నేను..!

 shajahana cover
– షాజహానా
~
”నీతో మాట్లాడ్డానికేం లేదు. ఒక్క దేహభాషతో మాత్రమే నీతో మాట్లాడగలను. నీ దేహం అంతిష్టం నాకు. దేహమే మొదలు దేహమే అంతిమం. ఒబామా గురించి మాట్లాడ్డానికి నాకు చాలా మంది మిత్రులున్నారు. నాకు త్వరగా సమాధానం కావాలి. నేను నువ్వనుకున్నట్లు నిన్ను ప్రేమించడం లేదు. నాకు ప్రేమంటే శరీరంలో ఒక భాగం మాత్రమే. శరీరమే ముఖ్యం. నీ మాట కోసం చూస్తుంటాను.”
***
”ఎందుకు వేరే మాట్లాడకూడదు? నేను శరీరం తప్ప ఏమి లేనిదాన్నా? అవయవ సౌష్ఠవం ఉన్నంత మాత్రాన, ముఖవర్చస్సు ఉన్నంత మాత్రాన నేనేమి మాట్లాడ కూడదా? నాకు నీతో ఈ ప్రపంచంలోని విషయాలన్ని మాట్లాడాలని కదా ఉంటుంది? నిన్ను నేను మనసా వాచా కర్మణా ఒక మనిషిని ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించాను కదా; నాలో రేగే భావాలన్నింటిని శరీరం మాటున దాచి నీతో నేను… ఎలా?”
***
”అవును.. నువ్వు నాతో పడుకోవడాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మన మధ్య ఏ బంధాలు అనుబంధాలు ఉండవు. నాకు నువ్వు నచ్చావు. అలా అని దాన్ని ప్రేమనుకోకు. ప్రపంచం అందమైంది. నువ్వు దాన్ని కోల్పోతున్నావు. నేను దగ్గరుండి చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు నన్ను రమ్మంటావు?”
***
”ఇలాంటి స్నేహితుడు నాకు దొరుకుతాడని కలలో కూడా ఊహించ లేదు. శరీరమే ముఖ్యమైతే ప్రపంచంలో ఏదో ఒక శరీరంతో సంతృప్తి చెందొచ్చు కదా! అయినా ఒక్కసారికే దేహదాహం తీరుతుందా? ఇలాంటి విషయాల్లో నేను ఎలా రియాక్ట్‌ అవుతానో కూడా అవసరం లేదా? నువ్వు బంధాలు కోరుకోవు, ప్రపంచం అందమైందని నాకు ఎలా చూపిస్తావు?”
***
”నీలాంటమ్మాయిలకు జీవితం గురించి తెలీదు. ఎలా లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలో తెలీదు. ప్రంపంచంలో నేనొక్కడినే మగాడిని కాదు, నాకు నువ్వొక్కదానివే ఆడదానివి కాదు. అందుకే అన్నాను ప్రపంచం అందమైందని. ఇంకా విడమరచి చెప్పాలంటే నీకు చాలా మంది మగ స్నేహితులు ఉండాలి అని నా ఉద్దేశం. కొన్ని రోజుల తర్వాత ఏం చెయ్యాలన్నా ఈ దేహం సహకరించదు. నాకు నువ్వు నీకు నేను నచ్చాక చర్చ లనవసరం, నన్నెపుడు రమ్మంటావ్‌? లేదా ఈ విశాల ప్రపంచంలోకి నువ్వు రా!”
***
”నువ్వు ఎలా పెరిగావో నాకు తెలీదు కాని నేను కనపడని కత్తులు మెరిసే చూపుల మధ్య పెరిగాను. ఏం చేయాలన్నా, ఏం చదవాలన్నా ఆఖరికి ఏం కట్టుకోవాలన్నా ఏం తినాలన్నా అమ్మా నాన్న, నానమ్మ, తాతయ్య, అన్నయ్య, ఇంటి పక్కవాళ్ళు, ఇంటెదురువాళ్ళు, వీధివాళ్ళు… ఇన్నిన్ని ఆంక్షల మధ్య నేను పొందే ఉపశమనం ఒక్క ఈ లైబ్రరీ మాత్రమే. ఇక్కడా నువ్వెదురై