవాలి.నైతికత అంటే ఏంటో ఎవరికి వారు తీర్పులిచ్చుకుంటుంటారు..కన్వీనియంట్ గా…శారీరక సంబంధం గురించి నేనసలు మాట్లాడటం లేదు

 10. AHALYA MAMILLAPALLI says:

  కల్పన గారూ! అద్భుతంగా విశ్లేషించారు. మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నా.

  మనసు పడ్డాను… తప్పు ( తప్పో ఒప్పో యేదైనా ) చేశాను అంటే ..హుందాగా ఉండేది కదా..
  ఆ సమయం లో భర్త పేరు తల్చుకుంటూ కళ్ళు మూసుకున్నా అంటూ ఆత్మవంచన ఎందుకు?
  నిజంగా మొగుడి మీద అంత అనురాగం ఉంటే అసలు తప్పే జరగదు కదా..

  కధ చదవగానే ఇబ్బంది గా అనిపించింది.

  శుభ్రత శరీరానికా? మనసుకా???

 11. ఈ కథ నాకు నచ్చలేదు. దీని మెసేజ్ ఒక్కటే కాదు, అసలు కథ చెప్పిన విధానం కూడా బాగా లేదు. కథ మోరల్ మెసేజ్ గురించి అందరూ ఇప్పటికే కామెంట్ చేసేసారు కాబట్టి, దాన్ని గురించి కామెంట్ చెయ్యను. ఈ కథలో హీరొయిన్ మోడరన్ luxury లైఫ్ lo జీవిస్తుందని రచయిత్రి మనకి చెప్పడం అవసరం. ఎందుకంటే, కథ కి ఆ విషయం ఇంపార్టెంట్. ఫేస్బుక్ waatsup , స్మార్ట్ ఫోన్, వీటి వల్లే ఇలా “తప్పు” జరిగిందని చెప్పాలి కాబట్టి, హీరొయిన్ గారు డబ్బున్న కుటుంబ లో మనిషి అని మనకి తెలియచెయ్యాలి.
  దానికి ఒప్పుకుంటాను. కాని, దానికి బాత్ tubs , అరోమా బాంబులు కూడా అవసరమా?
  రెండో విషయం: దీపు అనే అయన మంచి మొగుడు అని చెప్పడానికి, ఎలాంటి ఉదాహరణలు ఇచ్చినిది?
  ఆయన, ఈవిడ పడకగదిలో పవళించి లెటర్ రాస్తుంటే ఈవిడకి ఇష్టమయ్యే వంటకాలు తయారుచెయ్యడానికి అవస్తలు పడుతున్నాడు. ఇలా చెయ్యడం ప్రేమా? ఐ ఫీల్ that it is జస్ట్ సింపుల్ narcissism .

 12. Buchireddy gangula says:

  కథ చాల భాగుంది
  Nothing .wrong .
  తప్పు. ఏముందని??నేటి వ్యవస్థ లో Common ఇన్సిడెంట్స్.
  అదే. పురుషుడు చేస్తే —చెప్పడు —రాయడు
  Why difference ??
  ———————————————–
  Buchi reddy gangula

 13. “అతని సమక్షం లో కళ్ళు మూసుకొని భర్త పేరు ని ఉచ్చరిస్తూ, అతనినే తలుస్తూ”….దీన్ని ఈ విశ్లేషనలోనూ, కథలోనూ చదువుతున్నప్పుడు ..వెనకటికి ఏదో పాత సామెత లేదా ఒకానొక ప్రాంతంలో ప్రసిద్ధంగా ప్రబలంగా ప్రచారంలో ఉన్న ఒకానొక మూఢ విశ్వాసమూ గుర్తుకు తెస్తోంది. ఈ థీమ్ తోనే కీ.శే .నాగభైరవ కోటేశ్వర రావు అనే కవి “నది చెప్పని కథ ” పేరుతో కావ్య గానం చేసాడనుకుంటా….ఈ ‘కమలిని’ కథలో చర్చించడానికి చాలానే ఉంది కానీ “లోకో భిన్న రుచి” గదా..అయినా ఈ విశ్లేషణా వ్యాసం శీర్షిక తప్పు దారి పట్టించే ప్రమాదముంది .ఇది కథలోని “దీపు” జవాబుగా పొరబాటు బడే అవకాశాన్ని కల్పించడం లేదా?

 14. chandrika says:

  ఇలాంటి పాత్రలని , పాత్ర తీరు ని సమర్థించిన రచయిత్రిని నేను సమర్థించను. ఒక కల్పిత పాత్ర తో అలా ప్రవర్తింప చేసినందుకే ఇంత వ్యాసం వ్రాసారు. కానీ నిజ జీవితం లో ఇలాంటి పాత్రలు ఉంటున్నారు. నమ్మశక్యం గా అన్పించదు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అది కూడా పిల్లలున్న తల్లులు, మంచి చదువు చదువుకుని ఉద్యోగం చేసేవారు !! మరి వీరిని ఏం చేద్దాము? ఈ మధ్య పురుషులతో పాటు పార్టీ లలో తాగడం చూస్తున్నాము. పురుషులు అర్ధ రాత్రి తిరుగుతారు కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా మేము తిరుగుతాము తప్పేంటి , మా లాంటి వాళ్ళ ఆలోచనా ధోరణి వలన ఉద్యోగార్థం అర్ధరాత్రి బయటకి వచ్చే ఆడపిల్లలు బలి అయినా మాకు అనవసరం అనే మోడరన్ థింకింగ్ కి స్వాగతం పలుకుతున్నాము !! పెళ్లి చేసుకోకుండా ఎవడితో అయినా కలిసి కాపురం చేయచ్చు అనే కాన్సెప్ట్ ని, కనిపెంచిన తల్లి తండ్రులు కూడా అడగకూడదు, వారీ స్వేచ్చ ని ఆమోదించాలి అనే మోడరన్ థింకింగ్ ని ఆమోదిస్తున్న సమాజం ఇది ఎందుకు ఆమోదించరు? ఇంక ఇప్పుడు ఇలాంటి విషయాలలో కూడా సమానత్వం మొదలు పెడ్తున్నారు. అందరూ ఆడవాళ్లు అలాంటి వారే అన్న అభిప్రాయం కలుగ చేసి సమాజం లో ఆడవారికి గౌరవం పోగొడ్తున్నారు. వినాశ కాలే విపరీత బుద్దే !!

 15. సామాన్య says:

  సారంగ ఎడిటర్స్ కి …
  రచయిత ఒక కధ రాసినప్పుడు ఆ విషయంతో విబేధించడం లేదా అంగీకరించడం అనే విషయాలలో పాటకులకు అన్ని హక్కులూ వుంటాయి .కానీ ఒక రచయిత శైలి బాగోలేదు ,కధ చెప్పిన పద్ధతి బాగోలేదు అనే హక్కు ఎవరికీ వుండదు ,అలాగే రచయితకి మోడరన్ కపుల్ ఎలా ఉంటారో తెలీదు ,అది ఆవిడ fetish ,నార్సిస్సిసం వంటివి రచనకు దూరంగా వెళ్లి చేసిన కామెంట్స్ .రచయిత వ్యక్తిగత జీవితంపై చేస్తున్న దాడి .వ్యక్తిగత అసూయలతో ఎంతో మంది దాడులకు రావచ్చు .కానీ ఎడిటర్ వున్న పత్రికల్లో అవి ప్రచురించబడటం విచారకరం .అఫ్సర్ ,కల్పనగార్లు పత్రికల్లో పని చేసిన వ్యక్తులు .వారికి నేను ఈ విషయం గుర్తు చేయాల్సిన అవసరం లేదు . సారంగాలో ఇక పై ఇటువంటి కామెంట్స్ రావని ఆశిస్తున్నాను .
  థాంక్స్ & రిగార్డ్స్

 16. కె.కె. రామయ్య says:

  డా. సామాన్య గారు, ఈ చర్చలో వచ్చిన, అభ్యంతరకరంగా ఉన్నవనిపించిన కొన్ని కామెంట్స్ మీరు ఇగ్నోర్ చెయ్యవలసినడిగా విజ్ఞప్తి. మీ నుంచి ఒకదానిని మించిన మరో ఉన్నత రచనను ఆశిస్తున్న వారి అతిశయించిన అభిమానానికి అది సంకేతమెమో.

  విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన మీకు, ఓ IAS Officer గారి సతీమణికి, దేశం లో ని అనేక ముఖ్యమైన పట్టణాలలో నివాసం ఉన్న మీ వంటి రచయిత్రికి ” మోడరన్ కపుల్ ఎలా ఉంటారో తెలీదు” అని ఎవరైనా కామెంట్ చేసినా అది అంతగా అతకదు. వారి ఉద్దేశ్యం మోడరన్ కపుల్ జీవిత చిత్రీకరణ మరెలానో ఉండాలని కాబోలు.

  ఓ ఉద్యమ స్పూర్తితో, కమిట్మెంట్ తో రచనలు చేస్తున్న మీకు అభినందనలు.

  • THIRUPALU says:

   కల్పన గారు కధా విశ్లేషణ చాలా బాగుంది.
   కెకె రామయ్య గారు, సామాన్య గారు కమిట్ మెంట్ ఉన్న రచయిత్రి అంటే నాకు అంగీకారించాలని అనిపించటంలేదు. ఆమెకు జీవితం వేరు సాహిత్యం వేరు. సారంగలో ఆమె చెప్పుకున్నట్లు గా. వారికి సమాజం గురించి అవాగాహన లేదని ఎవరు చెప్పలేరు గానీ – ఈకధ ప్రకారం ఆమె బూర్జువా పెమినిష్టు కూడా కాదు. అది ఆమె కథలో వ్యక్త పరిచింది- ఇది పురుషులు తో సమానత్వం అని కూడా అనటంలేదు.అంటూ. ఆమె వాడిన పదజాలం, భావజాలం – కల్పజాగారు చెప్పినట్లు- సాంప్రదాయక పితృస్వామ్యక భావ జాలంతో ఆధనిక (అని అనుకొనే) ఎలియట్ సొసైటీ వారికి వరిసాగు ఇవ్వడానికి ఈ కధ రాశరు అనడంలో సందేహం లేదు.

   • THIRUPALU says:

    వరిసాగు అనే చోట భరోసా అని చదువుకోగలరు.

 17. Buchireddy gangula says:

  Dr .సామాన్య గారి. కామెంట్స్.–editors –ల కు—-
  100%. నేను ఎకబవిస్తాను –వారి కథ లో రియాలిటీ. ఉంది
  బయిట పడకుండా. ఉన్నవి –కోకొల్లలు —
  ఆచి –తూచి కామెంట్స్ రాయడం అవసరం
  Saamanya గారు excellent .writer
  రామయ్యా గారు. చక్కగా చెప్పారు సర్
  ——————————-
  Buchi రెడ్డి గంగుల.

 18. chandolu chandrasekhar says:

  సామాన్య గారు ,అద్భుతమైన కథ , తిక్కన రుతు క్రమం , సిగ్ముండ్ ఫ్రాయిడ్ ,psychosexual stages తెలిసిన కమలిని ,రెంటాల కల్పనా క్షమించట మేమిటి .ఆమెకు కథ సంవిధనామే అర్దం కాలేదు .నేను గతం లో losing my virginity .madhuri banerjee నవల చదివాను .చాల సహజంగా వుంటుంది .మీ కథ కూడా కాయ పండి విత్తనాన్ని వెదజల్లినంత సహజంగా వుంది .కమలిని అర్దం చేసుకోలేనందుకు , రెంటాల కల్పనా గారిని క్షమించ మని కమలిని గారిని వేడుకుంటు నాను .సామాన్య గారు మీరు రాసిన కథ అనన్య సామాన్యం . ముందుకు సాగిపొండి .

 19. Sujatha Bedadakota says:

  మీ విశ్లేషణ బావుంది కల్పనా! ప్రతి వాక్యంతో ఏకీభవిస్తున్నాను

  బైదవే పైన వ్యాఖ్యలు రాసిన SUJATHA గారు నేను కాదు (నేనేనా అని కొందరు మిత్రులు అడిగారు)

  సామాన్య గారు చెప్పినట్లు,కామెంట్స్ మీద ఎడిటర్స్ కి కంట్రోల్ ఉండాలి. మాడరేషన్ తప్పక ఉండాలని నా అభిప్రాయం కూడా

  ఆలోచించగలరు

 20. కె.కె. రామయ్య says:

  ‘గుండ్లకమ్మ చెప్పిన కథ’, ‘నది చెప్పని కథలు’ కావ్య గానం చేసిన డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు గారిని ప్రస్తావించిన K N RAU గారికి ధన్యవాదాలు.

  ‘భావోద్వేగ దీపికా మాలికా సురుచిర రచనా విధానం మీ కవితా సంవిధానం’ అని ఎన్టీఆర్‌ ప్రసంశలు అందుకున్న ప్రతిభాశాలి (ఎన్టీఆర్‌ నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రానికి రచయిత) .. కవిత, కథ, నవల, విమర్శ, వ్యాసం ఇలా సాహిత్యం లోని ప్రతి ప్రక్రియలోనూ ఘనత వహించిన గొప్ప సాహితీవేత్త, రచయిత, కవి, కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన వారు. ఒంగోలు, నెల్లూరు ప్రాంతాలలో వారికి ఎందఱో సాహిత్యాభిమానులు, శిష్యులు ఉన్నారు.

 21. Radha Manduva says:

  ఏమిటిది? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శస్తుంటే విమర్శే సిగ్గు పడటం లేదూ!? విమర్శకు ప్రమాణాలు, విలువలు లేవా? సద్వివిమర్శకులు అంటూ లేకపోవడం వల్లనే నాకీ అవహేళన అంటున్న విమర్శకేం సమాధానం చెప్తారు నేటి విమర్శకులు!? మేటి కవులు!!? తోటి రచయితలు!!?

  రచయితలే విమర్శకులైనప్పుడు ఒకరంటే ఒకరికి పడక కుళ్ళుని బయట పెట్టుకోవడం కోసం విమర్శని వాడుకుంటారన్న విషయాన్ని నిజం చేసినట్లయింది ఈనాడు. విమర్శించాల్సింది రచనని అన్న విషయం మరిచి ఏదో విధంగా రచయితలని అవమానించి, హేళన చేయడం, అసలు రచనని చదవని వారికి కూడా ఆ రచయిత హీనమని చెప్పడం – ఎంత బరితెగింపు? ఎంత అసూయ!!?

  ఎటు వెళుతున్నాం మనం!!?

 22. చూడండి గంగుల గారూ… మీరెవరో నాకు తెలియదు, సారంగ ఎడిటర్్స గురించి నాకు తెలుసు. ఒకళ్ళు పెట్టమంటే నేను కామెంట్ పెట్టలేదు. వ్యాసం రాసిన కల్పనా రెంటాల గురించి నాకేమీ బాధ లేదు. ఆమె చక్కగా కథని గురించి మాట్లాడారు. ఎవరి విషయల్లోనో మీరు నా పేరు ఎత్తి మీరు పెట్టిన కామెంట్ డిలీట్ చేయండి ముందు.

 23. నేను మాట్లాడుతోంది ఓ రచయితగా… మొన్న అఫ్సర్ గారినన్నారు, నిన్న నన్ను అన్నారు, ఈరోజు సామాన్యని అన్నారు మరో రోజు మరో రచయితని అంటారు. ఇది మంచిది కాదని అంటున్నాను. పర్సనల్ గా రచయితలని విమర్శించడం మంచిది కాదంటున్నాను. ఇప్పుడే చెప్తున్నాను. కామెంట్ కి మరో కామెంట్ పెడుతూ విద్వేషాలు పెంచుకోవడానికి కాదు నేను ఇక్కడ కామెంట్ పెట్టింది ఆవేదనతో పెట్టాను.

