‘నాలా మరో కోడలా… !!’

maro-kodalaa


-రేఖా జ్యోతి
~

” చందూ, నిన్ను ఎప్పుడూ మరిదిగా చూడలేదు నా పెద్ద కొడుకుగా తప్ప, నా మీద నీకున్న గౌరవం తెలుసు కనుక, నీకు అర్ధమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నం, నా మాట విను, ఇంకొక్కసారి ఆలోచించు. నీ ఆరాధన నాకు అర్ధమయ్యింది. నిజంగానే ‘సంధ్య’ మంచి పిల్ల, బాగా పాడుతుంది, స్థిరపడిన గాయని, చూడడానికీ చక్కగా ఉంటుంది, అన్నింటికీ మించి మనమంటే అభిమానమున్న పిల్ల. మహాలక్ష్మే ! అలాగని ప్రేమా, పెళ్ళి పేరుతో తెచ్చి మన గాట్లో కట్టేస్తామా? మన ఇంటి పరిస్థితులూ చూసుకోవద్దూ!

నిన్ను కనిపెట్టుకొని కనిపెట్టుకొని చదివించినా, ఉన్న ఊరు వదిలితే తిండికి ఇబ్బంది పడతావని, మధ్యాహ్నం కంప్యూటర్ క్లాస్ కి వెళ్తే నల్లబడిపోతావని మీ అమ్మగారు నిన్ను గంపకిందే ఉంచి పెంచారు. ఇప్పుడేదో ‘ఖాళీగా ఉన్నాడు’ అని మాట రాకుండా చిన్న ఉద్యోగంలో నిలబడ్దావు, మీ అన్నయ్యల లాగే! ఆర్భాటాలకీ .. ఆడంబరాలకీ పోగా .. నెలతిరిగితే పచారీకి, కరెంటు బిల్లుకీ, చాకలికి, పైపనివాళ్ళకీ డబ్బులు వెదుక్కునే మనం.. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తాం?

నాతోపాటూ పొద్దున్నే బావి దగ్గర అంట్లు తోమడానికి సాయం చేస్తుంది, బట్టలు పిండుతుంది, మోటారు పనిచేస్తే సరే.. లేకపోతే పక్కింటి రామయ్య వాళ్ళింట్లో నుంచి నీళ్ళు మోస్తుంది, ఉప్మాలోకి కూరలు తరుగుతుంది, చెట్నీలు రుబ్బుతుంది. హడావిడిగా తన పొట్ట పోసుకోవడానికో మనకు సాయం చెయ్యడానికో ఎక్కడో సంగీతం టీచరుగా చేరుతుంది. మళ్ళీ సాయంత్రం ఈ సంతలో కాఫీ గ్లాసులు, టిఫిన్ ప్లేట్లు పంచుతుంది. రాత్రి పదకొండు దాకా కూర్చొని చేయించుకొనే పదిమందికోసం గరగరా తిరిగే నాకూ, మీ చిన్నవదినకూ తోడు మరొకరు వస్తారు, అంతే కదా !!

పాటను చూసి ప్రేమించాను అనకు, పాటనే ప్రేమించు… పాడే వ్యక్తిని కాదు. విన్నామా.. బాగుంది అనుకున్నామా! మరీ నచ్చితే మరోసారి.. మరోసారి విను, అది ‘నా సొంతం’ అని నువ్వు అనుకున్నరోజే అపశృతులు మొదలవుతాయ్, అదీ ఖచ్చితంగా మనవల్లే జరగడం మరింత బాధ కదూ !! ”
ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంచి ఆరాధించే అంత ఎదిగామా మనం? లేదు కదా!

అంతదాకా ఎందుకు, మీరంతా కళారాధకులు, మీ పెద్దన్నయ్య నన్ను ఏమి చూసి చేసుకున్నారో అడుగు… , పదహారేళ్ళకే ‘వీణ’ కచేరీలు చేసేదాన్ని. విశాఖపట్నం ‘కళాభారతి’ లో చూసి మా ఇంటికి వచ్చి మాట్లాడారు. మీ ఇంటిపేరు చూసి మా తాతగారు మురిసిపోయి పెళ్ళికి ఒప్పుకున్నారు. నువ్వు ఇదంతా నమ్మలేవు కదా, ఎందుకంటే నేను మీ ఇంటికి వచ్చిన 14 యేళ్ళలో వీణ వాయించడం నువ్వు చూడలేదు కనుక. ఇక మీ చిన్న వదిన సంగతి నీకు తెలుసు, తెలుగు యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిప్లొమా పూర్తి చేసింది, మనతో సర్దుకుపోవడానికి డ్రాయింగ్ టీచర్ అయ్యింది. ఆ తర్వాత తన జీతంతో తను బి.ఎఫ్.ఎ. చదువుకోవడానికి కూడా మనం వెసులుబాటు ఇవ్వలేకపోతున్నాం. ఆర్ధికంగానూ సహకరించలేము … కాస్త తనకు తీరికా కల్పించలేము, బొమ్మల్లో మనసు పెట్టేంత ప్రశాంతత ఈ దైనందిన కాలపట్టికలో అసాధ్యం. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చందూ !!

