ప్రకృతి – మనుషులు – అండమాన్లు!

 

Andaman Diary Front Page

 

-కొల్లూరి సోమశంకర్

~

వాక్యాల వెంట పాఠకులను పరుగులు తీయించే రాయడం ఫిక్షన్‌ని విజయవంతం చేస్తే, రచయిత చేసే యాత్రలలో పాఠకులను తన వెంటే తీసుకువెళ్ళి వాళ్ళు కూడా మానసికంగా ఆయా ప్రాంతాలలో తిరుగాడినట్లుగా వ్రాయడం – యాత్రారచనలు ఎక్కువమందిని ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ కోవలోకొచ్చే యాత్రా కథనం – దాసరి అమరేంద్ర గారి “అండమాన్ డైరీ”.

అమరేంద్ర గారికన్నా ముందు ఎంతో మంది అండమాన్ దీవులను చూసుంటారు, ఎంతో కొంత రాసుంటారు. భవిష్యత్తులో కూడా మరెందరో అక్కడికి వెడతారు, వాటి గురించి రాస్తారు కూడా. దర్శనీయ స్థలాలు మారవు… ఏం చూసాం, ఎలా చూసాం, ఎలా తిరిగాం అన్నవి వ్యక్తుల దృక్కోణాన్ని బట్టి మారుతాయి. అందువల్ల యాత్రాకథనాలు కూడా విభిన్నంగా ఉంటాయి. అండమాన్ యాత్రల గురించి గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా చదివినా, ఈ పుస్తకం మళ్ళీ చదివిస్తుంది.

ఎవరైనా యాత్రలెందుకు చేస్తారు? ప్రదేశాలని, మనుషులనీ తెలుసుకోడానికి! తెలుసుకుని ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కొంతమందికి కేవలం సందర్శనా స్థలాలను దర్శించితేనే తృప్తి కలుగుతుంది. మరికొందరికి ఆయా ప్రాంతాలలోని స్థానికుల జీవితాలను తెలుసుకోడంలో ఆసక్తి ఉంటుంది. తెలుసుకోడం – నేర్చుకోవడం – జీవితాన్ని మెరుగుపరిచే అంశాలు! జాగ్రత్తగా వింటే ప్రకృతి మౌనంగానే ఎంతో చెబుతుంది; ఆసక్తిగా వింటే మనుషులు తమ జీవితాల్ని వివరిస్తారు. వాళ్ళకుండి మనకి లేనివేవిటో లేదా మనకు ఉండీ వాళ్ళకి లేనివేవిటో అర్థమవుతుంది. పై పై మెరుగుల కోసం జీవితాన్ని సంక్లిష్టం చేసుకునే బదులు… జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో – సముద్రం ఉంది, దీవులున్నాయి, కోరల్స్ ఉన్నాయి, అందమైన ప్రకృతి ఉంది. వీటన్నిటిని మించి మంచి మనుషులు ఉన్నారు. మెయిన్‌లాండర్స్‌ జీవన విధానాలకూ ఐలాండర్ల బతుకుతీరుకి ఉండే వ్యత్యాసంపై స్పష్టమైన అవగాహన ఉన్న మనుషులు వీళ్ళు. స్థానికులుంటారు; దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉంటారు.

ఇక ప్రకృతి విషయానికొస్తే, పుస్తకం ఉపశీర్షికలోనే చెప్పేసారు రచయిత – పచ్చల ద్వీపాలూ.. పగడాల సంద్రాలూ.. అని. రాస్ ద్వీపం గురించి,  సీతానగర్ బీచి రచయిత చేసిన వర్ణన – పాఠకుల మనస్సుల్లో కూడా అండమాన్స్ వెళ్ళిరావాలనే కోరికని నాటుతుంది. ఎలిఫెంట్ బీచ్‌లో స్నోర్‌కెలింగ్ చేసిన సందర్భంగా సముద్రం లోపల విహరించడం ఎలా ఉంటుందో చెబుతారు రచయిత. మనం కూడా స్నోర్‌కెలింగ్‌లో పాల్గొన్నట్లుగా అనిపిస్తుంది చదువుతూంటే. నీల్ ద్వీపం గురించి, బారాటాంగ్‌లోని మాన్‌గ్రోవ్‌ కెనోపీ వాక్‌ గురించి చదువుతుంటే ఉన్నపళాన అక్కడ వాలిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. మానసిక విహారం చేసి, అక్కడి అందాల్ని ఆస్వాదిస్తాం.

ఈ పుస్తకం మరో విశేషం… సంతృప్తికరమైన జీవితాన్ని గడిపే వ్యక్తులను పరిచయం చేయడం.. వీళ్ళ గురించి చదివినప్పుడు మనం అబ్బురపడతాం. వారి ఆలోచనా విధానానికీ, మానసిక పరిపక్వతకీ జోహార్లంటాం. కాస్తో కూస్తో వారి నుంచి నేర్చుకుంటాం.

తనకంటూ ఒక ఉనికి లేకపోవడమే మంచిదని భావించే ఓ గెస్ట్‌హౌస్ యజమానురాలు తన ఇంటినీ, జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వైనం పాఠకులకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వీళ్ళే నావాళ్ళు అనుకోకుండా ఎవరైనా నా మనుషులే అనుకునే ఆవిడ పట్ల గౌరవభావం కలుగుతుంది.

