తెలుగు హాస్యానికి కొత్త లెవెలు!

?

?

 -కొల్లూరి సోమశంకర్ 

~

 

తెలుగులో వ్యంగ్య రచనల ప్రాభవం కాస్త తగ్గుతోందని అనిపిస్తున్న సమయంలోనే ప్రసన్నకుమార్ సర్రాజు గారి కథల సంకలనం వెలువడి ఆ లోటుని కాస్త అయినా తీర్చింది.

ప్రస్తుత కాలంలో వ్యంగ్యం తగ్గడానికి కారణమేమిటో ముందుమాట వ్రాసిన ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణగారు వెల్లడించారు. “వ్యంగ్యం అంటే సత్యానికి ఆమడ దూరంలో ఉండి నవ్వు పుట్టించేది. ఇప్పుడు అంత దూరాన్ని సృష్టించడం కష్టమై వ్యంగ్యం తేలిపోతోంది” అన్నారాయాన.

మరో ముందుమాట వ్రాసిన ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గారు ఈ పుస్తకం గురించి చెబుతూ, “తెలుగు సినిమా లాంటి వల్గారిటీకీ, మీలో (పాఠకులలో) చక్కని సంస్కారానికి అప్పీల్ చేసే హాస్యానికీ తేడా ఉంటుంది. ప్రసన్న కథలీ పని చేస్తాయి” అన్నారు.

ప్రతీ మాటలో, పనిలో, జీవితాల వివిధ కోణాల్లో, ఏది తాకితే నవ్వొస్తుందో కొంతమందికే తెలుసు” అంటూ ఆ కొద్దిమందిలో సర్రాజు ఒకరు అంటారు డా. మాచిరాజు రామచంద్రరావు.

వీరి మాటలు, ఈ అభిప్రాయాలు చదివితే, ఓ మంచి పుస్తకం చదవబోతున్న నమ్మకం కలుగుతుంది. నిజమే… ఆ నమ్మకం వమ్ము కాదు.

ఈ పుస్తకంలో పన్నెండు కథలున్నాయి. అన్ని కథల్లోనూ హాస్యమూ, వ్యంగ్యమూ బాగా పండాయి. రాజకీయాలు, సినిమా, కార్పోరేట్ విద్య, పత్రికలు, టీవీ తదితర రంగాల తీరుతెన్నులపై పంచ్‌లు వేసిన కథలివి.

అనైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా” కథ దేశంలోని రాజకీయాలపై గొప్ప సెటైర్. ఒకప్పటి రాష్ట్రాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోతే ఎలా ఉంటుందో ఈ కథలో హాస్యంగా వివరించారు. విజయవాడ నగరమే ఈ కథలో అనేక చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కాలువల జలాల పంపకాలపై విబేధాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి వీసాలు, బోలెడుమంది గవర్నర్లు, వాళ్ళ పిఎలు, ప్రతిపక్ష నేతలు… కథ రంజుగా ఉంటుంది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాడు. “ఆపరేషన్‌కి పక్క రాష్ట్రానికెళ్ళడం మన రాష్ట్ర వైద్యులను అవమానించడమే. విరాష్ట్రీ మారక ద్రవ్యాన్ని వృధా చేసే హక్కు మీకెవరిచ్చారు?” అంటూ ప్రతిపక్ష నాయకుడు గొడవ చేస్తాడు. ఇలా పదే పదే ఏదో కారణం మీద గొడవలు చేసి, అరెస్టయి, బెయిల్ పై విడుదలయితే గానీ తోచదట ఆయనకి. పైగా ఇదొక యోగాట. పేరు ధర్నాయోగ లేదా యాగీయోగ. దాంతో ఆయనకున్న షుగరు, కీళ్ళవాతాలు అన్నీ పోయి చక్కగా రక్తప్రసరణ అయి, పదికాలాల పాటు అరెస్టయి బ్రతకొచ్చట!! చదువుతున్నంత సేపూ నవ్వుతూనే ఉంటాం.

