అట్టడుగు ముస్లిం రచయిత ‘అలీ’

-స్కైబాబ
~
ముస్లింవాద సాహిత్యంలో అట్టడుగు ముస్లింలలోంచి కవిగా రచయితగా తన గొంతుక బలంగా వినిపించినవాడు అలీ. తొలుత ‘పాన్‌మరక’ అలీగా, తరువాత ‘హరేక్‌మాల్‌’ అలీగా పేరుబడ్డ అలీ ‘పాన్‌మరక’ ‘జఖమ్‌’ ‘తమన్నా’ ‘గర్జన’ కవితా సంపుటులు, ‘జఖమ్‌’ కరపత్ర కవిత్వం, ‘హరేక్‌మాల్‌’ కథల సందూఖ్‌ వేశాడు. ఇంకా తన రచనలు వెలువరించే ప్రయత్నంలోనే ఉన్నాడు. అలాంటి అలీ సెల్‌ఫోన్‌ నుంచి మార్చి 6 అర్ధరాత్రి తను చనిపోయినట్లు కాల్‌ వస్తే ఎంతకూ నమ్మబుద్ధి కాలేదు. ‘అయ్యో! ఇంకా అతని జీవితంలోంచి మరిన్ని ముఖ్యమైన రచనలు రావలసి ఉండె కదా అని, ఈ మధ్యనే బిడ్డ షాదీ చేశాడు కదా, ఇంకా పెళ్లి కాని పిల్లలున్నారు కదా అని మనసు పిండేసినంత బాధయ్యింది.
మూడేళ్ల క్రితం హార్ట్‌ ప్రాబ్లమ్‌తో దవాఖానాలో చేరాడు అలీ. గుండె ఆపరేషన్‌ చేయడానికి అతని శరీర స్థితి సహకరించదని డాక్టర్లు చెప్పారు. దాంతో ఎలాగో అలా నెట్టుకొస్తున్నాడు. మార్చి 6న నల్లగొండలో ఒక ముషాయిరాలో పాల్గొనడానికి పేరు ఇచ్చాడు. రాత్రి ఎనిమిదింటికి కవిత రాస్తూ కూర్చున్నాడు. 9 ప్రాంతంలో శ్వాస తీసుకోవడం కష్టమవడంతో దవాఖానాకు తీసుకెళ్లారు. ముషాయిరా నిర్వాహకులు అలీ పేరు పిలవడానికి అతను కనిపించకపోవడంతో అతని సెల్‌కు ఫోన్‌ చేశారు. హార్ట్‌ ఎాక్‌తో అతను చనిపోయాడని విని విస్తుపోయారు!
నల్లగొండ పట్టణంలో పాన్‌డబ్బా నడుపుకుంటున్న అలీని 1986 చివరలో పరిచయం చేసుకుని ఆయన పాన్‌డబ్బా జీవితంపై కవిత కావాలని అడిగాను. పేజీలకు పేజీలు కవిత రాశాడు అలీ. దాన్ని మూడు పేజీలకు కుదించి ‘జల్‌జలా’లో మొదటి కవితగా చేర్చాను. 1998లో వెలువడిన ‘జల్‌జలా’ కవిగా అలీ పేరు మారుమోగిపోయింది. ఆ తరువాత ‘పాన్‌మరక’ పేరుతోనే అతను కవితా సంపుటి వేశాడు. ముస్లింల జీవితంలోని ఒక పాత్రే సాహిత్యకారుడుగా తెలుగు సాహిత్యంలో ఇన్నాళ్లు సంచరిస్తూ రావడం విశేషం. మన దేశంలోని, ముఖ్యంగా తెలంగాణలోని ముస్లిం జీవితాలకు సజీవ సాక్షిగా అలీ జీవితం గడిచింది. తన జీవితమంతా గరీబీనే తోడుగా నడిచిన కవి అలీ. సచార్‌ కమిటీ, మిశ్రా కమీషన్‌ రిపోర్టుల నేపథ్యంలో చూస్తే అలీ భారతీయ ముస్లింల ముఖచిత్రం.
అతని కవితా పాదాల్ని తడిమితే-
