అడవి పిలిచింది

 

                      

 

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్ట పడతాను . కుళ్ళి కృశించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగ భగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను !మందకొడి గా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండటం కంటే దేదీప్యమానం గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్క గా మారాలనుకుంటాను ! మనిషన్న వాడు జీవించాలి . బతుకీడ్చడం కాదుజాక్ లండన్

ఈ మాటలు చదువుతుంటేనే రక్తం పరుగులు పెడుతుంది ! ఇలా బతకడం ఎంతమందికి సాధ్యం అవుతుంది ? జాక్ లండన్ అలాగే బతికాడు . జీవితంలోని ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా మార్చుకుంటూ , వాటిని పోగు చేసుకుంటూ మంట లా మండుతూ వెలుగుతూ బతికాడు !

jack london2

జీవితాన్ని ఒక మహోధృత తరంగం లా జీవించి ప్రతి క్షణాన్నీ అనుభూతి చెంది, ఇక చివరి క్షణాల్లో “అప్పుడలా చేసుంటే బాగుండేది, ఆ నెల్లో అలా చేయకుండా ఉండుంటే బాగుండేది” అని పశ్చాత్తాపాలు, నెమరేసుకోడాలూ లేకుండా బతికినన్నాళ్ళూ జీవించడం మాత్రమే తెల్సిన వ్యక్తులు లోకంలో ఎంతమంది ఉంటారో గానీ సరిగ్గా అలాటి మనిషే జాక్ లండన్ ! బోల్డు పుస్తకాలు రాశాడని అందరికీ తెల్సిందే!

వాటిలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది “కాల్ ఆఫ్ ది వైల్డ్”! దీన్ని మొదటి సారి నేను పీకాక్ క్లాసిక్స్ వాళ్ళు వేసింది “అడవి పిలిచింది” గా చదివాను. అది చదివాక వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్, ( ఇలా కుక్కలు తోడేళ్ళ మీద పుస్తకాలు రాసినందుకే ఆయన్ని ఆక్స్ స్నేహితుడు “ఉల్ఫ్ మాన్” అని పిలిచేవాడట )  To build a fire ఇంకా Star Rover చదివాను. వైట్ ఫాంగ్, సీ వుల్ఫ్ కూడా వైల్డ్ లైఫ్ కి సంబంధించే సాగుతాయి, కాల్ ఆఫ్ ది వైల్డ్ లాగే! టు బిల్డ్ ఎ  ఫైర్, మొత్తం పూర్తి చేసి గానీ కదిలే పుస్తకం కాదు. నిజానికి, అతి మామూలు సంఘటనల్ని కూడా ఉత్కంఠ  రేకెత్తించేలా జాక్ లండన్ మాజిక్ చేయగలడు. ఆ కథలోకి మనల్ని తీసుకు పోయి అక్కడ పారేస్తాడు ! ఇహ మన ఖర్మ , తర్వాత వెనక్కి రావాలంటే దారి మనమే వెదుక్కోవాలి !

జాక్ లండన్ తెలుగు పుస్తకం తో నాకు పరిచయం ఐనా, మిగతా పుస్తకాలు కూడా చదివించాడు. ఈ తెలుగు “అడవి పిలిచింది” చదువుతుంటే మనల్ని పిచ్చిగా ప్రేమించి, మన మీద అంతటి మమకారం పెంచుకుని మన కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేంత ప్రేమను పంచే బక్ లాంటి కుక్కను, మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ల రక్తం కళ్ల జూసే బక్ లాంటి కుక్కని.. పెంచుకోవాలనే కోరిక బలీయంగా కలుగుతుంది ఎవరికైనా !  విశ్వాసం, ప్రేమ చూపడం ఒక్కటే బక్ లక్షణం కాదు !  సాహసం, జీవితం మీద ప్రేమ, ఉత్సాహం ఇవన్నీ దాని ప్రత్యేక లక్షణాలు ! ఇది తోడేలు జాతికి చెందిన బలిష్టమైన కుక్క!

విధి వశాత్తూ రాజా లాంటి విలాసమైన బతుకు లోంచి అతి హీనమైన బతుకు లోకి జారి పడ్డ దగా పడిన కుక్క ఇది

అమెరికాలొని కాలిఫోర్నియా లో  నివసించే ఒక  జడ్జి గారింట్లో సకల రాజ భోగాలనుభవిస్తూ పెరిగే బక్ అనే ఈ కుక్కే ఈ నవల్లో హీరో! జాక్ లండన్ ఇతర నవలల్లాగే, మొదలు పెట్టాక ఏక బిగిన చదివించే ఈ నవల్లో బక్ జీవితం మొత్తం ఆవిష్కృతమవుతుంది.

Buck

“బక్ పత్రికలు చూడదు ” అంటూ నవల ప్రారంభం అవుతుంది . ఒక గొప్ప ప్రారంభం ఇది !

విలాసవంత మైన జీవితం, దాని వల్ల అయాచితంగా వచ్చి పడ్డ దర్పం తో బక్ రాజ ఠీవి తో జడ్జి గారింట్లో ఉంటుంది. ఎంతో గంభీరంగా, గర్వంగా బతుకుతున్న బక్,  ఏదో జడ్జి గారి మనవలు కాబట్టి వాళ్లని తన జూలు తో ఆడుకోనిస్తుంది. కానీ అది పత్రికలు చూడక పోవడం వల్ల దానికి రాబోతున్న కష్టం అది గ్రహించలేక పోతుంది.

ఆ సమయం లో  అలాస్కా ప్రాంతం  లో బంగారు గనుల్లో బోల్డంత బంగారం దొరుకుతోందనీ, అందువల్ల  జనం అంతా కట్టలు గట్టుకుని అక్కడికి పోతున్నారనీ, మంచు తప్ప మరేమీ లేని ఆ ప్రాంతం లో ప్రయాణించడానికి  స్లెడ్జ్ బళ్ళు కావాలనీ, వాటిని ఈడ్చడానికి  మంచు ని తట్టుకునే జూలు కల్గిన  బలమైన కుక్కలు అవసరమనీ పత్రికల్లో వచ్చుండచ్చు, వస్తుండచ్చు గానీ పత్రికలు చూడక పోవడం వల్ల మనిషికి ఆ పచ్చని లోహం మీద ఉన్న ప్రేమానురాగాలు దానికి తెలీవు.  అంతే కాక జడ్జి ముల్లర్ ఇంట్లో పని చేసే మాన్యూల్  కి ఉన్న చైనా లాటరీ జూదం వ్యసనం గురించి దానికేమీ అవగాహన లేదు.  ఇవన్నీ బక్ పత్రికలు చూడక పోవడం వల్ల దానికి తెలీవు. కాబట్టి, మాన్యూలు గాడు తనని ఒక పరాయి మనిషికి అమ్మబోతున్నాడని గ్రహించలేకపోయింది. వాడిని నమ్మి వాడితో బయటికి ఎప్పట్లాగే వెళ్ళి, వేరే వాడికి అమ్ముడై పోతుంది.