రాజకీయాలపైనే మరో వ్యంగ్య కథ “ఇండిపెండెంట్స్ డే“. స్వతంత్ర్య అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడం ఎంత అపరాధమో చెబుతుందీ కథ. ఓ ఇండిపెండెంట్‌ని తమ పార్టీల్లోకి లాగేసుకోడానికి జాతీయపార్టీలు ప్రయత్నిస్తాయి. హై కమాండ్‌తో ఇక్కడి ఛోటా మోటా నాయకులు తెలుగు హిందీ కలగలసిన భాషలో మాట్లాడడం నవ్విస్తుంది. ‘పాత సూట్‍కేస్‌లకు కొత్త సూట్‌కేసులిస్తాం’ అంటూ ఇండిపెండెంట్ ఇంటిముందు తచ్చట్లాడిన రాజకీయ బ్రోకర్ “ఏ సూట్‌కేసులో ఎంతుందో ఎవరు చెప్పగలరు?” అని అనడం; లాబీలో మాట్లాడితే లాబీయింగ్ అనడం సరదాగా ఉన్నాయి.

దేవదాసు వెడ్స్ పార్వతి” కథ సినీరంగంపై చక్కని వ్యంగ్యాత్మక విమర్శ. మనవాళ్ళు తీసిన కథలనే అటూ ఇటూ మార్చి మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తుంటారో చెప్తారు రచయిత. “మన జనాలకి చెప్పిందే చెప్పడం, చేసిందే చెయ్యడం, చూసిందే చూడడం అలవాటయ్యా. అవి జీవితాలు గానీ, రాజకీయాలు గాణీ, సినిమాలు గానీ… కథలు కొత్తగా చెప్పాలి గాని కొత్తవి చెప్పకూడదు. ఓ పట్టాన అరిగించుకోలేరు” అంటాడో నిర్మాత కథా రచయితతో. దేవదాసు పార్వతి కథనే మళ్ళీ తీస్తూ, దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఎలా ఇవ్వాలో చెబుతుంటే నవ్వూ వస్తూందీ, నిజంగానే కొంతమంది నిర్మాతలు ఇలా ప్రయత్నిస్తున్నారు కదా అని గుర్తొచ్చి కించిత్ బాధా కలుగుతుంది. ఈ కథలో హాస్యం కన్నా వ్యంగ్యం పాలే ఎక్కువ.

సొంత పేరుతో సినిమాలు తీస్తే అచ్చిరావడం లేదని, బెంగాలీ డైరక్టర్ సత్యజిత్‌‌రాయిలా గంభీరంగా ఉండాలనుకొని, ‘విశ్వజిత్ రప్పా’గా పేరు మార్చుకుంటాడు ఓ నిర్మాత. సినీ నిర్మాణానికి డాన్‌లే తెరవెనుకగా నిధులందిస్తున్నారని నమ్మి, తన సినిమాకి నిధులు అందించవలసిందిగా డాన్‍లకు బహిరంగ ప్రకటన జారీ చేస్తాడు “డాన్‌ల భూగర్భ శత్రుత్వం” కథలో. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డాన్‌లు తమ వ్యవహారాలను భూగర్భంలో జరుపుతారని చెబుతూ, డాన్‍ డెన్‌లో ప్రవేశించడానికి వాడే కోడ్ సాంగ్ ఏమిటో చెప్పినప్పుడు నవ్వకుండా ఉండలేం.

తన కొడుకుని హీరోని చేయాలనుకుంటాడు ఓ నిర్మాత. “అదేంటి బావా, మనోడికి ఏవీ రావు కదా?” అంటాడు అతని బావమరిది. బావమరిది లేవనెత్తిన ప్రతీ ప్రశ్నకి జవాబిచ్చి అతని నోరు మూయిస్తాడు. అంతే… తెలుగు సినీ కళామాతల్లికి మరో నట వారసుడి సేవలు మొదలవుతాయి. ఇదే నిర్మాత ఓ డబ్బింగ్ సినిమా తీయాలని చెన్నై బయల్దేరుతాడు. బొంబాయి ముంబయిగా, మద్రాసు చెన్నై గారి మారకా, హైదరబాద్‌కు కూడా పేరు మారిస్తే, ఏం పేరు పెట్టాలో ఈ నిర్మాత సూచిస్తాడు. నవ్వాగదు ఆ పేరు వింటే. డబ్బింగ్ చిత్రాల ప్రహసనాన్ని చదివి నవ్వుకుంటాం “ఏకె97” అనే ఈ కథలో.

