ఒకానొక రూఫ్‌ గార్డెన్‌ కథ

 

– ఒమ్మి రమేష్‌బాబు

~

ఇటీవల ఒక ఉదయంపూట తుమ్మేటి రఘోత్తమరెడ్డిగారి ఇంటికి వెళ్లాను. చాన్నాళ్ల తర్వాత ఆయన కరస్పర్శ… స్నేహపూర్వక స్వాగతం పలికింది. ఆత్మీయ పలుకరింపు ఆతిథ్యపు మర్యాదలు చేసింది. ఆయన సామీప్యంలో నా మానసం కొత్త చివుర్లు తొడిగింది. కొన్ని కుశల ప్రశ్నలు. మరికొన్ని తేరిపార పరామర్శించుకునే చూపులు. తదేకంగా ఆయన్ని చూస్తున్నంత సేపు తొలి పరిచయం నాటి గురుతులు… జ్ఞాపకాల దొంతరలు. రెండు దశాబ్ధాల కాలచక్రం తెచ్చిన మార్పులను పోల్చుకునే ప్రయత్నం చేశాను. చెట్టులాంటి మనిషి కనుక ఎదుగుదల సహజమే. నా కనుల గ్రహణశక్తికి హరిత సొబగుల అందమేదో లీలగా మెదిలింది కూడా. అది భ్రమ కాదు కదా అని ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నని నేను అడగకపోయినా దానికాయన ఆచరణాత్మక శైలితో బదులిచ్చారు.

హైదరాబాద్‌లో కొత్త చిరునామాని చేరుకోవడం కొంత కష్టమే. కానీ రఘోత్తమరెడ్డిగారి విషయంలో ఆ సమస్య రాలేదు. నారపల్లె… నల్లమల్లారెడ్డి కాలేజి రోడ్డులో సుమారు కిలోమీటరు సాగింది ప్రయాణం. రోడ్డుకి కుడివైపున ఎర్రటి సున్నం వేసిన ఇల్లు. మిద్దె మీద ఆకుపచ్చటి కుచ్చుటోపీ. ఆ ఇల్లే ఆ ప్రాంతపు కొండగురుతు. ఎవరికైనా సరే తొలి చూపులోనే ఆకట్టుకనే తీరు. నేను ఆ ఇంట ప్రవేశించగానే మనసు నెమ్మదించింది. వాతావరణంలో చల్లదనం నాలోకి కూడా ప్రవహించింది. ఆ అనుభూతి గొప్ప కథ చదివినప్పుడు కలిగే అనుభూతికి సరిసాటి అనే చెప్పాలి.

రఘోత్తమరెడ్డిగారి నట్టింట కూర్చుని పలహారం తింటూ నలు మూలలూ పరికించాను. అంతటా నిరాడంబరత పరివేష్టించి ఉంది. దరహాస వదనంతో ఎదురుగా ఆయన జీవిత సహచరి రూప. ఆ ఇంట కుటుంబ సభ్యుడిగా మారిపోయిన గూఫీ అనే కుక్క కూడా పరిచితగా మారిపోయింది. ఇల్లు బాగుంది అన్నాను అభినందనపూర్వకంగా. “అప్పుడే ఏమైంది.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది” అన్నారు రఘోత్తమ్‌. ఆయనకి ఇష్టమైన పుస్తకాలో, సంగీతం సీడీలో చూపిస్తారనుకున్నాను. రఘోత్తమ్‌ తమ వాకిట్లో మెట్ల దారివైపు నడిచారు. నేను అనుసరించాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి అంతస్తులోకి చేరుకోగానే అక్కడ అకుపచ్చనిలోకం పలుకరించింది. అదొక చిట్టి వనం. రూఫ్‌ గార్డెన్‌! అందులోనే కూరగాయల పెరడు. పందిళ్లకు పాకిన రకరకాల పాదులు. అక్కడక్కడ పూల మొక్కలు. ఏపుగా పెరిగిన పళ్ల చెట్లు. మధ్యమధ్యలో ఆకుకూరల మడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక అందమైన పార్క్‌. చెట్ల మధ్య కూర్చోవడానికి వీలుగా చిన్న ఏర్పాటు. ఆకర్షణ కోసం పెట్టిన టెర్రకోట బొమ్మల కొలువులు. చూపు ఎటు తిప్పినా చిత్రవర్ణాల కూర్పులు!

