గ్రీకుల ‘మహాభారతం’ ఇలియడ్

 

స్లీమన్ కథ-28

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

కల్లూరి భాస్కరం

స్లీమన్ తన జీవితకాలంలోని చివరి పదేళ్లూ మరెక్కడైనా స్వర్ణనిక్షేపాలు బయటపడతాయా అని గాలిస్తూనే గడిపాడు. కానీ అతని ఆశ ఫలించలేదు. తనలో ఒక బాలుడిలో ఉండే కుతూహలం, ఒక యువకుడిలో ఉండే ఉత్సాహం ఇప్పటికీ ఉన్నా శరీరాన్ని వృద్ధాప్యం ఆవహించింది. ఎక్కడో ఒకచోట తను స్థిరంగా కుదురుకోవాలనిపించింది. ఎథెన్స్ తనకెంతో ఇష్టాన్నీ, మనశ్శాంతినీ కలిగించడంతో ఆ నగరం నడిమధ్యలో తన స్థాయికి తగినట్టు ఒక నివాసాన్ని నిర్మించుకోవాలని నిశ్చయించుకున్నాడు.

ట్రాయ్, మైసీనియాలలో తను కనుగొన్న రాజప్రాసాదాల నమూనాలో తన సౌధానికి తనే రూపకల్పన చేసుకున్నాడు. దానికి Iliou Melathron (‘ట్రాయ్ ప్రాసాదం’) అని పేరుపెట్టాడు. అది లైకాబిటిస్ కొండ పాదాల దగ్గర రాజుగారి గుర్రపుశాలకు ఎగువన ఉంది. అదొక భారీ నిర్మాణం. రంగురాళ్ల నేలతో, పాలరాతి మెట్లతో లోపల చలి చలిగా ఉంటుంది.  ట్రాయ్ లో తను కనుగొన్న స్వర్ణపాత్రలు, కలశాల నమూనాలు వాటి మీద చిత్రితమై ఉన్నాయి. గోడల మీద ప్రాచీనతను ప్రతిబింబించే ప్రకృతి దృశ్యాలు, హోమర్ నుంచి తగిన ఉటంకింపులతో గ్రీకు వీరుల చిత్రాలు ఉన్నాయి.

కింది అంతస్థులలో తను కనుగొన్న నిక్షేపాలను ప్రదర్శించాడు. పై అంతస్థును తన అధ్యయనానికి కేటాయించుకున్నాడు. “క్షేత్రగణితాన్ని అధ్యయనం చేయనివారు బయటే ఉండండి” అనే హెచ్చరికను తలుపుకు అతికించాడు. గదినిండా పుస్తకాలు. తను సేకరించిన అతి విలువైన సామగ్రిని కూడా అందులోనే ఉంచాడు. గోడల మీద, తను ఎంతగానో అభిమానించే న్యూయార్క్, ఇండియానాపోలిస్ తాలూకు దృశ్యాలను అలంకరించాడు. మందంగా తోలు తాపడం చేసిన ఓ పెద్ద కుర్చీలో కూర్చుని రోజంతా ప్రాచీన గ్రీకు గ్రంథాలను చదువుతూ గడిపేవాడు. పక్కనే ఒక చిన్న కుర్చీ ఉండేది. దానిమీద, రోజూ ఉదయమే పారిస్, లండన్, బెర్లిన్ ల నుంచి వచ్చే స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితాల దొంతర ఉండేది. టెలిగ్రాఫ్ ఫారాలు ఎప్పుడూ అందుబాటులో ఉండేవి. ఇప్పటికీ అతను వ్యాపారప్రముఖుడే. దాదాపు ప్రపంచమంతా విస్తరించిన తన ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణకు రోజూ కొన్ని గంటలు కేటాయించుకునేవాడు.