సినిమారంగాన్ని పరిశ్రమగా గుర్తించమని సినీరంగం పెద్దలు ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని ఆమోదించి సినిమా రంగాన్ని పరిశ్రమగా గుర్తిస్తుంది ప్రభుత్వం “ఏ టేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ” అనే కథలో. పరిశ్రమ కాబట్టి ఫ్యాక్టరీ గొట్టం ఉండాలని ఓ స్టూడియోలో భారీ పొగ గొట్టాన్ని ఏర్పాటు చేస్తారు. సినిమా బడ్జెట్ పై ఆంక్షలు విధిస్తుంది ప్రభుత్వం. చేసే ప్రతీ ఖర్చుకి ఆడిట్ ఉండాలంటుంది. సినిమా నిర్మాణానికి జాతీయ బ్యాంకులు లోన్‌లు ఇస్తాయి. లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఏమేం చెయ్యాలో ఓ బ్యాంక్ మేనేజర్ చెబుతాడు. సినిమా తీయడం అంటే ఓ డ్యూటీగా మారిపోయిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం అయిదు వరకు ఏదో ఆఫీసుకెళ్ళొచ్చినట్లుగా సినిమా తీయడం తన వల్ల కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుంటాడో నిర్మాత.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని తప్పనిసరి చేయడం జనాల కొంప ఎలా ముంచుతోందో హాస్యంగా చెబుతారు రచయిత. ఉరి తీయబోతున్న ఓ ఖైదీకి ఆఖరి క్షణంలో మరణశిక్ష వాయిదా పడుతుంది.. ఏ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం వల్లో కాదట. ఉరితీసే ఖైదీలకి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఉండాలనే నిబంధన కొద్ది సేపటి క్రితమే అమల్లోకి రావడం వల్లట. ఆధార్ కార్డ్ లేనందువల్ల ఆ ఖైదీ ఉరి నుంచి తప్పించుకున్నాడట. ఓ పెళ్ళిలో పిలిచిన అతిథులకంటే రెండు రెట్ల కన్నా ఎక్కువమంది వచ్చి విందు తిని పోయారట. ముష్టోళ్ళు కూడా కాస్త మంచి బట్టలేసుకొచ్చి తినేసి వెళ్ళారని ఆ కుటుంబం అనుమానపడింది. అందుకని ఆ కుటుంబంలో జరుగుతున్న తర్వాతి వివాహానికి శుభలేఖ పంపుతూ… ‘ప్రవేశం ఆధార్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే’ అని వ్రాయిస్తారు దాని మీద. సబలాదేవి అనే ఉద్యోగినిని ఎత్తుకెళ్ళి అత్యాచారానికి ప్రయత్నిస్తారు నలుగురు దుండగులు. “మీరు మగాళ్ళయితే మీ ఆధార్ కార్డులు చూపించండి” అంతే…. ఆ నలుగురు తమ ప్రయత్నాన్ని విరమించుకుని సబలాదేవిని సగౌరవంగా – అటుగా వచ్చిన బస్‌లో ఎక్కిస్తారు. హస్యం, వ్యంగ్యం కలగలసిన కథ “నీవే నా మదిలో…“.

ఇప్పుడంటే ‘సెల్ఫీ’ల కాలం కాని, ఒకప్పుడు ‘సెల్ఫ్’ల కాలం! తమకి విపరీతమైన పలుకుబడి ఉందని, ఫలానావాడికి నేనెంత చెబితే అంతేనని తమ గురించి ఘనంగా – ఎదుటివారికి అనుమానమే కలగకుండా సొంతడబ్బా కొట్టుకునే డబ్బారాయుళ్ళు అప్పుడూ ఉండేవారూ, ఇప్పుడూ ఉన్నారు. అలాంటివారి కథే “వెంకీ! ఎక్కడున్నావ్‌రా ఇంతకాలం?“.

విద్య వ్యాపారం అయిపోయాకా, విద్యార్థులు ప్రాడక్ట్స్ అయిపోయారు. విద్యార్థుల కలల్ని తాము అమ్ముకొంటున్న కొన్ని కార్పోరేట్ కాలేజీల పైత్యాన్ని చెబుతుంది “డ్రీమ్ మర్చంట్స్“. హాస్యంగా చెప్పినా, ఈ కథలో ప్రస్తావించిన విద్యార్థుల సమస్యలు, ఒత్తిడి నిజంగానే ఉన్నాయని అర్థమవుతుంది, బాధ కలుగుతుంది.

