వాడు ఆకలిని జయించాడు    

 

 

ఆ రోజు సాయంకాలం క్లాసులో వెనుక కూర్చున్న పెద్దపిల్లల దగ్గర ఏదో హడావుడి కనిపిస్తోంది. ముందు కూర్చున్న పిల్లల హోమ్ వర్క్ చూస్తున్నాను.

చేతిలో పని ముగించి వెనుక వైపు వరసల్లో ఉన్నసునీల్ని, వాడి చుట్టూ చేరిన గుంపుని విషయం ఏమిటని అడిగేను. జాన్బాబు వెంటనే చెప్పేడు,

‘ టీచర్, సునీల్ సెల్ ఫోన్ పట్టుకొచ్చేడు. అందులో బోలెడన్ని పాటలున్నాయి’. నా అనుమానం నిజమే. ఇందాకటినుండి ఎక్కడో సన్నగా విన్పిస్తున్న సినిమా పాటలు ఇక్కణ్ణుంచే అన్నమాట.

‘సునీల్, ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు’

‘ ఆపేసేనులే టీచర్. ఇంక పాటలు వెయ్యను’ అన్నాడు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ని జేబులోకి తోస్తూ.

‘ నీకు సెల్ ఫోనెక్కడిది?’

‘ నేనే కొనుక్కున్నాను టీచర్’. అర్థం కానట్లు చూసేను.

‘టీచర్, వాడు పొద్దున్నే లేచి తాడిగడప సెంటర్లో కాఫీ హోటల్లో మూడు గంటలు పనిచేసి స్కూలుకి వస్తాడు. వాడి డబ్బులతోనే కొన్నాడు’ జాన్ నా సంశయం తీర్చేడు.

పన్నెండేళ్ల పసివాడు పనికి వెళ్లి సంపాదించటాన్ని ఊహించేందుకే కష్టంగా తోచింది.

‘ నిజమే టీచర్, మా పిన్ని పనిలో పెట్టింది. నాకు డబ్బు విలువ తెలియాలని, సంపాదించడం ఇప్పటినుండే నేర్చుకోవాలని చెప్పింది టీచర్.’ వాడి మాటల్లో ఒక నిర్లక్ష్యం!

‘ నువ్వు మీ అమ్మానాన్నల దగ్గర వుండవా?’

‘ వాడికి అమ్మ చిన్నప్పుడే చనిపోయింది టీచర్.  వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడుగా.  ఆవిణ్నిఅమ్మ అనకుండా పిన్నిఅంటాడు వీడు’ జాన్ చెబుతున్నాడు.

ఊహించని పరిస్థితి! నాకు బాధగా ఉంది ఇలాటి ప్రశ్న వేసినందుకు.

‘కష్టపడి సంపాదించి, ఇలాటి అనవసరమైన ఖర్చులు పెడుతున్నావా సునీల్? ఇంట్లో తెలిస్తే కోప్పడరూ?’

‘ఏం అనరు టీచర్. నేను సంపాదించే దానిలో కొంత డబ్బు నేనే ఖర్చు పెట్టుకుంటాను. అలా అయితేనే పనిలోకి వెళ్తానని మా పిన్నికి చెప్పేను.’ అంత ఖచ్చితంగా వాడు ఇంట్లో చెప్పడాన్ని ఆశ్చర్యంగా విన్నాను.

‘ నీ ఖర్చులు అంటే ఇలా సెల్ ఫోన్ కొనుక్కోవటమేనా? ‘

‘టీచర్, ఫోన్ అంటే నాకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం. మా బాబాయ్ ఎప్పుడూ కొత్తకొత్త ఫోన్లు వాడుతుంటాడు. అందుకే డబ్బులు పోగేసుకుని కొనుక్కున్నాను. అయినా ఇది కొత్త ఫోన్ కాదు టిచర్. నా ఫ్రెండు నాగు కొత్త ఫోన్  కొనుక్కుని వాడి పాత ఫోన్ నాకు మూడొందలకి అమ్మేడు. టీచర్, ఈ మూడొందలు పోగుచేసుకుందుకు నేను నెల రోజులుగా సాయంకాలం టిఫిన్ తినడం మానేసేను.’ గర్వంగా చెబుతున్నాడు.

