తెంగ్లిష్ భూతం.. వేపమండల వైద్యం…

 

 

-ల.లి.త.

~

    ల.లి.త.

“భాషంటే ఓ అంటురోగం. అంతకు మించేం లే..”  ధాటిగా చెప్పేడు మా చెడ్డీల్నాటి నేస్తం సీనుగోడు.

“సగంనిజాల్ని గెట్టిగా చెప్పీసీవాళ్ళలో ముందువరస నీదే.  భాషంటే ఇంకా చాలావుందని చెప్పిన శాస్తుర్లంతా మొత్తుకోరూ? దానికెంత పెద్ద శాస్త్రముందిరా!” కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాను వాడి పళ్ళెంలో మరో దిబ్బరొట్టి ముక్క వేస్తూ.

“సుబ్బలచ్చిమి కవుర్లు సెప్పకే… అదంతే..” అని అల్లంపచ్చడీ రొట్టిముక్కపెచ్చుతో పాటు మాటల్ని కూడా నొక్కి నవిలీసేడు వాడు.

“నిరూపించరా అప్పారావ్..” అని నేనూ తగ్గకుండా నిలేశా.

“ఇవాళ దిబ్బరొట్టి వేస్తున్నాతల్లీ”. “ఇంకో రొట్టిముక్క వేసుకోరా” అని  వెన్నపూసిన దిబ్బరొట్టి జపం మీ అమ్మ వందలసార్లు చేసేకేకదా, దీనిపేరు ‘దిబ్బరొట్టి’ అని మన బుర్రల్లో నాటుకుంది! ఇంత కష్టపడి రెండు మూడు తరాలుగా మాటలు నాటి పెంచుతూ ఉంటేనే కదా భాష తేనెలో ముంచిన రొట్టెలా రుచులూరేది!”

“అంటురోగం అని చెప్తూ భాష నాటుడు కార్యక్రమంలోకి పోయావ్.  తిండెక్కువైనప్పుడల్లా పీతలా నడిచే నీ మెదడు లక్షణం ఏ మాత్రం మారలేదురా.” అని పొగిడేను.

“తిండెక్కువ పెట్టి గెరిల్లాయుద్ధం చేసే నీ బుద్ధీ అలాగే ఉందిగా”.. వాడూ పొగిడేడు నన్ను.

“బాసింపట్టు వేసుకున్నావుగా దిగరా ఇంక వాదంలోకి!”

“సుబ్బరంగా ‘మఠఁవేసుకుని’ కూచున్నానే.  విజయవాడెళ్ళి మన ‘మఠా’న్ని ‘బాసింపట్టు’ చేసీసేవు. ఇదీ అంటురోగమంటే. ఒక్కటే దెబ్బకి నిరూపించి పారేసినానా నేదా సుబ్బలచ్చిమీ”

“మఠం వెయ్యడాన్ని ఒక్కో వూళ్ళో ఒక్కోలా అంటార్లేరా బంకుశీనూ. నాలాంటి పండితుల్ని విడిచిపెట్టి సాధారణీకరించవోయ్.”

“రెండూర్లు తిరిగి నాలుగు ముక్కలు ముక్కునట్టుకున్న నీలాటోల్లంతా శాత్రం మాటాడీసీవోలే.  గట్టిగా పదివాక్యాలు గుంటూరుభాషలో మాట్లాడు నీ సంగతి తేలుస్తా.”

“అల్లంపచ్చడి ఘాటు తలకెక్కేక నీమాట నువ్వే వినవురా మహేశ్ బాబూ. నామాటలేం వింటావు?”

“ఇదీ నీ గెరిల్లా యుద్ధతంత్రం. కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికీ.. నీ మొగుడు ఎప్పుడూ లాగిపెట్టి తన్నలే?” ఉక్రోషం వొచ్చీసింది శీనయ్యకి.

“నువ్వు తన్నగలిగేవనా అతను తన్నడానికి?”  ప్రకాశ్ రాజ్ లాంటి శీనుగాడి ఆకారాన్ని చూస్తూ కొంచెం భయంగా  అన్నాను.

“నీతో ఇలా లాభం లేదు.  నేను పూర్తిగా చెప్పేకే నీకు మాటాడ్డానికి అనుమతి ఉంది.”  అంటూ నా మాట చొరనివ్వకుండా కన్హయ్యా కుమార్ లా రంగఁవెక్కి కదం తొక్కేడు మావాడు.  వాడి ‘ఆగ్న’ దాటలేక బ్రాకెట్లలో నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాన్నేను. దాని విధానమిది …

