కథల పరమార్ధం

 

 

కథల వల్ల ప్రయోజనం ఏమిటి?

 

ఇదొక ఎడతెగని చర్చకి దారి తీసే ప్రశ్న. ‘ఏ ప్రయోజనం లేదు’ నుండి ‘ప్రపంచాన్ని మార్చటం’ దాకా రకరకాల సమాధానాలొస్తాయి. వీటిలో నాకు నచ్చినది: “Entertain and inform” – ఆ క్రమంలో. పాఠకులని వినోదపరుస్తూ వాళ్లకి ఎంతోకొంత ఉపయుక్తమైన సమాచారాన్ని అందించగలిగేదే నా దృష్టిలో ప్రయోజనకరమైన కథ.

అయితే – ఏదేని సమస్య గురించిన సమాచారం తెలియజేయటానికి, దానిపై పాఠకులకి అవగాహన కలిగించటానికి సాహిత్యంతో పనేంటి? అందుకోసం కథలూ, నవలలూ రాయాల్సిన అవసరమేంటి? సదరు సమస్యపై సమాచారాన్ని క్రోడీకరించి, సంఖ్యలూ అవీ జతపరచి శుభ్రంగా ఓ వ్యాసం రాసేయొచ్చుగా. అది మరింత ప్రభావశీలంగా ఉంటుంది కదా.

లేదు. వ్యాసాల ద్వారా సమస్యల గురించిన సాధారణ సమాచారం లభిస్తుంది, స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. కానీ ఆ సమస్య బారినపడ్డ మనిషి అనుభవించే వేదన ఈ వ్యాసాల్లో కనబడదు. కష్టసుఖాలకి మనుషులెలా స్పందిస్తారు, వాటినెలా ఎదుర్కొంటారు,  అవి మానవ సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తాయి – ఇటువంటి సమాచారాన్ని పాఠకులకి అందించగలిగేది సాహిత్యం మాత్రమే.

ఇక్కడ గమనించాల్సిన విషయమొకటుంది. సాహిత్యం పని సమాచారాన్ని చేరవేయటమే. బోధించటం కాదు. హితబోధలు చేయటం కాదు. ఎందుకంటే, కథలు చదివి మనుషులు మారిపోరు. కథల వల్ల పాఠకుల నైతిక వర్తనం మారదు. కాబట్టి సందేశాలిచ్చే కథలకి బదులు సమాచారాన్నిచ్చే కథలు రాయటం మెరుగు. వీలైనంత కచ్చితమైన సమాచారాన్ని పాఠకులకందిస్తే, ఆసక్తి కలిగినవాళ్లు ఇతర మార్గాల ద్వారా మరింత లోతుగా వివరాలు తెలుసుకుంటారు. చదివినవారికి అందులో ప్రస్తావించిన విషయాల మీద ఆసక్తి, అవగాహన కలిగించగలిగితే ఆ కథ ధన్యమైనట్లే.

మరి వినోదం సంగతేమిటి? నా దృష్టిలో కథ – ఆ మాటకొస్తే ఏ కళకైనా – ప్రధమ పరమార్ధం వినోదం కలిగించటం. మిగతావన్నీ ఆ తర్వాతే. వినోదం పాళ్లు పిసరంతైనా లేకుండా సమాచారాన్ని బదిలీ చేయటమే ఏకైక పనిగా రాయబడ్డ కథల వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఇక్కడ ‘వినోదం’ అంటే నవ్వు తెప్పించటం, సంతోష పరచటం అని పొరబడకండి. ఆంగ్లంలో ‘entertainment’ అనే పదానికి ‘diversion’ అనే అర్ధమూ ఉంది. నేను ఆ అర్ధంలో వాడాను. వినోదాత్మకమైన కథలు చదవటాన్ని “escaping from reality” అంటూ వెక్కిరిస్తారు కొందరు. నేను మాత్రం దీన్ని “escaping into an alternate reality” అంటాను. కథ పని చదువుతున్నంతసేపూ పాఠకుడిని మరో ప్రపంచంలోనికి తీసుకుపోవటం. పాఠకుడికి కనీసం ఒకటైనా కొత్త విషయం చెప్పటం. ఆ మేరకి అతని/ఆమె దృష్టి పరిధి పెంచటం. అది చెయ్యలేని కథ రాయటం అనవసరం.

పైదంతా రచయిత కోణం నుండి కథ ప్రయోజనం ఏమిటో వివరించే ప్రయత్నం. దీన్నే పాఠకుడి కోణం నుండి ఇలా చెప్పొచ్చు:

“కథ పరమార్ధం పాఠకుడితో ఆస్వాదించబడటం”

అంతే.