raghu1

రఘోత్తమరెడ్డిగారి రూఫ్‌గార్డెన్‌లో జామ, పంపరపనస, బొప్పాయి, సపోటా, సీతాఫలం, బత్తాయి, దానిమ్మ, నిమ్మ వంటి చెట్లను చూస్తే చకితులమైపోతాం. ఆకాశపు నిచ్చెనమెట్లు ఎక్కినట్టుగా కొన్ని చెట్లు నిటారుగా ఎదిగిపోయాయి. నేల విడిచి చేసే సాగులో ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే… రఘోత్తమ్‌ నవ్వారు. చేయాలనుకుంటే సాధ్యంకానిదేముంది అన్న అర్థముంది ఆయన నవ్వులో. రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మొక్కలతో గడుపుతారు. నీరు పెడతారు. వాటిని పరిశీలించి బాగోగులు తెలుసుకుంటారు. ఇదీ ఆయన తన మాటల ద్వారా చెప్పిన దినచర్య. కానీ ఆ క్షణాన నాకు ఆయన “మొక్కల నాడి చూడగల వైద్యుడిలా” అనిపించారు. అంతేకాదు.. ఆ తోట అంతటి హరితశోభని సంతరించుకోవడానికి ఆయన పంచే ప్రేమ కూడా కారణమని అనిపించింది.

మిద్దెపైన రఘోత్తమ్‌ సృష్టించిన ఈ తోట.. ఆయన అభిరుచికి ఆవిష్కరణ. నిజానికి ఈ వర్ణన బట్టి ఇదంతా విశాలమైన జాగాలో పెంచిన తోట అని మీరనుకుంటే పొరపాటే. నారపల్లెలో ఆయనకున్నది సుమారు 170 గజాల స్థలమే. అక్కడే ఇల్లు కట్టుకుని, అందులోనే చిరకాల స్వప్నమైన సాగుపనులు చేసుకోవడం కొంత కష్టతరమే. కానీ రఘోత్తమ్‌ తన ఆలోచనకి పదునుపెట్టి… రూఫ్‌ గార్డెన్‌ ఏర్పాటుతో తన కల నెరవేర్చుకోవచ్చునని భావించారు. ఐదేళ్ల క్రితంనాటి ఆయన పూనికే ఇప్పుడు హరిత సౌందర్యానికి నిలయంగా మారింది. తోటల్లో ఎంత చేవగా పెరుగుతాయో అంతే మిసమిసతో, ఆరోగ్యంతో పెరిగాయి ఈ రూఫ్‌గార్డెన్‌లో చెట్లు, మొక్కలు..!

పాడైపోయిన కూలర్ల కింద ఉండే ఇనుప చట్రాలే కొన్ని మడులకు ఆధారం. శ్లాబ్‌ మీద బండరాళ్లు పేర్చి.. వాటిపై ఇటుకల కూర్పుతో కొన్ని మడులు తయారుచేశారు. వాటిలో మట్టి నింపారు. విత్తు నాటారు. పెద్దపెద్ద కుండీల్లో చెట్లను నాటారు. రెక్కల కష్టంతోనే అన్నీ చేశారు. నీటికి లోటు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించారు. అవసరమైన కాలువలు ఏర్పాటుచేశారు. ఇలా నగరపు నడిమధ్యన రైతుగా మారి సాగుబడితో జీవితానందం పొందుతున్నారు. ఇప్పుడు వారు తమ అవసరాల కోసం కూరగాయలు, ఆకుకూరలు కొనడం లేదు. (దుంప కూరలు ఒక్కటే ప్రస్తుతానికి మినహాయింపు) వారి పంట దిగుబడే ఇంటి అవసరాలకు మించి వస్తోందని చెప్పారు. అప్పుడప్పుడు ఇతరులకూ పంచుతున్నారు. పెరటి మొక్క వైద్యానికీ, కూరకీ కూడా పనికొస్తుందని ఆచరణపూర్వకంగా నిరూపించారు. 30 శాతం వరకూ పళ్లు తమ తోటలోనే పండుతున్నాయట. మరికొన్ని పళ్ల చెట్లు కాపుకి వస్తే.. ఆ లోటు కూడా పూడుతుందని నమ్మకంగా చెప్పారు రఘోత్తమ్‌. ప్రతిచెట్టునీ ఆయన బిడ్డ మాదిరే పరిపోషిస్తున్నారు. ఆ చిట్టి వనాన్ని చూసి మురిసిపోయి పిట్టలు అక్కడక్కడే సందడి చేస్తున్నాయి. సీతాకోకచిలుకలు పూవ్వుపువ్వునీ పలుకరిస్తూ సంబరపడుతున్నాయి. తేనెలూరు ఆ దృశ్యాలు కన్న కనులకి అంతకంటే ఏముంటుంది సార్ధక్యం..!?

