మతి పోగొట్టిన మైసీనియా స్వర్ణ సంపద

 

స్లీమన్ కథ-25

 

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

ఆ కలశం మీద చిత్రితులైన సైనికులు కొమ్ము శిరస్త్రాణాలు ధరించి ఉన్నారు. వాటి మీద తురాయిలు రెప రెప లాడుతున్నాయి. ఈజిప్టుసేనలకూ, ‘సాగర భూములనుంచి వచ్చిన’ వారికీ మధ్య జరిగిన యుద్ధాల తాలూకు చిత్రాలలోని సైనికులు కూడా ఇలాగే కొమ్ము శిరస్త్రాణాలు ధరించి కనిపిస్తారు. మైసీనియా కలశం మీద చిత్రించిన సైనికుల చేతుల్లో పొడవైన బల్లేలు, అర్థచంద్రాకారపు భారీ డాళ్ళు ఉన్నాయి. బల్లేలకు మద్యం సీసాలు తగిలించి ఉన్నాయి. సైనికుల కవచాల మీద చిన్న చిన్న వక్షస్త్రాణాలు ఉన్నాయి. వాటిని బహుశా ఒక లోహపు పట్టీతో బిగించుకున్నారు. కవచాలు వాళ్ళ తొడల దాకా ఉన్నాయి. వాటికి కుచ్చులు వేలాడుతున్నాయి. కాళ్ళకు మేజోళ్ళు ఉన్నాయి. స్లీమన్ అవి వస్త్రంతో చేసినవని అనుకున్నాడు కానీ, బహుశా కవచం లాంటివే అయుంటాయి. శిరస్త్రాణాలపై తెల్లని చుక్కలు ఉన్నాయి. చిత్రకారుడు ఆ చుక్కల ద్వారా  కంచులోహపు మెరుపును సూచిస్తున్నాడని స్లీమన్ అనుకున్నాడు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకే అతనికి దొరికిన ఇంకో కలశం తాలూకు శకలం మీద ఉన్న చిత్రాన్ని చూస్తే; సైనికులు ధరించినవి తోలు శిరస్త్రాణాలనీ, వాటి మీద కనిపించే తెల్లని చుక్కలు లోహపు చీలలనీ అనిపిస్తుంది.

స్లీమన్ కు ఎక్కువగా విస్తుగొలిపినవి, శిరస్త్రాణాలకు ఉన్న కొమ్ములు. “వాటి ఉపయోగం ఏమిటో నాకు ఏమాత్రం బోధపడలేదు. హోమర్ కాలం నాటి శిరస్త్రాణాలపై అలాంటివి ఉండేవని అనుకుందామంటే హోమర్ వాటి గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు ” అని రాసుకున్నాడు. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం స్లీమన్ పరాకు చిత్తగించాడు. ఎందుకంటే, ఇలియడ్ మూడో అధ్యాయంలో , మెనెలాస్, పారిస్ ల ద్వంద్వ యుద్ధం సందర్భంలో హోమర్ కొమ్ము శిరస్త్రాణాలను ప్రస్తావించాడు: “మెనెలాస్ వెండి తాపడం చేసిన తన ఖడ్గాన్ని ఒక్క ఊపుతో పైకెత్తి శత్రు శిరస్త్రాణం కొమ్ముమీద మోదాడు. అప్పుడా ఖడ్గం ముక్క ముక్కలైపోయి అతని చేతిలోంచి జారిపోయింది” అని రాశాడు. ఖడ్గ ప్రహారాన్ని కాచుకోవడం కోసమే ఆ కొమ్ము. దాంతోపాటు;  కొమ్ములు దృష్టి దోషాన్ని నివారిస్తాయనీ, యోధుడి పుంస్త్వాన్ని నొక్కి చెబుతాయనీ, తనకు అదనంగా మరో కన్ను ఉందన్న భావనను అతడిలో కలిగిస్తాయనీ భావించారు. శిరస్త్రాణాలలో రెండు కొమ్ములు ఉన్నవీ, నాలుగు కొమ్ములు ఉన్నవీ కూడా కనిపిస్తాయి. శిరస్త్రాణాలపై కొమ్ములు ఒక్కోసారి మేక కొమ్ముల్లా మెలితిరిగి ఉంటాయి.

సైనికులు కవాతు చేస్తూ సాగుతూ ఉంటే వారి మార్గానికి ఎడమ వైపున యువతులు నిలబడి చేతులు ఊపుతున్నారు.  ఆవిధంగా,  వారి శిరస్త్రాణాలపై ఉన్న కొమ్ములు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నాయి.* శిరస్త్రాణాలపై అలంకరించిన తురాయిలు ఈకల్లా కనిపిస్తున్నాయి తప్ప, గుర్రపు వెంట్రుకల్లా కాదు. సైనికులు పొత్తికడుపు దగ్గర వెడల్పాటి దళసరి లోహపు పట్టీని ధరించి ఉన్నారు. అది హోమర్ వర్ణించిన మిత్రే(mitre)ని తలపిస్తోంది. సైనికులు ధరించిన కాలితొడుగు(leggings)లకు అడుగున వెండిపట్టాల లాంటివి ఉన్నాయి. హోమర్ చిత్రించిన కాలితొడుగులకు కూడా ఒక్కోసారి వెండి పట్టాలు ఉంటాయి. సైనికుల ముక్కులు పొడవుగానూ, కళ్ళు వెడల్పుగానూ, గడ్డం తీరుగా కత్తిరించబడీ కనిపిస్తున్నాయి. అనంతరకాలంలో, వందల ఏళ్ల తర్వాత పర్షియన్ సేనలతో పోరాడిన గ్రీకు సైనికులు కూడా అచ్చం ఇలాగే కనిపిస్తారు. వారు కూడా నృత్యభంగిమలో కవాతు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా చిత్రాలలో కనిపిస్తారు. ఈవిధంగా ఈ పగిలిన కలశం అసాధారణరీతిలో గ్రీసు పురాచరిత్రను చెబుతోంది.**

