ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..!

 Abstract-creative-lamp-concept

                                                      -బమ్మిడి జగదీశ్వరరావు

పూజ్యులైన అత్తమామలకు

నమస్కారం!

ఆగండి! చదవకుండా చించేస్తే నాగురించి మీరు తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతారు! అందువల్ల మీ అమ్మాయికి మంచి మొగుణ్ణి కూడా కోల్పోతారు! అంతకన్నా వొక గొప్ప ఆవిష్కరణలో మీరు భాగం కాకుండా పోతారు! మనీ లేనప్పుడు మెనూ చూడడమెందుకు అనుకోవద్దు! మనీ అనేది యెప్పుడూ జేబులు మారుతుంది! నిండుగా వున్న జేబు ఖాళీ కావచ్చు! ఖాళీగా వున్న జేబు నిండవచ్చు! అంచేత మీ ఐశ్వర్యం అలాగే వుండిపోదు! నిన్న లేదు, యివాళ వుంది, రేపు?

నేను కోట్లు సంపాదిస్తానని అంటే “ఏం.. మీవాడు ‘మీలో యెవరు కోటీశ్వరుడు?’ నాగార్జున షోకి గాని వెళుతున్నాడా?” అని మా అమ్మా నాన్నతో అన్నారట! మీ వెటకారం నాకు నచ్చింది! కారం రాసినట్టయింది! పట్టుదల పెరిగింది! నేను కోటీశ్వరుడు అవ్వడమే కాదు.. మీకు కోటీశ్వరుడు అయ్యే అవకాశం యివ్వాలనిపించింది!

యస్.. రేపు నాదే! మీ దగ్గర ఐశ్వర్యం వుండొచ్చు! మరి నా దగ్గర? ఆ ఐశ్వర్యాన్ని సృష్టించే ఐడియాస్ వున్నాయ్! ఔను.. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది! ఎగ్జాంపుల్ గా వొక ఐడియా వొదులుతాను! కాసుకోండి! మీలాంటివాళ్ళు పెట్టుబడి పెట్టడానికి పోటీ పడతారు! కాని నాకు పెట్టుబడి పెట్టే ఛాన్సు మొదట మీకే యిస్తాను! మీరు కాదంటేనే వేరే వాళ్ళకి అదృష్టవంతులయ్యే అవకాశం వస్తుంది!

సొసైటీకి యేది రిక్వైర్మెంటో అది మనం కనిపెట్టాలి! యిన్నోవేట్ చేయాలి! యిదీ మీ రిక్వైర్మెంటు అని మనం పీపుల్ కి చూపించాలి! అంటే.. రిక్వైర్మెంటూ మనమే సృష్టించాలి.. సొల్యూషనూ మనమే చూపించాలి! దానికి సేవాభావం అనే కలరివ్వాలి! అప్పుడది సేవారంగం కేటగిరీ కిందికి వచ్చి సర్వీస్ వోరియంటేషన్ గా అనిపించాలి! సర్వీసు ప్రొవైడ్ చేయడంలో అంతవరకూ లేని మార్కెట్ స్పేస్ ని క్రియేట్ చేయాలి! అంటే.. అసలు మార్కెట్టే లేదని అనుకుంటే మార్కెట్టుని మనమే సృష్టించాలి! దానికదో మార్కెట్ గా ఆక్యుపై చేయాలి! మార్కెట్ కు డిమాండ్ క్రియేట్ చేయాలి! క్రియేట్ చేశాక అది బేసిక్ నీడ్ అవ్వాలి! నీడ్ ఈజ్ డీడ్!

అర్థమయ్యిందా? అర్థం కాకపోతే మరోసారి కేర్ ఫుల్ గా చదువుకోండి.. అర్ధం చేసుకోండి.. యింతకంటే బేసిక్ లెవెల్లో యెవడూ చెప్పలేడు.. మార్కెట్ మర్మం అర్థమయితేనే మార్కెట్లో రాణిస్తాం! మార్కెట్ మహారాజాలమవుతాం! మాయాజాల యింద్రజాలాలను మించిందీ మార్కెట్ మాయాజాలం! అర్థం చేసుకొనుటయే అర్థం! ‘అర్థం’ అంటే తెలుసుగా ధనం!

మీరు నా ఐడియా కోసం ఆవురావురు మంటున్నారని అర్థమయ్యింది.. యింక వూరించను.. పూరిస్తాను!