  • THIRUPALU says:

   ఇది మరీ బాగుందండీ! ఏదోఒక విమర్శ ఏది కువిమర్శ అనే విచక్షణా లేకుండా రాసేస్తే ఒప్పుకోవాలా? మీరన్న మాట బాగుంది. అయితే ఏ ఉద్దేశం తో అంటున్నారు అనేదే ముఖ్య ం. రచయిత లు రాసే శైలిని, శిల్పాన్ని, వస్తువును దృక్పధాన్ని ..అన్నిటినీ విమర్శించవచ్చు వ్యక్తి గతం కాకుండా. అవి ఎప్పడయితే కువిమర్శలవుతాయో అప్పుడు విలువలేకుండా పోతుంది. వీటి వల్ల రచయితకు ప్రయోజనం ఉండదు.అంతే కాక పాఠకుల్లో గందరగోళం రేపి వారి ప్రయోజనం దెబ్బతీస్తాయి.చివరకు రచియిత మనస్సు కష్టపెట్టటమొకటేమిగులుతంది. నా ఉద్దేశం లో ఇక్కడ చర్చ లో ఎవరూ, నాతొ చేర్చి, గొప్ప విమర్శ కులు కాదు. అయితే రచయిత లకు సమాజ నికి బాధ్యత్య వహించిాలనెడంలొ సందేహ లేదు. ఈరచయిత్రి గారు ‘ అంటరాని వసంతం’ జి.కల్యాణ రావు గారి నవలను సమీక్ష చేధారు. అనగలను ఒక గొప్ప జీవితానుభవతోటి విశ్శ్ణొలేషణ చేశారు. (ఆ సామాన్య గారు వీీరు ఒక్కరే అనుకుంటున్నాను) అందువల్ల నే పై వ్యాఖ్య చేశాను.

  • THIRUPALU says:

   టైప్ తప్పు గా వచ్చినందకు క్షమించండి

  • THIRUPALU says:

   నా కామెంట్ స్పష్టంగా లేకపోవడం వాళ్ళ మల్లి ఒక సారి నా భావాలని వ్యక్తం చేస్తున్నాను.
   నిహరిక గారు,
   ఇది మరీ బాగుందండీ! మీరన్న మాట “ఒక కధ వ్రాసేసి జనం మీదకి వదిలితే చూస్తూ ఊరుకోవాలా ? ” ఏది విమర్శ ఏది కువిమర్శ అనే విచక్షణా లేకుండా విమర్శ రాసేస్తే మాత్రం రచయితలూ ఒప్పుకోవాలా? రచయిత లు రాసే శైలిని, శిల్పాన్ని, వస్తువును దృక్పధాన్ని ..అన్నిటినీ విమర్శించవచ్చు వ్యక్తి గతం కాకుండా. అవి ఎప్పడయితే కువిమర్శలవుతాయో అప్పుడు వాటికి విలువలేకుండా పోతుంది. వీటి వల్ల రచయితకు ప్రయోజనం లేక పోగా మరీ కష్ట పెట్టిన వాళ్ళం అవుతాము. అంతే కాక పాఠకుల్లో గందరగోళం రేపి వారి ప్రయోజనం దెబ్బతీస్తాయి. నా ఉద్దేశం లో ఇక్కడ చర్చ లో ఎవరూ, నాతొ సహా , గొప్ప విమర్శ కులు ఏమి కాదు. కేవలం అభి ప్రయాలనే చెపుతున్నాము. ఇవి రచయిత్రికి మనమిచ్చే సర్టిఫికేట్ ఏమీ కాదు. అయితే రచయిత లకు సమాజ నికి బాధ్యత్య వహించాలనడంలొ సందేహ లేదు. ఈరచయిత్రి గారు ‘ అంటరాని వసంతం’ జి.కల్యాణ రావు గారి నవలను సమీక్ష చేసారు. ఒక గొప్ప జీవితా దృక్పధమ్ తోటి విశ్లేసించారు . నాకు చాలా నచ్చింది. నిచ్చన మెట్ల సమాజం లో కాలం గడిచే కొద్ది దృక్పదాలు మారి పోతుంటాయి కాబోలు. (ఆ సామాన్య గారు వీీరు ఒక్కరే అనుకుంటున్నాను) అందువల్ల నే కమిట్ మెంట్ మెంట్ ఉన్న రచయిత్రి కాదని వ్యాఖ్య చేశాను.

  • Rajendra Prasad Chimata says:

   ఇదే అసహనం అంటే. ఆడది ఇలా ఉండాలీ అని నిర్ణయించడానికి మీరెవరు? కోట్ల జీవితాలు కోట్లఅనుభవాలు. మీకు నచ్చితే ఆనందించండి, నచ్చకపోతే అలాంటి పరిస్థితులు కూడా కొన్ని జీవిత భాగాలు అనిఅర్థం చేసుకోండి.తస్లిమాను వేటాడినవారిని సమర్థించడం అమానుషం.

 24. K N RAU says:

  “Honest criticism and sensitive appreciation are directed not upon the poet but upon the poetry”_TSEliot.
  ఇక్కడ పోయెట్ స్థానంలో రచయిత్రినీ పోయెట్రీ స్థానంలో రచననీ ఉంచి అర్థంచేసుకుంటే సరిపోతుంది. Criticism is not a cheap or loose talk. విమర్శ నరం లేని నాలుక వంటిదనుకోవడం తప్పున్నర తప్పు . Criticism can also be a sarcastic expression but it should not be a personal attack and should not hurt personally. “కమలిని” కథని చర్చించడానికి ఈ వెబ్ జాగా సరిపోదు.కేవలం అభిప్రాయలు మాత్రమే విమర్శ కాదు. పొగడ్డం, తెగడ్డమే విమర్శ కాదని ఈ అభిప్రాయాల వెల్లడిలో పాల్గొంటున్న అందరికీ బహు బాగా తెలుసు. సుజాత గారి అభిప్రాయలో పోరబాట్లున్నాయి. రచనని వారు సరిగా అర్థం చే సుకోలేదేమో ననిపిస్తోంది. ఆ కథలో వస్తువు బహు సున్నితమైనది. When a society appears to be in a transition, this type of things are supposed to be happened. We must be very careful while dealing with these types of argumentation. ఏమైనా విమర్శ ఇంగితాన్ని కోల్పోకుండా ఉంటె బాగుంటుంది కదూ!

 25. సామాన్య గారితో వారి బాధతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను….కధని కధ లో పాత్రలను వాటి స్వభావాలను కధలలో వరకే తీసుకోగలగడం పోయి ఇలా వాటిని రచయితలకు ఆపాదించడం సరైన పధ్దతి కానేకాదు…

  • ari sitaramayya says:

   సరళ మోహన్ గారు – “కధని కధ లో పాత్రలను వాటి స్వభావాలను కధలలో వరకే తీసుకోగలగడం పోయి ఇలా వాటిని రచయితలకు ఆపాదించడం సరైన పధ్దతి కానేకాదు…”

   కె ఎన్ రావు గారు – “Honest criticism and sensitive appreciation are directed not upon the poet but upon the poetry”_TSEliot.

   నా అభిప్రాయం సామాన్య గారి కథ గురించీ కాదు, కల్పనా గారి వ్యాఖ్యానం గురించీ కాదు, ప్రస్తుతం మన సమాజంలో సాహిత్యానికి ఉన్న విలువ గురించి మాత్రమే. కథ రాయడం అంటేనే ఏదో ప్రయోజనం ఆశించి రాయాలనే ఉద్దేశం ప్రబలంగా ఉంది మన సమాజంలో. అంటే కథా, అందులోని పాత్రలూ, సన్నివేశాలూ రచయిత తను ఉద్దేశించిన ప్రయోజనాల సాధనకు వాడుకుంటున్న వస్తువులు మాత్రమే. ఈ సాంప్రదాయం ఉన్నంతకాలం పాత్రలనూ రచయితనూ వేరుచెయ్యడం కుదరదు.

 26. రాధ says:

  గంగుల గారు, మీరన్నారని కాదండీ… నా పేరెందుకు ఉపయోగించి ఎందుకు అనడం అని మొదటి కామెంట్ లో మీకు రాశాను. అంతే అది అక్కడకి ముగిసిపోయింది. ఇక రెండో కామెంట్ లో నేను రాసింది “మొన్న అఫ్సర్ గారినన్నారు, నిన్న నన్ను అన్నారు, ఈరోజు సామాన్యగారినన్నారు” అంటే మీరు అన్నారని కాదు రచయితలని వ్యక్తిగతంగా దూషించే వాళ్ళని గురించి… ఓ ఉదాహరణగా తీసుకుని అన్నాను. మీకు ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థం అయింది కదండీ! మరింత విశదంగా రాసి ఉండవలసింది నేను. పోనీలే మనసులో పెట్టుకోకుండా అడిగారు. లేకపోతే మరింత బాధపడేవాళ్ళం, ఏవేవో ఊహించుకుని.

