జలపిత

 

ఉక్రేనియన్ రచన: ఎమ్మా అందిజెవ్ స్కా

అనువాదం: అనంతు 

~

 

emma“మన’’( జీవిత) కాలంలో్ అసాధ్యమనిపించే కార్యకలాపాల, ఘటనల విలీనతనూ, లేదా కదంబాన్నీ ప్రతిపాదించి ‘వలయకాలం’ అనే నవీన కోణాన్నీ, శైలినీ ఆవిష్కరించిన ఎమ్మా అందిజెవ్ స్కా ఉక్రేనియన్ సర్రియలిస్ట్ రచయిత్రి.

1931, మార్చి 19 న తూర్పు ఉక్రేనియాలో పుట్టి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీకి వెళ్ళి, 1950లో న్యూయార్క్ నగరానికి తరలీ, ప్రస్తుతం మ్యూనిచ్ (జర్మనీ) లో నివాసముంటున్న ఎమ్మా అందిజెవ్ స్కా  అస్తిత్వం గూగుల్ లో అమెరికన్ జాతీయత, స్వంత గడ్డ (ఉక్రేనియా) లో విదేశీ రచయిత.

ఈ మెను తన పిత్రు దేశం ఆమోదించిందీ, అక్కున చేర్చుకున్నదీ, అర్థం చేసుకున్నదీ, గౌరవించిందీ ఎనిమిది దశాబ్దాల తర్వాతే. ఎమ్మా అందిజెవ్ స్కా 80 వ పుట్టిన రోజు పర్వదినాన ఉక్రేనియా 10 సంకలనాల్లో ఆమె సంపూర్ణ రచనలను ప్రచురించి తన చారిత్రక పొరబాటుకు దిద్దుబాటు చేసుకుంది.

ప్రస్తుత రచన ‘జలపిత’ (Djalapita) 1962 లో ప్రచురితం.

ఈ రచనలో వాస్తవికత, అధివాస్తవికత, మంత్రవాస్తవికత, జానపద కథనం, వ్యంగ్య ప్రకటన, నిరసన గొంతు, ధిక్కార స్వరం చెట్టపట్టాలేసుకుని కని, వినిపిస్తాయి.

ఇందులో స్రజనాత్మకత, ఆవిష్కరణాత్మక శైలికి కవలగా హేతుబద్ధ, తర్కబద్ద రుజు వర్తన కాల గమనాన్ని నడ్డి విరిచే తత్వ విచారం పాటించింది.

కాలం రుజు వర్తని అనే ‘మన’ హేతు బద్ధతనీ, తర్క విధేయతనీ అదే పనిగా తుత్తునియలు చేసి భూత, భవిష్యద్ వర్తమానాలను తోబుట్టువులను చేస్తుంది.

దీన్నే తను వలయకాలం(round time)గా ప్రతిపాదించింది.

ఎమ్మా అందిజెవ్ స్కా బౌద్ధాన్నీ, సంస్కృత  వాంగ్మయాన్నీ చదువుకుంది.

ఈ జలపిత పదబంధం, పదచిత్రం (తాత్విక ప్రతిపాదన) ఆ ఎరుకలోంచి జనించి ప్రవహించినదే.

ఇంతకీ ఇది కథా, కవితా, విడి విడి అంకాల మాలికా?

 లేక ఉట్టి పిచ్చి ప్రేలాపనా?

 లేక మన గిరి గీతల ఆవల పారే కొత్త నీటి పాయా?

తేల్చుకునేది ఎప్పుడూ  పాఠకుల, విమర్శకుల రసగ్న విగ్నతే.

రచనలదీ, వాటి రచయితలదీ కాదు.

 

Akkadi-MeghamFeatured-300x146

జలపిత

 

 

 

రచయితఎమ్మా అందిజెవ్ స్కా, ఉక్రేనియా

1962  లో ముద్రితం

ఆంగ్ల అనువాదంరోమన్ ఇవాష్కివ్

తెలుగుఅనంతు చింతలపల్లి

 

*

 

“నన్ను చంపేందుకు కత్తి నీడ చాలు’’ జలపిత అన్నాడు.

“అయినా సరే నా పైకి కత్తినే దూయాలనకుంటున్నావా?’’

*

మేఘాలే జలపిత ఆహారం.

అతని అరికాళ్ళు మేఘాలు. అతని చేతులు కూడా.

అందుకే ప్రతిసారీ జలపిత పేరు మారిపోతూ వుంటుంది.

*

 

జలపిత సర్వత్రం.

ప్రతి జీవీ, ప్రతి వ్యక్తీ అతనే. కానీ అతను ఎవ్వరూ కాదు.

అతనే జలపిత.

*

రెండు వేల సంవత్సరాల క్రితం జలపిత ఆత్మకథ రాసే ప్రయత్నం జరిగింది.

కానీ పదాల్లో జలపిత ఇమడకపోయేసరికి ఆ ప్రయత్నం మానుకున్నారు.

అతను పదం నుంచి పిండి రాలినట్టు రాలాడు. ప్రజలంతా అటు ఇటూ పరుగులు తీసారు.

అతని కోసం ఆకాశం కేసి, నేలకేసీ చూసారు.

 

జలపితను వర్ణించడం అసాధ్యం.

*

ఉద్వేగం బట్టి జలపిత పేరు మారుతుంటుంది. వాతావరణ మార్పుల వల్ల కూడా.

నీటికి అతను ఎంత చేరువలో వున్నాడన్న సంగతి మీద ఆధారపడీ అతని పేరు మారుతూపోతుంటుంది.

*

జలపిత బేబెల్ స్తంభం కొసకు లిఫ్ట్ లో వెళ్ళి ఒకసారి కిందకు తేరిపార చూసాడు.

ఆ పట్నం వీధుల్లో దుమ్మలో ఒక బూరబుగ్గల పిల్లవాడు తన ముక్కు లాక్కుంటూ కనిపించాడు.

“ఈ పిల్లవాడు నా శిష్యుడు అయ్యే అవకాశం వుంది’’ అనుకున్నాడు జలపిత.

“ఎందుకంటే అతనికి జీవన రహస్యం విచ్చుకున్నస్వాతి ముత్యపు చిప్ప.’’

జలపిత తన అదనపు పాదాన్ని ఆ స్తంభం కొనపై నుంచి సరిగ్గా ఆ వీధిలోకి మోపి ఆ పిల్ల వాడి పక్కన కూర్చున్నాడు.

“మీ శిష్యుడినేనా?’’ ముక్కు లాక్కోవడం ఆపి అడిగాడు ఆ పిల్లవాడు.

“కాదు’’, జలపిత ఆలోచించాడు.

ఈ పిల్ల వాడికి స్థిమితం లేదు.

ఇతను నా శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేడు.

*

జలపితను ఆరగించవచ్చు. జలపితపైన నడవచ్చు.

అతనొక మైదానం.

*

జలపిత గుర్రపు పందేలకు వెళ్ళి మొదటి వరసలో కూర్చున్నాడు.

పక్కనే ఒక ముసలి మహిళ. వయసు పైబడి చూపు దూరమవుతోంది.

ఆమె జలపితను గుర్రం అనుకుని భ్రమించి భయంతో అరిచేసింది. ఆమె జలపిత దృష్టిలో పడింది.

ఎందుకంటే ఆమె తన కళ్ళద్దాలు ఇంట్లో మరచి వచ్చింది. అందుకే గుర్రపు పందేలను చూడలేకపోయింది.

ఆమె చూడగలిగిందల్లా ఒక్క జలపితనే.

ఆమె అరుపును కూడా ఎవ్వరూ పట్టించుకునే పరిస్థిలో లేరు. అంతా పందేల్లో తలమునకలైపోయారు.

ఇంతలో ఆమె చూపునుంచి తప్పించుకుని తన ఎడమ చేతి వెనక్కి వెళ్ళిపోయి నక్కి దీర్ఘ ఆలోచనల్లోపడ్డాడు జలపిత.

గుర్రాలు వేరుగా, వేగం వేరుగా పరిగెత్తుతాయన్నది అతని ఆ ఆలోచనల సారం.

*

రాత్రంతా ఎటు పడితే అటు తిరిగి మెల్లిగా ఒక బాయిలర్ గదిలో నిద్రపోయాడు.

