పురాతన మైసీనియాలో అమ్మవారి స్వర్ణముద్ర!

 

స్లీమన్ కథ-27

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)-కల్లూరి భాస్కరం

~

 

మైసీనియాలో స్లీమన్ చేపట్టిన పని పూర్తయింది. నవంబర్ చివరిలో గ్రీస్ రాజుకు ఒక తంతి పంపించాడు. తవ్వకాలలో తను కనుగొన్న స్వర్ణసంపదతోపాటు, ఇతర విశేషాలను అందులో వివరించాడు. ఒక్క స్వర్ణ సంపదతోనే పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయచ్చనీ, అది ప్రపంచంలోనే ఒక అద్భుత మ్యూజియం అవుతుందనీ, దానిని దర్శించడానికి కొన్ని శతాబ్దాలపాటు విదేశీ పర్యాటకులు గ్రీస్ కు బారులు కడతారనీ అన్నాడు. తను కేవలం శాస్త్రవిజ్ఞానం మీద మక్కువతోనే పని చేశాననీ, ఈ స్వర్ణసంపదపై ఎలాంటి హక్కునూ ప్రకటించబోననీ నొక్కి చెప్పాడు. ఆ ముల్లెను ఎంతో భద్రంగా గ్రీస్ కు అప్పజెబుతున్నాననీ,  భగవంతుడి దయవల్ల అది జాతీయ సంపదకు అపారమైన మూలనిధి కావాలని ఆకాంక్షిస్తున్నాననీ అన్నాడు.

తీరా రాజుగారి కార్యదర్శినుంచి వచ్చిన జవాబు చూసి నీరుగారిపోయాడు. అది చాలా క్లుప్తంగా ఉంది. అతను జరిపిన ముఖ్యమైన పరిశోధనలకు, అందులో చూపించిన ఉత్సాహానికీ, శాస్త్రవిజ్ఞానం పట్ల మక్కువకు రాజు అభినందనలు తెలిపాడు. భవిష్యత్తులో జరపబోయే తవ్వకాలు కూడా ఇలాంటి విజయాన్నే చేకూర్చగలవన్న ఆశాభావాన్ని ప్రకటించాడు.

స్లీమన్ తను తవ్వకాలు జరిపిన చోటునుంచి మొదటిసారి వట్టి చేతులతో తిరిగి వెడుతున్నాడు. మైసీనియాలో అతను కనుగొన్నవన్నీ గ్రీకు ప్రభుత్వం ఆస్తిగా మారబోతున్నాయి. తవ్వకాలు జరిగినంత కాలం తనకు పక్కలో బల్లెంలా ఉంటూవచ్చిన స్టెమటేక్స్ తనకంటే ముందే పరిశోధనాంశాలను బహిర్గతం చేయడం ప్రారంభించాడు. దాంతో ఆగ్రహించిన స్లీమన్, అతన్ని నిరోధించాలనీ, పరిశోధనాంశాలను వెల్లడించే హక్కు తనకే ఉంది తప్ప ప్రభుత్వానికి కాదనీ స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి తంతి పంపించాడు.

ఆవిధంగా ప్రభుత్వంతో అతనికి మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈమధ్యలో నాప్లియో పట్టణ పాలకవ్యవస్థ జోక్యం చేసుకుని అక్కడ దొరికిన నిక్షేపాలను అక్కడే భద్రపరచాలని డిమాండ్ చేసింది. అది పట్టణానికి చెందిన ఆస్తి అనీ, దానివల్ల పట్టణానికి మేలు జరుగుతుందనీ నొక్కి చెప్పింది. ఇది తెలిసి స్లీమన్ రగిలిపోయాడు. ఇంకోవైపు, తన పరిశోధనాంశాలపై ప్రసిద్ధ పురావస్తు సొసైటీలు అన్నింటికీ తంతి పంపుతూ;  తవ్వకాలు జరిపిన ప్రదేశంలో  భారీ సంఖ్యలో తీసిన ఛాయాచిత్రాల కూర్పుపై ఆలోచన చేస్తూ, నోట్సు, డైరీలు రాసుకుంటూ గడిపాడు. యథావిధిగా జర్మన్లు అతని నిర్ధారణలను ఎద్దేవా చేస్తూ కొట్టి పారేశారు. ఫ్రాన్స్ ఆసక్తి చూపించలేదు. ఒక్క ఇంగ్లండ్ మాత్రమే అతని ఉత్సాహంలో పాలుపంచుకుంది.