ఎడాపెడా పురుగుమందులు వాడటం, కృత్రిమంగా నేల సారాన్ని పెంచాలన్న యావతో యద్ధేచ్చగా ఎరువులు వెదజల్లడం వంటివి రఘోత్తమ్‌కి నచ్చవని ఆయన సాగు పద్ధతిని చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆహార పంటల వల్ల ఆరోగ్యం ఎంతగా కలుషితమవుతుందో ఆయనకు తెలుసు. గతంలో అనారోగ్య చీడపీడల బారిన పడినవారే ఆయన కూడా. అందుకే ప్రకృతికి చేరువగా ఉండే సహజ సాగుపద్ధతులనే తన రూఫ్‌గార్డెన్‌కి పెట్టుబడిగా మార్చుకున్నారు. ఒక రచన చేసేటప్పుడు ఎంత దీక్ష, ఒడుపు, నిబద్దత, నిజాయితీ పాటించేవారో రూఫ్‌గార్డెన్‌ విషయంలోనూ రఘోత్తమరెడ్డి ఇదే పంథాని అనుసరిస్తున్నారు. ఆయన ముఖంలో తాండవిస్తున్న ప్రశాంతతకీ, ఆ ఇంట పరుచుకున్న చల్లదనానికీ కారణం ఏమిటో నాకప్పుడే బోధపడింది. ఒకానొకనాడు సాహితీ సేద్యం చేసిన ఆయన ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతే తేడా! ఇల్లు పీకి పందిరేసినట్టు అన్న ఎత్తిపొడుపుని తిరగరాసి… ఇల్లు కట్టి, ఆ పైన పందిరి కూడా వేశారు.

raghu2

వ్యవసాయం చేయాలన్న కోరిక రఘోత్తమ్‌కి ఈనాటిది కాదు. చిన్ననాటిది. చదువుకునే రోజుల్లోనే తమ పెరటిలో కూరగాయలు పండించేవారు. అయితే ఆనాడది ఆటవిడపు వ్యాపకం మాత్రమే. హైదరాబాద్‌ వచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత సాగుని పూర్తికాల విధిగా మార్చుకున్నారు. ఇందులో ఉన్న ఆనందం, ఆరోగ్యం మరెక్కడా దొరకదని చెబుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ వంటి నగరాల్లో వాతావరణం చక్కబడాలంటే… రూఫ్‌గార్డెన్‌ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిబంధన విధిస్తే మేలని రఘోత్తమరెడ్డి సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చదనం మనసుని ఆహ్లాదపరుస్తుంది. హరిత సంపదే కాలుష్యానికి నిజమైన విరుగుడుమంత్రం. ఈ సూత్రం కూడా రఘోత్తమ్‌ మాటల్లో అంతర్లయగా ధ్వనించింది.

ఐదేళ్లుగా రూఫ్‌గార్డెన్‌ వ్యవసాయం ద్వారా రఘోత్తమ్‌ మంచి ఉపాధ్యాయుడిలా మారారు. అందులో ఉన్న సాధకబాథకాలను తేలిక మాటల్లోనే ఆయన ఇతరలతో పంచుతున్నారు. ఇలాంటి విషయాలను ప్రోత్సహించే విషయాల్లో మన వ్యవసాయశాఖకి ఆయన వేసింది సున్నా మార్కులే. “మనది వ్యవసాయిక దేశం కదా.. ఇన్నేళ్ల బట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా…? తమ తమ భూముల లక్షణాలను కొలిచే చిన్నపాటి పరికరం కూడా రైతులకు తయారుచేసి ఇవ్వలేకపోయాం..” అని రఘోత్తమ్‌ అన్నారు. నేల సారం కొలిచే పరికరం ఉంటే రైతులకు తమ పొలంలో ఏ పంట వేస్తే మంచిదో గ్రహించగలుగుతారు. తద్వారా అనవసరపు ఖర్చులు, జంజాటాలు, నష్టాలు తప్పుతాయి అన్నది ఆయన భావన. ప్రభుత్వాలు, వ్యవసాయరంగ నిపుణులు తలుచుకుంటే ఇదేమంత కష్టమైన ఆవిష్కరణ కాదు. కానీ తలుచుకోరు అంతే!