 27. Satyam . says:

  కల్పనా గారి సమీక్ష చాలా బాగుంది .

  కథ లో కమలిని ,ఎలాటి పరిస్థితిలో వివాహేతర సాన్నిహిత్యానికి లోనయిందో ,వివరంగా establish చేయలేదని తోచింది ..
  ఆధునిక కాలంలో స్త్రీ పురుషులు ,ఉద్యోగ రీత్యా ( జీవనోపాధి ) అతి సన్నిహితంగా ,అన్ని వేళల్లోనూ ,కొన్ని కొన్ని సందర్భాల్లో ,రోజుల తరబడి సన్నిహితంగా మెలగవలసి వస్తున్నప్పుడు ,తనకే తెలియని తమకంలో పడిపోనూ వచ్చు ,ఒక రకమయిన
  అనాలోచిత క్రియ జరగనూ వచ్చు .
  అలాటిదే జరిగిందను కుందాము . కమలిని లోలోపల హృదయంలో ఎక్కడో అపరాధ భావన తొలిచి వేస్తున్నది .
  దీపూని అతి గాఢంగా ప్రేమిస్తున్నందువలన ,విషయం అతనితో పంచుకోవాలనుకుంది .

  ఆ మూడవ వ్యక్తి కమలినికి తగిన వాడుగా కనిపించదు .
  దీపూ కూడా ఒక పరిణతి చెందినవ్యక్తిగా ,కమలిని ని ,జారిపోతే లేపి చేయి అందుకుని ,వెంట నడిపించుకు పోతాడేమో …అతనికి తెలుసు ఆమె మనసు ,కమలిని అతనిలో సగాభాగామేమో !
  ఒకరిని విడిచి మరొకరు జీవించలేరేమో!
  మరెప్పుడూ అసలా విషయం స్పురణ కే రాకుండా ఒకరితో ఒకరు ,నూరుపాళ్ళు ఒకటిగా జీవిస్తారేమో !
  జీవితం గడిచిపోతుంది సంపూర్ణ అవగాహనతో .

 28. mani kumar says:

  కద కంటే చర్చ బాగుంది. పర్సనల్ దాడులు మాత్రం మంచివి కావు.

 29. అజిత్ కుమార్ says:

  కధలో ఆధునిక ప్రవర్తనా విధానం కనిపిస్తుంది. పూర్వ కాలంలో స్త్రీ పురుషులు ఒకరినొకరు తాకటం కూడా తప్పు అనుకునే రోజులనుండి నేడు అదేం తప్పు కాదనే అందరూ నమ్ము తున్నారు. కాలం గడిచే కొద్దీ మన ఆలోచనలు మరింతగా మారే అవకాశం ఉంది. పరస్పరం షేకింగ్ ఆఫ్ హేండ్స్ లో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఆధునికత పెరిగేకొద్దీ సెక్సంటే షేక్ హేండ్ ఇచ్చుకున్నంత సాధారణం కావొచ్చు. కనుక బాధ పడడం అనవసరమని నా అభిప్రాయం.
  ఇక కధ విషయానికొస్తే ప్రధాన కధావిషయంలో వర్ణన లేకపోవడంతో అది కధాలక్షణాన్ని కోల్పోయింది. ప్రాధాన్యత ఇవ్వవలసిన దానికి ఇచ్చివుండాల్సిందని రచయిత్రికి నా సలహా.

 30. ప్రభాకర్ గారూ, ఇక్కడ నేను అంటున్నది సామాన్య గారిని ఎందుకనాలి అనే అంటున్నాను. ఇవాళ సామన్యని అన్నారు రేపు నన్ననరా అంటున్నాను. ఏమిటిది? ఆమె ఓ కథ రాసిందనుకోండి దాన్ని గురించి కల్పన గారు విశ్లేషించారు అనుకోండి, కింద కామెంట్లు ఎందుకు సామాన్యగారి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిగా ఉన్నాయి? అని అడుగుతున్నాను. ఇక నా కథల గురించి నేను ఇక్కడ ఏమీ మాట్లాడలేదే? దయచేసి అర్థం చేసుకుని మాట్లాడండి. మీకు నా కామెంట్ అర్థం కాకపోతే “విశదంగా చెప్పండి” అని అడగండి. భావం ఈ నెట్ లో విశదీకరించపోలేకపోయానేమో! ప్్చ! ఒకప్పుడు అనుకునే వారుట ఏమిటిది ఎందుకు రచయితలు ఒకరినొకరు ఇలా వ్యక్తిగతంగా ద్వేషించుకుంటున్నారు అని.. దాని గురించి మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మన కళ్ళముందు జరుగుతుందే అని బాధపడుతున్నాను. విమర్శ సిగ్గుతో తలవంచుకోకూడదు అన్నాను. ఇక నా కథలకి ప్రత్యేకత ఉందో లేదో చెప్పమని నేను అన్నానా? పోన్లే నాకున్న శక్తి అంతే. అయితే నేను సామాన్య కథలకి అభిమానిని. అది కూడా మీకు ఈ సందర్భంగా చెప్పాలి. అసలు పుష్పవర్ణమాసం అనే కథైతే నాకు చాలా చాలా చాలా ఇష్టమైన కథ. :)

  • ఇంకో విషయం ప్రభాకర్ గారూ… సామాన్యగారినే కాదు ఇంకా రచయితలని (నన్నే అన్నారు “కృతి” కథ గురించి – వాకిలి లో వచ్చింది – నేనట పేరు కోసం పిల్ల వేషాలు వేస్తున్నానట, ఏ అంశమూ దొరకక పురాణాలులోంచి తీసుకుని రాశానట ) రచయితలు, తోటి రచయితులే అన్నారు. ఇలా ఉదాహరణలు చూపించనక్కర్లేదు కదా మీకు? రచయతలని తోటి రచయితలే వ్యక్తిగత దూషణలు చేస్తుంటే ఎలా అన్నాను

 31. వనజ తాతినేని says:

  ప్రభాకర్ గారు ..ఇక్కడ మళ్ళీస్పందించ కూడదని అనుకున్నాను కానీ మీ వ్యాఖ్య చూసాక స్పందించక తప్పలేదు.
  ఒక రచయిత రచన ఇంకొక రచయిత రచన కన్నా గొప్పవా ,సామాన్యమైనవా అని నిర్ణయించాల్సింది నిజంగా ఫాఠకులే! వాళ్ళ తీర్పే శిరోధార్యం. సామాన్యగారి రచనలు రాధ గారి రచనలు లేదా ఇంకొకరి రచనలా ఆ విషయం గురించి ఎలాంటి పేచీ లేదు కానీ రచయితల మధ్య అసూయలు,కుళ్ళుబోతు తనాలు లేవని మీరు చెప్పడమే విచిత్రంగా ఉంది. రచయితలూ పై పైకి నటిస్తూ లోలోపల అసూయతో ఉడికిపోతూ ఎప్పుడో ఒకచోట ఎవరితో ఒకరితో వెళ్ళగ్రక్కిన సందర్భాలు కోకొల్లలు. నలుగురికి చాటింపు వేసి పరువు తీసుకుంటున్నారు అని మీరు రాధ మండువ గారిని అంటున్నారు. ఆమె విమర్శ పేరుతో కమలిని కథ వ్రాసిన సామాన్య గారిని చీల్చి చెండాడిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా స్పందించారు తప్ప ఎవరికీ అనుకూలంగా వ్యాఖ్య చేయలేదని ఆ వ్యాఖ్య చదివిన ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. రచయితలలో గ్రూప్ లు, ఈర్ష్యా ద్వేషాలు, విమర్శ పేరుతో రచయితని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడం ఇప్పుడేమీ కొత్తగా పుట్టుకురాలేదు. వెబ్ పత్రికలు దాటి ఫేస్ బుక్ లోకి వెళ్లి చూడండి. రచయితల మధ్య ఉన్న అసూయాలని, కుళ్ళుబోతు తనాలని నిరూపించే అనేక వ్యాఖ్యలు, పోస్ట్స్ అక్కడ ఉంటాయి. ఎక్కడో ఎందుకు … ఈ వ్యాఖ్య పైన ఉన్న వ్యాఖ్యలలోనే ఆ విషయం అర్ధమవుతుంది. సామాన్య గారు నోటీస్ చేసినా ఆ వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ఇది చాలదూ నిరూపణ.

