కసబ్.గాంధీ @ యారవాడ.ఇన్

 

 

 మూలం: పంకజ్ సుబీర్                         అనువాదం : శాంత సుందరి రామవరపు

~

pankaj

 

పంకజ్ సుబీర్ – 2 కథా సంపుటులూ , 2 నవలలూ  ప్రచురించారు . ‘ యే వో సహర్ తో నహీం ‘ అనే నవలకి 2009 లో జ్ఞాన్ పీఠ్ వారి ‘యువపురస్కారం ‘ లభించింది. ఇవి కాక ఎన్నో కథా సంకలనాలకి సంపాదకత్వ బాధ్యత నిర్వహించారు .ఇండియా నుంచీ కెనడా నుంచీ వచ్చే హిందీ  పత్రికలకి  సంపాదక సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరి కథలను ఆడియో ,వీడియోలుగా విడుదల చేశారు . ఒక కథ సినిమాగా విడుదలకి సిద్ధంగా ఉంది. 

peepal-leaves-2013

 

గాలి బరువెక్కింది. ఈ గోడలకి అలా గాలి బరువెక్కడం అలవాటే. అలవాటు ఎందుకంటే ఈ గోడల్లో తరచు ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఇవాళ కూడా ఒత్తిడి ఉంది. దానికి కారణం సీ-7096. అది నవంబర్ నెలలో ఒక రాత్రి. సరిగ్గా ఒక వారం రోజుల క్రితం దేశం నలుమూలలా ఎక్కడ చూసినా విస్ఫోటనాలే, అవి దీపావళి టపాకాయల పేలుళ్ళు.

ఇవాళ మళ్ళీ మంగళవారం. మళ్ళీ పేలుళ్ళకి సిద్ధం అవుతున్నారు. పేల్చేందుకే సీ-7096 ని ఇక్కడికి తీసుకొచ్చారు. పాతికేళ్ళ సీ-7096 వల్లే ఇక్కడ గాలి ఇంత బరువుగా ఉంది.

సీ-7096 మౌనంగా ఉన్నాడు. ఇక అతనికి మౌనం తప్ప ఇంకేమీ మిగల్లేదు. బుర్రలో ఆలోచనలు మాత్రం సుళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాటిని పంచుకునేందుకు అక్కడెవరూ లేరు.రాత్రి చిక్కబడుతోంది. మెలకువగా ఉన్న సీ-7096 వేకువ శబ్దాలని వినేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వేకువ అతనికోసం అనంతమైన రాత్రిని మోసుకు రాబోతోంది.

ఇక్కడికి వచ్చే ముందు సీ-7096 సత్యం అనే విషయాన్ని తీసుకుని  ఒక వ్యక్తి చేసిన ప్రయోగాల గురించి చదివాడు. ఆ ప్రయోగాలు అతన్ని ఆశ్చర్యపరిచాయి. అతనికి వాళ్ళు చెప్పిన సత్యానికీ దానికీ ఎక్కడా పోలికే లేదు. ఆ సత్యం పూర్తిగా కొత్త రూపంలో అతనికి సాక్షాత్కరించింది. ఇప్పుడు అంతిమ సత్యాన్ని ఎదుర్కోబోతున్నాడతను. అతనికి తెలిసిన సత్యాలు గుర్తుకు రాసాగాయి. భయకంపితులై, హడిలిపోయి పరిగెత్తే జనం. వాళ్ళలో స్త్రీలూ, పిల్లలూ, వృద్ధులూ కూడా ఉన్నారు. కలాష్నికోవ్ లోంచి పేలిన మందుగుండు దెబ్బకి నేల మీద గుట్టలు గుట్టలుగా ఒరిగిపోయారు. ఇంకో రోజు బతికేందుకు బైటికి వచ్చిన జనం…వాళ్ళతో తను కూడా చనిపోదామనుకునే వచ్చాడు, కానీ అలా ఎక్కడ జరిగింది? బతికిపోయాడు. ఈ నాలుగేళ్ళు గడపడం కోసమే ప్రాణాలతో బైటపడ్డాడు.

ఈరోజు తనని తెచ్చి ఉంచిన చోట ఎనభైయేళ్ళ క్రితం సత్యంతో ప్రయోగం చేసిన ఆ వ్యక్తి కూడా ఉండేవాడని అతనికి తెలుసు. ఈ గోడలు అందర్నీ చూశాయి. సత్యం తో ప్రయోగాలు చేసే వాళ్ళనే కాక అసత్యంతో ప్రయోగాలు చేసేవాళ్ళని కూడా చూశాయి. అర్ధరాత్రి కావచ్చింది. సీ-7096 గోడలని తాకి వాళ్ళ స్పర్శని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. వీటిలో ఒకటి ఆ స్పర్శ కూడా ఉండచ్చు!

గోడ మీద ఒక నీడ కనిపించింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆ నీడ నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకి వచ్చింది. అతనికి ఇంకా భయం వేసింది. నీడ సరిగ్గా అతని ముందు వచ్చి నిలబడింది. ఈ నీడని అతను ఫొటోల్లో చూశాడు. దీనికి కొన్ని గుర్తులున్నాయి, వాటిని బట్టి ఎవరైనా ఆ నీడని గుర్తుపట్టగలరు. సీ-7096 కూడా వాటిని బట్టే ఆ నీడని గుర్తించాడు. కానీ ఏం చెయ్యాలో అతనికి పాలుపోలేదు. ఆ నీడ మొహం ఇప్పుడు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. దాన్నిప్పుడు నీడ అని కూడా అనలేడు. గుండ్రటి ఫ్రేమున్న కళ్ళద్దాల్లోంచి వయసుమళ్ళిన ఆ నీడ కళ్ళు తననే చూస్తున్నాయి. ఈరోజు ఆ నీడ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి. కింద అదే అందరికీ చిరపరిచితమైన పంచెకట్టు, కానీ పైన ముతక ఖద్దరుతో నేసిన ఖైదీలు వేసుకునే మురికి చొక్కా. దానిమీద తోలుతో చేసిన చిన్న బిళ్ల వేలాడుతోంది. ఆ బిళ్ళమీద 189 అనే అంకె ఉంది. మొహాన అదే చిరునవ్వు…అది ఆయన ట్రేడ్ మార్కు! సీ-7096 కళ్ళూ కళ్ళజోడులోంచి చూస్తున్న ఆయన కళ్ళూ కలుసుకున్నాయి. సీ-7096 కి చాలా ఇబ్బందిగా అనిపించింది.

“ఎలా ఉన్నావు?”అంటూ నవ్వే పెదవుల్లోంచి ఒక ప్రశ్న వినిపించింది. సీ 7096 అయోమయంలో పడ్డాడు.

“మీరు నన్నేనా అడుగుతున్నది?”అని ప్రశ్నకి ప్రశ్న బదులిచ్చాడతను.

“ఇక్కడున్నది మనమిద్దరమే కదా? మరి నిన్ను తప్ప ఇంకెవర్ని అడుగుతాను?” 189 శాంతంగా నవ్వుతూ అన్నాడు.

“అదికాదు, ఈ రాత్రివేళ ఇక్కడ  నన్నా ప్రశ్న అడగడం గురించి అంటున్నాను.ఏం జరిగిందో మీకు తెలీదా?”అన్నాడు సీ 7096 పొడిగా. అది వినగానే 189 మొహం మీది నవ్వు వెలిసినట్టయింది. నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళు కూడా మెరుపు తగ్గాయి. 189 బోసి నోటితో గాలి నెమరేస్తూ, చేతిలోని కర్రని గోడకి ఆనించి కింద కూర్చునేందుకు సిద్ధమయాడు. అది చూసి సీ 7096 సాయం చేసేందుకు ముందుకెళ్ళాడు.

“అక్కర్లేదు,నేను కూర్చోగలను, ఇంకా అంత ముసలితనం రాలేదులే,”అని నేలమీద కాళ్ళు ఒక పక్కకి ముడుచుకుని అందరికీ బాగా పరిచయమున్న పోజులో కూర్చున్నాడు 189. మోకాళ్ళకి పైకి ఉన్న ధోవతిలోంచి అస్థిపంజరాల్లా ఉన్న రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి. 189 సూటిగా సీ 7096 కళ్ళలోకి చూసి నవ్వాడు. అంతవరకూ ఆయన్నే చూస్తున్న అతను ఆయన అలా చూసేసరికి తడబడ్డాడు. అతని తడబాటుకి ఆయనకి ఇంకా నవ్వొచ్చింది.

“ఎలా ఉన్నావని ఇవాళే అడగాలి,”అన్నాడు 189, ఇవాళే అనే మాటని ఒత్తి పలుకుతూ. సీ 7096 జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. 189 మొలలో ఉన్న గడియారాన్ని తీసి టైమ్ చూశాడు. టైమ్ చూడగానే ఆయన కళ్ళలో కలవరపాటు కనిపించింది. తనలో తాను ఏదో గొణుక్కున్నాడు. అది సీ 7096కి వినిపించలేదు.

“ఎలా ఉన్నావో చెప్పనేలేదు నువ్వు?” అన్నాడు. బోసినోట్లోంచి మాటలు స్పష్టంగా రావడం లేదు.

“బాగానే ఉన్నాను,” అన్నాడతను నిర్లిప్తంగా “బాగున్నావా? నిజంగానా?” అన్నాడాయన. అతన్ని ఎగతాళి చేసే ఉద్దేశం 189 కి లేకపోయినప్పటికీ అతనికి అలాగే అనిపించింది.

“ఏం…ఎందుకు బాగుండకూడదు? ఏం జరుగుతోందని నేను ఆనందంగా ఉండకూడదు?” అన్నాడు అతను కొంచెం కోపంగా.

“అబ్బే,నా ఉద్దేశం అది కాదు, నేను అన్నది…”అని 189 ఏదో సంజాయిషీ ఇవ్వబోయే లోపల అతను అడ్డొచ్చి,”ఏమిటి? ఏమనాలనుకున్నారసలు? నేను భయపడాలా? బెదిరిపోయి ప్రాణభిక్ష పెట్టమని బతిమాలాలా? నా మొహంలో చావు భయం కనిపించడం లేదనా? చూడండీ, ఇదంతా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అన్నీ తెలిసే ఇక్కడికి వచ్చాను. అసలు నేను  నాలుగేళ్ళు ఆలస్యంగా వచ్చాను. నా మిత్రులు నాలుగేళ్ళ క్రితమే స్వర్గం చేరుకున్నారు!” అన్నాడు అతను అరుస్తున్నట్టుగా. గొంతులో ఉక్రోషం తొంగిచూసింది.

ఇలాంటి మాటలు వినడం 189కి అలవాటే. ఇంతకు ముందు ఎన్నోసార్లు ఉక్రోషం వెళ్ళగక్కే మాటలు విన్న అనుభవం ఉంది. వాటిని మౌనం అనే ఆయుధంతోనే ఎదుర్కొన్నాడు. ఆ తరవాత ఎవరూ మాట్లాడలేదు. సీ 7096 ఆయన జవాబు కోసం ఎదురుచూడసాగాడు.