మనశ్శాంతి లేకుండా చేస్తున్నావ్‌? నువ్వలా అడిగిన దగ్గర్నించి నాకు నిద్ర దూరమైంది.. అన్నం సహించడం లేదు.. ఎప్పుడూ ఎదురుగా నువ్వొచ్చి పదేపదే అడుగుతుంటావ్‌. నేన్నీతో కలిసి నడుస్తాను, మాట్లాడతాను, నవ్వుతాను, బోలెడంత ప్రేమిస్తాను… అంతే, తప్ప నువ్వడిగింది నేనివ్వలేను. ఈ విశాల ప్రపంచం నాది కాదు… నేను ధైర్యంగా బయటికి రావడానికి. ఇక్కడ నేల మీద నా పేరున్నా నా అధికారం ఉండదు. నేను కన్న ప్రపంచం మీద నాకే హక్కు ఉండదు. స్కూళ్ళల్లో బస్సుల్లో ఇంట్లో ఆఫీసుల్లో కాలేజిల్లో  ఎక్కడన్నా నేను ధైర్యంగా ఉండగలిగానా? పుస్తకాల్లో తప్ప. నేను నీకోసం ప్రపంచంలో కొచ్చిన మరుక్షణం నాకిచ్చే ఇరుకుపదం ఏంటో కూడా నాకు తెలుసు? ఏది విశాల ప్రపంచం? ఏది అందమైన ప్రపంచం? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నీలో నామీద కోరికుంది, దానికి సంబంధించి దాపరికం లేదు ఒప్పుకుంటాను, కాని ప్రేమిస్తే అది బాధ్యతవుతుందనే కదా ప్రేమించడం లేదని అంటున్నావు. ప్రేమ లేని దేన్నీ నేనంగీకరించను.”
***
”నేన్నీకు ముందునుంచి చెప్తూనే వస్తున్నాను. ప్రేమించట్లేదని, అలా అని మోసం చేస్తున్నానని అనుకోకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీమీద కలిగిన ఫీలింగ్స్‌ని ఉన్నదున్నట్లు నీకు చెప్పాను. నేన్నీ మేధస్సునో, ఓదార్పునో కోరుకోవడంలేదు. ఈ శరీరాన్ని నీ శరీరంలోకి ఒంపుకోవాలనుకుంటున్నాను. దానికి నువ్వింత మధనపడాల్సిన అవసరం లేదు. నీకు బాధ కలిగించే ఉద్దేశ్యం నాకు లేదు. ఇంకెప్పుడు నీకు ఎదురుపడను. మాట్లాడను, డిస్ట్రబ్‌ చేయను. ఎప్పుడయినా ఎవరిపైనైనా ఇలాంటి ఫీలింగ్స్‌ కలిగితే దాచుకోకు. నా గురించి ఆలోచించకు. నన్ను అనవసరంగా ప్రేమించకు.”
***
”నీకు ప్రేమంటే తెలీదు. మనుషుల విలువ మనసుల విలువ అంతకంటే తెలీదు. నువ్వు సమాజంలోనే పెరిగావా? అర్ధం కావట్లేదు. నీ నిజాయితీ చూస్తే అపురూపం అనిపిస్తుంది, కాని ప్రేమ లేకుండా కామం ఉంటుందంటే నేనంగీకరించను.. నేను ప్రేమించకుండా ఉండలేను, కాని మరచి పోకుండా కూడా ఉండలేను. మరపు నాకు నన్ను పెంచిన సమాజం నేర్పించింది. నేను పెంచి పెద్ద చేసిన పూలతీగలు, మేకపిల్లలు.. పిల్లి పిల్లలు, నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న, మా ఇల్లు ఇదే అని పరిచయం చేసిన ఇల్లు… ఎందుకూ పనికి రాని చదివిన చదువు అన్నింటిని మరచి పోయేలా చేసిన సౌకర్యవంతమైన సమాజం మనది.. ఇన్నింటిని మరచిపోయిన నేను నిన్ను మరచిపోలేనా? ఇంకెప్పుడూ ఏ అమ్మాయిని ఇలా మాత్రం అడక్కు. ఇంకెప్పుడు నాకు కనిపించకపోవడం నాకు మేలే? నీ లాంటి స్నేహితుడున్నాడని కొంత ఉపశమనాన్ని ఆనందాన్ని పొందేదాన్ని.. ఎప్పుడు తప్పిపోతాడో,  దూరమవుతాడో, ఎవరివల్ల దూరమవుతాడో అన్న బాధ నుంచి విముక్తం అవుతాను.”