ప్రతిమనిషికి విద్య వైద్యం మస్ట్! మస్ట్ అండ్ షుడ్! విద్య వైద్యం ఆల్రెడీ ఆక్యుపైడ్ అని మీరంటారు! నిజమే! ఛాన్సు లేదు అంటారు! అదీ నిజమే! ఫుల్లీ ఫిల్లుడ్! బట్ స్పేస్ ఈజ్ దేర్! ఎందరు యెక్కినా చూసేవాడికి యింకా స్పేస్ వుంటుంది.. పుష్పకవిమానంలోనే కాదు, యిన్నోవేషన్లో కూడా! సో ఆ స్పేస్ మనం క్రియేట్ చెయ్యాలి! చేస్తే స్పేస్ యెప్పుడూ వుంటుంది! ఎడ్యుకేషన్ సిస్టంలో యెక్కడ వుంది?

యస్.. అన్ని యూనివర్సిటీల్లో గొడవలు అవుతున్నాయా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఢిల్లీ జేయెన్యూ.. కాశ్మీర్లో.. అంతకు ముందు పూణే ఫిలిం యినిస్ట్యూట్ లో.. యిక్కడా అక్కడా అని కాదు, దేశ వ్యాప్తంగా గొడవలు జరుగుతూనే వున్నాయా? పోలీసులు లాఠీఛార్జీలు చేస్తూనే వున్నారా? స్టూడెంట్స్ ని చితక్కొడుతూనే వున్నారా? యస్.. యస్.. యస్స్ .. యిక్కడ స్పేస్ వుంది.. మన మార్కెట్ కి కావలసినంత స్పేస్ వుంది..

పరీక్షలకి ప్రిపేర్ అవడం అందరికీ వస్తుంది! మరి దెబ్బలకి ప్రిపేర్ అవడం అందరికీ రాదు! పరీక్షలకి వో సిలబస్ యేడ్చి చస్తుంది! లాఠీఛార్జీలకి వో సిలబస్ యేడ్చి చావదు! ఏ క్వశ్చన్ కైనా యెవడైనా ఆన్సర్ చేస్తాడు.. కాని యే దెబ్బకైనా యెవడైనా బేర్ చేస్తాడా? చెయ్యలేడు! అంచేత దెబ్బలని తప్పించుకోవడానికో తట్టుకోవడానికో శిక్షణ తప్పనిసరి అవసరం! దటీజ్ యెసన్షియల్! దటీజ్ స్పేస్!

అలాగే టియర్ గ్యాస్.. రబ్బర్ బుల్లెట్స్.. వాటర్ ఫైరింగ్.. ఫైరింగ్.. యే క్షణాన యేదన్నా జరగొచ్చు.. జరిగినప్పుడు జడిసి పోకుండా జంప్ అవాలి! దేశ సరిహద్దుల్లో శత్రు శిబిరం నుండి కాల్పులు జరిగినప్పుడు మన త్రివిధ దళాలు అన్ని ఆయుధాలు వున్నప్పటికీ ముందు వొడుపుగా తప్పించుకుంటాయి.. తరువాతే తిప్పికొడతాయి! త్రివిధ దళాలకి ప్రభుత్వం కోట్లు వెచ్చించి అను నిత్యం శిక్షణని యిస్తోందే.. అలాంటిది భావి విధాతలైన విద్యార్ధులకి వద్దా? సో.. ‘మీ పిల్లల ప్రాణ రక్షణ కోసం మా ప్రాణ సమాన ప్రయత్నం..’ అని మనం పిలుపు యివ్వాలి.. జనం పొలో మని వొచ్చి మన ట్రైనింగ్ సెంటర్లో చేరిపోవాలి!

హై జంప్.. లాంగ్ జంప్.. చిన్నప్పటి నుండి నేర్చుకున్నవే! బట్.. బార్బడు వైర్ మీది నుండి జంప్ చేయడం రావాలి! గేట్లు మూసేస్తే దూకడం రావాలి! అబ్బో వో మిలటరీ శిక్షణా సంస్థ యిచ్చినన్ని శిక్షణలు యివ్వడానికి మనకి స్పేస్ వుంది!