మాన్యూలు తన మెడ పట్టీని అపరిచితుడికి అప్పగిస్తుంటే కూడా , ఆ పరాయి వాడు మాన్యూలు కి తెలిసిన వాడే గదాని కాస్త గుర్రుమన్నా ఆమోదిస్తుంది! వాడు గోనె సంచిలో మూటగట్టి తీసుకుపోతుంటే “ఏదో జరిగింది” అని తప్ప ఏం జరిగిందో దాని కుక్క బుర్రకి తట్టదు. ఎన్నడూ ఆలోచించాల్సిన అవసరమే రాని బుర్రాయె!

అలా తీసుకుబోబడ్డ బక్ తన జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని భయంకరమైన జీవితాన్ని చూస్తుంది. ఒక బోనులో పడేసి బొత్తిగా బక్ అంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ రైల్లో తీసుకు పోతారు.

అక్కడి నుంచి అది చాలా మంది చేతులు మారి , సుదీర్ఘ ప్రయాణాలు చేసీ దానికి జీవితంలో “దుడ్డు కర్ర న్యాయాన్ని” పరిచయం చేసిన ఎర్ర స్వెటర్ వ్యక్తి చేతికి వస్తుంది. ఈ మధ్యలో ఎదురైన ప్రతి మనిషి పైనా బక్ ,చంపాలన్నంత కోపంతో తిరగబడి కరిచి రక్తం కళ్ల జూస్తుంది. రచయిత మాటల్లో చెప్పాలంటే “బందీ అయిన రాజుగారికి” వచ్చే కోపాన్ని చూపిస్తుంది. చివరికి బక్ ఎర్ర స్వెట్టర్ వాడి చేతిలో పడ్డాక వాడు “మాట వినడం, వినయంగా ఉండటం” అనేవి ఎలా సాధ్య పడతాయో దానికి రుచి చూపిస్తాడు, దుడ్డు కర్రతో!

తన దర్పాన్నీ, శౌర్యాన్నీ, బలాన్నీ మాత్రమే నమ్ముతూ వాటిని ప్రదర్శించాలని చూసిన బక్ కి ఎర్ర స్వెట్టర్ వాడి దుడ్డు కర్ర మాడు పగల గొట్టి, ఒక్క కుదుపు ఇస్తుంది. బక్ శరీరమే కాక, అభిమానం కూడా తిన్న మొదటి దెబ్బ అది!  దెబ్బ తిన్న బక్ అంత బాధని మొదటి సారి చవి చూసినా, తిరిగి వాడి మీద తిరగబడాలనే చూసి పన్నెండు సార్లు అతడి మీద దాడికి ప్రయత్నించి పదమూడో సారి కొట్టిన అతి బలమైన దెబ్బకి , తల వంచి శక్తి చచ్చి నిస్సహాయురాలై పోతుంది. వాడంటాడు ఏం బిడ్డా బక్? మన సంఘర్షణ అయిపోయింది. నీ స్థానం నువ్వు తెలుసుకుంటే మంచిది. నాది నేనెరుగుదును. ఇంతటితో పోనివ్వడం మంచిది

బక్ కి తన స్థానమేంటో తెలిసి వస్తుంది మొదటి సారి! తాను ఓడిపోయిందని గ్రహిస్తుంది గానీ లొంగి పోదల్చదు . అక్కడి నుంచీ బక్ “ఎదురు తిరిగితే” , తన తిరుగుబాటు న్యాయమైనదైనా  సరే, దెబ్బలు తినక తప్పదని అర్థం చేసుకుంటుంది. ఎర్ర స్వెటర్ వాడి నుంచి చేతులు మారి కెనడా దేశపు అధికారిక ఉత్తరాల బట్వాడా కోసం ప్రాన్సోయ్, పెరాల్ట్ అనే ఇద్దరు వ్యక్తుల వద్దకు చేరుతుంది బక్.నిత్యం కష్టమే,నిత్యమూ శ్రమే ! కానీ బతకాలంటే వాటికి తల వంచాలి !

ఇక్కడి నుంచీ బక్ కి అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం మామూలుగా నడిచి పోవాలంటే ఎన్ని జిత్తులు చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో,  ఎలా చేయాలో , ఎలా చేస్తారో అన్నీ తెలుస్తాయి. బతకడం కోసం అది అన్నీ నేర్చుకుంటుంది. మంచంటే తెలీని బక్ కి మంచు లో మైళ్ళ కొద్దీ స్లెడ్జ్ బండి లాగడం, మంచులో గుంట తవ్వుకుని పడుకోడం అన్నీ అలవాటు అవుతాయి. జీవితం లాగి పెట్టి  తన్ని మరీ నేర్పిస్తుంది. ఒకరి నాయకత్వం కింద పని చేయడమూ, పని సరిగా చేయలేనపుడు నోర్మూసుకుని భరించడమూ, ఇవన్నీ బక్ అంగీకరిస్తుంది.

ఎస్కిమో కుక్కలు వచ్చి పడితే వాటిని ఎదుర్కోవడమూ, తోటి కుక్కలు మోసం చేస్తే బుద్ధి చెప్పడమూ అలవాటు చేసుకుంటుంది. దాని జీవితం సినిమాల్లో మాదిరిగా క్షణాల్లో సింహాసనం మీది నుంచి పాతాళం లోకి జారి పడ్డట్టు అయినా, బక్ దాన్నుంచి తేరుకుని దొరికిన జీవితాన్ని అంగీకరిస్తుంది.

