అగమెమ్నన్ ముఖం తొడుగు దొరికింది!

MaskOfAgamemnon

స్లీమన్ కథ-26

 

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)ఈసారి స్లీమన్ కు అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యం కలిగించినవి, అసంఖ్యాకంగా ఉన్నబంగారు బిళ్ళలు. ఈ ఒక్క సమాధిగదిలోనే అవి ఏడువందలకు పైగా లెక్కకొచ్చాయి.  ఆకులు, సీతాకోకచిలుకలు, ఆక్టోపస్ లు, నక్షత్రాలు, పొద్దుతిరుగుడు పువ్వులు…ఇలా అవి వివిధ ఆకృతులలో ఉన్నాయి. కొన్ని పూర్తిగా రేఖాగణితనమూనాలలో ఉన్నాయి. ఇవి యోధుల చేతిలోని డాలును సూచించే సంక్షిప్త రూపాలని స్లీమన్ అనుకున్నాడు. కానీ మరణానంతర జీవితంలో వెంట ఉండే  సామగ్రిని సూచించే ప్రతీకలు కావచ్చు.

స్వర్ణముద్రలతోపాటు పెద్ద సంఖ్యలో స్వర్ణఫలకాలు ఉన్నాయి. వీటిలో అంగుళం మించి వెడల్పు ఉన్న ఫలకాలు చాలా తక్కువ. పర్షియాలో జరిపిన తవ్వకాలలో దొరికిన సైరస్, గ్జెరెక్సెస్ ల కాలం నాటి సంక్షిప్త స్వర్ణ ఫలకాలకు ఇవి భిన్నంగా ఉన్నాయి.  కళాకారుడు బంగారు రేకులను తీసుకుని సింహాలు, రాబందులు, చేపలు, జింకలు, గద్దలు, హంసలుగా మలిచాడు. వాటిలో జీవం ఉట్టిపడుతోంది. ఇవి బహుశా మృతుల దుస్తులకు కుట్టిన అలంకారాలు అయుంటాయి.

మూడో సమాధిలో మూడు అస్థిపంజరాలు కనిపించాయి. ఎముకలు, దంతాల పరిమాణాన్ని బట్టి అవి స్త్రీలకు చెందినవని స్లీమన్ అనుకున్నాడు. కానీ కవచాలు ధరించిన రాజు, ఇద్దరు రాకుమారులకు చెందినవి కావచ్చు. ఎముకల మధ్య ఒక బాకు, బంగారు తాపడంతో వెండితో చేసిన రెండు రాజదండాలు ఉన్నాయి.

మూడో సమాధి తెరచుకోవడంతో, మిగిలిన ఆగొరా మొత్తంలో తవ్వకాలకు స్లీమన్ సిద్ధమయ్యాడు. ఎక్కడనుంచి ప్రారంభించాలో మొదట అర్థం కాలేదు. అంతలో, ఆగొరాలోని మిగిలిన చోట్లకు భిన్నంగా మూడో సమాధికి పశ్చిమదిశలో మట్టి నల్లగా ఉన్నసంగతిని అతను గమనించాడు. అక్కడ 15 అడుగుల లోతున తవ్వించాడు. కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. మరో 9 అడుగుల  లోతున తవ్వేసరికి నాలుగు అడుగుల ఎత్తైన ఒక గుండ్రని వేదిక లాంటిది కనిపించింది. అది నూతి వరలా తెరచుకుని ఉంది.  మృతవీరులను సమాధి చేసి, వారి గౌరవార్థం దానిని నిర్మించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. బహుశా  మృతవీరులను ఉద్దేశించి అందులోకి కానుకలు జారవిడిచి ఉంటారని కూడా ఊహించాడు. సుమేరియాకు చెందిన రాచసమాధుల దగ్గర కూడా ఇలాగే మట్టి గొట్టాలు లేదా బిలాల లాంటివి కనిపించాయి. వాటిలోంచి మృతులకు బలులు, కానుకలు అర్పించేవారు. అయితే, స్లీమన్ కాలానికి అక్కడ తవ్వకాలు జరగలేదు. కనుక స్లీమన్ సొంత ఊహ మీదే ఆధారపడ్డాడు. ఆ ఊహే నిజమన్న నిర్ధారణకు ఆ తర్వాతి నిపుణులు కూడా వచ్చారు.