నిప్పురాజేసేవాడు భలే సోమరి. వాడికి బొగ్గులు, మొద్దులు వెతికి తెచ్చి వేసే ఓపిక లేక అక్కడే కనిపించిన జలపితను ఆ మండుతున్న భట్టీలోకి వేసి అగ్గి రాజేసాడు.

ఆ ఆకాశ హర్మ్యానికి వెచ్చదనాన్నిచ్చే ఆ భట్టీ గొట్టంలో తన దేహం పయనించడం గమనించిన జలపిత ఆశ్చర్యపోయాడు.

మొదట్లో ఆవిరితో కలిసి పయనించడం ఆహ్లాదంగా తోచింది అతనికి.

కానీ కొద్దిసేపటికే బేజారనిపించి ఆ భట్టీ గొట్టాన్ని పగులగొట్టి బయటపడ్డాడు.

అగ్నిమాపక దళం, భద్రతా సిబ్బందీ ఆ భవనం చుట్టుముట్టి నిచ్చెనలు వేస్తున్నారు హడావిడిగా.

ఈ లోగా భట్టీ గొట్టాలనుంచి తన దేహాన్ని కూడబలుక్కుని జలపిత వాళ్ళతో ఇలా అన్నాడు.

“జలపితతో భవనాలను వెచ్చబరచడం ప్రమాదకరం.’’

*

పదాన్ని విశ్వసించాడు జలపిత. అయితే ఆ పదం అతని ఎముకలన్నిటినీ విరిచి, అతని ఆత్మనంతా నుజ్జునుజ్జు చేసేసింది. అదే పదం జలపితను గానుగలో వేసి సిమెంట్, కంకర, చెదారంతో కలిపేసింది.

పాపం జలపిత ముక్కలుముక్కలై పడి వున్నాడు.

గానుగ చుట్టూ తిరుగుతున్న ఆ అవిశ్వాస పదం ఇలా పాడుతోంది తనలో తానుః

“వెర్రిబాగులోడులే జలపిత.

నమ్మతాడా ఎవడైనా పదాలను.

నమ్ముకుంటాడా ఎపుడైనా పదాలను.’’

*

జలపితతో వాళ్ళు బలవంతంగా నీళ్ళు మోయించారు.

నీటిని ఛిద్రం చేయడం ఇష్టం లేక అతను మొత్తం నదినంతా తన దోసిలిలో పట్టి తెచ్చి బల్ల మీద పెట్టాడు.

నదిని తిరిగి మళ్ళీ తీసుకుపొమ్మని అతణ్ణి ఆదేశించారు.

అత్యంత విధేయతతో జలపిత తీరం పక్కకు నదిని చేర్చాడు.

అతను చాలా సేపు అలా నిశ్చలంగా నిలబడిపోయాడు.

తనతో పాటు ఇతరులూ విస్థాపన చెందినందుకు బాధపడ్డాడు.

జలపిత చాలా మంచోడు.

*

జలపిత ఉద్యానవనానికి వెళ్ళి మొదటి వరుసలోని బల్ల పైన కూర్చున్నాడు.

దాహంలో వున్న జనాలు ఒకే ఒక్క నీటి చుక్క కోసం ఎంత తహతహలాడతారో అచ్చం అదే శైలిలో ఎంతగానో ఏడవాలనుకున్నాడు.

కానీ అలా చేయడం అతనికి చేతకాదు; తెలియదు.

 

తన బాహువులు, అరి పాదాలూ నేలకు ఆనించి చాలా బాధగా, గజిబిజిగా కూర్చున్నాడు.

దాంతో అతని చుట్టూ పిల్లలు మూగారు. ఆ పిల్లలు అతనిపైన ఇసుక చల్లుతున్నారు.

తన పెదాలపైన క్రమంగా మీసాలు ఏర్పడుతుండగా జలపిత ఇలా అనుకున్నాడుః

“కనీసం ఒక్క రోజన్నా చనిపోవడం ఎంతబాగుండునో.’’

అతని పైనంతా పిల్లలు దోగాడుతున్నారు.

పిల్లలు తడి ఇసుక అంటిన తమ చేతుల్తో జలపిత ఆకుపచ్చ కనురెప్పల వెంట్రుకలను పీకారు.

అవి బల్లుల్లా విడివడి గడ్డిలోకి కనుమరుగయ్యాయి.

 

జలపిత తరచూ ఉద్యానవనానికి వెళ్ళేవాడు. అప్పుడల్లా తనే గాలి లోని జాగాలనంతా ఆవరించాలని అనుకునే వాడు. అప్పుడు ఆ జాగాలంతా భారీ పుట్టగొడుగుల్లా ఉద్యానవనమంతా వెలిసేవి.

అటుగా వెళ్ళేవాళ్ళు ఓ గుప్పెడు జలపిత ఆలోచనలను కోసుకుని వెళ్ళే వాళ్ళు.

*

Art: Ananthu

జలపిత ఒక నీటి టెలిగ్రాఫ్ యంత్రాన్ని ఆవిష్కరించాడు.

మనం చేయవలసిందల్లా మన ముఖాన్ని నీటిలో పెట్టి ఆలోచనల్ని విరజిమ్మడమే.

అవి అలా భూగోళం వేరే అంచుకు ప్రసారం అయిపోతాయి.

మీకు టెలిగ్రాం అందాలంటే మీ దగ్గర ఆ నీటిని ఆపే కుళాయి మీట వుండాలంతే.

*

ఆవిరి స్నానం చేసే గదిలోకి వెళ్ళాడు జలపిత. గదిలో వున్న పై అంచు బల్లను చేరుకుననేందుకు దోగాడాడు. జలపితను అమితంగా సంతోషపరచాలన్న తపనతో ఆ ఆవిరి గది మాలి జలపిత కాలికి ఆవిరి పట్టాడు.

దాంతో జలపిత కాలు ఊడి కిం…ద…ప..డిం..ది.

అది అమాంతం ఆవిరి గదిలో తలంటుకుంటున్న ఒక మెథడిస్ట్ పైన పడి హతమార్చింది.

తన నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణి కన్నుమూసిందని చాలా సేపు వేదన చెందాడు జలపిత.

*

emma-1

విషయాల ద్రవ్య స్థితి గురించి ఆలోచిస్తూ తీరం వెంట నడుస్తున్నాడు జలపిత.

అప్పుడే అక్కడికి చేరిన ఒక అమ్మాయి ఒక పదంతో అల్లిన ఒక కళ్ళెం జలపితపై వేసింది.

ఆ పదం జలపిత తలలోని అన్ని ఆలోచనలనూ చెదారంలా మార్చేసేసరికి అతను ఓ కుప్పలా మారిపోతున్నాడు.

తనెంత పని చేసిందో ఆ అమ్మాయికి అస్సలు తెలియదు.

జలపిత తీరంలో పడి వున్నాడు. అలలు అతనిపై కదలాడుతున్నాయి.

“హమ్మా… చాలా కష్టంగా వుంది.’’ జలపిత ఫిర్యాదు చేసాడు.

ఆ ఫిర్యాదు పట్టించుకోని అలలు అటూ ఇటూ తిరుగుతూ అలవోకగా జలపిత దేహంలోని ఒక్కో అంగాన్ని, భాగాన్ని, అవయవాన్ని, చివరకు అతని ఆత్మనూ తుడిచిపెట్టేసాయి.

ఇసుక గతుకుతూ చాలా ఇబ్బంది పడ్డాడు జలపిత.

 

“జలపిత జలపితే ఎందుకు?’’, తనని తాను ప్రశ్నించుకున్నాడు.

జలపిత మరణానికి ఒక నిర్లక్ష్య ఆలోచన చాలు.

*

బాగా అలసిపోయాక నేలపై చేరగిలపడి తన చుట్టూ వున్న మైదానాలను కలగాపులగం చేసాడు జలపిత.

అప్పుడు దృశ్యాలతో సాలిటైర్ అడాడు.

అప్పటికి గాని అతని మనసు కుదుటపడలేదు.

*

జలపిత ఎప్పుడు యాత్రలకు వెళ్ళినా తన జేబులో ఒక మైదానాన్ని అదనంగా ఉంచుకునేవాడు.