పది నిమిషాలు,పదిహేను నిమిషాలు గడిచాయి…గడియారం ముళ్ళు ముందుకి కదుల్తున్నాయి,కానీ 189 నోరు విప్పలేదు. సీ 7096 కి ఆయన మౌనం భయం పుట్టించడం మొదలెట్టింది. గోడలమీదా, నేలమీదా కేవలం మౌనం! మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మౌనం అతనికి హాయినిస్తుంది, కానీ ఇద్దరు మనుషులున్నప్పుడు వాళ్ళ మధ్య మౌనం భయపెడుతుంది. ఎంత త్వరగా ఈ మౌనం వీడితే అంత బావుంటుందని అనిపిస్తుంది. 189 కావాలనే మౌనంగా ఉన్నాడు. ఆయనకి ఇంకోళ్ళని భయపెట్టడమంటే మహా ఇష్టం. అలా భయపెట్టేందుకు ఆయన ఎన్నో మార్గాలు అనుసరిస్తాడు, మౌనవ్రతం చేపట్టడం, నిరాహారదీక్ష చెయ్యడం లాంటివి. ఒక్కోసారి ఆయన చిరునవ్వు కూడా అవతలివారిని భయపెడుతుంది.

సీ 7096 అలజడికి గురవుతున్నాడు. లోలోపల ఆ అలజడి క్షణం క్షణం పెరిగిపోతోంది.

దాన్నించి తప్పించుకునేందుకు ఏదో ఒకటి మాట్లాడాలనిపించి,” మీరు వేసుకున్న జైలు దుస్తులు ఇక్కడివి కానట్టుందే?” అన్నాడు.

“ఇదా?”అంటూ 189 తన చొక్కాని చేత్తో తడుముతూ దానికున్న నంబరు బిళ్ళని వేళ్ళతో పట్టుకుని, “ఇది ఇక్కడిది కాదు, సౌత్ ఆఫ్రికాది. నేను మొదటిసారి జైలుకెళ్ళినప్పుడు ఇచ్చారు దీన్ని”అన్నాడు.

“మరి ఇక్కడ ఈ దుస్తులు…?”అన్నాడు సీ 7096.

“జైళ్ళు మారతాయి కానీ దుస్తులు ఎక్కడైనా అవే, జైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి. మొదటిసారి ఈ దుస్తులు వేసుకున్నామంటే ఇక జీవితాంతం ఒంటికి అతుక్కుపోయి వదలవు. జైల్లో ఉండడం నీకు అవస్థగా ఉందేమో కాని నిజం చెప్పాలంటే ఇదొక వ్యవస్థ. ఈ అవస్థనీ, వ్యవస్థనీ అర్థం చేసుకున్నావనుకో, ఇక నా సౌత్ ఆఫ్రికా దుస్తులు కూడా నీకు అర్థమవుతాయి”అన్నాడు 189 ఇంకా గూఢంగా నవ్వుతూ.

ఆ నవ్వు చూస్తే సీ 7096 కి చెప్పలేనంత ఇబ్బందిగా ఉంది. అతనికి ఇలాంటి నవ్వు చూడడం అలవాటు లేదు.

“అసలు మీరిక్కడికి ఎలా…నా ఉద్దేశం, మీరిక్కడే ఉంటున్నారా? రాజధానిలో ఉంటారని విన్నానే?” 189 మళ్ళీ మౌనం దాలుస్తాడేమో అనే భయంతో సీ 7096 ఏదో ఒకటి మాట్లాడాలని తడబాటుకి గురవసాగాడు. ఆయనతో వ్యక్తిగత విషయాలు చనువుగా మాట్లాడాలని ప్రయత్నించడం మొదలెట్టాడు. ఆయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకపోతే తనకి మతిపోయేట్టుంది.

అదే భంగిమలో కూర్చుని 189 తలెత్తి సీ 7096 వైపు చూశాడు. ఎన్నో ఏళ్ళ అనుభవంతో ఇక మౌనం వహించాల్సిన అవసరం తీరిపోయిందని గ్రహించాడు.

“ఎంతసేపని నిలబడే ఉంటావు,కూర్చో,” అంటూ కుడిచేత్తో కూర్చోమని సైగ చేశాడు. ఎవరో కీ ఇచ్చినట్టు సీ 7096 ఎదురుగా ఉన్న గోడకి ఆనుకుని కూర్చున్నాడు. మౌనం అనే మంత్రం ఫలించింది. 189 ఎప్పుడూ అవతలివాళ్ళు తన మాట వినేట్టు చేసేందుకూ, అన్నీ తన పక్షం ఉండేట్టు చూసేందుకూ ఈ మంత్రాన్నే ఉపయోగించేవాడు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అది ఎప్పుడూ తన ప్రభావాన్ని చూపించకుండా ఉండలేదు. కర్ణుడి శాపంలా విచిత్రంగా అన్నిటికన్నా ఎక్కువ అవసరం ఉన్నప్పుడే ఈ మంత్రం పనిచెయ్యకుండా పోయింది!

ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎదురు బొదురుగా కూర్చున్నారు. 189 మౌనాన్ని వీడాడు, కానీ ఆ సంగతి సీ 7096 కి తెలియకూడదనీ, అతన్ని ఇంకా తన మౌనంతో భయపెట్టాలనీ ఆయన అనుకున్నాడు. ఎప్పుడైనా ఆ మౌనాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుందని అతనికి తెలియాలన్నది ఆయన ప్రయత్నం.

“నేనిక్కడే ఉన్నానే…అప్పట్నించీ ఇక్కడే ఉన్నాను, రాజధానిలో నాకు ఇంకేం మిగిలిందని? నీలాగే నేను కూడా నాలుగేళ్ళనుంచీ ఇక్కడికి రావాలనుకుంటున్నాను. వాళ్ళిద్దర్నీ పోగొట్టుకుని వెనక్కి వచ్చి నాలుగేళ్ళయింది. అప్పట్నించీ ఇక్కడికి రావాలనే అనుకుంటూ ఉన్నాను. వాళ్ళిద్దరూ ఇక్కడే నిద్రపోతున్నారు, వాళ్ళని వదిలి ఎలా వెళ్ళగలను? కానీ పని పూర్తి కాలేదు. ఇక అయిపోతుందనుకునే సమయానికి మరెవరికో నా అవసరం పడింది. అయినా ఇప్పుడు కాకపోతే తరవాతైనా నేనిక్కడికి రావలసినవాణ్ణే” అన్నాడు 189. ఆ మాటల్లో ఏదో గూఢార్థం ఉన్నట్టు అనిపించింది సీ 7096 కి.

“జైల్లో ఉన్నాను, కానీ రెండోసారి నన్ను మహల్ లో ఉంచారు…ఆగాఖాన్ మహల్ లో. రెండూ ఇక్కడే యారవాడ లోనే ఉన్నాయి. ఇక్కడికి దగ్గర్లోనే ఉంది ఆ మహల్. అందుకే ఇక్కడికీ అక్కడికీ తిరుగుతూ ఉంటాను”

“నేనేమో 2012 లో వచ్చాను, విచిత్రంగా ఉంది కదూ…32,42,12…” అన్నాడు సీ 7096 ఏదో కొత్తవిషయం కనిపెట్టినట్టు.

“అవును విచిత్రమే, కానీ నేను రావడం, నువ్వు రావడం ఒకటి కాదు. ఒకటే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తేడా ఉంది…చాలా పెద్ద తేడా. నువ్వింకా చిన్నవాడివి. పాతికేళ్ళు నీకు. అందుకే ఆ తేడా ఎలాటిదో అప్పుడే నీకు అర్థం కాదు,” అన్నాడు 189 తనమాటకి తిరుగులేదన్నట్టు. సీ 7096 జవాబు చెప్పలేదు.

“నలభైరెండులో వచ్చినప్పుడు బా, మహాదేవ్ ఇద్దరూ నావెంట ఉన్నారు. మహాదేవ్ ఆరు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు”అంటూ ఉంటే 189 గొంతు గద్గదమైంది. నలభైరెండు,ఆగస్టు పదిహేనో తేదీన వెళ్ళిపోయాడు మహాదేవ్. నేను అతన్ని ఎన్నిసార్లు పిలిచినా లాభం లేకపోయింది. మామూలుగా అతను నామాట జవదాటడు…కానీ ఆరోజు అతన్ని ఆగాఖాన్ మహల్ లోనే పడుకోబెట్టేశారు” తనగొంతులో ఎలాంటి భావోద్రేకమూ పలకకుండా 189 జాగ్రత్త పడ్డాడు.

“ఆ తరవాత రెండేళ్ళకి ఫిబ్రవరి ౨౨ న బా కూడా…ఇద్దరూ ఒకరి తరవాత ఒకరు వెళ్ళిపోయారు. నేను ఒంటరిగా మిగిలాను. బా కూడా ఆ మహల్లోనే శాశ్వతంగా నిద్రపోయింది. నా రెండు చేతులూ అక్కడ నిద్రపోతున్నాయి. ఇద్దరి జ్ఞాపకంగా అక్కడ ఒక ఆలయం లాంటిది కట్టించారు. నేను జైల్లోంచి విడుదలైనప్పుడు నాకు చేతుల్లేవు! ఆసరికి బైటి ప్రపంచం కూడా చాలా మారిపోయింది. నలభై నాలుగులో ఇక్కణ్ణించి విడుదల పొంది రాజధానికి వెళ్ళాను, నలభై ఎనిమిదిలో అక్కణ్ణించి బైటపడి మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను. రాజధానిలో ఇక చెయ్యవలసిన పనులేవీ లేవనిపించింది. పైగా నావల్ల రాజధానికి కూడా ఎటువంటి ప్రయోజనమూ లేదని అనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను. వీళ్ళిద్దరికోసమే నేనిక్కడ ఉంటున్నాను. ఇంకెక్కడికీ వెళ్ళేది లేదు!” 189 చివరి వాక్యం గొణిగినట్టు అన్నాడు.

“ఆవిడ పోయాకే మీకు ఆవిడ విలువ తెలిసొచ్చిందా?” చాలాసేపటికి సీ 7096 నోటినుంచి ఈ చిన్న వాక్యం వచ్చింది. ముసలి కళ్ళజోడుకి ఆ ప్రశ్నలోని సెగ తగిలి కళ్ళు పైకి లేచాయి. ఆ కళ్ళు సూటిగా సీ 7096 కళ్ళలోకి చూశాయి. ఈసారి సీ 7096 మొహం మామూలుగా ఉంది. 189 వ్యక్తిత్వం ప్రస్తుతం అతన్ని ప్రభావితం చెయ్యడం మానేసింది. 189 కి సీ 7096 కళ్ళలో నిప్పు సెగ కనిపించింది. ఎన్నో ఏళ్ళ క్రితం ఒక కంటికి మాత్రమే లెన్స్ పెట్టుకున్న ఒక వ్యక్తి కళ్ళలో ఇదే సెగ చూశాడు 189. కానీ ఆయనకి ఇలాంటివి అలవాటే.