ఆ గుండ్రని నిర్మాణం అడుగున మరో మూడు అడుగులు తవ్వించాడు. స్వర్ణనిక్షేపాలతో నిండిన మరో సమాధి కనిపించింది. బంగారమూ, నగలూ కప్పిన మరో అయిదు కళేబరాలు కనిపించాయి. వాటిలో మూడు బంగారు ముసుగులు(ముఖాచ్ఛాదనలు) ధరించి ఉన్నాయి.  నాలుగవ కళేబరం శిరసు దగ్గర వంగిన మరో బంగారు ముసుగు కనిపించింది. అది సింహశిరస్సు ఆకారంలో ఉంది. అది శిరస్త్రాణం కావచ్చని స్లీమన్ అనుకున్నాడు.

ఈ నాలుగు ముసుగుల్లోనూ ఒకటి, మనిషి కవళికలను గుర్తించలేనంతగా శిథిలమైంది. కొన్ని నిమిషాలపాటు దానిని తదేకంగా చూస్తూ;  ఎత్తైన నుదురు, పొడవాటి గ్రీకు నాసిక, పలచని పెదవులతో చిన్న నోరు ఉన్న ఒక యువకుడి ముఖాన్ని అందులో పోల్చుకోడానికి  స్లీమన్ ప్రయత్నించాడు. ఈ ముసుగుకు స్పష్టమైన రూపురేఖలు లేకపోయినా, రెండు ముసుగులు మాత్రం ఆ నాలుగవ సమాధి వైభవానికి అద్దం పడుతున్నాయి. వాటిలోంచి ఓ అధికారమూ, ఆధిపత్యంతో పాటు దారుణమైన అందం తొంగి చూస్తోంది. వాటిపై మృత్యుచ్చాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. భయానకమైన కవళికలే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు. ఈజిప్టు ఫారోల శవపేటికలపై ఉన్న ముసుగులకు ఇవి భిన్నంగా ఉన్నాయి. దారువుపై చిత్రించిన ఈజిప్టు ఫారోల ముసుగులలో పవిత్రత, ప్రశాంతత ఉట్టిపడుతూ ఉంటాయి. మైసీనియా ముసుగుల సరళి వెనుక మరేదో ప్రయోజనాన్ని ఉద్దేశించి ఉంటారని స్లీమన్ అనుకున్నాడు. కళాకారుడు వాటిని ఆ వ్యక్తులు జీవించి ఉన్నప్పటి ముఖాలుగా తయారు చేయలేదు. వాటిపై మృత్యుచ్చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి వేర్వేరు వ్యక్తులకు చెందిన  చిత్తరువులు కావచ్చునని కూడా స్లీమన్ అనుకున్నాడు. మృత్యుచ్చాయలు కనిపిస్తున్నా; నిస్సందేహంగా ప్రతి మూసుగూ వేర్వేరు వ్యక్తుల ముఖాన్నే సూచిస్తోందనీ, అలా కాని పక్షంలో అన్ని ముసుగులూ ఒకే మూసలో ఉండేవనీ రాసుకున్నాడు.