*

జలపిత ఒక బంక కనుగొన్నాడు.

అది మధుర క్షణాలను ఏకంగా ఏడాదులుగానూ చేయగలదు.

దుఃఖ గడియలను కుదించనూ గలదు.

శతాబ్దాలను, యుగాలను కూడా చీమకాలంత చిన్నగా, చిటికె అంత సన్నగా, మెరుపంత లిప్తంగా చేసేయగలదు.

*

అలా వీధుల్లో నడుస్తుండగా ఒక ముసలి మహిళ బాగా బరువున్న సూట్ కేస్ మోసుకుంటూ వెళ్ళడం గమనించాడు జలపిత. తను సాయం చేస్తానని అడిగాడు. అంతే అలా అనీ అనగానే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె నీడకూడా ఎక్కడా కనిపంచలేదు. ఆశ్చర్యం వేసింది జలపితకి. ఉత్తర క్షణంలో తనకే తోచింది. మనుషులు తను నడిచినట్లు నడవలేరని. అలా ఆ మహిళ ఒక అడుగు వేసిందో లేదో జలపిత నగర శివారుకు చేరుకున్నాడు.  చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళి తన నుంచి తప్పి పోయిన మహిళను వెతికాడు.  తన లగేజీతో జలపిత ఉడాయించాడని ఆమె గ్రహించేలోపే ఆమెను చేరుకున్నాడు.

*

జలపిత ఒక కచేరీకి వెళ్ళాడు. ఆ సంగీతం అతడి దేహాన్ని చిన్ని ధూళి రజనులుగా మార్చి వేసింది.

ఆ రజను కణకణంగా తిరిగి కూర్చుకునేందుకు అతనికి సుమారు ఏడాది పట్టింది.

*

రెడు ప్రేమ పక్షులు జలపిత సాయం అర్థించాయి.

“మాకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎటు చూసినా కార్లు, ఇళ్ళు, వీధులే.’’

ఆ దంపతుల అభ్యర్థన తిరస్కరించలేకపోయాడు జలపిత. వీధులను కట్టేందుకు వాడే బింగరాళ్ళపై వాలాడు.

అతని శరీరం వ్యాకోచించింది. అది క్రమంగా చెట్లుగా, పొదలుగా అవతరించింది.

ఆ పరిసరాల్లో వున్న కార్లన్నీ కొత్తగా నెలకొన్నఆ ఉద్యానవనం చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చింది.

*

జనాలకు మరీ దగ్గరవడం వల్ల తనలో కలిగిన క్షోభ నుంచి, ప్రేమ నుంచీ స్వాంతన పొందేందుకు వర్షాన్ని అవిష్కరించాడు జలపిత ఒకానొక నిద్ర లేని రాత్రిలో.

*

జనాలు జలపితని వేధించారు.

కానీ తనను తాను రక్షించుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు జలపిత.

అంతటి మంచితనం అతనిది మరి.

*

జలపిత వీధిలో నడుస్తున్నప్పుడు, “ఎందుకు జనాలు చేతులూపుకుంటూ నడుస్తారు’’ అని ఆలోచించాడు.

అతనికి ఈ సమాధానం దొరికిందిః స్థలాన్ని కొలిచేందుకూ, స్థిమితాన్ని కొనసాగించేదుకూ, విశ్వాంతరాళ వాయువులు తమలో ప్రసరింపచేసుకునేందుకూ మనుషులు చేతులూపుతూ నడుస్తారు.

*

మితి మీరిన డొల్లతనం తనను ఆవరించినపుడు జలపిత ఒక వ్యాపారం మొదలు పెట్టాడు.

స్వర్గ తుల్యమైన లోయలనూ, మేఘాల బావులనూ, మడతపెట్టిన ఉరిమే మేఘాలను, ఉరమని వాటినీ అద్దెకివ్వడమే అతని కొత్త వ్యాపారం.

నిరుద్యోగులకు ఎలాంటి అద్దె లేదు.

ఇక ఉన్నవాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీతాలను బట్టి అద్దె ఐదుసెంట్ల నుంచి వెయ్యి డాలర్ల వరకూ నిర్ణయించాడు.

జలపిత తన వ్యాపారంలో భాగంగా గ్నాపకాలతో కట్టిన మైదానాలనూ విక్రయించాడు.

*

Art: Ananthu

జలపిత మహాసముద్రం పైన ఒక వంతెన నిర్మించాడు. దానిపైన జనాలు నడుస్తున్నప్పుడు ఆ ఎత్తుకు భయపడి కిందపడిపోకుండా వంతెనకు అటు ఇటూ చెట్లను నాటాడు.

ఆ వంతెన చిత్తడిగా వుండింది.

ఎందుకంటే దాన్ని మహాసముద్రపు నీటితోనే జలపిత నిర్మించాడు.

దాన్ని ముగ్గురు తాగుబోతులు దాటే దుస్సాహసం చేసారు.

వారికివేమీ లెక్కేలేదుగా మరి.

*

కోర్టు అధికారులు జలపిత దగ్గరికి వచ్చి తమతో విబేధించమని ఆహ్వానించారు.

అప్పుడు జలపిత సూర్యుడివైపు చూస్తూ నీటిలో వున్నాడు.

చుట్టుపక్కల చుక్క నీరూ పడకుండా జాగ్రత్తగా తన తడి దేహాన్ని పిండుకుంటుండగా న్యాయాధిపతులు జలపితని ఇలా ప్రశ్నించారుః

“న్యాయం అంటే ఏమిటి?’’

“మిల్లీ మీటర్లలో కొలిచే మంచితనమే న్యాయం.’’

ఇలా జలపిత తన జవాబు చెప్పిచూసేసరికి విచారణ గదిలో ఎవరూ కనిపించకపోవడం గమనించాడు.

తన తడి దేహం పిండగా రాలిన నీటిలో న్యాయాధిపతులు కొట్టుకుపోవడాన్ని జలపిత గమనించనేలేదు.

వాళ్ళంతా ఒక నదిలో తేలారు.

చావు బతుకుల మద్య వున్న వాళ్ళను గట్టుకు తెచ్చింది ఇంగ్లీషు పర్యాటకులున్న ఒక పెద్ద పర్యాటక నౌక.

 

*

అవపాతాన్నీ, తాపమానాన్నీ కొలిచే పరికరంగా కూడా జలపితని వాడడచ్చు.

*

ఒక వ్యక్తి బొద్దింక మెడకు తాడుకట్టుకుని జలపిత దగ్గరకు వచ్చి తమ తగవు తీర్చమని కోరాడు.

“ఇతను నా జీవితం దుర్భరం చేస్తున్నాడు.’’ బొద్దింకని చూపుతూ ఫిర్యాదు చేసాడు ఆ వ్యక్తి.

“మంచిది.’’ అని మనిషి, బొద్దింకల దేహాలను తారుమారు చేసాడు జలపిత.

కొద్ది రోజుల తర్వాత వ్యక్తి మెడకు తాడు కట్టుకుని బొద్దింక వచ్చింది.

అట్లాంటి దయలేని వ్యక్తితో జీవించడం దుర్లభంగా వుందని జలపితతో వాపోయింది బొద్దింక.

అప్పుడు ఎవరి దేహం వారికి తిరిగి ఇప్పించాడు జలపిత.

ఇద్దరూ చెరో దారిలో వెళ్ళిపోయారు.

అయితే చాలా దూరం ఒకరినొకరు వెనక్కి తిరిగి చూసుకుంటూనే నడిచారు.

 

*

లౌకిక వ్యవహారాల నుంచి కాసేపు దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాడు జలపిత.

విశ్వపు అట్టడుగు పొరల్లోకి వెల్ళిపోయాడు.

తన కాళ్ళను శూన్యంలో వేలాడేసి, తన తల ఆకాశమంతా వ్యాపించడాన్ని వినడం మొదలుపెట్టాడు.

సరిగ్గా అప్పుడే ఎవరో తన బొజ్జ దగ్గర గిలిగిలి పెట్టారు.

జలపిత కిందకు చూసి నిట్టూర్చాడు.

