రెండు సంఘటనలూ రెండు పాత్రలూ వొక నిరసన : థూ

 

 

-ఎ.కె. ప్రభాకర్ 

~

 

‘అందరూ నిర్దోషులైతే మరి చుండూరు దళితుల్ని చంపిందెవరు?’

చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ జరిగిన (1991 ఆగస్ట్ 6) యిరవై మూడేళ్ళకి హైకోర్ట్ డివిజినల్ బెంచ్ ఆ కేసులో యిచ్చిన తీర్పు ( 2014 ఏప్రిల్ 22) ని ప్రశ్నిస్తూ దళిత – హక్కుల – ప్రజా సంఘాలు వేసిన పెను కేక యిది. ఈ ప్రశ్నకి యింకా సమాధానం లభించాల్సే వుంది కానీ ఆ తీర్పుపై బలమైన నిరసనగా వెలువడ్డ సంచలనాత్మక కథ

( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014). రచయితగా పి వి సునీల్ కుమార్ తక్షణ స్పందన సాహిత్య లోకంలో చిన్నపాటి దుమారం లేపింది. కథ లోపలి , బయటి విషయాల మీదా చర్చలు జరిగాయి. కథలో ప్రస్తావితమైన సామాజికాంశాల గురించి సంఘటన పూర్వ పరాల గురించి రచయిత దృక్పథం గురించి దాన్ని కథలోకి తీసుకురావడంలో సాఫల్య వైఫల్యాల గురించి కళావిలువల గురించి రచనా శిల్పం గురించి కథ చదివాకా చదువరుల్లో కలగాల్సిన క్రియాశీల స్పందన గురించి స్థూలంగా సాహిత్య ప్రయోజనం గురించి వొక్క ఫేస్ బుక్ లోనే దాదాపుగా పాతిక పేజీల వరకు చర్చ జరిగింది. కథ యెంత ఆలోచింపజేసిందో ఆ చర్చలు కూడా అంతే తీవ్రంగా బుర్రకి పనిబెట్టాయి.

రచయిత కథలో తన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి భిన్న పద్ధతుల్ని పాటిస్తాడు. సర్వసాక్షి దృష్టి కోణంలో కథ నడిపిపేటప్పుడు  కథనంలోనో ముగింపులోనో రచయితే తన ఆలోచనల్ని స్వయంగా ప్రకటిస్తాడు. ఆ తరహా కథల్లో పాఠకులకి పెద్ద పనేం వుండదు.  సర్వసాక్షి కథనాన్ని రచయితా పాఠకుల మధ్య జరిగే సంభాషణ అనుకొంటే అటువంటి  కథలు యేకముఖ సంభాషణల్లాంటివి. అప్పుడు పాఠకుడు కేవలం శ్రోతగా మిగిలిపోయే ప్రమాదం వుంది. దాన్నుంచీ తప్పించుకొని పాఠకుల ఆలోచనకి చోటూ వెసులుబాటూ వ్యవధి యివ్వడానికి తన దృక్పథాన్ని వ్యక్తం చేయడానికి కథకుడు  అనుకూలమైన పాత్రల్ని – కంఠ స్వరాన్ని యెన్నుకొంటాడు. చాలా సార్లు సంభాషణల ద్వారా చెప్పిస్తాడు. లేదా పాత్రల బాహ్య అంతరంగ ప్రవృత్తుల ద్వారా  ఆవిష్కరిస్తాడు. అందుకు అనుగుణమైన సంఘటనల్ని సృష్టిస్తాడు. సంఘర్షణని చిత్రిస్తాడు. ఆ యా సందర్భాల్లో అవసరాన్నిబట్టీ ఆత్మాశ్రయ కథనాన్ని ఆశ్రయిస్తాడు. ప్రతీకలని నిర్మిస్తాడు. అన్యాపదేశాల్ని అడ్డం పెట్టుకుంటాడు. ఒక్కోసారి టెక్నిక్ పరంగా సరైన జాగరూకత లేకుంటే కథనంలో పాత్రల్లో రచయిత  చొరబాటు జరగొచ్చు. ప్రతిభా నైపుణ్యాలున్న రచయిత మాత్రమే స్వీకరించిన కథా వస్తువు డిమాండ్ చేసిన శిల్పంతో  పాఠకుడికి దగ్గరవుతాడు.