పని చేయడానికే తనను అక్కడికి తెచ్చారని  అర్థం చేసుకుని బతుకు దెరువు కోసమన్నట్టుగా అది త్వరగానే పని నేర్చుకుని స్లెడ్జ్ బళ్ళు లాఘవంగా లాగుతుంది.

కలలోనైనా ఊహించని కష్ట జీవితం!

ఉత్తరాల బట్వాడా పన్లు చూసే ప్రాన్సోయ్, పెరాల్ట్ బక్ ని బాగా మెచ్చుకుంటారు ఒళ్లు దాచుకోదని!

కష్ట జీవితం అలవాటయ్యాక బక్ లోని సున్నితత్వమూ, పెంపుడు జంతువుకు ఉండే నాగరికతా, మొహంలో ప్రశాంతతా అన్నీ ఒక్కొక్కటీ మాయమై పోతాయి.అది జీవితం మీద పగ బట్టినట్టు ప్రవర్తిస్తుంది. తనపై ఆధిపత్యాన్ని చూపబోయే స్పిట్జ్ కుక్క రక్తం కళ్ల జూస్తుంది. మోసం, దొంగతనం నేర్చుకుంటుంది. అదను చూసి దాడి చేసే విద్య నేరుస్తుంది. నిజాంకి ఇవన్నీ అక్కడ బతకాలంటే ఉండాల్సిన కనీస అర్హతలనుకోవచ్చు! అది రాక్షసి లాగా మారినా, ఆ రాక్షసత్వాన్ని కప్పి పైకి మామూలుగా కనిపించే యుక్తిని కూడా నేర్చుకుంటుంది.

కొన్నాళ్లు గడిచాక ,  ఉత్తరాల బట్వాడా పని పూర్తయ్యాక అది మరొకరి చేతిలో పడి, అక్కడి నుంచి అదృష్ట వశాత్తూ జాన్ టారంటన్ (Thornton )ఆశ్రయాన చేరుతుంది. అతడు దాన్ని చావగొడ్తున్న వాడిని బెదిరించి కాపాడతాడు ! టారంటన్ ని  చూస్తుంటే జాక్ లండనే తన పాత్రను పెట్టాడేమో అనిపిస్తుంది. అతని వద్దకు చేరాక నిరంతర శ్రమ కారణంగా  డస్సి పోయున్న బక్ తనకు అనుకోకుండా లభించిన ఈ అవకాశానికి ఆశ్చర్య పోతూనే కొంతకాలం పాటు తిండి,మంచి విశ్రాంతి, ప్రకృతి విహారం వీటితో కోలుకుని పోయిన తన శక్తిని కూడగట్టుకుంటుంది. ఈ బ్రేక్ లో దానికి ముందెన్నడూ లేని అనుభవం .. అవధులు లేని ప్రేమ జాన్ టారంటన్ తో కలుగుతుంది. జడ్జి మిల్లర్ ఇంట్లో రాజభోగాలు వెలగబెట్టినపుడు పది కుక్కల్లో బక్ ఒక ప్రత్యేక ఠీవీ తో ఉండటం, దాన్ని పని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోడం తప్ప ఇలాటి ప్రేమను పంచిన వాళ్లెవరూ లేరు. అది అతన్ని ఎంతగా ప్రేమించేదంటే జాన్ దాన్ని ముద్దు చేస్తుంటే గుండె వేగం పెరిగి పోతుంది.  పిచ్చి మమకారం పెంచుకుంటుంది!

అలాగని అది మిగతా కుక్కలా లాగా ఎగబడి ఆ ప్రేమను చూపించదు! పైకి పెద్దగా తేలకుండానే మూగగా ఆరాధిస్తుంది ! ప్రేమలో బెట్టుసరి గా ఉంటుంది . తన మమకారాన్ని జాన్ గ్రహిస్తున్నాడని తెల్సు ! కానీ ఎగబడితే కొంత చులకనై పోతానని బెట్టు ! దటీజ్ బక్ !

Call of the wild cover pageజాన్ ని అంటిపెట్టుకుని అహర్నిశలూ ఉంటూ, అతన్ని కాపాడ్డం తన విధిగా భావిస్తుంది.రెండు సార్లు అతన్ని ప్రమాదాల నుంచి కాపాడి ప్రాణ దానం చేస్తుంది. అతన్ని పందెం లో గెలిపించడానికి స్లెడ్జి బండితో సహా వెయ్యి పౌన్లు బరువు లాగుతుంది. జాన్ కోసం ప్రాణమిస్తుంది.

అయితే జడ్జి మిల్లర్ ఇంట్లోంచి కిడ్నాప్ అయింది లగాయతూ బక్ కి దొరికింది స్వేచ్చ మాత్రమే కాదు.దాని లోని ఆటవిక శక్తులేవో నెమ్మది నెమ్మదిగా జూలు విదిల్చి నిద్ర లేస్తాయి. అందుకే అది స్లెడ్జ్ బళ్లు లాగే ఇతర కుక్కల దగ్గర అతి సులువుగా వేగంగా కుయుక్తులు, కుట్రలు నేర్చుకుంటుంది. చివరికి అది మిగతా కుక్కల కన్న శక్తివంతంగా తయారై వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఇవన్నీ చేస్తున్నపుడే దాన్లోని ఏదో ఒక ప్రవృత్తి దాన్ని కొంత ఉద్వేగానికి గురి చేస్తూ, ఎక్కడికో వెళ్ళి పోవాలన్న భావోద్రేకాన్ని కల్గిస్తూ ఉంటుంది.

తెల్లని మంచు లోంచి పచ్చని అడవిలోకి వచ్చి పడ్డాక, టారంటన్ వద్ద ఉంటున్నపుడు ఈ ప్రవృత్తి మరింతగా ప్రకోపిస్తుంది! ఏ గత జన్మ జ్ఞాపకాలో వేధిస్తుంటాయి. ప్రకృతి నుంచి ఏవో పిలుపులు అందుతుంటాయి. ఆ పిలుపులు విన్నపుడు వెర్రి ఆవేశం దాన్ని ఆవహిస్తుంది. అది వినగానే బక్ అడవిలోకి పోయి తిరిగి తిరిగి తను కూడా మొరిగి, అడవి పాట పాడి వస్తుంది.