తమ ఇంటికొచ్చే మిత్రులు, బంధువులకు తన రూఫ్‌గార్డెన్‌ని చూపిస్తున్నప్పుడు ఆయన ముఖంలో తొంగిచూసే ఆనందం వర్ణనాతీతం. చివరిగా వారి అభిప్రాయం రాయడానికి ఒక నోటుబుక్కు అందిస్తారు. ఆ పుస్తకం పుటలు తెరిస్తే అపురూప స్పందనలెన్నో! గ్రామసీమలు స్వయంపోషకత్వం సాధిస్తేనే దేశం సుభిక్షమవుతుందని పాలకులు చెబుతారు. నిజానికి ఎవరికి వారు కూడా స్వయంపోషకత్వం సాధించాలన్నది ప్రస్తుతం రఘోత్తమ్‌ తన జీవితాచరణ ద్వారా చాటిచెబుతున్న సిద్ధాంతం. “ఎటువంటి ఆహారం భుజిస్తే సుఖ విరేచనం అవుతుందో అదే నీ ఆహారం” అన్న ఆయన మాట కూడా అక్షర సత్యం! నిజానికి రఘోత్తమ్‌గారి ఇంటినీ, సాగునీ దర్శించక ముందు వరకూ నాతో సహా చాలామందికి ఆయన కేవలం సాహిత్యకారుడిగానే సుపరిచితులు. రైతుగా మారిన రఘోత్తమ్‌ని కూడా చూస్తేనే ఆయన సంపూర్ణ వ్యక్తిత్వ దర్శనం అవుతుందేమోనని ఇప్పుడు నాకనిపిస్తోంది.

ఇక రఘోత్తమరెడ్డి సాహిత్య జీవిత విశేషాలకు వస్తే… తెలుగు కథాసాహిత్యం గర్వకారణంగా భావించే విలక్షణ రచయితలలో ఆయనొకరు. పరిచయం అక్కరలేనంత దొడ్డవారు. రాసినవి ఇరవై మూడు కథలు. అందులో పనిపిల్ల కథమీద సుదీర్ఘ చర్చ జరిగింది. నల్లవజ్రం అనే నవలిక రాశారు. కొత్త తరానికి కథలపై మక్కువ పెంచే ప్రయోగంగా “తుమ్మేటి రఘోత్తమరెడ్డి చెప్పిన ఏడు ఆశు కథలు” పేరుతో ఒక డీవీడీ వెలువరించారు. అందులో ఉన్న సెజ్‌ కథ మీదకూడా చర్చోపచర్చలు సాగాయి. అల్లం రాజయ్య, తుమ్మెటి రఘోత్తమరెడ్డి సృజించిన సాహిత్యాన్ని చదువుకుని పెరిగిన ఒక తరం ఉంది తెలుగునాట. వారుగానీ, వీరుగానీ ఒప్పినా ఒప్పకున్నా ఈ మాట నిజం. అంతటి చేవకలిగిన, చేయి తిరిగిన రచయిత ఈ మధ్య ఏమీ రాయడం లేదు. అదీ నా లోపల గూడుకట్టి ఉన్న బెంగ. ఎప్పుడేనా ఆయన ఎదురుపడితే తప్పక అడగాలనుకున్న ప్రశ్న. నిజంగానే ఈ రోజున ఆయన ముందు నేను.. నా ఎదుట ఆయన ఉన్నాం. అయినా అడగటానికి ఎక్కడో నాలో బెరుకు. తోటలో ఆహ్లాదంగా గడిపి వచ్చిన తర్వాత ఆ మహిమ వల్ల కాబోలు- నాలో బెరుకుపోయింది. “ఈ మధ్య ఏమీ రాయడంలేదెందుకు..?” అని అస్త్రం సంధించా.

