పెట్టుబడి ఊసెత్తని ఉద్యమ సినిమా!

 

 

-శివలక్ష్మి 

~

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  గోతె జెంత్రం (Goethe Zentrum-German film Club) లో నాలుగు సినిమాలు ప్రదర్శించారు. అందులో మార్చ్ 9 న ప్రదర్శించిన రెండు సినిమాలు మాత్రమే నేను చూశాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లోని మహిళల, బాలికల దారుణమైన పరిస్థితుల్ని ఈ రెండు సినిమాలు కళ్ళముందుంచాయి. అందులో మొదటి సినిమా: From Fear to Freedom ending violence against women 35 నిమిషాల నిడివి కల ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. దీనిని ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ (Women’s Learning Partnership) వారు నిర్మించారు.

 

ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు అతికౄరమైన హింస బారిన పడుతున్నారు. ప్రతి దేశంలో, ప్రతి సంస్కృతిలో, ప్రతి మతంలో, వర్గాల కతీతంగా ఉన్నత, మధ్య, అట్టడుగు తరగతుల్లోని మహిళలందరూ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. మహిళలపై జరుగుతున్నఅన్ని రకాల హింసలు అంతం కావాలంటూ, భయాలనుండి స్వేచ్చ కోసం చేసే ప్రయాణమే సినిమా ఇతివృత్తం

 ఐక్య రాజ్య సమితి గణాంకాల ప్రకారం 87% ఆఫ్ఘన్ మహిళలు  గృహ హింస బాధితులు.   కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో రోజువారీ 1100 కంటే ఎక్కువమంది  మహిళలు,  బాలికలు అత్యాచారానికి  గురవుతున్నారు. ప్రపంచం లోని 137 దేశాల్లో మానవ రవాణా  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని బారిన పడే 80% మంది స్త్రీలే!

ఈ చిత్రంలో పురుషుల్ని ఒక్కొక్కరినీ “నువ్వెంతమందిని అత్యాచారం చేశావు? అనడగడం కనిపిస్తుంది.ఆ పురుషులు ధీమాగా సిగ్గూ శరం లేకుండా 5, 10, 20 మంది అని చెప్తారు.గ్రామాలు తిరుగుతున్న కొద్దీ ఇంకా ఎక్కువమందిని అత్యాచారం చేస్తామని కూడా నిర్భయంగా చెప్తారు. పరువు కోసం చెల్లెల్ని చంపేశానని చెప్తాడొకడు. ప్రతి ఏటా దాదాపు 5000 మందిని పరువు, మర్యాదల పేరిట సొంత కుటుంబ సభ్యులే హత్యలు చేస్తున్నారు.

ఏడేళ్ళ పాపకి పెళ్ళి చేస్తే, ఆమె 15 ఏళ్ళకి ఇద్దరు బిడ్డల తల్లవుతుంది.బాల్య వివాహాలు, గర్భ ధారణలతో చిన్న పిల్లలైన తల్లులు, పసిబిడ్డలు కూడా  ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి సమస్యలు దాదాపు చాలా దేశాల్లో చిత్రీకరించడం కనిపిస్తుంది.

“ప్రపంచవ్యాప్తంగా మహిళలు బృందాలుగా ఏర్పడి హింస లేని సమాజం కోసం,స్త్రీల హక్కుల్ని సమర్ధించే మెరుగైన కొత్త చట్టాల కోసం పోరాడుతున్నారు. బలమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే ప్రజాస్వామ్య భావనలు నెలకొల్పడానికీ, హింసా సంస్కృతిని అంతం చేయడానికి కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు”- అని అంటారు యునైటెడ్ నేషన్స్ మాజీ సెక్రటరీ జనరల్ గా పని చేసి ప్రస్తుతం ‘ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్’ బోర్డ్ చైర్మన్ గా ఉన్న తొరయా ఒబైడ్ (Thoraya Obaid)

ఇరాన్, అమెరికాలలో ‘ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్’ వ్యవస్థాపక సభ్యురాలైన మెహ్ నాజ్ అఫ్ కామీ (Mahnaz Afkhami) “మా సంస్థ లింగ వివక్ష మూల కారణాలను అన్వేషిస్తుంద”ని అంటారు. దేశ దేశాల్లో పని చేసే వీరందరూ ఉమెన్స్  లెర్నింగ్ పార్ట్నర్ షిప్ భాగస్వాములే!