*

మీ మాటలు

 1. వృద్ధుల కల్యాణ రామారావు says:

  మంచి కథలు పాఠకుల్ని ఒకొక్కప్పుడు మారుస్తాయి కూడా! నేను రావిశాస్త్రి గారి కథలు చదివి సంఘ్ పరివార్ తాత్వికత నుండి బయటపడి వామపక్ష తాత్వికత వైపు ఆకర్షితుడయ్యెను.

 2. చందు తులసి says:

  అవును….సార్
  ఏ సాహిత్య ప్రక్రియ ఐనా ప్రాథమికంగా ఆలోచనల కలబోత…..
  రచయిత తన ఆలోచనను ..కథో, కవితో, పాట రూపంలోనో చెబుతాడు.
  ఆ చెప్పడం….వెనుక నలుగురికీ ఉపయోగపడే
  సంగతులైతే మరీ మంచిది.

 3. AMBALLA JANARDHAN says:

  అవును నిజమే. కొన్ని కథలు చదివి తమ అభిప్రాయాలను, దృక్పథాలను పాఠకులున్నారు. నేను కూడా కొన్ని కథలు చదివి, నాణేనికి మరోవైపు తెలుసుకున్న సందర్భాలున్నాయి. సాహిత్యం, చదువరులలో ఆసక్తిని రేకెత్తించి, వేర్వేరు మనుషులు, వేర్వేరు సందర్భాల్లో ఎలా స్పందిస్తారో తెలియజేస్తుంది. ఒకే మనిషి వేర్వేరు సమయాల్లో తన వైఖరిని ఎలా మార్చుకుంటాడో తెలియజేస్తుంది. పాఠకుడు ఓ కథలో తనను తాను చూసుకున్నాడనుకుంటే, ఆ కథ సార్థకమైనట్టే.

 4. THIRUPALU says:

  సాహిత్య ప్రయోజనం సామాజిక సాంస్కృతిక అభివృద్ధి సాదించడం. అందులో కధ ఒక ప్రక్రియ. అలంకార శాస్త్రాల ప్రకారం ఏదో ఒక రసం ఉండాలి. అది మానవాభ్యుధయానికి తోడ్పడాలి, లేక పోతే సాహిత్య గ్రౌరవం కొనసాగదు.

 5. అజిత్ కుమార్ says:

  కధలు అనేవి కళలలో ఒక భాగం. కళలు శృంగారానికి సహకరించేవి. ముఖ్యంగా లలిత కళలు మనుషుల మనసులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తుల అభిప్రాయాలు మారుస్తాయి.ఆలోచననూ, ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తాయి. ఊహాలోకంలో విహరించేలా చేస్తాయి. ఆ ఊహాలోకంలో అనేక మతాలను సృష్టిస్థాయి. మనకు నచ్చిన లక్షణాలతో దేవుళ్ళనూ, దేవతలనూ రూపొందిస్తాయి.
  కధల వలన లాభాలనే వెదుకుతున్నారు గానీ నష్టాలను గుర్తించడంలేదు. వాటిని గూర్చి కూడా ఆలోచన చెయ్యండి.
  కళ్యాణ రామారావు గారు భావించినట్లుగా వారు పరివార్ తాత్వికత నుండి వామపక్ష తాత్వికత వైపు మారానని భావించుచున్నారు కానీ ఆ రెండూ ఒక్కటే. వామపక్ష తాత్వికత కూడా మతతత్వమార్గంలోనే నడుస్తుంది.

 6. >> “కధల వలన లాభాలనే వెదుకుతున్నారు గానీ నష్టాలను గుర్తించడంలేదు”

  That’s true. But, it applies to everything – not just stories. Would you discourage your toddler from learning how to walk, because you’re worried she’ll fall and hurt herself?

  >> “[కథలు] ఆలోచననూ, ప్రశ్నించే తత్వాన్ని అణచివేస్తాయి. ఊహాలోకంలో విహరించేలా చేస్తాయి”

  I guess what you really meant is, “They suppress rational thinking and drown people in illusions”. That’s true to some extent; but there’s another side too. They let people imagine new worlds which in turn become new realities. They open up new possibilities, new ways of thinking, new problems and new solutions too. In fact, this is exactly why people should start reading fiction, science-fiction in particular, from an early age. For, our world would’ve been a different place if it’s not for the many ideas which first appeared in science-fiction, inspired would-be inventors and eventually became a reality. Now you can start arguing how the world without sci-fi and its influence could’ve been a much better place but that’s just a what-if. The same applies to fiction in general.

మీ మాటలు

*