నువ్వు నేను తప్ప..

 

 

 

చిత్రం/ పదాలు: ప్రవీణ కొల్లి

~

 

చివరాఖరకు ఎవరూ ఉండరు నువ్వు నేను తప్ప

నువ్వు నేను వేరేముందిలే

నాలో ఎదిగే నువ్వు

నీలో వెతుక్కునే నేను

అల్లితే కధలవుతాయి

జీవితం ఎప్పటికీ కధ కాదుగా!

 

కొన్ని సంఘటనలు, మరికొన్ని సంభాషణలు

కొన్ని కౌగిలింతలు, మరికొన్ని విదిలింపులు..అంతేగా!

అల్లగలిగితే నిన్ను చేరనివ్వననేమో

సవ్వడన్నా చెయ్యకుండా నా గమనంలో కలిసిపోయావు

అడుగడుక్కీ నీతో పడలేక సంధి చేసుకుందామనుకున్నాను

 

కానీ ఎక్కడ?

నువ్వొక మాయల ఫకీరువి

ఒక్క క్షణం అసలక్కడ లేనట్టే ఉంటావ్

మరో క్షణం విస్పోటకమై విశ్వాంతరాలలో వ్యాపిస్తావ్

నేనేమో ఒక్కోసారి బేలగానూ, మరోమారు అబ్బురంగానూ చూస్తూ ఉండిపోతాను

 

కొందరంటారు నువ్వొక దుఃఖానివని

నేనొప్పుకోను

నువ్వొక ఉనికివి

అనేకానేక భావోద్వేకాల అంతిమ గమ్యానివి

మరికొందరంటారు నువ్వొక బడబాగ్నివని

నేననుకుంటాను నువ్వొక జ్వాలవని

నీ సెగలో బూడిదై ఎగిరిపోగా

మిగిలిన వెలుగే నేనని

ఎప్పుడూ తోడుందే ఓ నా ఒంటరితనమా

నువ్వు ఏడిపిస్తావ్, నేర్పిస్తావ్
ఓ నా ఏకాంతమా

నీ రూపాంతరాల చాయలలోనే నా ప్రతిచ్ఛాయ

*

మీ మాటలు

  1. ” నేననుకుంటాను నువ్వొక జ్వాలవని, నీ సెగలో బూడిదై ఎగిరిపోగా ,మిగిలిన వెలుగే నేనని ..ఎప్పుడూ తోడుందే ఓ నా ఒంటరితనమా! నువ్వు ఏడిపిస్తావ్, నేర్పిస్తావ్..ఓ నా ఏకాంతమా… !! ” వండర్ఫుల్ pic అండ్ write up – ప్రవీణ గారూ, గుర్తుండిపోతాయి మీ మాటలు :)

  2. సురేష్ రావి says:

    చక్కని చిత్రం. అంతకన్నా చిక్కని మాటలు. లోతైన భావం. చాలా బాగున్నాయండీ అన్నీ కూడా

Leave a Reply to సురేష్ రావి Cancel reply

*