శీతాకాలాన్ని ఎథెన్స్ లో గడిపాడు. తన రికార్డులకోసం ఆగొరా పూర్తి రేఖాచిత్రం గీసి తెమ్మని మైసీనియాలో తన దగ్గర పనిచేసిన యువ ఇంజనీర్ వసీలియోస్ డ్రొసినోస్ ను పంపించాడు. ఆగొరాకు దక్షిణంగా పాక్షికంగా తవ్వకాలు జరిగిన చోట అతనికి పైపైన చెక్కిన రాళ్ళు కనిపించాయి. అవి సమాధి మందిరంలో కనిపించిన రాళ్లలా ఉన్నాయి. అదే రోజున మైసీనియాకు వచ్చిన స్టెమటేక్స్ తో వాటి గురించి చర్చించాడు. ఒక పనివాణ్ణి రప్పించి అక్కడ తవ్వించారు. ఒక స్వర్ణపాత్ర బయటపడింది. ఆ తర్వాత మరో అయిదు బంగారు పాత్రలు బయటపడ్డాయి. వాటిలో నాలుగింటికి కుక్క తల ఆకారంలో సున్నితంగా మలచిన కాడలు ఉన్నాయి. ఒకటి ఏ అలంకారమూ లేకుండా సాదాగా ఉంది. ఆపైన బంగారు తీగనుంచి మలచిన ఎన్నో ఉంగరాలు, రెండు స్వర్ణముద్రలు బయటపడ్డాయి. వాటిలో ఒకదాని మీద కొన్ని జంతువుల తలలు, మొక్కజొన్న కంకులు చిత్రితమై ఉన్నాయి. రెండోది మాత్రం కళాఖండమని చెప్పవచ్చు.

అది అమ్మ(Mother Goddess)వారికి చెందిన స్వర్ణముద్ర. మొదటి సమాధిలో దొరికిన బంగారు ముసుగులానే ఇది కూడా మైసీనియా ప్రజల ప్రగాఢ మతవిశ్వాసానికి అద్దంపడుతోంది. దాని మీద  అమ్మవారికి  నైవేద్యం ఇస్తున్నట్టు సూచించే చిత్రం ఉంది. అది కూడా అతి నిరాడంబరంగా ఉంది. దేవాలయం, పీఠం, తెరలు, తంతులు మొదలైనవి లేవు. అమ్మవారు ఒక పవిత్రవృక్షం కింద కూర్చుని ఉంది. తలపై పువ్వులు తురుముకుంది. ఆమె చేతిలో కూడా పువ్వులు ఉన్నాయి. కులీనతను చాటే ఇద్దరు యువతులనుంచి పువ్వులు స్వీకరిస్తోంది. బహుశా వాళ్ళు పూజారిణులు కావచ్చు. అమ్మవారి ఎదురుగా నిలబడిన ఒక పరిచారిక ఆ ఇద్దరినీ అమ్మవారికి చూపుతోంది. ఇంకొక పరిచారిక చిన్న రాతిగుట్టను ఎక్కి పవిత్రవృక్షఫలాన్ని తెంపుతోంది. అది అమ్మవారికి నివేదన చేయడానికి కావచ్చు. ముడతలు, ముడతలుగా ఉండి, మంచి అల్లికపని చేసిన జోడులంగాలను అందరూ ధరించారు. వీరుల యుగానికి చెందిన మైసీనియా సంస్కృతిలో అలాంటి జోడు లంగాలనే ధరించేవారు. అమ్మవారిలానే అందరూ నగ్నవక్షాలతోనూ, తలపై పువ్వులు, ఇతర అలంకారాలతోనూ ఉన్నారు.

