మన వాదమూ.. మనువాదమూ..

 

 

   -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi అన్నా.. కేసీఆరన్నా..

యేమి సెప్పినావే.. దిమాక్ కరాబయిపోయిందనుకో! అసెంబ్లీల నీ మాటలు యిన్నం! చాన మంచిగున్నాయ్! మర్సిపోలేకుంటున్నం! సుద్దులూ సామెతలూ ముద్దు ముద్దు మాటలూ మంచిగ ముచ్చట్లూ మస్తుగ సెప్పి నవ్వించెటోనివి! నువ్వు యెంత సీరియస్సుగ సెప్పినావే?! నువ్వు గింత సీరియస్సుగ సెప్పినావంటే.. డవుట్లేదు.. గిది.. గిది సత్యప్రమానకంగా సీరియస్సు  యిషయమే!

నువ్వు వుస్మానియా యూనివర్సిటీల ఎమ్మే తెలుగు సాహిత్యం సదివొచ్చినోనివి! నువ్వు సామాన్యునివా? యెనభై వేల పుస్తకాలు చదివినోనివి! దేశమెట్టుందో యూనివర్సిటీలు యెట్టున్నాయో నీకు గాకపోతే యెవరికి తెలుస్తుంది? నువ్వు గాపోతే యూనివర్సిటీ పోరగాల్లకి యెవలు సెప్పాలే? సెప్పి సెడ్డయిందేమి లేదు! నువ్వు వున్న మాటే సెప్పినావ్!

ఉన్నమాట సెప్తే వూరినాయుడికి కోపమని సెప్పడం మానేస్తామా? మన సంస్కృతేంది? మన సాంప్రదాయమేంది? కతేంది? కార్ఖానా యేoది? గాచారం కాకపోతే యూనివర్సిటీలల్ల యీ లొల్లేంది? హెచ్సియ్యూ జేయెన్యూ వొకటేమిటి.. దేశంలో యూనివర్సిటీలల్ల యీ అగ్గి రాజుకొనుడేంది?

ఈ సమయంల నీ మాటలే యాదికొస్తున్నాయన్నా..

“రోహిత్ వేముల గురించి మాక్కూడా సానుభూతి వుందధ్యక్షా.. కాని ఇష్యూ చెయ్యదలచుకోలేదు మేము.. దాన్నో పెద్ద ఇష్యూ చేసి గందరగోళం చెయ్యదలచుకోలేదు.. కారణాలు తెలుసుకున్నాం.. తగిన స్టెప్స్ తీసుకున్నాం.. దాన్ని ఖండించినాం.. అటువంటివి జరక్కూడదు.. అటువంటివి యెందుకు జరుగుతున్నాయధ్యక్షా.. దురదృష్టకర సంఘటనలు? ఢిల్లీల జేయెన్యూలో జరిగినా.. ఈడ మన దగ్గిర యిక్కడ సెంట్రల్ యూనివర్సిటీల జరిగినా దురదృష్టకరం.. ఐ హేవ్ కండెమ్ముడిట్.. యిటువంటి వాటికి ఆలవాలంగా మారుతున్నాయ్.. ఫిలాసఫీలూ సిద్ధాంతాలూ గుంచకపోయి యూనివర్సిటీలల్ల పెట్టి లేని జగడాలు పుట్టించి.. బీఫ్ ఫెస్టివల్.. కిస్ ఫెస్టివల్ అట అధ్యక్షా..  భారత దేశంల కిస్ ఫెస్టివల్ని వొప్పుకుంటారా అధ్యక్షా.. వొకడు కిస్ ఫెస్టివల్ అంటాడు.. యెన్నో రకాలు పెట్టి యేందేదో చేసి.. వాటన్నిటిని వొక చిత్ర విచిత్ర సంస్థలుగా తయారు చేసినారు.. ఆ పరిస్థితి పోవాలి.. పోవాల్నంటే దాన్ని పరిపాలన చేసేవాళ్ళు.. దానికి వైస్ ఛాన్సులర్ గా వుండే వాళ్ళు.. పటిష్టమైనటువంటి వాళ్ళు రావాలి.. దానికోసం మేము డిలే చేసినాము అధ్యక్షా.. ఐ థింక్ షార్ట్లీ- సెర్చ్ కమిటీవాళ్ళు రిపోర్ట్ యిస్తే అద్భుతంగా..” అని మీరెంత అద్భుతంగా మాట్లాడిన్రు!?