ఉలిక్కిపడ్డాను. వాడి ముఖం వాడిపోయి ఉంది.

కొన్నాళ్ల క్రితం ఒకసారి సాయంకాలం క్లాసులో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

కార్తీక్ ఆరోజు కూడా క్లాసుకి ఆలస్యంగా రావడంతో నేను కోప్పడ్డాను. ‘ టీచరుగారూ, మా అమ్మ పనిలోంచి ఇప్పుడే వచ్చింది. అన్నం తిని వచ్చేసరికి ఇంత సేపయ్యింది.’ అన్నాడు కార్తీక్.

‘ మిగిలిన పిల్లలు అందరూ సమయానికి వస్తున్నారు, నువ్వు వారానికి నాలుగు రోజులు ఆలస్యంగా వస్తావు. సునీల్ చూడు. ఒక్కసారి కూడా ఆలస్యం చెయ్యడు. అందరికంటే ముందుగా వస్తాడు.’

‘ సాయంకాలంపూట వాడు అన్నం తిని రాడు టీచర్. అందుకే అందరికంటే తొందరగా వచ్చేస్తాడు.’

కార్తీక మాటలకి పౌరుషంగా చెప్పాడు సునీల్,

‘నేను స్కూలు నుండి వచ్చేప్పుడే సెంటర్లో టిఫిన్ తినేసి వస్తాను.’

‘మీ పిన్ని నీకు సరిగా అన్నం పెట్టదంట కదా, అందుకే నువ్వు బయట టిఫిన్ తింటావు. మా అమ్మ చెప్పింది’ కార్తీక్ మాటలకి పెద్ద గొడవే జరిగింది ఆరోజు.

సునీల్ కార్తీక్ మీద కలియబడబోతే వాళ్లిద్దర్నీ నేను విడదీయవలసి వచ్చింది.

‘ నాకు ఎవరూ పెట్టక్కర్లేదురా. నేనే సంపాదించి అందరికీ పెడతాను’ కోపంగా చెబుతున్నసునీల్ ముఖం ఎఱ్ర బడింది. ఆ గొడవతో సడన్ గా లేచి, ‘వెళ్లిపోతాను టీచర్’ అని చెప్పి ఆరోజు క్లాసులోంచి వెళ్లిపోయేడు.

సునీల్ ఫోన్ కొనుక్కుందుకు సాయంకాలాలు ఆకలితో గడుపుకున్నాడని వింటే గుండె పట్టేసినట్లైంది.

‘సునీల్, ఫోన్ కొనుక్కోవటం కోసం టిఫిన్ మానేసి, ఆకలితో క్లాసుకొస్తే నువ్వు చదువుకోగలిగావా? ముందు బాగా చదువుకోవాలి. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు‘

నా మాటలు పూర్తి కాకుండానే వాడు చెబుతున్నాడు,

‘చదువుకుంటాలెండి టీచర్. ముందు డబ్బు సంపాదించాలి. మా పిన్నికి నా సత్తా ఏమిటో చూబించాలి ’ వాడి మనసులో గాయం నాకు అర్థం అవుతోంది.

దేవుడు మాస్టారు వాకింగ్ ముగించి మా క్లాసు మీదుగా ఇంటికెళ్తున్నారు. ఆయన అక్కడ జరుగుతున్న విషయం గమనించినట్లున్నారు. క్షణం ఆగి అన్నారు,

‘ టీచరమ్మా, నువ్వేదో వీళ్లందర్నీ బాగు చేద్దామని అనుకుంటున్నావు కాబోలు. నీ తరం కాదు. వీడి సంగతి సరే, వీడిలాటి వాళ్లు సంపాదించిన దాంట్లో కొంత ఇంట్లో ఇస్తారు. ఏ కోడి కూరో చెయ్యమని పురమాయిస్తారు. అక్కడికి తామూ ఇంట్లో సంపాదించే మగాళ్లయ్యేరని అనుకుంటారు. ఇంటిల్లిపాదీ వీళ్లని అందలం ఎక్కిస్తారు. అంతేకాని తమ బ్రతుకులో పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని, వాళ్లని చదివించుకోవాలని ఎప్పుడూ అనుకోరు. దశాబ్దాలుగా చూస్తున్నా వీళ్లని. నాకు చేతనైనంత చెప్పి చూసేను. ఉహు, వీళ్లు మారరు.’