అవి వేర్వేరు వ్యక్తుల చిత్తరువులనే అనుకున్నప్పటికీ, జీవించి ఉన్నప్పుడు వారిని గుర్తుపట్టడానికి వీలైన దాదాపు అన్ని కవళికలూ చెరిగిపోయేంతగా కళాకారుడు వాటిని సరళీకరించి దాదాపు అమూర్తస్థాయికి కుదించాడు. ఒక ముసుగుపై కళ్ళు గోళాల్లానూ, ముఖంలోంచి పొడుచుకు వచ్చేలానూ ఉండి మృత్యువు రూపుగట్టే శూన్యతను సంకేతిస్తున్నాయి. ఇంకో ముసుగుపై నుదురు ఎత్తుగా ఉంది.  పెదవులు బిగుసుకుని అతుక్కునిపోయినట్టు ఉండి మరణబాధను సూచిస్తున్నాయి. పెరూలో కనిపించిన అచ్చం ఇలాంటి బంగారు ముఖాచ్ఛాదనల్లానే ఇవి కూడా చనిపోయిన ఆయా వ్యక్తుల చిత్తరవులను మించి, మృత్యుచిత్రాలులా కనిపిస్తున్నాయి.  వాటిలో ఒక అభౌతికమైన అందం ప్రకాశిస్తోంది. మరణించిన కొన్ని గంటల తర్వాత రాజులు, రాకుమారుల ముఖాలు ఎలా ఉన్నాయో అలాగే మలచడానికి కళాకారుడు ప్రయత్నించాడు తప్ప; ఎక్కువ వివరాలు చూపాలని అనుకోలేదు. అన్ని ముఖాలూ దాదాపు దేవతాముఖాలను తలపిస్తున్నాయి. మరణించిన పాలకులలో దివ్యాంశను సూచిస్తూ, తాము జీవించి ఉండగా చలాయించిన దివ్యాధికారాన్నే; మరణించిన తర్వాత కూడా వెంట నిలుపుకున్నారని చెప్పడం కళాకారుడి ఉద్దేశంలా కనిపిస్తుంది.

ఈ ముసుగులు వీక్షకులను భయసంభ్రమాలకు గురిచేస్తాయి. పాశ్చాత్య చరిత్ర పొడవునా చిత్రకారులు అనేకులు మృత్యువు రూపురేఖలు పట్టుకుని చిత్రించడానికి  ప్రయత్నించారు. కానీ ఈ అజ్ఞాత మైసీనియా చిత్రకారులంతగా సఫలులైనవాళ్లు చాలా అరుదు. మన నాగరికత తొలి నాళ్లకు చెందిన ఈ ముసుగు చిత్రాలు  మృత్యువును ఎంతో నిర్భయంగానూ, శక్తిమంతంగానూ, సరళంగానూ చిత్రించిన తీరు అసాధారణమనిపిస్తుంది.

అయితే, ఈ ముసుగుల వాస్తవిక ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలియదు. హోమర్ కానీ, మరో గ్రీకు పండితుడు కానీ ఇలాంటి మృత్యు ముఖాచ్ఛాదనల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వాటిని మృతుల ముఖాలకు చుట్టి, వాటి సూత్రాలను చెవులకు చేసిన రంధ్రాలలో దూర్చి కట్టారు. దురదృష్టవశాత్తూ, ఆ అయిదుగురు మృతుల కపాలాలూ, భద్రపరచడానికి వీలులేనంతగా శిథిలమయ్యాయి. అవి బయటపడినప్పుడు వాస్తవంగా ఏ భంగిమలో ఉన్నాయో తెలియదు. బంగారు ముసుగులూ; కళేబరాల దగ్గర చెల్లా చెదరుగా పడున్న స్వర్ణాభరణాలూ మన కళ్ళముందు కనిపిస్తున్నాయి కానీ; ఆ రాతి సమాధుల్లో మృతదేహాలను ఎలా ఉంచేవారో, ఎలాంటి తంతు జరిపేవారో- ఆ మొత్తం సన్నివేశాన్ని ఇప్పుడు ఊహించుకోగలిగినంతగా మనకు ప్రాచీన గ్రీసు గురించిన పరిజ్ఞానం లేదు.

చదునుగానూ, విరిగీ ఉన్న సింహపు శిరస్సును మొదటిసారి చూసినప్పుడు శిరస్త్రాణం కాబోలని స్లీమన్ అనుకున్నాడు.  అందులో ఉండాల్సిన చిన్న చిన్న ముక్కలు మాయమయ్యాయనిపించింది. దానిని మరోసారి చేతిలోకి తీసుకుని నిశితంగా పరిశీలించాడు.  అందులో సింహపు కళ్ళను, చెవులను, ముట్టెను పోల్చుకుంటూ, అది కచ్చితంగా ముఖం మీద ధరించే ముసుగు అయుంటుందనుకున్నాడు. అయితే, అనంతరకాలంలో, ముట్టె నుదుటిమీద ఆనేలా రాజులు సింహశిరస్సును శిరస్త్రాణాలుగా ధరించడం కనిపిస్తుంది.  అలెగ్జాండర్ నాణేల మీద అలాంటి శిరస్త్రాణమే ఉంటుంది. కనుక స్లీమన్ మొదట అనుకున్నదే నిజం కావచ్చు.