అయిదు నిముషాలు అన్నం లేటయితే ఆకలి అంటారు మన పిల్లలు. అరగంట లేటయితే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి వాళ్లకి ఆకలికి తట్టుకోవడం నేర్పాలి! పస్తులు వుండడానికి వీలుగా వుపవాసాలు నేర్పాలి! మెస్సులు మూసేసినా అప్పడే మేనేజ్ అవుతారు! సో.. యోగా గీగా చేసి గాలిపీల్చి గాలితాగి గాలితిని గాలికి బతికెయ్యాలి! ఆక్సిజనూ ఆహారమే అనే నినాదాన్ని హెల్త్ కాన్సియస్ తో విద్యార్థులలోకి వారి తలిదండ్రులలోకి తీసుకువెళ్ళాలి! పెట్టుబడిలేని బడి!

చిన్న మాటకే చివుక్కుమనిపోయే తరం! అందునా ఆడపిల్లలు వో మాటంటే వురిపోసుకుంటున్నారు! అలాంటిది యూనివర్సిటీల్లో పోలీసులూ సెక్యూరిటీ సిబ్బంది అమ్మాయిల్ని అమ్మనా బూతులు తిడితే తట్టుకోవాలి గదా? మిమ్మల్ని చెరిచేస్తాం.. రేప్ చేసి పడేస్తాం.. లంజా లమ్డీ అని అన్నాసరే.. యేమీ అననట్టు.. యేమీ విననట్టు.. నిమ్మకు నీరెత్తినట్టు వుండాలి కదా? ఈ చెవిన విని ఆ చెవిన వొదిలేయడం కాదు, అసలు చెవికి యెక్కకుండా వుండేలా శిక్షణని యివ్వడానికి కూడా చాలా స్కోప్ వుంది!

వీసీల నుండి ప్రొఫెసర్ల దాక కులం పేరు పెట్టి తిట్టినా దీవించినా- అనుమానించినా అవమానించినా- ఆటపట్టించినా ఆర్డర్లీలుగా మార్చినా.. వివక్షత చూపించినా విచక్షణ మరిచినా- మనిషిగా చూడకపోయినా- మొద్దులా.. యెద్దులా.. తుమ్మ మొద్దులా.. బుద్దిగా నాలుకని మడిచి పెట్టుకొనేలా మనం ట్రైనింగ్ యిస్తాం! సూదీ దారంతో నోళ్ళు కుట్టుకోవడమెలాగో నేర్పిస్తాం.. శాంతి భద్రతల్ని కాపాడుకుందాం!

పక్కనే పిడుగు పడినా పట్టించుకోనట్టు పిల్లలుండాలి! ప్రతీ పేరెంటూ కోరుకొనేదదే! సో.. పిల్లలతో శవాసనం వేయించెయ్యాలి! ప్రాక్టీస్ చేయించెయ్యాలి! పీస్ ఆఫ్ మైండ్! ఓం శాంతి శాంతి శాంతి హి! ప్రభుత్వం కూడా భారతీయమని.. మన సంస్కృతీ చచ్చుబండని.. మనకి యెంతో సపోర్టు చేస్తుంది! రాయితీలు యిస్తుంది! మనకి అవార్డులు యిచ్చినా యివ్వొచ్చు! వాళ్ళకి హెల్తూ.. మనకి వెల్తూ!

అలాగే పోలీసులు కేసులు పెడితే.. నాన్ బెయిలబుల్ కేసులు పెడితే.. యెలా బయటకు రావాలో.. బెయిల్లూ జెయిల్లూ యెలా దాటాలో.. యెలా లాయర్లని పెట్టుకోవాలో.. కింది కోర్టులో వీగితే పై కోర్టుకు యెలా పోవాలో.. లా యేమిటో.. సెక్షన్లు యేమిటో.. ఫనిష్మెంట్లు యేమిటో.. ప్రాధమిక హక్కులు యేమిటో.. సివిలేదో.. క్రిమినల్ యేదో.. ద్రోహానికి దేశ ద్రోహానికి వున్న తేడా యేమిటో.. దేశ ద్రోహిగా యెప్పుడు యెవరు ముద్ర వేస్తారో.. తెలీదు! అంచేత విద్యార్థులు వాళ్ళని వాళ్ళు కాపాడుకొనే లా’ని.. అవేర్నెస్ ని అందివ్వాలి! అవన్నీ మనం యిస్తాం! అదే స్పేస్!