ఒక అర్థరాత్రి నాడు అడవి నుంచి వినిపించిన పిలుపుకు స్పందించిన బక్ అడవిలోకి పరుగు తీసి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందీ తెలుసుకుంటుంది. ఆ తోడేలుని తన బంధువు గా గుర్తించినట్టుగా ,  బక్ దాంతో పోట్లాడక స్నేహం చేస్తుంది.దానితో పాటు అడవిలో పిచ్చిగా తిరిగి ఆడుతుంటే, దానికి గత జన్మ గుర్తొచ్చినంత పనవుతుంది. ఈ తోడేళ్ళ స్నేహం కోసమే తాను వచ్చినట్టు అనుభూతి చెందుతుంది ! ఇలాటి ఉద్రేకంలోనూ అది టారంటన్ ని మర్చి పోక వెనక్కి తిరిగొస్తుంది.బక్ కి ఈ అడవి పిలుపు , అది సాగించే వేటా ఇవన్నీ ఎక్కడో ఇంతకు ముందు తనకు జరిగినవే, తనకు అనుభవం లోకి వచ్చినవే అని తోస్తుంది (దేజా వు అన్నమాట )! అది తన తోడేలు జాతి రక్తం లో నుంచి మరుగుతున్న జ్ఞాపకాల మంట గా అది గుర్తించలేదు గానీ అనుభవానికి తోస్తుంది !

ఈ క్రమంలో అది రాక్షసం గా ఆటవిక తత్వాన్ని అలవర్చుకుంటుంది. ఎలుగు బంట్లను కూడా వేటాడుతుంది. డజన్ల కొద్దీ తోడేళ్ళను అవలీలగా ఎదుర్కొని రక్తం కళ్ల జూస్తుంది. ఒక గొప్ప అతిశయమూ, దాని వల్ల సమకురిన ఆటవిక సౌందర్యం వల్ల బక్ సౌందర్యం, ఠీవీ ఇనుమడిస్తాయి.ముట్టె మీదా, కళ్ళ పైనా ఉన్న నల్లని మచ్చలతో అది దాదాపూ ఒక బలమైన తోడేలు వలే కనిపిస్తుంది. పొంచు వేయడం,నిశ్శబ్దంగా పాములా పాకి దెబ్బ కొట్టడం ఇలాటివన్నీ బక్ నేర్చుకుని గొప్ప జీవ శక్తి తో అత్యంత శక్తివంతమైన ఆటవిక మృగం గా రూపొందుతుంది.

ఈ సమయంలోనే టారంటన్ బృందం బంగారు గనుల నుంచి చాలా బంగారాన్ని సాధిస్తారు.ఒక దుర్దినాన బక్ ఒక దుప్పిని  మహోత్సాహం తో వేటాడుతూ ఉన్నపుడు  ఈహాట్ తెగకు చెందిన రెడ్ ఇండియన్లు టారంటన్ శిబిరం మీద పడి అందర్నీ చంపి బంగారం దోచుకుంటారు. అందర్నీ చంపాక వాళ్లు ఆనందంతో నృత్యం చేస్తున్న సమయంలో బక్ అక్కడికి వచ్చి జరిగిన ఘోరాన్ని గుర్తించి, వీరావేశంతో విధ్వంసం సృష్టించి కన పడ్డ వాళ్లందర్నీ చంపి పారేస్తుంది. అదొక కుక్క అని కూడా గ్రహించే టైము వాళ్ళకి ఇవ్వదు !  భయం తో వాళ్ళంతా కకావికలైపోతారు. ఒక పెద్ద భూతం వచ్చి పడిందనుకుంటారు

జాన్ టారంటన్ నీళ్ళ మడుగు వరకూ పరిగెత్తి అక్కడ చని పోయాడని బక్ అర్థం చేసుకుంటుంది.బక్ ఆ సంఘటన జరిగినపుడు అక్కడ ఉండుంటే అంత జరిగేది కాదు. టారంటన్ మరిక లేడనే విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ దాని కడుపులో గుండెలో దుఖం తో  ఒక డొల్ల తనం ఏర్పడుతుంది. ఆ ఖాళీ మరిక పూడేది కాదు ఎన్నటికీ ! అది బాధను దిగమింగుతుంది.

కానీ పగను కాదు!

బక్ వెళ్ళి తోడేళ్ళ గుంపులో చేరి వాటన్నిటి మీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అడవి తోడేళ్ళ సంతానం లో ముట్టెమీదా నెత్తి మీదా కపిల వర్ణపు మచ్చలు గల వాటిని ఈహాట్లు గుర్తిస్తారు.వాళ్లకు ఆ దెయ్యం కుక్క అంటే దడ. వాళ్ళ శిబిరాల్ని అది ఆ తర్వాత కూడా ధ్వంసం చేస్తుంది, శిబిరాల్లోంచి వెళ్ళిన వేట గాళ్ళు తిరిగి శిబిరం చేరకుండా దొరికిన వాళ్లను దొరికినట్టు చంపేస్తుంది. వాళ్ల శవాల పక్కన బక్ పాదాల గుర్తులు! వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేటాడి చంపుతుంది

ఇంత రాక్షసి గా మారిన బక్ ప్రతి వేసవి లోనూ ఆ లోయలోకి వచ్చి అక్కడ బంగారం నేలలోకి ఇంకి పోయి గడ్డి మొలిచిన ఆ ప్రాంతాల్లో ఎవర్నో గుర్తు చేసుకుని సుదీర్ఘంగా ఏడ్చి వెళ్ళి పోతుంది.

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -19591

నవల ఆది మధ్యం అంతం మొత్తం బక్ దే! జాక్ లండన్ ఎంతటి ఉద్వేగ భరిత శైలి లో రాశాడో, అది ఏ మాత్రం లుప్తం కాకుండా దీన్ని కొడవటి గంటి కుటుంబ రావు అనువదించారు. నవల మొత్తం బక్ విశ్వరూపాన్ని, దాని జీవన వైవిధ్యాన్ని, భావోద్వేగాలని అత్యద్భుతంగా చిత్రీకరించారు.