నాలుగవ సమాధిలో కనిపించిన స్వర్ణసంపద స్లీమన్ ను సైతం విచలితుణ్ణి చేసింది. బంగారు ముసుగులు అందులో స్వల్పభాగం మాత్రమే. రెండు కళేబరాల మీద స్వర్ణ వక్షస్త్రాణాలు(breast plates)ఉన్నాయి. ఇంకో కళేబరం మీద చంచలించే ఆకులున్న కిరీటం ఉంది. పదకొండు గుండ్రని భారీ స్వర్ణపాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకదాని చేతులపై రెండు పావురాలు ఎంతో సున్నితంగా చెక్కి ఉన్నాయి. ఆ పాత్ర అచ్చంగా ఇలియడ్ లో వర్ణించిన నెస్తార్ కు చెందిన మద్యపాత్రలా ఉంది [నెస్తార్: మైసీనియాలోని ఒక పట్టణమైన పీలోస్ ను పాలించిన రాజనీతిజ్ఞుడైన రాజు. ఇలియడ్ ప్రకారం, ట్రోజన్ యుద్ధంలో గ్రీకుల పక్షాన పోరాడాడు. మహాభారతంలోని భీష్ముడిలా మూడు తరాలను చూసిన వీరుడు, మంచి సలహాదారు] “బంగారు సూచికలు (పిన్నులు) పొదిగి, రెండు పావురాలతో అలంకృతమైన” పాత్రగా దానిని ఇలియడ్ వర్ణించింది. ఆపైన బంగారు వడ్డాణాలు, జడకట్లు(రిబ్బన్లు), మోకాలి దగ్గర కట్టుకునే ఒక బంగారు పట్టీ, ఒక బంగారు కవచం, బంగారు పతకాలు, పిన్నులు; ఒక అంగుళం కంటే చిన్నవిగా ఉన్న రెండు తలల బంగారు గొడ్డళ్ళు, బంగారు రేకులు ఆచ్ఛాదించిన 12 భారీ బొత్తాలు, నాణేలను తలపిస్తున్న 400 కు పైగా స్వర్ణముద్రలు,  150 బంగారు బిళ్ళలు, ఒక బంగారు చేప, కత్తి పిడులుగా  మలచి ఉపయోగించినట్టు అనిపిస్తున్న 10 బంగారు రేకులు, రాగి కాగులు, కంచుతో చేసిన మొనదేలిన కత్తులు, బంగారు కొమ్ములతో ఉన్న ఒక వెండి గోవు శిరస్సు కనిపించాయి. ఈ సమాధిలో కనిపించిన అనేక వస్తువుల్లానే గోశిరస్సు కూడా పవిత్రతను చాటే తెగ(tribe)చిహ్నం అయుంటుంది. కళ్ళకు మిరుమిట్లు గొలిపే ఈ స్వర్ణరాశి మధ్యనే ఆశ్చర్యకరంగా లెక్కలేనన్ని ఆల్చిప్పలు కనిపించాయి. వీటిలో కొన్నింటిని అసలు తెరవనేలేదు.

తను ట్రాయ్ లో కనుగొన్న నిక్షేపాల కన్నా ఎక్కువ నిక్షేపాలు ఈ ఒక్క నాలుగవ సమాధిలోనే స్లీమన్ కు కనిపించాయి. ఈసారి దానికి నేరుగా ఉత్తరం వైపున తవ్వకాలు ప్రారంభించాడు. క్రమంగా అయిదవదీ, చివరిదీ అయిన సమాధి బయటపడింది. అందులో దోపిడీ జరిగిన ఆనవాళ్ళు కనిపించాయి. ఒక్క కళేబరం మాత్రమే ఉంది. అది కూడా పూర్తిగా శిథిలమై పొడి పొడిగా రాలిపోయేలా ఉంది. పక్కనే ఒక స్వర్ణకిరీటం, ఒక బంగారు పానపాత్ర, ఒక ఆకుపచ్చని కలశం, స్వల్ప సంఖ్యలో మట్టి బొమ్మల శకలాలు కనిపించాయి.

