ఇంత నిద్రెందుకో మనకి!

 

 

-నిశీధి

~

మతం తర్వాత  ఈ ప్రపంచానికి పట్టిన భయంకరమయిన జబ్బు , నిజానికి అంటువ్యాధి అనే చెప్పుకొనేది ఏమయినా ఉంటే అది ఖచ్చితంగా అవనీతి మాత్రమే . ఆ జబ్బు మనలో ఎంత  ముదిరిందో తెలుసుకోవడానికి  , అధికారం జనాన్ని కరప్ట్  చేయదు ,  జనమే అధికారాన్ని కరప్ట్ చేస్తారు  అనడానికి ప్రస్తుత  భారతదేశం ప్రపంచ దేశాలకే ఒక నెగటివ్ మోడల్ ఐకాన్ గా మారుతుందని అర్ధం కావడానికి మనలో మన చుట్టూ కొన్ని వందల ఉదాహరణలు దొరుకుతున్నాయి .

ఇందుకు అతి పెద్ద  ఉదాహరణగా , నిజానికి దేశభక్తులు ఎవరు దేశద్రోహులు ఎవరు అన్న చర్చ అటు కార్పోరేట్ కనుసన్నలలో నడిచే మీడియాలోనే కాక స్వీయ అభిప్రాయ ప్రకటన అవకాశాలు  హెచ్చుగా ఉన్న సోషల్ మీడియాలో లో సైతం  పెద్ద ఎత్తున సాగుతున్న ఈ తరుణంలో ఒక పక్క   పనామా  పేపర్స్‌లో ఇండియా కీర్తి పతాకాలు రెపరెపలాడించి మరో పక్క ఇడియట్ బాక్సుల ముందు కూర్చునే ఇడియట్స్ కోసం చాలా జాగ్రత్తగా కాసుల గలగలలు స్పష్టంగా వినిపించేలా  తయారు చేసిన క్రికెట్ ఆటల ముందో వెనకో చేతిలో ఇండియన్ ఫ్లాగ్ అందరికి కనపడేలా బేస్ వాయిస్ లో జనగణమన పాడి వీర దేశభక్తుల దిల్  కా దడ్కన్ తో పాటు వళ్ళంతా  వద్దన్నా  కరుచుకోచ్చే గూస్బంప్స్ పెంచిన ఆరడుగుల దేశభక్తిని రేపొద్దున్న మన ఖర్మ కాలితే భారత దేశ మొదటి పౌరుడుగా  చూడాల్సోస్తుందేమో అన్న ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తుంది . ప్రెసిడెంట్ పదవి ఆషామాషీ ఆటేమి కాదు “ దేశంలో  అతున్నత స్థాయి రబ్బర్ స్టాంప్  ఉద్యోగమే “ అని గల్లీలలో క్రికెట్ ఆడే పిల్లలకి సైతం విదితమే  అయినా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెరిగిపోతున్న అర గుంట ఆస్తుల్లో పంటలు పండించుకోడానికి అప్పులు  తీసుకోని , కట్టలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుభారతం ఒక పక్క లక్షల కోట్లు ఎగేసి రంజుగా విమానాలేసుకొని దేశాలు దాటి పోతున్న మోడీలు మాల్యాలు ఇంకో పక్క , అదే సమయంలో కోట్లు వెనకేసుకొని విలాసంగా నవ్వుతూ  దేశంలో కౌన్ బనేగా  కరోడ్‌పతి అంటూ ఈజీ మనీ గేమ్స్  తో పాటు మనీ ల్యాండరింగ్  కేసుల్లో ప్రముఖంగా  వినబడే  బచ్చన్లు దేశభక్తులుగా  కీర్తించబడుతున్న ఈ   టైమ్‌లో నిజమే ఈ దేశంలో  ఉండాలంటే  భయమే మరి . అదే మాట పైకి చెప్పిన పాపానికి అమీర్‌ఖాన్ పై  సహన ప్రియులంతా  ఎంత అసహనాన్ని  చూపారో ఇంక్రేడిబుల్ ఇండియా బ్రాండ్  అంబాసిడర్‌గా అమీర్ ని పక్కన పెట్టినప్పుడే  తెలిసిపోయింది మనం అంతా  ఎలాంటి సమాజాన్ని  సృస్టించడంలో  నిమగ్నమై  ఉన్నామో .