“అదేం లేదు, నాకు బా విలువ ఎప్పట్నుంచో తెలుసు. అందుకే నేను కూడా ఆవిణ్ణి బా అనే పిలిచేవాణ్ణి”189 గొంతు విచిత్రంగా వణికింది. అది మరీ వినీ వినిపించనట్టుండి సీ 7096 కి తెలియలేదు.

“అందుకేలాగుంది జీవితాంతం ఆవిణ్ణి పట్టించుకోలేదు మీరు!”వాక్యం చిన్నదే అయినా సీ 7096 అన్న మాటల్లో లోతైన అర్థమే ఉంది.

“అదేం కాదు.ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు ఎంతో చదావాలి. గొప్ప పనులు చెయ్యాలని నడుం కట్టుకున్నప్పుడు కుటుంబాన్ని కొంత వదులుకోవలసి వస్తుంది. తమ కుటుంబం ఇక విస్తృతమైపోయిందనీ, ఇతరులకి కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉందనీ వాళ్ళు తెలుసుకోవాలి. బుద్ధుడైనా,రాముడైనా,కృష్ణుడైనా, ఏసుక్రీస్తయినా, చివరికి మహమ్మద్ ప్రవక్తైనా సరే కుటుంబం మీద వ్యామోహం వదులుకోవలసిందే!”189 తన వాదనని సమర్థించుకునేందుకు జవాబు చెప్పాడు.

గోడలకవతల రాత్రయింది కానీ నిశ్శబ్దంగా లేదు. ఇక్కడ రాత్రి నిశ్శబ్దంగా ఉండదు. ఈ రోజూ అంతే. అసలు అదంతా జరగబోయే ముందటి రాత్రి నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది?

“కుటుంబ సభ్యులు కూడా మనమీద మమకారం చంపుకోవలసిందే. లేకపోతే అర్ధరాత్రి, నిద్రపోతున్న భార్యని వదిలి సత్యాన్ని తెలుసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళేవాడిని ఎవరు సమర్థిస్తారు …?” 189 గొంతు బాగా తగ్గించి ఈ మాటలు అన్నాడు. ఆ తరవాత ఇద్దరి మధ్యా మౌనం రాజ్యమేలింది. సీ 7096 తదేకంగా 189 చేతుల వైపే చూడసాగాడు… ’ఆజానుబాహువు!’ అనుకున్నాడు.

“నేను కూడా నా కుటుంబాన్ని వదిలి ఈ అడవిలోకి వచ్చేశాను…!”అన్నాడు సీ 7096 తలెత్తకుండా. మళ్ళీ “అమ్మనీ, నాన్ననీ, చెల్లినీ, ఇద్దరు తమ్ముళ్ళనీ వదిలి… శాశ్వతంగా…నేనిక్కడ ఉన్నానని మా అమ్మకి తెలియనుకూడా…” అతను వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు.

“తేడా ఉంది. నువ్వు నీ కుటుంబానికి ఏదో చెయ్యాలని వాళ్ళని వదిలి వచ్చావు. దేశం కోసమో సమాజం కోసమో కాదు. అలాటిదేదైనా చేసి ఉంటే విషయం వేరుగా ఉండేది” అన్నాడు 189 కొంచెం కోపంగా.

“మీరు పేదరికాన్ని చూడలేదు, అనుభవించలేదు. అందుకే ఇలాటి మాటలు మీరు సులభంగా అనేస్తున్నారు. ఇంట్లో మీ తోడబుట్టినవాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటే, మీ తలిదండ్రులు పేదరికం కోరల్లో చిక్కి క్రమంగా మృత్యువుకి చేరువవుతూ ఉండడం చూస్తూ ఉంటే, అప్పుడిక దేశం, సమాజం లాటివి గుర్తుండవు. అప్పుడు గుర్తుండేది ఒక్కటే…ఆకలి…ఆకలి…ఆకలి”అన్నాడు సీ 7096 ఆవేశంగా.

“మా కుటుంబంలో మొత్తం ఆరుగురం. సంపాదించేది మాత్రం ఒక్కరే.అది కూడా నికరంగా చేతికి వచ్చే నెలజీతం కాదు. చేతికి డబ్బులు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావో తెలీని పరిస్థితి. నాలుగో తరగతి దాకా చదివాక చదువు మానెయ్యాల్సి వచ్చింది. ఆ తరవాత చేసేందుకేమీ లేకుండా పోయింది. ఏం చేస్తాను?ఇలాటి పని చెయ్యకపోతే…?”189  అతని బాధని అర్థం చేసుకుని మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు. సీ 7096 పిడికిళ్ళు బిగిశాయి. బహుశా ఏడుస్తున్నట్టున్నాడు. కానీ 189 కి అతని ఏడుపు వినపడడం లేదు.

“మీరు చెప్పిన మహనీయులందరూ మహళ్లలో ఉండేవారు. వాళ్ళలో ఎవరూ పేద కుటుంబానికి చెందినవాళ్ళు కారు. పేద ఇంట్లో పుట్టి ఉంటే సత్యాన్ని వెతుకుతూ అడవుల్లోకి వెళ్ళవలసిన అగత్యం ఉండేది కాదు, ఇంట్లోనే సత్యం సాక్షాత్కరించి ఉండేది” సీ 7096 ఏడవడం లేదు. అతని గొంతు స్పష్టంగా ఉంది.

“మా నాన్నే స్వయంగా నన్ను ఈ మనుషులకి అప్పగించాడు. ఏ తండ్రైనా తన పిల్లల్ని మృత్యువు ఒడిలోకి పంపుతాడా? పంపడు కదా? కానీ అలాటిది నాకే జరిగింది. మా నాన్నే ’వీళ్ళ వెంట వెళ్ళు, మంచి బట్టలూ, మంచి తిండీ ఇస్తారు. నువ్వు వీళ్ళతో వెళ్తే మాకు కూడా డబ్బులు దొరుకుతాయి. డబ్బుంటే నీ తోడబుట్టినవాళ్ళు సుఖంగా బతకగలుగుతారు. పెళ్ళిళ్ళు కూడా సవ్యంగా జరుగుతాయి’ అని నచ్చజెప్పి పంపించాడు.”

189 తన పొడవాటి చేతిని జాపి సీ 7096 భుజం మీద ఉంచాడు. ఆ స్పర్శ ఏదో వింత ఓదార్పునీ, ఉపశమనాన్నీ ఇచ్చినట్టు అనిపించిందతనికి. తలెత్తి 189 వైపు చూశాడు. అలవాటు ప్రకారం బోసినోటితో గాలి నములుతున్నట్టు దవడలాడిస్తూ 189 చిన్నగా నవ్వాడు.

“నాలుగో తరగతి దాకా చదివి,వెంటనే నువ్వు వీళ్ళతో చేరిపోయావా?” 189 మెత్తగా అడిగాడు.

“లేదు, కొన్నాళ్ళు ఊళ్ళోనే కూలి పని చేశాను. కానీ సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది.తరవాత పని వెతుక్కుంటూ పట్నం వెళ్ళాను. కానీ అక్కడా పని దొరక్క మళ్ళీ ఉన్న ఊరికే రావలసివచ్చింది”అన్నాడు 7096. 189 చేత్తో అతని భుజాన్ని రెండు సార్లు చరిచి మళ్ళీ తన ఒళ్ళో పెట్టేసుకున్నాడు.

“అందుకే నేను ఎప్పుడూ అనేవాణ్ణి, పల్లెల్లో అభివృద్ధి వెలుగులు ప్రసరించనంత కాలం పూర్తి స్వాతంత్ర్యం వచ్చినట్టు కాదని.ఒకరి అధీనంలో ఉన్నా, స్వతంత్రంగా ఉన్నా నగరాల్లో పెద్ద తేడా ఏమీ రాదు. నిజమైన బానిసత్వం ఉండేది పల్లెటూళ్ళలోనే. ఆ బానిసత్వం ఈనాటికీ అలాగే ఉంది. స్వాతంత్ర్యం వస్తే అసమానతల అగాధం పూడుకుంటుందని అనుకున్నాను”అన్నాడు 189. బోసినోటితో మాట్లాడుతూంటే ఉచ్చారణ తమాషాగా ఉందనిపించింది సీ 7096కి.

“ఏ స్వాతంత్ర్యం గురించి చెపుతున్నారండీ మీరు? స్వాతంత్ర్యం ఎక్కడొచ్చింది? మీ దేశంలో స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. మీ దేశంలోనే ఒక ధనవంతుడు ఐదువేల కోట్ల ఖర్చుతో ఒక భవనం కట్టించి తన భార్యకి కానుకగా ఇస్తున్నాడు. ఐదువేల కోట్లు!!! ఐదువేల కోట్లంటే ఎంతో తెలుసుకదా మీకు? అయినా మీకెందుకు తెలీదు, అన్ని నోట్లమీదా మీ ఫొటోనే కదా అచ్చు వేస్తారు? ప్రస్తుతం కరెన్సీ అంటే మీరే. ఐదువేల కోట్లతో ఎన్ని కుంపట్లు, ఎన్ని రోజులపాటు వెలుగుతాయో కాస్త లెక్క కట్టండి. అగాధం గురించి మాట్లాడుతున్నారు మహానుభావా! ప్రస్తుతం అగాధం లేదూ ఏమీ లేదు, ఆకాశానికీ నేలకీ ఉన్నంత తేడా ఉంది. అగాధమైతే పూడ్చడం సాధ్యమౌతుంది. ఆకాశానికీ నేలకీ ఉన్న దూరాన్ని దేంతో పూడుస్తారు?” సీ 7096 కి ఆవేశం ఎక్కువై 189 మీది మీదికి రాసాగాడు.

189 ని కరెన్సీ అని అవమానించాలనుకున్నాడు. కానీ 189 ఏమీ జవాబు చెప్పకుండా అతని కళ్ళలోకి లోతుగా చూసి ఊరుకున్నాడు. మళ్ళీ ఒకసారి తన జేబు గడియారాన్ని తీసి టైమ్ చూశాడు.

“మానాన్న నన్ను వాళ్ళతో పంపించేప్పుడు నా వైపు చూడకుండా, ‘బాబూ,నువ్వు వీళ్ళ వెంట వెళ్తే మాకు తిండీ బట్టా దొరుకుతాయి’ అన్నాడు,” 189 మౌనంగా ఉండడం చూసి సీ 7096 అన్నాడు.

“మరి మీ అమ్మ? ఆవిడ ఏమంది?” 189 అడిగాడు.