పూజారిణులకు, అమ్మవారికి మధ్యలో రెండు జంట గొడ్డళ్ళు ఉన్నాయి. వాటిలో ఒకటి పెద్దది, ఇంకోటి చిన్నది. ఈ జంట గొడ్డళ్ళు బహుశా లౌకిక, పారలౌకిక శక్తులను రెంటినీ సూచిస్తూ ఉండచ్చు. పూజారిణులకు పైన; శిరస్త్రాణామూ, చేతిలో ఖడ్గమూ ధరించిన ఒక యువతి గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆమెను ఎనిమిది(8)అంకె ఆకారంలో ఉన్న ఒక డాలు కప్పి ఉంది. మనకు తెలిసినంతవరకు ఒక సాయుధ దేవతను చిత్రిస్తున్న తొలిచిత్రం ఇదే. ఈమెకు ఒక పక్కన ఉజ్వలంగా ప్రకాశిస్తున్న సూర్యుడు, చంద్రవంక చిత్రాలు ఉన్నాయి. అవి మధ్యాహ్నాన్నీ, రాత్రినీ కూడా సూచిస్తున్నాయి.

ఈ చిత్రంలోని వ్యక్తులందరిలో ప్రశాంతత, పవిత్రత ఉట్టిపడుతున్నాయి. అప్పటి జనం, జీవితంపట్ల ధీమాతో ఎంతో ప్రశాంతజీవనం సాగిస్తున్న సంగతిని ఈ స్వర్ణముద్రలోని ప్రతి వివరం సూచిస్తోంది. ఈ ముద్ర ఎంత చిన్నదంటే, ఒక అంగుళం వెడల్పును మించిలేదు. కళాకారుడు అంత చిన్న ముద్రలోనే శతాబ్దాలుగా సంతరించుకున్న మతవిజ్ఞానాన్ని అంతటినీ అద్భుతంగా రంగరించాడు. స్వర్గశక్తి కాంతి రూపంలో వలయాలు వలయాలుగా కిందికి ప్రవహిస్తోంది. పవిత్రమైన తోపులో కూర్చుని ఉన్న అమ్మవారి నుంచి అదే శక్తి పొంగిపొరలుతోంది. పూజారిణులలో వినయవిధేయతలకు బదులు,  ఒక హక్కుగా తాము అమ్మవారి దగ్గర ఉన్నామన్న భావన కనిపిస్తోంది.  అమ్మకు నివేదన చేయడంలో ప్రేమాభిమానాలు తొంగిచూస్తున్నాయి. ఈజిప్టు చిత్రాలలో దేవతలకు నివేదన చేసేటప్పుడు భక్తులలో కనిపించే దాస్యభావన వీరిలో కనిపించడంలేదు. వీరిలో ఒక మానవీయమైన ఆత్మగౌరవం, హుందాతనం వ్యక్తమవుతున్నాయి. సూర్య, చంద్ర కాంతులలో స్నానమాడుతూ స్వేచ్ఛగా సంచరించేవారిలా కనిపిస్తున్నారు.