‘ప్రతిరోజు ఎంతోమంది నోళ్లు పండిస్తుాంను/ కాని నా బతుకే పండట్లేదు /నేనమ్మిన కింగ్‌సైజ్‌ సిగరెట్టే/ నా గరీబీ బీడీ వైపు చీదరింపుగా చూస్తుంది’ అప్పట్లోనే డిగ్రీ చేసిన అలీ ‘ఫ్రేంలో బంధించబడ్డ నా పట్టా/ బూజు పట్టిన గోడకు/ పాత క్యాలెండర్‌లా వేలాడుతుంది’ అంటూ ‘ఇంటర్వ్యూలకైతే పిలుస్తారు/ తీరా నా పేరు ‘అలీ’ అని తెల్సుకొని చిత్తు కాగితంలా విసిరేస్తే/ ఎండుటాకులా మిగిలిపోయాను’ ‘అలీ గల్లీకొచ్చి చూడు/ సోరుప్పు రాలే గోడలు/ సిమెంటు అతికిన ఉప్పుదేరిన కుండలు/ పగిలిన కవేలీ కప్పులు/ ఇమ్మిచ్చిన అర్రలు/ దిల్‌కే ఉప్పర్‌ థర్మామీటర్‌ రక్కే దేఖో/ ఓ కిత్‌నా దర్ద్‌ బతాయేగా!’ లాంటి ఎన్నో తాత్వికమైన కవితా పాదాలు ‘పాన్‌మరక’ కవితలో చూస్తాం. ఆ కవితను ముగిస్తూ ‘ఈ దేశపు గోడ మీద/ ఉమ్మేసిన పాన్‌ మరకలా/ నేనిలా ……….’ అంటూ ఈ దేశ ముస్లింల దయనీయమైన స్థితిని ప్రతిబింబిస్తాడు.
aliఅచ్చమైన తెలంగాణ కవి
– – – – – – – – – – – –
తెలంగాణ ఉద్యమానికి ఎన్నో కవితలను అలీ అందించాడు. ‘మత్తడి’, ‘పొక్కిలి’ ‘మునుం’ లాంటి కవితా సంకలనాల్లో అతని కవితలున్నాయి. ‘గర్జన’ పేరుతో తెలంగాణ ముస్లింవాద కవితా సంపుటి వెలువరించాడు. ‘మత్తడి’లో, తెలంగాణ ఉర్దూ, తెలుగు ముస్లిం కవితా సంకలనం ‘రజ్మియా’లోని అతని కవిత ‘అస్తర్‌’లో-
‘ఆటోవాలా చల్తే/ క్యా బేటా.. కైసే హై?’/ నా ‘జబాన్‌’ని అనకొండలేయో మింగినయ్‌/ నా పేర్లు మార్చి/ నా ఖాన్‌దాన్‌ మూసీల కలిపినయ్‌’ -అంటూ తెలంగాణలోని ఉర్దూ భాషను ఆంధ్రావారు ఎలా నాశనం చేశారో చెబుతాడు అలీ. రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు చేస్తున్న ముస్లింల దీనస్థితిని చెబుతూ ‘పైజామా లాల్చీల కెల్లి/ తొంగి చూస్తున్న/ బొక్కల బొయ్యారం’ను వర్ణిస్తూ ‘హమారా జీనా/ జూతేకే నీచే/ అస్తర్‌ బన్‌గయా’ అంటాడు. ఇతర కవితల్లో- ‘ఈ గులాంగిరీ బతుకులు ఇంకెన్నాళ్లు’ అని నిలదీస్తాడు. ‘కుడిపక్క కృష్ణా కాల్వ ప్రవాహమున్నా/ మాకు ఫ్లోరిన్‌ నీళ్ల భూమి పొరలే దిక్కు’ అంటూ బాధపడుతూ ‘నైజామోడి పైజమా ఏనాడో ఊడింది/ ఇక ఆంధ్రోడి పంచె ఊడగొడదాం రాండ్రి’ అంటాడు. ‘తెలంగాణ సెంటిమెంటు కాదురా/ నా ఆత్మబలం.. నా ఆత్మగౌరవం.. నా జన్మహక్కు’ అని నినదించాడు.
గుజరాత్‌ ముస్లింల ఊచకోతపై కదిలిపోయిన అలీ ‘జఖమ్‌’ పేరుతో నాలుగు కవితలతో కరపత్రం వెలువరించాడు. అందులోని ఒక కవితలో ‘హమ్‌ మర్కే భీ జగాతే హైఁ/ సోయీ హుయీ దునియాఁ కో’ అనడం మొత్తం భారత సమాజాన్నే మేల్కొల్పే తత్వంగా చూడొచ్చు. ఇంకా ‘గుజరాత్రుల్లో నన్ను ఊచకోత కోసి/ అమ్మీజాన్‌ చిత్రపటాన్ని నగ్నంగా నిలిపావు’ అంటాడు.
అతని కవిత్వంలో ‘చెదలు పట్టిన గిర్కల బావి కలలు’ ‘నా కాలివేళ్ల సందుల్లో/ ఇరుక్కున్న మట్టి వాసనల నడుగు/ నేను దళిత వారసున్నేనని మద్దెల మోగిస్తాయ్‌’ ‘దువా ఒక్కటే దవా కాదు’ ‘ధర్నాకైనా హిమ్మత్‌లేని లాల్చి పైజామాలు/ రూమిటోపీలకు బిగించిన హద్దుల సంకెళ్లు/ నా నోట్లోని నాలుకకు కుట్లేస్తున్నాయి’ ‘నీ అంటరాని ఆత్మలకు అత్తరు పూస్తా’ లాంటి ఎన్నో వెంటాడే కవితా పాదాలు చూస్తాం.