అసలు బక్ ని ఒక మనిషి పాయింటాఫ్ వ్యూలో అర్థం చేసుకొవాలనిపిస్తుంది. ఈ మాట డోనాల్డ్ పైజర్ అనేసాహిత్య కారుడు కూడా నొక్కి వక్కాణిస్తాడు. బక్ అనుభవించి, మనం చదివేదంతా మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులే! పరిస్థితులకు అనుగుణంగా దర్జా వెలగబెట్టడమూ, హీన దశలో గతి లేక లొంగి ఉండాల్సి రావడమూ, తర్వాత ఆటవికంగా ప్రవర్తించాల్సి వచ్చి, ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చినపుడు దాన్ని అంది పుచ్చుకునే స్వభావమూ ఇది మొత్తం అట్టర్ హ్యూమన్ నేచర్! బక్ తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఈ మధ్య అదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడతగ్గాలో  అక్కడ తగ్గి ప్రవర్తిస్తుంది.చిత్రంగా నవల మొదటి సారి చదువుతున్నపుడు నాకు సీతారామా రావు గుర్తొచ్చాడు. అతను కూడా డబ్బు చేతిలో ఉన్నపుడు తన్ను తాను మహరాజు గా భావించుకుంటూ దర్పంగా ఉంటాడు. బోల్డు కబుర్లు చెపుతాడు. బక్ నుంచి సీతారామా రావులు చాలా నేర్చుకోవాలి! పరిస్థితి చేజారగానే చతికిల బడి డిప్రెషన్ లోకి పోయి తనను తాను చంపుకుంటాడు. బక్ అలా చేయదు. గడ్డి పోచలా తుఫాన్ వచ్చినపుడు వంగి, అది పోగానే తలెత్తుతుంది. ఈ క్రమంలో అది తన స్వాభిమానాన్ని, సహజ విశ్వాస స్వభావాన్ని,అంతకు మించి అనువంశికంగా ప్రాప్తించిన ఆటవికత్వాన్ని ఏ మాత్రమూ వదులుకోదు!సమయం కోసం వేచి చూస్తుందంతే!

ఎర్ర స్వెటర్ వాడు పరిచయం చేసిన దుడ్డు కర్ర న్యాయాన్ని అది చిటికె లో గ్రహించి ఆ పాఠాన్ని చివరి వరకూ గుర్తు పెట్టుకుంటుంది. అధికారం చేతిలో ఉన్నవాడిదే రాజ్యం!వాడి చేతిలో కర్ర ఉన్నంత వరకూ, మనకు ప్రాణం మీద ఆశ ఉన్నంత వరకూ దుడ్డుకర్రను గౌరవించక తప్పదు. ఈ పాఠాన్ని మనుషులు అందరూ నేర్చుకోలేరు. నేర్చుకున్నా మానవ సహజమైన ఉద్వేగాలతో అనువు గాని చోట సామెత లా ప్రవర్తించి, భంగ పడతుంటాం మనం, అది సహజం కూడానూ! కానీ గెలవాలంటే వేచి చూడక తప్పదని, నెగ్గాలంటే తగ్గక తప్పదని బక్ చెప్తుంది.అలాగే బక్ కొన్ని జీవిత సత్యాలు తన శ్రామిక జీవితంలో నేర్చుకుంటుంది. బలమున్న వాడిదే రాజ్యం అనే ఎర్ర స్వెటర్ వాడి పాఠమే దీనికి కూడా మూలం! ప్రాణాలు నిలబెట్టుకుని తీరాల్సిన పరిస్థితిలో మోసం తప్పదు! తీరీ తీరని ఆకలి తీరాలన్నా దొంగ తనం చేయక తప్పదు. బక్ లో ఉత్తమ లక్షణం అదే! నేర్చుకున్న పాఠాల్ని మర్చే పోదు! తనకు పోటి గా తయారైన స్పిట్జ్ అనే కుక్క దాష్టీకాన్ని అది చాలా రోజులు భరిస్తుంది . దాని నాయకత్వం లో పని చేస్తుంది !గాయ పడుతుంది . మొదట్లో చాలా సహనం వహిస్తుంది . కాల క్రమేణా అది దాని సహజ ఆటవిక ప్రవృత్తిని  స్వీకరించాక , స్పిట్జో తనో తేలి పోవాల్సి వచ్చిన రోజు, ఉగ్ర రూపం ధరించి దాని అంతు చూసేస్తుంది ! ఎవరో ఒకరు గెలాల్సిన రేసులో ప్రాణాలు పోగొట్టుకోడానికి కూడ సిద్ధమై ప్రాణాలు తీయడానికి  తెగబడుతుంది ! తెగబడక పొతే స్పిట్జ్ ఆ చాన్స్ తీసుకుంటుంది మరి !

బ్రాహ్మణీకం లో చలం ఒక మాటంటాడు “ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ, మనుషులు తమ స్వభావంలోనూ ఔన్నత్యం ఉందనుకుంటారు” అని! బక్ కూడా జడ్జి గారింట్లో ఉన్నన్నాళ్ళూ తానొక రాజ వంశానికి చెందిన దాన్నని ఊహించుకుంటూ దర్పం చూపిస్తుంది. కానీ వాస్తవం మరో లోకం లో పడేసి ఈడ్చి తన్నే సరికి, ముందు నిర్ఘాంత పోయినా త్వరలోనే తేరుకుని జీవితంతో రాజీ పడుతుంది. ఒళ్ళు దాచుకోక పని చేస్తుంది.అలా దాచుకునే ఇతర స్లెడ్జ్ కుక్కల్ని సహించదు.అడవిలోకి వచ్చాక, సహజ గుణం ప్రకారం ఆహారం కోసం మాత్రమే వేటాడుతుంది. వినోదం కోసం కాదు! ఇలా ఎక్కడికక్కడ బక్ నీళ్ళు అది పోసిన పాత్రను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా, జీవితానికి అనుగుణంగా అడ్జస్ట్ అవుతూ, ఎలా జీవించాలో సహజం గా చెప్తుంది మనకి . “నాగరికత నుంచి తిరిగి ప్రకృతికి ప్రయాణం ” అనే కాన్సెప్ట్ అమెరికా సాహిత్యం లో ఒక ప్రత్యేక ప్రక్రియ గా చెప్పవచ్చు . మార్క్ ట్వైన్ హకెల్ బరీ ఫిన్ కూడా ఈ కోవకు చెందిందే !

