కథలో మాండలికం ఎంత వరకూ?!

 

-టి. చంద్రశేఖర రెడ్డి

~

ఈ వ్యాసం-విభిన్న మాండలికాల్లో తెలుగు కథలు రాయటం గురించి.

ఒకప్పుడు కథలు గ్రాంథిక వచనంలో రాయబడేవి. తర్వాత అవి వ్యావహారిక భాషలో రావటం మొదలైంది. అడపాదడపా ఆ దశలోనే కథలు మాండలికంలో రావటం కూడా ఆరంభమైంది. ఈ ధోరణి ఊపందుకని ఇప్పుడు చాలా కథలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భిన్నప్రాంతాల మాండలికాల్లో వస్తున్నాయి. తెలంగాణా, రాయలసీమ, కోస్తా జిల్లాల మాండలికంలో; దాంతో పాటు ఇంతకు ముందు ఉపయోగించిన వ్యావహారిక భాషలో; ఆయా ప్రాంతపు రచయితల కలాలనుంచి కథలు జాలువారుతున్నాయి. ఈ ధోరణిలో స్పష్టంగా కనపడే విషయం-ఒక ప్రాంతపు రచయితలు, వాళ్ల కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలోనే రాయకుండా, ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగంలో ఉన్న వ్యావహారికభాషలో సైతం రాయటం.

కథ రెండు భాగాలుగా చెప్పబడుతుంది. కథకి సంబంధించిన నేపథ్యం, ప్రస్తుత పరిస్థితులూ, పరిసరాలూ మొదలైనవి ఒక భాగం. రెండో భాగం పాత్రల మధ్య సంభాషణ.

కొంతమంది రచయితలు, కథలో రెండు భాగాలనీ అంటే మొత్తం కథని; వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాస్తున్నారు. ఉదాహరణకు కె. ఎన్. మల్లీశ్వరి గారి కథ “టెంకిజెల్ల”(ఆదివారం వార్త, 2 అక్టోబర్ 2011; కథ 2011 కథా సంకలనం), కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె  సుక్క’ (బతుకమ్మ,3 ఆగస్ట్ 2014, ప్రాతినిధ్య 2014 కథా సంకలనం), స. వెం. రమేశ్ గారి కథ ‘పాంచాలమ్మ పాట’ (విశాలాక్షి అక్టోబర్ 2014-ప్రాతినిధ్య 2014 కథా సంకలనం).

కొంతమంది రచయితలు పాత్రల సంభాషణని మాత్రమే వాళ్లెన్నుకున్న ప్రాంతపు మాండలికంలో రాసి, మిగిలిన కథని; పైన చెప్పిన వ్యావహారికభాషలో రాస్తున్నారు. ఉదాహరణ-బెజ్జారపు రవీందర్ గారు రాసిన ‘మూడు తొవ్వలు’ కథ (ఆదివారం ఆంధ్ర జ్యోతి 23 అక్టోబర్ 2011, కథ 2011 కథా సంకలనం).

కొన్ని మాండలికాల్లో,  ఒక ప్రాంతపు వాళ్లకి తెలిసిన పదాలు, కొంచెం మార్పుతో మిగిలిన ప్రాంతాల్లో సైతం వాడబడతాయి. అలాంటి పదాల్ని ఏ మాండలికంలో రాసినా, ఆ మాండలికంతో పరిచయం లేని  పాఠకులు కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. దీనికి కారణం, ప్రాథమికంగా వాళ్లకు పరిచయమున్న పదమే, ఉచ్ఛారణ పరంగా కొంత మార్పుకు లోనయి కథలో కనబడటం.

ఉదాహరణకు-చెప్పాడు అనే పదం. ఇది- చెప్పిండు, చెప్పినాడు గా మిగిలిన ప్రాంతాల్లో వాడబడుతోంది. దీని వలన చెప్పాడు అనే పదంతో పరిచయం ఉన్న  పాఠకుడు; చెప్పిండు, చెప్పినాడు పదాల విషయంలో చదవటానికి కానీ, అర్థం చేసుకోవటానికి కానీ ఎలాంటి అసౌకర్యానికీ గురి కాడు.   కాని, కొన్ని పదాలు పూర్తిగా ఆ ప్రాంతానికే పరిమితం. పాంచాలమ్మ పాట కథలో ఉపయోగించబడ్డ- బడిమి, ఇడవలి, అడిమ లాంటివి.