“నిరుపేదల ఇళ్ళలో అమ్మలు ఏమీ అనరు, ఊరికే ఏడుస్తారంతే. విషయం ఏదైనా వాళ్ళకి తెలిసింది ఏడవడం ఒక్కటే. మా అమ్మ కూడా ఏడ్చి ఊరుకుంది”అన్నాడు సీ 7096 వణికే గొంతుతో. మళ్ళీ 189 అతని భుజం తట్టి ఓదార్చాడు. గోడలు మౌనంగా అంతా చూస్తున్నాయి.

“నన్ను చంపేస్తే ఇదంతా ముగిసిపోతుందా? నాలాంటి వాళ్ళందరూ ఇక లేకుండా పోతారా? అక్కడ చాలా పేదరికం ఉంది. నిరుపేద తండ్రులు ఒక ముద్ద అన్నం కోసం ,జానెడు గుడ్డముక్క కోసం నాలాంటివాళ్ళని వీళ్ళకి అప్పగిస్తూనే ఉంటారు. అలాంటి తండ్రులు చాలా మందే ఉన్నారక్కడ. నన్ను చంపినంత మాత్రాన కథ ముగుసిపోదు. నేను ఒక చిన్న పావుని మాత్రమే. నా చావు పెద్ద లెక్కలోకి రాదు. ఒక్క పిసరు కూడా మార్పు రాదు,”అన్నాడు కసిగా సీ 7096. అతని గొంతులోని కసి 189 కి తెలిసింది.

“అందుకే విభజన వద్దని మొత్తుకున్నాను. నా శవం లేచాకే విభజన జరగాలని కూడా అన్నాను. నేను శవంగా మారినా పరవాలేదు , విభజన మాత్రం జరిగి తీరవలసిందే అన్నారు వాళ్ళు. చిరకాల స్నేహితుడే అందరికన్నా పెద్ద శత్రువుగా మారతాడని నాకు తెలుసు. విభజన జరిగాక కూడా ఇంటి గోడలు కలిసే ఉంటే అన్నదమ్ముల మధ్య అయినా ఒక్కొక్క అంగుళం కోసమూ గొడవలు రాక మానవు. ఈనాడు రెండు ముక్కలైన ఈ భాగాలు రేపు అతి పెద్ద శత్రువులై ఇద్దరి ముందూ నిలబడతాయని నాకు అప్పుడే తెలుసు. చూడు, ఇప్పుడు జరిగింది అదే కదా? నువ్వే దానికి అన్నిటికన్నా పెద్ద నిదర్శనం!” అన్నాడు 189 గొంతు తగ్గించి.

“విభజన జరగకుండా ఆపాలని చూశారా మీరు?” అని అడిగాడు సీ 7096

“శతవిధాల ప్రయత్నించాను,కానీ నామాట ఎప్పుడూ,ఎవరూ వినలేదు” అన్నాడు 189.

“ధృతరాష్ట్రుడు కూడా మహాభారత యుద్ధం జరగకుండా ఆపాలనే చూశానన్నాడు. కానీ ఆయన మాటా ఎవరూ వినిపించుకోలేదు కదా? దుర్యోధనుణ్ణి హస్తినాపురానికి రాజు చెయ్యాలనుకున్నాడనుకోండి, అది వేరే విషయం. ఆ విషయంలో మొండిపట్టు సడలించలేదు కానీ యుద్ధం మాత్రం కూడదన్నాడు. మీరు ఇంతకు ముందన్నారు, మమకారం వదులుకోవాలని, కానీ మీ కొడుకు మీద మమకారం వదులుకోలేకపోయారేం?”అన్నాడు సీ 7096.

“నాకు కొడుకు మీద మమకారమా? అసలు నన్ను బోనులో నిలబెట్టిందే నా సంతానాన్ని సరిగ్గా పెంచలేదని కదా?”అన్నాడు 189.

గోడలకి అవతల ఏదో హడావిడి వినిపిస్తోంది. ఏవో ఏర్పాట్లు చేస్తున్న చప్పుళ్ళు,గొంతు తగ్గించి ఎవరో మాట్లాడుతున్నారు. జనం హడావిడిగా అటూ ఇటూ తిరగడం వినిపిస్తోంది. ఆ చప్పుళ్ళకి సీ 7096 గాభరా పడుతున్నాడు. అతని కళ్ళు మాటిమాటికీ ఆ చప్పుళ్ళు వినవస్తున్నవైపు భయంగా చూస్తున్నాయి.

“నేను చెప్పేది మీ కన్నకొడుకు గురించి కాదు, మీరు మమకారం వదులుకోలేని కొడుకు ఒక్కడే, అతని గురించి అంటున్నాను. అధికార పీఠం మీద అతనే కూర్చోవాలని కోరుకున్నారు. ఇంకెవరూ ఆ పదవి చేపట్టడం మీకిష్టం లేకపోయింది. అలా కాకుండా మీరు మీ పట్టు విడిచిపెట్టి ఉంటే విభజన జరిగేదే కాదు. మీరు కూడా మహాభారతం జరగకూడదనీ అయినా మీ కొడుకే పదవిని అలంకరించాలనీ కోరుకున్నారు” బైటివైపు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు సీ 7096

” నేనా…? విభజన జరగకూడదని, దాన్ని ఆపాలని నేను ప్రయత్నించలేదా? నేను శాయశక్తులా ప్రయత్నించాను. ఒక ఉత్తరం కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. ‘అధికారం కావలసినవాళ్ళకి ఇచ్చెయ్యండి, కానీ విభజన మాత్రం జరగనీయద్దు’ అని రాసి మరీ ఇచ్చాను. నా మాట ఎవరైనా వింటే కదా? ఓడిపోయి ఆ ఉత్తరం పట్టుకుని వెనక్కి వచ్చేశాను. విషయం నా చెయ్యిదాటిపోయింది. వాళ్ళు స్వాతంత్ర్యం కోసం ఎటువంటి మూల్యం చెల్లించటానికైనా సిద్ధపడ్డారు. విభజన కూడా ఆ మూల్యంలో ఒక భాగమే” అన్నాడు 189 అలసిన గొంతుతో.

7096 కళ్ళార్పకుండా ఆయన్నే చూస్తున్నాడు. అతనికి 189 మొహంలో ఒక విచిత్రమైన దిగులుతో నిండిన భావం కనిపించింది. ఈనాటివరకూ అతను చూసిన ఆయన ఫొటోలు వేటిలోనూ అలాంటి దిగులు కనబడలేదు. ఎప్పుడూ ఆ బోసి నవ్వే చూశాడు.పేరు తెచ్చుకుని గొప్పవారైపోతే ఇదొక ప్రమాదం, ఎప్పుడూ అందరికీ మీరు నవ్వుతూ కనిపించాలి! దిగులు ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవాల్సిందే.

మహాత్ములు, అవతార పురుషులు ఎక్కడైనా దిగులుగా ఉంటారా? వాళ్ళే దిగులు పడితే మామూలు మనుషులకి వాళ్ళమీదున్న భ్రమ తొలగిపోతుంది కదా! మామూలు మనుషులు తమ దిగులుకి పరిష్కారాలని వీళ్ళ దగ్గరే వెతుక్కుంటారు. వీళ్ళే దిగులు పడితే వీళ్ళని ఎవరు పట్టింగహుకుంటారు? సీ 7096 ఆయన అన్న మాటలకి ఘాటైన సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అతని దగ్గర అలాంటి సమాధానం ఉంది. కానీ 189 మొహంలో దిగులు అతన్ని ఇబ్బంది పెట్టింది. ఎందుకో గాని ఆయన్ని మరింత బాధ పెట్టేందుకు అతని మనసు ఒప్పుకోలేదు.

” కానీ…కానీ మీరు తల్చుకుంటే అది సాధించటం సాధ్యమయేదే. మొత్తం మీ చెయ్యి దాటిపోయిందనటం సరికాదు. జనం మీ వెంటే ఉన్నారు. మీ మాటలు విన్నారు, మీ మాటకి విలువిచ్చారు. ఆ ఉత్తరం పట్టుకుని రోడ్డుమీదికొచ్చి, జనానికి నచ్చజెప్పి ఉంటే, వాళ్ళు మీ మాట వినేవాళ్ళు కారూ? తప్పకుండా వినేవాళ్ళే. కానీ మీరు పుత్ర వాత్సల్యంలో…మీ మానస పుత్రుడి మీది మమకారంలో పడి అన్నీ వదిలేశారు. మీ శవం మీదే విభజన జరగాలి అన్నప్పుడు విభజనకి ముందు మీరు శవంగా మారలేదేం? లేదు, మీరు నిజంగా అడ్డుకోవాలనుకుంటే విభజన జరక్కుండా చూసేవారే. మీ పుత్త్ర ప్రేమ అడ్డొచ్చింది. అప్పుడు మొదలైన ఆ మహాభారతం ఈనాటివరకూ కొనసాగుతూనే ఉంది” కటువైన మాటలు అనకూడదని సీ 7096 చాలా ప్రయత్నించాడు, కానీ వేగంగా గడిచిపోతున్న సమయం ఇక కాలం తన చేతిలోంచి ఇసుకలా జారిపోతోందని చెపుతున్నట్టు అనిపించింది. ప్రవహించే కాలం అతనికి మిగిలిఉన్న క్షణాలని దోచుకుంటున్నట్టు అనిపించింది. ఇంక ఎక్కువ సమయం లేదేమో! అందుకే మనసులో ఉన్నదంతా కక్కేస్తున్నాడు. ఈ సారి 189 అతని మాటలకి జవాబు చెప్పలేదు.

“మీరు దాన్ని ఆపి ఉండచ్చు. జనం మీ మాట వినేవారు,”అంటూ మళ్ళీ గొణిగాడు సీ 7096.

“ఆ ఉత్తరంలో నేను రాసినదానికి వాళ్ళు ఒప్పుకున్నట్టయితే నేను దేశమంతటా తిరిగి జనాలని ఒప్పిస్తానని చెప్పాను. కానీ ముందు నావాళ్ళు అందులోని విషయాలని ఒప్పుకోవాలి. వాళ్ళే కాదన్నాక నాకింక వేరే దారి లేకపోయింది. ఇక దాన్ని తీసుకెళ్ళి లూయిస్ కి ఇచ్చెయ్యాల్సి వచ్చింది. నేను అనుకున్నది సాధించలేక పోయానని ఓటమిని అంగీకరించటం తప్ప చేసేదేమీ లేకపోయింది. నా చేతిలో ఏమీ లేదనీ, మీరు ఎలా కావలిస్తే అలా చెయ్యండనీ అన్నాను. అసలు నా నా చేతిలో ఏమైనా ఎలా ఉంటుంది? వాళ్ళ పార్టీని నేను వదిలిపెట్టి ముప్ఫైనాలుగేళ్ళయింది. వాళ్ళ ధోరణి బొత్తిగా నచ్చక వదిలేశాను,” అన్నాడు 189. ఆయన తనలో తనే మాట్లాడుకుంటున్నంత నెమ్మదిగా మాట్లాడాడు.