ఇంతకుముందు మొదటి సమాధి దగ్గర తవ్వకాలు ప్రారంభించినప్పుడు అది బురదతో నిండిపోవడం వల్ల పని ఆగిపోయింది. కొన్ని వారాలపాటు బాగా ఎండ కాయడంతో ఆ బురద ఎండిపోయి తిరిగి అక్కడ పని ప్రారంభించే అవకాశం కలిగింది. మొదట్లో అది ఖాళీగా ఉన్నట్టు అతనికి అనిపించింది. కానీ మరింత లోతుగా తవ్వేసరికి మూడు కళేబరాలు కనిపించాయి. వాటి పక్కనే కొద్దిపాటి నిక్షేపాలు ఉన్నాయి. వాటిలో రెండు బంగారు ముసుగులున్నాయి.  ఒకదాని కపాలానికి ఇప్పటికీ కొంచెం చర్మం అతుక్కుని ఉంది. పైన పడిన శిథిలాల బరువువల్ల ఆ కళేబరం అణిగి సాపుగా మారిపోయింది. ముక్కు లేదు. అయినా ముఖంలో గుర్తించగలిగిన కవళికలు కనిపిస్తున్నాయి. స్లీమన్ దానిని చూస్తూనే ఉత్తేజం పట్టలేకపోయాడు. ఆ ముఖంలో అతనికి అగమెమ్నన్ పోలికలు కనిపించాయి!

అది గుండ్రంగా ఉండి, ముప్పై అయిదేళ్ళ పురుషుడి ముఖంలా కనిపించింది. అన్ని దంతాలూ పటిష్టంగా ఉన్నాయి. ఒక పెద్ద స్వర్ణ వక్షస్త్రాణాన్ని ధరించి ఉన్నాడు. అతని నుదుటి మీదా, వక్షస్థలం మీదా, తొడల మీదా బంగారు ఆకులు పరచి ఉన్నాయి. అతని ముఖానికి పక్కనే పడున్న బంగారు ముసుగు సాపుగా అయిపోయింది. స్లీమన్ దానిని చేతుల్లోకి తీసుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఎథెన్స్ లోని మంత్రికి తంతి పంపించాడు. ఈ చివరి సమాధిలో కనుగొన్న మూడు కళేబరాలలో ఒకదాని ముఖంలో తను ఎంతో కాలంగా ఊహించుకుంటున్న అగమెమ్నన్ పోలికలు కనిపిస్తున్నాయనీ, ఆ ముఖ కవళికలను భద్రపరచడానికి చిత్రకారుని పంపవలసిందిగా నాప్లియోకు తంతి పంపాననీ అందులో తెలియజేశాడు.

ఆ పురాతన వీరుని కళేబరాన్నీ, దాదాపు భద్రస్థితిలో ఉన్న అతని ముఖాన్నీ చూడడానికి ఆర్గోస్ మైదాన ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దాని బొమ్మ గీయడానికి నాప్లియోనుంచి ఒక చిత్రకారుని రప్పించారు. శాస్త్రీయపద్ధతుల్లో భద్రపరిచే లోపల అది ఎక్కడ పొడి పొడి అయిపోతుందో నని భయపడుతూ  స్లీమన్ రెండురోజులపాటు ఆ పనులను పర్యవేక్షించాడు. ఆర్గోస్ నుంచి ఒక నిపుణుడు వచ్చి దాని మీద ఒక ద్రావణాన్ని పోసాడు. దాంతో అది గట్టిపడిన వెంటనే దానిని విజయవంతంగా ఎథెన్స్ కు తరలించారు.

నాలుగవ సమాధిలో దొరికిన విస్తారమైన స్వర్ణరాశులతో పోల్చితే,  దోపిడీ ఆనవాళ్ళు కనిపిస్తున్న మొదటి సమాధిలో దొరికినవి నామమాత్రమే కానీ; వాటిలో కూడా స్వర్ణపాత్రలు, స్వర్ణ వక్షస్త్రాణాలు, 12 బంగారు పలకలు ఉన్నాయి. ఆ పలకల్లో కొన్నింటిపై జింకలను సింహాలు వేటాడుతున్న చిత్రాలు ఉన్నాయి. ఆపైన బంగారు పిడులు ఉన్న 80 కంచు ఖడ్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా పదునుగా ఉన్నాయి. ఇంకా, ఒక కరవాలం తాలూకు బంగారు కుచ్చు, ఒక వీరుడి కళేబరం మీద పొడవాటి బంగారు పట్టీలు ఉన్నాయి. అన్నింటిలోనూ విశేషంగా చెప్పదగినది ఇక్కడ దొరికిన బంగారు ముసుగు. అది మిగిలిన ముసుగులన్నిటికన్నా చాలా అందంగా ఉంది.