“దిబ్బరొట్టె పేరుతో తరాలుగా మన తలకెక్కిన ఈ అద్భుత పదార్థాన్ని మనచేత ఎవరైనా ‘పాన్ కేక్’ అనిపిస్తే అది   అంతర్జాతీయ కుట్ర. రసాయనాయుధాలకంటే బలమైనది అన్యభాషాప్రసారం.  ఇది గమనించకుండా అన్యమత ప్రచారం అంటూ ఊగిపోతున్న ఆంధ్రదేశపు హిందూవాదులు తెంగ్లిష్ ప్రచారాన్ని ఎందుకు ఖండించరని అడుగుతున్నా.  అడుగుతున్నా నేనడుగుతున్నా.. మొబైల్ ఫోన్ని “చరవాణి” అని వాడుకలోకి తెస్తూ తరవాణిని   గుర్తుకు తెప్పిస్తున్న పత్రికాధిపతిని! (అబ్బ. పొద్దున్నే వాము కలిపిన తరవాణిలో ఆవకాయో మిరపకాయో కొరుక్కుని బొజ్జనిండా తిని, బళ్ళో మత్తుగా ఊగిన రోజుల్ని ఏమన్నా తిరగదోడేవా ప్రియనేస్తం!)  ఏమనీ? తెలుగు వార్తాపత్రికలూ టీవీచానెళ్ళ మధ్య నలుగుతున్న తెలుగోళ్ళని ఒక్కసారంటే ఒక్కసారి… రక్తాశ్రువులొలుకుతున్న తెలుగుతల్లి కళ్ళలోంచీ  పరిశీలించమని… ఓపక్క పత్రికల్లో తెలుగుని ఉద్ధరిస్తూ  మరోపక్క కొత్త కొత్త దూరదర్శన పాయల్ని (టీవీ చానెల్స్)  మూర్ఖానందపు పెట్టె (టీవీ) లోకి పంపిస్తూ వాటిద్వారా తెలుగుభాషా కల్పవృక్షాన్ని నాశనం చెయ్యటం కోసం పరదేశీ వేరుపురుగుల్నీ, కాండంతొలిచే పురుగుల్నీ అగ్గితెలుగునీ, అదే.. అగ్గితెగుల్నీ వ్యాపింపజేస్తున్న తీరుని ప్రశ్నిస్తున్నా. దీనివల్ల జనం, చదూతున్న పత్రికలభాషనీ చూస్తున్న టీవీ తెంగ్లిష్ నీ  వింటున్న ఎఫ్ఫెమ్ రగడనీ (బాగా చెప్పేవ్. తెంగ్లిష్ నగిషీల్లో ఆర్జేల పనితనం తనిష్క్ ని మించినదే)  కలిపి గిలకొట్టి,  కొత్తరకం కంగారుభాష మాటాడుకుంటూ గెంతుకుంటూ పోతున్నారని నేను సోదాహరణంగా వివరించగలను మీడియా మహారాజులారా!  చిత్తశుద్ధి లేని మీ శివపూజల్ని నేన్నిరసిస్తున్నా”. (ఉపన్యాసం బాగుంది గానీ ‘లక్స్ సినిమాతారల సౌందర్య సబ్బు’ నాటి రోజుల్నుండీ ఈనాటిదాకా టీవీ యాడ్ లు కూడా తెలుగుని మరీ దుంపనాశనం చేసిపెడుతున్నాయిరా నాయినా).

ఊపిరి పీల్చుకోడానికి ఆగేడు శీనుగాడు.

“ఈ మధ్య మనకీ కొత్త కొత్త వంటల చానెళ్ళు వొచ్చీసేయి పిల్లా చూసేవా నువ్వు?  నీలాటి బక్కప్రాణికి అన్నిరకాల  వంటల పేర్లు వింటేనే నీరసం వొచ్చిస్తుంది. మీ అమ్మ వంటలు మర్చిపోతావ్.  మ్మ్.. అలా కాదులే.  మీ అమ్మా అమ్మమ్మల వంటలని కూడా ఎలా చెయ్యాలో వీడియో తీసి ఆ చానెల్ కి పంపిస్తే కాస్త పేరూ డబ్బూ కూడా వస్తుందనుకుంటా చూసుకో.  ఒకటి మర్చిపోకు సుమా.  ఆ వంటెలా చెయ్యాలో పూర్తిగా తెలుగులోనే చెప్పాలని వాళ్లకి షరతు పెట్టు. (‘షరతు’ అనే మాట ఎక్కణ్ణుంచి వచ్చిందో తెల్సుకోవా శీనూ)  ఆ చానెల్ చూసి తీరాల్లే. చక్కగా బొద్దుగా ఉండే అమ్మాయిలే అంతానూ.  (అంతా నీలాగే గుండ్రంగా ఉంటే ఎంతానందంరా నీకూ!)  అరె…  అలా అనుమానంగా చూసి శీలశంక చెయ్యకు. (అదేంట్రా మూలశంకలా?)  స్త్రీవాదమే మాటాడుతున్నాలే. సున్నాకొలత వొదిలి మనుషులంతా ఎవరి కొలతల్ని వారు ప్రేమించుకోవాలని నా ఆశయం. (అలా నీ పొట్ట చుట్టుకొలతని ప్రేమించుకుంటూ ఉండు. గుండెపోటొచ్చీగల్దు.)

ఇంతకీ నువ్వు మాటాడకుండా ఉంటే ఎటో వెళ్తున్నాన్నేను. (మీ మగాళ్ళంతా అంతేగా. దార్లో పెట్టడానికే మేమున్నాం.)  అసలు విషయం ఏమిటంటే అమ్మలూ.. చిన్న అనుకరణ చేసి చూపిస్తా చూడు ఓ కార్యక్రమాన్ని!” –  శీనులోని నటుడు ఆవలిస్తూ నిద్రలేచాడు.

***

పాలకోవా వ్యాపారి  శంకర్రావు గారి దగ్గరకు వంటల చానెల్ అమ్మాయి వచ్చింది.

అమ్మాయి :  “అసలు మీ పాలకోవాకున్న ఇంత టేస్ట్, ఇంత స్పెషాలిటీ ఏంటో అర్జంట్ గా తెల్సుకోవాలని వచ్చేసానండీ.”

శంకర్రావు :  “తప్పకుండా.. రండి… ఊక పొయ్యి మీదే కోవా వండుతామండి. ధాన్యం మిల్లు నుండి తీసుకొస్తామండి ఊక..  రైస్ మిల్లులో రైస్ సెపరేట్ అయ్యేక వొచ్చే పొట్టుని ఊక అంటారండి.