కవితక్క స్థాపించిన తెలంగాణ జాగృతి తరుపున వొకట్రెండు రోజులు కార్యకర్తలు దత్తాత్రేయ యింటిముందు గొడవకు దిగి సప్పుడు సెయ్యకుండా సక్కగున్నరు! మన యంపీ విశ్వేశ్వరరెడ్డి సారయితే రోహిత్ దళితుడే కాదని, ఆ అబ్బాయి చనిపోవడానికి వేరే కారణాలున్నాయని సెప్పాల్సింది సెప్పి సప్పుడు సెయ్యకుండున్నడు! పార్లమెంటుల మరొక యంపీ జితేంద్ర రెడ్డిసారు “దత్తాత్రేయ గురించి కేర్ తీసుకున్నాము, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు యిస్తే మేము వ్యతిరేకించాము” అని మన సపోర్టు ఫుల్లుగ సూపించారు! హెచ్సియ్యూకు అన్ని రాజకీయ పక్షాలు వొచ్చినా  బీజేపీ తోటి మీరు కూడా యెవరూ వెళ్ళకుండా సక్కగ వున్నరు! అలా కేంద్రంతో అందరూ యెంతో మంచిగున్నరు! కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటివి చానా ముఖ్యం! అందరూ కలిసి కేంద్ర రాష్ట్ర సంబంధాల్ని బలోపేతం చేసిండ్రు! రాష్ట్రానికి కావలసినవన్నీ తెచ్చుకోవాలె! అడుక్కు తెచ్చుకోవాలె! మద్దతు యిస్తున్నట్టే వుండాలె! ప్రజల మద్దతు ఆలకి పోకూడదు! ఆంధ్రోళ్ళ చంద్రబాబుతో కేంద్రానికి యెంత కవరు చేసినాగాని చెడింది.. మనం కేంద్రాన్ని మంచిగ మచ్చిక చేసుకోవాలె!

మీరు యిన్నిన్ని పాట్లు పడతాంటే యూనివర్సిటీ పోరాగాండ్లకు తలకి యెక్కుత లేదు! ఎకసెక్కం చేస్తాండ్రు! ‘మీ కేసీఆర్ చెండీ యాగం చేసినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! యాదాద్రికి అన్నన్ని నిధులు యిచ్చినప్పుడు లేదా?’ అని అడుగుతాండ్రు! మిమ్మల్ని మనువాదులని ముద్రవేస్తాండ్రు! ఆమాటకొస్తే దేశంల నాయకులందరూ మనువాదులేనట! వాళ్ళ ప్రతినిధులేనట! హిందూ మతమే అధికార మతంగా ప్రభుత్వాల అభిమతంగా- రాష్ట్రాల దేశాల మంత్రులందరూ ప్రజా ప్రతినిధులందరూ శంకుస్థాపనలకడ ప్రారంభోత్సవాలకడ వొకటేవిటి అన్నీట్లకడ- వేద మంత్రాలతో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టడం లేదా..?’ అని నిలదీస్తుండ్రు! ‘ఎవరి విశ్వాసాలు ఆలకి వుండవా?’ అని అడిగితే- “మల్ల.. మావిశ్వాసాలు మాకుండవా..?” అని వుల్టా అడుగుతాండ్రు! ‘ఎన్నో విశ్వాసాలకి – భిన్న విశ్వాసాలకి వేదికలు యూనివర్సిటీలు..’ అని మనకి తిరిగి పాఠాలు చెపుతాండ్రు! చెడిపోయిండ్రన్నా.. చదువుకున్న పోరగాండ్లు పూర్తిగా చెడిపోయిండ్రు!