ఆయన మాటలు నాకు కష్టంగా తోచేయి. ’అలా అనకండి మాస్టారూ, మనం వీళ్లని మార్చే ప్రయత్నం చేద్దాం. చదువుకుంటే భవిష్యత్తు బావుంటుందని అర్థం అయ్యేలా చెబితే………’

నామాటలు పూర్తి కాకుండానే, ‘నీ ఓపిక తల్లీ, ఏం చేస్తానంటావో చేసుకో. నాకు మాత్రం ఓపిక లేదు’ చేతులెత్తి దండం పెట్టి మెల్లిగా ఇంటి వైపు వెళ్ళిపోయేరాయన.

అంత అనుభవం ఉన్న మాస్టారు అంత నిస్పృహగా ఎందుకు మాట్లాడేరు? ఈ పిల్లలకి నిజంగా ఎవరం ఏమీ చెయ్యలేమా?

మరునాడు కాస్త ముందుగా బయలుదేరి సునీల్ ఇంటికి వెళ్లేను. ఇంటి ముందు బియ్యం బాగు చేస్తున్న ఆమె బహుశా సునీల్ పిన్ని అయివుంటుంది. ఆమె తలెత్తి ఏమిటన్నట్టు చూసింది.

‘అమ్మా, మీరు పిల్లవాణ్ణి ఇప్పటినుండి పనిలోకి పంపుతున్నారు. చదువుకునే వయసు కదా. తెలివైన పిల్లవాడు. శ్రద్ధగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. మీ ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. కొన్నాళ్లు మీరు వాడి చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి’ ఆమె ముఖం అప్రసన్నంగా మారింది.

అక్కడే ఉన్న నులక మంచం మీద చుట్ట కాల్చుకుంటూ కూర్చున్న వృద్ధుడు మాత్రం సమాధానంగా మాట్లాడాడు.

‘ నా అల్లుడేమైనా ఆఫీసరుద్యోగం చేస్తున్నాడా టీచరమ్మా? పిల్లోడూ ఓ చెయ్యి సాయం చేస్తేనే సంసారం నడిచేది. నాకూతురు సవితి కొడుకని ఆణ్ణి పనిలోకి పంపట్లేదు. ఇంట్లో కూర ఆకుకి వస్తాయని పంపుతోంది.’ మనవడి సంపాదనలోనే తన చుట్టల ఖర్చునడుస్తోందన్న విషయాన్ని మాత్రం అతను చెప్పలేదు.

‘ అలా కాదండీ. చదువుతో పాటు పనిచేసే శక్తి, సమయం పిల్లలకుండదు. వాళ్లు చదువుమీద పూర్తిగా ధ్యాస పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా చిన్నపిల్లల్ని పనిలోకి పంపటం నేరం అవుతుంది, మీకు తెలుసా?’

‘అంటే ఏంటి, మామీద కేసెడతారా? ‘ అసహనంగా అడిగిందామె. ఇంతలో సునీల్ రానే వచ్చాడు.

‘ ఏరా, పని ఎగేసేందుకు టీచరుగార్ని మామీదకి ఉసిగొల్పుతున్నావా?’ వాడిమీద చెయ్యెత్తిందామె. వాడు దెబ్బ తప్పించుకుంటూ లోపలికి పరుగెత్తాడు. తెల్లబోయాను. ఏం చెప్పాలని వచ్చాను, ఏం జరుగుతోంది?!

‘ టీచరమ్మా, మా ఇంటి విషయాల్లో, పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకు. చదువు చెప్పడానికొచ్చేవు. అంతవరకే’ విసురుగా బియ్యం చేటతో సహా లోపలికి వెళ్లిపోయిందామె.