  ఇంకొక్కమాట ఏమిటంటే … నేను మీ కామెంట్ ని మొదటిసారి భారతదేశ సమయంలో రాత్రి 01:39 కి చూసాను. ఉదయం 07:00 కి ఈ కామెంట్ లేదు . మీరు మళ్ళీ ఇదే కామెంట్ మళ్ళీ పోస్ట్ చేసారు . మధ్యలో ఏం జరిగిందో అర్ధం అవుతుంది. హంస న్యాయం ఉండాలండీ ! ఇక్కడ అది తప్పినట్టు నాకు అనిపిస్తుంది. ఈ వ్యాఖ్య నేను కూడా వ్యక్తిగతంగా వ్రాయడం లేదు. రచనలు రచయితల దృష్టిలో వ్రాస్తున్నాను. గమనించగలరు .

 32. నిహరిక says:

  @Tirupalu Garu,
  రచయతలకి/రచయిత్రులకి సామాజిక బాధ్యత ఎక్కువ ఉండాలి. దానితో పాటు కాస్త సంయమనం, ధైర్యం కూడా ఉండాలి. పాఠకులకు అవేవీ ఉండనవసరం లేదు. రచన నచ్చకపోతే లేదా సినిమాలో కధే లేకపోతే తిట్టుకుంటాం కదా ? విమర్శ ఎటువంటిదైనా స్వీకరించాల్సిందే ! సినిమాల్లో సూర్యాకాంతాన్ని తిట్టుకుంటాం కదా ? నన్ను వ్యక్తిగతంగా తిడుతున్నారు అని ఆవిడ అలిగి కూర్చుంటుందా ? ఒక కధ వ్రాసిన తరువాత దానిని వ్యక్తిగతంగా చూడడమనేది ప్రస్థుత ట్రెండ్ , వ్రాసిన వాళ్ళు ఎదురుగా కనపడుతుంటే ఏదయినా,ఎవరైనా అనేస్తారు.నన్ను పొగిడితేనే వ్రాస్తాను లేకపోతే మీ పత్రికలో వ్రాయను అంటే ఎవరికి నష్టం ? ఒక రచనని చూసి కుళ్ళుతోనో అసూయతోనో ఎవరు విమర్సించినా ఆ రచన లక్ష్యాన్ని చేరినట్లే కాబట్టి బాధపడనవసరం లేదు.కధ గురించి చర్చే లేకుండా రచయిత్రి గురించి చర్చేమిటో నాకు అర్ధం కావడం లేదు.సామాన్య ఇలా వ్రాసిందేమిటి అనేకన్నా కమలిని ఎందుకిలా చేసింది అని ఒక్కరూ ఆలోచించటం లేదు.కార్యకారణ సంబంధం తప్పక ఉండే ఉంటుంది. కమలినికి దీపూ ఏమని సమాధానం చెపుతాడా అని వేచిచూస్తున్నాను.

  • THIRUPALU says:

   నిహారిక గారు,
   మీతో ఏకీభవిస్తున్నాను. రచయితకు తప్పనిసరిగా భాద్యత ఉండాలి. కమలిని పాత్ర సమాజ మొత్తానికి ప్రతిబింబం కాదు. 70 ఎల్లా క్రితం చలం హారు సృష్టించిన రాజేశ్వరి ని చూసి నోర్లు నొక్కు కొనే సమాజం ఇవాళ లేదు. ఎన్ని కట్లు బాట్లు మధ్య నైనా ఎన్ని పాశవిక సమస్యల్లో కూడా స్త్రీ పురుష సంబందాలు చరిత్రలో వడి దుడుకులు లేకుండా సాపిగా జరిగిన సందర్బాలు లేవు. ఈ కధ నైతిక కోణాన్ని వదిలిపెడితే స్రీల హక్కుల దృక్పదమ్ నుండి సరిగ్గా లేదు. అది పురుశాదిపత్యాన్నే సమర్ధిస్తుంది. అందుకే ఈ విమర్శలు. పతివ్రత ల గురించి మాట్లాడుతుంది. మళ్లి తప్పుచేసాను అంటుంది. ఇది ద్వంద వైకరి. ఒక సారి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింద లేదా ఆమెకు ఆమె నిర్ణయించు కోవాలి. ఇతరులేవారు నిర్ణయించారు. తన శరీరానికి తానే అది పతి. ఇంకొకరికి చెప్పినంత మాత్రాన ఆమె ‘పతివ్రత’ కాదుకదా! అదే ఇక్కడ చర్చ నియమ్శమ్. ఆమె పశ్చాతాపం అర్ధం లేనిది కాబట్టే ఈ రగడ.

 33. కె.కె. రామయ్య says:

  నీహారిక గారు, క్షమించండి మీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.

  వివాహ బంధానికి బయట పొందిన అనుభవాన్ని, అనాలోచితంగా జరిగిన ఒక శారీరక తప్పిదానికి, కమలినిలో కలిగిన అపరాధ భావన, భర్త పట్ల తనకున్న గాఢ ప్రేమలను పరిగణలోకి తీసుకోకుండా మనువు కాలం నాటి పాతివ్రత్యం పడికట్టుతో కమలినికి ఘోరమైన నేరం అంటకట్టడము సబబు కాదు.

  ఈ సందర్భంలో పాతివ్రత్యం, తప్పు, అనైతికత లాంటి భావజాలం కలగడము … నేటి ఆధునిక మహిళా ప్రతినిధి లాంటి కమలినిలో కలగడము ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్నే కించపరిచేలా ఉన్నాయనేది ఈ వ్యాసంలోని వాదన.

  • నిహరిక says:

   K k Ramayah Garu,

   నేనే నీవయితే ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పినతరువాత కమలినిలో అపరాధభావన ఎక్కడుంది ? ఘాడమైన ప్రేమ ఎక్కడుంది ? ఒక తప్పు చేస్తున్నపుడు మెడలో ఉన్న నల్లపూసలే భర్తని గుర్తు చేస్తాయి కదా దీపూ దీపూ అని కలవరించడం అబద్దం. తల్లిని క్షమించనివాడు తననిమాత్రం క్షమిస్తాడని ఆశించదు కదా ? దీపూ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవడం కోసమే స్త్రీలోలుడని తెలిసీ తప్పు చేసింది.(మంచివాడయితే అతనిని వదిలించుకోవడం కూడా కష్టమే కదా ? ) భర్తని పరీక్షించడం కోసమే తప్పు చేసి ఉండాలి లేదా తప్పు చేసానని అబద్దం చెప్పి ఉండాలి. పైన ఎవరో చెప్పినట్లు మంచివాడి పెళ్ళాలెపుడూ ఇలాంటి ప్రయోగాలే చేసి చరిత్రని మార్చేసారు. ఏ చట్టం తేవాలన్నా ఇద్దరు ఆడవాళ్ళు తేలేరు.మగవాడి ఆమోదం తప్పనిసరి.

   పాతివ్రత్యం,నైతికం,కట్టుబాటు అనేవి ఏ యుగంలోనైనా తప్పనిసరి.సమాజం మనుగడే వాటిపై ఆధారపడి నడుస్తున్నపుడు ఆధునిక మహిళల ఆత్మగౌరవం దెబ్బతిన్నంతమాత్రాన వాటివిలువ తగ్గిపోదు.