ఒక సామాన్యుడికి పేట్రియాటిజం అంటే తిరంగా ఝండాలు భుజాన మొయ్యడం , భారత మాతాకి జై  చెప్పడమేనా  ? లేదా  దేశాన్ని  దేశ భవిష్యత్తుని నిర్మించుకొనే పునాది ఇటుకల్లో భాగస్వామ్యం కావడమా ?  ప్రతి వ్యక్తిని , పూర్తి వ్యవస్థని వ్రేళ్ళతో సహా కుళ్ళబెట్టి మొత్తం దేశపు నదుల్లో , భూసారంలో కూడా  కలిసిపోయినంతగా  మనల్ని పెనవేసుకుపోతున్న  పెనుబాము అవనీతికి  ఎదురు నిలబడే శక్తి మనలో నశించిందా ? లేక ఎదురు తిరిగే సామర్థ్యం ఉన్నా నిద్ర నటిస్తూనే  ఉంటామా  ? పనామా  పేపర్స్  నిండా మనదేశ  హేమాహేమిల పేర్లు  బయటికొస్తున్న సమయంలో నిజంగా  స్పందించాల్సిన రీతిలోనే  మనం  స్పందిస్తున్నామా ? అక్కడో ఇక్కడో  సోషల్ మీడియాలో చెణుకులు వినిపిస్తున్నా మాతాజీలు బాబాజీ ల అభ్యంతరకరమైన వాక్యాల  మీదనో , పాపులర్ నినాదాల మీదనో  జరుగుతున్న  చర్చలు , ప్రతి సామాన్యుడి రక్తం ఉడికిపోవాల్సిన సిట్యువేషన్స్ ఏమి  ఈ రోజు ఎందుకు కనిపించడంలేదు ? ఈ ప్రశ్నలకి సమాధానమేది ?  లేదా  మనమొక వెయ్యి  తింటాం పక్కనోడు పదివేలు ,  ఆ పై వాడు పదివేల  కోట్లు తింటాడు  అన్నంత  సింపుల్‌గా  కణాల్లో  జీర్నించుకుపోయిన కరప్షన్ జీభూతాలని  వదిలించుకోవడానికి ఇష్టపడటం లేదా ?

ఇంత మౌనం పాటిస్తున్న  సభ్యసమాజం కోసం  నిజానికి  సరయిన నిర్వచనాలలో దేశభక్తి అంటే ఏమిటో ఒక పెద్ద డిబేట్  జరగాల్సిన  ఈ సందర్భంలో మత్తు  వదలరా  నిద్దుర మత్తు వదలరా  అని  మన కొసరాజు  1966 లోనే  రాసినా  , ఇపుడు మాత్రం అన్నా హజారే యాంటి  కరప్షన్  మూమెంట్ సమయంలో బాలివుడ్ లిరిసిస్ట్ ప్రసూన్ జోషి రాసి గళమెత్తిన ఒక చిన్న కవిత ఈ  సారి  మనకోసం . గవర్నమెంటులు మారినా , అధికారపు పార్టీల జెండా  రంగులు  ఏవయినా మనలో మార్పు  రానంత వరకూ మన దేశభక్తి నాటకాలు అన్ని హుళిక్కి అని తేల్చి  చెప్పే  సర్వకాల సకల జనుల గీతం  తెలుగు లో  ఇలా

 

ఇంత నిద్రెందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి

అలికిడి లేకుండా నల్లని రాత్రులు వచ్చిపోతూనే  ఉంటాయి

అలికిడి లేకుండానే ఏ క్షణమయినా గుండె చప్పుడు ఆగిపోతుంది

అయినా మరోసారి వత్తిగిలి పడుకొని  అన్నీ మర్చిపోతాం మనం

ఇంత నిద్రెందుకో  మనకి

మగతా లేక  మరేదయినా మత్తా ఇది

నెమ్మది నెమ్మదిగా ఇంతగా  అలవాటు పడిపోతూ

 

