కాలం గడప

 

 

–    ఎస్.హరగోపాల్

~

 

శ్వాస శ్వాసకు మెల్లగా రాత్రిని

పచ్చీసులో పంటకాయలా జరుపుకుంటపోవుడె     

తెల్లారిన ప్రతిపొద్దును దాటేటందుకు

రెండుదోసిళ్ళకాలం పడవ నడపాల్సిందే

బొట్టు బొట్టుగా కుతికెజారే మంచినీళ్ళ ఓతిగ

బతుకుపాట గున్ గునాయిస్తూనే వుండాలి

పాట ప్రాణమిస్తది,ప్రేమనిస్తది,ప్రేమిస్తది

బతకాలనే ఇష్టం నీలోపలి లోపలి తియ్యటిపాటరా

పోరాటపుజెండా ఓతిగ కండువభుజానవేసుకుని

పొలానికి చెమటల కట్టుకాలువలెక్క నడిచేరైతుతో

నాగలిమేడిలెక్క దిక్సూచిరీతి మానవజాతి ముందు నిలవాల్సిందే

మట్టిచాళ్ళల్లో రేపటొద్దులను పెంచెటందుకు బతకాలనే ఈ సోయి

మట్టిగంధం నుంచి మనిషిగా నిలిపిన అమ్మకడుపుకొంగులో

ఊగి,ఊగి కాలంకొసలదాక, నేలదిగిన కలవలె బొమ్మనిలుపాల్సిందే

నెత్తుటిడాగులే పచ్చటాకుల బాటనిండా,పాదముద్రలు పట్టుకుని నడువాలె

జనసముద్రపు కెరటాలమీద అచ్చువేయాల్సిందే మహాప్రస్థానం మళ్ళీ

*

                                                               

మీ మాటలు

*