ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో…

Kasepu

-అరణ్య కృష్ణ

~

 

“కాసేపు” అంటూ ఒక 22 సంవత్సరాల క్రితం  తీరైన కవిత్వం చెప్పి మళ్ళీ కనిపించకుండా పోయాడు వాసు.  అంత మంచి కవులు ఏదో కాసేపు – అంటే ఒక ఐదారేళ్ళ పాటు కవిత్వం చెప్పి మళ్ళీ కలం పట్టుకోక పోతే ఎలా?  అలాంటీ వాసుని పరిచయం చేయటం ఈ వ్యాసం ఉద్దేశ్యం.  1987 నుండి 1994 వరకు సుమారు 7 సంవత్సరాల కాలంలో కేవలం ఒక 15 కవితలు మాత్రమే రాసిన వాసు కవితల్లో అధిక భాగం “ఆంధ్రజ్యోతి” వారపత్రికలోనే ప్రింటయ్యాయంటే కవిగా అతని సత్తా ఏమిటో తెలుస్తుంది.  ఆయన తన కవితల సంకలనం “కాసేపు” 1994లో ముద్రించారు.  ఈ సంకలనం నగ్నమునికి అంకితమిచ్చారు.

అతి సరళమైన వ్యక్తీకరణలో భావోద్వేగాల జుగల్బందీ వినిపించటం వాసు ప్రత్యేకత.  ఈయన కవితలు పల్లెలోనూ, సంస్కృతిలోనూ లోతైన పునాదులు కలిగివుండి బతుకుతెరువుకి నగరానికి వచ్చిన అనంతరం  కోల్పోయింది పొందలేక, ఉన్నదాన్ని స్వంతం చేసుకోలేని ఒక అస్తిమిత మానసిక స్థితిని తెలియచెబుతాయి.  వాసు చెప్పినట్లు “కాలం ముందుకే పోతుంది/మనసు వెనక్కి కూడా పోగలదు”.  ముందుకురుకుతున్న కాలంకి వ్యతిరిక్తంగా బాల్యంలోకి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగల మానవ సంబంధాల పరిమళాల్లోకి కవి జారుకుంటాడు.  అలా జారుకున్నప్పుడే “సంప్రదాయానికి నమస్కారం” అన్న కవిత వస్తుంది.  ఈ కవిత శీర్షికలో లేని కవిత్వమంతా కవితలో వుంది.

“అది ఎగరటానికి రెక్కలక్కర్లేని వయసు

అనుక్షణం ఆనందం ఒక్కటే మనకి నేస్తం

నేస్తం కట్టడమే పసిపిల్లల చాదస్తం”

 

“తుపాకీ పేలిస్తే పువ్వులు రాలేవి

కన్నీళ్ళు పోస్తే నక్షత్రాలు మొలిచేవి”

 

ఇంతకంటే సరళంగా బాల్యాన్ని నిర్వచించటం ఎవరికైనా సాధ్యమా?  గడిచిపోయిన కాలాల్లోకి దూకి బతికిన క్షణాల్ని నెమరేసుంటాడు కవి అలా.  ఎందుకంటే “బాల్యానికి కాలం పట్టదు / బాల్య స్మృతులకు కాలదోషం పట్టదు”

“నాకూ చెట్టుకూ పెద్ద తేడా ఏముంది?

పండిన ఆకుల ముడతలతో

పువ్వుల కవళికలతో

చెట్టు నాకు అద్దం పడుతుంది

నడుస్తూ నేను చెట్టుకు కదలికనవుతాను

వేళ్ళు భూమిలో పాతుకుపోయి

కదలలేని శక్తిహీన ఈ చెట్టు

కాళ్ళు కదపగలిగీ శక్తిహీనుణ్ణి నేను”

 

“చెట్టుతో సంభాషణ అనవసరం

చెట్టు దగ్గర దాపరికం అసాధ్యం”

 

“ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి

మోకాళ్ళ మీద కూచోబెట్టారు”