తన నివాసంలో అతను హోమర్ వర్ణించిన రాజుల్లానే ఒక నియంతలా వ్యవహరించేవాడు. తన మాట శిలాశాసనం. తనకు పంపే వర్తమానాలను అన్నింటినీ ప్రాచీన గ్రీకు భాషలో పంపి తీరవలసిందే. ఇంట్లో భోజనాల దగ్గర, ఇతర నిత్యకృత్యాలలో గ్రీకు మాట్లాడవలసిందే. తన పనివాళ్లు అందరికీ గ్రీకు పేర్లు పెట్టాడు. ఒక పనివాడి పేరు, బెల్లర్ ఫాన్. ఇంకొకతని పేరు, టెలమాన్. కూతురు అంద్రోమకీ ఆయా పేరు, దనాయి.  కొడుకు అగమెమ్నన్ నర్సు పేరు పోలిక్సీనా. ముసలి తోటమాలి పేరు కల్ఫాస్. భవిష్యత్తును చెప్పగలిగిన కల్ఫాస్ శాపవాక్యాలతోనే ఇలియడ్ మొదలవుతుంది. ప్రాచీన గ్రీకులు ఇళ్ళలో ఎక్కువ గృహోపకరణాలను పేర్చేవారు కాదు కనుక, తను కూడా వారినే అనుసరించాడు. ఓ మూల కొన్నిపాటి కుర్చీలతో, సోఫాలతో గదులన్నీ బోసిపోయినట్టు ఉండేవి.  అలాగే, ఇంట్లో ఎక్కడా తెరలు ఉండకూడదు.  అతని ఉద్దేశంలో, అఖిలెస్ తెరలు వేలాడదీసిన నివాసంలో ఉన్నాడన్నది అసలు ఊహించడానికే వీలులేని విషయం. తన భారీ భవంతిని పురాతన గ్రీకు రాజప్రాసాదాల నమూనాలో నిర్మించడానికి, పాంపే(పురాతన రోమన్ నగరం) శిథిలాలు అతన్ని ప్రత్యేకించి ఆకట్టుకోవడం కూడా ఒక కారణం. పాంపే భవంతులలోని నాట్యశాలల తరహాలోనే తన నివాసంలో నాట్యశాలను నిర్మించాడు. దాని గోడల మీద నీలం, తెలుపు రంగుల్లో పిల్లల నగ్నచిత్రాలను ప్రదర్శించాడు. వాటిలో తన పరిచయస్తులు, ప్రయాణాలలో తనకు తారసపడిన వ్యక్తుల కవళికలు ఉండేలా చూశాడు. వాటి మధ్యలో కళ్ళద్దాలు ధరించిన తన చిత్రాన్ని ఉంచాడు.

జీవితం పొద్దువాలుతున్న దశలో తనకు రక్షగానూ, తనలో ఉత్సాహం నింపడానికా అన్నట్టూ భవనం పై కప్పు నేల మీద జియస్, అఫ్రొడైట్, అపోలో, ఎథెనా సహా ఇరవైనాలుగు మంది దేవీ దేవుళ్ళ పాలరాతి విగ్రహాలను ఉంచాడు.

***

pura1

స్లీమన్ తన జీవితంలో చివరి ముప్పై నాలుగేళ్లూ ఇలియడ్ ను ఎంతో తమకంతో పఠిస్తూనే వచ్చాడు. అదే అతని బైబిల్. రోజులో ఎన్నోసార్లు ఆ పుస్తకాన్ని తిరగేసేవాడు. దాదాపు అతని ఆలోచనల కన్నిటికీ అదే ఊటబావి.  అందులో, ఏ భాగం గొప్పదీ, ఏది నీకు ఎక్కువ ఇష్టం అన్న ప్రశ్నకు అతని దగ్గర అవకాశమే లేదు. అది ఆమూలాగ్రమూ గొప్పదే,  ప్రీతి కలిగించేదే. అందుబాటులో ఉన్న ఇలియడ్ ప్రతి ఒక్క ముద్రణా అతని లైబ్రరీలో ఉండేది. వాటిలో అనేకం మందమైన మొరాకో తోలుతో బైండ్ చేసినవి. అవిగాక,  చవకగా లభించే పేపర్ బౌండ్ చాజ్నిట్స్ [Tauchnitz- జర్మనీకి చెందిన బెర్న్ హార్డ్ చాజ్నిట్స్ అనే అతను నెలకొల్పిన సంస్థ 1842-1950ల మధ్యకాలంలో పేపర్ బౌండ్ చవక ముద్రణలను వ్యాప్తిలోకి తెచ్చింది. అవి చాజ్నిట్స్ ముద్రణలుగా ప్రసిద్ధి చెందాయి]ముద్రణలను ప్రయాణాలలో వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. వాటి పుటలను తన వ్యాఖ్యానంతో నింపేసేవాడు.