తాగుడికి బానిసై భర్త చనిపోతే, నలుగురు పిల్లలతో జీవనం సాగిస్తూ చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉన్నంతలో గొప్పగా బ్రతుకుతున్న ఓ మహిళది స్ఫూర్తిదాయక గాథ. ప్రపంచం మీద భరోసా ఉన్న వ్యక్తి. బతుకు భయం లేని మనిషావిడ..

లక్ష్మణపూర్ అనే ఊరిలో రెండో బీచ్‌కి సమీపంలో ఓ కొబ్బరిబోండాల దుకాణం నడుపుతున్న పెద్దావిడది బంగ్లాదేశ్ మూలాలున్న కుటుంబం. భారత ప్రభుత్వం పునరావాసంపై వీళ్ళని ఇక్కడకి తరలించింది. ఈవిడ కొడుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్‌ పీజీ చేస్తున్నాడు. కూతురు బెంగుళూరులో ఐ.టి. ఉద్యోగం.. ‘ఇంకా ఈ కొట్టెందుకూ. మూసెయ్యి’ అంటారట పిల్లలు. ఆవిడేమో ‘ఇది నాకు అలవాటయిన జీవన రీతి. ఎలా వదిలిపెట్టాలీ! అసలు ఎందుకు వదిలిపెట్టాలీ’ అని బదులిస్తారు. ఎంత మానసిక దృఢత్వం కావాలి ఈ నిర్ణయం తీసుకోడానికి?

కాలాపత్థర్ అనే చోట బంగ్లాదేశీ మూలాలున్న మొండల్ అనే వ్యక్తితో మాటలు కలిపిన రచయిత అతని కుటుంబపు జీవన సరళి, ఆర్థిక వనరులు, స్నేహితులు, బంధువులు… గురించి ఎంతో తెలుసుకుంటారు.

కర్తవ్యపాలనని మించిన ఆర్తి కనబరుస్తాడో డ్రైవర్. అండమాన్ దీవుల జాతీయ పక్షులను యాత్రికులకు చూపిస్తూ వాటి సంఖ్య తగ్గిపోతోందని బాధ పడతాడు. ఇదే డ్రైవర్ తన వాహనంలో వచ్చిన యాత్రికులకిచ్చే బ్రేక్‌ఫాస్ట్ పాడయిపోయిందని తెలుసుకున్నాక స్పందించిన తీరు అతని నిబద్ధతని చాటుతుంది.

కొత్త జవసత్వాలతో నిండిన గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీకగా కనిపించే ఓ కుర్రాడు – రచయితకి ఆతిథ్యం ఇస్తాడు. ప్రపంచమంటే పట్టలేని ఆసక్తి అతనికి. చదువుకోవాలన్న తపన… ముంబయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహా నగరాలు చూడాలన్న అభిలాష అతని మాటల్లో వ్యక్తమవుతుంది. సంస్కారవంతమైన వ్యక్తిత్వం!

రచయితకి ఆతిథ్యం ఇచ్చిన నౌకాదళం అధికారి ప్రకాష్‌ గారిది మరో కథ. డెహ్రాడూన్ మిలటరీ కాలేజి, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలలో చదివి – కావాలానే నేవీని ఎంచుకున్నారాయన. పోటీ విపరీతంగా ఉండే రక్షణ రంగంలో వడపోత ఎక్కువనీ, ఎన్నికైన మెరికలంతా పదవీకాలమంతా పోటీ పడుతూనే ఉంటారని; ఒక్కోసారి మంచి ప్రతిభావంతులైనా వెనుకబడిపోక తప్పదనీ, అది జీవనసూత్రమని చెబుతారాయన. భవిష్యత్తుపై భయమూ, బెంగ లేకుండా – వ్యవస్థని గౌరవించే వ్యక్తి ఆయన. భావి జీవితం గురించి ఉద్వేగం లేకుండా ఆయన చెప్పిన తీరు బావుంది.

ఇంకా ఎందరెందరో మనుషులు… అందమైన వాతావరణంలో జీవిస్తూ… బ్రతుకుని శోభాయమానం చేసుకుంటున్న తీరు మనకీ జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. జీవన సరళిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే జీవితం ఎంత బాగుంటుందో అర్థమవుతుంది.

అండమాన్ దీవుల గురించి, స్థానిక తెగల గురించి, సెల్యులర్ జైలు గురించి, పురాతన సామిల్ గురించి, మ్యూజియంల గురించి, ఇతర దర్శనీయ స్థలాల గురించి తగినంత వివరణ ఉందీ పుస్తకంలో.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ, కినిగెలోను లబిస్తుంది. 104 పేజీల ఈ పుస్తకం వెల రూ. 100/-.

InvitationAD1

 

మీ మాటలు

  1. “. పై పై మెరుగుల కోసం జీవితాన్ని సంక్లిష్టం చేసుకునే బదులు… జీవితాన్ని సరళంగా ఉంచుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అర్థమవుతుంది.”
    అక్షర సత్యం!!
    ప్రకృతి పట్ల ప్రేమతో, బాధ్యత తో ఉంటే జీవితం మెరుగు పడుతుంది.
    మంచి వ్యాసం..

  2. సాయి.గోరంట్ల says:

    మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు సర్.
    చదివి తీరాలనే ఉద్విగ్నతతో….
    ధన్యవాదాలు

  3. amarendra says:

    థాంక్ యు సోమశంకర్, థాంక్ యు సారంగ, థాంక్ యోయ్ అఫ్సర్

Leave a Reply to కొల్లూరి సోమ శంకర్ Cancel reply

*