అబద్ధాల వర్షపు వెల్లువలో

నిజాల వేణుగానమేదో

ఒకే ఒక గాలి వీచిక కోసం ఎదురు చూస్తూనే కృశిస్తుంది

తర్వాతెందుకో దుఃఖిస్తాం మనం

మరీ ఇంత నిద్రెందుకో మనకి

 

నారు మనదే  నాట్లు  మనవే

ఆశ్చర్యం ఏమిటో  ఇలా ఎదిగిన పంటలు చూసాక

నరికేయాలి నశింపచేయాలి

ఈ రోజు మనముందు పెద్ద సవాలే  నిలబడి ఉన్నపుడు

ముళ్ళనెందుకు విత్తుతున్నాం మనం

ఇంతగా ఎందుకు  నిద్రిస్తున్నాం  మనం

 

ఆట అందరిదే

ఓటమీ అందరిదే

అదేమిటో అనూహ్యమైన విచిత్రపు  ఆట

ఇంజను  నలుపే

డబ్బాలు నలుపే

నిండు భారంగా నడిచే పాత ట్రైనే ఇది

మరి ఈ రైలే ఎక్కిపోవాలని కోరికేమిటో మనకి

 

జోలపాటలు కాదిప్పుడు

లాగిపెట్టి చెంపదెబ్బలు కొట్టండిప్పుడు

ఒక చిన్న బ్రతుకాశ ఇవ్వండిప్పుడు

లేదంటే  మళ్ళీ  నిద్రిస్తాం

కలల్లో మళ్ళీ మునిగిపోతాం

రండి ఇలా  పాపాలు కడుక్కుందాం

 

ఇంత నిద్రేందుకో  మనకి

ఇంత దీర్ఘమైన ఇంత ఘాడమయిన నిద్రెందుకో మనకి!

 

 

~

ఇంకొంచం ఓపిక ఉన్నవారికోసం ప్రసూన్ జోషి ఒరిజినల్  కవిత యూట్యూబ్ లింక్

 

 

 

 

 

మీ మాటలు

 1. penugonda basaveshwar says:

  గోప్యంగానే ఉండాలట
  గొప్పోళ్ళ ఇంటి గోత్రాలు
  ఐనా వీళ్ళే చెబుతారు
  శ్రీ రంగ నీతి సూత్రాలు

  చాటింపు వేసి చెబుతున్నా
  పనామా వారి పత్రాలు
  ఆ దేశంలోనే ఉన్నాయట
  నల్ల ధనం దాచే సత్రాలు

  • బ్రెయిన్ డెడ్ says:

   బాగుంది , నిజానికి ఎలాంటి పదాలు రావాల్సిన అవసరం ఇంకెంతో కదా

 2. అజిత్ కుమార్ says:

  వాళ్ళా తప్పు చేశారూ… వీళ్ళీ తప్పుచేశారూ అని చాడీలు చెప్పడం కూడా తప్పేగదా…

  • బ్రెయిన్ డెడ్ says:

   అన్ని తప్పులు చేసి చూసి నేర్చుకోవాల్సిన పని లేదు కదా సర్ . సో చాడిల రూపంలో అయినా కొంత తప్పు చేయకుండా ఉండే ధైర్యం తెచ్చుకోవడం

 3. sadlapalle chidambarareddy says:

  నిజంగా ఈ మనో వ్యథ కు ముందు ఎన్ని సార్లు గుండె గాయమై చీము నెత్తురు కారుతూ నిద్ర నుండి దూరం చేసిందో .మన వంటి లక్షల కోట్ల శవ మూకలను చూసి కనీరు కార్చిందో అది అక్షరాల్లొ వ్యక్తమవుతోంది.