raghu3మితభాషి కనుక తన తాజా వ్యాసంగం గురించి క్లుప్తంగా వివరించారు. పుస్తక రూపం దాల్చిన ఆ రచనలు నాచేతికిచ్చారు. అవి చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. జీవన తరుశాఖల నుంచి ఫలసేకరణ చేస్తున్న వనమాలిలా నా కనులకు కనిపించారు. తన జీవితాన్ని మధించి… వచ్చిన సారాన్ని… మహావాక్యాలుగా తీర్చి సూక్తులు రచిస్తున్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి స్వతంత్ర కోట్స్‌ రచన చేపట్టి… దానిని ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నారు. “జీవించు- నేర్చుకో- అందించు” శీర్షికన 2011లో తొలి పుస్తకం విడుదల చేశారు. దరిమిలా రెండవ సంపుటి వెలువడింది. మరో నాలుగు సంపుటాలకు సరిపడా కొటేషన్స్‌ తయారుచేశారు. గత నాలుగేళ్లుగా తొమ్మిదివేలకు పైగా కొటేషన్స్‌ రాశారు. ఆయన నిరాడంబరుడు కావడం వల్ల ఈ ప్రయోగానికి రావాల్సినంత ప్రచారం రాలేదేమో అనిపించింది.

గోదావరిఖని బొగ్గుగనుల్లో కూలీగా చేరి సూపర్‌వైజర్‌ ర్యాంకులో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు రఘోత్తమరెడ్డి. అది కూడా పదమూడేళ్ల సర్వీసు ఉండగానే. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన కొడుకు సీషెల్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం రఘోత్తమ్‌, రూప దంపతులు నారపల్లిలోని సొంత ఇంటిలో సొంత వ్యవసాయం చేసుకుంటూ ఉన్నంతలో హాయిగా, ఆనందంగా బతుకుతున్నారు. ఉన్న దానితో తృప్తిపడే విశాల మనసు ఉంటే అనవసరపు ఆరాటాలకు తావుండదని నిరూపిస్తున్నారు.

ఆయనని ఉపాధ్యాయుడు అని మధ్యలో ఎందుకు సంబోధించానంటే రఘోత్తమ్‌ మాటల నుంచీ, చేతల నుంచీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలియచెప్పడానికే!

*

 

తుమ్మేటి రఘోత్తమరెడ్డి రచయితగా సాహిత్య వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం కూడా ఎంత సౌందర్యవంతంగా, ఈస్టటికల్‌గా చేస్తారో ఈ డాబా (రూఫ్‌గార్డెన్‌) చూస్తే తెలుస్తుంది. ఒక ఎకరంలో ఎంత వైవిధ్యంగా పెంచవచ్చో… ఇంత చిన్న స్థలంలో చేసి చూపిస్తున్నారు… ప్రకృతి వ్యవసాయం…. ప్రకృతితో సహజీవనం… ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సేదదీరడం… ఎంత చల్లని నీడో..! ఇందుకు పడే కష్టంలో ఎంత ఆనందం ఉంటుందో అభిరుచి ఉన్నప్పుడే తెలుస్తుంది…
– బి.ఎస్‌. రాములు
(రూఫ్‌ గార్డెన్‌పై స్పందన)

మీ మాటలు

 1. వావ్.. రఘోత్తం గారి రూఫ్ గార్డెన్ లాగే ఆహ్లాదంగా రాసారు రమేష్ గారు..

 2. వనజ తాతినేని says:

  ఆశ్చర్యం గానూ, అనుసరణీయం గానూ ఉంది. .
  ధన్యవాదాలండీ !

 3. చాలా బావుంది రమేష్ సర్. ఆశ్చర్యం గా అనిపించింది సర్

 4. శ్రీచ‌మ‌న్‌ says:

  తుమ్మేటి ర‌ఘోత్త‌మ్‌రెడ్డి గారి సేద్యం చూశాక‌, గ‌తం గుర్తొచ్చింది. నాకు సాధ్యంకాదుగానీ, ర‌ఘోత్త‌మ్ గారిలా సేద్యం చేయాల‌నుంది. అది తోట కాదు. స‌హ‌జ‌సిద్ధ‌మైన పురా సేద్య‌కారుల క‌ల‌ల‌ పంట‌. ప్యాకెట్‌లో పెట్టి అమ్మే ఆర్గానిక్ ఉత్ప‌త్తుల‌కు అమ్మ‌మ్మ వంటిదీ తుమ్మేటి పంట‌.