మైసీనియాలో స్లీమన్ కనుగొన్నవాటిలో ఈ ముసుగే చివరిది. మిగిలిన వాటిలో లేని ఒక పరిపూర్ణత దీనిలో ఉంది. మిగిలినవి మృత్యువును శక్తిమంతంగా సూచిస్తున్నాయి కానీ, వాటిలో మర్త్యత్వం ఉంది. కానీ ఈ ముసుగులో శక్తిమంతతే కాక; ఒక పవిత్రత, నైర్మల్యం, ఉదాత్తత ఉట్టిపడుతున్నాయి. ఇతర ముసుగులు ఆయా వీరుల అంతిమక్షణాలలోని మృత్యుచ్ఛాయలను సూచిస్తూ ఉంటే, ఈ ముసుగు వాటికి భిన్నంగా ఒక వీరుడు దేవుడిగా మారిన క్షణాలను సూచిస్తోంది. అందులో మర్త్యత్వపు ఆనవాళ్ళు కాకుండా, కేవలం ప్రసన్నత తొంగి చూస్తోంది. విశాలమైన నేత్రాలు మూసుకుని ఉన్నాయి. కనురెప్పలు స్పష్టంగా గుర్తించబడి ఉన్నాయి. పలచని పెదవులు ఒక మార్మికమైన చిరునవ్వును వెలార్చుతూ మూసుకుని ఉన్నాయి. గెడ్డం ఉన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనుబొమలు దట్టంగా చెక్కి ఉన్నాయి. మొత్తంగా ఆ కనుబొమలు, మీసాలు, పెదవులపై ఆ చిరునవ్వు ముఖానికి ఒక విచిత్రమైన లోతును సంతరిస్తున్నాయి. క్రీస్ట్ ఆఫ్ డఫ్నె[అలబామా, అమెరికాలో ఉన్న ప్రసిద్ధ కేథలిక్ చర్చి], చేఫాలు[ఇటలీలో, సిసిలీ ఉత్తరతీరంలో, పలేమో రాష్ట్రంలో ఉన్న నగరం], పలేమో [ఇటలీ దీవి అయిన సిసిలీ రాజధాని. 12వ శతాబ్దికి చెందిన ఇక్కడి కెథెడ్రల్ ప్రసిద్ధమైనది. ఇక్కడ రాచ సమాధులు ఉన్నాయి]వంటి అద్భుతనిర్మాణాలతో పోల్చదగిన ఆ ముఖం, ప్రాచీన చిత్రకళ సాధించిన ఉన్నతికి అద్దంపడుతోంది.

ట్రాయ్ లో దొరికిన స్వర్ణహారకిరీటాలు, మైసీనియాలో దొరికిన స్వర్ణకిరీటాలు, విస్తారమైన మిగతా స్వర్ణరాశులు అప్పటి జనం ఇంకా మోటుగానూ, అనాగరికదశలోనూ ఉన్నట్టు సూచిస్తున్నాయి. సైనికులను చిత్రించిన కలశం నాటి యోధులు యుద్ధానికి ఎలా వెళ్ళేవారో చెబుతోంది. సమాధులలో దొరికిన బంగారు నగలు ఉత్సవ సందర్భాలలో వాళ్ళు ఎలా అలంకరించుకునేవారో వెల్లడిస్తున్నాయి. ఈ ఒక్క ముఖాచ్ఛాదన మాత్రం దేవతలపట్ల వారు ఎంత ప్రగాఢమైన భక్తిగౌరవాలను చాటేవారో సూచిస్తోంది.

మైసీనియాలో స్లీమన్ తవ్వకాలు ముగిశాయి.

(సశేషం)

 

 

 

 

 

మీ మాటలు

*