ఈ స్వర్ణముద్ర సంకేతించే పూర్తి అర్థమేమిటో తెలియదు. చిత్రానికి ఒక పక్కన ఆరు విచిత్రమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అవి బంగారు ముసుగులో, కపాలాలో, శిరస్త్రాణాలో, పవిత్రపుష్పాలో లేక మరొకటో తెలియదు. ఆ పవిత్రవృక్షం దేనిని సూచిస్తోందో కూడా చెప్పలేం. స్టెమటేక్స్ నుంచి అతి కష్టం మీద ఈ స్వర్ణముద్ర ఫోటో ను సంపాదించి పరిశీలించిన స్లీమన్, అందులోని చెట్టు ఫలాలు అనాసలో లేదా మధ్య అమెరికాలో తను చూసిన పనస తరహా పండ్లో కావచ్చు ననుకున్నాడు.  అందులోని స్త్రీలు శిరస్త్రాణం లాంటిది ధరించారనుకున్నాడు. వాళ్ళలో కనిపించే పురుషలక్షణాలు అతనికి విస్తుగొలిపాయి. వాళ్ళ లంగాలకు ఉన్న పట్టీలు చంద్రవంక ఆకారంలో ఉన్నాయనుకున్న స్లీమన్, అలాంటి చంద్రవంక రూపాలే స్వర్ణముద్ర అంతటా ఉన్నాయని అనుకున్నాడు. సూర్య, చంద్రుల కింద అలలు అలలుగా ఉన్న గీతలు సముద్రాన్ని సంకేతిస్తున్నాయని ఊహించాడు. అవి స్వర్గకాంతి వలయాలనూ, లేదా పాలపుంతనూ కూడా సూచిస్తూ ఉండచ్చు.

అఖిలెస్ కోసం ఈఫెస్టస్ (లోహపు పని చేసే గ్రీకు దేవుడు) అయిదు వలయాలు కలిగిన ఓ పెద్ద డాలును ఎలా తయారు చేశాడో ఇలియడ్ లో హోమర్ వర్ణించాడు.  మొదటి వలయం భూమి, ఆకాశం, సముద్రం, అలుపనేది ఎరగని సూర్యుడు, పూర్ణచంద్రుడు, నక్షత్రమండలాలను సూచిస్తుంది. స్లీమన్ మొదటిసారి అమ్మవారి స్వర్ణముద్రను చూసినప్పుడు ఉత్తేజితుడయ్యాడు. “అఖిలెస్ డాలుకు ఈఫెస్టస్ ఎలాంటి మహిమలు కల్పించాడో వర్ణించిన హోమర్, బహుశా ఈ స్వర్ణముద్రను చూసి ఉంటా”డని తన పక్కనే ఉన్న సోఫియాతో అన్నాడు. అంతటి విశిష్టమైన స్వర్ణముద్ర మొదట తన కంట పడనందుకు ఎంతో విచారించాడు. అయితే, తను కనుక ఇంజనీర్ ను పంపి ఉండకపోతే అది ఎప్పటికీ బయటపడేదే కాదనుకుని ఊరడిల్లాడు.

మైసీనియాలో తను కనుగొన్న విశేషాలకు పుస్తకరూపమిస్తూ ఎనిమిది వారాలు గడిపాడు. వెంటనే దానిని ఫ్రెంచ్, ఇంగ్లీష్ లలోకి అనువదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత, తన పుస్తకానికి పరిచయవ్యాసం రాయవలసిందిగా బ్రిటిష్ రాజకీయ కురువృద్ధుడు, గొప్ప హోమర్ అధ్యయనవేత్త అయిన  గ్లాడ్ స్టన్ ను కోరాడు. తన ప్రశంసకు అపార్థాలు కల్పించవచ్చునని భయపడి గ్లాడ్ స్టన్ అందుకు వెనకాడాడు. వేసవిలో లండన్ సందర్శించిన స్లీమన్ తనతో ట్రాయ్ నిక్షేపాలను తీసుకువెళ్లి, సౌత్ కెన్సింగ్టన్ మ్యూజియంలో వాటిని ప్రదర్శింపజేశాడు. గ్లాడ్ స్టన్ కు అవి నిజంగానే ట్రాయ్ నిక్షేపాలన్న నమ్మకం చిక్కకపోయినా, స్లీమన్ పాండిత్యానికి ముగ్ధుడై చివరికి నలభై పుటల పరిచయవ్యాసం రాసి ఇచ్చాడు.