సునీల్ కుమార్ చుండూరు మారణకాండనీ దానిమీద పెద్ద  కోర్టులో వెలువడ్డ జడ్జిమెంట్ నీ కథలో ప్రధాన సంఘటనలుగా – కథాంశాలుగా తీసుకొన్నాడు. కులాలు కాలాలు మార్చలేదు గానీ స్థలాలు మార్చాడు. పాత్రల పేర్లు మార్చాడు. తణుకు ప్రాంతంలో జరిగినట్టు పేర్కొన్నాడు. స్థానికత కోసం  అయితంపూడి లాకులు దగ్గర శవాలు దొరికినట్టు వొకటి రెండు మార్పులు జోడించాడు. కామందు పేరుకి ప్రతీకాత్మకంగా రెడ్డీ నాయుడూ రెండూ తగిలించాడు. మిగిలిన కథంతా అదే.

దళిత కులానికి చెందిన జోసఫ్ కొడుకు సాల్మన్  రాజు అతన్తో పాటు తణుకు కాలేజీలో చదువుకొనే వూరి  ‘కామందుల ఆడపిల్లని యిష్టపడ్డాడు. ఆ పిల్లా ఆడ్ని ఇష్టపడింది… కామందులకి ఇది గిట్టలేదు.’ అది గొడవకి దారితీసింది. కామందుల కుర్రాళ్ళకి మండి ‘ఏరా మాలనాకొడకా’ అని కులం పేరుతో ఘర్షణకి దిగారు.

దీన్ని వూరి కామందు బసివిరెడ్డి నాయుడి మాటల్లో చూద్దాం:

‘మాటా మాటా పెరిగింది . అక్కడితో ఆగాలా ? ఆ రాజుగాడు ఆడికి తోడు మిగిలిన మాలమాదిగ కుర్రనాయాళ్ళు కలిసి కామందుల పిల్లల్ని, కనీసం పెద్ద ఇళ్ళ పిల్లలే అన్న ఇంగితం లేకుండా , పెద్దంతరం , చిన్నంతరం లేకుండా చేయ్యిచేసుకున్నారండి… ఎంత దారుణం.

రామరాజ్యం కోసం కలలు కన్న గాంధీగారు, ఇప్పుడు కలలు కంటున్న మోడీగారూ ఈ సంగత్తెలిస్తే ఎంత కుమిలిపోతారు?

ధర్మం ఇప్పటికే ఒంటికాలి మీద కుంటుతుంది. ఇలా వదిలేస్తే ఇంకేమీ మిగలదు కాబట్టి, ఈ కాస్త ధర్మాన్నన్నా నిలబెట్టడానికి ఈ కడజాతి కుక్కలకి బెత్తం దెబ్బ చూపిద్దాం అని పెద్దలంతా అనుకుని ఓ తీర్మానం చేసుకున్నామండి. అది కాస్త మోతాదు ఎక్కువైంది.’  

మోతాదు ఎంత యెక్కువైందో జోసఫ్ మాటల్లో చూద్దాం:

‘ ఆ రోజు రాత్రి చూడాలి బాబూ. రాములోరి రథ యాత్ర జరిగినట్టు మా మీద దండెత్తేరు. కత్తులు, కటార్లు, ఈటెలు, బళ్ళేలు పట్టుకుని వచ్చేరు… మా గుడిసెలకి నిప్పెట్టేరు. మా అమ్మల్ని మానాల మీద తన్నేరు. మా ఆడబిడ్డల్ని మళ్ళా పాడుచేసేరు. దొరికినోడ్ని దొరికినట్టు నరికేరు. ఎంటపడ్డారు. ఎగబడ్డారు. నరికేశారు. కిందేసి తొక్కేశారు. గోనెసంచుల్లో కుక్కేశారు. పంట కాలవలో పడేశారు.’

ఆ దాడిలో ఇరవై ఏళ్ళు అత్తారబత్తంగా పెంచుకున్న జోసఫ్ కొడుకు (రాజు)తో సహా మొత్తం పదిమందిని చంపేశారు. ఒక కుంటోడు జోసఫ్ కాలిరగ్గొట్టి అతన్ని కుంటి జోసఫ్ చేసాడు.

అదిగో … అప్పుడు … ఆ పాశవిక దాడిలోనే  ఇగిరిపోయింది జోసఫ్ నోట్లో తడి. అతనికి యెన్నోసార్లు  ‘ఉయ్యాలనుంది… దేవుళ్ళ మీదా … మమ్మల్ని మనుషులు కాదన్న వాళ్ళమీదా … కడజాతివాళ్ళని అన్నవాళ్ళమీదా …’ ఉయ్యాలన్నా ఉయ్యలేడు.

అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. మధ్యలో కింది కోర్టులో దాడిచేసినవారికి శిక్షలు పడ్డాయి(చుండూరు కేసులో విచారణకి సంఘటనా స్థలిలోనే స్పెషల్ కోర్టు యేర్పాటైంది – దళితులపై దమనకాండని  విచారించడం కోసం వొక ప్రత్యేక కోర్టు యేర్పడడం దేశంలో అదే తొలిసారి. సంఘటన జరిగిన పదహారేళ్ళకి  2007 లో యాభై ఆరు మందిని దోషులుగా నిర్ధారించి ఆ కోర్టు శిక్ష విధించింది).

కానీ పై కోర్టులో రెడ్డి తోక తగిలించుకొన్న జడ్జి యిచ్చిన తీర్పు దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొన్న వారికి అశనిపాత విస్మయం కల్గించింది.

న్యాయమూర్తి అందరూ నిర్దోషులే అని తీర్పు చెబుతూ ‘ఇంకా కులాలెక్కడున్నాయి?’  అన్నాడు.

‘దొంగ కేసు’ అని తేల్చేసాడు.

జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’

‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

థూ …’

అదీ కథకి ముగింపు.

p v sunil kumar

కథలో వాస్తవానికి రెండు దాడులు జరిగాయి. మొదటిది దళితులపై భౌతికంగా జరిగిన దాడి. రెండోది – దాని వ్యవస్థీకృత రూపం.  కులమే  రెండుచోట్లా కారణం. బాధితుడి నోట్లో తడి ఆరిపోయి ఉమ్మి రాకుండా నోరెండిపోయి నెరళ్ళు విచ్చుకున్న బీడు పొలంలా తయారయ్యే పరిస్థితికి కారణమైన సంఘటన మొదటిది. అది తరాలుగా అమలౌతున్న సామాజిక క్రౌర్యాన్ని ఆవిష్కరించిన భయావహ సంఘటన. అది ఆంధ్రప్రదేశ్, తమిళ్నాడు , బీహార్ , మహారాష్ట్ర, రాజస్తాన్ – దేశంలో యే మూలైనా దాడి చేసేది రెడ్డినాయుళ్ళు, భూమిహారుల రణవీర్ సేన , కుంబీలు , జాట్ లు వంటి ‘కులీను’లైతే   వేటాడబడేది బలయ్యేది మాత్రం ‘కులహీను’లైన దళితులే. రాజ్యాంగ బద్ధమైన సామాజిక న్యాయం కోరడమే ఆత్మగౌరవంతో పీడన లేకుండా బతకాలనుకోవడమే  వేటకి కారణం. మూడేళ్ళ పసి బిడ్డా    డెబ్భై యేళ్ళ వృద్ధులా – ఆడా మగా అని చూడకుండా విచక్షణా రహితంగా చంపేసిన  కిలవేన్మణి (1968) మొదలుకొని – బథానీ టోలా (1996)లో రణవీర్ సేన సాగించిన మారణహోమం , ఖైర్లాంజీ దురాగతాల  మీదుగా నిన్న మొన్నటి లక్షింపేట , యివాల్టి వేముల రోహిత్  హత్యల వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండానే బయటపడతారు. హతులు వుంటారు – హంతకులుండరు.  హంతకుల కులం పాలకుల కులం న్యాయమూర్తుల కులం వొకటే కావడం యెంత చక్కటి రాజకీయ నీతి?

ఈ వ్యవస్థీకృత దుర్నయం పట్ల తీవ్రమైన అసహ్యాన్ని వ్యక్తంచేయడానికి ఛీత్కారాన్ని ప్రకటించడానికి జోసఫ్ నోట్లో  వుమ్మడానికి మళ్ళీ నోట్లో నీరూరాయి. ‘థూ …’ ఆ విధంగా రచయిత ధర్మాగ్రహ ప్రకటన రాజకీయ – సామాజిక  నిరసన.