  • బ్రెయిన్ డెడ్ says:

   మీరు ముందు చెప్పినట్టు ఇలాంటి వంటరి యుద్ధాలు ఎవరికీ వాళ్ళం కాకుండా కూసంత కలిసి చేస్తే ఇంకొంత ఫలితం ఏమో

 4. వాసుదేవ్ says:

  మతాన్ని దాటి అవినీతి పై మీ పోరాటవాక్యం కోసం మీరు పరిచయం అయినప్పట్నుంచీ ఎదురుచూస్తూనే ఉన్నా. హమ్మయ్య ఇన్నాళ్ళకి మీనుంచి ఓ కొత్త వాక్యాన్ని చదివి మంత్రముగ్ధుణ్నయ్యాను.ముఖ్యంగా ఆ కవిత. అది ఓ కవితలా కాకుండా ఓ ఆవేశపూరిత ప్రసంగంలా అనిపించి ఆసాంతం ఆస్వాదించాను.
  “ముళ్ళనెందుకు విత్తుతున్నాం మనం” ఒకవేళ నాటకపోయినా వాటిమీంచే సుఖంగ వెళ్ళిపోతుంటాం. అది అలవాటయింది. కరప్షన్ లేకపోతే ఇది ఇండియా కాదేమొనన్న స్తాయికి ఎదిగాం (?) ప్రసూన్ జోషి ఓ సైలెంట్ ప్రొటేస్టర్. అప్పట్లో రాజకీయ కవితల్లా ఇతని కవితలూ ఉర్రూతలూగిస్తాయి.
  “రండి ఇలా పాపాలు కడుక్కుందాం” ఔను. పాపాలు కడుక్కునే టైమయింది. గంగెలాగు ఎండిపోయింది కాబట్టి మానసికమైన పాపాలనైనా కడుక్కుందాం– ఓరోజైనా నిద్రలేచి, ఓ రోజైన ఉద్యమించి. కుడోస్ నిషీజీ మరో మంచి అనునాదానికి. పక్కవాద్యాలకోసమే ఇక నిరీక్షణ.

  • బ్రెయిన్ డెడ్ says:

   మతమే మొదటి అవనీతి కేంద్రం అయినప్పుడు మతాన్ని దాటి మళ్ళీ కొత్తగా అవనీతి మీద రాసేది ఏమి ఉండదు అనిపించేది కాని , ఈ టాపిక్‌లో మన అలసత్వం మీద నిజంగానే అసహ్యం . ఇంకొంచం బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండటంలో మనకి పెద్ద నష్టం ఏమి లేదేమో అన్న భావన . థాంక్స్ సర్ . పక్క వాద్యాలు సబ్జెక్ట్ మతం కాదు కాబట్టి గాఢనిద్ర నటిస్తుంటాయి కదా ఎప్పటిలానే

 5. విలాసాగరం రవీందర్ says:

  దేశ భక్తి అర్థం మారిపోయింది. రేపు ఆ పనామా మాయలోళ్ళు మేమే అసలు దేశ బత్తులమని బుకాయిస్తూ లైవ్ శోలు ఇస్తారు.

  ఇప్పుడు ప్రతి పండక్కీ ఎన్నిఅబద్ధాలను తనివితీరా వింటూ చూస్తున్నం. మన మొద్దు నిద్ర వదలం గాక వదలం.

  సమయోచితంగా మంచి పోయెం నిశీది గారు

  • బ్రెయిన్ డెడ్ says:

   థాంక్స్ రవి గారు . మంచి కవిత్వం ఎపుడు ఒక ఉత్సాహమే కదా

  • THIRUPALU says:

   //దేశ భక్తి అర్థం మారిపోయింది. రేపు ఆ పనామా మాయలోళ్ళు మేమే అసలు దేశ బత్తులమని బుకాయిస్తూ లైవ్ శోలు ఇస్తారు. //
   ఇంకా బుకాయించడమేమిటి. బుకాయించే ఆట ఎప్పుడొ మొదలైంది. మీరో మరీ లేటు గా మేలొకొన్నారు.
   ‘అవినీతి’ అంటే ఏమిటి ? అని అడిగే స్థాయికి మనమంతా నెట్ట బడినాము. అవినీతి పరుడు కాని వాడికి అన్నం దొరకదు అన్నంత మునిగి పోయినాము.