 

మీ మాటలు

  1. ముందుగ సారంగ వారికి, రచయిత్రిగారికి ధన్యవాదాలు.
    ఎక్కడుంది లోపం? విద్య , దాని ఆవస్య్స్కత, ఉపయోగం తెలియచేప్పలేని తల్లితండ్రులా? బాలకార్మిక చట్టం ఖటినంగా అమలుపర్చలేని ప్రభుత్వాల? దుర్బ్గరంగా వున్నా జీవన పరిస్తితులా?
    పిల్లాడు తనtindi తనే సంపదిన్చుకోగాలుగుతున్నాడని సంతోషించాలా? ఈక్రమంలో డబ్బే సంపాదించాలనే కసి వాడిలో పెరిగిపోతుంది . ఏది ఏమైనా ఇంటువంటి సమస్యలని ధైర్యంగా మన ముందుకు తెస్తున్న అనురాధగారు అభినందనీయులు . ప్రభుత్వాలు , ప్రజలు కంకణం కట్టుకుంటే సాదించ లేనిదేది లేదు .

  2. jaya reddy boda says:

    కథ బాగుంది .. మేడం

  3. Sitha challa says:

    పవర్ఫుల్ స్టొరీ. 12 సంవత్సరాల పిల్లవాడు పరిస్తుతుల ప్రభావంతో జీవితాన్ని ఎటువైపు తీసుకుని వెడతాడు? ఓన్లీ చదువు సరిపోదు, పెద్దవాళ్ళు సపోర్ట్ కావలి వాళ్ళ అభివృధికి. మార్పు వస్తోంది, మనం అనుకున్న దానికంటే మెల్లిగా. కాని టీచర్స్ మీద బోలెడు బరువు వుంది!! థాంక్స్ టీచర్స్!!

  4. వనజ తాతినేని says:

    ఇలాగే అంటారు ..మంచి చెప్పబోతే ! చదువుకునే వయసు దాటిపోయ్యాక ఎదగలేక ఈదలేక దురలవాట్లకి లోనై బాగున్న వాళ్ళపై కసి పెంచుకుంటారు. ప్రయత్నం చేయాలి ఆపకూడదని మీ మాటే నేను అంటాను … అనూరాధ గారు .
    ఎన్ని కథలు … ఈ పిల్లల వెనుక . మీకు మనసారా అభినందనలు.

  5. suryanarayana n says:

    రచయిత్రిగారికి అనురాధ గారికి అభినందనలు ఇటువంటి కథలను ఎంచుకోన్నదుకు.
    సమాజం లో ఉన్న పరిస్తితులను చక్కగా వివరించారు. నేటి సమాజంలో పిల్లలలో వారి పోషణ మరియు సంపాదన మీద ఉన్న ఆసక్తి చక్కగా వివరించారు రచయిత్రి గారు. నేటి సమాజంలో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరణ బాగుంది. సమాజంలో పెద్దలు పునికొని ఇటువంటి సమస్యలు పారిస్కరించాగాలరని బావిస్తున్నాను. చదువు ఒక్కటే సరిపోదు, పెద్దల ఆదరణ కావాలి వాళ్ళ అభివృధికి. అడిజరిగిన్నాడు మార్పు తప్పక వస్తుంది

  6. nadella lakshmi padmini says:

    చదువుతో పాటు పనిచేసే శక్తి, సమయం పిల్లలకుండదు. వాళ్లు చదువుమీద పూర్తిగా ధ్యాస పెడితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా చిన్నపిల్లల్ని పనిలోకి పంపటం నేరం అవుతుంది,

    అమ్మా, మీరు పిల్లవాణ్ణి ఇప్పటినుండి పనిలోకి పంపుతున్నారు. చదువుకునే వయసు కదా. తెలివైన పిల్లవాడు. శ్రద్ధగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతాడు. మీ ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. కొన్నాళ్లు మీరు వాడి చదువు బాధ్యత పూర్తిగా తీసుకోవాలి..

    రచయత్రి అనురాధ గారు పైన రాసిన రెండు విషయాలు మనందరికీ తెలిసినవైన, ఐతే నేటి సమజమలో ఉన్న పరిస్తితులు ఆర్ధిక ఇబ్బందులు దాటటానికి తప్పని పరిస్తితులలో పిల్లలని చూడకుండా వారిని పనిలో కి పంపిస్తున్నారు అని పిస్తుంది. నేటి ప్రభుత్వాలు సమజానికి అవసరమైని చట్టలు చేసి, పేదవారి ఆర్ధిక ఇబ్బందులు మీద అద్యయాననం చేసి వాటిని తొలగించటానికి మరిన్ని పధకాలు ప్రవేశ పెట్టాలి.