ఇలియడ్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని ఓసారి ఒక మిత్రుడు ఉత్తరం రాశాడు. అందులో కష్టమేమీ లేదనీ, అది కాస్టలియన్[గ్రీస్ లో డెల్ఫీ సమీపంలోని] ఊటజలాలంత తేటగా ఉంటుందనీ, ఒక ఆధునిక నవలలా దానిని చదువుకోవచ్చనీ స్లీమన్ జవాబిచ్చాడు. అతని దృష్టిలో ఇలియడ్, ఒడిస్సే లు రెండూ దివ్యశాసనాలు. భగవదాశీస్సులతో రూపొందినవి. మానవమాత్రుడికి సాధ్యం కాని ఉదాత్తతా, సొగసూ వాటిలో ఉట్టిపడుతుంటాయి. ఈ గ్రంథాలను ఎవరైనాసరే కూర్చుని శ్రద్ధగా పఠిస్తే తన జన్మ సార్ధకమైందన్న భావనా, ఒక అలౌకికానందమూ అతన్ని ముప్పిరిగొంటాయి. మనిషి తాలూకు అంతటి విషాదాన్నీ అవి ప్రతిఫలిస్తాయి. అవి, ఒక పరిపూర్ణ కవి చెప్పిన పరిపూర్ణ కథలు. ఇంతకు మించి చెప్పడం అనవసరం.

ఇలియడ్ లో అన్నిటి కన్నా ఫలానా భాగం గొప్పదని చెప్పడం కష్టమనీ, అన్నీ సమానంగా రంజకమైనవే నని స్లీమన్ పదే పదే నొక్కి చెప్పినా; ఒక సందర్భంలో మాత్రం తన ఈ నిర్ధారణను తనే ఉల్లంఘించాడు.  అన్నిటిలోనూ  ప్రత్యేకించి మరింత అద్భుతమైనదిగా ఒక ఘట్టాన్ని ఎత్తిచూపాడు. అది, హెలెన్ ఒక వస్త్రంపై అల్లిక పని చేస్తూ స్కియన్ గేటు వైపు నడిచి వెడుతున్న ఘట్టం. ఆమె నేస్తున్న అలంకరణవస్త్రంపై ట్రోజన్లు, అఖియన్లు ఒకరి పీక ఒకరు పట్టుకున్న చిత్రాలు ఉన్నాయి.  ఆ సమయంలో, చెట్టు కొమ్మల మీద ఆనందంగా కిచకిచలాడే పక్షుల్లా  రాజు ప్రియామ్, నగర పెద్దలూ  సమీపంలోని ఒక బురుజు మీద సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు.

యుద్ధం ఆగిపోయిందన్న వార్త వస్తుంది. దానికి బదులు హెలెన్ భర్త మెనెలాస్, ఆమెను అపహరించుకుని వచ్చిన పారిస్ ద్వంద్వయుద్ధం చేయాలని తీర్మానించారు. హెలెన్ భవితవ్యాన్ని ఆ యుద్ధం నిర్ణయించబోతోంది. హెలెన్ శ్వేతవస్త్రం ధరించి, చెలికత్తెలు వెంటరాగా ప్రియామ్ ఉన్న బురుజును సమీపిస్తుంది. ఆమె రాకను గమనించిన పెద్దలు అప్రయత్నంగా గొంతులు తగ్గించి, ఆమె అద్భుత సౌందర్యాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇంకోవైపు, సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం అంతం కాబోతోందన్న సంతోషం వాళ్ళలో వెల్లివిరుస్తోంది. ప్రియామ్ ఆమెను తన దగ్గరకు పిలిచి శత్రుసేనలోని ఒక వ్యక్తిని చూపించి, “అందరికంటే ఆజానుబాహువుగా, ధీరోదాత్తుడిలా కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు?” అని అడుగుతాడు.