 34. Chandrika says:

  అసలు ఈ కథ మీద అంత వ్యాసం, ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఆశ్చర్యం గా ఉంది. రచయిత్రి మీద మాట్లాడేవారే కానీ కథాంశం మీద చర్చ చెయ్యట్లేదు. అసలు వ్యాసమే కథ లో పాత్ర ని కాక రచయిత్రి ని టార్గెట్ చేస్తున్నట్లు ఉంది – ఇది వరకు ఇలా వ్రాశావు ఇప్పుడు ఇలా వ్రాశావు అంటూ. అసలు ఈ కథ మీదే ఎందుకింత చర్చ అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇది వరకుస్త్రీలని కించపరిచే విధం గా కథ ఒకటి సారంగ లో నే.చదివినట్లే గుర్తు. బస్సు స్టాపు లో పరిచయమైన వ్యక్తి తో Living together గా ఉండి సంతానానికి సిద్ధం అవుతుంది ఆ పాత్ర. ఇంకొకటి కినిగే లో చదివినట్లు గుర్తు. ‘మహి’ అనే నవల లో ఆ ‘మహి’ పాత్ర కి ఒక వదిన ఉంటుంది. ఆ అన్నయ్య సరిగ్గా ఉండడని వేరే మగవాడితో తిరుగుతూ ఉంటుంది. వాడు తనని పెళ్లి చేసుకోడని ఆ వదిన పాత్రకి తెల్సు. అయినా తిరగడం ఆపదు. ఇద్దరు పిల్లలున్న తల్లి పాత్ర ఆలోచించే విధానం చూస్తుంటే చదవ బుద్ధి కాదు. ఆ నవల గురించి వ్రాయమంటే ఇంతకంటే పెద్ద వ్యాసం వ్రాసేస్తా కూడా. మరి ఆ కథ, నవల ఎవరూ చదవలేదా ? ఆ పాత్రలు ఎవరికీ స్త్రీలని కిన్చపరచినట్లు అన్పించ లేదా ? ఇద్దరు రచయితలు నాకు తెలిసి స్త్రీలే !!

 35. Prabhakar K says:

  వనజ తాతినేని

  కామెంట్స్ లో సామాన్య గారిని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్లలో రచయితలెవరూ లేరు. అయినా రాధ మండువ గారు రచయితలే సాటి రచయిత్రిని విమర్శిస్తున్నారు అని అంటున్నారు? ఎవరా రచయితలు? ఎక్కడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడకొచ్చి రాస్తున్నట్టుగా కనిపిస్తున్నది కామెంట్స్ అన్నీ చదవండి !

  రచయిత్రుల మధ్య అసూయలు ఉంటే ఉండొచ్చు, ఫేస్బుక్ లో ఒకరికొకరు లైక్స్ కొట్టక పోవడమో, మరొకరి దగ్గర వెళ్ళబోసుకోవడమో జరగొచ్చు! వాళ్ళు ఫలానా చోట అలా అన్నారు, ఇలా అన్నారు అని పబ్లిగ్గా ఇలా పత్రికల ద్వారా సోషల్ మీడియాలో లేని వారికి సైతం వీటిని చెప్పి రచ్చ చేసుకోడమేనా రచయితల పని?

  పాఠకుల దృష్టిలో రచయితల స్థానం దిగజారిపోవడానికి ఇంతకంటే అవసరమా?

  కామెంట్ రాశాక ఇదే మళ్ళీ ఈ పత్రిక చూడటం మళ్ళీ! ఈ లోపు కామెంట్ మాయమవడం, మళ్ళీ కనిపించడం ఏమిటో వింత?

  అర్థ రాత్రులూ తెల్లార్లూ మీరు మేలుకుని ఆన్ లైన్ పత్రికలు చెక్ చేస్తూ ఉండటం మాత్రం బాగుంది. మీ టైం కి ఓపికకు జోహార్లు

 36. వనజ తాతినేని says:

  వారిజ కథ పి. వసంత లక్ష్మి గారు సారంగ లోనే ప్రచురితం http://saarangabooks.com/retired/2015/04/08/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C/

  మహీ నవల కుప్పిలి పద్మ గారు.

 37. kiran kothagudem says:

  నాకు కమలిని ఇలా అర్థం అయ్యింది —
  1)కమలిని 27,28 యేండ్ల అమ్మాయి కావొచ్చు.కల్పన గారి విమర్శ చదివాక కథ మళ్ళీ రెండు సార్లు చదివాను .కమలిని ప్రౌడ అనే సూచన నాకు ఎక్కడా కనపడలేదు.కమలిని మాట్లాడిన , ప్రవర్తించిన తీరు ,వాతావరణం,పిల్లల ప్రస్తావన లేక పోవటం వల్ల కమలిని వయస్సు 27,28 కావొచ్చని సాధారణ పాఠకుడిని అయిన నాకు తోచింది .
  2)కమలిని భారతం చదివే సాంప్రదాయక కుటుంబం లో పుట్టి పెరిగి ఉండొచ్చు ,ఆమెకు కూడా సాహిత్యం చదివే అలవాటు వుంది .
  3)కమలిని నిజయీతీ మంచి వ్యక్తిత్వం వున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి.
  4)కమలిని ఉన్నత విద్యావంతురాలు.మంచి ఉద్యోగం లో ఉంది.నిత్యం చాలా మంది మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంది.
  5)కమలిని భర్త ని చాలా ప్రేమిస్తుంది.
  6)కమలిని అనుకోకుండా పర పురుషుడి పట్ల తాత్కాలికంగా ఆకర్షితురాలు అవుతుంది.ఈ విషయం కమలినిని చాలా బాధిస్తుంది.నిజయీతీపరురాలైన కమలిని తనని చాలా ప్రేమించే భర్త కి చెప్పాలని అనుకొంటుంది .
  7)కమలిని భర్త కి ఉత్తరం రాస్తుంది .
  8)కమలిని చదువరి,తెలివైనది,ఆమెకు సమకాలీన సమాజంలోని అభ్యుదయ విషయాల పట్ల కొంత అవగాహన ఉంది. కానీ “మెయిన్ స్ట్రీమ్ ” సమాజం లో సాధారణమైన జీవితం జీవిస్తున్నది .(విప్లవ సంఘం లోనో స్త్రీ వాద సంఘం లోనో సభ్యురాలు కాదు.)
  9)కమలిని భర్తకి జరిగిన విషయం నిజయీతిగా చెబుతూనే తను నివసిస్తున్న సమాజం గురించి తన అవగాహనని తెలియ చేస్తుంది.
  10)కమలిని మంచిది కాబట్టి తనను ఎంతో ప్రేమించే సహచరుడు బాధ పడేటట్టు చేయటం తప్పు అని భావిస్తుంది .’పాతివ్రత్యం” మొదలగు మాటలు వాడుకలో ఉన్నవి నిషేధం లో లేనివి కూడా కాబట్టి మాములు మనుషులు ఆ పదం వాడినట్టే కమలిని కూడా తన ఉత్తరం లో ఆ మాట వాడినా ,ఉత్తరం మొత్తం చదివాక నిజాయితీ కంటే పాతివ్రత్యం అనే ఆ భావన పెద్ద విలువయినదేమీ కాదని ఆమె ఉద్దేశ్యమని తెలుస్తున్నది . ఈ వేదనని ఇంకా స్పష్టంగా చెప్పటానికి తస్లీమా నస్రీన్ ఉదంతం గుర్తు చేస్తుంది.
  11)సమాన హక్కులు ,సమాన తప్పిదాలు అని కమలిని అన్నప్పుడు ఒక పాఠకుడిగా నాకు హక్కుల తో పాటు “తప్పిదాలను” కూడా ఒప్పుకోవాలి కదా అనే అనిపిచింది .కల్పన గారు ‘పొట్టి బట్టలు అత్యాచారాలు ” తో సమాన హక్కులు సమాన తప్పిదాలను పోల్చ్చారు .కల్పన గారికి క అర్థం ఐనట్లు నాకెందుకు అర్థం కాలేదు అని ఆమె చెప్పినట్లు అర్థం చేసుకోవడానికి మూడు రోజులుగా ప్రయత్నించి విఫలం అయ్యాను.
  12)రచయిత్రి సామాన్య కమలిని పాత్రను ఏదో ఒక వాదానికి రేప్రేసేన్టేటివ్ గా చిత్రించకుండా , వైరుధ్యాల ,సంక్లిష్టతల మామూలు మనిషిగా కమలిని ని తీర్చి దిద్దింది.తన పరిమిత జ్ఞానంలో కమలిని కి భూమి పుట్టినప్పటి నుంచి స్త్రీలు ఇటువంటి వాటిని ఎన్నిటినో భరించారు కదా ,వారికి లేని పాతివ్రత్యం స్త్రీలకేందుకు ,ఇప్పుడు పురుషులు కూడా స్త్రీలలాగే సరేలే దాందేముంది అనుకోవచ్చు కదా అనే ఆలోచన రావటమే చాలా ప్రోగ్రెసివ్ . ఎందుకంటె కమలిని స్త్రీవాది కాదు కదా .