తెలంగాణ పోరాటంల ముందుండి నడిసినారు బాగుంది! ఉద్యమాలు చేసినారు బాగుంది! ప్రాణ త్యాగాలు చేసినారు బాగుంది! ప్రత్రేక రాష్ట్రం సాధించినారు అదీ బాగుంది! అక్కడితో ఆగాలి గదే.. రాష్ట్రం సిద్దించింది రాజకీయాలు వొదిలి చదువుకోవాలి గదా.. మళ్ళీ యీ పోరాటాలు యేoదన్నా? ఇలాగుంటే బంగారు తెలంగాణ అస్తదా?

అన్నా.. కుర్రాళ్ళు ముదిరిన్రు అన్నా! మీరు బ్రాహ్మణ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. క్రిస్టియన్ సంఘాలకు వెల్ఫేర్ బిల్డింగ్ కు నిధులిచ్చినట్టు.. భూమిలేని దళితులకు మూడెకరాల పొలం యిస్తామన్నట్టు.. బీసీలకు పెద్ద పీట వేస్తామన్నట్టు.. ఆదివాసీలకు కొమరంభీం బిల్డింగ్ నిర్మించి ఆదుకుంటామన్నట్టు.. ఆంధ్రా సెట్లర్లకు మేమున్నాం అని భరోసా యిచ్చినట్టు.. అన్ని వర్గాల ప్రజలని యెలా మీరు ప్రతినిధులుగా కలుస్తున్నారో- అచ్చంగ అలాగ మేమూ అన్ని వర్గాల ప్రజల ఆలోచనలకు ఆశయాలకు భావజాలాలకు ప్రతినిధులుగా వుంటారట.. మాట్లాడతారట..!

సమాజంలో వున్నన్ని వర్గాలు – యూనివర్సిటీలల్ల కూడా వుంటాయని – మీ ఫిలాసఫీ సిద్ధాంతమూ మీకున్నట్టే మా ఫిలాసఫీ సిద్ధాంతమూ మాకుంటుందని తెగేసి అంటున్నారన్నా.. ఏమైనా స్టూడెంట్లతో ప్రాబ్లం అన్నా.. ప్రత్యేక తెలంగాణ వరకే విద్యార్థులకు రాజకీయాలతో సంబంధం వుండాలిగాని.. యిదేటన్నా యిది..?

మనం కొద్దిగ జాగర్త పడాలన్నా! బీఫ్ తిన్నారని చంపేస్తే- ఫ్రిజ్ ల బీఫ్ వున్నాదని అనుమానించి చంపేస్తే- తినే తిండి మీద మీ పెత్తనమేంటని అడిగిన్రు! మా తిండి మేం తింటాం అని బీఫ్ ఫెస్టివల్ పెట్టిన్రు! అలజడి సృష్టించిన్రు! కాలికట్ ‘డౌన్ టౌన్’ రెస్టారెంట్ల వొక ప్రేమికుల జంట ముద్దులు పెట్టుకుంటే- రెస్టారెంటు మీద దాడి చేసిన్రని మోరల్ పోలీసింగ్ చేసిన్రని.. మీడియాల మాట్లాడుతూ పోరగాల్లు ముద్దులు పెట్టుకొని గిది మా పోరాటం అన్నరు! దేశంల యూనివర్సిటీలల్ల కిస్సు ఫెస్టివల్ జరిపిన్రు! రచయితల్ని ముగ్గుర్ని వరసగ సంపితే అవార్డులను అందరూ వెనక్కిచ్చినట్టు – పదిమంది పోరగాల్లు యూనివర్సిటీల వుసురు తీసుకుంటే వంద వెయ్యీ కాదు లక్షలమంది కదిలిన్రు! మీకివన్నీ తెలియవని కాదు, జర మనం సైలెంటుగ వుంటే అరిచి ఆల్లే నాలుగు రోజులకి కాకపోయినా నాలుగు నెలలకి అలిసిపోయి బతుకాగంల బడిపోతరు! కాంట్రాక్టు వుద్యోగుల్ని రెగ్యులరైజు చేస్తామంటే మరి మా కొలువులో అని నిన్నే కాదన్నరు. ఛలో అసెంబ్లీ అన్నరు. నువ్వు సేయిన్చాల్సింది సేసినావా లేదా? ఆంధ్ర పోలీసులలెక్క భగ్నం చేయించినవ లేదా? ఇయ్యాల యూనివర్సిటీలోకి కన్నయ్య రాక కన్నా ముందు వీసీ పోదిలి అప్పారావుని మళ్ళా దించితే – నీవంతు పోలీసు ఫోర్సు అందించినవ లేదా? పోలీసుల్ని దింపి అద్బుతంగా లాఠీఛార్జీలూ అరెస్టులూ సేయించి అదుపులోకి తెచ్చినవ లేదా? నువ్వు యేదయినా సెయ్యగలవే అన్నా.. నా ఆవుసు పోసుకొని నువ్వు సల్లగ వుండాల.. మరి నాలుగు కాలాలు మమ్ము పాలించాల..