Ali_4
ముస్లింవాద కథకుడు.. ‘హరేక్‌మాల్‌’ రచయితగా అలీ
– – – – – – – – – –  – – – – – – – – – – – – – – – – – –
‘వతన్‌’ ముస్లిం కథా సంకలనం వేసే పనిలో 2000 ప్రాంతం నుంచి మళ్లీ అలీ వెంటపడ్డాను. అప్పటికీ అలీ పాన్‌డబ్బా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేస్తే నల్లగొండ పట్టణం రోడ్ల మీద నాలుగు పయ్యల బండి మీద ‘హరేక్‌మాల్‌’ అమ్ముకుంటున్నాడు. ఏ అడ్డా మీద ఉన్నాడో తెలుసుకోవడం, వెళ్లి ఆయనతో బండి పక్కన నిలబడి మాట్లాడ్డం చేసేవాణ్ణి. హృదయ విదారకంగా ఉండేది, అలీ హరేక్‌మాల్‌ దందా! నల్లగొండ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో వారంలో ఒక్కోరోజు ఒక్కో పట్టణంలో అంగడి ఉంటుంది. ఆ అంగళ్లకు అలీ, అతని మిత్రులు హరేక్‌మాల్‌ మూటలు ఎత్తుకొని బస్సుల్లో పడి పొద్దున్నే వెళ్లడం, పొద్దుగూకిందాకా ‘దస్‌ కే చార్‌! దస్‌ కే చార్‌!’ అని అరిచీ అరిచీ మళ్ల మిగిలిన వస్తువులన్నీ మూటకట్టుకొని లాస్ట్‌ బస్‌కి నల్గొండ చేరడం.. ఆ బస్‌లో ఒక్కో ఊరిలో ఒక్కొక్కరు దిగిపోతుంటే ఒంటరిగా తమ గరీబీ గురించి ఆలోచించుకుంటూ రావడం.. అట్లా ఆ కథంతా రాశాడు అలీ.
దారిద్య్రరేఖకి ఇంకా కింద బతుకుతున్న ముస్లింల జీవితాలను పట్టించిన కథ ఈ హరేక్‌మాల్‌. డిగ్రీ చదివి రోజు కూలికి పోలేక హరేక్‌ మాల్‌ అమ్ముకుంటూ తన జీవితాన్ని చర్వణం చేసుకునే ఒక పేద ముస్లిం బతుకును సమగ్రంగా అన్ని కోణాలనుంచి చూపించిన కథ. అన్ని దారులు మూసుకు పోగా బతకలేక చావలేక బతుకుతున్న అనేక మంది ముస్లిం కుటుంబాలకు ప్రతీకగా కనిపిస్తాడు కథానాయకుడు. ముస్లింల చుట్టూ పరుచుకున్న పేదరికపు విషవలయం ఎప్పటికీ నశించేది కాదని, వెతలు ఎప్పటికీ తీరేవి కావని చెప్తూ భూమి గుండ్రంగా సైకిలు చక్రాల్లా ఉన్నదని చెప్తూ తమ జీవితాల్లో ఎప్పటికీ వెలుగులుండవని కథను ముగిస్తాడు రచయిత. ‘వతన్‌’ సంకలనంలో ఆ కథ ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది.
2006లో ‘హరేక్‌మాల్‌’ కతల సందూఖ్‌ పేరుతో సంపుటి వేశాడు అలీ. కథల సందూక్‌ అనడంలోనే మంచి ప్రయోగం కనపడుతుంది. కథల పెట్టె అని అర్ధం. ‘హరేక్‌మాల్‌’ కథతోపాటు మరో తొమ్మిది కథలు ముస్లింలలోని నిరుపేదల జీవితాలను రికార్డు చేశాయి.