***
-ఏం మనిషి? మగవాడిగా ఆలోచిస్తాడే తప్ప నా గురించి ఎందుకాలోచించడు? నాన్న అన్నాడు డిగ్రీ దాకా చాలమ్మ, పిజి చదివితే మళ్ళీ ఎక్కువ చదివిన వాడిని తేవాలి కదా; ఆలోచించు; కాబట్టి ఇక్కడికి చదువునాపెయ్యి. ఇంక నేను ఫీజులు కట్టలేను. కట్నం ఇవ్వాలి కదా? నాన్న మాటలకి తలొంచాలి ఎన్ని ఆలోచనలున్నా బుర్రలో. నేను కాసేపు నాన్నలా మారి నిజమే నిజమేననుకుని ఒప్పేసుకున్నాను కదా పెళ్ళికి, ఇక నాలో నేనెక్కడున్నాను? అమ్మకి ఎప్పుడయినా స్వేచ్ఛ ఉంటే కదా నా గురించి పట్టించుకోవడానికి; నాన్న చెప్పిందే వేదం. కొన్నాళ్ళు కలిసున్నందుకు అమ్మ కూడా మరో నాన్నే !
జీవితమంటే ఏం లేదు ఎదుటివాళ్ళని ఆక్రమించడమేనని అర్ధమై, మౌనమే భాషగా బతుకుతున్న మూగజీవితానికి పరిచయమైన లైబ్రరీ దోస్తు అతడు. ప్రపంచం మొత్తం అతడి మెదడులో నిక్షిపమై ఉందా అని అనుమానం వచ్చేది ఒకోసారి. అతడితో మాట్లాడితే కోల్పోయిందేదో దొరికినట్టనిపించేది, తడారిన మనసుకు జీవం వచ్చేది. అతడే నా కోల్పోయిన జీవన మాధుర్యాల చిరునామా అనుకున్నాను. మంచి స్నేహితుడనుకున్నాను. నాలో ఉన్న నాన్న మీంచి,  భర్త మీంచి, కొడుకు మీంచి తొంగి చూస్తుంటాడు, ఎంత ధైర్యం? క్రమంగా అతడి రూపం కూడా నాలో ఎవరూ తుడిపేయలేనంతగా తీర్చిదిద్దుకుంది. ఎంతమందిని మోయాలి నేను? వీళ్ళల్లో ఒక్కరిలో నైనా నేనున్నానా? ఎంత పరిమితితో ఉండి ఉంటాను?
అతడికి అంతే నేను అఖ్ఖర్లేదు. కావలసింది మనసు కాదు దేహం. కాకపోతే కక్కుర్తి లేదు, మోసం లేదు. అదొక్కటే కాదు కదా నన్ను నేను అర్పించుకోవటానికి, నన్ను నన్నుగా చూడలేకపోవటానికి అతడికి సవాలక్ష కారణాలు ఉండనీ. నా మనసుకు, కన్నీళ్ళకు, చిరునవ్వులకు నా ఆలోచనలకు దేనికీ ప్రాధాన్యం ఇవ్వని అహంకారి. నేను ఎలా అంగీకరించగలను? నేను అతడిని పూర్తిగా కొద్దిగా కొద్దిగా మర్చిపోతున్నాను… ఇప్పుడు నాకు లైబ్రరీ కూడా లేదు.. అతడు కూడా లేడు… ఇప్పుడు నేను ఖాళీగా కనపడుతున్నాను.
నన్ను పూరించుకోడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను. పూరించుకోగలనో లేదో కూడా చెప్పలేను. కాని నన్ను నేను గుర్తించుకున్నందుకు ఆనందంగా ఉంది, నన్ను నేను పూర్తిగా ఖాళి చేసుకున్న ఆనందం అది!
shajahana invitation

మీ మాటలు

  1. అజిత్ కుమార్ says:

    పైకి వాడు చెప్పుకోలేకపోయాడుగానీ ప్రేమంటే అదే. పైకి వాడడిగిందిశరీరమనుకున్నా ప్రేమంటే అదే. మీరిద్దరూ ప్రేమించుకున్నారూ, అపార్ధం చేసుకున్నారు. మరోసారి ఆలోచించండి.

మీ మాటలు

*