వాస్తవ సంఘటనలు వాటికవే కథలు కావని కొందరు , బసివిరెడ్డి నాయుడు కుంటి జోసఫ్ యీ రెండు పాత్రల్ని తీసేస్తే యిది కేవలం వొక వార్త మాత్రమేననీ మహా అయితే వార్తాకథనం కావొచ్చేమోనని కొందరూ, సంఘటనలు జరిగిన సందర్భాల్లో తత్క్షణ ప్రతిస్పందనలుగా వచ్చే యిటువంటి రాతలకు సాహిత్య విలువని ఆపాదించలేమని  మరికొందరూ, బసివిరెడ్డి నాయుడి పాత్ర చిత్రణలో శిల్ప విషయికంగా జరిగిన పొరపాటు వల్ల మంచికథ కాలేకపోయిందని , ఆ విధంగా రచయిత ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని యింకొందరూ విమర్శపెట్టారు. కథని బాధితుల పక్షం నుంచి చూడాలన్న వాదాన్ని కూడా యెద్దేవ చేసారు. జరిగిన ప్రతి సంఘటనా సాహిత్య వేషం ధరించి విసువు పుట్టిస్తుందని కొత్తదనం వుండడం లేదని అందువల్ల మూస కథలు మాత్రమే వస్తున్నాయని  కథా ప్రేమికులు బాధపడ్డారు. సున్నితమైన  సమకాలీన  సంఘటనల్ని వర్ణించినంత మాత్రాన కథని మెచ్చుకొని తీరాలా అని వాదించారు. శిల్పాన్ని ముందుకు తెచ్చి కథలో  స్వీకరించిన  వస్తువుపట్ల కూడా అసహనం వ్యక్తం చేసారు  (అట్రాసిటీ గురించి గాక అట్రాసిటీ చట్టాల దుర్వినియోగం గురించి కథ రాస్తే ఆహ్వానించడానికి వారికి అభ్యంతరం లేదు).

ముందుగా గుర్తించాల్సిన విషయం – సమకాలీన సామాజిక సంఘటనలు సాహిత్యంలోకి యెక్కకూడదని గిరిగీసుకోవాల్సిన అవసరం లేదు. అలా గీసుకొంటే చివరికి మనకి మిగిలేవి అలౌకికమైన దెయ్యాలు – భూతాల హారర్ కథలూ గ్రహాంతరవాసుల సూడో సైన్స్ ఫిక్షన్ కథలూ అభూతకల్పనా ప్రపంచపు కథలేనేమో!  [కిలవేన్మణి దళితుల వూచకోత – యథార్థ సంఘటన నేపథ్యం చేసుకొని  ఇందిరా పార్థసారథి రాసిన ‘కురుతిప్పునల్’ నవలకి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు (1977) వచ్చింది. ఆ తర్వాత అది సినిమాగా కూడా గొప్ప ప్రశంసలు పొందింది – వాస్తవాలు కళలై చరిత్రలోకెక్కడానికి యిదొక ఉదాహరణ మాత్రమే]

వాస్తవాన్ని కళగా రూపొందించడంలో శిల్ప వస్తువుల ప్రాధాన్యతల గురించి మాట్లాడుకోవాల్సిన అనివార్యమైన అవసరాన్ని మరోసారి ‘థూ…’ కథ కల్పించింది అనడంలో యెటువంటి సందేహం లేదు. నిజమే కథ వుపన్యాసంలానో వ్యాసంలానో వుండకూడదు. వస్తువుని వున్నతీకరించడానికి అవసరమైన శిల్పాన్ని సమకూర్చుకోవాలి. అది రచయిత దృక్పథాన్ని ఆవిష్కరించడానికి దోహదం చెయ్యాలే గానీ ఆటంకంగా పరిణమించ కూడదు. కథకి ఆత్మ దృక్పథమే. అది యే మేరకు  పాఠకులకి చేరింది అన్నదాన్ని బట్టీ కథ మంచి చెడ్డలని నిర్ధారించాలి.

థూ… కథలో కథ చెప్పిన రెండు పాత్రలు – బసివిరెడ్డి నాయుడు , జోసఫ్  భౌతికంగానే కాదు  గ్రామంలో సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా కూడా   సంఘర్షించుకొనేపాత్రలు. ఒక సామాజిక భీభాత్సానికి భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతిద్వంద్వి పాత్రలు. రెండు వైపుల అటు చివర యిటు చివర వైరి శిబిరాల్లో  నిలబడ్డ భిన్న పాత్రలు. వాటి గొంతు వేరు , భాష వేరు , జీవితానుభవాలు వేరు. వాటి సారం వేరు. వీటి మాధ్యమంగా కథ చెప్పదల్చుకొన్నప్పుడు సాంప్రదాయిక రచనా పద్ధతులననుసరించి  రచయిత యేదో ఒక వైపు వుండాలి ; ఒక నిర్దిష్ట కంఠ స్వరాన్ని  యెన్నుకోవాలి. కానీ ఈ కథలో రచయిత పాటించిన టెక్నిక్ ఇద్దరి ద్వారా కూడా తను చెప్పదల్చుకొన్న భావజాలాన్ని ప్రకటించడం. అదే విమర్శకి కారణమైంది. బసివిరెడ్డి నాయుడి సంభాషణలకి వ్యంగ్యాన్ని ఆశ్రయించడం  నప్పలేదనీ  , పాత్రౌచిత్యం దెబ్బతిందనీ  విమర్శకులు భావించారు.