ఆ సంపుటిలోని మిగతా కథల్లో ‘ముసీబత్‌’ కథ ‘ముల్కి’ ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచిక (2004)లో అచ్చయింది. ఈ కథ తెలుగు సాహిత్యంలో మరో భిన్నమైన పార్శ్వం. ఇందులో- సౌదీకి వలస వెళ్ళే పేద ముస్లింల లాగే అలీ బావ ఫయాజ్‌ సౌదీ వెళ్తాడు. అక్కడ కొన్నాళ్లకు హార్ట్‌ ఎటాకొచ్చి చనిపోతాడు! దోస్తులు ఇక్కడికి ఫోన్‌ చేసి ఫయాజ్‌ భౌతిక కాయాన్ని పంపాలంటే అతని దగ్గర ఉన్న పైసలు పంపలేము! పైసలు పంపించాలంటే బాడీని పంపలేము! అంటారు. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అంతా ఫయాజ్‌ భార్య అభిప్రాయం అడిగారు. ఆమె ఏం చెప్పగలదు! ముగ్గురు ఆడపిల్లలు! పైసలేం మిగుల్చుకోలేదు. ఇల్లు గడవడం.. పెళ్లిళ్లు.. వగైరా ఎలా జరుగుతాయి?! గింజుకుని, నలిగీ, యాతనపడీ చివరికి పైసలు పంపించమనే- అందరి అభిప్రాయంగా చెబుతారు! -ఇంతటి గరీబీని చిత్రించాడు అలీ తన కథల్లో..!
అయితే ఇదే ‘ముసీబత్‌’ కథలో మరో ముఖ్యమైన విషయం రికార్డు చేశాడు అలీ.
ముస్లింల ఆచార వ్యవహారాలు ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా ఉన్నాయి. దేశదేశాలకు ఇస్లాం వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆయా దేశాల సంస్కృతుల్ని తనలోకి ఇముడ్చుకోవడం, ఇస్లామిక్‌ (అరేబియన్‌) సంస్కృతిని ఆయా దేశాలకు వ్యాప్తి చేయడం జరిగింది. జరుగుతున్నది. ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచమంతా ముస్లింల సంస్కృతి ఒకే రకంగా ఉండదని అర్థమవుతుంది. ఆ దిశలోనే మన దేశంలోని మన రాష్ట్రంలోని ముస్లింల సంస్కృతిని చర్చకు తెస్తూ షాజహానా, స్కైబాబ తమ సంపాదకత్వంలో ‘అలావా’ ముస్లిం  సంస్కృతి కవితా సంకలనం వేశారు. అందులోని సంపాదకత్వంలో స్కైబాబ అలీ ‘ముసీబత్‌’ కథను ఉటంకిస్తూ చెప్పిన విషయాన్ని ఇక్కడ చూడొచ్చు-
‘మూడో రోజు జ్యారత్‌. సమాధి దగ్గరికి వెళ్లి పూల చాదర్‌ కప్పి ఫాతెహా లివ్వాలి. ఇక్కడ సమాధి లేదు. చిత్రమైన స్థితి. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. చివరికి ఫయాజ్‌ దోస్తులకు ఫోన్‌ చేసి జర సమాధి దగ్గరికి వెళ్లి పూల దుప్పి కప్పి ఫాతెహా లిచ్చి రమ్మని అభ్యర్ధిస్తారు. ‘ఇక్కడ అవన్నీ ఉండవు. సమాధి చేసి వచ్చారంటే తిరిగి అటు వెళ్లడం ఉండదు!’ అంటారు ఫయాజ్‌ దోస్తులు. పరేశాన్‌!’
ఇట్లా అలీ 2004లోనే దేశీ ముస్లిం సంస్కృతిని చర్చకు పెడుతూ కథ రాయడం గమనార్హం. ఈ  సంస్కృతి గురించి ఇవాళ తీవ్ర సంఘర్షణ జరుగుతుండడం విశేషం.