  • Rajendra Prasad Chimata says:

   మీ ఎనాలిసిస్ చాలా బాగుంది.చాలాలోతుగా పరిశీలించారు.

 38. మంజరి లక్ష్మి says:

  “తన పరిమిత జ్ఞానంలో కమలిని కి భూమి పుట్టినప్పటి నుంచి స్త్రీలు ఇటువంటి వాటిని ఎన్నిటినో భరించారు కదా ,వారికి లేని పాతివ్రత్యం స్త్రీలకేందుకు ,ఇప్పుడు పురుషులు కూడా స్త్రీలలాగే సరేలే దాందేముంది అనుకోవచ్చు కదా అనే ఆలోచన రావటమే చాలా ప్రోగ్రెసివ్ . ఎందుకంటె కమలిని స్త్రీవాది కాదు కదా .” ఇక్కడ అర్ధం కాలేదండీ. ఏదో తేడాగా ఉంది వాక్యం `వారికి లేని ప్రాతివ్రత్యం’ లో వారు ఎవరు పురుషులా? అలా అయితే పుట్టినప్పటినుంచి ఇటువంటి వాటిని భరించిన వాళ్ళు ఎవరు? స్త్రీలు కాదనిపిస్తోంది.

 39. venkat says:

  పాత్రివ్రత్యం, లైంగిక స్వేచ్చా వాదాల కోణం నుంచి కాకుండా విషయాలను ఆరోగ్యం, అనారోగ్యం కోణం నుంచి భేరీజు వేసి ఎటువంటి ప్రవర్తన వల్ల శారీరికంగా ఆరోగ్యంగా వుందోచ్చో అది నేర్చుకుంటే మంచిది. నిజానికి ఒక పార్టనర్ యడల పాతివ్రత్యం, నిబద్దతా మొదలైనవి స్త్రీకైనా పురుషుడికైనా శారీరిక ఆరోగ్యాన్నికోరకు నిర్దేశించబడిన అంశాలు. అదోదిలేసి ఏదేదో వాదాలు….మనసుకి నియంత్రణ అలవాటు చేయక ఏటంటే అటు వెళితే ఆనక రోగాలోచ్చాయని బాధ పడకుండా ఉండగలిగితే, అవి మళ్ళీ వేరొకరికి అంటించకుండా ఉండ గలిగితే స్వ్సేచ్చా వాదం తప్పు కాదు! అది ప్రాక్టికల్ గా సాధ్యమా?

 40. kiran kothagudem says:

  నాకు కమలిని ఇలా అర్థం అయ్యింది —
  1)కమలిని 27,28 యేండ్ల అమ్మాయి కావొచ్చు.కల్పన గారి విమర్శ చదివాక కథ మళ్ళీ రెండు సార్లు చదివాను .కమలిని ప్రౌడ అనే సూచన నాకు ఎక్కడా కనపడలేదు.కమలిని మాట్లాడిన , ప్రవర్తించిన తీరు ,వాతావరణం,పిల్లల ప్రస్తావన లేక పోవటం వల్ల కమలిని వయస్సు 27,28 కావొచ్చని సాధారణ పాఠకుడిని అయిన నాకు తోచింది .
  2)కమలిని భారతం చదివే సాంప్రదాయక కుటుంబం లో పుట్టి పెరిగి ఉండొచ్చు ,ఆమెకు కూడా సాహిత్యం చదివే అలవాటు వుంది .
  3)కమలిని నిజయీతీ మంచి వ్యక్తిత్వం వున్న కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి.
  4)కమలిని ఉన్నత విద్యావంతురాలు.మంచి ఉద్యోగం లో ఉంది.నిత్యం చాలా మంది మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంది.
  5)కమలిని భర్త ని చాలా ప్రేమిస్తుంది.
  6)కమలిని అనుకోకుండా పర పురుషుడి పట్ల తాత్కాలికంగా ఆకర్షితురాలు అవుతుంది.ఈ విషయం కమలినిని చాలా బాధిస్తుంది.నిజయీతీపరురాలైన కమలిని తనని చాలా ప్రేమించే భర్త కి చెప్పాలని అనుకొంటుంది .
  7)కమలిని భర్త కి ఉత్తరం రాస్తుంది .
  8)కమలిని చదువరి,తెలివైనది,ఆమెకు సమకాలీన సమాజంలోని అభ్యుదయ విషయాల పట్ల కొంత అవగాహన ఉంది. కానీ “మెయిన్ స్ట్రీమ్ ” సమాజం లో సాధారణమైన జీవితం జీవిస్తున్నది .(విప్లవ సంఘం లోనో స్త్రీ వాద సంఘం లోనో సభ్యురాలు కాదు.)
  9)కమలిని భర్తకి జరిగిన విషయం నిజయీతిగా చెబుతూనే తను నివసిస్తున్న సమాజం గురించి తన అవగాహనని తెలియ చేస్తుంది.
  10)కమలిని మంచిది కాబట్టి తనను ఎంతో ప్రేమించే సహచరుడు బాధ పడేటట్టు చేయటం తప్పు అని భావిస్తుంది .’పాతివ్రత్యం” మొదలగు మాటలు వాడుకలో ఉన్నవి నిషేధం లో లేనివి కూడా కాబట్టి మాములు మనుషులు ఆ పదం వాడినట్టే కమలిని కూడా తన ఉత్తరం లో ఆ మాట వాడినా ,ఉత్తరం మొత్తం చదివాక నిజాయితీ కంటే పాతివ్రత్యం అనే ఆ భావన పెద్ద విలువయినదేమీ కాదని ఆమె ఉద్దేశ్యమని తెలుస్తున్నది . ఈ వేదనని ఇంకా స్పష్టంగా చెప్పటానికి తస్లీమా నస్రీన్ ఉదంతం గుర్తు చేస్తుంది.
  11)సమాన హక్కులు ,సమాన తప్పిదాలు అని కమలిని అన్నప్పుడు ఒక పాఠకుడిగా నాకు హక్కుల తో పాటు “తప్పిదాలను” కూడా ఒప్పుకోవాలి కదా అనే అనిపిచింది .కల్పన గారు ‘పొట్టి బట్టలు అత్యాచారాలు ” తో సమాన హక్కులు సమాన తప్పిదాలను పోల్చ్చారు .కల్పన గారికి క అర్థం ఐనట్లు నాకెందుకు అర్థం కాలేదు అని కల్పన గారు చెప్పినట్లు అర్థం చేసుకోవడానికి మూడు రోజులుగా ప్రయత్నించి విఫలం అయ్యాను.
  12)రచయిత్రి సామాన్య కమలిని పాత్రను ఏదో ఒక వాదానికి రేప్రేసేన్టేటివ్ గా చిత్రించకుండా , వైరుధ్యాల ,సంక్లిష్టతల మామూలు మనిషిగా కమలిని ని తీర్చి దిద్దింది.
  ఆ మామూలు కమలిని తన పరిమిత జ్ఞానంలో” భూమి పుట్టినప్పటి నుంచి స్త్రీలు పురుషుల వైపు నుండి ఇటువంటి వాటిని ఎన్నిటినో భరించారు కదా ,పురుషులకు లేని పాతివ్రత్యం స్త్రీలకు ఎందుకుంది ,ఇప్పుడు పురుషులు కూడా స్త్రీలలాగే సరేలే దాందేముంది అనుకోవచ్చు కదా” అని ప్రశ్నిస్తుంది . ఆమెకు ఆ మాత్రపు ఆలోచన రావటమే చాలా ప్రోగ్రెస్ . .

 41. kiran kothagudem says:

  .
  12)రచయిత్రి సామాన్య కమలిని పాత్రను ఏదో ఒక వాదానికి రేప్రేసేన్టేటివ్ గా చిత్రించకుండా , వైరుధ్యాల ,సంక్లిష్టతల మామూలు మనిషిగా కమలిని ని తీర్చి దిద్దింది.
  ఆ మామూలు కమలిని తన పరిమిత జ్ఞానంలో” భూమి పుట్టినప్పటి నుంచి స్త్రీలు పురుషుల వైపు నుండి ఇటువంటి వాటిని ఎన్నిటినో భరించారు కదా ,పురుషులకు లేని పాతివ్రత్యం స్త్రీలకు ఎందుకుంది ,ఇప్పుడు పురుషులు కూడా స్త్రీలలాగే సరేలే దాందేముంది అనుకోవచ్చు కదా” అని ప్రశ్నిస్తుంది . ఆమెకు ఆ మాత్రపు ఆలోచన రావటమే చాలా ప్రోగ్రెస్ . .