  7. సునీల్ పిన్ని అన్న మాటలకి ఒళ్ళు గగుర్పొడిచింది!! ఉచిత సలహా మరియు ఉచిత విద్య కి రోజులు కావు ఇవి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు. గూడెం కధలు ప్రతి ఎపిసోడ్ ఎంతో బాగా వర్ణిస్తున్నారు రచయిత్రిగారు

  8. sreedevi canada says:

    సునీల్ లాంటి పిల్లలు ఏదైనా ఛాలెంజ్ గా తీసుకుంటే సాధించలేనిది లేదు. సెల్ ఫోన్ కోసం ఆకలి చంపుకుని డబ్బులు పోగు చేసేడు, అదే మార్కులు మరియు డిగ్రీస్ ఛాలెంజ్ గా తీసుకుంటే ఎంతో అభివ్రుది కి వస్తాడు. ఇది ఎలా , ఎవరు చెప్పగలరు. పిల్లలు మొదలు ఇంటి నుండే నేర్చుకుంటారు కదా మరి ఇంటిలో ఇలాంటి పరిస్థితి ఉంటె చదువు మీద ఫోకస్ ఎలా పెట్టగలరు. మన సమాజం లో ప్రగతి నత్త నడక నడుస్తున్నమాట క్లియర్ గా ఉంది.

  9. We can try to change the gudem people but there are so many factors .Anuradha Garu is trying to reveal the shocking scenario of the part of the society. All the best madam.

  10. మామూలు గా స్కూల్స్ లో ప్రిన్సిపాల్ పేరెంట్స్ పిలిచి చెప్పటమో లేదా ఇంటికి నోటీసు పంపడమో చేస్తారు. గూడెం లో టీచర్ ఎంతో ప్రేమతో ఈ విధం గా సమాజ సేవ చెయ్యడాన్ని కొందరు అలుసుగా తీసుకోవడం బాధాకరం.

  11. టీచర్ గూడెం లో పిల్లలకి విద్యా దానం చెయ్యడమే కాకుండా ఒక మెట్టు పైకి వెళ్లి ,ఇంటికి వెళ్లి నచ్చ పెద్ద వాళ్లకి చెప్పడం ఎంతో నచ్చింది. కేవలం చదువు చెప్పడమే కర్తవ్యమ్ అని కాకుండా పిల్లలని పైకి తేవాలనే తపన ఎంతో బాగా రాసేరు. కథ ఎంతో కళ్ళకి కట్టినట్టు రాసేరు. నాకు చిన్నప్పటి రోజులు గుర్తు వచేయి, కొత్త గాజులు, బొట్టు బిళ్ళలు, చెవుల రింగులు కొనుక్కున్న రోజుల్లో చివరి బెంచిల్లో చేరేవాళ్ళం.

  12. chandrika says:

    అందుకే ఇలాంటి వారికి విద్యావిధానం వృత్తి విద్య ఆధారం గా ఉండాలి. Pottery, బొమ్మల తయారీ లాంటి హస్త కళలలో శిక్షణ ఇవ్వాలి. Fine motor skills తో చిన్న వయసు లోనే సునాయాసంగా నేర్చుకోగలరు. మాములుగా చదువుకునే పిల్లలే ఫండ్ రైసింగ్ అంటూ ఎన్నో పన్లు చేసి చూపిస్తుంటారు. ఇలాంటి విద్యావిధానం తో చదువు, ఒక జీవనాధారం కూడా. మాములు విద్యార్థులకి చెప్పినట్లు ఇప్పుడు చదువుకో ఎప్పుడో బాగుపడ్తావు అంటే రోజు కూలి చేసుకునే వారికీ అవ్వదు కదా !! ఇక్కడ కథలు, కవిత్వాలు వ్రాసే రచయితలు/రచయిత్రులు ఎన్నో సమస్యల గురించి వ్రాసే బదులు ఇలాంటి గురువులకి సహాయం గా ఇలాంటి పనులకి పూనుకొంటే బావుంటుంది.