అవన్నీ వదిలేసినా , ‘పోనీ విడిగా ఉండి చూసుకుంటాను’ అంటావా? నువ్వూ ఈ ఇంట్లో మగవాళ్ళ లాగే ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టవు. పొద్దున్న టిఫిన్లు, రెండు చెట్నీలు … మధ్యాహ్నం భోజనంలోకి రెండుకూరలు, పప్పు సాంబారు … రుబ్బిన పచ్చడి, నిల్వపచ్చడి, అన్నంలోపొడి … ఏ ఒక్కటిలేకపోయినా వీరంగం చేసే నువ్వు … ‘ఆ అమ్మాయి బాగా పాడుతుంది’ కనుక, పెళ్ళి మాటలు మాట్లాడమంటే ఎలా? రేపు ఆ అమ్మాయి 20 యేళ్ళు నేర్చుకున్న సంగీతం వదిలేసి పోద్దునకేం వండాలి ? రాత్రికేం వండాలి .. అని హైరానా పడిపోవాలిసిందే ! నీ జీవితంలో.. నీ దినచర్యలో, అలవాట్లలో గొప్ప మార్పులు చేసుకోకుండా .. త్యాగం చెయ్యకుండా ఆమెను ఆమెగా ఉంచలేవు చందూ ! ఇది నీ లాంటి వాడికి సాహసం, నువ్వు సిద్ధమా?

ఏ కళని ఆరాధిస్తున్నావో ఆ కళకి, ఆమెకీ జీవితాంతం నువ్వు పోషకుడిగా .. రక్షకుడిగా ఉండగలనన్న నమ్మకం నీకుంటే .. అలాగే వెళ్ళి అమ్మాయిని ఇవ్వమని అడుగుదాం, నిజాయితీగా తూకం వేసుకో !!

ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే ! ‘ఏమో మనం కాకుండా మరెవరైనా అయిఉంటే ఆమె జీవితం బాగుండేదేమో!’ అని భవిష్యత్తులో మనం బాధపడకూడదు. మాలాగా ‘పెళ్ళికి ముందు వీణ వాయించేదాన్ని’, ‘ పెళ్ళికి ముందు నేను బొమ్మలు వేసేదాన్ని’ అని తను చెప్పుకోకూడదు. ” పెళ్ళికి ముందు నేను కచేరీలు చేసేదాన్ని ” అని మరో అమ్మాయి బాధ పడడం తోడికోడళ్ళుగా మేము ఊహించుకోలేమురా!

“చందూ .. అంత రిస్క్ ఎందుకురా, నువ్వేమిటో మాకు తెలుసు నీకూ తెలుసు … ! గౌరీ అక్క కూతురు ‘హోం సైన్స్’ చేసిందట, చిన్నప్పటి నుంచీ మన ఇంటి పరిస్థితులూ పద్ధతులూ తెలిసిన పిల్ల .. వంట భాగా చేస్తుంది. కళలూ కాకరకాయలూ అని బుగ్గకి చెయ్యిపెట్టుకొని ఊహల్లో బ్రతికే పిల్ల కాదు. పైగా ‘స్త్రీ’ కి సొంతసమయం అని పోరాడే పిల్ల కాదు .. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. రేపే వెళ్ళి మాట్లాడుతాం, ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం కూడా కష్టం రా!”

కాలం మారిపోయిందని మొత్తుకొనేవాళ్ళకి మన ఇల్లూ .. మన పద్ధతులూ మారలేదని, తెలీదు కదా, దాన్ని అలానే ఉండనీ గుట్టుగా, ఎప్పటికీ !!”

*

మీ మాటలు

 1. చాలా బాగుందండీ . . ఇలా ఆలోచించే వదినలు , తోడి కోడళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది! ఏదో కధలో చదివాను. ఒకమ్మాయి అన్నయ్యకి సంబంధాలు చూస్తుంటారు. తన స్నేహితురాలు అన్నయ్య మీద ఇంట్రెస్ట్ చూపిస్తోందని తెలిసినప్పుడు ఆమె చెప్పిన డైలాగ్ ఇది. “మా అన్నయ్యకి పెసరట్టు చేసి పెట్టే ఐశ్వర్యా రాయ్ కావాలి.” ( తన అన్నయ్యని ఎత్తి పొడుస్తూ అంటుంది). స్నేహితురాలు చామనఛాయ లో ఉంటుంది.
  ఎందుకో ఈ డైలాగ్ ఇప్పటికీ నన్నువెంటాడు తూనే ఉంది.