సింధి మేదర్ గౌల్డ్ (Sindi Medar Gould) నాయకత్వంలో నైజీరియాలో పనిచేస్తున్న ఒక సంస్థ మహిళలపై హింసను నమోదు చేస్తుంది.

నైజీరియా నుంచి బాయోబాబ్ అనే సంస్థలో పని చేసే షిబోగూ ఓబెన్వా (Shibogu Obinwa) మహిళలకు జరిగే శరీర హింస నుండి తమను తాము రక్షించుకునే హక్కుల గురించి “నా శరీరం, నా ఇష్టం” అని చెప్పే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తారు.

హఫ్సాత్ ఆబియోలా (Hafsat Abiola) నైజీరియాలో ప్రజాస్వామ్య స్థాపనే తమ ధ్యేయమంటుంది.

టర్కీలో పని చేసే యాకిన్ ఎర్టర్క్ (Yakin Erturk)  మహిళల మీద అమలవుతున్న హింస గురించి ప్రస్తావిస్తారు.

అమెరికా నుంచి ఫ్రాన్సెస్ కిస్లింగ్ (Frances Kisling) మహిళలు లైంగిక పరమైన దుర్గార్గపు ఆలోచనలను ప్రేరేపించేవారుగా, పురుషులు దానికి బలవుతున్న వారుగా సమాజపు నరనరాన ఎందుకు ఇంకిపోయిందో అనేదాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

అమెరికా రట్జర్స్ విశ్వవిద్యాలయం నుంచి కరీమా బెన్నౌన్ (Karima Bennoune) అమెరికాలో చట్టాల అమలు గురించి మాట్లాడతారు.

జాక్వెలిన్ పీటాంగ్వై (Jacqueline Pitanguy ) బ్రెజిల్ నుంచి తమ సంస్థ సమాజంలోని స్త్రీ-పురుష అసమానతల గురించి పనిచేస్తుందని చెప్తారు.

బహ్రెయిన్ నుంచి వాజీహా అల్ బహార్న (Wajihaa Albarna) తమ సంస్థ పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తుందని చెప్తారు.

మలేషియా నుంచి బెట్టీ యో (Betty Yeoh) పని ప్రదేశంలో వేధింపుల మీద తమ సంస్థ గురి పెడుతుందంటారు.శక్తివంతమైన అంతర్జాతీయ చట్టాల నుపయోగించి సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తుందని చెప్తారు.

మలేషియా లోని మ్యూస్ వా నుంచి జైనా అన్వర్ (Zainah Anwar) ముస్లిం పురుషులు స్త్రీలను కొట్టి, రకరకాల హింసలకు గురి చేస్తున్నారనే విషయాన్ని ప్రచారం చేసి ప్రజల మద్దత్తుని కూడగట్టడానికి తమ సంస్థ కృషి చేస్తుందని చెప్తారు.

జోర్డాన్ నుంచి అస్మా ఖాదర్ (Asma Khader) కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్త్రీల సమస్యల మీద ప్రజల్లో అవగాహన పెంచడానికి తమ సంస్థ కృషి చేస్తుందంటారు. పరువు కోసం తన చెల్లెల్ని హత్య చేసిన కేసులో మహిళల నిరసన ఫలితంగా, ఆమె సోదరుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి ముఖ్యమైన సందేశం ప్రజల్లో మార్పు తెస్తుందంటారు అస్మా.

లెబనాన్ నుంచి పని చేసే లిన హబీబ్ (Lina Habib) తమ సంస్థ పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుందని చెప్తారు.

ఐర్లండ్ నుంచి మేరీ రాబిన్సన్ (MARY ROBINSON) వారి సంస్థ మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అని నినదిస్తూ ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందంటారు.

పాకిస్తాన్ నుంచి రబియా హది (Rabia HAdi) స్త్రీల పట్ల హింస అంతం కావాలంటే విద్య ద్వారా సాధికారత సాధించాలంటారు.

1993 డిసెంబర్ 20న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా మహిళలపై హింస నిర్మూలన గురించి ఒక ప్రకటన వెలువడింది. అందులో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిస్తూ “స్త్రీల సమానత్వం, భద్రత, స్వేచ్ఛ, గౌరవం మొ.న హక్కుల పట్ల హామీ పడుతూ స్త్రీల పట్ల వివక్ష తగదని హెచ్చరించింది. మహిళల హక్కులు కూడా మానవ సార్వత్రిక హక్కులలో భాగమేనని ప్రకటించింది.