“మాకు మావాళ్ళు ఏం చెపుతారో తెలుసా? విభజన జరిగినప్పుడు అటువైపువాళ్ళు మా హక్కులన్నిటినీ కాజేశారని అంటారు. అందుకే మా దేశంలో అంత పేదరికం ఉందని చెపుతారు. మమ్మల్ని వెళ్ళి మా హక్కుల్ని సాధించుకు రమ్మని పంపిస్తారు. నాకూ అదే చెప్పారు”అన్నాడు సీ 7096.

“ఈనాటి వరకూ ఎప్పుడు ఏ విభజన జరిగినా పెద్దవాడే నిందని భరిస్తున్నాడు. తమ్ముడి వాటాని దోచుకున్నాడని అన్ననే దోషిగా నిలబెడతారు. తమ్ముడు అన్నకి అన్యాయం చేశాడని ఎప్పుడూ అనరు. అన్న అవడంలో ఇది కూడా ఒక సమస్యే. సాఫల్యం సాధించలేని ప్రతి సమాజమూ తన ఓటమికి కారణాలని బైటే వెతుక్కుంటుంది. మనం తయారుచేసిన ఈ సమాజం అసమానతలమీద నిలబడి ఉంది. ధనవంతుడు రోజు రోజుకీ మరింత ధనవంతుడైపోతూ ఉంటాడు, పేదవాడు మరింత అధోగతికి దిగజారిపోతూ ఉంటాడు.

“నువ్వు చెప్పే పేదరికం ఇక్కడా ఉంది. అంతే ఉందో ఇంకా ఎక్కువే ఉందో! నీకు ఆట్టే సమయం లేదు లేకపోతే తీసుకెళ్ళి చూపించేవాణ్ణి. నేను దేశమంతా తిరిగి చూసిన పేదరికాన్ని నీకూ చూపించేవాణ్ణి. బైటికి ప్రదర్శించేట్టు అంత గొప్పగా ఏం లేదు ఈ దేశం. నగరాల్లోని వెలుగులు చిమ్మే రహదారులనే చూపిస్తారు, చీకటి సందులూ, గొందులూ, ఆకలితో అలమటించే పల్లెల్లోని మట్టి కాలిబాటలూ ఎవరు చూపిస్తున్నారు? స్వాతంత్ర్యం మొత్తంగా పెద్ద పెద్ద ఇనప్పెట్టెలు నింపుకోవడానికే పనికివచ్చింది. అంత పెద్ద పోరాటమూ వ్యర్థమైపోయింది…ఏమీ సాధించలేదు…ఇప్పుడనిపిస్తుంది…అనవసరంగా అంత శ్రమపడ్డామేమోనని…అంతా వృథా…వృథా అయింది…” అని 189 తన చేతితో సీ 7096 వేళ్ళని తాకాడు.

“కావాలంటే నన్ను మీవెంట తీసుకెళ్ళి మీ దేశం చూపించండి. మీమాట ఎవరు కాదంటారు? రేపు జరగవలసినది కొన్ని రోజులకివాయిదా వేస్తారు, అంతే. మీతో వచ్చి మీ దేశం చూశాక మళ్ళీఇక్కడికే వచ్చేస్తాను. నాకు జరగబోయేదాన్ని గురించి నేనుభయపడటం లేదు.కానీ ఈ లోపల నేను చూసి, అనుభవించివచ్చిన పేదరికం లాంటిదే ఇక్కడ కూడా ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. ముందు మనిద్దరం ఇక్కడి పేదరికాన్ని చూద్దాం. తరవాత మీరు నావెంట వచ్చి అక్కడ ఉన్నపేదరికాన్నీ, ఆకలినీ చూద్దురుగాని. స్వాతంత్ర్యం రాకముందు అక్కడిపరిస్థితి మీరు చూసే ఉంటారు, కానీ తరవాత ఎలా ఉందోచూడాలిగా!” ఇంకా ఆయన వేళ్ళమీద తన వేళ్ళు అలాగే ఉంచిఅన్నాడు సీ 7096.

“నా మాట ఎవరు వింటారు? ఎప్పుడో మానేశారు. అప్పుడే వినకపోతే ఇప్పుడిక ఎవరు వింటారు?ఒక విషయం చెప్తాను విను, ఈ లోకం ఒకవ్యక్తి పటాన్ని పూజించినప్పటికీ అతని మాట వింటుందనేమీగ్యారంటీ లేదు. పటం ఫ్యాషన్ కోసం కూడాపెట్టుకుంటారు!” అన్నాడు 189.

“అయినా మీరెందుకు మాట్లాడతారు? నేను మర్చిపోవడం నాదేతప్పు. ౨౩ మార్చి ౧౯౩౧ రోజున కూడా లాహోర్ సెంట్రల్ జైల్లోఉదయం ఏడు గంటలకి ఆ ఉరితాడు వేస్తూంటే దాన్ని ఆపగలిగి కూడా మీరేమీ అనలేదు. మీరు సైగ చేసినా ఆ ఉరి ఆగిపోయేదే. కానీమీరు దాన్ని ఆమోదిస్తున్నట్టు తలవంచుకుని ఊరుకున్నారు. ఆ ఘోరాన్ని జరగనిచ్చారు!” మొదటిసారి సీ7096 గొంతులో వెటకారం ధ్వనించింది.

“వాళ్ళు హింసకి పాల్పడ్డారు. వాళ్ళని కాపాడి ఉంటే  దేశమంతటాహింస విజృంభించి ఉండేది.ఏ రకమైన హింసనీ నేను సమర్థించను. హింసవల్ల దేన్నీ సాధించలేం. ఒకవేళ సాధించినాదాన్ని నేను ఆమోదించను. నేను నా అహింసామార్గాన్ని వదులుకోదలచలేదు. 189 గొంతు మళ్ళీ దృఢంగా మారింది.

“అహింసా? అదెక్కడుంది? అన్నివైపులా హింసే రాజ్యమేలుతోంది. అడవిలో సింహం జింకలని చంపుతోంది, ఆకాశంలోడేగ పిచుకలని చంపుతోంది, సముద్రంలో పెద్దచేప చిన్నచేపలనిమింగుతోంది, అంతటా హింసే ఉంది. అడవిలో అమలయే న్యాయమే అంతటా చెల్లుతోంది మహాశయా! మీరు చంపేవాళ్ళలో కాకపోతేచనిపోయేవాళ్లలో ఉంటారు. ఏవైపు ఉండడానికి ఇష్టపడతారో మీరే నిర్ణయించుకోవాలి. ఈ లోకాన్ని కూడా అడవిని నిర్మించినట్టే నిర్మించారు. ఇక్కడ ప్రాణాలతో ఉండాలంటే హింస చెయ్యకతప్పదు” ఇంకా సీ 7096 గొంతులో వెటకారం అలాగే ఉంది.

“సరే, కానీ నాకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. నేను హింసని ఎంతమాత్రం సమర్థించలేదు, సమర్థించను. వాళ్ళు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే కదా? నేనెందుకు జోక్యం చేసుకుంటాను? అయినా నేను అడ్డుపడితే వాళ్ళు చావు తప్పించుకునేవాళ్ళా?” సీ 7096 తనని వెటకారం చేస్తున్నాడని గ్రహించి 189 మరింత దృఢంగా అన్నాడు.

“అందుకే ఆ శిక్ష పడడానికి సరిగ్గా 18 రోజుల ముందు, మార్చి 5 న మీరు ఆ ఒడంబడిక చేసుకున్నారు. సరిగ్గా 18 రోజుల ముందు! అది మీరు వేసిన ఎత్తు కాదా? ఆ ఒడంబడికలో రాజకీయ ఖైదీలందరినీ విడుదల చెయ్యాలన్న అంశం ఉన్నప్పుడు దాన్ని అలాగే ఉండనివ్వాల్సింది! అందులో ‘హింసాయుతమైన పనులు చేసినవారిని తప్ప’ అనే వాక్యాన్ని ఎందుకు జోడించాల్సి వచ్చింది? హింస చేసేవాళ్ళెవరు? ఆ దోషులు మీ అభిప్రాయాలని అంగీకరించని వారే కదా? మిమ్మల్ని సమర్థించినవారందరూ అహింసావాదులేనాయె. ఈ ఒడంబడిక చేసుకుని మిమ్మల్ని సమర్థించేవారందరినీ రక్షించారు, కానీ మిమ్మల్ని ఎదిరించి, మీ అభిప్రాయాలతో ఏకీభవించని వారందరినీ ఉరికంబానికి వేలాడదీయించారు. ఆ ఒడంబడికవల్ల లాభం చేకూరింది మీకే. మీ పార్టీ మీద నిషేధాన్ని ఎత్తేశారు. మీవాళ్ళ ఆస్తులన్నీ వెనక్కిచ్చేశారు. మీరు చాలా యుక్తిపరులని జనం ఊరికే అనలేదు,” సీ 7096 పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు.

బైటి గోల ఎక్కువైంది. జనం పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఇటూఅటూ హడావిడిగా నడిచే కాళ్ళ బూట్ల చప్పుడు కూడా ఉండుండివినిపిస్తోంది.

” అహింస నా సిద్ధాంతమనీ, ఎపుటికీ దాన్నే నమ్ముతాననీ, హింసని సమర్థించే పనులేవీ అన్నటికీ చెయ్యననీ చెప్పా కదా?ఎవరైనా, ఎప్పుడైనా, ఎటువంటి హింసకి పాల్పడినా దాని పరిణామాలని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందే!” 7096 ఇచ్చిన అంతదీర్ఘోపన్యాసమూ 189 మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఆయన అదే ధోరణి ప్రదర్శించాడు.

“ఎప్పుడూ మీ నోట వినిపించే రామనామం, చనిపోయేప్పుడు కూడా చివరిగా మీ నోటి వెంట వినిపించినది అదే, ఆ రాముడు కూడా హింసనే సమర్థించాడే? ఆయన అహింసని నమ్మనే లేదు. మీ రాముడుఎంత భీకరమైన యుద్ధం చేశాడు! అలాంటప్పుడు అహింసామంత్రాన్ని జపించే మీ నోట ఎప్పుడూ ఆయన పేరే వినిపిస్తుందేమిటి? ఆయన చేసిన హింస మీకు హింసలా కనిపించదా? ఇక ఎప్పుడూ మీవెంటే ఉండే భగవద్గీతలో ఏముంది?అతి పెద్ద హింస జరిగే ముందు ఇచ్చిన ఉపన్యాసం అది. ఒక యోధుడు అహింసా మార్గాన్ని అనుసరించాలనుకుని తన ఆయుధాలని పారేస్తూఉంటే, అతన్ని మళ్ళీ హింసవైపు ఉసికొల్పడానికి అన్న మాటలే కదా భగవద్గీత?మానవ చరిత్రలో అన్నిటి కన్నాఅతి ఘోరమైన హింస జరిగినది ఆ యుద్ధంలోనే అనేది మీకూ తెలుసు. ఆ హింస జరగడానికి సరిగ్గా ముందు, దాన్ని ప్రారంభించేందుకు చెప్పిన మాటలన్నిటినీ మీరు ఎప్పుడూ వెంట ఉంచుకుంటారు, కానీ అహింస గురించి మాట్లాడతారు!” అన్నాడు సీ 7096 మరింత ఉద్రేకంగా. 189 జవాబేమీ చెప్పలేదు.ఒకసారి గాలిని నమిలాడు. ఇబ్బందికరమైన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఉండేందుకు అదే ఆయన వాడే ఉపాయం.