 2. మైథిలి అబ్బరాజు says:

  ఎవరి జీవితం వారి చేతుల్లో నే ఉంచి ఆరాధించేంత ఎదిగామా మనం? లేదుకదా.
  ఆద్భుతమైన స్పష్టత.
  శేషేర్ కవిత ని గుర్తు చేసింది.

 3. చాలా బావుంది రేఖ గారూ… ప్రతి పదంలో నిజాయితీ ఉంది, మరి ఎంత మంది అర్థం చేసుకుంటారు రియాలిటీని!!? సందేహమే… :) అభినందనలు

  • పరిస్థితుల్లో మార్పు ‘ వినే ‘ వరకు వచ్చింది Mam , నెమ్మదిగా అర్ధం చేసుకుంటారేమో ! థాంక్యూ Mam !

 4. “ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంచి ఆరాధించే అంత ఎదిగామా మనం? లేదు కదా!” మంచి అబ్జర్వేషన్!

  • థాంక్యూ సర్, ప్రాణం గా పెంచుకున్న కళలని పాపం వదులుకోవాలంటే బాధ కదూ !!

 5. Ramachandra says:

  Rachana Baagundhi.vishayam kudaa..

 6. sasi kala says:

  mee ille kaadhu andarivi anthe lendi . pelli ante oohalatho kaadu practical gaa ilaage aalochinchaali .
  inkaa pelli chesukonedi pillala kosame kaabatti jenyutical gaa koodaa aalochinchi nirnayaalu teesukovaali . kaani vaalla prema vidadeeyalentha unte manam yemi cheyyalemu kadha ! nice narration

 7. మీరు వ్రాసిన ఈ కథకు ముందుగా మీరుంచిన ముఖచిత్రం పూర్తి భావాన్ని తెలుపుతూ చాలా పరిపూర్నతనిచ్చింది ……..రేఖా జ్యోతి గారు మీకు అభినందనలు….

 8. మంచి ఆలోచన ధోరణి. ఆచరించి చూపిస్తే అద్భుతంగ వుంటుంది

 9. paresh n doshi says:

  వొక్క ముక్కలో చెప్పాలంటే : ” పెళ్ళికి ముందు దాకా బతికేదాన్ని”, అంటుందా సంగీత గ్నానం వున్న అమ్మాయి.

  “చందూ .. అంత రిస్క్ ఎందుకురా, నువ్వేమిటో మాకు తెలుసు నీకూ తెలుసు … ! గౌరీ అక్క కూతురు ‘హోం సైన్స్’ చేసిందట, చిన్నప్పటి నుంచీ మన ఇంటి పరిస్థితులూ పద్ధతులూ తెలిసిన పిల్ల .. వంట భాగా చేస్తుంది. కళలూ కాకరకాయలూ అని బుగ్గకి చెయ్యిపెట్టుకొని ఊహల్లో బ్రతికే పిల్ల కాదు. పైగా ‘స్త్రీ’ కి సొంతసమయం అని పోరాడే పిల్ల కాదు .. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు. రేపే వెళ్ళి మాట్లాడుతాం, ఈ కాలంలో అలాంటి అమ్మాయి దొరకడం కూడా కష్టం రా!”

  “నాకు తెలుసు. తెలిసే తల నరికుంచుకోడానికి సిద్ధం”, అంటుందా ఈ ‘హోం సైన్స్’ అమ్మాయి?

  చందూ కి యెవరో వొకరు బలి కాక తప్పదేమో.

  sigh

  • ” తెలిసే …..! ” అండీ , ఇంత కంటే ( వండి వార్చి సర్ది ) మరేదీ ముఖ్యం కాదని నేర్చుకున్నందువల్ల , చందూ లాంటి వారిని ( ఇలాంటి వారే ఎక్కువ కదా :( ) చేసుకొనే వారున్నారండీ . Thank you సర్