 5. sampath rao pulluri says:

  రమేష్ గారు,
  సాధారణంగా తోట చూశాక ఎంతో ఆహ్లాదం అన్పిస్తుంది కాని రాయటం కష్టం. దీన్ని మీరు అధిగమించారు.బాగా చెప్పారు.ధన్యవాదాలు.
  పుల్లూరి సంపత్ రావు

 6. kothapalli ravibabu says:

  కార్మికుడిగా ,రచయితగా రైతు గా తుమ్మేటి కృషి గురించి ఒమ్మి చెప్పిన కధనం చాలా బాగుంది. తుమ్మేటి ఇంటికి అతిథుల ప్రవాహం ఉండవచ్చు.

 7. రఘోత్తం సర్ నాకు చానా ఇష్టమయిన రచయిత. ఆయన మరల సేద్యానికి మూలాలకి పోవడమూ బానే ఉంది. కాకుంటే ఏ ప్రయోజనం ? నాకు నిర్మాణం నిబద్దత లాంటి పెద్ద చర్చ చేసే ధైర్యం లేదు. చెప్పే మాటలకీ ఆచరణకీ పొసగని అపర విప్లవ మేధో వికాసం మీద కూడా నాకేం బ్రమలు లేవు. బద్రలోక్ ప్రవచించే ప్రవచనాల మీదా విశ్వాసం లేదు రఘోత్తం సర్ మలిదశ రచనా వ్యాసంగం మీద తీవ్ర అసంతృప్తి నాకు. ఈ వ్యాసం చదవుతుంటే. కైలాసం లో శివయ్య పారోతమ్మ తో ఉంటూ అప్పుడప్పుడూ లోకం ఎలా ఉందొ చుసోస్తా అని బయలు దేరేవాడట. అలా పోవడం మూలాన పారోతమ్మ ఏకాంతానికి భంగం అవడం ఇష్టం లేక అక్కడే పెద్ద పెద్ద కుండలు పెట్టి అక్కడ కాసిన్ని గింజలు పోసి పచ్చగా ఉంచేది శివయ్య లోక సంచారానికి వెళ్ళే ముందు స్వామీ లోకం మొత్తం పచ్చగా కలకల లాడుతూ ఇలానే ఉంది అనేదట” ఏం ఆశించి ఈ వాక్య రాసోనో అనే చర్చ కన్నా ఆ కథలో ఉన్న నీతే ఈ పాలకులు అనుసరిస్తున్నారు అని అనుకుంటున్నా

 8. mididoddy Swamy says:

  సర్….. సందేశాలు ఇవ్వరు. Aacharane వారి సందేశం…

 9. తెలుగు వెంకటేష్ says:

  అక్షరాలతో కథాసేథ్యం…
  ఆలోచనలతో ఫలసాయం..
  ఆహా…
  తిని తొంగునే మాబోటి వాళ్ళను నిద్దుర లేపారు
  కృషీ వలునికి ధన్యవాదాలు..

 10. Sudhakar ,P. says:

  If we maintain a roof garden like that, what about the slab sir…what kind of precautions or arrangements we need to take. ..please let me know sir.

 11. అవినాష్ మర్రి says:

  రమేశ్ గారి వ్యాసం చదివాక మరోసారి రఘోత్తం సార్ గారి రూఫ్ గార్డన్ చూడాలి అనిపిస్తుంది ముందోసారి గురువు గారు సంపత్ రావు గారితో వెళ్లి చూశ కళ్లతో ఈ వ్యాసం చదివాచక మనస్సుతో చూడాలి.

 12. Prasadamurty says:

  హాయిగా ఆయన తోటలో విహరించినట్లుంది. నాకెంతో ఇష్టమైన రచయిత తుమ్మేటి. ఒకసారి వెళ్ళాలి.

 13. Devika rani.p says:

  రెడ్డిగారి రూఫ్ గార్డెన్‌ను ఎంత చక్కగా పరిచయం చేశారు…నాకు చూడాలని ఉంది..ఎప్పుడెళ్దాం సర్…పల్లెలో పెరిగిన నాక్కూడా మొక్కలంటే, చెట్లంటే చాలా ఇష్టం…ఎన్నిరకాల మొక్కలు పెంచానో…ప్చ్.. పెళ్లై నగరానికొచ్చి చాలా మిస్ అవుతున్నా….రఘోత్తమ్ రెడ్డి గారి రూఫ్ గార్డెన్ చూడాలి..నేనూ అలాంటి గార్డెన్ పెంచాలి. మనోభీష్టఫలసిద్ధి రస్తు అని దీవించండీ…

మీ మాటలు

*