pura3

“అతను అగమెమ్నన్, నా భర్తకు అన్నగారు” అని హెలెన్ చెబుతుంది. ఆ తర్వాత, తన కవచాన్ని నేల మీదికి జారవిడిచిన ఇంకో వ్యక్తిని చూపించి, తగుమాత్రం ఎత్తుగా, లోతైన ఛాతీతో ఉన్న అతను ఎవరని అడుగుతాడు. “అతను ఒడీసియస్” అని చెబుతుంది. ఈసారి, ఎత్తుగా, అందంగా ఉన్న ఇంకో వ్యక్తిని చూపించి, ఎవరని అడుగుతాడు. “అతను ఎజాక్స్” అని చెబుతుంది. క్రీటు రాజు ఇడోమెనెస్ ను కూడా ఆమె గుర్తుపడుతుంది. అగమెమ్నన్ సేనానులందరిలో అతనే పెద్దవాడు.  ఇంతలో ఇద్దరి కోసం ఆమె కళ్ళు ఆత్రుతతో గాలించాయి. వారు, కాస్టరస్, పోలీడూసెస్ లు. వాళ్ళిద్దరూ ఆమె సోదరులు. ఒకతను మంచి అశ్వశిక్షకుడు, ఇంకొకతను ప్రసిద్ధ మల్లయోధుడు. వాళ్ళు కనిపించకపోయేసరికి కీడును శంకించి, పట్టలేని దుఃఖంతో ఆమె మూగవోయింది. హోమర్ అంటాడు:

ఫలవంతమైన భూమి ఇప్పటికే వారిని తన ఒడిలోకి తీసుకుంది

దూరంగా, తాము ఎంతో ప్రేమించే లాసిడిమోనియా*కు వారు చేరుకున్నారు

దుఃఖం నగ్నంగా నర్తించే ఇలాంటి ఘట్టాలు హోమర్ లో ఏడెనిమిది కనిపిస్తాయి. దుఃఖం-మనిషి ఎదుర్కొనే దుఃఖం- ఇదే ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. అఖిలెస్ ఆగ్రహోదగ్రతా, ఎందరో ఉత్తముల చావుకు కారణమైన అతని విలయ తాండవం-ఇవే తన ప్రధానవస్తువులని హోమర్ ఇతిహాస ప్రారంభంలోనే చెబుతాడు. అఖిలెస్ రూపంలో మృత్యుశక్తి పట్టపగ్గాలు లేకుండా విస్ఫోటించింది. తన దారికి అడ్డువచ్చిన ప్రతిదానినీ ధ్వంసం చేస్తూ, ప్రతి ఒకరితో ఘర్షణపడుతూ; శత్రువీరుడైన హెక్టర్ ను చంపి అతని మృతదేహాన్ని గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసేవరకూ ఎత్తిన కత్తి దించని అఖిలెస్ విజృంభణను ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోతాం. ఎట్టకేలకు మృతదేహాన్ని రాజు ప్రియామ్ కు అతను అప్పగించినప్పుడు, ఆ యువవీరుడైన హెక్టర్ రూపురేఖల్లో  మానవీయంగా, లేదా దైవత్వంగా చెప్పదగినదేదీ మిగలదు. అతను, నలిపి చంపేసిన ఒక పురుగు!