అమ్మాయి :  “జెనరేషన్ ఇంత ఫాస్ట్ గా వెల్తోంది కదా..  గాస్.. గాస్ స్టవ్స్, ఇంకా అప్డేటెడ్ చాలా వచ్చాయి కదా. మీరెందుకింకా ‘ఊక’ వాడ్తున్నారు? (ఊక అనే మాటనే అంత బెరుగ్గా అంటావెందుకు తెలుగుపిల్లా?)  మీ సీక్రెట్స్ లో వన్ అఫ్ ది సీక్రెట్స్ ఊకపొయ్యి అన్నమాట…  సరే. కోవా రెడీ అవడానికి ఎంత టైం పడుతుందండీ?”

శంకర్రావు:  “పదిలీటర్లు పాలు కోవాగా తయారవటానికి గంట, గంటన్నర పడుతుందండి”.

అమ్మాయి :  “ఓకే ఓకే. ఆ పాలు టెన్ లీటర్సాండీ ?

శంకర్రావు:  “అవి ఫార్టీ లీటర్స్అండీ. ఇవి టెన్ లీటర్స్ అండీ.”  (ఒప్పేసుకున్నా శీనూ. భాష వొట్టి అంటురోగమే. పాపం ఆయనకీ అంటించేసిందీ పిల్ల. అసలే అన్యభాషా వ్యాధినిరోధకశక్తి లేనివాళ్ళం).  … కోవాకి పాలు బాగా మరిగి చిక్కబడాలి”.

అమ్మాయి :  “అంటే బాగా రెడ్డిష్ రావాలాండీ?”

శంకర్రావు:  “ఔనండీ రెడ్డిష్ రావాలి”. (ఇదేంబాధ శంకర్రావుగారూ మీకు? మధ్యలో మా కళ్ళు రెడ్డిష్..  ఛ ఛా .. ఎర్రబడిపోతున్నాయ్ ఆర్. నారాయణమూర్తిలా).

అమ్మాయి :  “పెద్దలు నడిచిన ‘మాట’లో (బాట అనే మాట తెలీదీ పిల్లకి) మనమూ నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ పొందుతామనటంలో మీరు ట్రూ ఇన్స్పిరేషనండీ. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండీ?

శంకర్రావు :  పందొమ్మిది వందల యాభైలో నాన్నగారు స్టార్ట్ చేశారండీ.. (మీకూ ‘స్టార్ట్’ అయిందండీ అంటువ్యాధి.)

అమ్మాయి :  శివరావు గారంటే మీ ఫాదర్ గారాండీ? మీది పుట్టుకతోనే ‘సంపున్న’ కుటుంబమా?” (నీ సంపుడేంది తల్లీ ?)

***

“ఇప్పుడేమంటావ్? ఈ అమ్మాయిని వేషం మార్చి శంకర్రావుగారింట్లో రెండ్రోజులుంచి వాళ్ళంతా మాటాడుకునే భాషలో ముంచి తీస్తే తప్ప ఈ పిల్ల తన వొచ్చీరాని వింగిలీష్ని ఆయనకీ అంటించడం ఆపదు.  నువ్వూ నేనూ, తెలుగులో కథలూ కబుర్లూ రాసే అల్పసంఖ్యాక వర్గాలవాళ్ళూ, తెలుగు భాషాశాస్త్రవేత్తలూ (ఈ జాతి ఇంకా మిగిలుందంటావా?)  పిల్లలకి బడుల్లో తెలుగు నేర్పించే అభాగ్యులూ మనభాష గురించి ఆలోచిస్తే చాలదు తల్లీ.  టీవీకి తెంగ్లిష్ చీడ వదిలిన్నాడే  తెలుగుజాతి మొత్తం బాగుపడేది. అదెలగంటావా? మొదటగా తెలుగు టీవీ చానెల్ యజమానులందర్నీ కూచోబెట్టి,  దేశభక్తికంటే గెట్టిగా తెలుగుభక్తిని ఒళ్లంతా నలుగుపిండిలా రుద్ది తలంటు పొయ్యాలి.  (తెంగ్లిష్ మదగజాన్ని అణచగలిగే అంకుశాలున్న అసలైన మావటీలెవరో బానే కనిపెట్టేవుగానీ వాళ్ళని లాక్కొచ్చి ఆ ఉద్యోగంలో పెట్టే శక్తి ఎవరికుందో చెప్పలేవు శీనూ నువ్వు.).  తెలుగుమాటల మధ్యలో అతిగా ఇంగ్లీష్ ముక్కలు వేస్తూ దీన్నో వ్యాధిలా అందరికీ అంటించడాన్ని దేశద్రోహనేరమంత..  అదేలే.. భాషాద్రోహనేరమంత  హీనంగా చూస్తూ వేళాకోళం చెయ్యాలి.  ఎవరైనా “సండే.. థర్టీయత్ నైట్.. టూ లాక్స్ తీస్కుని స్టార్ట్ అవుతున్నా”… అంటుంటే  “టీవీ, కంప్యూటర్, కామెరా లాంటివాటికి సరేగానీ  ‘ఆదివారం.. ముప్పయ్యో తేదీ రాత్రి… రెండులక్షలు తీస్కుని బయల్దేరుతున్నా’ అని చెప్పడానికి ఇంగ్లీషుముక్కలెందుకు బంగారూ?” అని నెత్తిమీద సోలడు నూనింకిపోయీలా కొట్టీయాలి. తెలుగుమాటలు అందిస్తూ అంటిస్తూ పోవాలి.  (ముక్యమంత్రిగోరే  తెంగ్లిష్ ని నాలికమీదున్న సరస్వతీదేవిలా మొక్కీసోట  ఇయన్నీ చేసీదెవులో చెప్పకుండా నీ గోలేందిరా?)  ఇంతకు ముందు ఇరుగు పొరుగుల్తో సుబ్బరంగా తెలుగులో మాటాడుకునే ఇల్లాళ్ళభాషని కూడా చెడగొట్టి తెంగ్లిష్ ని నాటుకుంటూపోతున్న టీవీ చానెళ్ళని ఏం చేసినా పాపం అంటదు.  తెలుగు మాటా పాటా మర్చిపోయి,  బుల్లితెరల మీద సినిమాపాటలు పాడి ఎగురుతూ,  టీవీ పీతబుర్రలు కనిపెట్టిన వెర్రాటలాడుతూ, ‘ఆరెంజ్ కలర్ టాప్ మీద జరీ వర్క్ చేసిన హాండ్స్ తో గ్రీన్ కలర్ బాటమ్, కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ చున్నీ ఉన్న డ్రెస్ నో, పింక్ కలర్ బాడీమీద రెడ్ కలర్ ప్రింట్స్ వేసిన రిచ్ సిల్క్ సారీనో బ్యూటిఫుల్ గిఫ్ట్స్ గా కొడుతూ’ కాలం దొర్లించేస్తున్నారు కొంతమంది ఇల్లాళ్ళు.