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -195997

బక్  స్వామి భక్తి కూడా విశేషం! టారంటన్ జోలికి ఎవడు వచ్చినా రక్తం కళ్ల జూస్తుంది. వాళ్లిద్దరి బంధాన్ని, మమకారాన్ని జాక్ లండన్ చాలా ప్రత్యేకించి వివరిస్తాడు. టారంటన్ దాని తల మొరటు గా పట్టుకుని వూపుతూ దాన్ని నానా తిట్లూ తిడతాడు. అవన్నీ ముద్దు మాటలని దానికి తెలుసు! అతనలా ప్రేమ చూపిస్తుంటే ఆనందంతో దాని గుండె బయటికి వచ్చేస్తుందన్నంత గాఢంగా దాన్ని అనుభవిస్తుంది. అంత ఉద్రేకం!

పైగా బక్, హచి లాంటిదో (అదీ గొప్పదే)మరోటో కాదు! అది ఎక్కడైనా సరే సంరక్షణ బాధ్యత తీసుకునే రకం!తనను ప్రేమించిన వారిని అంతకంటే పిచ్చిగా ప్రేమించే రకం!

దాని వేటను రచయిత ఎంత ఉద్వేగ భరితంగానో వర్ణిస్తాడు. గడ్డ గట్టిన మంచు మీద తేలిక పాటి అడుగులతో పారిపోయే ఒక నీటి కుందేలును అది వేటాడే తీరు అద్భుతం! అది ఎంతటి ఉన్నతమైన enthusiasm తో వేటాడుతుందో రచయిత కళ్లకు కడతాడు.

జీవితపు అత్యున్నత స్థాయిని  అందుకుని, మళ్ళీ అలాటి దశ జీవితంలో రాదేమో అన్నపుడు గొప్ప ఆవేశం కలుగుతుందిజీవితపు ఉచ్చదశలో కలిగే ఆవేశం అదేం చిత్రమో జీవితాన్నే విస్మరింప జేస్తుంది. తాను జీవించి ఉన్నట్టు కూడా తెలియనివ్వని ఆవేశం కళాకారుడికి అనుభవమైనపుడు ఒక మహా జ్వాలతో పైకి లేస్తాడు.సైనికుడికి ఆవేశం వచ్చినపుడు యుద్ధోన్మాదానికి వశుడై ప్రాణాలకు తెగించి పొరాడతాడు.బక్ సరిగ్గా ఇప్పుడు అలాటి ఆవేశానికి చిక్కింది. జీవితోద్వేగం దాన్ని ఆవహించింది. దాని నర నరానా ఆనందం ఉబుకుతున్నదిఒక కుక్క వేట దృశ్యం ఇది!

ప్రకృతి గురించి, వైల్డ్ లైఫ్ గురించి తీరిగ్గా ఆలోచించే సమయం, కోరిక, తీరిక మనకు ఉండక పోవచ్చు గానీ, దానితో మమేకమై తిరిగితే, గడిపితే ఎన్నెన్ని రహస్యాలు ఆవిష్కృతమవుతాయో! ఎన్ని జంతు హృదయాలు మనతో మాట్లాడతాయో! పశువులు మనుషులకంటే నయమని ఎంతగా అర్థమవుతుందో ! అన్ కండిషనల్ గా ప్రేమించగలిగేది జంతువులు మాత్రమేనని అందరమూ ఒప్పేసుకుంటామేమో!

జాక్ లండన్ అలా , విచ్చలవిడి నగ్న ప్రకృతి లో, జంతువులని చూస్తూ, చెట్లతో, సముద్రం తో మాట్లాడుతూ బతికాడు,  గడిపాడు. ఈ నవల, ఇంకా మరి కొన్ని అతని నవలలు అలా పుట్టినవే! తోడేళ్లనీ కుక్కల్నీ, ఎస్కిమోలనీ, రెడ్ ఇండియన్లనీ గమనిస్తూ, చదువుతూ మంచు గుట్టలు పేరుకునే స్థలాల్లో తిరిగాడు. అక్కడ గుడారం వేసుకుని, పుస్తకాలు చదువుతూ  గడిపాడు! అతని జీవితంలో తిండి, నిద్ర , డబ్బు వంటి వాటికి ఎలాటి ప్రాముఖ్యం లేదు!  అవన్నీ తాత్కాలిక అవసరాలంతే ! సాహసం , గొప్ప ప్రేమ , తీవ్రమైన పాషన్ , వ్యామోహం , ప్రయాణం , ప్రకృతి, సముద్రం , అడవి ఇవన్నీ కలిస్తే జాక్ లండన్ జీవితం! ఆయన ఇదంటూ ఒక వృత్తి ని ఎంచుకోలేదు . ఓడ కూలి, చాకలి,ముత్యప్పు చిప్పల్ని దొంగిలించడం ,చిన్నా చితకా కూలి పన్లు చేశాడు ! అట్లాంటిక్ మంత్లీ లో రాతలు రాశాడు! చిన్న తనంలోనే సాహసాలూ సముద్ర యాత్రలూ, అన్వేషణలూ వర్ణించే పుస్తకాలు చదివి జీవితం అంటే సాహసం, రొమాంటిసిజం అని నిర్వచించేసుకున్నాడు! ఆ నిర్వచనం ప్రకారమే బతికాడు! తెప్ప కట్టుకుని శాన్ ఫ్రాన్సిస్కో సముద్రం లో పడి తిరిగే వాడు.చిల్లర నేరస్తులంతా స్నేహితులు! దొంగతనాలు మొహం మొత్తాక దొంగల్ని పట్టుకునే ఉజ్జోగం కూడా చేశాడు. రెండూ ఎలా ఉంటాయో చూద్దామని “కిక్” కోసం చేసిన పన్లే!

Prakriti pilupu_Jack London,(Tr)Kodavatiganti -1959189

సాహసాన్ని మనసు తీరా అనుభవించేందుకు  అప్పట్లో (1896-1899) అలాస్కా ప్రాంతంలో జరిగిన బంగారం అన్వేషణ కి బయలు దేరాడాయన . జీవితానుభవాన్ని పొందిన సమయం అది. “It was in the Klondike, I found myself” అంటాడు.మంచు తప్ప ఏమీ లేని చోట ఒక ఏడాది పాటు నివసించాడు. ఎండ మొహం చూడక పోవడం వల్ల స్కర్వీ రోగం వచ్చి, బంగారం అన్వేషణ మొదలయ్యే సమయానికి ఆ స్థలం వదిలి తిరిగి కాలిఫోర్నియా రావాల్సి కూడా వచ్చింది !నిజానికి లండన్ అన్వేషణ బంగారం కోసం కాదు కాబట్టి అతనికి పోయిందేమీ లేదు, ఆరోగ్యం తప్ప! ఈ అలాస్కా జీవితంలోనే అతనికి ఈ నవలకు కావలసిన ముడి సరుకు దొరికింది! స్లెడ్జ్ బళ్ళు లాగే ఎన్నో కుక్కల్ని చూసివాటి లోంచే ఆయన బక్ ని సృష్టించాడు !