 6. bolimeru prasad says:

  పనామా పేపర్స్… … బాంకు బాకీల ఎగవేతలు… జరగవల్సినంత చర్చ జరగక పోవడం ఈ”దోపిడి దేశభక్తుల” కి వూరటే.. మనది మొద్దు నిద్రే… కాకుంటే బాకీ ఎగ్గొట్టిన దొంగల వివరాలు చెప్పననటానికి రిజర్వ్ బాంక్ కి,, ఈ దగుల్భాజితనాన్ని నిలదీయాల్సిన మేధావులకి మనమంటే ఎంత చులకన? — మనమంటే మనకే చులకన—-

  • బ్రెయిన్ డెడ్ says:

   మీ నుంచో పవర్ఫుల్ కవిత కోసం ఎదురుచూపు

 7. ఇంత నిద్దరెందుకంటావేమిటి నిశీధీ! ఇది నిశీధి కనుక (కిడ్డింగ్).
  రాజకీయాల్లో మతం, అవినీతి ఐడెంటికల్ ట్విన్స్ కాదూ?
  ఇద్దరి అమ్మ/నాన్న ఒకరే. దాని పేరు హిపోక్రిసీ. ఒక చిన్న పదవో, బహుమతో పారేస్తే మహాభాగ్యమని ఏరుకోడానికి మనలోనే, మన పక్కన్నే (రాసే, కూసే వాళ్లలో) గుట్టలు గుట్టలు గుట్టలు జనాలు లేరూ?
  వాళ్ల మీద ఉందా మనకు ఖోపం?

  • బ్రెయిన్ డెడ్ says:

   హిపోక్రసి మనిషి హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంటే , మీ మాటలు కాదనే ధైర్యం ఉందా సార్ థాంక్స్ అలాట్ ఓపిగ్గా చదివినందుకు

 8. దేవరకొండ says:

  పార్లమెంటరీ (పార్టీ) రాజకీయాలు కాకుండా మరో ప్రత్యామ్నాయ విధానం లేదు మనకి. పార్టీలన్నీ సారంలో ఒకటే! ప్రత్యామ్నాయాలే లేని దరిద్రంలో వున్నమనకి నిద్రే బెస్ట్! మేలుకొంటే బాధ్యతలు నెత్తిన పడతాయి. బాధ్యతల్లేని హక్కులు కదా మనకి కావలసింది! కుల మతాలు ఎప్పటికీ వుంటాయి. అవి పోయేదాకా దేశం బాగుపడదనే వాళ్లు కాస్త సంయమనంతో ఆలోచించాలి. కుల మతాలను (వాటితో పోరాడుతూనే) పక్కన బెట్టి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని వుంటాయని, అక్కడ రాజీ, మెతక ధోరణులు కూడదని గుర్తిస్తే అది ఒక ముందడుగు.

  • బ్రెయిన్ డెడ్ says:

   కులం మతం అవనీతి మొత్తానికి ఈ దేశాన్ని ఏది వదిలేలా కనిపించడం లేదు ప్రస్తుత కాలం లో . థాంక్స్ సర్

 9. Buchireddy gangula says:

  పనామా పేపర్స్ —దీని మీద ఏ చర్చ జరుగదు —మోడీ ప్రభుత్వం జోకొట్టి నిద్రపుచ్చుతుంది —
  దారి మళ్ళిస్తుంది –కట్టు. కథలు. Vఒల్కబోస్థధి–
  రాజులు వారసత్వ పాలనల తో పాలిస్తున్న దేశం లో –ఏ మార్పు రాదూ –రాబోధు

  H .R .కే. గారు –ఇందిరమ్మ –ఎమర్జెన్సీ పాలన ను సమర్థిస్తూ –Sri శ్రీ గారు–ఆరుద్ర గారు–సోమసుందర్
  గారు–గేయాలు రాశారు
  డబ్బుతో—ఆధిపత్యం తో. ఏమయినా. చేయగలరు
  కుటిల రాజకీయాలతో –ప్రజాసామ్యాన్ని ఖూని చేసే –నాయకులు రాజ్యం యేలుతుంటే ???
  ———————————
  Buchi రెడ్డి గంగుల

మీ మాటలు

*