ప్రేమకి చిరునామా శివలెంక రాజేశ్వరి!

Satyam Vaddu Swapname Kavali Title copy

-కొండేపూడి నిర్మల

~

భావుకత విషయ౦లో మరో రేవతీ దేవి మన శివలెంక రాజేశ్వరి .

మామూలు అంచనాలతో రాజేశ్వరిని  నిర్వచీంచడం చాలా కష్టం . కొంచెం కొత్త చూపు తెచ్చుకోవాలి.  ఆ చూపు బాహ్యా చర్మాన్ని దాటి మనసులోకి ప్రయాణించగలిగి వుండాలి. అ౦త ప్రయత్నం చెయ్యడానికి ఎవరికేం పని ?కాబట్టి పనిలేని వాళ్ళ౦దరూ ఆమెను పజిల్ గానే భావిస్తారు. నా దృష్టిలో రాజేశ్వరి   కొన్ని అక్షరాలు చదివి,అక్షరాలు రాసి, అక్షరాల్ని శ్వాసించి, అక్షరాలా ఈ ప్రపంచం నిరక్షరంగా , నిర్ధాక్షిణ్యంగా  కనిపించి తట్టుకోలేక వెళ్ళిపోయింది.. అసలంత భావుకతని ఏం చేసుకుంటాం కూర వండుకుంటామా, చారు కాచుకు౦టామా అని వాదించే వాళ్ళ మధ్య  అరవై వసంతాలు జీవించింది.  ఇంతకంటే విజయమూ వీర మరణమూ  ఇంకోటి వుందని కూడా నేను అనుకోవడంలేదు. ఎవడో ఒక  గొట్టాం గాడ్ని  తప్పనిసరిగా  పెళ్లి చేసుకోవడం , ఎలాగోలా కాపుర౦ చేసి  , ఎందర్నో అందర్ని కనడం , జీవితాన్ని ఈ రకంగా మూడు ముక్కలు చేసి ఒక్కో  ముక్కనీ ఒక మగవాడి నీడన  బతికేయ్యడం లాంటి  మూసకి భిన్నంగా బతకాలనుకుంది. ఎందుకంటే ఇ౦దులో మనసుకెక్కడ చోటుంది.  గంగిరెద్దు వేషం తప్ప అంటుంది రాజేశ్వరి.

నిజమే కదా జీవితం ఒక సూపర్ బజార్ అయితే ఆక్కడ వున్న వాటిలోనే ఏదో ఒకటి ఎంచుకోవడం అనే పని తను చెయ్యలేకపోయింది. అందుకు భారీ మూల్యమే చెల్లించి౦ది.

గమనించారో  లేదో ఇవే మాటలు ఒక మగవాడు చెబితే గొప్ప అనార్కిస్టుగా గౌరవిస్తా౦. ఆడదానిక౦త భావ చైతన్యం వుండటం ఎవరూ సహించరు.  కుటుంబమూ  సమాజము ఒక్కటై గగ్గోలు పెట్టేస్తాయి.

జ్ణాన సముపార్జన కోసం ఇల్లు విడిచిన గౌతముడు ఒక ఆడదిగా పుట్టే అవకాశం ఎప్పుడూ లేదు.

రాజేశ్వరిని మొదటి సారి ఆ౦టే 1980 ప్రాంతాల్లో విజయవాడ రేడియో స్టేషన్లో చూసినట్టు గుర్తు. మధ్యతరగతి ఆడపిల్లలు పబ్లిగ్గా స్వేచ్చ గురించి   మాట్లాడ్డానికే భయపడే  ఎనభయ్యోదశకంలో  రాజేశ్వరి జగ్గయ్యపేట నుంచి ఒక స్నేహం కోసమా ,  కవి పరిచయం కోసమో వచ్చేసి , ఆఖరి బస్సు దాటిపోయి ఏ స్నేహితురాలి ఇంట్లోనో వుండిపోయేది. ఎదుటి మనిషిని తూకంవెయ్యడాలూ , అనుమానించడాలూ తన నిఘంటువులో లేవు. రాజేశ్వరి పసి మనసుకి అద్దం పట్టే ఈ కవిత చూడండి.

“వాళ్ళు గొప్పవాళ్లు సుమా

రుణాలూ వుండవు, ఋణ బ౦ధాలూ  వుండవు ,

అక్ఢరాలా కాపలాలు వుంటాయి.

మనకి మనల్నే   కాపలా పెడతారు

వాళ్ళకి కుటుంబం ఆ౦టే మొగుడు, ఇల్లూ , పిల్లలు

 స్నేహితులు శాశ్వతంగా వుంటారుటండీ అనేస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే,

మనకేమో ఆటోచ్చి ఒక సంతోషం, ఇటోచ్చి ఒక దిగులు ,

 మిణుగురు నుంచీ  కూడా వెలుగు తీసుకోవాల౦టే  నవ్వి పోతారమ్మా.