అఖిలెస్సే ఇందులో నాయకుడు. అయితే, అతను మృత్యువును ప్రేమించిన నాయకుడు. ఇందుకు భిన్నంగా ఈ కథను వినే శ్రోతలందరూ జీవితాన్ని ప్రేమించేవారు. ఇంత అందమైన భూమిని సృష్టించి కూడా, దానిని ఇంతటి విషాదంతో నింపిన దేవతల విధ్వంసశక్తికి వారు నివ్వెరపోతారు. మెరిసే కవచాలు, ధైర్యం ఉట్టిపడే చూపులు, వంగే మానవదేహాలు, స్వర్ణహారాల ధగధగలు-అన్నీ చివరికి ఇన్ని కన్నీళ్లుగా మిగిలిపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే, యువవీరుల విషాదాంతాన్ని పురస్కరించుకుని భగవంతుని ఉద్దేశించి చేసే సుదీర్ఘ ప్రార్థన, ఇలియడ్.**

ఇలియడ్ లో అడుగడుగునా  బాధాగ్రస్తుల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంతటి ధ్వంసకాండకు గ్రీకులు ఎందుకు పూనుకున్నారు? అందులో వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందారు?  హెక్టర్ మృతదేహాన్ని ట్రాయ్ ప్రాకారాల వెంట ఈడ్చుకువెడతారనీ, అఖిలెస్ విజయం సాధిస్తాడనీ, తళుక్కు మనే శ్వేతవస్త్రాలతో ప్రేతదేవతలా హెలెన్ కథ అంతటా ఆవరించి ఉంటుందనీ ప్రారంభంనుంచీ మనకు తెలుస్తూనే ఉంటుంది. గొప్ప సౌందర్యారాశిగా, అందరానిదిగా తోచే హెలెన్, తన అందానికి తనే భయభ్రాంతమవుతూ జీవించే ఒక భూతాన్ని తలపిస్తుంది. ఈ భూతం కోసమే వీరులంతా కలసి ఈ మహాయుద్ధం సాగించారు; ఈ భూతం కోసమే సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నారు. పురుషులు చావవలసిందే; స్త్రీలు దుఃఖించవలసిందే; రక్తం చిందవలసిందే; చివరికి అంతా నిష్ఫలం. ఒక భయానకమైన, నిర్హేతుకమైన విధి ఆద్యంతం పరచుకున్నట్టు ఉంటుంది.***

జీవితం నిరర్థకం, అర్థరహితమన్న ఎరుక హోమర్ లో ధ్వనిస్తూ ఉంటుంది. అతనికి యుద్ధాల గురించి తెలుసు.  మృతులు, క్షతగాత్రుల దేహాలు నేలకొరిగిన దృశ్యం ఎలా ఉంటుందో తెలుసు. సంప్రదాయం అతన్ని అంధుడిగా చెబుతుంది. అందుకే కాబోలు, ప్రతిదానిలో ఉజ్వలతను పదే పదే ఎత్తి చూపుతాడు. అతన్ని ఏజియన్ దీవులకు చెందిన ఒక ద్వీపవాసిగా కూడా సంప్రదాయం చెబుతుంది.**** బహుశా అందుకే గ్రీకులు, ట్రోజన్ల ఉభయుల పట్లా అతనిలో ఒక విచిత్రమైన నిర్మమత్వమూ; అర్థరహితమైన యుద్ధంలో చిక్కుకున్న వ్యక్తుల పట్ల మమత్వమూ కనిపిస్తాయి.