“విభజన కారణంగా రెండు దేశాలలోనూ పది లక్షలకి పైగా ప్రాణాలు కోల్పోయినప్పుడు మీరు మాత్రం ఎక్కడ ఆపగలిగారు? ఇంకాఎంతమంది ఇళ్ళూ వాకిళ్ళూ కోల్పోయారో, ఎంతమంది ఆచూకీ తెలీకుండా మాయమయారో వాళ్ళ లెక్కే తేలలేదు.అంత హింస తరవాత లభించిన స్వాతంత్ర్యాన్ని మీరందరూ స్వీకరించారు కదా? టపాకాయలు కాల్చారు, డప్పులు వాయించి ఆ స్వాతంత్ర్యానికి స్వాగతం పలికారు!” 189 గాలి నమలడం చూసి సీ 7096 కిఆవేశం హెచ్చింది. గొంతులో కోపాన్ని ప్రదర్శించాడు. మళ్ళీ అతనికి మౌనమే సమాధానమయింది. వంచిన మోకాలి మీది చెయ్యి కొద్దిగా కదిలిందంతే.

మళ్ళీ సీ 7096 మౌనాన్ని ఛేదిస్తూ,” ఆ… కొన్ని వేలమంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఆ హంతకుడు, ఆయుధాల దళారి, వాడు చేసిన హింస మీకు కనబడలేదు. ఆ రక్తం రుచి మరిగిన తోడేలు ఆరేళ్ళ క్రితం మీ దేశానికి వచ్చినప్పుడు, రక్తసిక్తమైన తన పంజాలతో, మాంసం ముక్కలు అతుక్కున్న పళ్లతో మీ సమాధి దగ్గరకి కూడా వచ్చాడు. వాడిప్పుడు ఈ ప్రపంచానికే రాజు కాబట్టి వాడు చేసిన హింస న్యాయమేనా? వాడి రక్తంతో నిండిన పంజాలకి స్వాగతం పలికేందుకు మీ దేశమే రెడ్ కార్పెట్ అవుతుందా? మీరు ఆ సమాధిలో నిద్రపోతూ వాడు సమర్పించిన రక్తం అంటిన పువ్వులని స్వీకరించి, చూస్తూ ఊరుకున్నారు కదూ? వాడు ఈ కాలపు అతి పెద్ద యుద్ధ నేరస్థుడు. వాణ్ణి మీ సమాధి దగ్గరకి మీదేశమే ఆహ్వానించింది. మార్చి ౨,౨౦౦౬ నాటి ఆ బ్లాక్ థర్స్ డే న మీ సమాధీ, మీ అహింసా, మీ సిద్ధాంతాలూ అన్నీ, ఆ నేరస్థుడిచ్చిన పువ్వులు స్వీకరించగానే, అపవిత్రమైపోయాయి. మీరు గర్వించేందుకు ఇంకేమీ మిగల్లేదు…” సీ 7096 కోపంగా మాట్లాడుతూనే ఉన్నాడు, 189 అతని మాటలన్నీ మౌనంగా విన్నాడు. కోపంగా అనే మాటలు వినడం ఆయనకి బాగా అలవాటే.

“కనీసం వాణ్ణి రాకుండా చెయ్యాల్సింది. వాడు హత్య చేసి నెత్తుటిధారలు ప్రవహింపజేసింది ఆ పెద్ద భూభాగానికి చెందినవాళ్ళనే కదా! అదంతా ఒకే జాతికి చెందినవాళ్ళ రక్తం…వాళ్లని మీరు ఆర్యులంటారు. ఇక్కణ్ణించి అక్కడిదాకా పరుచుకున్నది ఆరక్తమే. వాడి రక్తం వేరు, కనీసం మీరైనా మీవాళ్ళ పక్షం మాట్లాడి ఉండవలసింది. అప్పుడు మీ అహింసా సిద్ధాంతాన్ని వాడి చెవులు చిల్లులు పడేట్టు గొంతు చించుకుని మరీ అరవాల్సింది. కానీ ఎవరూ మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. మౌనం అంగీకారమనే మాట మీకే బాగ తెలిసుండాలి. మౌనంగా ఉండి మీరు కూడా వాడి హింసని సమర్థించారు. అందుచేత అహింస గురించి ఇప్పుడు మాట్లాడే హక్కు మీకు గాని ఇంకొకరికి గాని లేదు. వాడు ప్రపంచంలో ఏ మూలకి కావాలంటే ఆ మూలకి సైన్యాన్ని పంపించగలడు. ఎవరికైనా మరణదండన విధించెయ్యగలడు. వాడి నాన్న ఒక తోడేలైతే వీడూ తోడేలే. చాలాకాలం క్రితం వాడి నాన్న సైన్యంతో వచ్చాడు. లక్షమందిని హతమార్చి మరీ వెళ్ళాడు. పాలస్తీనా నుంచి ఇరాక్ దాకా ఈ తోడేళ్ళ గోళ్ళ, వాడైన కోరల గుర్తులే. కానీ మీకవి కనిపించవు!” సీ 7096 గొంతు కాస్త తగ్గించి అన్నాడు. ఆ తరవాత కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. 189 తను ఏమీ మాట్లాడకుండా అతనికి తన ధోరణిలో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఇక సీ 7096 చెప్పేందుకేమీ లేదని ఆయన గ్రహించాడు. తను కూర్చున్న భంగిమ మార్చుకుని మోకాళ్ళు మరోవైపుకి మడుచుకున్నాడు. బైట చప్పుళ్ళు ఎక్కువయాయి.

“కొంచెం నీళ్ళు…”అన్నాడు 189 నెమ్మదిగా. వెంటనే సీ 7096 గ్లాసులో నీళ్ళు నింపి ఆయనకి అందించాడు. 189 నెమ్మదిగా ఒక్కొక్క గుక్కే తాగి గ్లాసు అతనికి అందించి, “రాత్రిపూట సామాన్యంగా గోరువెచ్చని నీళ్ళే తాగుతాను. కానీ ఇప్పుడు ఎలాంటినీళ్ళైనా ఏమీ తేడా తెలీదు” అని 189 ధోవతి కింది అంచుని సాఫీచేశాడు.

మళ్ళీ”అప్పటి సంగతి వేరు. అంతా పద్ధతి ప్రకారం చేసే అలావాటుండేది. కానీ మంచి అలవాట్లని జీవితాంతం పాటించడం అంత సులభం కాదు” అని బోసి నోటితో నవ్వాడు. ఆ నవ్వు పేలవంగా ఉంది.

“నీ తమ్ముళ్ళు ఏం చేస్తూంటారు?” బైటి చప్పుళ్ళు ఎక్కువవడం గమనించి 189 మాట మార్చాడు.

“ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలీదు, ఐదేళ్ళ క్రితం, నేను ఇల్లు వదిలి వచ్చినప్పుడు పెద్ద తమ్ముడు పొలంలో కూలీ పని చేసేవాడు, చిన్నవాడు స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు” అన్నాడు సీ 7096. అతని గొంతు గద్గదమైంది. తల వంచుకుని “నేను చేసిన ఈ పనికి ఫలితంగా వాళ్ళకి ఏమైనా దక్కిందో లేదో కూడా తెలీదు” అన్నాడు.

“మీ నాన్న ఏం చేసేవాడు?” సీ 7096 మెత్తబడడం చూసి 189 మరో ప్రశ్న వేశాడు.

“పెరుగ్గారెలు అమ్మేవాడు. ఇంటింటికీ తిరిగేవాడు. కొన్నిసార్లు ఊళ్ళోనే అమ్మితే కొన్నిసార్లు బైటికి వెళ్ళి అమ్మేవాడు. కానీ పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు, గడిచిపోయేది అంతే”ఇంకా తలవంచుకునే సమాధానం చెప్పాడతను.

“ఇల్లు విడిచి నువ్వు వచ్చిందెప్పుడు?” అంటూ 189 తన చెతిని మళ్ళీ అతని భుజం మీద ఉంచాడు.

“ఐదేళ్ళయిపోయింది అప్పుడే. నేను ఇల్లు వదిలినప్పుడే మా ఊళ్ళో పూరబ్ అనే అమ్మాయి హత్యకి గురైంది. అది చలికాలం, డిసెంబర్ అనుకుంటా,” అంటూ సీ 7096 తన భుజం మీదున్న 189 చేతిమీద తన చేతిని ఉంచాడు. కానీ తల మాత్రం ఎత్తలేదు.

“ఎవరి వెంట వెళ్ళావు?”అన్నాడు 189.

“మా చిన్నాన్న వెంట. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళమనీ, ఆయన వెంటే ఉండమనీ చెప్పాడు మా నాన్న. ఏమీ అడక్కుండా ఆయనవెంట వెళ్ళిపోయాను”అన్నాడు సీ7096 కాస్త దిగులుగా. 189 చేతిమీదున్న తన చేతిని తీసి నేలమీద ఆనించాడు. ఆ తరవాత 189 ఇంకేమీ అడగలేదు. ఇద్దరూ అలా మౌనంగా కూర్చుని ఉండిపోయారు.

“నాకు మా అమ్మంటే…చాలా…చాలా ఇష్టం…ప్రేమ. అమ్మ నాతో చాలా సన్నిహితంగా ఉండేది. అమ్మ నా కోసం…” ఆతరవాత సీ 7096 గొంతు పెగల్లేదు. 189 అతని భుజాన్ని చేత్తో గట్టిగా నొక్కాడు.