అతనికొక ఉద్రేక పూరితమైన  జీవితం కావాలెపుడూ! బంగారం అన్వేషణ లో జబ్బు పడి వచ్చాక ఆ అనుభవాల డైరీ తోనే పూర్తి స్థాయి రచయితగా మారాడు  ! అందుకే అతని ప్రతి రచనా చదువర్లను కూడా ఉద్వేగం అంచున నడిపిస్తుంది

ఈ నవల చదివాక అనిపిస్తుంది, “లండన్ నిజంగానే బక్ అనే కుక్కని ఊహించుకుని ఎక్కడో ఒక చోట బక్ నిజంగానే ఉందని నమ్మి ఉంటాడా?” అని!

ఈ నవలను 1959 లో కొడవటి గంటి కుటుంబరావు గారు ప్రకృతి పిలుపు అనే పేరుతో అనువదించగా దేశీ కవితా మండలి విజయవాడ వాళ్లు వేశారు. చాలా రోజులకు అది అందుబాటు లో లేకుండా పోయింది. మంచి పుస్తకాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే పీకాక్ క్లాసిక్స్ ఈ పుస్తకాన్ని మళ్ళీ 2003 లో “అడవి పిలిచింది” పేరుతో అందుబాటు లోకి తెచ్చింది . కాపీ రైట్ సమస్యల వల్ల కుటుంబరావు  గారి అనువాదాన్నే గాంధీ కొంత సంక్షిప్తం చేసి ప్రచురించారు. 2003 నుంచి పది  సార్లు ముద్రణకు వచ్చింది. మొదటి ప్రచురణ లో ఇది కొడవటి గంటి కుటుంబరావు గారి అనువాదానికి సంక్షిప్తం అనే విషయం ముందుమాట లో ప్రస్తావించారు (గాంధీ గార్ని కనుక్కున్నాను) గానీ తర్వాత తర్వాత ప్రచురణల్లో ఈ విషయం లేక పోవడం వల్ల ఈ మధ్య కాలంలో కుటుంబరావు గారి అనువాదం అందరికీ అందుబాటులోకి వచ్చే దాకా నేను అది గాంధీ గారు చేసిన అనువాదమనే అనుకున్నాను. ఒరిజినల్ నవలను సంక్షిప్తం చేసి గాంధీ అనువదించారని భావించాను.

 

పైగా “కొ కు అనువదిస్తే అచ్చం ఇలాగే ఉండేది. ఎంత సజీవమైన భాష వాడారో” అనుకున్నాను కూడా :-) ! ఒక చోట కుక్క ధర మాట్లాడే విషయంలో “నూరుకు ఠోలీ తక్కువైతే వీలు కాదు పొమ్మన్నాడు” అనే వాక్యం లో “ఠోలీ” అనే మాట విని అసలు ఎన్నాళ్ళయిందో అనిపించింది !

గాంధీ ఇంకో మంచి పని కూడా చేశారు. ఈ పుస్తకాన్ని పిల్లల కోసం  బొమ్మలు చేర్చి “బక్” అనే పేరుతో మరో ఎడిషన్ వేశారు!

పీకాక్ క్లాసిక్స్ కి ఈ విషయంలో ఎన్ని కృతజ్ఞతలు  చెప్పినా చాలదు. జాక్ లండన్ అనేవాడొకడున్నాడని, జీవితాన్ని అత్యద్భుతంగా దాని దారిన దాన్ని నదిలో వదిలేసిన పడవలా పోనిస్తూ, ఆయన అనుభవాలన్నీ నవలలుగా లోకానికి అందించాడని నాకు పీకాక్ క్లాసిక్స్ ద్వారానే తెల్సిందని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ప్రఖ్యాత రచయిత నాకు అప్పటి వరకూ పరిచయం కాలేదని చెప్పడానికి సిగ్గు పడటం లేదు.

gandhi

“పీకాక్” ప్రచురణల గాంధి

కొన్ని పుస్తకాల ప్రభావం బలంగా ఉంటుంది. రచయిత మీద మమకారమో ప్రేమో, హద్దులు దాటిన అభిమానమో పెంచుకునేలా చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినపుడు ఆ అగాథ జలాల్లో బోటు మీద తిరుగుతూ “జాక్ లండన్ తిరిగిన ఈ నీళ్ళలోనే నేను కూడా షైర్లు కొడుతున్నా” అనుకుని సంతోష పడ్డాను! కట్టుకుంటున్నపుడే తగలబడి శిధిలాలుగా మిగిలిన అతని ఇల్లు ఒక సజీవ జ్ఞాపకం!

ఉద్వేగపుటలల్లో సాహసాల దారిలో లాక్కుపోయే ఈ నవల ఇంగ్లీష్ లో ఉచితంగానే డౌన్లోడ్ కి దొరుకుతుంది! తెలుగు వెర్షన్ కుటుంబరావు గారిది కూడా నెట్ లో ఉంది. వెదికి కనుక్కొని చదవండి :-)

ప్రకృతి తో బతకాలి, ప్రకృతి లో బతకాలి ! ప్రకృతి తో మమేకమై బతకాలి !

ప్రకృతి ఆహ్వానిస్తే తప్పక బయలు దేరాలి ! ఇదే జాక్ లండన్ జీవితం , రచనలూ !