యింకా స్టూడెంట్స్ కు రావలసిన స్కాలర్ షిప్పులని ఆపితే.. స్టయిఫండులని ఆపితే.. యెలా అప్పు చెయ్యాలో.. అప్పు  చేసుకు పప్పుకూడు వొండి యెలా బతకాలో.. మనం తర్ఫీదు యిస్తాం!

అన్నీ యూనివర్సిటీలో చదివే పెద్ద వాళ్ళకే అనుకోవద్దు! ఆ మాటకొస్తే యల్కేజీ నుండి పిల్లలు పుస్తకాల బస్తాలూ బరువులూ మొయ్యడంలోనూ మనం తర్ఫీదు యిద్దాం!

అన్నీ వేదాల్లో వుండొచ్చు! కాని అన్నీ పాఠాల్లో వుండవ్! వున్నా బోధ పడవ్! కొత్త సందర్భాలకి కొత్త స్కిల్స్ తాలూకా అవసరం యెంతో వుంది! వుంటుంది! ఈ స్పేస్ ని మనం ఫుల్ ఫిల్ చేద్దాం! బిజినెస్ గా చూద్దాం!

బిజినెస్ మెన్ మొదట నమ్మేది థాట్ ని! థాట్ కింగ్ లా ప్రవోకింగ్ లా వుండి కాన్ఫిడెన్సుని యివ్వాలి! ఆ పై సొసైటి అందుకు అనుకూలంగా వుండాలి! పదునుగా యెలా వుండాలో యిప్పుడు అచ్చం అలానే వుంది!

యిది పక్కా బిజినెస్ ప్లాన్! పక్కవాళ్ళకి చెప్పకండి! చర్చించకండి! మాట జారితే మార్కెట్ జారుతుంది! కాచుకొని వున్న కార్పోరేట్ శక్తులు యీ స్పేస్ లోకి కూడా వచ్చేస్తాయని నా సిక్స్త్ సెన్సు చెబుతోంది!

ఇప్పటికైనా నా తెలివిని నమ్మి మీ అమ్మాయిని నాకు యిస్తారని నమ్ముతున్నాను! రేపటి యీ కోటీశ్వరున్ని యివాలే దీవించండి! కోటీశ్వరులు కండి! ఆలసించిన ఆశా భంగము.. తక్షణం నన్నూ నా ఐడియాని మీదిగా చేసుకోండి!

ఆల్ ది బెస్ట్.. మై పార్టనర్స్ ..

ఆలోచించండి.. ఆచరించండి.. ఆనందించండి!

అభిమానంతో-

మీ

అల్లుడు!

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    అల్లుడూ నీ సిక్స్త్ సెన్సు ను నమ్మి పిల్లను, నీ పక్కా బిజినెస్ కు పెట్టుబడిని నీ చేతుల్లో పెట్టమని నా సిక్స్త్ సెన్సూ చెపుతోంది. కాని రేపు నువ్వు కోటీశ్వరుడివి, విజయం వరించిన కింగ్ విజయ్ వీ అయ్యాక, తెప్ప తగలేసి నన్ను పోరా బోడిమల్లయ్యా అనవని గ్యారంటీ ఏందీ. అందుకే ముందుగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఢిల్లీ జేయెన్యూ.. కాశ్మీర్లో.. పూణే ఫిలిం యినిస్ట్యూట్ లకు సంబందించిన బిగినెస్ ల రైట్స్ నాకు రాసివ్వు. మిగతా కొత్త ఏరియాల రైట్స్ నువ్వుంచుకో. ఆఫర్ నచ్చితే రేపు ఆదివారం UB గెస్ట్ హౌస్ లో కలుద్దాం.

    • బమ్మిడి జగదీశ్వరరావు says:

