నా రాత్రి సుదీర్ఘమయినది..

sivalenka10

-శివలెంక రాజేశ్వరీ దేవి

~

 

‘‘రాత్రి చదివేందుకు అట్టేపెట్టాను

ఆ నోబెల్‌ప్రైజ్‌ పొందిన కవిని గురించి రాసిన సంగతి’’

అని నీకు చెప్పినపుడు

‘‘ఇదే కదా రాత్రి ఇంకా రాత్రి ఏమిటీ’’ అని కదా అడిగావు

పదిగంటల సమయంలో

 

నా రాత్రి సుదీర్ఘమయినది

ఇలా నా వెంటరా

నీకు తెలీని రాత్రిలోకి తీసుకువెళతాను

అర్ధరాత్రి దాటిన తర్వాత

ఒకసారి గదిలోంచి బయటికి వొచ్చి

అదేపనిగా ఆకాశాన్ని సంభ్రమంగా చూస్తానా

ఆ తర్వాత కొమ్మలు కొట్టేసినందుకు దిగులుపడుతున్న

ఆ రాత్రిపూలచెట్టుని పలకరించి స్పృశించి

మళ్ళీ చిగురిస్తావు, అపుడు నీ దేహమంతా నక్షత్రపుష్పాల

కాంతితో మళ్ళీ మెరుస్తుంటుంది చూడు అని సాంత్వనపరిచి

ఎవరో దయగా నాటిన

ఆ పారిజాతపరిమళాన్ని లోపలికి తీసుకుని

అంతేనా

 

నా రాత్రి సుదీర్ఘమయినది

నా హృదయం ఆ సమయంలోనే మెలకువతో వుంటుంది

ఆ సంగీత సమ్రాట్‌ స్వరలయలు

మదిలో మెరిసాయా ఇక చెప్పపని లేదు

మన ప్రేమ సత్య సౌందర్య సీమలో ప్రభవించి… ప్రభవించి…

కాల గాఢాగ్ని కీలలో తపియించి… తపియించి

దగ్ధ తరుకాండమగునో అని నిరాశగా

గోపారత్నం పాడుతూ సందేహాన్ని వ్యక్తం చేస్తుంటే

ముగ్ధ మధు భాండమగునో అని పాడగనే

ప్రాణాలు ఎటో వెళ్ళిపోతాయి

 

ఇక ఎందరో కళాకారుల గాన మాధుర్యంలో

రాత్రి వొరిగిపోతుంటుంది

చిత్తరంజన్‌ తలత్‌ బాలసరస్వతీదేవి పాటులు

నెమరువేసే రాత్రి

 

ఇక ఆమె

ఆమె అంటే కేవలం ఆమేనా

ఎన్నెన్నో పాత్రలను తన గళాన పలికించిన

ఒక కళావరణం

కళాత్మక కాంతి మెరుస్తున్న ఒక వలయం

ఊర్వశి పాత్రని తన స్వరంలో

అజరామరం చేసిన ప్రతిభాశాలిని

 

ఇక మరొకరూ

ఆమె మహానటి మాత్రమేనా

దయాస్వరూపిణి

వెన్నెలకాంతిని నింపుకున్న ఆ కళ్లు చివరికి వెలవెలపోయినా

నిజమైన కళాకారుల జీవితాలు

రాలని కన్నీటిబిందువులు అవటానికి

ఆమె ఆ పాత్రల్లో నటించిందా

జీవించిందా అనే సరిహద్దు లేవు

 

నా రాత్రి సుదీర్ఘమయినది

అంతర గంగా ప్రవాహాల్లో మునకలేస్తున్న రాత్రి

నన్ను అపనిందల పాలుచేసే రాత్రి

ఒక రొటీన్‌ అనేది లేకుండా చేసిన రాత్రి

అపహాస్యాలపాలుచేసిన రాత్రి

తమ తమ పాత్రలకు

రూపకల్పనన చేసిన రచయితల పాత్రలతో పాటు

నేనూ ఒక పాత్రనై వాళ్ళవెంట వెళ్ళే రాత్రి

శ్రీకాంత్‌ రాజ్యలక్ష్మి కమలలత సవిత కోమలి అమృతం

వెంటాడుతూ పలకరిస్తారు

అంతర్వేదిలోని వేదనను పాట ఆసరాగా తీసుకుని

కన్నీటితో స్వచ్ఛపరిచే కన్నీటిరాత్రి

కళాత్మక కలలరాత్రి

 

నా సుదీర్ఘ రాత్రి వల్ల నేను పగలు మెలకువగా వుండలేను

ఈ రాత్రిని ఇవాళ వెన్నెల వెలిగిస్తోంది

ఆ వెలుగులో నేను వెలిగి పగటిని చీకటిని చేసి

నేను వెలవెలపోతాను

 

నా రాత్రి సుదీర్ఘమయిన రాత్రి

జాగరణరాత్రి

స్నేహరాత్రి

స్నిగ్ధరాత్రి

స్వప్నాలు పూలలా రాలిపోయిన రాత్రికూడా

ధాత్రిపై దయగా వెన్నెల పాడుతోంది

ఇది వెన్నెల వేళైనా ఇది చల్లని రేయయినా

నిదుర రాదు కనుకు శాంతిలేదు మనసుకు

అందుకే రాత్రి కవితనీ

పగటిపూట వినిపించమని అడగకు నాన్నా

ఇష్టంలేని వాళ్ళు గబ్బిలం అన్నా

ఇష్టంవున్న వాళ్ళు రాత్రిపక్షి అన్నా

పెద్దగా తేడా ఏమీలేదు

నేనే నమూనాలోనూ లేను కనుక

అందుకే రాత్రిని పగలు చేస్తాను

పగటిని రాత్రి చేస్తాను

 

(12.10.2011 శరత్‌ పూర్ణిమ)

మీ మాటలు

 1. “స్వప్నాలు పూలలా రాలిపోయిన రాత్రికూడా, ధాత్రిపై దయగా వెన్నెల పాడుతోంది” _/\_

 2. Bhavani Phani says:

  అద్భుతంగా ఉంది అనడం కంటే చెప్పడానికి ఇంకేమీ లేదు . ధన్యవాదాలు

 3. Jaya Reddy Boda says:

  అంతర్వేదిలోని వేదనను పాట ఆసరాగా తీసుకుని

  కన్నీటితో స్వచ్ఛపరిచే కన్నీటిరాత్రి

  కళాత్మక కలలరాత్రి
  చాలా బాగుంది కవిత

 4. సాయి.గోరంట్ల says:

  అద్బుతహ్..
  మరేం చెప్పను ఇంతకన్నా

 5. చీకటిలా పరచుకొన్న విషాదం పై జాలు వారుతున్న కన్నీటి పొరలాంటి వెన్నెల ….సున్నిత హృదయురాలు శివలెంక రాజేశ్వరి గారికి కన్నీటి నివాళులు !

Leave a Reply to Bhavani Phani Cancel reply

*