అన్న.. ఆఖరుగ  వొక్క మాటే! రెడ్డిగార్లు అదికారంల వున్నప్పుడు అందరూ రెడ్డిగార్లదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! కమ్మగ చౌదరీలు అదికారంల వున్నప్పుడు అందరూ కమ్మలదే ఛాన్సు! ఆల్లే ఛాన్స్’లర్లు! మరి మన దొరల రాజ్యం వొచ్చింది! దొరాలకి న్యాయం చెయ్యవానే? మళ్ళీ సియ్యమ్ము సీటు దళితులకే అని యెనకటికి అన్నట్టు అనబాకు! ప్రతిపక్షమే లేకండ అందరొచ్చి మనపార్టీల చేరిండ్రు! ప్రతొక్కనికీ పంచాల గదా? పీటెయ్యాల గదా? అలగని మనోళ్ళకు అన్యాయం చెయ్యకు! మన వర్గమోల్లకు! వర్గమంటే కులమే గదనే! అన్నీ తెలిసినోనివి.. నీకేం సెప్పేది? ప్రేమతోటే సెప్పేది! తప్పులుంటే మన్నించు..!

జిందాబాద్.. జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్..!

అన్నా దండమే!

యిట్లు

మీ

వీరాభిమాని!

 

 

 

 

మీ మాటలు

  1. THIRUPALU says:

    వీరాభి మాని గారు,
    ముబైల్ యూనివెర్సిటి మీ సియమ్ము గారు గురించి బాగానే పొగిడారు.
    బాగుంది.

  2. Buchireddy gangula says:

    భాగుంది Rao Garu .
    కెసిఆర్—అతడు దొర ఏ కదా/
    నడుస్తుంది దొరల -పాలన
    మారింది అంటూ ఏమి లేదు
    వేములవాడ గుడి కి. 50 కోట్లు మంజూర్..???నాయకుడు ?????
    సొల్లు కూతలు కూయడం తప్ప
    ———————————————
    బుచ్చి రెడ్డి Gangula

  3. శ్రీనివాసుడు says:

    **రాజుగారు ధరించేది దేవతావస్త్రాలు** అని తెలిసీ సింహాసనం ఎక్కించింది మనమే కదా. నిశ్చయమైనాక కునిసేం లాభం? ఇప్పటికయినా గొంతు వివ్పకపోతే, **తాంబూలాలిచ్చేసేను, తన్నుకు చావండి**, అని, ప్రజలందరినీ దేవతావస్త్రధారులుగా చేసే ప్రమాదం లేకపోలేదు.

  4. buchireddy gangula says:

    కొంతమంది మేధావులు — పదవులు రాగానే — గొంతులు విప్పని —– ఘంటా చక్రపాణి గారు
    –అల్లం రాజయ్య గారు ????
    ————————————————–
    డబ్బు తో
    పదవుల తో
    ఆధిపత్యం తో —ఎన్ని రకాల గారడీ ఆటలు అయినా ఆడవచ్చు —అందరికి తెలిసిన నిజమే
    కదా ———————
    ————————————————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  5. VIJAI KUMAAR says:

    చాల బాగుంది

  6. మా లాంటి చాలామంది టీఆర్ యస్ ని అభిమానించే వాళ్ళలో రీథింకింగ్ మొదలయ్యింది సెంట్రల్ యూనివర్సిటీ లో వీళ్ళ వ్యవహారం చూసాక . హాట్స్ ఆఫ్ బమ్మిడి భయ్యా.

Leave a Reply to Dr.Rafi Cancel reply

*