సంభాషణలు

-అవ్వారి నాగరాజు
~
ఎవరమైనా ఎలా చెప్పగలం
తాత్విక ప్రశ్నల సుడుల నడుమ గింగిరాలు కొడుతూ
మూగిన పంథాల చిక్కుముడులలో ఉక్కిరిబిక్కిరిగా
కాలాకాలాల నడుమ గీతలు గీస్తూ చుట్టుకొలతలు తీస్తూ
అప్పుడప్పుడూ ఒక నిట్టూర్పునో మరింకో దాన్నో
జరగండహో జరగండని దారి చేసుకుంటూ
మనమూ ఉన్నామని చెప్పుకోవడానికి ఆదుర్దాపడుతూ
మన పనిలో మనం నిత్యం నిమగ్నమై ఉంటాం కదా
దేహాలని పగల చీల్చుకుంటూ
సందర్భాసందర్భాల నడుమ తమను తాము పేని
ఊపిరి కదలికలకు చలించే వో సంకేతంలాగా  కాకుంటే ఇంకేదో స్ఫురించని సుదూరపు ఊహలాగా
ఏదో వొక క్షణంలో
ఎవరొస్తారో తెలియదు కానీ
ఇదుగో ఇట్టాగే చప్పున చొచ్చుకొని వొచ్చేస్తారు
అలా వొచ్చేదాకా
చావు మన అర చేతుల మీద ఇగరని నెత్తుటిమరకలను అద్ది పోయేదాకా
వొక తెర చాటున నక్కిన మాయోపాయి వేసే
ఆట్టే తెలియని సహస్ర శిరచ్చేధ చింతామణి ప్రశ్నలలాంటివేవో ముఖాల మీద పెఠిల్లున చిట్లేదాకా
ముసిరిన సంభాషణలకు
అటూ ఇటూ తిప్పి చూసుకొనే దిగ్భ్రాంతీ దుఃఖమూ తప్ప
ఇదమిత్తంగా ఇదని చెప్పలేము కదా

మీ మాటలు

  1. THIRUPALU says:

    బాగుంది.

  2. నిజమే సంభాషనలన్నితిరిగి కొత్తగా మొదలు కావాల్సిన సందిగ్ధ సందర్భంలో ఈ దిగ్భ్రాంతి దుఃఖము తప్పవు…చాల బాగుంది మాస్టార్జి..

    • శ్రీనివాసుడు says:

      మహత్తరం వర్మగారూ! మనం నిండామునిగిన, మన లోపల నరనరాలా జీర్ణించుకుపోయిన తాత్త్వికభావజాలాన్నంతా కొన్ని ఘడియలైనా ప్రక్కనబెట్టి, ఏ అభినివేశంలేకుండా సంభాషణలని క్రొత్తగా ప్రారంభించవలసివుందన్న మీ గమనింపు బాగుంది.

మీ మాటలు

*