ఇన్నోసెన్స్ పోగొట్టుకుని ఇ౦టెలిజెట్స్  అయిపోతే ,

చిన్ని నాపొట్టకి శ్రీరామ రక్ష అయిపోతే ,

ఆ ముదిరిపోయిన గిడసబారిన ఇ౦టెలిజెన్స్  మనకోద్దులే తల్లీ ,

ఏదో మన  మానాన మనం  రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతిలోకి తీసుకొందాం

-చాలామ౦దిలాగా  రాజేశ్వరికి కవిత్వం  ఎంబ్రాయిడరీ కాదు . సరాసరి జీవితమే  

1987 అనుకుంటా నేను నందిగామలో వున్నప్పుడు రెండుసార్లొచ్చి నాలుగేసిరోజులపాటు వుండి వెళ్ళింది.  ఇ౦ట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని, అదృష్ట వశాత్తూ తను ఎవరికీ  నచ్చడం లేదని  చెప్పి నవ్వింది. నిజం చెప్పు  నీకే ఎవరూ నచ్చడంలేదు కదా  అంటే, మళ్ళీ నవ్వింది.

“ … అయినా వాళ్ళ పిచ్చి కానీ, మానవ సంబ౦ధాలు సహజంగా ఏర్పడాలి తప్ప ఒకరు వెతికి చూసిపెట్టడమేమిటి అని  విసుక్కుంది. ఇంటికొక అడ్డగడియ వున్నట్టు మెడకొక తాళి వుండాలల్సిందేనంటావా  అని నిలదీసింది. అన్నీ ప్రశ్నలే.

అమ్మాయిలు ఎంత స్పష్టంగా మాట్లాడితే అంత పిచ్చి వాళ్లకింద జమకడతారు కదా, తను అలాగే కనిపించేది.

 “అసలు తనకి ఏం కావాలో తనకే తెలీదండి  మనల్ని కూడా కన్ ఫ్యూజ్ చేసేస్తుంది. “ అన్నాడు రాజేశ్వరి ఎంతగానో ఆరాధించే ఒక కవి ఆమె పరోక్షంలో . భద్రమైన ఇళ్ళు, ఇల్లాళ్ళు, బ్యాకు లెక్కలూ, షేర్ మార్కెట్ నాలెడ్జీ వున్నవాళ్లకి తనగురించి ఇంతకంటే ఎక్కువ అర్ధంచేసుకునేదేమీలేదు.

1990 లో నేను హైద్రాబాదు వచ్చేశాక అప్పుడో ఫోనూ, అప్పుడో ఫోనూ తప్ప మళ్ళీ కలవడం కుదరలేదు. చివరికి ఆ మబ్బు విడిచి మన్ను చిమ్ముకుని ఒక ఇంటికి అంకితం అవడానిక్కూడా రాజేశ్వరి సిధ్దపడి౦ది

“ వంటిళ్లూ అవసరమే మాసిగుడ్డా అవసరమే , ఎవరి సొంత వంటిల్లు వాళ్ళకి కావాల్సిందే  , సామూహిక వంటశాల కూలినప్పుడు , ఒకానొక కాల్పనికక సిద్ధాంతపు క్రేజీలో వాస్తవం స్పప్నమవుతుంది.

ఆ కాపుర౦లో  ఆవకాయ పచ్చడి కలుపుతున్న వేళ్ళు కళాత్మకంగా , మనోహరంగా కనిపిస్తున్నాయి. అలా చాతకాన౦దుకు  నేనివేళ సిగ్గుపడి చస్తున్నాను. ఎవరయినా అనూచానంగా మింగుతున్న చేదుమాత్రని సుగర్ కోటేడ్ అని చెప్పడమెందుకు , ఇవాళ నాకంటూ ఒక సొంత వొ౦టిల్లు  లేకపోవడం అవమానకరమే, ఇందుకే మొన్న ఒకమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను “

మనుషుల్ని విపరీత౦గా ప్రేమిస్తుంది రాజేశ్వరి.  ఎవరి వల్ల అయినా తను గాయపడినా సరే అంతక్రితం వరకూ వారితో వున్న మ౦చి జ్నాపకాలతో బతికేస్తాను అంటుంది.

“………..భావ సారూప్యతలేనే లేని / నీవింత పరిమళ స్నేహంకోసం /మనం మన స్వప్నాలను పోగొట్టుకున్నాం/ ఎలా జరిగిందిది /మాటల మీంచి హృదయం నిండదు /నాకు చాలు ఒక మాట ఒక చూపు, ఒక నవ్వు, ఒక స్పర్శ /పొదరిల్లు కింద దొరికిన ఆ దొంగ చిరునవ్వునేం చేసావు ?/అది వెన్నెలయింది కదా /ఈ మిట్ట మధ్యాహ్నం నువ్వు చూడలేదా …….”

