యిదీ మొదలు …..

 

-నారాయణస్వామి వెంకట యోగి 

~

 

యెలా ఉంటమో,

యేమై పోతమో,  

ఊహించుకోని క్షణాలవి

యెక్కడికి వెళ్తమో

యెవరెక్కడుంటమో 

యేదీ  అస్పష్టంగానే
ఉన్న రోజులవి

పెనుగాలులమై వీచినమో,

జడివానలమై కురిసినమో,

నల్లమబ్బులమై విరిసినమో

కాలం కనికరించని క్షణాలెన్నిటినో

దోసిళ్ళలో పట్టుకుని 

యెదురీదినమో

 

ఇప్పుడంతా,  

భోరుమనే ఆనందమూ ,  

కేరింతల దుఃఖమూ

కలగలిసిన 
ఒక తలపోత.

యెందరిని పోగొట్టుకున్నం,

యెన్ని సార్లు కాటగలిసినం

యెన్ని కన్నీళ్ళు 

మూటగట్టుకున్నం

 

యెన్ని క్షణాలు
యెన్ని నిమిషాలు 

యెన్ని యేడాదులెన్ని యుగాలు

కనుపాపలమీద స్మృతులు 
పూల ముళ్లై,  

విరబూసిన అనుభవాలు 

కవిత్వాక్షరాలై,

చివరికి మనమిప్పుడు 

సముద్రపుటొడ్డున నత్తగుల్లలతో ఆడుకునే

చిన్న పిల్లలం.

 

కలిసి అనుకునే నడిచినం

కలిసిన ప్రతిసారీ
కొంగ్రొత్త  నడకలతో 

కూడబలుక్కునే ప్రయాణించినం.

నెత్తురోడుతూ  రాలిన పూల రెమ్మలను 

మృదువుగా స్పృశించి

చెంపల మీద యెండిన నీటిచారికలకు

హత్తుకున్నం.

కంకర రాళ్ళూ,  పల్లేర్లూ గుచ్చుకుని 

చిట్లిన పాదాలకు 

చిరునవ్వుల లేపనాలు పూసుకున్నం.

అలసిపోయిన ప్రతిసారీ

ఇదే మొదటాఖరి మెట్టు అనుకున్నం.

గమ్యం కనబడని ప్రతిసారీ

పుస్తకాల్లో దాచుకున్న 
బంతిపూల రిక్కల్ని 

తడిమి చూసుకున్నం.

చాలాదూరం వచ్చేసామా మనం?  

లేదూ నీకు,  నాకూ,  మనకూ 

ఇదేనా మొదటి అడుగు?

ఇప్పటికీఇన్నేళ్లకీ 

మనం కలిసే నడుస్తున్నాం కద

ఇదీ,  నిజమైన ప్రారంభం.

రా,
మరో సారి
సరికొత్తగా మొదలు పెడదమా

మన అలుపులేని 

ప్రాచీన ప్రయాణం

 

(సుధాకిరణ్ కి ఆత్మీయంగా)

మీ మాటలు

 1. balasudhakarmouli says:

  చాలా బాగుంది… గతాన్ని తడిమి.. నేటిని ప్రేమగా చూసారు.

 2. Ravinder Vilasagaram says:

  బాగుంది పోయెమ్ నారాయణ స్వామి గారు

 3. బ్రెయిన్ డెడ్ says:

  ఇప్పుడంతా, భోరుమనే ఆనందమూ , కేరింతల దుఃఖమూకలగలిసిన ఒక తలపోత. ఎందుకో గుండె తడిమిన అనుభూతి ఆ మాటలు చదవగానే . చాల నచ్చింది కవిత

 4. narayana swamy says:

  సుధాకర్ రవీందర్ గారు నిశి గారు – కవిత మీకు నచ్చినందుకు నెనర్లు

 5. JAYA REDDY BODA says:

  చివరికి మనమిప్పుడు

  సముద్రపుటొడ్డున నత్తగుల్లలతో ఆడుకునే

  చిన్న పిల్లలం.

  చాలా బాగుంది సార్

 6. Narayanaswamy says:

  నచ్చినందుకు నెనర్లు జయా గారూ

 7. Pillalamarri Srinivas says:

  బాగుంది సర్

 8. bagundi ns garu

 9. chalaa baagundi

 10. వాసుదేవ్ says:

  “పుస్తకాల్లో దాచుకున్న
  బంతిపూల రిక్కల్ని

  తడిమి చూసుకున్నం.:’ ఇలాంటివి తప్పిస్తే కవిత ఓ గొప్ప ప్రయోగం గా ఉంది స్వామీ…ఔనూ మీరింకా ఇలా రాయొచ్చుగా కొత్తగా ఇక్కడ ? ఎక్కడో ఎదో లోపిస్తున్న బాధ తప్ప అంతా బానే ఉంది

 11. Narayanaswamy says:

  శ్రీనివాస్ ఉషా గారూ మీకు నెనర్లు

  వాసుదేవ్ గారూ లోపమేమిటొ తెలిస్తే సరిద్దుకోవచ్చు – తెలిసేంత వరకూ లోపం లోపంగానే ఉంటుంది – అయినా కవిత్వం లో యేదో వెలితి లోపం ఉండాలి కదా – కవే అన్నీ చెప్పేసి కడుపు నింపేస్తే పాఠకునికి మిగిలేదేముంది – బంతిపూల రిక్కలు ఇలాంటివి అన్నారు – ఇంకా ఏమిటో చెపితే తప్పకుండా ఆలోచిస్తాను

 12. ప్రసాదమూర్తి says:

  ఆర్ద్రమైన కవిత. గతాన్ని ఎప్పుడు చేతుల్లోకి తీసుకుని చూసుకున్నా అలల మీద మన నీడల్లా ఇలాంటి అక్షరాలు కళ్ళ ముందు కదలాలి. మంచి కవిత ఇచ్చినందుకు స్వామికి అభినందనలు

 13. Narayanaswamy says:

  ప్రసాద మూర్తి అన్నా మీ కామెంట్ ఒక గొప్ప కవితా వాక్యం – నెనర్లు అన్నా !

 14. mohanbabu says:

  సుఖంగ , చక్కగా , అయోమయం లేకుండా ఉన్న చక్కటి కవిత్వం .

 15. Delhi Subrahmanyam says:

  ఎప్పటిలాగే మంచి కవిత మిత్రమా. అభినందనలు

 16. narayana swamy says:

  మోహన్ బాబు గారూ సుబ్బు గారూ మీకు నెనర్లు

 17. భోరుమనే ఆనందం …..కేరింతల దుఃఖం……చాలా బాగా చెప్పారు

 18. చాలా బాగుంది కవిత నారాయణ స్వామి గారు…
  ‘మొత్తానికి హ్యాపీ జర్నీ లా బాగుంది….

మీ మాటలు

*