గన్నుతో కాదు….గుడ్లురిమి చిదిమేస్తా!

 

 

‘ఇక్కడ కాదు. బయటికి నడు నీ పని  చెప్తా ’ అంది ఫ్లెమింగో, గుడ్ల గూబ ని చూసి!

‘నువ్వే దయచెయ్. మరో క్షణం నాదగ్గరుంటే కళ్ళార్పకుండా  చంపేస్తా. నువ్వు వీగిపోయినప్పుడు ఓదార్పనేది లేకుండా కడిగేస్తా…ఇహిహి ”  ఉరిమినట్టుండే గుడ్లను మరింత ఉరిమింపజేసి  చూసింది గుడ్ల గూబ!

‘ఏంటలా గుడ్లురిమి చూస్తావ్? అలా చూస్తే మేం భయపడి ఎగిరి పోవాలా? గూబ గుయ్ మంటది జార్త!’ అంది ఫ్లెమింగో!

‘ఏం మాడుతున్నావ్ ఫ్లెమీ? మా గుడ్ల గూబ కళ్ళెప్పుడూ అలానే ఉంటాయ్! అది కోపం తో కాదు. నీతో నవ్వుతూనే చెబుతున్నా ‘దయచేయ్’ అని“

“నకరాలు చేయకు. నా చేతులో ఇత్తడై పొతావ్”

“ఇత్తడంటే …లోహం. అంటే ‘లోహ విహంగం’ అవుతానన్నమాట! అహ్హహా.ఒహ్హోహో..! ఒకప్పుడు మా దగ్గరున్న ‘లోహ పాదం’ ఏనాడో నీ దగ్గర అడుగు పెట్టిందిగా. అలాటి పాదాలని జతచేసుకుని  నువ్వు పార్టీని ఈదాలంటే  చాలాకష్టమే మరి. అహ్హాహా…ఒహ్హోహో  ”

“నువ్వు నవ్వుతున్నాననుకుంటున్నావేమో. నాకు తెల్సు. అది నవ్వు కాదు. అవహేళన అని తెలుస్తూనే ఉంది ”

“నా కనుగుడ్లు ఎల్లప్పుడూ  విచ్చుకోవడమే ఉంటుంది. ప్రత్యేకించి  ఉరమడం అనేది ఉండదు. ఇంత నవ్వుతున్నా ఉరిమానంటావేం? నా గుడ్ల మాన్యుఫాక్క్చరింగే అంత అనుకోవచ్చుగా. అహ్హహ్హ  !”

“మరి అలా ఆ చూపుడు వేలు ఎందుకు గుచ్చినట్టు  చూపిస్తున్నావ్?”

“మళ్ళీ అహ్హ హ్హ….నేను రెక్క ఎత్తిచూపిస్తున్నా, అది నీకు వేలు ఎత్తి చూపిస్తున్నట్టుందేం? నేనిక్కడ కూల్ గా  నిన్ను చూస్తున్నా కూడా నీకు ఉరిమినట్టుంటుంది. సరే …ఇహ నేను నవ్వను గాక నవ్వను. సీరియస్ మోహమేసుకునే  ఉంటా!సరేనా.”

“నీ ఫేసుకలాంటి ఫ్రస్ట్రేటెడ్  స్టాంపే బెటర్! అర్థం కాలేదా? అంటే నీ వదనానికి ఆ మథన ముద్రే బాగుంతుందంటున్నా! అయినా నీ సంగతిలా  కాదు. పక్షుల ప్రత్యేక  సమావేశంలో నీ ప్రసంగాన్ని దుయ్యబట్టి ఏ ఈకకి ఆ ఈక  పీకి పారేస్తా!”

“హలో! ఏమ్మాడుతున్నావ్? ప్రస్తుత  ప్రసంగంలో ఏం పీకావని కొత్తగా  వేరే పీకుతావ్? సందర్భం లేకుండానే విర్రవీగిన నీ ‘అవిశ్వాసమే’ వీగిపోయింది “

“అదిగో మళ్ళీ గుడ్లలా ఉరమకన్నానా? నీ గుడ్లంటే నాకో ‘ఫోబియా’. తోటి పక్షిని కాబట్టి అలా ‘పీకడం’ లాంటి అన్ పార్లమెంటరీ పదాలు నాపై వాడుతున్నావ్ గానీ, మనుష్య భాషలో అదో పెద్ద బూతు. నీకా విషయం తెల్సా?”