ఒక వ్యక్తి కుమారుడికి తనే మార్గదర్శిగా వ్యవహరిస్తానని ఎప్పుడో ఇచ్చిన తన మాట గుర్తుకు వచ్చింది జలపితకి. భూమి మీద నిలబడి ఒక పూల రెమ్మతో జలపితకు గిలిగిలిపెట్టింది ఆ తండ్రే.

అతను నామకరణ ఉత్సవాన్ని గుర్తుచేసాడు జలపితకి. ఆ పూలరెమ్మను విరిచిపారేయాలనుకున్నాడు జలపిత.

ఆ వ్యక్తికి ఉన్నదల్లా ఆ పూలరెమ్మ ఒక్కటేనన్న విషయం జలపితకు గర్తుకు వచ్చి జాలిపడి విరమించుకున్నాడు.

 

జలపిత మంచితనం అనంతం.

*

తన తల శకలాల కోసం తడుముకున్నాడు జలపిత.

వాటిని అంతరాళం అంతటా చల్లాడు.

అదంతా తన మామూలు రూపం తీసుకునేంతవరకు నిరీక్షించే వ్యవధిలేకపోవడంతో వాటినంతా గాలితో మిళితం చేసేసాడు.

తన అరికాళ్ళతో తాడించి సతత హరితంగా మార్చేందుకు ప్రయత్నించాడు.

అవి వాటి మార్గంలో పేలిపోయి విచ్చలవిడిగా పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు.

ఆ సాయంత్రం సదరు మార్గదర్శి జలపిత ప్రవర్తన చాలా నిర్లక్ష్యంగా వుందన్న వదంతులు వ్యాపించాయి.

అతను మందు కొట్టాడు. చిందేసాడు. అసభ్యకరమైన జోకులు వేసాడు.

తర్వాతి కాలంలో అవన్నీ కొన్ని ఆఫ్రికా మతాల జడ సిద్ధాంతాలుగా ప్రాచుర్యం పొందాయి.

*

జలపితను బానిసగా అమ్మేసారు. చలువరాతి నేలను శుభ్రం చేయడం అతని రోజువారీ పని.

అతను నేలను ఎంతగా శుభ్రం చేసాడంటే, వచ్చిన అతిధులు కాలుమోపగానే సర్రున కిటికీల్లోంచి, తలుపుల్లోంచీ జారి పడిపోయారు.

 

*

ఎండ విపరీతంగా వెన్న ఒక రోజు తాపం చల్లార్చుకునేందుకు జలపిత ఒక పుచ్చకాయలోకి వెళ్ళిపోయాడు.

ఆ పుచ్చకాయను తీగ నుంచి తెంపి సంతకు తీసుకు వెల్తున్నారన్న విషయం గమనించనేలేదు జలపిత.

తీరా పుచ్చకాయను ఒప్పలు కోస్తుండగా అందులోంచి బయటపడ్డాడు జలపిత.

అప్పటికే అతని అరికాళ్ళు చెక్కివేయబడ్డాయి.

పుచ్చకాయ రసంలోంచి తన బాహువులను కూడబలుక్కుని ఒక్కసారి విదిలించుకున్నాడు.

భయ భ్రాంతులైన అతిథులు తమ కంచాలను గిరాటేసి కుర్చీల్లోంచి తూలిపడ్డారు.

ఎటుపోవాలో తోచక తొక్కిసలాట జరిగింది.

పుచ్చకాలయలు కోసుకునే చాకులతో ఒకరినొకరు పొడిచేసుకున్నారు.

ఆ విపత్తను చూసిన జలపిత అతిథుల దేహహాలలో దిగబడిన చాకులను తీసివేసి వాళ్ళందరినీ యధావిధిగా విందు బల్ల ముందు ఆశీనులను చేసాడు. వారి గాయాలను తడిమి స్వస్థత చేకూర్చి దగ్గరలో వున్న కొలను నుంచి కొంత నీటిని తెచ్చేందుకు వెళ్ళాడు.

ఆ కొలను దగ్గరే పిట్టలు నివాసం వుండేది.

ఆ కొలను దగ్గర ఏవేవో మాటలు ఉచ్చరించాడు.

దాంతో పరిశ్రమల్లో, జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది.

అతను ఉచ్చరించిన మాటల్లో మచ్చుకు ఒకటిః  చాకు లేకుండా కూడా పుచ్చకాయ తినవచ్చు.

*

“నువ్వు లేకుండా నేను బతకలేను.’’ జలపితతో అంది ఓ నీటి చుక్క.

“నువ్వు చాలా గొప్పవాడివని నాకు తెలుసు. నువ్వు జలపితవి. నేను మామూలు నీటి చుక్కని.

అయినా అదంతా నాకు పట్టదు. ఎందుకంటే నేను నువ్వు లేకుండా బతకలేను.’’

జలపిత నిశ్చేష్టుడయ్యాడు.

అంతటి ఆశ్చర్యంలో నిలుచున్న చోటే మూడు రోజులు స్థాణువై వుండిపోయాడు.

నాలుగో రోజు జలపిత ఇలా పలికాడుః

“నేను లేకుండా బతకలేక పోతే, నాతోనే బతుకు.’’

ఇలా అనగానే అతని చెవి వెనుకకు చేరింది నీటిచుక్క.

లోకమంతా పగలబడి నవ్వింది.

నీటి చుక్కతో ఏదో లోపాయకారి ఒప్పదం చేసుకుని దాన్ని జలపిత పటాయించాడని అనుకున్నారంతా.

“నువ్వు ఊహించగలవా ఇది?’’ కిందపడి దొర్లుతూ పగలబడి నవ్వుతూ ఒక కొండముచ్చు ఇంకో ముచ్చుతో పిచ్చాపాటి మాట్లాడుతోందిలా.

“వాళ్ళు పక్కపక్కన నడుస్తుంటే, వాళ్ళంత ఎత్తు వుంది అది. వాళ్ళిద్దరినీ చూసిన ఓ గోమాత నవ్వాపుకోలేక పొరబోయి చనిపోయిందికూడా,’’ అంది నవ్వుతూ ఇంకో కొండ ముచ్చు.

అప్పుడు మనుషులనూ, జంతువులనూ కలిపి జలపిత అడిగాడు.

“ఇందులో అంత పగలబడి నవ్వే సంగతి ఏముంది?’’

“అది చిన్నది. నీకన్నా సిగ్గు వుండొద్దా జలపితా!” అని అడిగారంతా.

 

తన అరచేతిలో వున్న నీటి చుక్కను వారికి చూపుతూ జలపిత అన్నాడు.

“చిన్నదీ, పనికి మాలినదీ అంటూ ఏదీ లేదు.’’

 

ఆ నీటి చుక్కలో తమ ఛిద్రమైన ముఖ బింబాలను చూసుకున్న వాళ్ళంతా భయంతో తలో దిక్కు పారిపోయారు.

ఆ నీటి చుక్క అంతకంతకూ పెరిగి వాళ్ళ ముందు సూర్యుడంత పరిణామంలో వ్యాకోచించింది.

అందరూ దాని ముందు ఇసుక రేణువుల్లా వున్నారు.

ఇదే జలపిత సంకల్పం.

*

Art: Ananthu

వీధిలో నడుస్తున్న రెండు దీపాలు జలపితని నిలదీసాయి.

“నువ్వు ప్రకాశమా?’’

“నేను మిణుకు’’ బదులిచ్చాడు జలపిత.

దాని తర్వాత అందరూ కలసి పబ్ కి వెళ్ళి మందుకొట్టారు.

 

“నీటి నుంచి దుఃఖం జనించింది.’’ అన్నాడు జలపిత

*

ఇసుకలో కూర్చుని తన పిడికిళ్ళతో కళ్ళు నులుముకుంటున్న ఒక పిల్లవాడు జలపితను “పవనం అంటే ఏమిటి?’’ అని అడిగాడు.

“పవనం నైరూప్య జలం.’’ జలపిత జవాబు.

*

“జనాలు ఎందుకు పొగతాగుతారు?’’ అని గందరగోళ పడి, మళ్ళీ తనే చటుక్కున తమాయించుకేని “తమ గౌరవార్ధం ఇంకెవ్వరూ అగరబత్తీలు వెలిగించరు కాబట్టి తమను తామే గౌరవించుకోవాలన్న దిగులుతో జనాలు పొగతాగుతారు.’’ అని నిర్ధారించుకున్నాడు జలపిత.