ఏ కథలో అయినా తెలిసిన పదాలని చదవడం, అవి చదవగానే అర్థం అవుతుంటే ముందుకు సాగడం సులభం. కారణం, ఉచ్ఛారణపరంగానైనా, అవగాహనపరంగా అయినా ఆ పదాలు తెలిసిన వాళ్లకి కథని అవగాహన చేసుకోవడంలో అవరోధాలు అనిపించవు కనక. నిజం చెప్పాలంటే ‘టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’,  ‘పాంచాలమ్మ పాట’ కథలతో పోల్చుకుంటే ‘మూడు తొవ్వలు’ కథ నేను నాకున్న పరిమిత తెలుగు భాషా జ్ఞానంతో ఎక్కువ సౌకర్యవంతంగా చదవగలిగాను. కారణం-అందులో కథనం నాకు తెలిసిన భాషలో ఉండి, సంభాషణల వరకు మాత్రమే, సంబంధించిన పాత్రలు వాటి మాండలికంలో మాట్లాడుకున్నట్లు రచయిత రాయటం.

కథ చదవటం వేరు, కథని అర్థం చేసుకోవటం వేరు, కథని అనుభవించటం వేరు. టెంకిజెల్ల’, ‘నూనె సుక్క’, ‘పాంచాలమ్మ పాట’ కథలు, పూర్తిగా ఆయా ప్రాంతపు మాండలికాల్లో రాయటం వల్ల, వాటిల్లో ఎంత చదివించే గుణం ఉన్నా; చాలా పదాలకి అర్థం తెలియక పోవటం వలన నేను పట్టిపట్టి చదవాల్సి వచ్చింది. దీని వల్ల నేను ఆ కథలని చదవటం వరకే పరిమితమయ్యానని అనిపించింది. అర్థం చేసుకోవటం, అనుభూతిని పొందటం విషయంలో నన్ను నేను పూర్తిగా సంతృప్తి పరుచుకోలేక పోయినట్లుగా కనిపించింది.

బహుశా ఈ అనివార్య పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని అనుకుంటాను-కొన్ని కథల చివర, ఆ కథలో ఉపయోగించబడ్డ ఏ పదాలైతే మిగిలిన ప్రాంతాల పాఠకులకి తెలియటానికి అవకాశం లేనివని అనిపిస్తున్నాయో వాటి పట్టిక, అర్థాలతో  ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ పట్టిక, కొన్ని కారణాల వల్ల ఇవ్వబడిన ఉద్దేశాన్ని నెరవేర్చటంలో విఫలమవుతోంది. ఎలాగంటే-

పాంచాలమ్మ పాట కథలో నాకు తెలియని పదాలు 97.   ప్రాతినిధ్య 2014 కథా సంకలనంలో ఈ కథ క్రింద, ఆ కథలో వాడబడిన మాండలిక పదాల పట్టిక వాటి అర్థాలతో ఇవ్వలేదు. అప్పటికీ ‘శబ్దార్థ చంద్రిక’ ని సంప్రదించి దడము, అలమట, కయ్య అనే పదాల అర్థం తెలుసుకుని ఆ పదాలను వాడిన సందర్భాలను అవగాహన చేసుకోగలిగాను. కాని. నిఘంటువులొ సైతం లేని అడిమ లాంటి పదాల విషయంలో ఏమీ చెయ్యలేకపోయాను. ఆ పదం నిఘంటువులో  చేర్చబడక పోవటానికి కారణం-నిఘంటువులో ఉన్న విధంగా రచయిత ఆ పదాన్ని రాయకపోవటమా? రాసినా అది ముద్రారాక్షసచర్యలకి గురి కావటమా? తెలుసుకోలేక పోయాను. వెలుతురు ప్రసరించాల్సిన సందర్భంలో ఇలా కొన్ని పదాలు, వాటి పెదాలు విప్పకపోవటం వలన అవగాహనారాహిత్యపు అంధకారంలో  చిక్కుకుపోయాను.

టెంకి జెల్ల కథలో నాకు తెలియని పదాలు 41 ఉన్నాయి.  అందులో 20 పదాలకు మాత్రమే, కథ 2011 సంకలనంలో కథ చివర అర్థం ఇవ్వబడింది. అందులో ఒకే అర్థం వచ్చే పదాలు 12 ఉన్నాయి.  మిగిలిన తొమ్మిది పదాల అర్థం తెలుసుకోవటానికి శ్రమించాల్సి వచ్చింది.  ఇది కాక, ఈ కథ విషయంలో నాకు ఇంకొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కథకి పేరుగా పెట్టబడిన ‘టెంకి జెల్ల’ పదానికే అర్థం తెలియలేదు. జెల్లకాయ అంటే చెంప దెబ్బ అని, నిఘంటువు చెపుతోంది. టెంకిజెల్లకి అర్థం కనపడలేదు. కథ చివర అర్థం ఇవ్వబడిన మాండలికాల్లో; జాకర్లు, కమ్మగట్టడం అనే పదాలు ఉన్నాయి. కానీ, ఆ పదాలు కథలో ఎక్కడా కనపడలేదు. నబవరులు అనే పదం కూడా ఇచ్చారు. కానీ కథలో సబవరులు అనే పదం మాత్రమే ఉంది. రెండిట్లో ఏది ముద్రణా దోషమో తెలియ లేదు.  గత్తర-అంటే ‘చెత్త’ అని అర్థం ఇచ్చారు. నాకు తెలిసి ఆ పదం అర్థం ‘ఉపద్రవం’. తెలుగు నిఘంటువు కూడా అర్థం అదే చెపుతోంది. పట్టికలో ఇచ్చిన ‘చెత్త’ అనే అర్థం, కథలో ఆ పదం వాడబడిన సందర్భంలో సరిగా ఇమడలేదు.