ఇలియడ్ లో ముగ్గురు వ్యక్తులు విశిష్టంగా కనిపిస్తారు: అల్లకల్లోలం సాగించే అఖిలెస్, జిత్తులమారి ఒడీసియస్, విధివంచితుడు హెక్టర్! ఒడిస్సే చివరి అధ్యాయాలలో ఒడీసియస్, అఖిలెస్ లక్షణాలను అన్నిటినీ పుణికి పుచ్చుకుంటాడు. ఇలియడ్ లో హెక్టర్ ఆంతరంగిక నాయకుడు అయితే, అఖిలెస్ బహిరంగ నాయకుడు. ఆర్ద్రతా, ఆత్మీయతా నిండిన దాదాపు అన్ని ఘట్టాలూ హెక్టర్ కు సంబంధించి ఉంటాయి. ఇంచుమించు అతను హేమ్లెట్ లాంటివాడు. సాలెగూడులో ఇరుక్కున్న అతను దాని నుంచి బయటపడే ప్రయత్నంలో ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడతాడు. అందమైన కలలు పేర్చుకుంటాడు, అంతలోనే వాటిని కుప్పకూల్చుతాడు. తన నాశనానికి తనే అసహనంతో ఎదురుచూసేవాడిలా కనిపిస్తాడు. ఒక్కోసారి బాల్యస్మృతులలోకి జారిపోతాడు.  జీవితం గాలిబుడగ లాంటిదన్న భావనకూ, బాధ్యతాస్పృహకూ మధ్య నలుగుతూ ఉంటాడు.

(సశేషం)

******

అథోజ్ఞాపికలు

*లాసిడిమోనియా: గ్రీసు పురాతన నగరాలలో ఒకటైన స్పార్టాకు మరో పేరు.

** మహాభారతానికి, ఇలియడ్ కు పోలికలు అడుగడుగునా కనిపించి ఆశ్చర్యం గొలుపుతాయి. ఇది ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన ఆసక్తికరమైన అంశం.

***ఈ వివరణ కూడా మహాభారతాన్ని, అందులోని స్త్రీపర్వాన్ని గుర్తుచేస్తుంది. అలాగే, రామాయణాన్ని కూడా.  ట్రోజన్ యుద్ధం హెలెన్ కోసం జరిగితే, ఒక కోణం లోంచి చూసినప్పుడు మహాభారతయుద్ధానికి కేంద్రబిందువు ద్రౌపది. రామ, రావణయుద్ధానికి కేంద్రబిందువు సీత.

****మహాభారతకర్త వ్యాసుడు కూడా ద్వీపంలోనే జన్మించాడు. అందుకే ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు(కృష్ణ=నల్లనివాడు, ద్వైపాయనుడు=ద్వీపంలో జన్మించినవాడు) అనే పేరు వచ్చింది.  హోమర్ కు, ఆయనకు మరికొన్ని పోలికలు ఉన్నాయి.

 

 

 

మీ మాటలు

 1. సుందరం says:

  శ్రీ భాస్కరం గారూ,
  మీ ఈ 28 వ్యాస పరంపరలో ఇంచుమించు మమ్మల్ని కూడా ‘స్లీమస్’ తో పాటు ప్రయాణం చేయించి, ఒక తోటి ప్రయాణికుడికి కలిగే ఉత్కంఠ రేకెత్తించారు. మళ్లీ తొందరలో ‘మహాభారతం’ వైపు వస్తారని భావిస్తున్నాను.
  సుందరం

  • భాస్కరం కల్లూరి says:

   సుందరంగారూ…స్లీమన్ కథ మీలో ఉత్కంతను రేపుతున్నందుకు సంతోషం. కృతజ్ఞతలు. ఇంతవరకు వచ్చిన (స్లీమన్ కథ మినహా) నా ‘పురా’గమనం వ్యాసాలను అచ్చుకు సిద్ధం చేసే పని వల్ల, ఇతర పనులవల్ల వెంటనే నా వెనకటి ‘పురా’గమన వ్యాసపరంపరను కొనసాగిద్దామా వద్దా అన్న డోలాయమానంలో ఉన్నాను. అలాంటి స్థితిలో మీ ఆహ్వానం ఆ వైపు ప్రలోభ పెట్టి ఉత్సాహం నింపుతోంది…చూడాలి, ఏం జరుగుతుందో!

 2. Srinivas Vuruputuri says:

  ప్లీజ్, ఆపవద్దు. మీ మహాభారత వ్యాసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి. అన్నట్లు, అప్పుడెప్పుడో మీరు సాక్షిలో రాసిన వ్యాసాలను కూడా అచ్చు వేస్తున్నారా, భాస్కరం గారూ?