*

సాంకేతికత పరమావధిపైన తన అభిప్రాయం వెలుబుచ్చాలని జలపితను కోరారు.

“జనాలు తమ వెంట్రుకలతో తమనే పైకి లేపుకునే సత్తా ఇస్తుంది అది.’’ ఇదీ జలపిత సమాధానం.

అయితే అదేదో మెట్ట వేదాంతంలా వుందనిపించి పత్రికా విలేకరులు అతని సమాధానాన్ని నమోదే చేసుకోలేదు.

*

జలపిత నది పక్కన బల్ల మీద నిద్రపోతున్నప్పుడు ఇద్దరు ఆకతాయిలు అతని గుండెలోకి గాలం వేసి చేపల వేట మొదలుపెట్టారు.

ఒక ఆకతాయి జలపిత గుండెలోంచి జల్ల చేపని లాగేసినప్పుడు మెలకువ వచ్చింది.

కానీ నిద్రలేవాలని లేదు జలపితకి.

ఆకతాయిల వైపు చూసి తన మనికాలితో మెల్లగా బల్లను తాకాడు.

ఆ కుదుపుకి ఆకతాయిలు బోర్లాపడి ముక్కులు పచ్చడి చేసుకోకుండా జాగ్రత్తగానే బల్లను తాకాడు జలపిత.

వారి కాలి కింది బల్ల రెండు గా చీలిపోయింది.

ఒక ముక్క జలపితని నేరుగా మహాసముద్రం లోకి తీసుకువెళ్ళింది.

*

ఈతగాళ్ళు జలపిత దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసారు.

“లావుగా వున్న వాళ్ళు మమ్మల్ని ఈత కొట్టనివ్వడం లేదు. వాళ్ళు దిగగానే నదిలోని నీళ్ళన్నీ చెల్లా చెదరై బయటపడిపోతున్నాయి.’’ అన్నారు బక్క ఈతగాళ్ళు.

“బక్కవాళ్ళు మమ్మల్ని ఈత కొట్టకుండా ఆపుతున్నారు. వాళ్ళు ఈతకు దిగితే నీళ్ళు జ్యామితిగా, డొల్లగా తయారవుతున్నాయి. అట్లాంటి నీటిలో ఎవరైనా ఎట్లా ఈత కొడతారు?’’ అని వాదించారు లావున్న ఈతగాళ్ళు.

జలపిత వాళ్ళిద్దరి వంకా చూసాడు. ఇసుక వైపు చూపు సారించాడు.

అక్కడే ఈతగాళ్ళంతా నిలబడేది.

అప్పుడు వాళ్ళ కోసం రెండంస్తుల నీటిని సృష్టించాడు జలపిత.

ఒక అంతస్తులో బక్కవాళ్ళు, మరో అంతస్తులో లావు వాళ్ళు ఈతకొట్ట వచ్చు.

 

*

“లోకాన్ని వగతుగా చేస్తున్నాడు జలపిత.’’ అని అభిప్రాయపడిన బుధ వర్గం జలపితపైన వ్యాకరణం విధించాలని నిశ్చయించుకున్నారు.

జలపిత అసలు జలపితే కాదనేసారు.

అతని మూలాలు అనుమానాస్పదమైనవి అన్నారు.

బహుశా సంస్కృతంలో వున్న “జలి – పితర్ ‘’ అన్న రెండు పదాల అపభ్రంశమే అతను అని తేల్చారు.

జలపితర్ అంటే నీటి తండ్రి. జల చర అంటే నీటి జీవి.

జలపితను తోసిరాజంటే తప్ప లోకంలో ఎక్కడుండాల్సింది అక్కడ వుండదు అని బుధ వర్గం అభిప్రాయపడింది.

పైగా సంస్కృతం ఒక మృత భాష; జలపిత కూడా అంతే – అని తేల్చేసిన బుధవర్గం తమ గ్రంధాలను తెరిచింది.

అయితే బుధవర్గం ఇలా జలపితను తూష్ణీకరించి అతని పేరు మూలాలగురించి మల్లగుల్లాలు పడుతుండగా వ్యాకరణ గ్రంథంలో సరిగ్గా అప్పుడే చేరిన జలపిత పేరు తాజా దవన దళంలా పరిమళించింది.

తమ అసలు సంగతి మరచి పోయి బుధ వర్గం తమ సులోచనాలను తొలగించి నీటి శబ్దానికి నిశ్చేష్టులయ్యారు. జలపితలోపల పాడుతున్న పక్షులతో జత కలిపి చిందేసింది బుధవర్గం.

*

ఇనుముకు తనే సూర్యుడినని వాన ఎలా భరోసా ఇచ్చిందో నీటి గొట్టంలో ఉన్నప్పుడు విన్నాడు జలపిత.

వాన భాషలో అన్నన్నేసి అచ్చులు లేకపోయి వుంటే ఈ విషయం ఇనుముకు చటుక్కున అవగతం అయ్యి వుండేది కదా అనీ అనుకున్నాడు జలపిత.

*

“కొంచెం తప్పుకో’’ చెట్టు కొమ్మల మద్యలో నిద్రిస్తున్న జలపితను ఓ చిట్టి గువ్వ అడిగింది.

జలపిత జరిగాడు.

సగం విశ్వం ధ్వంసం అయ్యింది.

గువ్వ కిచకిచమంది.

అప్పుడు జలపిత అన్నాడుః “స్థూలాన్ని ధ్వంసం చేయగలదు సూక్ష్మం.’’

*

ఒక రోజు ఉదయం తప్పనిసరిగా ఆసనాలు వేయాల్సి వచ్చింది.

నిరాకరించడానికి తటపటాయించాడు జలపిత.

అందుకే సూర్యగ్రహణం తెప్పించాడు.

తమ చాకచక్య లేమికి వేరెవ్వరూ చంకలు గుద్దుకోకుండా అలా చేసాడు.

*

గాలికి అభిముఖంగా తన పాదాన్ని గీకాడు జలపిత.

అలా గాలితో చదరంగం ఆట మొదలైంది.

“ఆటకట్టు, అబ్బాయి.’’ అంది గాలి.

తన తర్వాతి అడుగు గురించి జలపిత తీవ్రంగా ఆలోచిస్తూ వున్నాడు చాలాసేపు.

చివరికి స్పందించి “కట్టుకు పై కట్టు’’ అని చెప్పి ఆట గెలిచాడు.

*

‘జనాలు ఎందుకు నీట మునిగిపోతున్నారు?’ అని ఒక సారి జలపిత సుదీర్ఘంగా ఆలోచించాడు.

ఎందుకంటే అతనికి నీటి గురించి బాగా తెలుసు.

పైగా నీరు సుదీర్ఘమనీ, అందులో మునిగే వీలే లేదనీ అతనికి బాగా తెలుసు.

ఖచ్చితంగా నీటిలో రంధ్రాలేవో వుండి వుండాలి.

వాటిల్లో పడే జనాలు అలితిగా చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చాడు జలపిత.

ఈ రంధ్రాలను దిండ్లతో కనుక పూడ్చ గలిగినట్టయితే జనాలు నీట మునగడాన్ని నివారించవచ్చు.

*

ఒక వేసవి కాలంలో గ్రంధాలయం ముందు జలపిత నడుస్తున్నప్పుడు దాని నిశ్శబ్దానికీ, నిర్మలతకీ ముగ్ధుడయ్యాడు.  కిటికీలకున్న దోమ తెరల్లోంచి తన దేహాన్ని లోనికి అనుమతించాడు.

పుస్తకాల అరల మధ్య నిద్ర పోయాడు.

ఎంత ఘాడంగా నిద్రించాడంటే అతని చేతిలో కొంత భాగం, భుజంలో కొంత భాగం పుస్తకాల్లో కూరుకుపోయేంతగా.

లోహ ముఖపత్రాలతో రూపొందించిన ఒక అతి భారీ, అతి పురాతన పుస్తకాన్ని గ్రంధమాలి తన పొత్తిలి లోకి చొప్పిస్తున్నప్పుడు జలపితకు మెలకువ అయ్యింది.

అది జలపిత ఉరఃపంజరానికీ, పొత్తి కడుపుకూ మధ్య ఇమడటం లేదు.