సహజంగా గ్రామాల్లో, పట్టణాల్లో జరిగే మోసాలను, ప్రపంచంలో పెరిగిపోతున్న మత విద్వేషాలను పట్టి చూపిన కథ ‘కోడిపిల్లలు మూడు’. మూడు కోడిపిల్లలు కొని పెంచబోయిన తన కొడుకు కథ అది. ఒక పిల్లను పిల్లి ఎత్తుకుపోగా, అది చూసి భయపడ్డ మరో కోడిపిల్లకు పక్షవాతమొస్తుంది. దాన్ని పడేయమని తల్లి చెబుతున్నా వినక దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఆ పిల్లవాడు. దాని గురించే బెంగ పెట్టుకుంటాడు. చివరికది చనిపోతుంది. దాన్ని పెంటదిబ్బ మీద పడేయమని చెప్పినా వినకుండా ఇంటి ఆవరణలో ఒక మూల దానిని సమాధి చేస్తాడు. మోసాలు ద్వేషాలు లేని ప్రపంచం ఒకటుందని, అది పిల్లల ప్రపంచమని చెప్తూ తన పిల్లలకు అంతటి జాలి దయ ఉండాన్ని చూసి సంతోషపడతాడు కథానాయకుడు. నేడు సమాజంలో ముస్లింల మీద జరుగుతున్న విష ప్రచారానికి పూర్తిగా భిన్నమైన కోణంలో మనల్ని వెంటాడుతుంది ఈ కథ.
సమాజంలో ఏ ఉపద్రవం జరిగినా చివరికి అది పేదవాళ్ళ కడుపు కొట్టడానికేనని అలీ ‘పాన్‌డబ్బావాలా’ కథలో వివరిస్తాడు. అసలే వ్యాపారం నడవక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, డిగ్రీ పట్టాలు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తీసుకుని పాన్‌ డబ్బా నడుపుకుంటున్న చిన్న జీవితాల వ్యధలను చిత్రించిన కథ పాన్‌డబ్బావాలా. పోలీస్‌ వాళ్ళకి లంచాలిచ్చి, అడిగిన వాళ్ళకల్లా అప్పులు పెట్టి జీవితం గడవక నానా బాధలు పడి డబ్బాను నడిపిస్తుంటే ఆఖరికి రోడ్ల వెడల్పు కార్యక్రమంతో ఆ జీవనాధారాన్ని కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో తెలీని నిరుద్యోగుల, బడుగు జీవుల కథ పాన్‌డబ్బావాలా.
ఏ జాతి  ఉన్నత విద్యకు దూరమైపోతుందో, ఆ జాతి అభివృద్ధిపథం వైపు పయనించడం చాలా కష్టమైన విషయమని చెప్పిన కథ ‘నయా ఖదమ్‌ నయీ సోంచ్‌’. ముఖ్యంగా ముస్లిం అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమని, బాల్యంలోనే వివాహాలు చేయడం మూలాన ముస్లింలు వెనుకబడుతున్నారని కథలో కొత్త ఆలోచనలను రంజాన్‌ పండుగ దినాన పాత్రల ద్వారా వివరిస్తాడు రచయిత. రాజకీయాలలో మతాలు ముఖ్యపాత్ర వహించడాన్ని కూడా విమర్శిస్తాడు. క్రిష్టియన్‌ సంస్థలు విద్యా వ్యాప్తికి పూనుకోవడాన్ని ఉదహరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలన్నీ వివిధ దేశాలలో ఉన్న ముస్లింల గురించి ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తాడు.
ఇలా హరేక్‌మాల్‌ కథా సంపుటి నేటి ముస్లింల ఆర్ధిక రాజకీయ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టింది. నల్లగొండలో మాట్లాడే తెలంగాణ ఉర్దూ కలగలిసిన మిశ్రమ యాసతో కూడిన భాష ఈ సంపుటిలో కనిపిస్తుంది. కొన్ని కొత్త పదబంధాలు, కొత్త సామెతలు కనిపిస్తాయి. ఇలాంటి వైరుధ్యభరితమైన కథలు అందించిన అలీ ఒక నవల, తన ఆత్మకథ రాసిపెట్టాడని తెలుస్తున్నది. వాటిని అచ్చు వేయవలసిన బాధ్యతను తలకెత్తుకోవలసి ఉంది.