 

“చెట్టూ చిగురిస్తుంది

చెట్టులా నిలిచిపోవటానికి

చెట్టంత ప్రయత్నం చేస్తూ” (ఎర్రగన్నేరు)

వాసులోని అనుభూతి కవితాధోరణికి అద్దం పట్టే కవిత ఇది.  మానవజీవితంలోని రకరకాల అనుభూతులన్నింటినీ చెట్టులో చూడగలిగిన కవి తన కవితా వస్తువుతో ఎంతగా తాదాత్మ్యీకరణం చెందగలడో ఈ కవిత నిరూపిస్తుంది.  పాఠకుడి మనసులో ముసురు పట్టించగల కవిత ఇది.

“ఏ పిలుపో వినిపిస్తుందనే ఆశతో

రాత్రి ఒక్కణ్నీ మేల్కొని కూర్చుంటాను” అంటూ మొదలయ్యే “జననం” కవిత ఏకాంతాల చుట్టూ ఏర్పడే ప్రాకారాల్ని, తొలి కదలిక కోసం చేసే నిరీక్షణని వివరిస్తూ

“అసహనం చీకట్లో అనంతంగా పెరిగిపోయి

జిరాఫీ మెడలో కొండ చిలువ వొళ్ళు విరుచుకున్నప్పుడు

రాత్రిని ఉషస్సు జయిస్తుంది

టేబుల్ మీద మహా ప్రస్థానం

నన్ను కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పిస్తుంది” అంటూ ముగుస్తుంది.  జిరాఫీ దేహం మీద ప్రాకృతిక డిజైన్ని అసహనంతో వొళ్ళు విరుచుకుంటున్న కొండ చిలువ తో పోల్చటం కవి నిర్నిబంధ ఊహాశక్తికి అద్దం పడుతుంది.  టబుల్ మీద మహా ప్రస్థానం తనని కౌగిట్లోకి లాక్కొని కవిత్వం నేర్పించటమే కవితా జననం.

పరాయి నగరంలో ఏదో ఒక రూంలో ఒంటరిగా బతికే బ్రహ్మచారి జీవితమో సంక్లిష్ట దశ.  కొంత విచిత్రంగానూ ఉంటుంది. పుస్తకాలు చదువుతూ, సిగరెట్లు ఊదిపడేస్తూ, బద్ధకంగా బతికేస్తూ….గొప్ప విచిత్రంగా ఉంటుంది.  రూం తాళం తీసుకుంటూ లోపలికెళ్ళిన ప్రతిసారి బహుళత్వాన్ని తలుపు బైటనే వదిలేసి లోపలికి  మళ్ళీ బైటకి వొచ్చేవరకు ఏకాత్మతో ఒక గొప్ప ఏకాంకిక నడుస్తుందిలే! అది అనుభవించినవాడికే తెలుస్తుంది (“అనుభవించిన వాడికే” అని ఎందుకన్నానంటే ఆడపిల్లలంత బుద్ధిగా మగపిల్లలుండరుగా రూముల్లో).  రూంలోని ఏకాంతంలోనే కవి తన సజీవతని, నిర్జీవితనీ కనుగొన్నాడు. మళ్ళీ రూంనుండి బైటకొచ్చినప్పుడెలా వుంటుంది మరి?

“నేను రూం బైట నిలబడి

తాళం వేస్తూ గడప మీద నించుంటే

ఆ దృశ్యం ఉబ్బిన పుట్టుమచ్చలోంచి

వెంట్రుక బైటపడుతున్నట్లుంటుంది”

మనసులోని సంక్లిష్టతని వివరించటానికి “ఉబ్బిన పుట్టుమచ్చలోంచి వెంట్రుక బైటపడటం”ని మించిన ప్రభావవంతమైన ప్రతీక ఏమన్నా వుంటుందా ప్రియ పాఠకులారా?