ఈ హక్కులు అమలు కావడానికి పితృస్వామ్యం పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని చెప్తారు ఈ ఉమెన్స్ లెర్నింగ్ పార్ట్ నర్ షిప్ నాయకులు.

ఒక సంస్థ నుంచి మిగిలిన అన్ని సంస్థలూ సమాచారాన్ని,కష్ట-నష్టాలను పంచుకోవడం, ఒకరినుండి మరొకరు నేర్చుకోవడం ద్వారా వారి మధ్య కొన్ని భావ సారూప్యతలూ – కొన్ని తేడాలు ఉన్నప్పటికీ వారి వారి లక్ష్యాల దిశగా పని చేస్తూ భవిష్యత్తులో ప్రజాస్వామ్య సమాజాన్ని సాధిస్తామని చెప్పుకొచ్చారు.

అన్ని సంస్కృతుల, అన్ని తరగతుల, అన్ని తరాల లింగ పరిధుల్లో సంభాషణ నడుపుతూ మేము సంఘటితమై మా భాగస్వామ్య సామర్థ్యాన్ని పటిష్టపరచుకుంటూ మరింత విస్తరణకు ప్రయత్నిస్తున్నా మంటారు దీని నాయకులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చివరికి 1800 సంవత్సరం నుంచి మొదలై 1910 వరకూ కొనసాగి తమ రాజీ లేని పోరాటాలతో, చివరికి 140 మంది చికాగో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలోని మహిళా కార్మికుల ప్రాణత్యాగాలతో అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్ళ ఫలితంగా “అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం” ఏర్పడింది. ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించుకుని,సాధించుకోవలసిన సమస్యల కోసం భావి పోరాటాలకు సిద్ధం కావడం “అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం” లక్ష్యం. పండగల్లాగా పట్టు చీరల బహుమతులతో,ముగ్గుల పోటీలతో జరుపుకుంటారు “ అంతర్జాతీయ మహిళా దినోత్సవం” – ఈ రెండిటికీ స్పష్టమైన తేడా ఉంది. అందరూ ఈ భేదాన్ని తెలుసుకోవాలి!

మహిళల మీద అమలవుతున్న హింసను ఎంతో హృద్యంగా  దృశ్యీకరించిన ఈ నాయకత్వం అసలు దీనికంతకూ మూలకారణమైన పెట్టుబడిని రవ్వంతైనా ఎక్కడైనా చెప్తారేమోనని వళ్ళంతా కళ్ళు చేసుకుని కళ్ళార్పకుండా శ్రద్ధగా సినిమా చూశాను.పొరపాటున కూడా పెట్టుబడి ప్రస్తావన రానివ్వలేదు. అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.

ఎన్ని చట్టాలు వచ్చినా అవి అమలు కావు.మహిళల మీద హింస ఆగదు.దీనికి కారణం ప్రభుత్వాలను తమ పెట్టుబడితో వెనకుండి నడిపే కార్పొరేట్ శక్తులు.

” పెట్టుబడి అనే బండ రాయి కింద నలిగిపోతున్న చీమలు మన శ్రామికులు. పెట్టుబడి రాక్షసికి ఆహారం జంతువు ల్లాంటి మన శ్రామికులు “అని 16 వ శతాబ్దం లోనే తన “అన్నా కరేనినా నవల్లో నికొలాయ్ అనే పాత్రతో చెప్పిస్తారు టాల్ స్టాయ్. శ్రామికులవే బానిస బతుకులైతే, ఇక బానిసకు బానిసలైన స్త్రీల పరిస్తితి ఎంత హీనంగా ఉంటుందో చెప్పనే అక్కరలేదు !

“బీద వారినే కాదు,ఈ భాగ్యవంతుల్నీ వాళ్ళ గొప్ప తనాల భారాల నించీ, ఊపిరాడని గర్వాల నించీ,మర్యాదల నించీ,ఈర్ష్యల నించీ, చికాకుల నించీ తప్పించి, శాంతినీ, సంతోషాన్నీ, తృప్తినీ ఇచ్చి కాపాడే కమ్యూనిజం రావాల”ని కాంక్షించాడు చలం. అంతో ఇంతో సామాజికంగా,ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉన్న స్త్రీలకైనా స్వేచ్చ రావాలంటే ఈ అణచివేతలకు మూలకారణాలను అన్వేషించాలి!