“అందరూ అమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, అందరూ. ఈ ప్రపంచం మొత్తాన్ని అమ్మల చేతుల్లో పెడితే, ఈ రక్తపాతం, హింసా మొత్తం ఆగిపోతుంది. కానీ మనం అలా ఎన్నటికీ జరగనివ్వం. ఎందుకంటే అమ్మలు ఈ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తారు. ప్రపంచపటం మీదున్న గీతల్ని ఊడ్చి చెరిపేస్తారు. ఈ చివర్నించి ఆ చివరి దాకా అంతా ఒకేలా ఉండేట్టు చేసేస్తారు. చీపురుతో మందుగుండు సామాన్లని చిమ్మి చెత్తబుట్టలో పారేసి వస్తారు. మందుగుండు ఎప్పుడూ తల్లుల గర్భాలనే కాల్చివేస్తుందని వాళ్లకి తెలుసు. ఈ లోకాన్ని వాళ్లకి గనక అప్పజెపితే దీన్ని హాయిగా బతికేందుకు వీలుగా మార్చేస్తారు వాళ్ళు. మనం లోకాన్ని ప్రియురాళ్లకి అప్పజెప్పాం, భార్యలకి అప్పజెప్పాం, ఉంపుడుగత్తెలకి అప్పజెప్పాం, కానీ ఎప్పుడూ ఏ తల్లికీ అప్పజెప్పలేదు. మనకి భయం…ఒకవేళ తల్లులు ప్రపంచమంతటా ప్రేమ నింపేస్తే మనం ఎక్కడికి పోతాం, ప్రేమ నిండిన ఆ ప్రపంచంలో ఎలా బతుకుతాం, అనే భయం! మనకి అలా బతకడం అలవాటే లేదే!” అన్నాడు 189 ప్రేమ నిండిన గొంతుతో. సీ 7096 అలాగే తలవంచుకుని కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరి మనసులో ఏముందో ఇంకొకరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయారు.

“మందుగుండు పేలినప్పుడు మొట్టమొదటి కేక ఎవరో ఒక తల్లి గొంతులోంచే వస్తుంది.అది ఎక్కడైనా కావచ్చు, ఆ తల్లి ఎవరైనా కావచ్చు. ప్రపంచంలోని తల్లులందరూ మందుగుండుని ఎంత అసహ్యించుకుంటారో నువ్వు ఊహించలేవు” 189 గొంతు ఖంగుమని పలికింది.

“తెలుసు, నాకు బాగా తెలుసు. మా అమ్మకి కూడా మందుగుండంటే పరమ అసహ్యం. కానీ అసహ్యించుకున్నంత మాత్రాన ఏదీ ముగిసిపోదు కదా! అది అక్కడే అలాగే ఉంటుంది. మీరు ఎంత అసహ్యించుకున్నప్పటికీ” సీ 7096 గొంతులో దిగులు పెరిగిపోయింది.

“నిన్ను అక్కడికి పంపినప్పుడు నువ్వెందుకు ఎదురుతిరగలేదు? అప్పటికి నీకు ఇరవైయేళ్ళు. మంచీ చెడూ తెలుసుకునే జ్ఞానం ఉంది. నాకు వెళ్ళాలని లేదని అనుండచ్చే?” 189 సరైన అదను చూసి అడిగాడు.

“నేను పదమూడేళ్ళకే స్కూలు మానేశానని మీకు తెలుసు కదా? ఆ తరవాత ఏమీ చెయ్యకుండా ఉండిపోయాను. చేసేందుకు ఏమీ లేకపోయింది. ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు కూలీ పనికి పోయేవాణ్ణి. అలాంటి సమయంలో ఎవరైనా వెళ్లనని ఎలా అనగలరో మీరే చెప్పండి?” ప్రశ్నకి ప్రశ్నే బదులు చెప్పాడు సీ 7096.

అక్కడికెళ్ళకైనా ఈ పని చెయ్యకూడదు, వెనక్కి వెళ్ళిపోవాలని నీకు అనిపించలేదా?” 189 గొంతులో ఇప్పుడు మృదుత్వం లేదు.

“అనిపించింది, ఇలాంటి పనులు నేను చెయ్యలేనని కూడా చెప్పాను. కానీ నా మాట వినిపించుకున్నదెవరు? చెప్పడం, వినడం లాంటివి అక్కడ ఉండవు. వెనక్కి వచ్చే మార్గం లేకపోయింది. వాళ్ళు చెప్పే మార్గం ,స్వర్గానికి తీసుకెళ్ళే మార్గం ఒక్కటే మిగిలింది నాకు. అక్కడ ఆ కొండ ప్రాంతాల్లో నేను కాక నాలాంటివాళ్ళు మరో పాతికమంది దాకా కుర్రవాళ్ళు ఉండేవారు. అందరూ తిండికి కూడా గతిలేని నిరుపేదలే. నా లాగే వాళ్ళు కూడా నరకంలాంటి జీవితాన్ని స్వర్గం చేసుకునేందుకు అక్కడికి వచ్చారు. దాన్ని సాధించాలంటే మేమే స్వయంగా స్వర్గానికెళ్ళాలని మాకందరికీ తెలుసు. ఆ కొండల్లోనే మాకు మందుగుండు సామానుతో ఆడుకోడం నేర్పారు. మందుగుండు సామాన్లలోఅన్ని రకాలూ, రంగులూ అక్కడే చూశాం. దాన్ని ఎలా అదుపు చెయ్యాలో, అదుపులో ఉంచుకుని మా లక్ష్యం కోసం దాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకున్నాం,” సీ 7096 గొంతు మామూలు స్థితికి రావడం మొదలెట్టింది. ఒక్క క్షణం ఆగి గొణుగుతున్నట్టు ” నేనా పని చెయ్యలేను, నా వల్లకాదని చెప్పాను, నిజంగా చెప్పాను!” అన్నాడతను.

“ఊ…ఇక నిన్నిక్కడికి పంపించినప్పుడు ఎందుకు పంపించారో నీకు తెలిసే వచ్చావా?” 189 కొంచెం మెత్తబడినట్టు అడిగాడు.

“తెలుసు,మాకందరికీ తెలుసు. ఇక్కడ మనుషులని చంపేందుకు పంపారు… ఇంకా…ఇంకా…మేం చనిపోయేందుకు కూడా…మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించారో మాకందరికీ బాగా తెలుసు. అసలు మాకు శిక్షణ ఇచ్చిందే అందుకు. మా కుటుంబాలకి డబ్బులిచ్చింది కూడా అందుకే. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి హత్యలు చెయ్యడమే మా పని,” అన్నాడు సీ 7096.

“ఎవర్ని చంపడానికి?”189 అడిగాడు.

“ఎవర్నైనా సరే,కనబడిన వాళ్లందర్నీ…” సీ 7096 గొంతు అణగారిపోతోంది.

“ఎందర్ని చంపావు…ఆ స్టేషన్ లో?” అతని గొంతుని మరింత అణిచేందుకు 189 ఆ ప్రశ్న వేశాడు.

“తెలీదు…కానీ…రెండున్నర మేగజైన్లు ఖాళీ చేసేశాను. నేను…అలా కాలుస్తూ పోయానంతే. వాళ్లని చంపు, అప్పుడే మనం బతికి ఉండగలం అని చెప్పారు నాకు…అందుకే చంపుతూ పోయాను…ఎందర్ని చంపానో నాకే తెలీదు…” సీ 7096 ఆగి ఆగి మాట్లాడసాగాడు, అతని గొంతు చాలా నీరసంగా ఉంది.

“నువ్వు చేసిన ఈ పనికి అసలు అర్థమేమిటో తెలుసా నీకు? మీ చేత ఇలాంటి పనులు ఎందుకు చేయిస్తున్నారో ఏమైనా అవగాహన ఉందా?”189 నెమ్మదిగా అడిగాడు.

“తెలీదు,” అని క్లుప్తంగా జవాబు చెప్పాడు సీ 7096.

“మరి?” అన్నాడు 189.

డబ్బున్న కుటుంబాల్లోని వాళ్ళెవరైనా ఇలాంటి పనులెందుకు చేస్తారు? నాలాంటివాళ్ళే డబ్బులకాశపడి చేస్తారు కానీ!”ఈసారి సీ 7096 తలెత్తి సమాధానం చెప్పాడు. సూటిగా 189 కళ్ళలోకి చూస్తూ ఈ మాటన్నాక అలా చూస్తూనే ఉండిపోయాడు. 189 కూడా చూపులు మరల్చుకోలేదు. ఇద్దరూ కొంతసేపలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. కొంతసేపేమిటి, చాలాసేపు అలాగే కళ్ళతో మాట్లాడుకున్నారు. చాలా సేపటితరవాత 189 తన చేతిని సీ 7096 భుజం మీంచి తొలగించి,అతని ఒక చేతిని తన రెండు చేతుల్లోకీ తీసుకుని నొక్కాడు. సీ 7096 కి ఆ చేతుల్లో వెచ్చదనం ఉన్నట్టు తోచింది. ఆ వెచ్చదనాన్ని ఒకప్పుడు ప్రపంచం మొత్తం అనుభవించింది!

“మీకు…మీకు నన్ను చూస్తే అసహ్యం వెయ్యడం లేదా?”అన్నాడు సీ 7096 చాలాసేపటికి నోరు విప్పి.

“లేదు…అసలు నేను ఎప్పుడూ  పాపాన్ని ద్వేషించు, పాపిని కాదు, అనేవాణ్ణి. నేరాన్ని అసహ్యించుకోవాలి గాని నేరస్థుణ్ణి కాదు! అపరాధాన్ని అంతమొందించమనే ఎప్పుడూ చెప్పాను, అపరాధిని మట్టుపెట్టమని ఎప్పుడూ అనలేదు. నువ్వనే కాదు, ఆ అపరాధి ఎవరైనా నేనలాగే చేస్తాను. హింసకి సమాధానం హింస కాకూడదు. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోకూడదు. ఒకవేళ తను చేసిన నేరాన్ని ఆ నేరస్థుడే అసహ్యించుకుంటే నేనతన్ని ప్రేమిస్తాను. ఎందుకో తెలుసా?అలాంటి సమయంలో అతనికి ఎక్కువ అవసరమైనది ప్రేమే” 189 చాలా తియ్యగా, సీ 7096 చేతిని తన చేత్తో మృదువుగా తడుతూ అన్నాడు. సీ 7096 ఏమీ జవాబు చెప్పకుండా ఆ కళ్ళ్జజోడులోంచి తనవైపు చూస్తున్న కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు.

“ఇందాక హింసని సమర్థిస్తూ నువ్వేమేమో అన్నావు. నేను మాట్లాడకుండా నువ్వు చెప్పింది విన్నాను. నువ్వు చెప్పిన దానితో ఏకీభవించకపోయినా నిన్ను ఆపలేదు. ఎందుకో తెలుసా? నా ఉద్దేశం ఈ లోకంలో ఉన్న ఎటువంటి అభిప్రాయమైనా సరే, దానితోపాటే దాన్ని ఏకీభవించకపోవడమనే అంశం కూడా దాని వెంటే ఉంటుంది. ఎటువంటి అభిప్రాయమూ కూడా సర్వసమ్మతమై ఉండదు. అలా ఉంటే అది అసలు అభిప్రాయమే కాదనాలి. నువ్వు వెలిబుచ్చిన అభిప్రాయాలలో కొన్నిటిని తప్ప మిగతా వేటినీ నేను ఒప్పుకోను. అయినా అలాగని నీతో అనలేదు. అవతలి వ్యక్తి భిన్నాభిప్రాయాన్ని తీసిపారెయ్యడం కూడా ఒక రకంగా హింసే అంటాను. అసలు ఆరోగ్యకరమైన ఏ సమాజానికైనా ఇదే, అన్నిటికన్నా పెద్ద హింస అంటాను” అని 189 ఒక్క క్షణం ఆగి తొడమీద ఉన్న జేబు గడియారంలో టైమ్ చూశాడు.