అయితే యీ విమర్శలన్నిటికీ సమాధానమా అన్నట్టున్న రచయిత చెప్పిన మాటలు గమనార్హాలు :

‘బాణం గుండెలో దిగితే బాధలా ఉంటుంది. అదే బాణం గుండెలో దింపినవాడికి వినోదంలా ఉంటుంది. వస్తువు అదే, కానీ అది ఒకడికి సంతోషాన్ని, మరొకడికి చావుని ఇస్తోంది. వ్యవస్థ అయినా సంఘటన అయినా బలిసినవాడికి ఒకలా , బక్కోడికి మరోలా కనబడతాయి. వ్యవస్థలో ఏ ఒక్క సంఘటనా కారణం లేకుండా జరగదు. సామాన్యుడికి సత్యం తెలిస్తే వాడు వ్యవస్థని ఎలా సమ్మానిస్తాడో అదే … ఈ థూ…. ఇది కథ కాదు, వ్యవస్థ ఎక్స్ రే, సి.టి.స్కాన్ …’ (కథ 2014 , కథాసాహితి)

అవును కదా – ఎక్స్ రే, సి.టి.స్కాన్ పిల్మ్ లు కలర్ ఫొటోగ్రాఫ్ లంత అందంగా కనపడకపోతే టెక్నీషియన్ని తప్పుపట్టలేం.

నిజానికి సవర్ణులు మనసు లోపల అనుకొనే మాటల్నే రెడ్డినాయుడు బయటికి అన్నాడు. న్యాయాన్ని బలిమితో చెరబట్టినవాడు కోర్టు మెట్ల మీదే బసివిరెడ్డి నాయుడులా మాట్లాడగలడు. పాఠకులు ఆ మాటల వెనక వున్న అగ్రకుల అహంకారాన్నీ ఆధిపత్య స్వభావాన్నీ  రాజకీయ అధికారం ఇచ్చిన పొగరుమోతుతనాన్నీ చట్టాల్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన నిర్లక్ష్యాన్నీ  న్యాయవ్యవస్థ మొత్తం తమ కనుసన్నల్లోనే నడుస్తుందన్న  ధీమానీ స్పష్టంగా చూడగలరు. ఒకటి రెండు చోట్ల అవి అతిశయించిన దాఖలాలు యెత్తిచూపగలమేమో గానీ రెడ్డినాయుడి మాటలు అసహజాలు కావు ; ప్రస్తావితమైన అంశాలు అసత్యాలైతే అసలు కానే కావు.

ఇటీవల పాటియాలా కోర్టు ఆవరణలోనే కన్హయ్య మీద లాయర్లు దాడి చేయడం  , మళ్ళీ మళ్ళీ చేస్తామని ప్రకటించడం , అందుకు సన్మానాలు చేయించుకోవడం , జైలుకెళ్ళి అక్కడకూడా అతన్ని కొడతామనీ అంతుచూస్తామనీ బహిరంగంగా మీడియా ముందు హెచ్చరించడం , కన్హయ్య నాలుక కోసినవాడికి లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఫత్వాలు జారీ చేయడం యివన్నీ చూసినపుడు బసివిరెడ్డి నాయుడు మాటల్లో అహంకారం గానీ వ్యంగ్యంగానీ కృత్రిమంగానో అనుచితంగానో అనిపించవు. తన ఫ్యూడల్ ఆలోచనలకి ఆచరణకీ ప్రజాస్వామ్యం ముసుగు వేసుకోవాల్సిన అవసరం సందర్భం అతనికి కనిపించలేదు. సమాజంలో రెడ్డినాయుళ్ళు బోరవిరుచుకొని తిరుగుతూ సాహిత్యంలోకి జబర్దస్తీగా తోసుకురావడంలో వైపరీత్యం యేమీ లేదు.