  13. Lakshmi ramesh dasika says:

    today i read an article in telegraph newspaper (assam edition) “Little Migrants”. Over the past few years, the “work for ఎడ్యుకేషన్” concept has seen several children from hamren subdivision (karbi అంగ్లోంగ్ District) migrate to nagaon డిస్ట్రిక్ట్ for education. They stay with the families there , work for them and in return they get an opportunity to go to school. The girls assist in cleaning and the boys take the cattle to the fields. sunil విషయంలో కూడా తప్పులేదు. చదువుకుంటూ సంపాదించుకుంటున్నాడు . వాళ్ళకి సంపాదించకపోతే రోజు గడవదు. వాళ్ళని చదువుకోమని encourage చేస్తూ, if possible financial assistance చేస్తే చాల helpful గా వుంటుంది.

  14. seshu chebolu says:

    ఎప్పటి లాగే ఈ సారి గూడెం కధ కూడా మనలని అలోచించేలాగా చేస్తోంది. సునీల్ లాంటి విద్యార్థులు ఆకలిని చంపుకుని తమకి కావలసినవాటి కోసం పట్టుదలగా పని చెయ్యగలరు. ఆ వయసు పిల్లలిని సరైన గాడిలో పెడితే ఎంతయినా వృద్ధిలోకి వస్తారు. అనురాధగారి లాంటి టీచర్లు మన సమాజానికి అవసరం. పాఠాలు చెప్పడమే కాక ఇంటికి వెళ్లి తల్లి తండ్రులలో పరివర్తన తేవాలనుకోవడం చూస్తే ఆమె ఎంత సిన్సియర్ గా సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుస్తోంది. Hats off to అనురాధగారు!!

  15. Rajeswari says:

    అందుకే ఈ లాంటి విద్య ఉండగుడదు ఏదన్న మెకానిక్ షాప్ ఉంచితే బాగా పని నేర్చు కుంటారు. వాళ్లకు జ్ఞానం అక్కర్లేదు. జ్ఞానం వస్తే సమాజానికి ఎదురు తిరుగుతారు.

  16. Rajeswari says:

    ఈలాంటి వారికి అని చదువుకోవాలి

    • Rajeswari says:

      నా కామెంటు మీద ఎవరైన స్పందిస్తారనుకున్నాను. నేను వ్యక్తం చేసిన అభిప్రాయం పై వర్గాల వారిది. అందు వల్లనే ఇటీవలి కాలంలో యూనివర్సిటీ లలో వ్యక్త మవుతన్నది. దీన్ని ఆదరించడం వారు చాలామందె ఉంటారు. కాని రచయిత్రి ఒక పసి వాని ఆత్మ గౌరవాన్ని మనకు చూపించడం చాలా బాగుంది.

  17. lakshmi yanamandra says:

    మరలా రచయిత్రి గారు ” వాడు ఆకలిని జయించాడు ” తో చాల రోజులు తర్వాత వచ్చిన ఈ కధను (నిజ జీవితం లో జరిగే కధను) బాగుగా వివరించారు. మనము ఎవరి ఆలోచనైన కొంత వరుకు మార్చ గలిగితే చాలు ఈ కధ అంత గా ప్రభవితం చేయాలి . పిల్లలు గురించి ఇంత గా ఆలోచించే టీచర్స్ చాలా చాలా అవసరం. నాకు మాత్రం” సునీల్” లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించిది కాని అతను బాగుగా చదువుకుంటే అతను ఏది ఐనా సాధించ గలడు.