*

మీ మాటలు

 1. మంచి విశ్లేషణ ….శివలక్ష్మి గారు ….
  “అసలు జబ్బేమిటో తెలుసుకోకుండా బస్తాలు బస్తాలు మందులు మింగించినట్లుంది. ప్రభుత్వాలను ప్రశ్నించకుండా సన్నాయి నొక్కుల ఉద్యమాల వల్ల ఉపయోగం ఉండదు.” అస్తిత్వ ఉద్యమాలన్నీ మీరు చెప్పినట్లు బస్తాల కొద్దీ మందులు మింగడంలో పోటి పడుతున్నాయి. ప్రొటెస్ట్ ఉద్యమాలు ఫోటోలు కోసం ఫాషన్ పరేడ్లై ఫరిడవిల్లుతున్నాయి గదా. ఈ గుర్తింపు గొడవలు పుట్ట గోడుగుల్లో తలదాచుకోవాలని తలుస్తున్నాయి. క్లాస్ struggle – కాస్ట్ struggle గాను , revolutitionaries – రేస్ లీడర్స్ గాను, ప్రెషర్ పాలిటిక్స్ -ప్లెజర్ పాలిటిక్స్ గాను బహు convenient గా పరివర్తన చెంది పరవశించి పోతున్న తరుణం గదా ఇది . ఇలాగే ఉంటుంది పరిస్థితి కొంత కాలం..మళ్ళీ సదరు ఉద్యమ కారులకు జ్ఞానోదయం అయ్యే దాక…అది ఎంతో దూరంలో లేదు.
  మీ నిశిత విశ్లేషణకి అభినందనలు.

  • శ్రీనివాసుడు says:

   బాగా చెప్పేరండీ, వారికి ఆ ఉద్యమాల్లో తాము కోరుకునే ఎడతెగని, నిరంతర గుర్తింపు వస్తున్నంతకాలం, వారి హైపర్ నార్సిసిజానికి అవి ఆజ్యం పోస్తున్నంతకాలం ఆయా అస్తిత్వ, నిరసన, గుర్తింపు ఉద్యమాల ఘనత వహించిన నాయకులు, భావజాల ప్రచారకులు జ్ఞానానికి బహుదూరంగా వుంటారు. ఇక ఉదయం అయ్యేదెక్కడ? నాకైతే ఏ ఆశా లేదు.

 2. Doctor Nalini says:

  అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం హైజాక్ అయిపోవడాన్ని చూసి మనం బాధ పడటాన్నిమరో సారి గుర్తు చేసావు శివా .ఇటీవల ‘తిరాక్’ అనే డాక్యుమెంటరీ చూసాను . అందులో కూడా ముస్లిం మహిళల అణచివేతని కేవలం ఒక ఎన్జీవో దృష్టి నించి చూపారు తప్ప పరిష్కారం లేదు . ఇలాంటివి చూస్తే రావి శాస్త్రి గారు విమర్శించే అయ్యో అయ్యో కథలు గుర్తొస్తాయి .

 3. అజిత్ కుమార్ says:

  స్త్రీల సమస్యలకు పెట్టుబడి కారణమని నమ్మడం తప్పు.

 4. Bhavani Phani says:

  చాలా మంచి ఆర్టికల్ . ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు పడుతున్న కష్టాల గురించి వింటుంటే ఎంతో బాధ కలుగుతోంది .

 5. Sivalakshmi says:

  స్పందించి, ప్రోత్సహిస్తున్నK N Rau,శ్రీనివాసుడు ,DOCTOR NALINI, BHAVANI ఫణి లకు హృదయపూర్వక ధన్యవాదాలు .అజిత్ కుమార్ గారూ సమస్యలు ఏవీ వాటికవే విడివిడి గా ఉండవండీ! కొనుగోలు శక్తి లేని,మార్కెట్ కి వినియోగదారులుగా పనికిరాని ప్రజలను పెట్టుబడి మట్టుబెట్టాలని చూస్తుంది . స్త్రీల సమస్యల వెనక ఉన్న రాజకీయాలకూ దీనికీ సంబంధముంది! చదివి,స్పందించినందుకు కృతజ్ఞతలు!

మీ మాటలు

*