అసలూ,  తెలుగురాని వింతజీవాల్ని ఏంకర్స్ అనే పేరుతో మనమీదికి వొదుల్తున్న టీవీ చానెల్ యజమానులు ఇంగ్లీష్ ముక్కలతోనే జ్ఞానం వొచ్చీసిందనుకునే జడ్డితనాన్ని పక్కనపెట్టి,  ఓ చిన్నపని చెయ్యొచ్చుగా!  ఒక్క రెండునెల్లంటే రెండునెల్లు.. టీవీ వ్యాఖ్యాతలుగా ఉద్యోగమిచ్చి తీసుకున్న వాళ్ళనందర్నీ ఓచోట కూచోబెట్టి తెలుగులో శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకున్న కోట్లు కరిగిపోతాయా? నడ్డివంచి తెలుగుని వడ్డిస్తే, ఇప్పుడు మాట్లాడుతున్న పిచ్చిభాష మళ్ళీ మాటాడే ధైర్యం చెయ్యగలరా ఈ వ్యాఖ్యాతలు?  చైనావాళ్ళంతటి వాళ్ళే మనవాళ్ళతో ‘మీ పేరేమిటి?’ అనడగటానికి ఎంతోకష్టపడి ఇంగ్లీష్ లో మర్యాదగా ‘వ్హాటార్యూ?’ అంటూ పాపం తప్పోతడకో ఏదోటి మాటాడేసి వ్యాపారవృద్ధి  చేసుకుంటూపోతుంటే,  ఉద్యోగం నిలబెట్టుకోవడంకోసం మనవాళ్ళు మనభాషని ఆపాటి నేర్చుకోలేరా?”

“ఒక కీలకం ఉంది సుబ్బూ.. ‘అన్యాయాలో, అక్రమాలో, హిందూమతపు జడలదెయ్యాలో, వర్గపోరాటాలో, ఆలో పొలో’మంటూ ఆయాసపడేవాళ్ళ  పూలు పుయ్యని ముళ్ళగులాబీపొదలాంటి భాషని టక్కున కత్తిరించి పడేసి సరికొత్త జాతీయాన్ని అందుకుని శైలీ ప్రకటన (స్టైల్ స్టేట్మెంట్ ని ఇలా తెలుగు చేశారా గురూగారూ ?) చేసీసేడు చూడూ.. ఆ కుర్రాడిలా దారి తియ్యాలి.  భావాల ఎత్తూ ఆదర్శాల లోతూ ఇవాళ ఎవరికీ అక్కర్లేదమ్మీ!  దేనిగురించైనా ప్రచారం ఎంత తెలివిగా చేసేవాఁ అన్నదే కిటుకు. తెంగ్లిష్ మీద విరుచుకుపడి, ‘చక్కగా తెలుగు మాట్లాడ్డమే, తెలుగుతో ప్రయోగాలు చెయ్యడమే నాగరికత’ అనుకునేంతగా తెలుగువారందరిలోనూ స్వాభిమానం గంతులు వేసేలా శైలీప్రకటన చెయ్యగల ధీరులు వొచ్చేవరకూ ఇంతే సంగతులు” రొప్పుకుంటూ ఆగింది బండి.

