అదే… ఆకాశంలో ఇంద్రధనస్సు!

 

అనగనగా ఒక ఊరు.

ఊరంటే మామూలు ఊరు కాదు.

అందమైన ఊరు.

అంతకన్నా అందమైన మనుషులు.

ఆ అందమైన మనుషులకు ప్రకృతి అంటే ప్రాణం.

అందువల్ల ఆ ఊళ్ళో పచ్చ పచ్చటి చెట్లు.

ఆ పచ్చా పచ్చాని చెట్లను చూసి వనదేవత తెల్ల తెల్లని చెరువులు, పొంగిపొర్లే చెరువులు ఇచ్చింది.

ఓసోస్ వనదేవతేనా పులకించిపోయేదని, వరాలిచ్చేదని భూమాత ఆ ఊరికి నీలి నీలపు కొండలు ఇచ్చింది.

గరుత్మంతుడు ఎర్రగా బుర్రగా ఉండే పిట్టలు పంపించాడు.

ఎన్ని రంగుల పిట్టలో? రంగురంగుల పిట్టలు.

నీలి నీలి నెమళ్ళు.

ఆకుపచ్చని చిలకలు.

ఎర్ర ఎర్రని లకుముకిపిట్టలు .

వంగపండు వడ్రంగిపిట్టలు.

పసుప్పచ్చని పైడికంటిపిట్టలు.

నారింజరంగు జీనువాయిపిట్టలు.

ఇల్లా ఒకటి కాదు రెండు కాదు బోల్డు బోల్డు పిట్టలు.

ఆ ఊరు చూసి అందరూ అసూయపడేవారు.

చివరికి దేవతలు కూడా.

వంగపండు వడ్రంగి పిట్టలు టకటక తకధిమి అని తలలతో సంగీతం వాయించేవి

అరెవా! అంత సంగీతానికి తగ్గట్టు నాట్యం ఉండొద్దూ అంటూ నీలి నెమళ్ళు రోజూ బయట పురులు విప్పి నిలబడేవి.

ఆ పురులు, ఆ అందాలు, ఆ సంగీతాలు చూసి పిట్టలన్నీ కేరింతలు.

కేరింతలంటే ఏమిటి?

సంతోషంతొ చేసే గోల, ఆర్భాటం.

సంతోషం ఎక్కువైన చోట పిల్ల పిట్టల ఆటలు, పాటలు తప్పకుండా ఉంటవి.

పిల్లల ఆటలంటే ఉరకలు, పరుగులు.

ఈ ప్రపంచకంతో సంబంధం లేనట్టుండే ఉరకలు, పరుగులు, పాటలు, సంగీతాలు

ఓ రోజు ఆకాశంలో దేవతలంతా, రాజుగారైన ఇంద్రుడితో పాటు కైలాసానికి వెడుతూ ఈ ఊరిని దాటుతున్నారు

కిందంతా గోల గోలగా ఉన్నది

ఇంత గోలగా ఉన్నదేమిరానని తల వంచి చూసినారు

అందరితోపాటు ఆ ఆటలు పాటలు తాను కూడా చూసాడు ఇంద్రుడు.

ఆయనకు ఆ ఆటల ఐడియా నచ్చింది

ఆ వెంటనే ఒక ఆలోచన వచ్చింది

ఆలోచన, అది కూడా ఇంద్రుడికి వచ్చింది.

ఇంద్రుడంటే ఎవరు ?

ఇంద్రుడంటే రాజుగారు.

దేవతలకు రాజుగారు.

రాజుగారంటే మాటలా?

రాజుగారు ఏది చెపితే, ఏదనుకుంటే అది అయిపోవాల్సిందే

దేవతలందర్నీ పిలిచాడు.

మనం కూడా ఆటలాడుకుందాం అన్నాడు.

అంతే, గుసగుసలు మొదలైనాయి.

కొంతమంది వింతగా చూసారు.

కొంతమంది మా వల్ల కాదన్నారు.

కొంతమంది మమ్మల్నొదిలెయ్ నాయనా అన్నారు.