ఇంత కల్తీ లోకంలో, కెరీర్ తప్ప ఇంకేదీ అక్కర్లేని ,  ప్రతిఫలం వుంటే తప్ప చిరునవ్వు అయినా ఖర్చుపెట్టని మనుషుల మధ్య రాజేశ్వరి ఒక మినహాయింపు .

రాజేశ్వరి గురి౦చి  ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా గిల్టీగా వుంది. నేను రాసిన “ఇల్లు ఖాళీ చేసినప్పుడు….”  కవిత చదివి,  మరి ప్రపంచాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుందో కదా అది రాస్తాను కానీ అస్సలు అనుభ౦లోకి రానివి ఊహించడం కష్టం కదా అంది . మరి ఇన్నేళ్ల తర్వాత అయినా దానిమీద రాసిందో లేదో తెలీదు. నామాడి శ్రీధర్ సేకరించి పంపిన వాటిలో అలాంటి శీర్షికతో ఏదీ కనిపించలేదు కానీ తీవ్రంగా ఆశాభంగం చెందిన ఒక సందర్భాన్ని గురించి మనసు కలచి వేసే కొన్ని వాక్యాలు ఎలా రాసిందో చూడండి..

“ హెలో వున్నారా / ఆహా వున్నాను వున్నాను/మాట్లాడరేం/ మాట్లాడుతున్నాను/ ఇప్పటి నా మాట వినిపించడంలేదేమో / నేను రానా, వద్దు/ మీరు వస్తారా , రాను/ నేను ఖాళీగా వున్నాను ఈవేళ / ఆత్మ చైతన్యమవుతున్నవేళలో నీ ఖాళీ సమయాన్ని నే పూరించలేను/ నీ చిరునవ్వుని నేను కాలేను/ i don’t want tobe fill in the blank please/ సరే ఏం చేస్తున్నారు / పక్షుల ఆశల్ని పాములు మింగేసే హింసాత్మక అసహ్యాన్ని చూస్తున్నాను /ఏమర్ధమయిందేమిటి ? / రేపటి సీతాకొక చిలుకలకోసం /ఈ వేళ అరచేతిలో గొంగళి పురుగుల్నీ సాకడం /

ఉత్తరానికీ ఎలిజీకి పెద్ద తేడా ఏముంది.

మనుషులుగా ఏ ఇద్దరయినా ఏళ్లతరబడి ఎవరి నదుల్లో వాళ్ళూ కొట్టుకు పోతున్నప్పుడు,

కెరటానికి పైన ఉన్నామా , అడుగున వున్నామా అనేది తప్ప ,

ఎవరి జీవన ఘోష అయినా ఈ భీభత్స శబ్దాల మధ్య ఎలా  వినిపిస్తుంది చెప్పు

-ఇది నువ్వు చదవలేని ఉత్తరం . చదివితే పోస్టులో మళ్ళీ కొన్ని పరిమళాలు నాకు అంది వుండేవి.

రాజేశ్వరీ , ఇవాళ నీ కవిత్వం చదివి నిన్ను తలచుకుంటుంటే ఏదో బాధగా వుంది.

మీ మాటలు

 1. నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను ..భలే చెప్పారు కదా !

 2. మంచి వ్యాసం. చాలా బాగుంది.

 3. K N RAU says:

  “నేను కవిత్వం చదివి కరడు కట్టి వున్నను కాబట్టి బతికిపోయాను” కవిత్వం చేయాల్సిన పని ఇదే. బతికించడమే. ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చెయ్యడమే. కవిత్వమై జీవించి వెళ్లిపోయిన ఆ మహా మనీషికి జోహార్లు.
  నిర్మల గారి వ్యాసం ఆత్మీయంగానే కాదు ఆధునిక సమాజంపై ఆగ్రహంగాను ఉంది. ఎక్సుల్లెంట్ .

 4. Satyam . says:

  నిర్మల గారూ ,

  మీ ఆర్టికల్ చదువుతున్నపుడు ,ఎన్ని సార్లో “అద్భుతం” అనుకున్నాను .

  మీ write- up ,మీరు పరిచయం చేసిన రాజేశ్వరీ దేవి గారి కవిత్వం తో సమానంగా ఉంది

  ఇదంతా నిజమా ఇలాటి వాళ్ళు ఉంటారా !

  మళ్లీ ,మళ్లీ చదివి స్పందిస్తాను .

 5. “…..ఏదో మన మానాన మనం రాత్రి వర్షాన రాలిన పున్నాగ పూలని చేతిలోకి తీసుకొందాం” _/\_ , ప్రతీ వాక్యం చాలా ఆత్మీయంగా చాలా దగ్గరగా రాశారు…. :(

మీ మాటలు

*