  18. రాజేశ్వరి గారు , నాకు మనస్సు చివుక్కు మంది మీ కామెంట్ చూసి. మొదట ‘ఇలాంటి వారికి ‘ అని తేడా చూపించడం , రెండు ‘విద్య అక్కర్లేదు ‘ అనడం.
    ఇలాంటి కథలతో మనలో ఎన్నో ఆలోచనలు రావడం మంచిదే కాని విద్య అన్నది ఒక్క ఉద్యోగం/డబ్బులు కోసమే అన్న ఆలోచన కూడదు.
    మీరు అన్నట్లు వారికి వృతి విద్య ముఖ్యం కాని ఆ పిల్లల వయసు చూడండి, కొన్ని ఇళ్ళలో ఇంకా గోరుముద్దలు తినిపిస్తారు. టీచర్ తనకున్న టైం లో సమాజ సేవ చెయ్యడం అందరూ హర్షించట్లేదు అని తెలుస్తోంది. వేలకి వేలు ఫీజు కట్టి స్కూల్ కి పంపితేనే విద్యకి విలువ ఉన్నట్టు ఉంది.
    శేషు చేబోలు గారు చెప్పినట్టు పాఠాలు చెప్పడమే కాక ఇంటికి వెళ్లి తల్లి తండ్రులలో పరివర్తన తేవాలనుకోవడం చూస్తే టీచర్ ఎంత సిన్సియర్ గా సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారో తెలుస్తోంది.

  19. ‘జ్ఞానం వస్తే సమాజానికి ఎదురు తిరుగుతారు’ అన్నది కూడా చాల తప్పుగా అని పించింది. ఆ పిల్లలే చదువుతో ఎంతో మర్యాదగా ఉంటున్నారు, నేను గమనించిన వాళ్ళు.

  20. మా నాన్న అనేవారు రెండు ముక్కలు చదువుకునే సరికి నాకే చెప్తున్నాడు .
    చెప్తే తప్పు ఏమిటి , వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉండాలనుకునే మనస్తత్వాలు మనవి . ‘జ్ఞానం వస్తే సమాజానికి ఎదురు తిరుగుతారు’ అన్న తీరు మారాలి . చదువుకున్నాడు కనుక ఏదో తెలిసింది చెప్పడం లో తప్పు ఏమిటి?
    వృతి విద్య అంటే రాళ్ళు మోసి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అవడమా ? ఆ వయసుకి వృతి విద్య ఏమిటి? కనీసం 14 రావాలి కాయ కష్టం చెయ్యాలంటే .
    ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా !!

    • chandrika says:

      చంటి గారు!!వృత్తి విద్య అంటే కాయకష్టం ఒక్కటే కాదండి . దాని క్రిందికి చాలా వస్తాయి. డబ్బులు ఎక్కువై చేసే extra curricular activities వీటిల్లోకే వస్తాయి. అయినా ఈ రోజుల్లో చదివిన చదువుకి చేసే ఉద్యోగాలకి సంబంధం ఉండట్లేదు. అలాంటప్పుడు వీటితో పాటు చదువు నేర్పిస్తే వారే పదిమందికి రేపు ఉపాధి కల్పిస్తారు. Creativity, marketing అనేది కావాలి. ఆ అవగాహన లేకపోవడం వలన దేశం చాలా నష్టపోతోంది. అది పల్లెల్లో తీసుకురాగలితే బావుంటుంది. ఎంత సేపు మనకి వచ్చింది వితండవాదన అమాయక జనాన్ని రెచ్చగొట్టడం. నా వాదమే నెగ్గాలి అన్న తపన. ఇది పోతే మన దేశం సగం బాగుపడ్తుంది.

  21. chandolu chandrasekhar says:

    ఏమిటి ఈ చర్చ .లంపెన్ ఎలిమెంట్ వున్నా కథ ని వాడు ఆకలి జేయించాడు టైటిల్ పెట్టి ,వాడికేదో ఆత్మ గౌవరమ్ వున్నట్టు .వాడిమీద సెల్ ఫోన్ చిన్న విషయం కాదు . వాడు దాన్ని adult film కి వాడొచ్చు . పిల్లల వెట్టి చాకిరి మిద ,లేదా సామాజికంగా వారు విద్య కి ఎలా దూరం అయ్యారు ,వాటి స్తితి గతుల . బాల్యాన్ని కోలుపోవటం , వాడు కోల్పోయిన దానిని తిరిగి పొందటం ఆత్మ గవురమ్ అయుతుంది . ఎంత మాత్రం ఈ కథ సమర్ద్దనియం కాదు