అవకాశం దొరికింది కదాని ముందుకి దూకి,

“ఓకే బాస్. ఏదో పెరిఫెరల్గా మాట్లాడుతూ, ఇంగ్లీష్ వైరస్ ఇంతగా గ్రో అవడానికీ మన రెసిస్టన్స్ లేమికీ గల కారణాలజోలికి వెళ్ళకుండానే ప్రాబ్లెమ్ ని మీరు డీప్ ఫ్రై చేసారనీ,  సాల్వ్ చేసే వర్క్ కి పూనుకున్నారనీ అర్థం అవుతోంది. ఏదెలావున్నా మీరు చెప్పినట్టు తెలుగువంటని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చెయ్యడం ముఖ్యం.  మొదటిగా తెలుగులాంగ్వేజ్  మిల్క్ ని విలేజెస్ నుంచి ముందురోజు నైట్ కలెక్ట్ చేస్కుని, దాన్లోవున్న కొద్దిపాటి ఇంగ్లీష్ నలకల్ని ఫిల్టర్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీనికి భాషాభిమానం అనే సుగర్ ని ఏడ్ చేసి, పరభాషాద్వేషం అనే చిటికెడు ఇలాచీ పొడిని మిక్స్ చెయ్యాలి.  ఇది ఎక్కువేస్తే పాకం స్పాయిల్ ఔతుంది సుమా.. తరువాత  డయలెక్ట్ అనే ఊక స్టవ్ మీద నేటివిటీ అనే ఇత్తడి కడాయిపెట్టి ఈ మిక్స్ ని డైరెక్ట్ గా వేసి కంటిన్యువస్ గా ఇడియమ్ అనే తెడ్డుతో తిప్పితే ఒకటి రెండు డికేడ్స్ అయ్యాక చక్కటి తెలుగుకోవా స్మూద్ గా టేస్టీగా వస్తుంది. ఈ పని కలెక్టివ్ గా తెలంగాణా ఉద్యమం రోజుల్లో రోడ్లమీద చేసిన వంటలంత ఇంటెన్సివ్ గా చెయ్యాలి.  నీ ప్రభావంతో నేను కూడా ఈజీ సొల్యూషన్స్ చెప్పేస్తున్నా చూసేవా శీనూ!  పోనీ కుంభకర్ణుణ్ణి బుల్లి రాక్షసులు నీడిల్స్ తో పొడిచినట్టు ఆన్లైన్ పిటిషన్స్ పెట్టి మీడియాని పొడుద్దామా?  సరే.  అదలా వుంచి, మన తెలుగు పాలకోవాలోకి వచ్చేద్దాం. డిఫెరెంట్ రుచున్న ఈ స్పెషల్ తెలుగు డిష్ వెరైటీని కొత్త జెనరేషన్ పిల్లలు ఎంజాయ్ చెయ్యటం స్టార్ట్  చేసారంటే తెలుగుమమ్మీ శ్రమ ఫలించినట్టే.  ఎక్సెలెంట్ టేస్ట్ తో ఉన్నఈ కొత్త తెలుగుభాష కాన్సెప్ట్ సినిమాల్లోకి ‘వర్కౌట్’ ఔతుంది. తెలుగు ఫిక్షన్లోకి కూడా ఇంపోర్ట్ ఔతుంది”  అని  చెప్పుకుపోతూ అంతలో తెలివి తెచ్చుకుని,  “అయ్యో, ఏంటో శీనూ, ఒక్కరగంట ఏ తెలుగు టీవీచానెల్ చూసినా, వాటిలో మూడోతరం తెలుగు సినిమా హీరోలూ ముంబై హీరోయిన్ల ముచ్చట్లు విన్నా నాకిలాంటి మాటలే ఒచ్చిస్తున్నాయ్.  వీళ్ళ మధ్య ఝాన్సీ లాంటి మేలిమి బంగారు  వ్యాఖ్యాతలక్కూడా కిలుం పట్టిపోతోంది.” అని గింజుకున్నాను.

“ఇంగ్లీష్, తెలుగు అనే రెండు అందమైన భాషలు పెళ్ళాడి బుజ్జి తెంగ్లిష్ ని ఎప్పుడు పుట్టించేయో మనకి సరిగ్గా అర్థం కాకముందే అది వామనావతారంలా ఎదిగి మననెత్తిన కాలు పెట్టేసింది. ఈ బిడ్డకి ఊబవొళ్ళు వొచ్చేసిందని  అనుకునేవాళ్ళు తక్కువమంది. ఆ కాలు కిందే ఇంకెన్ని తరాల తెలుగువాళ్ళు బతుకుతారో తెలీటం లేదు. ఇప్పటికే సగం చచ్చిన తెలుగు ఇంకే అవతారం ఎత్తుతుందో అంతకన్నా తెలీదు.  ఏంచేస్తాం? ఇప్పుడు నెమ్మదిగా మన చిన్నప్పటి తెలుగుపాఠానికి రా.  చెంపకు చెయ్యి పరంబగునపుడు కంటికి నీరాదేశంబగును. తెంగ్లిష్ నీకు ఎక్కినపుడల్లా చిన్నప్పటి ఈ సంధిసూత్రం గుర్తు తెచ్చుకుంటూ లెంపకాయ్ వేసుకో.  బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అన్నాడు వేమన. తెలుగుటీవీ ఏంకర్లనే గ్రహాంతరవాసుల్లోంచి ఉద్భవించి, సమాజానికంతటికీ పట్టిన తెంగ్లిష్ భూతాన్ని పచ్చపచ్చని తెలుగువేపమండల్తో తన్ని మరీ వదిలిస్తే తప్ప మనజాతి బాగుపడదు. జాతి మొత్తం గొడవ మనకెందుగ్గానీ నీపాటికి నువ్వు ఎప్పుడైనా టీవీ చూస్తే తెలుగు వేపమండల వైద్యం చేసుకుంటూ ఉండు” అంటూ ప్రకాశ్ రాజ్ లా నవ్వేడు మా శీనుగాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. శ్రీనివాసుడు says:

  **బెమ్మాండం ల.లి.త. గారూ! నాను శానా యేళ్ళనుండి రాద్దామనుకున్నది (అంటే, నాను రచైతని కాదు) తవరెంతో బాగా సెప్పినారు. దినామూ ఆ టి.వి. లంగరిల (లంగరుడు, లంగరి – యాంకర్) కిచిడీ, కలబంద యాసని, తెంగిలిపీసు గోసని తట్టుకోలేక శానా గడబిడలాడిపోతుంటాను. పొట్టసెక్కలయ్యేట్లు సేసినారు, అందుకోండి నా దండాలు!**
  (ఆరే కాదండీ, ఆ మధ్య ఆంధ్రదేశంలో నాలుగు అచ్చరముక్కలొచ్చిన జీవాలన్నీ అదే గోస)
  (గయితే, ఇక్కడో ఇసయం వుందండీ. ఎప్పుడైనా తగాదాలొచ్చినప్పుడు సిన్నప్పుడు ఇన్న దేవబాసలోనే బూతులు తిట్టుకుంటుంటారు, అదొక్కటే మినగాయింపు)

  • Lalitha P says:

   బూతులైనా తెలుగులో మిగిలేయని గెట్టిగా అనుకోకండి. పెద్ద కాన్వెంటుల్లో సదూకున్నోలు ఇంగిలీసు బూతుల్తోనే తగూలాడతారు. ఇప్పుడికైతే ఆల్ల జనాభా ఇంకా తక్కువే అనుకోండి…

 2. Buchireddy gangula says:

  ప్రబుత్వాలే English భూష కు పట్టం గడుతుంటే ??
  UNO , రిపోర్ట్ ప్రకారం మరణించే Telugu భాష 11 వ స్థానం లో ఉంది
  అది నిజం కానుంది –ఏమో ////
  లలిత గారు –భాగుంది –కాని కనఃయ..Kumar లా –అంటూ.
  JNU .ప్రెసిడెంట్. స్టాండ్. ఇస్ రైట్.
  ————————————
  Buchi reddy Gangula..