“ఇంక నేను అడగదల్చుకున్న ఆ ఒక్క ప్రశ్నా అడిగే సమయం వచ్చిందనుకుంటా. అక్కడిదాకా వచ్చేందుకే ఇంతసేపూ ఏవేవో ప్రశ్నలు వేస్తూ వచ్చాను,” అని ఆయన మళ్ళీ కాసేపు మౌనం వహించాడు. ఆ నిశ్శబ్దంలో బైటి చప్పుళ్ళు మరీ గట్టిగా వినిపించసాగాయి.

“ఇప్పుడు నా ఈ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పు. హింసని సమర్థిస్తూ నువ్వు చాలానే మాట్లాడావు. ఎన్నో ఉదాహరణలు ఇచ్చావు. కానీ ఇంకెవరి ఉదాహరణో కాకుండా నీ ఉదాహరణ ఆధారంగా నేనడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నువ్వు చేసిన హింస నీకు సమ్మతమేనా? అప్పుడు అక్కడ జరిపిన హింసాకాండని ఈరోజు, ఇక్కడ నువ్వు సమర్థిస్తావా? ఇప్పుడు దాన్ని ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడమే అన్నిటికన్నా ముఖ్యం, ఎందుకంటే ఇదే అంతిమ సత్యం. ఇంతకు ముందుగాని,తరవాత గాని జరిగేదేదీ సత్యం కాదు!” 189 గొంతు స్పష్టంగా, గట్టిగా పలికింది. ఒక్కొక్క మాటా ఆ గదిలో ప్రతిధ్వనిస్తున్నట్టు మారుమోగింది. దాని ప్రభావం సీ 7096 ని కొంతసేపు కమ్మేసింది. అతను 189 కళ్లలోకి ఒక్క క్షణం చూసి తల దించుకున్నాడు.

“నేనొప్పుకోను…లేదు, మీ మాటలు అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోను” అన్నాడు 7096 తలవంచుకునే.

“ఇదే శాశ్వత సత్యం. దీన్ని గుర్తుంచుకో. నువ్వు చేసిన పని హింస అనీ, దాన్ని వ్యతిరేకిస్తున్నాననీ నువ్వు  ఒప్పుకుంటే, ఇక రేపు జరగబోయేదాన్ని నువ్వు ప్రశాంతమైన మనసుతో అంగీకరించగలుగుతావు. పరిపూర్ణమైన శాంతి అనుభవిస్తావు”అన్నాడు 189 ఎంతో తియ్యగా, ప్రేమగా. సీ 7096 ఆయన మాట అంగీకరించినట్టు మౌనంగా తల పంకించాడు.

“ఇంకొక మాట, ఈ ఆకలీ, పేదరికం ఎక్కువకాలం ఉండవు. ఒకరోజు జనం మళ్ళీ వెనక్కి వస్తారు…ఆ రోజు, ఇదే చేతికర్రతో ఆ ఐదువేల కోట్లు ఖరీదు చేసే భవనాన్ని ధ్వంసం చేస్తాను. అలాంటి భవనాలన్నిటినీ కూల్చేస్తాను. ఆ విరిగిన ముక్కలన్నిటినీ ఈ దేశమంతటా వెదజల్లుతాను. మీ ఇల్లు ఉన్నంత దూరం, మరీ మాట్లాడితే ఇంకా దూరం వాటిని విసురుతాను. ఈ నరభక్షక భవనాలు కూలిపోవాలి. కొన్ని లక్షలమందికి అందవలసిన వాటాలని పీల్చి పీల్చి తమలో నింపుకుంటున్నాయివి. నీ లాంటి ఇంకా ఎంతోమందిని సృష్టిస్తున్నవి ఇవే. ఇవి నేలమట్టమైన రోజున అన్నీ సర్దుకుంటాయి. నా మాట నమ్ము, అలాంటి రోజు తప్పక వస్తుంది, ఈ నా చేతికర్రతోనే ఒక్కొక్క భవనాన్నీ ముక్కలు ముక్కలుగా కూల్చేస్తాను”అంటూ తన పక్కనున్న కర్రని ఎత్తి గాల్లో గిరగిరా తిప్పాడు 189. మాట్లాదేకొద్దీ ఆయన గొంతు మరింత దృఢంగా అయింది. బైటి మాటలు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి .తెల్లవారిపోయినట్టుంది. 189 తనని తాను సంబాళించుకుంటూ లేవడానికి ఉద్యుక్తుడయాడు. సీ 7096 గబగబా వెళ్ళి ఆయన్ని పట్టుకుని లేవదీశాడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడ్డారు.

“ఇప్పుడు నీకింక భయం వెయ్యడంలేదు కదా?” అన్నాడు 189 అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ.

“లేదు, కానీ…అమ్మ గురించే భయం!” అన్నాడు సీ 7096 ఆయన వైపే చూస్తూ.

“అమ్మ గురించా, ఎందుకు?”

“నామీద అమ్మకి కోపం వస్తుంది”అన్నాడతను దిగులుగా.

“ఊ…అయితే ఈ భయం మంచిదే…చాలా మంచిది,”అన్నాడు 189, సీ 7096 భుజం తట్టి చిరునవ్వు నవ్వుతూ. సీ 7096 సమాధానమేమీ చెప్పలేదు కానీ మొదటిసారి అతని మొహంలో పల్చని చిరునవ్వు కనిపించింది.

“నీ మరణం గురించి నాకూ ఒక భయం ఉంది. నువ్వు చనిపోయాక అక్కడ జనం నిన్నొక హీరోని చేసేస్తారు. నీ గురించి కథలు కథలుగా చెప్పి, నీలాంటి అమాయకులని భావోద్రేకంతో నింపి అదే మార్గాన నడిపిస్తారు. నీ మరణాన్ని బలిదానం, వీర మరణం అంటారు. చనిపోయాక కూడా నువ్వు వాళ్లకి ఉపయోగపడుతూ ఉంటావు. ఇది అన్నిటికన్నా పెద్ద నష్టం అనిపించుకుంటుంది. అదే నా భయం. హింసని బలిదానం అనడం అన్ని ప్రమాణాలనీ మార్చేస్తుంది. సమాజానికి దానివల్లే అన్నిటికన్నా ఎక్కువ చెరుపు. హింస తాలూకు ఈ దుష్పరిణామాన్ని చూస్తేనే అన్నిటికన్నా నాకెక్కువ భయం. హింసా మార్గాన్ని అనుసరించేవాళ్ళని వీరులని ఆకాశానికెత్తితే, ఇక సమాజం మొత్తం అదే దారిన నడుస్తుంది,” 189 గొంతులో అలసట ధ్వనించింది.

“రేపు నువ్వు చనిపోయాక దేశమంతటా టపాకాయలు పేల్తాయి. కూడళ్ళలో మిఠాయిలు పంచుతారు, ఆనందంతో డప్పులూ,డోళ్ళూ వాయిస్తారు. నీ దిష్టి బొమ్మల్ని తగలబెడతారు” అన్నాడు 189 అతని కళ్లలోకి లోతుగా చూస్తూ.

“తెలుసు, కానీ మీరు చనిపోయినప్పుడు కూడా ఇవన్నీ చేశారు కదూ? తక్కువమందే కావచ్చు, కానీ కొందరైనా చేశారు” చూపు మరల్చుకోకుండా అన్నాడు సీ 7096.

” ఊ…నిజం చెప్పావు. నేను చనిపోయినప్పుడు కూడా కొందరు మిఠాయిలు పంచారు” 189 గొంతులో అపహాస్యం కనిపించింది, ఆ వెటకారం తనపట్లే . సీ 7096 ఆయన బోసినోటి నవ్వు చూస్తూ ఉండిపోయాడు.

“సరే , నేనిక వెళ్తాను ప్రార్థనకి వేళయింది. బా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నీకు కూడా సమయం ఆసన్నమైందనుకుంటా, బైట హడావిడి ఎక్కువైంది” అంటూ 189 చేతులు జోడించి నమస్కారం చేశాడు. సీ 7096 అవాక్కయి అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు.

“ఇక వెళ్తాను”అంటూ 189 అడుగు ముందుకేశాడు.

“ఒక్క మాట…!” ఆయన వెళ్ళిపోతూంటే వెనకనించి సీ 7096 పిలిచాడు. అప్పటికి ఆయన గది ఆ కొసకి చేరుకున్నాడు. అతను పిలవగానే ఆయన ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

“మా అమ్మకి చెప్పండి…” అన్నాడు సీ 7096 బొంగురుపోయిన గొంతుతో.

ఇద్దరూ గదికి చెరో కొసనా నిలబడిపోయారు. ఇద్దరిమధ్యా చిమ్మచీకటి పరుచుకుంది. బైటినుంచి ఎందరో నడిచివస్తున్న చప్పుడు…వాళ్ళ కాళ్ళకున్న జోళ్ళ చప్పుడు…జోళ్ళకి కొట్టిన మేకులు నేలకి తగుల్తున్న టకటకమనే చప్పుడు. అవి నెమ్మది నెమ్మదిగా దగ్గరవసాగాయి. అతనున్న గదివైపుకే రాసాగాయి. నడుస్తూ ఇంకా ఇంకా దగ్గరకి రాసాగాయి.

***

 

 

 

 

మీ మాటలు

  1. గొరుసు says:

    చాలా గొప్ప కథ. కథను ఇలా రాయాలని ఆలోచన వచ్చిన పంకజ్ సుబీర్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. రెండు శత్రు దేశాల నేపథ్యం కళ్ళకు కట్టి మనసు చలింప చేశారు. చరిత్ర మరోసారి పునరావృతమ్ అయ్యింది. ఆ నాటి విభజన రోదన చెవుల్లో ప్రతిధ్వనించింది. శాంతసుందరి గారి తర్జుమా గురించి ఎంత చెప్పినా తక్కువే . చదువరిని కసబ్, గాంధీ ల మద్య కూర్చో బెట్టేశారు ఆమె.

    • Sathasunadari says:

      థాంక్స్ జగదీశ్వర రెడ్డి గారూ . పెద్ద కథ అయినా ఓపిగ్గా చదివి స్పందించారు సంతోషం అనిపించింది

మీ మాటలు

*