ఎప్పుడూ రాక్షసులతో యుద్ధాలు, అప్సరసల నాట్యాలు ఏవిటి చూస్తాం అనుకున్న కొంతమంది సంబరపడ్డారు.

తర్జనభర్జన పడుతున్నారు.

తర్జనతోనూ భర్జనతోనూ ఏమిటొస్తుందీ?

ఇహ ఇలా లాభం లేదని అష్టదిక్పాలకుల్ని పిలిచాడు.

ఆడుకుందాం పదండన్నాడు.

ఎవరికి తప్పినా వాళ్ళకు తప్పదుగా!

రాజు గారి దగ్గర కొలువులో ఉన్నారయ్యె.

ఆజ్ఞ ధిక్కరిస్తే తల తీసి ఆకాశగుమ్మానికి వేళ్ళాడదీస్తాడేమో!

ఏమో మరి, అంత పని చేస్తాడు, చెయ్యగలడు ఆయన.

అదీ భయం. ఆ పవరు అంటే భయం

అవతలివాడికి పవరున్నవాడంటే, ఏం చేస్తాడో తెలియని భయం.

అందువల్లే ఆ పవరుకోసం పోట్లాటలు

ఈ లోకంలో అందరూ అర్రులు చాచేది దానికోసమే

ఆ గొడవంతా పట్టం ఎందుకని సరేనన్నారు వాళ్ళు.

ఏ ఆట ఆడడం సార్ అనడిగారు.

ఎలా ఆడతామన్నారు ? మరి రూల్సు రాళ్ళు రప్పలు ఏమిటన్నారు ?

అలా రూల్సు గట్రా ఏమిటని అడగ్గానే ఇంద్రుడు తలగోక్కొని  ఆలోచించాడు.

మళ్ళీ ఓ సారి కిందకు చూచాడు.

ఆ కింద, రూల్సు రప్పలు ఏవీ ఉన్నట్టు కనపడని ఉరకలు పరుగులు కనపడ్డాయ్.

రూల్సు గట్రా ఏమీ లేవు , అందరం పరుగులెత్తుదాం పదండి అన్నాడు.

ఇదేమి ఆటండీ ? ఆయినా ఆకాశంలో ఎక్కడ పరుగులు పెడతాం అన్నారు దిక్పాలకులు ?

ఏవండీ అంటే అన్నానంటారు, ఆ తెల్ల మబ్బులున్నవి ఎందుకు, వాటి మీద పెట్టండి అన్నాడు ఇంద్రుడు.

తెల్ల మబ్బులు ఖంగారు పడ్డాయ్.

కొన్ని మబ్బులు ఈ రాజుగారి ఆట మా ప్రాణానికొచ్చిందిరా అనుకున్నాయ్.

పొరపాటున బయటకే అనేసాయ్.

అది చూశాడు ఇంద్రుడు. అది విన్నాడు ఇంద్రుడు.

ఛస్! నా ఆజ్ఞకు ముహం మాడుచుకుంటారా? ఆ మాడ్పు లానే మీరు కూడా మొత్తం నల్లగా అయిపోయి జీవితమ్మొత్తం అలాగే గడపండి అని శాపం పెట్టిపారేశాడు.

మొహం మాడ్చుకున్న మబ్బులన్నీ నల్లగా అయిపోయినై.

ఏడుస్తున్నాయ్.

వాటి ఏడుపే వాన అయిపోయింది.

ఆరోజునుంచి, పైనుంచి పడే వానకు ఆ నల్ల మబ్బుల ఏడుపే కారణం

ఇంద్రుడికి ఇంకా కోపం తీరక, మిగిలిన తెల్ల మబ్బులన్నీ ప్రేక్షకులుగా ఉండమని ఈ నల్లమబ్బుల మీద ఆట మొదలుపెట్టాడు.