వాసు రాసిన మరో కవిత “కూల్ డ్రింక్ పార్లర్లో…..” పొద్దుట్నుండి రాత్రివరకు కూల్ డ్రింక్ పార్లర్లో పని చేసే బాల కార్మికుడి జీవన వ్యధార్తి దృశ్యం ఈ కవిత వస్తువు.  1988లో రాసిన ఈ కవిత ఇటువంటి వృత్తిగతమైన విచలిత దృశ్యాల్ని ఆవిష్కరించే కవితలకి నాంది అని నౌదూరి మూర్తిగారు అభిప్రాయపడ్డారు.  తల్లెత్తకుండా రబ్బరు సంచీలో ఐసుముక్కలేసి కర్ర సుత్తితో ముక్కలు చేసుకుంటూ పోయి ఎండిపోయిన ఐస్ కుర్రాడి కళ్ళల్లో స్వప్నసీమల కోసం కవి అన్వేషిస్తాడు.

“వాడలా వున్నప్పుడు

వాడలా వుండి పోవాలనుకున్నప్పుడు

రెండు ఐస్ తునకలు కంట్లో పడి

కళ్ళల్లో ఐస్ మేఘాలు కరిగి

వాడి చెంపల మీదుగా హిమవాహినీ చారికల్ని గీసి

కింద పడిపోతాయి”

“వాడి జీవితం చాలనంత మంచు

వాడి భవిష్యత్తులో వుంది”

ఎవరికైనా నోస్టాల్జియాలో జ్వరం రావటం ఖచ్చితంగా ఉంటుంది.  జ్వరం ఒక తియ్యని బాధ.  జ్వరం వచ్చినప్పుడు మీరు చాలా ప్రత్యేకం.  రోజూ మీతో పోట్లాడే వారికి మీ మీద అనురాగం చూపించే ఒక గొప్ప అవకాశం.  ఆ జ్వర తీవ్రతని కవి ఎలా వివరిస్తాడో చూడండి-

“దేహం పక్క మీదకి వాలగానే

నెత్తుర్లో మంచు ముక్కలు తేల్తాయి

ఉడుకు తగ్గిన నెత్తురు

చేతులోంచి వేళ్ళలోకి ప్రవహిస్తుంది

దట్టమైన అరణ్యంలో కొమ్మల్ని చీలుస్తూ

పాయలై తెగిన వెన్నెల్లాగ”

కానీ కవి అన్నట్లే “జ్వరమూ తరుచుగా రాదు”. అయ్యో కదా!

“లెక్క తెగట్లేదు” వాసు అత్యుత్తమ కవితల్లో ఒకటి.  తనకి లెక్కలు బాగా వివరించి చెప్పే మిత్రుడు నాయుణ్ని ఉద్దేశిస్తూ చెప్పిన కవిత ఇది.

“అప్పుడు నువ్వేం చెప్పే వాడివో!

నీ వెనుక నడుస్తూ నేనేం వినేవాడ్నో!

ఒక సముద్ర శాఖ దూసుకొచ్చి

ఒడ్డుని చీపురు కట్టలా ఊడ్చేసి

అఖండ భూభాగం చీలిపోవడం చెప్పేవాడివి

బతుకుతెరువు తోడలై

సరళ జీవన కాంక్షా కురంగాన్ని పట్టుకోవడానికి

పూలమొక్కల వెనక పొంచున్న సంగతి చెప్పేవాడివి”

తనకింత చెప్పిన నాయుడితో కవి చివర్లో ఏమంటున్నాడో వినండి.

“ఇవాళ నేను ఆ పాటలే వింటూ అవే లెక్కలు చేస్తున్నా!

లెక్క తెగట్లేదు నాయుడూ”

 

జీవితం ఎప్పుడూ తెగని లెక్కే. నిజానికి లెక్క తెగితే మాత్రం జీవితంలో మజా ఏముంటుంది?  మృత్యువు లోని అనూహ్యతే కదా జీవితం మీద ఆసక్తిని పెంచేది.  జీవితం లెక్క శాశ్వతంగా తెగేది మృత్యువుతోనే మరి.  అందుకే లెక్క తెగకపోవటమే ఆసక్తికరం.