 10. గొప్ప నేరేషన్ , క్లారిటీ.. పెళ్లి అంటే రోలు రోకలి దాటి ఆలోచించని కుటుంబాలు చాలానే ఉన్నాయి. వొకప్పుడు, వోల్గా గారితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.. కొంత మారింది కదా అంటే..
  ” మారింది, అప్పుడు రోట్లో రుబ్బేవారు, ఇప్పుడు గ్రైండర్ లో.. రుబ్బటం మారలేదు ” అని నవ్వారామె.
  మళ్ళీ మా పిన్ని కూడా.. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, మగవాడు తిన్న ప్లేటు, మళ్ళీ పెళ్ళామో, తల్లో తీయాల్సిందే.. బఫే లో కూడా వెతుక్కొని వచ్చి, ఎంగిలి ప్లేటు చేతిలో పెడతారు.. నాక్కూడా అలా తినేయగానే వాళ్ళ చేతిలో పెట్టాలని కోరకగా ఉంటుంది ..అంది.
  పెళ్ళికి ముందు , ఆ తరవాత అని జీవితం మారితే, ఇంక పెళ్లి సంగీతాల’ , హోమ్ సైన్సుల పిల్లలే బెటర్.
  హ్మ్మ్.. చాలా గొప్పగా రాసేరు

  • ” మారింది, అప్పుడు రోట్లో రుబ్బేవారు, ఇప్పుడు గ్రైండర్ లో.. రుబ్బటం మారలేదు ” Thanks a lot … మొత్తం వ్యవస్థ నుంచి మార్పు ఆసించట్లేదు (:( ) కనీసం ” మన కుటుంబంలోకి వచ్చే అమ్మాయికి మనం ఏమి ఇవ్వగలం?” అని చిన్న ప్రశ్న వేసుకుంటే చాలేమో అని ఈ ప్రయత్నం !! TQ

 11. “ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే ! ‘ఏమో మనం కాకుండా మరెవరైనా అయిఉంటే ఆమె జీవితం బాగుండేదేమో!’ అని భవిష్యత్తులో మనం బాధపడకూడదు.”
  బాగా చెప్పారు.

 12. వనజ తాతినేని says:

  చాలా బాగుంది రేఖ గారూ! కుటుంబాలలో పురుషులు అంత త్వరగా ఒప్పుకుంటారా?

  • చెప్పకపోతే అన్నీ బాగున్నాయని – వాళ్లకి వాళ్ళే కితాబిచ్చుకుంటారు కదండీ :( కనీసం ఇంట్లో ‘ స్త్రీ ‘ పరిస్థితి వింటే, ఎప్పుడో ఒకప్పుడు వారి లోపల ఒక చిన్న guilt అయినా వస్తే చాలు :( Thank you mam

 13. పైన అందరూ ఇచ్చిన స్పందన లన్నీ చాలా చక్కగా ఉన్నాయి.
  రేఖా గారూ, మీ వర్ణన చాలా చక్కగా ఉందండి. కళ్ళకు కట్టినట్లు ఉంది చదువుతూ ఉంటె…
  ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ప్రత్యేకించి ప్రేమ అంటే మీరు ఇచ్చిన అర్ధం చాలా చక్కగా ఉంది..”
  (వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే…)

  మీ నుంచి మరిన్ని కధలు రావాలని ఆశిస్తున్నాం.GOD BLESS YOU

  • థాంక్యూ లక్ష్మి గారూ … , మరేదైనా కూడా రాయాలనిపించే ధైర్యం మీ మాటలు!

 14. Venkat Suresh says:

  వారు కోరుకొన్న జీవితాన్ని మనం కలగనటమే…. బ్యూటిఫుల్!!

 15. Jayashree Naidu says:

  రేఖా…
  ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే
  ఎంత సింపుల్ గా అలవోకగా చెప్పేశావో…
  మోనోలాగ్ లా సాగినా, ఎన్నో అంతరంగాల ప్రతిధ్వనుల్ని నేర్పుగా ఇమిడ్చేశావు. సంప్రదాయం మింగేసే జీవితాలెన్నో…

 16. రేఖా ! ఇప్పుడే చదివాను ..చాలా బాగుంది ..మన ఇళ్ళల్లో మగవారికీ బువ్వ వండి , విస్తరి నిండా అధరువులు వండే నైపుణ్యమూ , మగవారు ఎంత సంపాదిస్తున్నారు ?అనే ప్రశ్నలు వేయకుండా , బాపూ బొమ్మ లా ఉండి ,తల దించుకుని మెలిగే ఆడపిల్ల కావాలి ..అంటారు ..పత్నీ పోస్ట్ కి ..వారి అర్హతల ఊసు ఎత్తకూడదు ! నిజం ..నా పెళ్ళి ముందు .. అంటూ ఎంత మంది ఆడవారు తమ జీ్వితేచ్చలని స్వయంగా చంపేసుకుంటున్నారో ఈ వివాహ వ్యవస్థ లో ..చిన్న కథ ఐనా , ఎన్నో విషయాలు స్పృశించావు ..మంచి కథ చదివిన తృప్తి ని మించినది ఏముంది ?