టీవీ చూడడం ఓ నిత్యావసరంగా మారిపోయిన ఓ ఇంట్లో, ఇంటాయన టీవీ ముందు కూర్చుంటాడు “స్త్రీ ఛానల్” కథలో. పెద్ద టీవీ ‘నిమిత్తమాత్రురాలిగా’ ఆయన్ను చూస్తుంది. ఈయన మాత్రం ఏదో మైకంలో ఉన్నవాడిలా ‘నిమత్తు మాత్రుడిగా’ ఆన్ చేస్తాడు. ఒక్కో ఛానెల్ మార్చుకుంటూ పోతూంటాడు. ఉన్నట్లుండి ఓ కొత్త ఛానల్ కనబడుతుంది. ఆ ప్రోగ్రామ్‌ చేస్తున్న యాంకర్‌కీ కొత్తేమో –  మాట తడబడి – ‘అంతరంగిక మధనం’ అనే పదాన్ని తప్పుగా పలికిన వైనం నవ్వు తెప్పిస్తుంది. ఇంటాయన చాలాసేపు ఈ ఛానల్ కార్యక్రమాలు చూస్తూంటాడు. చివరికి ఇంత కలుపుగోలు ఛానల్‌ని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ కట్టేసి పడుకుంటాడు. బాగా నవ్విస్తుందీ కథ.

పాఠకుల కాలక్షేపం కోసం ఓ రచయిత ఒక కథ రాస్తే, ఆ కథ చదివిన పాఠకులు పత్రికకి ఉత్తరాలు వ్రాస్తారు. ఆ కథ వల్ల ఫైనాన్స్ సమస్యలు చెలరేగి, జెండర్ రాజకీయాలు పెట్రేగి విదేశీ సమస్యలు పెచ్చరిల్లే పరిస్థితి వస్తుందని రచయిత భయపడేలా చేస్తారు “పాఠకుల తోకకు నిప్పు” కథలో.

ప్రైవేటు ఎయిర్‌లైన్స్ విపరీతంగా పెరిగాకా, అవి అందిసున్న సేవల తీరుతెన్నులను హాస్యంగా చెప్పిన కథ “విమాన సంచరరే…“.

అన్ని కథలలో ఆరోగ్యకరమైన హాస్యం ఉంది, సున్నితమైన వ్యంగ్యం ఉంది. ఈ కథలలో “గొప్ప సందేశాలు లేవుగానీ, హాయిగా చదివిస్తాయి” అనే శ్రీరమణ గారి అభిప్రాయంతో నిరభ్యంతరంగా ఏకీభవించవచ్చు.

మిహిర పబ్లికేషన్స్ వారు జనవరి 2016లో ప్రచురించిన ఈ 137 పేజీల పుస్తకం వెల రూ.100/-. విదేశాలలో ఉండే తెలుగువారికి $10. నవోదయా బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ వారు సోల్ డిస్ట్రిబ్యూటర్స్.

~ కొల్లూరి సోమ శంకర్

 

మీ మాటలు

 1. Bhanu prakash says:

  ఆధార్ కథ హిలేరియస్ చాలా బాగుంది వెంటనె కొని చదవాలి, మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు

 2. Buchireddy gangula says:

  చిట్టెన్ రాజు. Garu –మునిమానిక్యెం గారిలా –వ్య o గ్య కథలు రాస్తున్నారు –రాశారు కూడా
  ———-_——————–
  Buchi reddy . గంగుల

 3. దేవరకొండ says:

  జాగ్రత్తగా పరిశీలిస్తే వ్యంగ్య రచనలకు దీర్ఘ కాలిక సామాజిక ప్రయోజనాల్ని సాధించగలిగే శక్తి, స్వభావం వుంటాయనిపిస్తున్ది. ఉదాహరణకి మన పాత సినిమాలు కొన్ని అక్కరలేనన్త మెలోడ్రామాను, అమాయకత్వాన్ని చూపించి, ఇలాంటి వ్యంగ్య రచనలకు ముడి సరుకయ్యాయి. సినీమా దర్శకులు (కొందరైనా) వీటిని చదువుతారు కాబట్టి మంచి మార్పులు తేవడానికి ప్రయత్నించారు. అలాంటి సినీమాలను ఇప్పుడు ఎవరూ తీయరు. కనుక ఇప్పుడొచ్చే సినీమాల్లోని విపరీతాలని ఇలాంటి రచనలు తూర్పారబెడితే భవిష్యత్ లో మంచి సినీమాలొచ్చే అవకాశం వుంది. రాజకీయాల విషయంలో అలాంటి నమ్మకం ఇంకా కలగడం లేదని ఒప్పుకోవాలి. ఎందుకంటే అవి, ప్రజల్ని కూడా భాగస్వాముల్ని చేసుకుని అధోముఖ ప్రయాణంలో దూసుకేళ్తున్నాయి కాబట్టి. వ్యంగ్య రచనల అవసరం సమాజానికి ఎప్పుడూ ఉంటుందని గుర్తించి ఆహ్వానించి ఆదరిద్దాం!

మీ మాటలు

*