  • Lalitha P says:

   భావాలకి కొత్త భాషని అందించే కన్హయ్యాలు ఇప్పుడు ఇంకా రావాలనే నా ఉద్దేశ్యం బుచ్చిరెడ్డి గారూ. ఆఖర్నించి మూడో పేరా సరిగ్గా చదవండి. లెఫ్టిస్టు భావనాధారకు సరికొత్త జాతీయం తెచ్చాడు కనకే హిందూవాదుల దేశభక్తి ఉప్పెనకు ఎదురునిలవగల్గేడు. సీతారాం ఏచూరి వంటి మేధావులు చెయ్యలేని పని, అంటే సమసమాజం అనే భావనకు ఆకర్షణీయమైన భాషను అందించినవాడు కన్హయ్యా.

   • buchireddy gangula says:

    u.r.right..lalitha.garu…..
    విద్యార్థులంతా కనఃయ్య కుమార్ లా గళం విప్పే రోజు రావాలని ఆశిస్తూ

    ————————————————
    buchi. reddy.gangula.

 3. Sudhakar Unudurti says:

  ఈ జాడ్యపు మూల కారణాల గురించి పరిశోధించి విశ్లేషించే వ్యాసాలూ, చర్చలూ ఇంకా కావాలి. ఈ దిశలో మంచి ప్రయత్నం. అభినందనలు!

 4. శ్రీనివాసుడు says:

  ‘‘బూతులు మిగిలింది తెలుగులో’’ అని కాదండీ నా వుద్దేశెం. కాస్త సదూకున్నోళ్ళ, నాగరీకం నేర్చినవాళ్ళ బుర్రల్లో మిగిలేయి అనండి. కొన్ని కిర్రియలు, కొన్ని సొర్వనామాలు, అంటే, ‘‘చేశా, వచ్చా, వెళ్ళా, చూశా, అయింది, వచ్చింది, చూసింది, వాడు, వీడు, నీ, నా, నేను, వాళ్ళ, వీళ్ళ’’ లాంటి వాటి మద్దెలో తెంగిలిపీసు ముక్కలన్నీ తగిలించేసి వుపన్నేసేలిచ్చేత్తారండి’’.
  *********
  జీవద్భాష అయిన మాండలికాలకు మన ప్రభుత్వ, ప్రభుత్వేతర, వాణిజ్య, వర్తక, విద్య, ఉపాధి వ్యవహారాలన్నింటిలోనూ ప్రాధాన్యత ఇస్తే ఈ పరిస్థితి వుండేది కాదు.
  అయితే, దీనంతటికీ మూలకారణం తెలుగు అకాడెమీ అని నా నిశ్చితాభిప్రాయం. భాషను భ్రష్టుపట్టించింది తెలుగు అకాడెమీయేనని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పనిచేసిన ఆచార్యులొకాయన సెలవిచ్చారు. మాండలికాలను పాతరవేసి, రెండున్నర జిల్లాల తెలుగు నమూనాగా, సంస్కృతభూయిష్టంగా చేయడంలో దాని కృషి నిరూపమానం.
  పాశ్చత్య నమూనా విద్యావిధానం, పరిపాలనా విధానం, కార్యనిర్వహణావిధానంలోని పాఠ్యమంతా ఆంగ్లభాషలోనే ఉండండంవల్ల ఆ భాషలోని పదాలకి సమానమైన వాడుక భాషలను వెదికి అన్నిచోట్లా ఉపయోగింపజేయడంలో విఫలమైంది అకాడెమీ. సంస్కృత సమాసాలతో కూడిన తెలుగు మాటలను ఆంగ్ల సమానార్థకాలుగా చేయడంలో అవి ప్రజలకు నోరుతిరగక తేలిగ్గా పలకగలిగే ఆంగ్లపదాలకే అలవాటుపడ్డారు.
  అదే సమయంలో ఆంగ్లమాధ్యమంలో చదువులకు గత మూడు దశాబ్దాలుగా గిరాకీ పెరిగి, వాటిలో చదువుకునే తరానికి ఇంగ్లీషు, తెలుగుల సంకర తెంగిలిపీసు ఒంటపట్టింది.
  రెండున్నర జిల్లాల నమూనా భాషనే తెలుగు మాధ్యమాలు, ముఖ్యంగా పత్రికలు వినియోగించడంవల్ల భాషలోని పదాలు సగం ఉపయోగంలేక త్రుప్పుపట్టిపోయాయి.
  చదువుకున్నవాళ్ళకోసం తీసేవే సినిమాలు కాబట్టి విద్యార్థులు ఏది మాట్లాడితే దాన్నే సంభాషణలుగాపెట్టి, తమ విశేష సృజనతో వేనవేల తెంగిలిపీసు పదబంధాలు సృ‌ష్టించి, తెలుగుకు కట్టిన సమాధిలో తామూ పాలుపంచుకున్నారు సినీ రచయితలు.
  ఇలా ‘‘నీచే, నాచే, వరమడిగిన వాసుకి చేతన్’’ అంటూ తెలుగు చావుకు సవాలక్ష కారణాలు. ఈ విషయంలో తమిళనాడును చూసి బుద్ధి తెచ్చుకోవడం మంచిది. అక్కడ ఏ క్రొత్త ఆంగ్లపదం వారి భాషలోకి వచ్చినా వెంటనే పండితులు కూర్చుని దానికి సమానమైన తమిళపదాన్ని ఎన్నుకుంటారు.
  ఆంగ్లం అనేది ఫ్యాషన్ స్థాయిని దాటి, స్టేటస్ స్థాయికి వచ్చి, అడిక్షన్ స్థాయిలో అలరారుతోంది ప్రస్తుతం.
  ఇదంతా నా పాక్షిక అవగాహన మాత్రమే. సమగ్రంగా పరిశీలిస్తే ‘‘సాంస్కృతిక విధ్వంసంలో ఇది కూడా పాయ’’ అని తెలుస్తుందేమో!
  ఇప్పటికయినా సమస్త దృశ్య, శ్రవణ మాధ్యమాలు తమ సృజన, సమర్పణలలో మాండలికాలే వాడితే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు.
  ఇప్పుడు చెప్పినదంతా నా ప్రాంత మాండలికంలో వ్రాయలేకపోయిన నేను కూడా దోషిని, బాధితుడిని.
  అమ్మనుడి, స.వెం. రమేశ్ లాంటివారి కృషి ఫలిస్తుందేమో వేచిచూడాలి.