దీన్ని బట్టి అనిపించిందేమిటంటే- ఆ కథలో మిగిలిన ప్రాంతాల పాఠకులకు తెలియనివనుకుని  పదాల పట్టిక తయారు చేసినవాళ్లు, అన్ని ప్రాంతాల పాఠకుల భాషాజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ పట్టికని తయారించలేదని.

నేను ఆ కథ చదివిన సంకలనంలో కొట్టం రామకృష్ణారెడ్డి గారి కథ ‘నూనె సుక్క’ చివర కూడా; పాఠకుడికి తెలియని పదాలూ, వాటి అర్థాలూ ఇవ్వబడలేదు. అయినా, కథలో వాడిన భాష; ఉద్యోగరీత్యా నేను కొన్ని సంవత్సరాలు నివసించిన ‘మహబూబ్ నగర్’ జిల్లాది కావటం వలన కథలో నాకు తెలియని పదాలు తక్కువగా ఉన్నాయి.  మిగిలిన తెలియని పదాల అర్థాలు కూడా, రచయితకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. కాని, ఒక ప్రాంతపు మాండలికాన్ని అర్థం చేసుకోవటానికి, అలా ఆ ప్రాంతంలో నివసించి ఉండటం అనే అవకాశం అందరికీ దొరకనిది.

నేననుకోవటం-‘పాఠకుడికి తెలియని పదాలు’ అన్నది ఒక అయోమయానికి గురి చేసే పదసమూహమని.   ఎందుకంటే, ఆ పదాలని, కథ రాసిన రచయిత గుర్తిస్తే, ఆ పట్టిక అసంపూర్ణంగా ఉండే అవకాశం ఎక్కువ.  టెంకి జెల్ల-కథ చివర్లో ఇచ్చిన పట్టిక, దీనికి దృష్టాంతం. వాస్తవానికి, ఒక ప్రాంతంలో వాడే పదాల్లో, మిగిలిన ప్రాంతానికి తెలియని పదాలు; ఆ మిగిలిన ప్రాంతాల వాళ్లే నూటికి నూరు శాతం గుర్తించగలరు. అలా గుర్తించబడిన పదాలకు, అసలు కథా రచయిత ద్వారా అర్థాలు చెప్పిస్తే ఆ పట్టిక తనకు నిర్దేశించిన పనిని నిర్దిష్టంగా చేయగలదు. అలా కాకుండా, ఏ కథ చివర ఏ కథారచయితయినా తానే తయారు చేసి ఒక పట్టిక ఇస్తే, అది ‘కంటి తుడుపే’ కాగలదు.

కథని చదవడం పాఠకుడిగా నాకు నేనై నా భుజాల మీద ఎత్తుకున్న బాధ్యత కనక, అది ఏ రూపంలో ఉన్నా చదవడం నాకు అవసరం. ఏ  కథలో పాత్రలు ఐనా ఒక ప్రాంతపు జీవితాల్లోంచి తీసుకోబడినపుడు, ఆ పాత్రలు ఆ ప్రాంతపు భాషలో మాట్లాడటం సహజం. కథకుడు, ఆ పాత్రల సంభాషణని ఆ ప్రాంతపు భాషలో వ్రాయటం కూడా సముచితం. కాని, సంభాషణలు కాక మిగిలిన కథంతా అదే భాషలో ఉండటం అవసరమా?

అవసరమే అని అలాంటి కథా రచయితలు విశ్వసిస్తే, ఒక ప్రాంతపు జీవితాల్ని  మిగిలిన ప్రాంతాల వాళ్లకి ఆ రచయితలు సంపూర్తిగా పరిచయం చేయాలనుకుంటే, ఆ ప్రాంతపు భాషలో మిగిలిన ప్రాంతాల వాళ్లకి తెలియటానికి అవకాశం లేని పదాలన్నిటినీ ఆ కథతో పాటు విధిగా పరిచయం చెయ్యాలి. అప్పుడే రకరకాల ప్రాంతాల మాండలికాల్లో రాసిన కథలని; తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల పాఠకులు అర్థం చేసుకోగలరు. సరైన అనుభూతి పొందగలరు. అది సమగ్రంగా జరగనంతవరకూ, కొన్ని కథలు నాలాంటివాళ్లకి అసమగ్రంగానే అర్థమవుతాయి. అసంతృప్తిని మిగులుస్తాయి.