మరికొన్ని మంచి కవితలతో పాటు ఇంకొన్ని అనువాద కవితలు కూడా “కాసేపు”లో కనిపిస్తాయి.  కాసేపట్లోనే చదవటం పూర్తయ్యే ఈ సంకలనం చాలాకాలం మీ మనసులో వుంటుంది. చదవండి. నిజానికి వాసు కవిత్వం చదువుకుపోవాల్సిన కవిత్వం.  ఈ పరిచయం కేవలం నామమాత్రమే. అదికూడా ఎందుకంటే వాసు కవిత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయటంతో పాటుగా వాసుకూడా తానొకప్పుడు కవినేనన్న విషయం గుర్తు చేయటం కోసం, మళ్ళీ కవిత్వం వైపు పురికొల్పటం కోసం!

*

మీ మాటలు

  1. Paresh N Doshi says:

    Vasu is one of my fav poets. Thanks Krishna for this. I share your complaint against him, of not writing enough.

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు పరేష్, వాసు మీద ఫిర్యాదు గురించి నాతో గొంతు కలిపినందుకు. !

  2. ‘కాసేపు’లో కాసేపైనా మునకలు వేయాలనే ఆసక్తిని కలిగించే విధంగా వాసు గారి కవిత్వాన్ని
    పరిచయం చేసారు. ఒక మంచి కవిని , మంచి కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదములు అరణ్యకృష్ణ గారు

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు. మనం మునక వేసేది “కాసేపు” మాత్రమే. ఆ పన్నీటి వాసన బహుకాలం వెంట వస్తుంది శశిశ్రీ గారూ!

  3. Thanks Aranya Krishna, Paresh and Sasisri gaarlu. Thanks to Saranga team. I will write more later.

    _Vasu_

  4. కొండేపూడి నిర్మల says:

    అవును అరణ్య కృష్ణా, వాసు ఎంత బాగా రాసేవాడు . నాకు గుర్తుంది. మనమంతా సమకాలికులం కదా. అతను ఎక్కడ వున్నాడు / ఏం చేస్తున్నాడు >? వివరాలు చెప్పు. అతన్ని పరిచయం చేస్తూ కూడా కనీసం ఫోటో అయినా వేయలేదేమిటీ?

    • Vasu (Srinivasa Nyayapati) says:

      నిర్మలా,

      Thanks. I am on FB, Srinivasa Nyayapati. Will send you a friend request.

    • Aranya Krishna says:

      నిర్మలా! వాసు బెంగుళూరులో వుంటున్నారు. అవును మన సమకాలీకుడే ఆయన. ఫేస్బుక్ పుణ్యమాని టాక్ లోకి వచ్చారు. ఆయన కూడా మళ్ళి కవిత్వం రాయాలనే ఈ పరిచయం.

      • Aranya Krishna says:

        నిర్మలా! టాక్ కాదు టచ్ లోకి వచ్చారు. వాసు ఫోటో వేసుండాల్సింది. అతని ఎఫ్బి పేజిలో వుంది.

  5. V.Ch.Veerabhadrudu says:

    నేను వాసు కవిత్వానికి జీవితకాల అభిమానిని.

    • Vasu (Srinivasa Nyayapati) says:

      భద్రుడూ, I am flattered. నేనే మీ అభిమానిని, అదే నా ముఖ్యమైన Identity

  6. S. Narayanaswamy says:

    వాసు రాయకపోవడం నేరంగా భావించి తీర్పునివ్వడ మైనది :-)

  7. Vasu (Srinivasa Nyayapati) says:

    ఏ శిక్ష విధిస్తున్నారు Nasy?

Leave a Reply to Vasu (Srinivasa Nyayapati) Cancel reply

*