తన ఖాళీ కడుపుపైన ఇలాంటి అనుకోని దాడి ఇబ్బందిగా అనిపించింది జలపితకి.

అయితే ఆ వృద్ధ గ్రంధమాలికి తను తక్షణం కనిపిస్తే గుండె ఆగి చస్తాడని జలపితకి తెలుసు.

పైగా అతను జలపితకు సుపరిచితుడు.

పైగా అతనికి మూఢనమ్మకాలెక్కువ.

పైగా అతని భార్య గయ్యాళి.

అందుకే అయ్యో పాపం అనుకుని జలపిత అతనికి కనిపించడం మానివేసాడు.

ఆ పాత గ్రంధాన్ని తన దేహంలో సర్దుకునేందుకు తన పొత్తి కడుపును మెడవరకు జుర్రుకున్నాడు జలపిత.

ఆ తర్వాత తన పేగుల్లో పడిన ముద్రలను తొలగించుకునేందుకు దాదాపు కొన్ని వారాలు తన పేగులను ఇస్త్రీ చేసుకోవడంలోనే తలమునకలైపోయాడు.

“నా ముఖం చూసిన వారంతా నీటి వంక చూస్తారు.’’ ప్రకటించాడు జలపిత.

*

గణిత శాస్త్ర వేత్తల సమావేశానికి జలపితని ఆహ్వానించారు.

అంతరాళ వంపుల నియమాలను లెక్కించే క్రమంలో పాల్గొనేందుకే అందింది ఆహ్వానం.

ప్రతిపాదిత సిద్ధాంతాలన్నింటినీ ఆలకించాడు జలపిత.

అప్పుడు తన అతి పిన్న వయసు చిటికెన వేలు మూత తీసాడు.

దాని లోపలినుంచి ఒక పుష్ఫాన్ని బయటికి లాగాడు.

ఫలితాన్నిగణిత శాస్త్ర వేత్తలకు వివరించాడు.

ఈ ఆవిష్కరణకు ముగ్ధులైన వాళ్ళందరూ తమ కుర్చీలను గిరాటేసేసి పరిగెత్తారు.

దారిలో వాళ్ళ కళ్ళద్దాలు వదులుకున్నారు.

నేరుగా పచ్చిక మైదానాల్లోకి వెళ్ళి సీతాకోకచిలుకలను వడిసి పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు.

 

*

జలపిత మొక్కల్లోపలికి వెళ్ళిపోయాడు.

వాటిల్లోనే రెండు వందల సంవత్సరాలు యానించాడు.

జలపితలో వున్న ఏకైక శాశ్వత గుణంః  మంచితనం.

ఇక తక్కినదంతా మిణుకే.

*

జలపిత రాయబారిగా నియోగించబడినప్పుడు అతనికి ఒక భారీ ఉక్కు కవచాన్నిచ్చారు.

కనీసం అలాగైనా తన నిర్లక్ష్యపు అరికాలితో దాన్ని నిమరడని.

కనీసం దాన్ని ధరించినప్పుడు అలా చేయడనీ.

అయితే జలపిత భావాల భట్వాడాధారుడన్న విషయమే మరచిపోయారు.

అతను ఇంత వరకెన్నడూ భావాలలోని లీలా మాత్ర లేశాన్నీ కనీసం నలపలేదు; కనీసం ఏమార్చనూలేదు.

 

జలపిత లాలిత్యం చెక్కు చెదరనిది.

 

*

జలపిత ఒక చిత్ర కళా ప్రదర్శనకు వెళ్ళాడు.

కళాఖండాలన్నీ సిగ్గుతో తమ చట్రసమేతంగా చడీ చప్పుడూ చెయ్యకుండా గది నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాయి.

 

*

“జనాలు ఎందుకు నీడలు చేస్తారు?’’ అని అడిగారెవరో జలపితని.

“ఎందుకంటే లోపలి కాంతి జనాల్లో పెద్దగా పనిచెయ్యదు కాబట్టి.’’ అని బదులిచ్చాడు.

జలపిత ఎప్పుడైనా ఆటోరిక్షాలోనో లేదా మరో డొంకదారి రవాణా వాహనమో ఎక్కినప్పుడు తన అదనపు అరికాళ్ళను, కాళ్ళనూ లగేజీ భద్రపరిచే గదుల్లోనే పెట్టేసుకునేవాడు.

 

*

Art: Ananthu

జలపిత బంగారం.

నిజానికి కంసాలులు అతడిని తరచూ వాడుకునేవారు.

ఇంకా చెప్పాలంటే జాతరలకు వెల్ళినప్పుడు నగ లాగా అతడిని ధరించేవారు జనం.

 

*

“వస్త్రాలు దేహానికీ, ఆత్మకీ గిరిగీస్తాయి.’’ అనుకున్నారు జనం.

అందుకే చివరికి జలపితని తొడుక్కున్నారు.

అలాగైనా అతడిని వర్గీకరించి, నిర్వచించాలని అనుకున్నారు.

కనీసం అతని అభిమానులు అలా అభిప్రాయపడ్డారు.

తీరా ఇది ఆచరించబోతే మరో మీమాంస ఎదురైంది.

ధరించిన వస్త్రాలకి ఆవలా జలపిత ఎంతగా వున్నాడంటే, పెద్ద పెద్ద నిపుణలు కూడా ఈ సంశయాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారు.

ఇంతకీ జలపితకి వస్త్రాలున్నాయా?

లేక వస్త్రాల చుట్టూ ఆవరించిన ఆచ్ఛాదనే జలపితా?

ఎందుకంటే అవి రెండూ కూడా జలపితే కదా!

 

 

*

ఒక దంపతులు సినిమాకి వెళ్దామనుకున్నారు.

అయితే అంత తక్కువ వ్యవధిలో తమ మూడు మాసాల పాపను చూసుకునేందుకు ఒక ఆయాను వెతికి పట్టుకోవడంలో విఫలమయ్యారు.

ఆ కారణంగా పాపను చూసుకోమని జలపితని కోరారు.

తన విధిని జలపిత తూచ తప్పకుండా నిర్వహించాడు.

ఎంతగా అంటే, కొన్ని గంటల్లో కన్నవారు సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఆ పిల్లవాడు 20 ఏళ్ళ వాడయ్యడు.

ఆ యవ్వనుడు తనకు వెంటనే పెళ్ళి చేయమనీ, లేకపోతే సన్యాసం తీసుకుని లోక కల్యాణం కోసం పాటు పడతానని బెదిరించాడు.

ఈ యువకుడి కన్న వారి ప్రతిస్పందన చరిత్రలో నమోదు కాలేదు.

*

జలపిత ఒక జల్లెడ కనుగొన్నాడు.

అందులోంచి చెడ్డవాడిని జల్లిస్తే మంచివాడయిపోతాడు.

 

రాజకీయ కారణాల వల్ల ఈ జల్లెడని నిషేధించారు.

*

ఒక పేరు ప్రతిష్టలున్న రాజకీయ వేత్త వివాహ మహోత్సవంలో జలపితని ప్రసంగిచమని కోరారు.

జలపిత తన మాటలు మొదలు పెట్టగానే అందరూ పరారయ్యారు.

కారణంః  అతను ఉపన్యాసం ఇవ్వడానికి బదులు ఒక పిట్టల గుంపును ఆకాశంలోకి వదిలాడు.

పైగా జలపిత తన మాట నిలబెట్టుకోలేదని అతిథులంతా ఫిర్యాదు చేసారు.

ఈ సారి ఆశ్యర్యపోవడం జలపిత వంతయ్యింది.

ఎందుకంటే ఇప్పటివరకు అతను చేసిన ఉపన్యాసాలన్నింటిలోకీ అదే అత్యంత గొప్పదని అతని నమ్మకం.

అందుకే అసలు తననుంచి జనం ఏమి కోరుకుంటున్నారో జలపితకి కొంచెం కూడా బోధపడలేదు.

 

*

జలపితను పుట్టినరోజు వేడుకలకు పిలిచారు.

తొందదరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యంది.

జలపిత సత్కార్యాలు చేయడంలో పుణ్యకాలం గడచిపోవడమే ఈ ఆలస్యానికి అసలు కారణం.

అందుకే చాలా హడావిడిగా వెళ్తున్నాడు.