అందుకే  వర్ణ ధర్మ పరిరక్షణ అవసరం గురించి రామరాజ్య స్థాపన గురించి అందుకు పాలక వర్గాలు పడుతున్న కష్టాల గురించి స్వాతంత్ర్యం తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రాజకీయాధికార బాధ్యతలతో ప్రజా పాలన భారంతో పై కులాల ప్రభువులు చేస్తున్న త్యాగాల గురించి తాము దయతో జాలితో అమలు జేస్తున్న యస్సీ యస్టీ రిజర్వేషన్ల గురించి వోటేసి తమకు అధికారం కట్టబెట్టినందుకు ఔదార్యంతో తాము ప్రవేశపెట్టిన  మాల మాదిగల సంక్షేమ పథకాల గురించి    రెడ్డి నాయుడు తన దృష్టికోణం నుంచి చాలా విస్తృతంగానే యేకరువు పెట్టాడు. కథలో యివన్నీ యిమడతాయో లేదోనన్న ప్రశ్నని  కాసేపు పక్కనబెడితే బసివిరెడ్డినాయుడి ముఖత: వెలువడ్డ మాటల్ని  పదే పదే చదవగా అతడి portrait ని చిత్రించడం రచయిత వుద్దేశం కాదనీ –  అగ్రకుల పెత్తందారీ తనానినికి archetypical caricature గా అతణ్ణి బ్లాక్ అండ్ వైట్ లో గీయడమేననీ నాకు బోధపడింది. ఆ గీతల్ని పతంజలి వ్యంగ్యచిత్రాల్తో పోల్చడం సాహసమే గానీ , రాజు గారి బామ్మర్ది అయిన కారణంగా న్యాయస్థానంలో న్యాయాన్ని తిమ్మిని బమ్మి చేయడానికి పూనుకొన్న శూద్రకుడి శకారుడితో కొంతవరకు పోల్చవచ్చు.  అందువల్ల రెడ్డినాయుడి మాటల్లో ఆధునిక మనువాదం వికృతంగా వినిపించడం అసంగతమేం కాదు. శిల్పానికొచ్చిన లోటేం లేదు. ఆధునిక కథా నిర్మాణ సూత్రాలూ కొలతలూ పక్కనబెట్టి సంప్రదాయ దేశీయ కథా రీతుల వెలుగులో చూస్తే రచయితగా సునీల్ కుమార్ నడిచిన దారి తెల్లమౌతుంది.

చిందు కళాకారులు ప్రదర్శించే జాంబ పురాణం దాదాపు యీ టెక్నిక్ లోనే నడుస్తుంది. చిందు జాంబ పురాణం సంవాద రూపంలో వుంటుంది. రెండే పాత్రలు – వొకరు  బ్రాహ్మణుడు మరొకరు మాదిగ ఆదిజాంబవుడు. అందులో బ్రాహ్మణుడు వర్ణ దురహంకారానికీ  ఆది జాంబవుడు ఆత్మగౌరవానికీ ప్రతీకలు. అక్కడ కూడా బ్రాహ్మణుడు అచ్చు బసివిరెడ్డి నాయుడిలానే ప్రవర్తిస్తాడు. ఆది జాంబవుడు తార్కికంగా జవాబులు చెబుతాడు.  అయితే రెండు పాత్రలూ నటించేది చిందు మాదిగలే కాబట్టి బ్రాహ్మణుడి ఆలోచనల్లోకి సంభాషణల్లోకి అహంకార ప్రకటనల్లోకి ఆ కళాకారుడు తన జీవన నేపథ్యంతో సహా చొరబడతాడు. అప్పుడు అతని మాటల్లోకి వ్యంగ్యం హాస్యం అధిక్షేపం అసహనం అవహేళన  అన్నీ వచ్చి చేరతాయి. అవన్నీ ప్రదర్శన రక్తి కడటానికే దోహదం చేస్తాయి తప్ప ప్రేక్షకులకి యెబ్బెట్టుగా తోచవు. చిందు ప్రదర్శన జాంబవుడి విజయంతో అంతమైతే ‘థూ…’ కథ కుంటి జోసఫ్ నిరసనతో ముగుస్తుంది.

చిందు జాంబ పురాణంలో బ్రాహ్మణ జాంబవుల పాత్రలు రంగం మీదకి రావడానికి వొక ప్రవేశిక ( prologue ) వుంటుంది. దాన్ని సూత్రధారుడిలాంటి వారు నిర్వహిస్తారు. ‘థూ…’ కథ లో రచయిత పాత్ర కూడా రెడ్డి నాయున్ని , జోసఫ్ ని అలాగే ప్రవేశపెట్టి నిష్క్రమిస్తుంది. అయితే కథలో రచయిత – కథా రచయితా వొకరు కాదు. కథలో రచయిత వొక పాత్ర. అతడు కూడా  వొక వర్గానికి ప్రతినిధి. పేదల ఏడుపులూ పెడబొబ్బల కథలు అతనికి నచ్చవ్ , ప్రేమకతలు కావాలి. ఈ పాత్రని నెపం చేసుకొని సాహిత్యంలో పాతుకుపోయిన విలువల పైన నిలవ యీస్తటిక్స్ పైన కూడా సునీల్ కుమార్ వ్యంగ్యాన్ని గుప్పించాడు (కథలోని ఈ పొర కూడా కొందరికి వూపిరాడనివ్వలేదేమో!). తను ప్రతిపాదించే వస్తువు పట్లా వాడిన టెక్నిక్ పట్లా సాహిత్యకారుల ప్రతికూల స్పందనని అతను ముందుగానే వూహించినట్లున్నాడు.

తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన అది. ఏడుపు అందంగా లేదనో ఆలంకారికంగా లేదనో కళాత్మకంగా లేదనో యింకాస్త బాగా యేడవొచ్చుగదా అనో ఫిర్యాదు చేసేవాళ్ళకి యేదైనా అనుభవంలోకి వస్తేగానీ తత్త్వం బోధపడదు.

జోసఫ్ తాత మూతికి ముంత కట్టుకొని వుమ్మొస్తే నేల మీద వుయ్యకుండా ముంతలో వూసేవాడు. ముడ్డికి యేలాడే తాడూ దాని చివర తాటాకు – అతను నడిచించోట అది తుడిచేసేది. అంటరానివాడొత్తన్నాడు తొలగండని చేతిలో గంట వాయిస్తూ  బేపనవారికి హెచ్చరిక చేసేవాడు. జోసఫ్ కొడుకు తరానికి వచ్చేసరికి ఆ ‘మర్యాద’ నుంచీ బయటపడి ముడ్డి మీద మంచి గుడ్డ కట్టుకొని బడికెళ్ళి నాలుగక్షరాలు నేర్చుకొని మనిషిలా బతకాలని కోరుకోవడం  నేరమైంది. చావుకి కారణమైంది. దళితుల అటువంటి చావులు దేశంలో సగటున రోజుకి రెండు జరుగుతూ వుండగా అందుకు వ్యవస్థీకృతమైన మద్దతు ఆమోదం లభిస్తున్నప్పుడు ఆ సామాజిక విషాదాన్ని దురన్యాయాన్ని యిన్ సైడర్ గా వొక దళిత రచయిత మాత్రమే బలంగా ఆవిష్కరించగలడని చెప్పడానికి  ‘థూ …’ మంచి వుదాహరణ. సరైన సమయంలో అవసరమైన కథని యింత నిర్దిష్టంగా నిజాయితీగా  రాసినందుకు సునీల్ కుమార్ కి అభినందనలు.

తాజాకలం  : బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూనే పాలకులు ఆయన 125 సంవత్సరాల జయంతి వేడుకలు జరపడం గొప్ప ఐరనీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాతీయ సమైక్యత గురించి అంబేద్కర్ ఆలోచనల గురించి  కరీంనగర్ బార్  అసోసియేషన్  ఏర్పాటుచేసిన సభలో చుండూరు కేసులో తీర్పు యిచ్చిన జడ్జి వుపన్యాసాన్ని కొందరు న్యాయవాదులు అడ్డుకొన్నారు(చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html). మర్నాడు అందుకు బాధ్యులైన నలుగురు  లాయర్లని బార్ అసోసియేషన్  సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వార్తకీ ఈ కథకీ చుట్టరికం వుండడం వల్ల యిక్కడ నమోదు చేయడమైంది తప్ప యిప్పుడు మనం చేయవలసిన పని వొక్కటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం యెదురుచూడటం లేదా కుంటి జోసఫ్ లోని తడిని ఫీలై అతని చేతికర్రగా మారడం.

*

మీ మాటలు

  1. డా.జి.వి.రత్నాకర్ says:

    థూ కథ పై ఎ.కె.ప్రభాకర్ గారి విశ్లేషణ బాగుంది.
    వాస్తవికంగా ఆలోచనాత్మకంగా ఉంది.

  2. Sashanka says:

    అంతా మర్చిపోయిన చుండూరునీ , అ చారిత్రిక తీర్పునీ , ఆ సందర్భంగా ‘థూ’ కథా విశ్లేషణ బాగా చేశారు ప్రభాకర్ గారు.

    రచయిత కథని మాత్రం ఇలా ముగించారు.
    జోసఫ్ ‘నోట్లోంచి మాట రాలే … మాట బదులు ఉమ్మొచ్చింది…’
    ‘ముంతలో పడాల్సింది పొరపాట్న ఆయన మొగాన పడింది …

    125 సంవత్సరాల అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా అప్పుడాయన్ని’పోరాటాల నడిగడ్డ’ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆహ్వానించటం , ఆయన తన చారిత్రిక ప్రసంగాన్ని ఇవ్వటం, కొందరు లాయర్లు అడ్డుకోవటం , అందుకు బాధ్యులైన నలుగురు లాయర్లని బార్ అసోసియేషన్ సస్పెండ్ చేయడం జరిగింది.
    (చూ. http://indiatoday.intoday.in/story/ex-hc-judge-faces-lawyers-protest-over-dalit-murder-verdict/1/593897.html).