అమ్మవారి స్వర్ణముద్ర ప్రత్యేకించి గ్లాడ్ స్టన్ ను ఆకట్టుకుంది. తొలి సమాధిలో కనిపించిన కళేబరం అగమెమ్నన్ దే కావచ్చని స్లీమన్ లానే ఆయనా అనుకున్నాడు. రూపురేఖలు పదిలంగా ఉన్నాయి కనుక, దానిని భద్రపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనీ, మృతుడు ఒక విశిష్ట వ్యక్తి అయినప్పుడే అలా జరుగుతుందనీ భావించాడు. అగమెమ్నన్ వెంట ఎప్పుడూ ఇద్దరు పురోహితులు ఉండి హెచ్చరికుల పాత్ర నిర్వహిస్తూ ఉంటారని ఇలియడ్  చెబుతోంది కనుక, సమాధిలో ఈ కళేబరం పక్కనే కనిపించిన రెండు కళేబరాలూ నిస్సందేహంగా వాళ్ళవే అయుంటాయని గ్లాడ్ స్టన్ అనుకున్నాడు.

లండన్ లో తను పొందిన గౌరవాదరాలకు స్లీమన్ పొంగిపోయాడు. గ్లాడ్ స్టన్ తో కలసి విందుభోజనం చేశాడు. ఎథెన్స్ లో అస్వస్థతతో ఉన్న సోఫియాకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె పక్కన లేకుండా అతను ఎక్కువ రోజులు గడపలేడు. ఎట్టకేలకు, రాయల్ ఆర్కియలాజికల్ సొసైటీ సభ్యులు ఆమెను ప్రసంగానికి ఆహ్వానించడంతో వెంటనే లండన్ వచ్చి భర్త పక్కనే వేదికను అలంకరించింది. ఇరవై అయిదు రోజుల పాటు, సమాధులలోని పురాతన మైసీనియా రాజులు, రాణుల కళేబరాల మధ్య మోకాళ్ళ మీద కూర్చుని వాటిని కప్పిన మట్టి పొరలను తను ఎంత జాగ్రత్తగా తొలగించిందో సరళమైన ఇంగ్లీష్ లో వివరించింది. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ప్రశంసాసూచకంగా స్లీమన్ చిరునవ్వు చిందించాడు. ఆమె ప్రసంగ పాఠాన్ని తనే రాసి ఇచ్చాడు. ఒక్క తప్పు కూడా  లేకుండా లేకుండా రాసింది రాసినట్టు ఆమె అప్పగించినందుకు సంతోషించాడు. అంతకు మించిన సంతోషం అతన్ని త్వరలోనే ముంచెత్తబోతోంది. అప్పుడామె గర్భవతి. కొడుకు పుట్టబోతున్నాడు. పేరు కూడా స్లీమన్ ముందే నిర్ణయించేశాడు: అగమెమ్నన్!

పద్దెనిమిది మాసాలపాటు ప్రశంసల జల్లులో పులకరిస్తూ గడిపిన తర్వాత, 1878 వేసవిలో తిరిగి తవ్వకాలను చేపట్టాడు. ఈసారి ఇథకాలోని ఒడీసియస్ ప్రాసాదాన్ని కనుక్కోగలననుకున్నాడు. మౌంట్ అయోటిస్ పైన జూలైలో రెండు వారాలపాటు తవ్వకాలు జరిపించాడు. 190 ఇళ్ల శిథిలాలు తప్ప విలువైన వేవీ కనిపించలేదు. దాంతో తవ్వకాలు విరమించాడు.

మరోసారి ట్రాయ్ వైపు గాలి మళ్ళింది.  అక్కడ తవ్వకాలను కొనసాగించడానికి  టర్కీ ప్రభుత్వం నుంచి ఫర్మానా పొందడంలో ఈసారి గ్లాడ్ స్టన్ సాయంతోపాటు, కాన్ స్టాంట్ నోపిల్ లో బ్రిటిష్ రాయబారిగా ఉన్న ఆస్టెన్ లేయర్డ్ సాయం కూడా లభించింది. అసీరియన్ల నగరం నినవే(Nineveh)ను కనుగొన్న పురావస్తు నిపుణుడిగా లేయర్డ్ ప్రసిద్ధుడు. టర్కీ ప్రభుత్వం ఫర్మానా ఇస్తూనే ముందు జాగ్రత్తగా తవ్వకాల పర్యవేక్షణకు ఒక స్పెషల్ కమిషనర్ ను, పదిమంది పోలీసులను నియమించింది.