హఠాత్తుగా అతనికి ఒక చిన్న నీటి పాయ తన కాళ్ళ ముందే తగిలింది.

తన దారిని అడ్డుకుంటోంది ఆ పాయ.

తన హడావిడిలో జలపిత ఆ పాయను దాటేందుకు అంజె వేయబోతున్నాడు.

అప్పుడే తట్టింది.

కాళ్ళ ముందు పడివున్న వాటిని దాటడం అరిష్టం అని.

అందుకే ఇబ్బందికి లోనయ్యాడు జలపిత.

అందుకే ఆ నీటి పాయ వెంట వెళ్ళి, దాని చుట్టూ తిరిగి వేడుకలకు ఆలస్యం కాకుండా చకచకా వెళ్ళిపోయాడు.

అలా వెళ్తున్నప్పుడు ‘చిన్నా, పెద్దా’ విషయాల గురించి దీర్ఘంగా ఆలోచించాడు.

 

*

ఒక కోళ్ళ ఫారంలో గుడ్లు పొదగవలసి వచ్చింది.

చాలా శ్రద్ధగా గుడ్లను పొదిగాడు జలపిత.

ఎంత శ్రద్ధగా అంటే ఒక విమానయాన కంపెనీ తన కోళ్ళ ఫారంకు వ్యతిరేకంగా కోర్టులో దావా వేసేంత.

దావా సారాంశంః జలపిత సద్దుమణగకపోతే ఇక మా విమాన యాన కంపెనీ మూసుకోవాల్సిందే.

జలపిత కోళ్ళఫారంలో పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి దూర విమాన ప్రయాణాలు చేసే వారంతా విమానాలు ఎక్కడం మానేసి కోళ్ళపైనే ప్రయాణించడానికి మొగ్గుచూపుతున్నారు.

ఆ కోళ్ళు ప్రయాణికులను అంత వేగంగా, అంతే భద్రంగా తీసుకువెళ్తున్నాయి మరి.

 

*

జలపిత ఆవిష్కరణలన్నింటిలోకీ తూర్పు దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కొన్ని ఇలా వున్నాయిః

తీరిక లేని పొగతాగే కుక్క పిల్లల యజమానుల కోసం జలపిత రూపొందించిన కొత్త కుక్క పిల్లలు.

ఈ కుక్క పిల్లలు తమ యజమానులు వదిలిన సిగరెట్ పొగ రింగులపైన నడిచివెళ్ళగలవు.

దీని వల్ల కుక్కలకు ఎలాంటి అనారోగ్యం కానీ, ఇతర హానీ కానీ వుండదు.

ఇక పొగ తాగని యజమానలకూ ఈ కొత్త కుక్కపిల్లలు మరో వెసులుబాటును కల్పిస్తాయి.

పొగతాగని యజమానుల ఊపిరి వెంట ఈ కుక్క పిల్లలు నడవగలవు.

 

మరో ఆవిష్కరణః ఇది మరో అద్భుతం.

శుభ్రత పట్ల విపరీతమైన శ్రద్ధ వున్న సంపన్నమహిళల సౌలభ్యం కోసం జలపిత చేసిన ఆవిష్కరణ ఇది.

స్వచ్చంధ శౌచ్య రబ్బరు బూట్లు.

ఈ బూట్లు దుమ్మును తమంతట తామే తుడిచిపెట్టుకుంటాయి.

*

“లోకంలో ఆత్మమితి ఆవిష్కరించబడిన తర్వాతే తమకంటూ ఆత్మ ఒకటి వుందన్న విషయం మానవాళికి బోధపడింది.’’ నిర్ధారించాడు జలపిత.

 

సకాలంలో అవతరించడంలో విఫలమైన ఓజోను పొరే జలపిత.

కానీ జలపిత గురించి ఆలోచించిన ఉత్తరక్షణం అతను అప్పటికే తన బాహువులనూ, కాళ్ళనూ గాలి నుంచి లాగేసుకుంటూ వుంటాడు.

*

 

 

 

అనువాదకుడి మాట

 

anantజలపిత కథ(?) నా చేతికి అందినప్పుడు… ఇది తెలుగులో ఇప్పుడు ఎందుకు?

తెలుగుకి ఎందుకు? అని తోచింది.

మొదలు, మధ్య, ఘర్షణ, అవరోధం, సమస్య, ముగింపు, తెగింపు, పరిష్కారం, ఆశావాదం అనే లెక్కల తక్కెడల జల్లెడలో ఎల్లెడలా కొట్టుమిట్టాడే లేదా కొడిగడుతున్న మన కథా templates కి ఆవల కూడా కథాకథన నిర్గమనాలూ, నిమజ్జనాలూ జరిగాయనీ, జరుగుతాయనీ, జరుగుతన్నాయనీ, జరగాలనీ మరోసారి ఆశించేందుకే (నా మటుకు నేను) ఈ జలపితనీ, ఈ ఎమ్మా అందిజెవ్ స్కా నీ అనువదించాలని అనుకున్నాను.

ఎమ్మాని విస్మరించి, తూష్ణీకరించిన ‘ఆధునిక వాస్తవికతా వాద’ సరళినీ, తర్క హేతు రుజు మార్గాన్నీ, దాని కాలిక గమనాన్నీ ఏక కాలంలో, ఏకైక సమయంలో ప్రోది చేసుకుని పొందు పరచి పొదిగి… ఎవరైనా ఆ గుడ్డును పగలేసే ఆ తంతును కనులారా చూడాలని, ఆ పగిలి వచ్చే బిడ్డల రెక్కలను కౌగిలించుకోవాలనీ ఆమెకు ఇప్పుడు పాల్పడ్డాను.

ఇందులోని ‘పదాలు కట్టేయలేని’ ఆలోచనలు తెలుగు కథా, నిర్మాణ, శైలీ, నిపుణత, పాండిత్య ప్రకర్షలకీ ఏ రెండు గింజలయినా సాదరంగా చల్లకపోతాయా అనే బలమైన, బలహీనమైన మూఢనమ్మకంతోనే ఇది అనువదించాను.

ఎమ్మా అందిజెవస్కా పదాన్ని శంకించింది.

భాషేతర వాస్తవికతలో పదం తల వొంచుకుని చేతులు కట్టుకుని చిత్తగించవలసి వుంది ఇంకనూ…

గిరిలోపలి మన పదాలు వినోదమే.

అది మనుగడ కాదు.

గిరిబయట మనకింకా అందని పదాలు నవ్య నిర్వచనాలు.

లేదా నూతన కరచాలనాలు.

ఇటు మన గిరులకీ.

మన నలిగిన/రొడ్డుకొట్టుడు పదాలకీ.

*

మీ మాటలు

 1. anil battula says:

  మంచి సుర్రియల్ కథ..చక్కటి అనువాదం.

 2. శ్రీనివాసుడు says:

  ’Word is not the thing”
  ‘’You are the world’’
  ******
  ’’ఆత్మమితి‘‘

  Is a method going to uncondition you? There is no method to uncondition you. We have played with these words, we have done all these things for centuries – the gurus, the monasteries, Zen, this or that method with the result you are caught, you are a slave to the method, aren’t you, and therefore …
  Freedom from Conditioning
  ***************
  The desire to free oneself from conditioning only furthers conditioning. But if, instead of trying to suppress desire, one understands the whole process of desire, in that very understanding there comes freedom from conditioning. Freedom from conditioning is not a direct result.
  *****************
  The mind frees itself
  You see, when the mind is totally aware of its conditioning, there is only the mind; there is no ‘you’ separate from the mind. But, when the mind is only partially aware of its conditioning, it divides itself, it dislikes its conditioning or says it is a good thing; and, as long as there is condemnation, …
  – జిడ్డు కృష్ణమూర్తి

  నా భావనలో అదే సనాతన ధర్మంలో జీవుని అంటిపెట్టుకుని వున్న కర్మ.