ఆట మొదలయ్యింది. దేవతల పరుగులాట మొదలయ్యింది

కొంతసేపు అందరూ అటూ ఇటూ పరుగెత్తాక, గందరగోళంగా ఉండటంతో, అందరూ ఓ చోటికి చేరి తూర్పు చివరి నుంచి మొదలుపెట్టి పశ్చిమం చివరి దాకా ఎవరు ఫాష్టుగా పరుగెత్తుతారో వాళ్ళు గెలిచినట్టు అని తీర్మానించారు

సరే, ఈ రూల్సు లంపటం నాకు పెట్టకుండా వాళ్ళే తీర్మానించారుగానని చంకలు గుద్దుకొని ఇంద్రుడు పరిగెత్తటం మొదలెట్టాడు.

వాయువు, ఓస్ ఇంతేనా! రాజుగారండీ, మీరు మీ పరుగూ ఓ లెక్కా నాకు అని, మాజ్డా కారులా జూం జూం అని ఇంజను దడదడలాడించి పరుగెత్తటం మొదలుపెట్టినాడు.

అది చూసాడు ఆదిత్యుడు. వార్నీ కొంపలంటుకుపోతాయ్ ఈ వాయువుగాడు రాజుగార్ని ఓడించాడంటేనని ఏడు గుర్రాల బండెక్కి పరిగెత్తిపోయి వాయువుని – ఒరే నెమ్మదిరా నాయనా, రాజుగార్ని గెలవనియ్యమని ఒప్పించి ఆ వేగం తగ్గించాడు.

అలా ఇంద్రుడు గెలిచాడు.

కేరింతలు కొట్టాడు.

ఆ సంతోషంలో ఓడిపోయినవాళ్ళందరి మబ్బుల మీద వజ్రాయుధంతో ఓ దెబ్బా వేశాడు.

మెరుపులు పుట్టినై.

ఆ మెరుపులే మనం చూసే మెరుపులు

ఇంకోసారి పరిగెత్తుదాం అన్నాడు.

ఇష్హో, అష్హో అని అనుకుంటూ , కాళ్ళీడ్చుకుంటూ దిక్పాలకులు పరుగులెట్టారు.

రాజుగారు కాబట్టి ఆయన్నే మళ్ళీ గెలవనిచ్చారు.

నాలుగు రవుండ్లయినై.

నాలుగు సార్లూ ఇంద్రుడే గెలిచాడు, మబ్బుల మీద దెబ్బలు వేసి మెరుపులు తెప్పిస్తూనే ఉన్నాడు.

ఐదో రవుండ్లో కూడా గెలిచి మబ్బుల మీద కొడుతుంటే వజ్రాయుధం సర్రున చేతిలోంచి జారిపోయింది.

ఆ ఊళ్ళో పడిపోయింది.

భూమి లోపలికంటా వెళ్ళిపోయింది.

భూమాతకు కోపం వచ్చేసిందయ్యోయ్.

ఆవిడ కాళికా మాత అయిపోయింది.

ఒరోరి ఇంద్రా, నీ వజ్రాయుధంతో నాకు నొప్పి పుట్టిస్తావా? ఇక నువ్వది తీసుకోలేవ్ ఫో అని ఆ ఆయుధాన్ని పొడి పొడి చేసేసి వజ్రాలుగా మార్చేసింది.

ఇంద్రుడు బిక్కమొహం వేసాడు.

ఇదేమిట్రా ఇలాగయ్యిందని.

ఇప్పటిదాకా ఆడుకున్నాం. పాడుకున్నాం. గెలిచాం. ఓడాం. ఇంతలో ఈ విపరీతం ఏమిటి, చేతిలో ఉన్న ఒక్క గొప్ప ఆయుధం పోయిందేనని దిగాలుగా కూర్చున్నాడు.

రాజుగారు దిగాలుగా కూర్చోటం చూసి కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడ్డారు

మనసు కష్టపెట్టుకున్నవాళ్లలో సూర్యుడు ఒకడు.

ఎప్పుడు కానీ, అప్పుడప్పుడు కాని దిగాలుగా కూర్చునే వాళ్ళంటే సూర్యుడికి పడదు.