  • భాస్కరం కల్లూరి says:

   శ్రీనివాస్ గారూ…ధన్యవాదాలు. సుందరం గారూ, ఆ తర్వాత మీరూ అన్న ఈ ఉత్సాహకర వాక్యాలు నన్ను మళ్ళీ ఆ వ్యాసపరంపర రోజుల్లోకి తీసుకువెళ్ళాయి. వాటి పునః ప్రారంభానికి ఇవి నా మనసులో తగిన పూర్వరంగాన్ని రచిస్తున్నట్టు అనిపిస్తోంది. జిజ్ఞాస, విజ్ఞత కలిగిన పాఠకుల ఆసక్తే ఏ రచనకైనా ఇంధనం అవుతుంది. అన్నీ అనుకూలిస్తే తప్పక మళ్ళీ ప్రారంభిస్తాను. ప్రారంభించడమంటే మరోసారి అపారసముద్రంలోకి లంఘించడమే.

   నా సాక్షి వ్యాసాలు అన్నప్పుడు ఏ వ్యాసాల గురించి అంటున్నారో అర్థం కాలేదు. వాటి స్వభావం వేరు అనుకుంటాను. బహుశా ‘మహాభారతం మరియు గాన్ విత్ విండ్’ గురించి అంటున్నారా? అది ఒక పుస్తకం కాదగిన చిన్న వ్యాసం.

 3. Srinivas Vuruputuri says:

  సాక్షి కాదేమో – వార్త కాబోలు. జనమేజయుడి సర్పయాగం గురించి రాసిన వ్యాసాలు…

  మీరిప్పుడే ప్రస్తావించిన ‘మహాభారతం మరియు గాన్ విత్ విండ్’ వ్యాసానికి లింకు ఏమైనా ఇవ్వగలరా?

 4. విన్నకోట నరసింహారావు says:

  శ్రీ భాస్కరం గారూ, అథోజ్ఞాపికలలో (***) మీరన్నట్లు నిస్సందేహంగా రామరావణ యుద్ధానికి సీతే కేంద్రబిందువు, ట్రోజన్ యుద్ధం హెలెన్ గురించే జరిగింది. కానీ, మహాభారత కథలో ద్రౌపది విశిష్ట స్ధానం కలిగున్నా, యుద్ధం మాత్రం రాజ్యంలో వాటా కోసమే జరిగిందని, మొదట్నుంచీ ఆ కథ దాయాదులపోరు గురించేననీ, అందువల్ల ఆ మహాసంగ్రామానికి ద్రౌపది కేంద్రబిందువు అనలేమనీ నా అభిప్రాయం.

 5. భాస్కరం కల్లూరి says:

  అందుకే, “ఒక కోణం లోంచి చూసినప్పుడు” అన్నాను చూడండి. దుర్యోధనుడు పూర్తి రాజ్యాన్ని కోరుకున్నాడు కానీ, యుద్ధాన్ని కాదు. ధర్మరాజు అర్థరాజ్యాన్ని, కాకపోతే కనీసం అయిదూళ్లను కోరుకున్నాడు కానీ, యుద్ధాన్ని కాదు. అర్జునుడు కూడా యుద్ధమనగానే విషాదానికి లోనయ్యాడు కానీ యుద్ధాన్ని కోరుకోలేదు. భీముడు యుద్ధాన్ని కోరుకున్నా, అన్న మాటకు అతను బందీ. ఇక మిగిలింది కృష్ణ(ద్రౌపది), కృష్ణుడు. కృష్ణ మనసావాచా యుద్ధాన్ని కోరుకుంది. కృష్ణుడు పాండవుల వెనక ఉండి యుద్ధాన్ని నడిపించాడు. యుద్ధం మొత్తానికి నువ్వే కారణ మంటూ ఉదంకుడనే ఋషి నుంచి తీవ్ర నింద పొందాడు. గాంధారి నుంచి శాపం పొందాడు. కృష్ణ, కృష్ణుల నామసామ్యం ఇక్కడ విచిత్రంగా లేదూ?!

మీ మాటలు

*