 3. శ్రీనివాసుడు says:

  ఆర్యా,
  అనువాదం చాలా బాగుంది. అయితే, ఈ క్రింది వచన అనువాదం సరిపోలదేమో!
  “Why do people have a shadow – Dzhalapitu asked. – Because it does not work inside lighting, “- said Dzhalapita.
  “జనాలు ఎందుకు నీడలు చేస్తారు?’’ అని అడిగారెవరో జలపితని.
  “ఎందుకంటే లోపలి కాంతి జనాల్లో పెద్దగా పనిచెయ్యదు కాబట్టి.’’ అని బదులిచ్చాడు.
  *********
  Dzhalapita has only one constant characteristics: goodness, the rest is fluid.
  జలపితలో వున్న ఏకైక శాశ్వత గుణంః మంచితనం. ఇక తక్కినదంతా మిణుకే.
  ఈ అనువాదానాకి నా సూచన:
  జలపితకున్న ఏకైక అచల గుణం మంచితనం, ఇక మిగతాదంతా ప్రవాహియే.
  ***********************
  ముద్రారాక్షసాలు కొన్ని వున్నట్లుగా నాకు తోచింది, మీకు అభ్యంతరం లేకపోతే సరిచేసిన పదాలను ఈ టపాలో ప్రచురిస్తాను.
  ********
  అనువాదంలో నాకు తోచిన మరిన్ని అనుమానాలను మీకు తెలుపవచ్చా?
  నాకు ఆంగ్లం పెద్దగా రాదు, కేవలం భావ సందర్భాన్ని బట్టే ఇవి సూచిన్తున్నానని మనవి.

 4. The version I have translated from English is by Roman Ivashkiv.
  His very spelling for the protagonist is Jalapita, not Dhzalapita.
  And the lines you have quoted are like this in Roman’s version…
  1. Jalapita has only one permanent characteristic: goodness. Everything else is transient.

  2. “Why do people make shadows?” Jalapita was asked.
  “Because internal light doesn’t work well in people, “Jalapita answered.

  So Mr Srinivasudu, please check/comment/suggest/reflect on my translation in this light.
  You can send your other remarks to canantu72@gmail.com.
  Regards
  Anantu
  P.S: I take sole responsibility for typos in this published piece of mine.

  • శ్రీనివాసుడు ,
   జిడ్డు కృష్ణ మూర్తి ని మీరు అసందర్భంగా ఉటంకించారు, పైగా అతని మాటలను అపార్థమూ చేసుకున్నట్టు నాకు తోచింది.అయినా అది నాకు అనవసరం ఇక్కడ. అస్సలు చదువే లేని డొల్ల మనుషులు అధిక సంఖ్యాకులు సాహిత్యంలో మనిపూసలుగా చెలామణీ అవుతున్న ఈ ప్రమాదకర కాలంలో దాదాపు 30 పేజీలు, అదీ అనువాదం, పైగా వాస్తవికేతర శైలిలో సాగిన జలపిత కథను మీరు చదవడం, ఆ పైనా మీ స్పందన తెలపడం నాకు ముచ్చట వేసింది. మీ లాంటి వారు అధిక సంక్యాక వర్గం ఎప్పుడు అవుతారో ఏమో? అన్న దిగులు మాత్రం నాలో నా నాటికీ పెరుగుతోంది.

 5. rani siva sankara sarma says:

  యిలాంటి కథలలో తా జాదనమే ముఖ్యం. తొందరపడకూదదు అర్థం చేసుకోవడానికి. నిజానికి దీనిలో జలపిత జీవిత చరిత్ర చాలానే వుంది. సర్వవిషయాలలోకీ అతడు చొచ్చుకుపోయాడు. పుచ్చకాయలు, నది, లైబ్రరీ , కోర్టు , గణితం వ్యాకరణం యిలా సూక్ష్మ స్థులాలలోకి చొచ్చుకెళ్లి కూడా తన చిరునామాని అవ్యక్తంగా వుంచాడు. యెన్నో కవితాత్మక వాక్యాలని మిగిల్చాడు చాలు.

 6. శ్రీనివాసుడు says:

  అనంతు,
  నాకు రోమన్ ఇవాష్కివ్ అనువాదం దొరకలేదు. అందుకే ఒక యూక్రేయిన్ సైట్లో వున్నమూలపాఠ్యం యొక్క అనువాదాన్ని ఉటంకించాను. అది నా పొరపాటే.
  జిడ్డు కృష్ణమూర్తిని గురించి ఉటంకించిన విషయం మీకు అనవసరం అన్నారు కాబట్టి, ‘‘అది సందర్భమా, అసందర్భమా’’ అన్న వివరాన్ని ప్రస్తావించదలుచుకోలేదు.
  నేను పెద్దగా చదువుకోలేదు. అయితే, స్చేచ్ఛాచింతన పట్ల అభినివేశం మాత్రం వుంది.
  సాంకేతికత ప్రసాదించిన భావవాహికలను దున్నిపారేస్తూ, ‘‘అతిశయించిన స్వీయ వ్యామోహం’’ అంటే Hyper narcissism పీడితులై గుర్తింపుకోసం నిరంతరం అంగలార్చే నయా విద్యావంతులు, మేధావులు, కళాకారులు – కెరీరే సర్వస్యంగా భావిస్తూ వడివడిగా పరుగెడుతున్న యువతరం – తాము అంటిపెట్టుకున్న, అంటకాగుతున్న భావజాలాలనే పరమంగా భావించి ప్రపంచ కువలయాపీడాన్ని తడిమే తత్త్వాంధులు విలసిల్లినంతకాలం ‘‘నిజంగా చదవడం’’ అనేది ఇప్పట్లో ప్రాచుర్యంలోకి రావడం అసాధ్యమనే తోస్తోంది.
  ఖలీల్ జీబ్రాన్ quotation అనువాదం ఒకటి ఏదో దినప్రతికలో చిన్నప్పుడు చదివేను,
  ‘‘A great singer is he who sings our silences’’ – ‘‘నిశ్శబ్దాన్ని పాడేవాడే మహాగాయకుడు’’.
  అయితే, ఈ అనువాదం నాకు తృప్తినివ్వలేదు.
  అందుకే, ‘‘మన మౌనంలోని రాగాలను పలికించేవాడే మహాగాయకుడు’’ అని స్వీయ అనువాదం చేసుకున్నాను.
  ఖలీల్ జీబ్రాన్‌ని ఈ ‘‘జలపిత’’ అనువాదం ద్వారా గుర్తుతెచ్చినందుకు బోలెడు నెనర్లు.
  మీరు ఈ స్థాయి అనువాదాలను మరిన్ని అనువాదాలు చేయాలని కాంక్షిస్తూ…..

  రోమన్ ఇవాష్కివ్ ఎలా వ్రాసినా Dzhalapita అనేదే సరయిన వర్ణక్రమం

 7. శ్రీనివాసుడు says:

  ’’ఎమా ఎన్డాయ్ జిస్కా‘‘ రచన Dzhalapita కు ‘‘రోమన్ ఈవష్కివ్ ’’ ఆంగ్ల అనువాదం ఇప్పుడే అంతర్జాలంలో దొరికింది. ఇది చదివి నా అభిప్రాయాన్ని త్వరలో తెలుపుతాను.

 8. mohanbabu says:

  అనంతు ఇదొక సాహసం , విచిత్ర మైన అనుభూతి , నేమరేసుకోవలసిన ఫీలింగ్స్ , ఉమ్మడిగా ఒక విలక్షణమైన పరిస్థితి చదివేవాడికి . మరొకసారి చెబుతున్న ఇదొక సాహసం .

 9. Thank you very much Anantu garu for this translation. Great introduction to the writer.

 10. Its my pleasure, dear Aruna Pappu
  and dear Mr Mohanbabu

 11. కె.కె. రామయ్య says:

  కాలం నాడు నామాడి శ్రీధర్ గారితో కలిసి త్రిపురని ఇంటర్వ్యూ చేసిన అనంతు వీరే కదా సార్ అని త్రిపుర గారి రమణజీవి కి ఫోను చేసి కనుక్కుని, ఈ జలపిత కధ చదవమని రమణజీవి గారికి చెప్పాను. ఆపై ఈ కధ చదివే సాహసమూ చేస్తాను.

 12. వెంకట్ శిద్దారెడ్డి says:

  అనంతం చాలా బావుంది. బొమ్మ కూడా బావుంది. ఇక నుంచి చాలా రాయాలి నువ్వు. ఎదురుచూస్తుంటాను :-)

మీ మాటలు

*