నా దృష్టిలో ఈ సమస్యకి పరిష్కారం: కథ అర్థం కాని, చేసుకోలేని పాఠకుల చేతుల్లో లేదు. కొంత కథారచయితల చేతుల్లో, మిగిలింది ఆ కథలు ప్రచురిస్తున్న మాధ్యమాల చేతుల్లో ఉంది.

ఈ పరిశీలన చేస్తున్న సమయంలో నేను చదవడం తటస్థించిన ఓ ప్రాంతపు మాండలికంలో రాయబడ్డ-ఒక కథ విషయంలో, కొంత స్వేచ్ఛ తీసుకుని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకున్నాను. ఆ కథ చదివిన అనుభూతి నాలో ఇంకా పచ్చిగానే ఉండగనే, ఆ కథని మొత్తం నాకు తెలిసిన వ్యావహారిక భాషలో రాసుకున్నాను. అసలు కథ పేరుకి సమానార్థం ఉన్న, నేను మాట్లాడే మాండలికంలో ఉన్న పదాన్ని, కథకి పేరుగా పెట్టుకున్నాను. అసలు కథ చదివిన అనుభూతిలోనుంచి పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత, ఆ కథ నా స్మృతిపథంలోంచి చాలా వరకూ మరుగయేదాకా, మానసిక విరామం ఇచ్చి; నేను తిరగ రాసుకున్న కథని మరోసారి చదివాను. కథ ముగింపు ముందే తెలిసి ఉండటంవలన నాలోంచి తొలిగిపోయిన ఉత్కంఠతని మినహాయించి; అసలు కథ అందించిన అనుభూతికీ, నేను రాసుకున్న  కథ చదివి పొందిన అనుభూతికీ చెప్పుకోదగినంత తేడా చవిచూడలేక పోయాను.

ఈ అధ్యయనం వల్ల, మానవజీవితాలకు సంబంధించిన కొన్ని అనుభూతులకు, ప్రాంతాల ప్రమేయం ఉండదని నా వరకు నాకు తోచింది. ఇక పోతే, భాష అవరోధమా కాదా అనేది ఒక కథలో వాడిన మాండలికంతో అసలు పరిచయం లేని ఇంకో పాఠకుడెవరైనా ఆ కథని చదివి చెప్పవలసిన విషయం అని అనిపించింది.

అయితే, కథనం మాత్రం ఒక ప్రాంతపు మాండలికంలో ఉండి; సంభాషణలు అందరికీ పరిచయం ఉండటానికి అవకాశం ఉన్న భాషలో రాయబడ్డ కథలు ఇంతవరకూ నేను చదవటం తటస్థించలేదు. రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయేమో?

ఈ లోపులో కోరుకోవాల్సిన విషయం మరోటుంది. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగి; ఆ ప్రాంతపు భాషతో విస్తృత పరిచయం ఉన్న రచయితలు; తమకు పరిచయం లేని మాండలికంలో కథలు పూర్తిగానో, సంభాషణల వరకో రాసి ఆ కథలని బలహీనపర్చే ప్రయత్నం చేయకుండా ఉంటే చాలని. ఈ ధోరణి ఈ మధ్య ఒక కథలో కనపడింది. అందుకనే ఈ మాట కూడా చెప్పాల్సి వచ్చింది.

***

మీ మాటలు

  1. jaya reddy boda says:

    కథ మాండలికం గురించి మీ అభిప్రాయం బాగుంది,బాగా చెప్పారు

  2. Yalla Atchuta Ramayya says:

    మీ డిమాండ్ చాలా న్యాయంగా ఉంది. మంచి పరిశీల నాత్మక వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.

  3. చందు తులసి says:

    కొన్ని కథలకు మాండలికం అదనపు బలాన్నిస్తుంది. ఇంకొన్ని టికి గుదిబండగానూ మారుతుంది.. కాబట్టి సందర్భమూ, అవసరమూ
    గుర్తించి వాడటం మేలు.
    మీ వ్యాసం బాగుంది చంద్రశేఖర్ రెడ్డి గారూ.

  4. Bhavani Phani says:

    తెలుగు కథల్లో మాండలీకం ఏ విధంగా వాడబడుతోందో చాలా వివరంగా విశ్లేషించారు . మా వంటి వారికి ఎంతో ఉపయోగకరం . ధన్యవాదాలు

  5. శ్రీనివాసు says:

    చాలా మంచి పరిశీలన. అయితే, మాండలికాలలోని జీవలక్షణం ప్రతిఫలించాలంటే కథ చివర పదపట్టికను తప్పనిసరిగా పొందుపరచినచో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని నా భావన.

మీ మాటలు

*