 5. కె.కె. రామయ్య says:

  ” హిందూవాదుల దేశభక్తి ఉప్పెనకు ఎదురునిలవగల్గేడు కన్హయ్యా. సమసమాజం అనే భావనకు ఆకర్షణీయమైన భాషను అందించినవాడు కన్హయ్యా. భావాలకి కొత్త భాషని అందించే కన్హయ్యాలు ఇప్పుడు ఇంకా రావాలనే నా ఉద్దేశ్యం ” JNU స్టూడెంట్ లీడర్ కన్హయ్యా కుమార్ పట్ల కలిగిన అభిమానానికి authenticity కలిగించిన ల.లి.త. గారికి వొందనాలు. లాల్ సలాం.

 6. Satyanarayana Rapolu says:

  వేదనను కూడ వ్యంగంగ, ఆవేదనను కూడ అందంగ చెప్పగలిగే మీ నేర్పరి తనానికి అభినందనలు. ప్రసార మాధ్యమాల భాషా ప్రమాణాలు భయం పుట్టిస్తున్నయి. తెలుగు వెలుగులు ప్రసరింప చేస్తున్నది మేమే నని ప్రగల్భాలు పలికే వారు ‘వైద్యశాల’ బదులు ‘ఆసుపత్రి’ వంటి అవకర పదాన్ని శైలీ ప్రకటన చేసి రుద్దుతున్న తీరు బాధ కలిగిస్తున్నది. అవి తెలుగునే కాదు; ఇంగ్లిష్‌ను కూడ భ్రష్టు పట్టిస్తున్నయి. ఈమెయిల్ అడ్రెస్ చెప్పెటప్పుడు ‘ఎట్’ అనవలసిన @ గుర్తును ఎట్ ద రేట్/ ఎట్ ద రేట్ ఆఫ్ అని మతి పోగొట్టుతున్నరు తెంపరి తెంగ్లిష్ వ్యాఖ్యాతలు.

 7. విన్నకోట నరసింహారావు says:

  తెలుగు భాష భ్రష్టు పట్టిపోతున్న వైనం గురించి ఆవేదనతో బాగా చెప్పారు ల.లి.త.గారూ.
  మీరు “పాలు” అని వ్రాసిన దానికి చిన్న సలహా – టీవీ ఏంకరిణులు పుఠం వేసినా “పాలు” అనే అవకాశాలు తక్కువ, “మిల్క్” అనే అంటారు. పైగా పాలకోవాని మిల్క్ కేక్ అనగల సమర్ధులు కూడా వాళ్ళు :)
  మీరిచ్చిన ఉదాహరణలే సరిపోతాయి, కానీ నా ఆక్రోశం కూడా చూపించడానికి నేనూ కొన్ని ఉదాహరణలిస్తాను. టీవీ వాళ్ళకి పాలెప్పుడూ మిల్కే, నీళ్ళెప్పుడూ (వాళ్ళల్లో కొంతమంది ఉచ్ఛారణ ప్రకారం “”నీల్లు”) వాటరే, నూనెప్పుడూ ఆయిలే, పంచదారెప్పుడూ షుగరే, ఉప్పు సాల్టే, బియ్యం రైసే, ఉల్లిపాయలు ఆనియన్సే, టొమాటో గుజ్జు/ముద్ద ప్యూరీనే, ఒకదానికొకటి కలపడం ఏడ్ చెయ్యడమే, వేడిచెయ్యడం హీట్ చెయ్యడమే, వేయించడం ఫ్రై చెయ్యడమే (కానీ వీళ్ళకి ఫ్రై చెయ్యడానికీ, రోస్ట్ చెయ్యడానికీ తేడా తెలియదు మళ్ళీ, రెండింటికీ ఫ్రై చెయ్యడమే); ఇంకా ఇతర భాషా పదాల మోజంటే – జీడిపప్పు కాజూనే, ఏలక్కాయలు ఇలాచీనే, వేరుశనగగింజలు పల్లీలే. ఒకటా రెండా వీళ్ళు చేసే భాషా విన్యాసాలు!
  కొన్ని అన్యభాషా పదాలు వాడుకలోకి వచ్చి జేరడం కొంతవరకూ జరుగుతుంది, కానీ టీవీ వాళ్ళకి అలా తెంగ్లిష్ మాట్లాడటమే ఫాషన్ అనుకుంటున్నట్లున్నారు. దురదృష్టకరం ఏమిటంటే టీవీ ప్రభావం వలన సామాన్య జనం కూడా అలా మాట్లాడటమే ఫాషన్ కాబోలు అనుకుని అలవాటు చేసుకుంటున్నారు. అలాగే వంటల కార్యక్రమంలో పాల్గొనే మహిళలు కొంతమంది వాళ్ళు చేసే వంటకానికి తెలుగు పేరు కాకుండా, హిందీ / ఇంగ్లిష్ పేర్లు పెడితేనే గొప్పగా ఉంటుందనే భావనలో ఉన్నట్లు కనబడతారు (ఉదాహరణకి – కద్దూ కా హల్వా).
  మీరు వంటల కార్యక్రం ఉదాహరణగా ఇచ్చారు కాబట్టి నేను కూడా వాటికి సంబంధించే పై పేరా వ్రాసాను. తతిమ్మా టివీ కార్యక్రమాల్లో కూడా పెద్ద తేడా ఏమీ కనబడదు – వార్తలు, సీరియళ్ళు, గేం షోలు, ప్రత్యక్ష దైవాలు అని వాళ్ళు అనుకునే సినిమా వాళ్ళతో మైమర్చిపోయి ముచ్చట్లు / చర్చలు, పొద్దున్న లేచినప్పటినుంచీ ఒక్కో సినిమా గురించి చెప్పడం (ఏదో డాక్టరేట్ థీసిస్ విశదీకరిస్తున్నంత ఇదిగా చెప్తుంటారు). చాలా భాగం తెంగ్లిష్‌లోనే.
  మీరు చెప్పినట్లుగా టీవీ వాళ్ళకి శిక్షణనిప్పించడం టీవీ యజమానులకి పెద్ద పనేమీ కాదు, ఆర్ధికస్ధోమత ఆన్న ప్రశ్నా కాదు. కానీ టీఆర్పీలు, ఆదాయం, లాభాల మోజులో పడిపోయిన వాళ్ళకి అటువంటి సలహాలేమయినా రుచిస్తాయంటారా? ఇటువంటి భాషతో కార్యక్రమాలు చేస్తున్నా కూడా టీఆర్పీలు పెరుగుతున్నాయి కదా.
  మరొకటి కూడా ఉంది. స్కూల్లో తెలుగు బదులు మార్కులు బాగా వస్తాయని సంస్కృతం తీసుకోవడం – దీని కారణంగా కూడా తెంగ్లిషే వస్తుంది మరి.
  ఏతావాతా తెలుగు భాష పూర్తిగా భూస్ధాపితం అయిపోవడం తప్పదనిపిస్తోంది :(

 8. శ్రీనివాసుడు says:

  ‘‘ఒక భాష ఎలా మరణిస్తుందంటే మన భాషను మాట్లాడటానికి మనమే సిగ్గుపడినప్పుడు, గొప్పగా భావించే భాషకు దాసోహమని, చొంగలు కార్చినప్పుడు, మన తరువాతి తరాలవారికి మన భాషను అందించలేకపోయినప్పుడు. మాట్లాడేవారు కరువైపోయి క్రమంగా మృతభాషగా మారుతుంది. ప్రాంతీయభాషలను ఆయా పాఠశాలల్లో నేర్పకపోవడంమూలానకూడా ఆయా భాషలు మృతభాషలుగా మారే అవకాశంవుంది. ప్రాంతీయభాషల మనుగడలో, వాటిని మాట్లాడేవారి సంస్కృతి పరిరక్షణలో పాఠశాలలు కీలకపాత్రం వహిస్తాయి.‘‘
  ‘‘అమ్మనుడి’’, మార్చి 2016,
  ‘‘భాష – అంతర్జాతీయ భావన’’ – ఆంగ్లమూలం జోగాసింగ్

 9. Ovvs ramakrishna says:

  మేడమ్! నమస్తే. ఆలస్యంగా స్పందిస్తున్నాను. క్షమించాలి.నా ఉద్దేశ్యంలో ఆంగ్ల భాషలో చదివితేనే ఉపాధి,ఆంగ్లంలో మాట్లాడితేనే గౌరవం.అనేఒక అబద్ధపు వాతావరణం చుట్టూ ఉండడం వలన ఈ తెంగ్లిష్ భూతం విజృంభిస్తున్నది. దీనికి మనలను ఏలేవారి భావదాస్యమే కారణమనిపిస్తుంది.

 10. Satyanarayana Rapolu says:

  HINGLISH AND TELUGISH WORDS
  This is with reference to the news item ‘Hilarious translation in AP, TS websites’ (The Hans India, April 4, 2015). It was really amusing to find such funny words. It happened just because of depending upon translation software. But, it makes me more perplexed how some silly words are being promoted in media and literature by learned folks. With the advent of British rule, missionaries also came here. In order to reach the public, they modified many Biblical and English words in pronunciation as if they were of native tongue. For example; Christ, Mary, John, Matthew, David, Baptism and Paradise were changed as kreestu, mariya, yOhaanu, mattayi, daaveedu, baapteesmamu and paradaisu respectively. Though, the word vaidyaSaala was there for a medical aid institution, the Hospitals started by them were called ‘aspataal’ in North and ‘aasupatri’ in South India instead of ‘vaidyaSaala’. These ‘aspataal’ and ‘aasupatri’ words find place in daily media and official websites of Indian languages. So, I request the native language users to leave the Hinglish and Telugish words and to see that ‘vaidyaSaala’ shall be in use for a hospital like ‘paaThaSaala’ for a school.
  Dr Rapolu Satyanarayana, Palakurthi, Warangal District, TS

మీ మాటలు

*