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. సాయి.గోరంట్ల says:

    చాలా బాగుంది పరిచయం.ఇంతకు ముందు జాక్ లండన్ గురించి చదివినా “బక్” గురించి మానవ స్వబావాలను బక్ ద్వారా వివరించిన తీరు బలే నచ్చంది….దన్యవాదాలు

  2. శ్రీనివాసుడు says:

    ’’అడవి పిలిచింది‘‘ పుస్తకము కొరకు లంకె
    http://www.vikasadhatri.org/?q=node/24

  3. శ్రీనివాసుడు says:

    ’’ప్రకృతి పిలుపు‘‘ పుస్తకము కొరకు లంకె
    http://www.docfoc.com/download/documents/prakriti-pilupu-jack-london-tr-kodavatiganti-kutumbarao-1959-198-p

  4. Prof P C Narasimha Reddy Ph D says:

    Jack London stood on the edge of human and animal instincts and created a character that stole our hearts.Ko Ku’s translation is rather out of sync with his usual diction but sharp in narration with racy style of edgeless chiaroscuro. – Prof P C Narasimha Reddy

  5. కె.కె. రామయ్య says:

    జాక్ లండన్ నవల “కాల్ ఆఫ్ ది వైల్డ్” లోని బక్ విశ్వరూపాన్ని, దాని జీవన వైవిధ్యాన్ని, భావోద్వేగాలని “ప్రకృతి పిలుపు” గా 1959 లో తెలుగు లోకి అత్యద్భుతంగా అనువదించిన కొడవటిగంటి కుటుంబరావు గారిని ప్రస్తావిస్తూ పుస్తక విశ్లేషణ చేసిన సుజాత గారికి ధన్యవాదాలు.

    ” విశ్వాసం, ప్రేమ చూపడం ఒక్కటే బక్ లక్షణం కాదు ! సాహసం, జీవితం మీద ప్రేమ, ఉత్సాహం ఇవన్నీ దాని ప్రత్యేక లక్షణాలు ! ఇది తోడేలు జాతికి చెందిన బలిష్టమైన కుక్క! అసలు బక్ ని ఒక మనిషి పాయింటాఫ్ వ్యూలో అర్థం చేసుకొవాలనిపిస్తుంది. బక్ అనుభవించి, మనం చదివేదంతా మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులే! పరిస్థితులకు అనుగుణంగా దర్జా వెలగబెట్టడమూ, హీన దశలో గతి లేక లొంగి ఉండాల్సి రావడమూ, తర్వాత ఆటవికంగా ప్రవర్తించాల్సి వచ్చి, ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చినపుడు దాన్ని అంది పుచ్చుకునే స్వభావమూ ఇది మొత్తం అట్టర్ హ్యూమన్ నేచర్! ”

    “కాల్ ఆఫ్ ది వైల్డ్” నవల అంతః సూత్రాన్ని అద్భుతంగా వివరించారు సుజాత గారూ! హృదయపూర్వక ధన్యవాదాలు!!

  6. కె.కె. రామయ్య says:

    జాక్ లండన్ నవల “కాల్ ఆఫ్ ది వైల్డ్” ను ’’ప్రకృతి పిలుపు‘‘ పేరిట కొ.కు. నాయన అత్యద్భుతంగా అనువదించిన (దేశీ కవితా మండలి, విజయవాడ ప్రచురణ) పుస్తకం డౌన్లోడ్ కు లింకు ఇచ్చిన శ్రీనివాసుడు గారికి కృతజ్ఞతలు.

  7. Sailaja Chandu says:

    సుజాత గారూ,
    చదివినపుడు అనుభవం లోకి వచ్చిన ఎన్నో భావాలను మీకు చెప్పలేను. ఈ రెండు పదాలతో సర్దుకోండి !
    చాలా బాగుంది.

  8. సుజాత గారూ…
    చక్కటి, చిక్కటి పరిచయమండీ.
    ఇప్పటిదాకా జాక్ లండన్ ది ‘ఉక్కుపాదం’ (ఐరన్ హీల్) మాత్రం చదివితే చాల్లే అనుకునేవాణ్ని. కానీ, ఇప్పుడు ‘అడవి పిలిచింది’ కూడా తప్పక చదవాల్సిందే అనిపిస్తోంది. థాంక్యూ!!

  9. సుజాత says:

    సాయి గోరంట్ల గారూ,
    శ్రీనివాసుడు గారూ (లింక్స్ ఇచ్చినందుకు)
    శైలజ గారూ,
    నరసింహా రెడ్డి గారూ

    నాగరాజ్

    నచ్చినందుకు ధన్యవాదాలు

    నాగరాజ్, To buid a fire కూడా చదవండి! నచ్చుతుంది మీకు !ఉచితంగా ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది

    రామయ్య గారూ, ఆ అంతస్సూత్రాన్ని ఒకరు కనిపెట్టేదేముంది, అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు జాక్ లండనే విశద పరిస్తే!!

    ధన్యవాదాలండీ ! మీరు ఈ వ్యాసాన్ని ఈ మెయిల్ ద్వారా కూడా నలుగురికీ పంచారని తెల్సింది !

  10. Thanks to Sujatha gaaru and also thanks to Srinivaasudu gaaru for giving links for free on line book.I read it and giving the links who knew them would enable interested readers to lay their hands on the on line books. Thanks once again.

  11. వందో సారి చెప్పుకుంటాను. అలుపు రాదు. జాక్ లండన్ అంటే ప్రాణం. ముఖ్యంగా అడివి పిలుపు (కాల్ అఫ్ ది వైల్ద్). ఈ సంగతి ఇటీవలే చెప్పుకున్నాను. ఇది లంకె, అది చూడాలనిపిస్తే. ముందస్తు థాంక్సు.

    https://roadsgonowhere.wordpress.com/2016/02/18/%E0%B0%92%E0%B0%95-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%89%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%A1%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5/

  12. రామ్ ప్రసాద్ says:

    సుజాత గారు “బుక్” గురించీ ఇష్టం గా రాస్తారని తెలిసిందే కానీ , “బక్ ” గురించీ ఇంత ప్రత్యేకం గా రాశారు ఏమిటో అని మొదలెడితే – చివరి వరకూ ఆపకుండా చదివించారు.

    వేదాలు చదివే ఓపిక లేని వాళ్ళ కోసం ఉపనిషత్తులూ వగైరా సృజించారని పెద్దలు అంటారు . ఆ వరస లో – కాలానుగుణం గా …. పుస్తకాలు చదివే ఓపిక లేని వాళ్ళ కోసం సంక్షిప్తాలు , అదీ లేని నా లాంటి వాళ్ళ కోసం పుస్తక పరిచయాలు !!

    “కిరాణా జన్ముడు ” కాకుండా “కారణ జన్ముడు ” జాక్ లండన్ గురించీ, ఆయన “బుక్”, “బక్ ల గురించీ అద్భుతమయిన పరిచయం సుజాత గారూ !!!

    రామ్ ప్రసాద్

మీ మాటలు

*