  వసంత లక్ష్మి

  • మీ కధలకి పెద్ద అభిమానిని, మీ అభినందన చాలా సంతోషాన్ని ఇచ్చింది. థాంక్యూ Mam !

 17. రేఖా జ్యోతి గారి ఈ మెయిల్ ఐ డి తెలియ చేయగలరని కోరుతున్నాను.
  tkgowri@gmail.com

 18. Krishna Veni Chari says:

  ఒక సింపిల్‍ మొనొలోగ్‍ నెరేటివ్‍ లో ఒక కుటుంబపు పరిస్థితిని ఎంత బాగా వర్ణించారో! అభినందనలు.

  • చిన్న ప్రయత్నం … మీకు నచ్చినందుకు చాలా సంతోషం, థాంక్యూ అండీ !!

 19. RAKUMARI says:

  చెప్పకపోతే అన్నీ బాగున్నాయని – వాళ్లకి వాళ్ళే కితాబిచ్చుకుంటారు కదండీ :(

  ఇది కుడా కదా అంత బాగుంది

 20. Bhavani Phani says:

  చాలా మంచి కథండీ, ఆలోచింపచేసే వాక్యాలు . కథనం కూడా చక్కగా ఉంది . అభినందనలు

 21. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంచి ఆరాధించే అంత ఎదిగామా మనం? లేదు కదా!
  ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే !
  ఈ రెండు వ్యాక్యలలో ఎంతో పెద్ద విషయాన్ని ఇట్టే చెప్పేశారు.

  • పెద్ద విషయమేనండీ :( – పెళ్ళైన రెండేళ్ళకి కలిసిన స్నేహితురాల్ని ” నీకేంటి మంచి సింగర్ వి ” అనగానే .. బదులు చెప్పకుండా భోరున ఏడవడం బాగా కలచివేసిందండీ :( చిన్న మార్పులతో అందరి జీవితాలకీ కాస్త విలువ వస్తే చాలు.

 22. ఎ కె ప్రభాకర్ says:

  “ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంచి ఆరాధించే అంత ఎదిగామా మనం? లేదు కదా!
  ప్రేమించడం అంటే ఏం లేదురా.. వారు కోరుకున్న జీవితాన్ని మనం కలగనడమే !”
  లోతైన విషయాన్ని చాలా సింపుల్ గా స్పష్టంగా క్లుప్తంగా గాఢంగా హత్తుకొనే లా చెప్పారు. యూ హావ్ డన్ ద జాబ్ వెరీ షార్ప్లీ. అభినందనలు రేఖ గారూ !

 23. chandolu chandrasekhar says:

  దాన్ని అలానే ఉండని గుట్టుగా ,ఎప్పటికీ!! thanx అండీ ఎవరో వీపు మిద చరిచి నట్టుంది .

  • చిన్న కేర్ చాలండీ …. ఎవరో ఏదో వదులుకొని బాధపడకూడదని .., బ్యాలన్స్ కోసమే ఈ కాస్త ప్రయత్నం ! థాంక్యూ సర్

 24. అజిత్ కుమార్ says:

  నాకు చిన్నప్పటినుంచీ నాటికలూ నాటకాలంటే పిచ్చి. చుట్టుప్రక్కల ఏవూళ్ళోనైనా నాటకప్రదర్శన ఉందంటే కుర్రాళ్ళనందర్నీ కలేసి తీసుకెళతాను. పండుగలొస్తే మాకు నాటకాలేయడమే గొప్పసరదా. అలాంటి నాకు పెళ్ళయ్యాక వాటన్నిటికీ బ్రేకుపడింది. రాత్రుళ్ళు నన్ను బయటికి వెళ్ళనిచ్చేదేకాదునాపెళ్ళాం.ఎలాంటివాడు ఎలా అయ్యాడో చూడండని నా మిత్రులంతా నన్ను జాలిగా చూసి తత్వబోధలు చేస్తుంటే తలూపక మరేం చెయ్యగలనూ…వాస్తవానికి స్త్రీలవి పూర్వగాధలు…ప్రస్తుత కష్టాలన్నీ మగవాళ్ళకేనని వేరే చెప్పాల్నా…

  • అయ్యో … ఎవరికీ మినహాయింపు లేదుకదండీ :( అటు ఉన్నంత దిగులే ఇటూ ఉంటుంది కదా ఇష్టాలను ఒదులుకొనేటప్పుడు :(

మీ మాటలు

*