 42. కె.కె. రామయ్య says:

  ” వైరుధ్యాల, సంక్లిష్టతల మామూలు మనిషిగా కమలిని ని చిత్రించారు రచయిత్రి సామాన్య. పురుషులకు లేని పాతివ్రత్యం స్త్రీలకు ఎందుకుంది అనే మాత్రపు ఆలోచన కమలినికి రావటమే ఆమెలో చాలా ప్రోగ్రెస్ ” చక్కగా వివరించిన కిరణ్ గారికి ధన్యవాదాలు.

 43. Devarakonda says:

  If the ugliest form of seduction is rape, the sophisticated form of rape is seduction. Kamalini is a victim of seduction. Character is equally important (or unimportant) for male and female human-beings. To overcome the feeling of guilt, Kamalini struggled to seek theoretical support from scriptures to literature to real life incidents in society at large. As I understand, it is an incomplete story. Kamalini-2 can be considered by the writer, from Dipu’s angle, so as to reach a logical conclusion. Even the most advanced nations do not welcome a society of free-sex! It is probably a dream for MCPs and a few ‘most progressive ‘ feminists! (as opined by Hari S Babu elsewhere in this column).

 44. దేవరకొండ says:

  లైంగిక అత్యాచారం యొక్క ముసుగు మరులు గొలిపి వలలో వేసుకోవడం అయితే ఈ వలలో వేసుకోవడం యొక్క వికృత రూపం లైంగిక అత్యాచారం! ఈ వలలో వేసుకోవడం అనే అత్యాచార బాధితురాలు కమలిని ఈ కథలో. శీలం అనేది (దాన్ని ఎవరెలా నిర్వచించుకున్నా) స్త్రీ పురుషులిద్దరికీ సమాన ధర్మం. అపరాధ భావనల నుంచి తనను తాను రక్షించుకునే ప్రయాసలో కమలిని పురాణ గాధలనుండి, సాహిత్యం నుండి, సమాజంలో జరిగే సంఘటనల నుంచీ ఉదాహరణలను మద్దతుగా తోడు తెచ్చుకొనే ప్రయత్నం చేసింది. ఈ కథ అసంపూర్ణం అని నా అభిప్రాయం. రచయిత, కమలిని-2 కూడా (దీపు కోణంలో) రాస్తే ఈ చర్చను ఒక తార్కిక తీరానికి తీసుకెళ్లే ఆవ కాశం ఉంది. ఎంతో అభివృధ్ధి చెందిన దేశాలు కూడా విచక్షణా రహిత చిత్తకార్తె నాగరికతను ఆహ్వానించవు. అది కేవలం మగ దురహంకారులు, మరి కొందరు అతివాద ఫెమినిస్టుల కల కావచ్చు! ( hari S babu marO చోట చెప్పినట్లు)

 45. శ్రీనివాసుడు says:

  ’’క‘‘ మలిని ‘‘అ’’ మలినిగా మారాలనుకోవడం తన స్వేచ్ఛకు సంబంధించిన విషయం. అది తన ఇష్టం, తన తత్త్వం. మనం మనం చర్చించుకోడానికి అది అతీతం.
  ‘‘రచన వ్యక్తపరిచే తాత్వికతే రచయిత’’. ఇదే ’’సామాన్య‘‘ తత్త్వం.
  అయితే, ఆ తత్త్వం కూడా ”There is nothing permanent except change..” [ఇంక్లూడింగ్ మై అబౌవ్ వోర్డ్స్ ]’’

 46. నా అభిప్రాయం కొంచెం పెద్దగా వుండడం వల్ల నా బ్లాగ్ లో….

  http://kv-kurmanath.blogspot.in/2016/05/blog-post_64.html

 47. కె.కె. రామయ్య says:

  కూర్మనాధ్ గారి అభిప్రాయం ( వారి బ్లాగు నుండి )

  ” కమలిని మీద కల్పనకి వున్న విమర్శే నాకు కూడా వున్నది. ఆమె దీనంగా కాకుండా, బతిమాలుతున్నట్టుగా కాకుండా వుండి వుంటే బాగుంటుందని నాకు అనిపించింది. కమలిని కొన్ని చోట్ల బోల్డ్ గా ఎసర్టివ్ ఉన్నట్టుగా అనిపించడం వల్ల ఆమె మీక్ గా రాయడం బాగుండలేదు.

  లేఖ రాసిన పధ్ధతి మీద కూడా నాకో విమర్శ వున్నది. లేఖ టోన్ రొమాంటిక్ గా వున్నది. ఈ ఇతివృత్తం రొమాన్స్ కి సంబంధించినది కాదు. మనుషుల మధ్య సంబంధంలో చాల డెలికేట్ అంశానికి సంబంధించిన అంశం. కాబట్టి లేఖ టోన్ భిన్నంగా వుంటే బాగుండేదని నాకనిపించింది “.

 48. Allam Vamshi says:

  స్త్రీలూ, పురుషులూ, వాదులూ, వాదాలూ…blah blah blah… ఇయన్ని పక్కన పెడితె ఒక ఆర్డినరీ పాఠకునిగా నాకు కథ మస్తు మంచిగనిపించింది..

  చదువుతుంటే చదవబుద్ది అయింది..

  ఒక్కసారి కథ చదవడం మొదలుపెడితే ఆ కథ అయిపోయేదాకా కంటిన్యుయస్ గా చదివించేటట్టు రాయడం సామాన్య గారి ప్రత్యేకత.

  వారి “మహిత” కథ చదువుతుంటే ఎంత మంచిగ అనిపించిందో “కమలిని” కథ చదువుతుంటె కూడ నిజంగ అంతే మంచిగ అనిపించింది.. ఈ కథాంశం, కథ చెప్పిన తీరు, కథలో మాటలు, మనుషులూ మొత్తం అన్ని నచ్చినయి.

  నాకు అంత మంచిగ అనిపించిన కథ గురించి ఇక్కడ ఇంత పెద్ద నెగెటివ్ చర్చ జరిగిందని ఇప్పుడే చూసి మస్త్ పరేషాన్ అయిన! సగం కామెంట్లు నాకసలు సమజే కాలేదు.. అసల్ తిట్టిన్లా పొగిడిన్లా తెల్వలేదు!

  ఏదేమైనాగని తిట్టడాన్నే “విమర్శ”చెయ్యడం అని అనుకోవడమే అసలు విషాదం.. ఈ విషయంలో చానమంది ఇక్కడ తమస్థాయిని తగ్గించుకున్నట్టు అనిపించింది!

  ఒక మంచి రచయిత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇదికాదని నా అభిప్రాయం..

  సరే..
  ఏదేమైనాకని సామాన్య గారికి కృతఙ్ఞతలు..

  నేను చదివేది అతికొద్దిమంది కథలే.. అందులో మొదటి స్థానంలో ఉండే రచయిత్రి మీరే.. “మహిత నుంచి కమలిని దాకా అన్నీ మంచి కథలే.. ”

  కథలు చదవడం అలవాటులేని నాలాంటి చానామందిని మీ మంచి కథలతో చదువరులుగా మారుస్తున్నందుకు & సద్విమర్శలు చేసి నాలాంటి కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నందుకు.. నిజంగా చాన థాంక్స్ మేడం ..

  ఎంతో ఓపికతో కథంతా చదివి దానిలోని మంచి చెడు గురించి మీరు చెప్పే తీరు చానా నచ్చుతుంది నాకు..
  నిజంగ కొత్త రచయితలుకు మీరిచ్చే ప్రోత్సాహం చాల గొప్పది, ఆ “మాటల” విలువ ఎంతో నాకు తెల్సు..
  అటువంటి మీరు, దయచేసి ఇటువంటి చర్చలను పెద్దమనసుతో “క్షమించేసి” ఎప్పటిలాగే ఇంకెన్నో మంచి మంచి కథలు మాకందించాలని మనస్పూర్థిగా కోరుకుంటూ..

  అల్లం వంశీ

మీ మాటలు

*