    ఇదీ అసలు ఐరనీ.

    ‘థూ’

    -శశాంక

  3. Buchireddy gangula says:

    Excellent రివ్యూ..ప్రభాకర్ గారు
    థూ–కథ ను –సారంగ లో వేస్తే. భాగుండు —

    పెద్దతరం –చిన్నతరం
    కుల–మత–పట్టింపులు ఉన్న గాంధీజీ పుట్టినదేశంలో–యీ దోపిడీ
    వ్యవస్థలో —న్యాయెం ????
    దేవుడు యెరుగు ———–
    ==============================
    Buchi రెడ్డి Gangula

  4. dr.ajay rathan says:

    విశ్లేషణ చాల బాగుంది , చదువుకున్న మనమే కొన్ని సందర్బాలలో మన కులానికి యెమిచెయ్య లేని నిస్సహాయక పరిస్తి తిలో ఉండాల్సిన దౌర్భాగ్యం కలిపిస్తున్న ఈ అగ్రవర్ణాల అహంకారాన్ని మన తెలివి తేటల తోనే అనచివేయ్యాలి.

  5. కె.కె. రామయ్య says:

    చుండూరు దళితులపై అగ్రవర్ణాల మారణకాండ కధాంశంగా పి.వి. సునీల్ కుమార్ గారు రాసిన “థూ” కథ ( విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014) పై ఎ.కె.ప్రభాకర్ గారి పదునైన విశ్లేషణ … తరతరాలుగా అనేక సామూహిక బృందాల గూడుకట్టుకొన్న దు:ఖానికీ ఆగ్రహానికీ అక్షరావిష్కరణ ‘థూ…’ . సంవత్సరాల తరబడి న్యాయం కోసం యెదురుచూసి భంగపడ్డ వారి క్రోధాక్రందన … గురించి ప్రభాకర్ గారి ప్రస్తావన అంతే సంవేదనతో సాగింది.

    “అక్కడ (చర్చి) లోపల క్రైస్తవులు ఎవరున్నారని ? అక్కడ ఉన్నదంతా రెడ్లు, కమ్మలు, మాలలు, మాదిగలు” అంటూ ప్రశ్నించిన పి.వి. సునీల్ కుమార్ గారి “క్రైస్తవులు లేని చర్చి” కధని ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధం ( 6-మార్చి-2016 సంచిక) లో చూడగలం.

    http://epaper.andhrajyothy.com/743008/Sunday/08.03.2016#dual/26/1

  6. కె.కె. రామయ్య says:

    సామాజిక విషాదాన్ని, దురన్యాయాన్ని బలంగా ఆవిష్కరించిన పి.వి. సునీల్ కుమార్ గారి “థూ” కథ; విశాలాంధ్ర – ఆదివారం, జూన్ 15 , 2014 సంచిక ఈ క్రింది లింకులో చూడవచ్చు.

    http://54.243.62.7/sundayspecial/article-134880

    http://54.243.62.7/images_designer/article_docs/2014/6/15/Sunday.pdf

  7. కె.కె. రామయ్య says:

    “థూ” కథని పి.వి. సునీల్ కుమార్ గారి బ్లాగులో, ఈ క్రింది లింకులో చూడవచ్చు.

    http://thesunilonline.blogspot.in/p/blog-page_83.html?m=1

  8. కె.కె. రామయ్య says:

    “థూ” కథ పై ఎ.కె.ప్రభాకర్ గారి అద్భుత విశ్లేషణతో పాటు పాఠకులు చదువుకునే సౌకర్యార్దం పి.వి. సునీల్ కుమార్ గారి “థూ” కధను వ్యాసంతో పాటు అనుసందానిన్చినందుకు సారంగ అఫ్సర్ గారికి కృతజ్ఞతలు.

  9. THIRUPALU says:

    అవునండి రామయ్య గారికే! మొదట విశ్లేషణ చదివినపుడు బాగా అర్ధం కాలేదు. రామయ్య గారు కదా లింక్ చదివిన తరువాత అర్ధం అయింది.
    విశ్లేష ణ చాలా బాగుంది. ధన్య వాదాలు

  10. మీరు మొహమాట పడ్డారు కానీ ఆంధ్రజ్యొతి వారు సునీల్ కుమార్ గారికి రావిశాస్త్రి, పతంజలి గార్ల వారసత్వం ఇచ్చారు, వ్యంగ్య రచనలలో

Leave a Reply to Buchireddy gangula Cancel reply

*