“ఈకలంటూ ఉన్నాక  పీకించుకోకుండా ఉంటామా?లేదా పీకకుండా ఉంటామా? అందులో అన్ పార్లమెంటరీ ఏముంది? అర్ధం లేని ఏడుపు నీది.”

“ఏడిశావ్……ఇప్పుడు నువ్వన్న  ‘ఏడుపు’  అనేదే అసలైన  అన్ పార్లమెంటరీ. దాన్ని రికార్డులోంచి పీకించాలి.”

“ఏడుపు అన్ పార్లమెంటరీ కాదు….నువ్వంటోన్న ‘ఏడిశావ్’ అనేది అన్ పార్లమెంటరీ. అయినా నేను ఏడిశానంటావ్…మీ అయ్య పనీ పాటా లేకుండానే తెగ ‘నవ్వుతూ’ ఉండేవాడు….గుర్తుందా? పనికిమాలిన నవ్వుకన్నా పనికొచ్చే ఏడుపు మిన్న కదా!  అదలా ఉంచి నీ వద్ద నున్న పక్షులన్నీ  నా వద్దకు వలస వచ్చేశాయి …ఇంకొన్ని వచ్చేస్తున్నాయి ”

“ఆ …. మావన్నీ మీవద్దకు వస్తే  వలసలు అంటారు…..అదే పొరుగు ఊళ్ళో మీకిదే జరిగితే –  మమ్మల్ని ‘గద్ద’ తన్నుకెళ్ళింది   అంటూ ‘ముక్కు’ సూటిగా అనేస్తావు.  ….అంతేగా? అక్కడ ముక్కుకు లొంగిపోతావ్ ….ఇక్కడ ముక్కుకు తాడు వేస్తానంటావ్. నువ్వేంటో ఒక్క ముక్కా అర్థం కావురా బాబూ ”

“ఫ్లెమీ బ్రదర్….ఏమ్మాడుతున్నారు? రెండు కళ్ళకీ అంతటి దేదీప్యమానమైన  ప్రాధాన్యాన్ని ఇచ్చాను గాబట్టే … ఇవ్వాళ నీకు నా గుడ్లు ఉరిమినట్టు కనిపిస్తుంది. నిజానికి జరిగిందేమేటంటే ఇరుపక్షులకీ … సారీ … ఇరు పక్షాలకీ సమన్యాయం చేయాలన్నదే నా ‘ఉభయ గుడ్ల’ తత్వం. అయినా నన్నంటావేమిటి? నేను పక్షినైతే నువ్వు ప్రతిపక్షివి!  నేను ప్రతిపక్షినైతే నువ్వు పక్షివి!  మీ అయ్య ఊరకే పిచ్చ పిచ్చగా నవ్వుతుండేవాడు ఊరపిచ్చుక లా! అప్పట్లో  నేను ప్రతి పక్షినిగదా…అంచేత దానికి విరుద్ధముగా కడు సీరియస్ గా ఉండేవాణ్ణి. మాట్లాడుతుంటే అడుగడుగునా  కళ్ళు ‘మూసుకు’నేవాడు. నేను ప్రతి పక్షిని గావున తద్విరుద్ధముగా  కళ్ళు  ‘బార్లా తెరిచి’ చూచెడివాడిని. ఇటుల … అటువైపునుంచి  ఈ వైకల్యం ఏ…నా…డో  నాకంటుకొనగా … నేడేదో పిల్ల పక్షి నాయొవద్దకు వచ్చి గుడ్లురిమెదవేమీ గుడ్లురిమెదవేమీ యనుచు వ్యర్ధ ప్రేలాపముసేయుటెందులకు?” అంది గుడ్ల గూబ, గుయ్ మనేలా.