  22. Rajeswari says:

    చంద్రశేఖర్ గారు, ఏది లంపెన్ ఎలిమెంటరీ. ఇక్కడ సెల్ పోన్ అన్న వస్తువు ఉపయోగం ఏమిటి అన్నది ముఖ్యం కాదు. చేతిలో ఉన్న వస్తువు దాన్ని ఉపయోగించే ఆలోచనను బట్టి అది ఉపయోగపడే విదానం ఉంటుంది. అది ఈనాడు అత్యంత సాదరణమైన పరికరం.దాన్ని ఉపయోగించే మనుషులె ముఖ్యం. ఈనాడు ఉన్న సాంకేతిక తను మానవ గమనానికి ఉపయోగించ వచ్చు మానవ కల్యాణానికి ఉపయోగించ వచ్చు అంతమాత్రాన సాంకేతిక త అవసరం లేదంటున్నామా? దాన్ని లంపెన్ ఎలిమెంట్ అంటారా? ఆపసివాడు సాధించే విధానమే కధాంశం.

  23. Rajeswari says:

    మానవ గమనానికి అని గమనించ గలరు.

  24. Seshu konduri says:

    సెల్ ఫోన్ పక్కన పెడితే డబ్బు కోసం చిన్న చిన్నpanlu చేసుకోడం తప్పు కాదు కాకపోతే వాడి aalochanalalo మార్పు తేవాలి ప్రిఒరితిఎస్ వాడికి అర్ధమయ్యేలా చెప్పాలి ఈపని ఒక్క టీచర్ మాత్రమే చెయ్యగలదు ఇంటి పరిస్తితుల్ని ఎలాగా మార్చలేము ఈkonamani సునిల్ని మౌల్ద్ చెయ్యాలి రచయిత్రి ఈసారి వ్రాసే కథల్లో ఆకోణంలోఆలో చిస్తే బాగుంటుంది సమస్యని ప్రెసెంట్ chest unna విధానం రచయిత్రి చాల బాగుంది

  25. anuradha nadella says:

    ఎప్పటిలాగే గూడెం కథని చదివి అభిప్రాయాలను పంచుకున్న ఫ్రెండ్స్ అందరికీ థాంక్స్. పిల్లలు పేదరికం వలన తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. ఆర్ధిక పరిస్థితుల వలన పని చెయ్యవలసిన అవసరం, బాధ్యత ఉన్నప్పుడు చదువుకుందుకు వాళ్లకి తక్కువ సమయం ,అవకాశం మిగులుతాయి. వాళ్ల శక్తి చాలదు కూడా. వాళ్లకి చదువు అవసరం బోలెడు ఉంది.వాళ్లు ప్రపంచాన్ని తెలుసుకోవాలి, మంచి చెడ్డలు విచక్షణ తెలుసుకోవాలి, ఇంకా … జీవితంలో ఎదగాలి కదా.
    ముందుగా పిల్లలకి చదువు విలువ పదేపదే చెబుతూనే ఉండాలి. వ్యక్తిగతంగానే కాక కుటుంబాన్ని మెరుగైన స్థితిలోకి తీసుకురావటానికి కూడా చదువే మార్గం .కానీ కొందరు మిత్రులు చెప్పినట్టు చదువు పూర్తి అయి, జీవిక దొరికేంత వరకు చాలా సమయం పడుతుంది కనుక , చదువుతో పాటు పిల్లల అభిరుచిని బట్టి వృత్తి విద్యనూ నేర్పించే విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెడితే వాళ్ళకు, వాళ్ల కుటుంబాలకు ఎంతో మేలు చేసినట్టవుతుంది . ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే పేదరికం గురించి, అవిద్య గురించి ప్రత్యేకం గా దిగులు పడవలసిన అవసరం ఉండదు. ఆ మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తూ …..అనూరాధ

  26. d g sekhar says:

    చాల ;బాగుంది సునీల్ లాంటి చాకు లాంటి కుర్రవాళ్ళకి సరైన చేయూత దొరికితే చాల మంచి పౌరులుగా మారుతారు. గవర్నమెంట్ అలాగే నాన్ గవర్నమెంటల్ organisations ముందుకి వత్చి చైల్డ్ లేబర్ ని గట్టి గ నిషేధించి పిల్లలకి compulsory ఎడ్యుకేషన్ ఇంప్లేమేంట్ చెయ్యలి. రచయితా కి ఇటువంటి మంచి రచనని చేసినందుకు ధన్యవాదములు.

మీ మాటలు

*