      మామా! పిల్లనీ పెట్టుబడినీ చేతిలో పెట్టడానికి చాలామంది ‘నేనురా మీ మామను అంటే నేనురా మీ మామను’ అని పోటీ పడీసరికి తేల్చుకోలేక కాస్త టైం స్పేస్ తీసుకున్నా! రేపు నేను కోటీశ్వరుడిని అయ్యి తెప్ప తగాలేస్తానేమో నన్నమీ భయం నాకు భక్తిలా కనిపించి ముద్దొస్తోంది! కాన్ఫిడెన్సూ పెంచుతోంది! మీరడిగిన బిగినెస్ రైట్స్ మీకు యిస్తాను! కొత్త ఏరియాలకి కొదవలేదు! లోకం చాలా పదునుగా యూనివర్సిటీలు అనుకూలముగా వున్నవి! అంచేత బంపరాఫర్ మీరే తీసుకోండి, కాని చాటుగా యిలా గెస్టు హౌస్ లో కలవడం కాదు, మేళ తాళాలతో బాజా బజంత్రీలతో మాయింటికి అత్తతో కలిసి రండి! మా అమ్మానాన్నల్ని అడిగి అల్లుడ్ని చేసుకోండి ! అదృష్టవంతులు కండి!

  2. కె.కె. రామయ్య says:

    “ ఈ దేహంమొత్తం ఈ దేశంమొత్తంలానే నొప్పి పెడుతోంది “అన్న బజరా గారూ! రామరాజ్యంలో రావులోరి సావి రాజప్రాసాదం ముందు ధర్మఘంటలానో, నేటి రాజ్యంలో ఆక్రోశం మాటల్లో వెలిబుచ్చలేని ఓ దళితుడి చేతిలోని డప్పులానో ఓ చారిత్రిక ఆవశ్యకతను నిభాయిస్తున్న మీకు వొందనాలు.

    చంటి బిడ్డ ‘నోర్బు’ ను తీసుకుని రోహిత్ వేములకు న్యాయం జరగాలంటూ ఆ HCU వెలివాడల నిరసన పోరాటాల్లో కెళ్లి నిలిచిన ఓ వెన్నెల మనసు తల్లి భద్రత పట్ల కలిగిన భయాన్ని, బాధను వెలిబుచ్చలేక పోవటమే కాక పైపెచ్చు పోకిరీ మాటలు రాసాను. ఏవీ అనుకోకండి.

    ( అనుకున్నాలే! ఆ పాలమూరాయన, కాలం నాటి కధల గజయీతగాడు కూడా గోదాలోకి దిగిపోయుంటాడని… భళిరా బజరా అంటూ )

    • బమ్మిడి జగదీశ్వరరావు says:

      అయ్యయ్యో.. మీవి పోకిరి మాటలు అని నేను అస్సలు అనుకోవడం లేదు, మీ స్పందన చదివి చాలా బాగుంది అని నేనూ అదే రీతిలో మాట కలిపాను, తప్పితే నా రచన మాట్లాడాక నేను మాట్లాడడం సబబు కాదని సహజంగా నేను స్పందించను, కాని మీ వ్యంగ్యం నన్ను ప్రతిస్పందించేలా చేసింది. అది వ్యంగ్యానికి కొనసాగింపే! స్వాగతించ తగిందే! అందుకే నేనూ అంతే సరదాగా రాసాను. వ్యంగ్యానికి వున్న పదును యిదే! అందరికీ తగిలిపోతుంది, రాసిన వాడితో కలిపి! దుఃఖమూ సహా ఆవేదనా ఆగ్రహమూ యెక్కువైనప్పుడు వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తామని మీకు తెలియంది కాదు. మీ అభిప్రాయం అది, యే రూపంలోనైనా చెప్పే హక్కు మీకు వుంది, వుంటుంది! అప్పుడప్పుడూ మనం పోకిరీలం కూడా కావాలి! ఏవైనా అనుకోవాలి! ఏవీ అనుకోకపోతే యెందుకు?
      (అనుకున్నాలే! నేను గజయీత గాన్ని, పాలమూరాయాన్ని కాను.. మీరు ‘గొజరె’ అనుకొన్నారు.. నేను ‘బజరా’ని!)

  3. కె.కె. రామయ్య says:

    ‘బజరా’ గారూ, శస్త్రాస్త్రాలు ఏ శమీవృక్షము మీదో మర్చిపోయిన సవ్యచాచి ( అటు విశాఖ మాండలీకము, ఇటు పాలమూరు మాండలీకము ప్రయోగాలు తెలిసిన ) అర్జునుడిని కురుక్షేత్ర రణరంగానికి వచ్చేలా చెయ్యాల్సిన భాద్యత మీలాంటి అభినవ్యుల మీద ఉంది.

  4. Delhi Subrahmanyam says:

    చక్కటి వ్యంగ్యం. బావుంది బజర గారూ.

మీ మాటలు

*