“ఇదిగో …నన్నేమయినా అను. ఊరుకుంటా. ఏలోకాలకో రెక్కలల్లార్చుకుంటూ ఎగిరిపోయిన ఓ పెద్ద పక్షిని పట్టుకుని, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడకు. మెదడు పాక్షికంగా దెబ్బతింటుంది. ఇంగో నా శాపం! ” అంటూ  శాపం పెట్టింది ఫ్లెమింగో!

“ఛీ! జైలు పక్షిలా ఎంత అసయ్యంగా మాడుతున్నావ్? పడమట అస్తమించడానికి సిద్ధంగా ఉన్న  నీతో నోరు కలపడం నాదే తప్పు. అయినా నేను అర్జంటుగా అప్పుతెచ్చుకోడానికి  ఉత్తరానికి వెళ్లాల్సిన పనుంది. నిన్ను రేపటి ప్రత్యేక సమావేశంలో తూర్పార బడతాను. అప్పటివరకూ నువ్వు తక్షణమే  దక్షిణ దిశగా పో!” అంది గుడ్లగూబ అక్కడినుంచి ఎగరబోతూ!

“వామ్మో. నేనుకూడా తొందరగా వెళ్లకపోతే కొంప కొల్లేరు సరస్సయ్యేట్టుంది. పిల్ల పక్షులంతా సరిగ్గా తిని తొంగున్నారో లేక ఇంకేవైనా హడావిడి చేస్తున్నారో చూసొస్తా. అసలే ఎవరు స్వపక్షమో ఎవరు అక్కుపక్షమో తెలిసిచావడం లేదు. అది తెలుసుకుందామనుకున్న నా  అవిశ్వాసానికి విశ్వసనీయత లేకుండా వీగి పోయింది ” అంటూ ఉన్నపళంగా గాల్లోకి లేచింది ఫ్లెమింగో!

పెద్ద బంగాళా లాంటి చెట్టు గూటికి చేరి చూసుకునేసరికి అనుకున్నట్టే పిల్ల పక్షుల కిలకిలలు పెద్దెత్తున వినిపించాయి. అన్నీ కలిసి గానా బజానా చేసుకుంటున్నట్టుగా ఉంది. అంతే కాదు. అవిపాడుకునే పాట వినేసరికి తన ప్రతి రెక్కలోని ప్రతి ఈకా భయంతో నిక్కబొడుచుకుంది. మోడు బారబోతున్న చెట్టు సాక్షిగా గానాభజానాల  పాట జోరుగా సాగుతోంది.

“ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…… ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…”

$$$

 

 

 

 

 

 

మీ మాటలు

  1. చందు తులసి says:

    సమావేశాల వెనుక అసలు వేషాల్ని…..బాగా చూపించారు.

  2. మిత్రమా! శ్రీ కొర్నెపాటి శేషగిరిరావు పంతులు మనుమడు రాజశేఖర్ అని బ్యాంకు మేనేజర్ ఒక ఖండ కావ్యాన్ని ఇచ్చారొకసారి నాకు.. మహా కౌలీనమని.. అద్భుత పద్య సాహిత్యం. విషయం మాత్రం జంతువులకు పక్షులకు మధ్య యుద్దం.. అందులోకాక-జంబుక సంవాదము భారతంలోని గృధ్ర జంబుకోపాఖ్యానాన్నిప్రస్తావిస్తూ సాగుతుంది. జంతువుల పక్షుల ద్వారా మనుషుల ప్రవృత్తి ని ఎత్తిచూపడమే కవి ఉద్దేశం అయి వుండాలి..
    అంతర్లీనంగా ఏదో చెప్పాలన్న తపన ఈ పక్షుల ద్వారా చెప్పించడం ఒక సాంప్రదాయమే.. నువ్వు దాన్ని సమర్థంగా నిర్వహించావ్!!

    • వర్చస్వి says:

      థాంక్స్. యశస్వి సోదరా. మంచి సమాచారాన్ని ఉటంకించినందుకు సంతోషంగా ఉంది.

మీ మాటలు

*