*

మీ మాటలు

  1. sangishetty srinivas says:

    అలీ జీవితాన్ని, సాహిత్యాన్ని అతి దగ్గరి నుంచి చూసిన స్కైబాబ దాన్ని అక్షరాల్లో అందరికి అందించినందుకు అభినందనలు. అలీ ఆఖరి నవల అచ్చేస్తే తెలంగాణా ముస్లిం సాహిత్యానికి మేలైన జోడింపు అవుతది..

  2. కొడురి విజయకుమార్ says:

    స్కై …. నీ వ్యాసం చదివేక, ‘ఈ అలీని ఒక్కసారైనా నేను కలిసి వుండవలసింది కదా’ అని ఒక చిన్న దిగులు కలిగింది !

  3. buchi reddy gangula says:

    పరిచయెం భాగుంది —
    అలీ గారు — we.miss.you..sir…
    యి పాడు దేశం లో ముస్లిం గా పుట్టడమే తప్పు అన్నా —-
    కుల పిచ్చి — మత పిచ్చి —దేవుని పిచ్చి తో నడుస్తున్న దోపిడి వ్యవస్థ లో — మార్పు
    ఎప్పుడో — ఎన్నడో
    విద్యార్థులు అంతా కన్హయ్య కుమార్ లు అయి తిరుగాబడే రోజు రావాలి
    ఎదిరి చూడటం తప్ప ????
    ———————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  4. చందు తులసి says:

    ఆలీ గారి గురించి …వివరంగా తెలియజేశారు సార్…
    పేదరికం, కారణంగా ఎంతమంది కవులు గుర్తింపుకు నోచుకోలేకపోయారో…

    అటువంటి వారికి సాయం చేయలేకపోయినా సాహిత్యాన్నైనా…కాపాడుకోవాల్సిన బాధ్యత
    సాహిత్యలోకం మీద వుంది…

  5. syed sabir hussain says:

    మతోన్మాదాన్ని తరిమి కొట్టాలంటే లౌకిక,ప్రజాస్వామిక వాదులంతా ఏకం కావాలి. అప్పుడే అలీ కి నివాళి అర్పించిన వాలం అవుతాము…సాబిర్ హుస్సేన్

  6. Skybaaba says:

    అలీ ని దగ్గరి నించి చూసి, రాయించి, ప్రేమించి, గొడవ పడి.. మల్ల అలాయిబలాయి తీసుకొని.. ఇంతలోనే అతన్ని కోల్పోవడం జీర్ణం కాక… అతని సెలెక్టెడ్ రచనలు అచ్చేయాల్సి ఉంది.. ఇక్కడ స్పందించిన అందరికీ షుక్రియా..

మీ మాటలు

*