అందుకు ఆయన ఉరుకులు పరుగుల మీద వొచ్చేసి ఓ రాజరాజ నీకు ఆయుధం కావాలి అంతేగా! నేనిస్తా, ఇంత పెద్దదిస్తా, అన్నిటికన్నా పెద్దదిస్తా తీసుకో అన్నాడు.

ఇంద్రుడి ముహం వెలిగిపోయింది.

సరే ఇవ్వు అన్నాడు సూర్యుడి చేతులు పట్టుకొని తబ్బిబ్బైపోతూ!

సూర్యుడు ఉండు ఒక్క నిమిషం, తెచ్చిస్తా అని కింద ఉన్న ఊళ్ళోకి వచ్చేశాడు.

పిట్టల్ని పిలిచాడు. మీ ఈకల్లో కొన్ని నాకిచ్చెయ్యండి అన్నాడు.

అన్ని పిట్టలు సూర్యుడొచ్చాడని ఊగిపోతూ ఈకలిచ్చేసినై.

అవన్నీ కుప్ప చేసుకుని పొయ్యాడు సూర్యుడు.

అందులో వెలిగిపోతున్న రంగుల్ని కొన్ని తీసుకున్నాడు.

చకచకా ఒక ఆయుధం తయారు చేసాడు.

తీసుకెళ్ళి ఇంద్రుడికిచ్చాడు.

ఇంద్రుడు దాన్ని పట్టుకోలేక సతమతమైపోయినాడు.

చేతులు పట్టనంత పెద్దదైపోయింది అది.

మొత్తానికి కష్టపడి చేతుల్లోకి తెచ్చుకున్నాడు.

దీన్ని పెట్టుకోవాలంటే దేవేంద్రలోకం సరిపోదు. ఎక్కడ దాచిపెట్టాలన్నాడు.

ఇప్పటిదాకా ఆడుకున్నావుగా రాజా మారాజా, ఆకాశం ఉందిగా అక్కడ పెట్టుకో అన్నాడు సూర్యుడు.

సరే, మళ్ళీ ఓ సారి పరుగులాట ఆడదాం అని ఆట మొదలుపెట్టాడు.

షరా మామూలుగా గెలిచాడు.

గెలిచిన ఆనందంలో చేతిలో ఉన్న ఆయుధాన్ని మబ్బుల మీద తాటించాడు.

ముసిముసిగా నవ్వుకుంటూ సూర్యుడు దాక్కున్నాడు, ఆ నవ్వు ఎక్కడ కనపడుతుందోనని.

ఆకాశం అంతా ధగధగా మెరిసిపోయింది ఉన్నట్టుండి.

ఆ రంగులతో. ఆ ప్రకాశవంతమైన రంగులతో. ఏడు రంగులతో!

ఇంద్రుడు ఆటాడినప్పుడల్లా, గెలిచినప్పుడల్లా, నల్ల మబ్బులు ఏడ్చినప్పుడల్లా, ఆయుధం తాకించినప్పుడల్లా ఆకాశం మెరిసిపోతూనే ఉంది.

సూర్యుడు ముసిముసిగా నవ్వుతూనే ఉన్నాడు.

అదే ఆకాశంలో ఇంద్రధనస్సు అయ్యిందయ్యా!

అలా ఇంద్రధనస్సు పుట్టిందయ్యా!

అయ్యా అదీ ఇంద్రధనస్సు సంగతి….

ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక బల్గేరియన్ కథలో ఒక అబ్బాయి రంగు పిట్టల ఈకలు చూసి ఇంద్రధనసు ప్రస్తావన తీసుకొని రావటం చదివాక వచ్చిన ఆలోచనతో రాసుకున్న పిట్ట కథ ఇది…పిట్టల కథ ఇది…ఇంద్రధనస్సు కథ ఇది…

*

మీ మాటలు

  1. పిట్టకథ హరివిల్లంత అందంగా ఉందండీ!! :)

  2. AHALYA MAMILLAPALLI says:

    హ హ …బాగుంది:-)

  3. Bale raasarugaa!

మీ మాటలు

*