హిస్సాలిక్ కు వెళ్ళడం స్లీమన్ కు ఇది ఆరోసారి. సెప్టెంబర్ లో పని ప్రారంభించాడు. రెండు మాసాలవరకూ విలువైనవేవీ దొరకలేదు. 1878 అక్టోబర్ 21న, బ్రిటిష్ యుద్ధనౌకకు చెందిన కొందరు అధికారుల సమక్షంలో ప్రియామ్ ప్రాసాదం తాలూకు ఈశాన్య ప్రదేశాన్ని కనుగొన్నాడు. తనకు మొదటి ట్రోజన్ నిక్షేపాలు దొరికిన ప్రదేశానికి ఇది ఆట్టే దూరంలో లేదు. ఇక్కడ 20 బంగారు కర్ణాభరణాలు, పెద్ద సంఖ్యలో బంగారు ఉంగరాలు, బంగారు-వెండి మిశ్రమంతో చేసిన రెండు పెద్ద కంకణాలు, 11 వెండి చెవిపోగులు, 158 వెండి ఉంగరాలు, లెక్కలేనన్ని బంగారు పూసలు బయటపడ్డాయి. మరికొన్ని రోజుల తర్వాత కొన్ని బంగారపు కడ్డీలు, బంగారు గుళ్ళు, ఒక స్వర్ణకంకణం, ఒక వెండి బాకు కనిపించాయి. నవంబర్ 26న తవ్వకాలు నిలిపివేశారు. ఈసారి మూడో వంతు నిక్షేపాలను మాత్రమే తన వద్ద ఉంచుకోడానికి స్లీమన్ ను అనుమతించారు. మిగిలివాటిని కాన్ స్టాంట్ నోపిల్ లోని ఇంపీరియల్ మ్యూజియం కు పంపించారు.

అంతవరకూ అతన్ని వరిస్తూ వచ్చిన అదృష్టం తదుపరి వసంతంలో ఆఖరి అంకానికి చేరబోతోంది. ఫిబ్రవరిలో ట్రాయ్ కు చేరుకుని ఎమిలీ బర్నాఫ్, రుడాల్ఫ్ ఫిర్కోల సాయంతో ట్రాయ్ లో తవ్వకాలు కొనసాగించాడు. నగర ప్రాకారాన్ని తవ్వి తీసి, హోమర్ ట్రాయ్ కు చెందిన పూర్తి రేఖాపటాన్ని తయారు చేయాలన్నది అతని ఆలోచన. ఏప్రిల్ లో కొన్ని బంగారు చక్రాలు, గొలుసులు, చెవిపోగులు, కంకణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ అతనికి ఎలాంటి నిక్షేపాలూ కనిపించలేదు. ఒకప్పుడు అపార స్వర్ణసంపదతో అలరారే మూడు పట్టణాలు ఉండేవని హోమర్ చెప్పాడు. అవి: ట్రాయ్, మైసీనియా; బియోషా (Boeotia)లోని ఒకప్పటి గొప్ప నగరమైన అర్కమెనోస్. హోమర్ ను పరమప్రమాణంగా భావించే స్లీమన్, మరుసటి సంవత్సరం  అర్కమెనోస్ లో తవ్వకాలకు పూనుకున్నాడు. కానీ అతను ఆశించినట్టు స్వర్ణనిక్షేపాలు బయటపడలేదు.

అతని అదృష్టాధ్యాయం అంతటితో ముగిసింది!

(సశేషం)

 

 

మీ మాటలు

*