***

OLYMPUS DIGITAL CAMERA

నెలలు గడుస్తున్నాయి. ఆగొరా(agora)లో దొరికిన నాలుగు సమాధిరాళ్ళ శకలాలు, సైనికుల చిత్రం ఉన్న కలశం తప్ప చెప్పుకోదగినవేవీ దొరకలేదు. మండుటెండలో, పొద్దుటి నుంచి సాయంత్రంవరకూ 125 మందితో స్లీమన్ తవ్వకాలు జరిపిస్తున్నాడు. మైసీనియా మొత్తాన్ని వేడి వేడి ధూళి మేఘాలు కమ్మేస్తున్నాయి. అతని కళ్ళు మండిపోతున్నాయి. ఎండతోపాటే అతని చిటపటలు పెరిగిపోతున్నాయి. ఇంకోపక్క అధికారులతో ఘర్షణ విడుపు లేకుండా సాగుతూనే ఉంది.

సందర్శకులు వస్తున్నారు. కుండ పెంకులు, పూసలు, మృణ్మయమూర్తులు మినహా వాళ్ళలో ఆసక్తిని నింపే గొప్ప విశేషాలేవీ అక్కడ లేవు. బ్రెజిల్ చక్రవర్తి దియోడెమ్ పేద్రో-2 తవ్వకాలను చూడడానికి కోరింత్ నుంచి వచ్చాడు. ఈ విశిష్ట సందర్శకుని రాకకు స్లీమన్ పొంగిపోయాడు. ఏట్రియస్ కోశాగారంగా పిలిచే ఓ భూగర్భ సమాధివద్ద అతనికి గొప్ప విందు ఇచ్చాడు. అది చాలా కాలంగా ప్రసిద్ధిలో ఉన్న ప్రదేశం కనుక, విలువైనవేవీ దొరకకపోవచ్చునన్న ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు చేపట్టలేదు. తను ట్రాయ్ లో కనుగొన్నట్టే ఇక్కడ కూడా నిధినిక్షేపాలను కనుగొంటానని చక్రవర్తితో స్లీమన్ అన్నాడు. చక్రవర్తి చిరునవ్వు నవ్వాడు. స్లీమన్ చెప్పుకునే గొప్పల గురించి గ్రీకు అధికారులు అతన్ని ముందే హెచ్చరించారు. సమాధులపై అతను ఆసక్తిని చూపించాడు. మనిషి గుంభనంగానూ, సామాన్యంగానూ కనిపించినా అందంగా ఉన్నాడు. మాటలో, నడకలో మర్యాద ఉట్టిపడుతోంది. అతని పురావస్తు పరిజ్ఞానం స్లీమన్ ను ఆశ్చర్యచకితం చేసింది. అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. “పురాతన నాగరికతలపట్ల అవగాహన పెంపొందడానికి మీరు అమూల్యమైన దోహదం అందిస్తున్నా”రంటూ చక్రవర్తి కూడా స్లీమన్ పై ప్రశంసలు కురిపించాడు.

ఉబ్బు తబ్బిబ్బు అయిపోయిన స్లీమన్ అతనికి చిత్రిత మృణ్మయ పాత్రల తాలూకు శకలాలను కొన్నింటిని బహూకరించాడు.  అయితే, చక్రవర్తి వచ్చి వెళ్ళిన కొన్ని రోజులకు ఒక విషయం తెలిసి ఒకింత ఆశ్చర్యపోయాడు. లియోనీదస్ లియొనార్దో అనే పోలీస్ కెప్టెన్ చక్రవర్తి భద్రతకు బాధ్యుడిగా అతని వెంటే ఉన్నాడు. పోలీస్ సిబ్బంది అంతా పంచుకోండంటూ చక్రవర్తి ముష్టి విదిల్చినట్టు అతనికి నలభై ఫ్రాంకులు ఇచ్చాడు.  లియొనార్దోకు చక్రవర్తి వెయ్యి ఫ్రాంకులు బహూకరించాడనీ, నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు అతను అబద్ధం చెబుతున్నాడనీ మిగతా పోలీస్ సిబ్బంది అనుకున్నారు. దానిపై విచారణ జరిగి లియొనార్దోను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఆ పోలీస్ కెప్టెన్ స్లీమన్ కు బాగా తెలిసినవాడు. అతనిపై తీసుకున్న చర్యకు స్లీమన్ మండిపడ్డాడు. అతను ఎలాంటి తప్పూ చేసి ఉండడంటూ ఎథెన్స్ లోని ప్రధానమంత్రికి తంతి పంపాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో, బ్రెజిల్ చక్రవర్తి కైరోలో ఉన్నట్టు తెలిసి నేరుగా అతనికే తంతి పంపాడు:

ఏలినవారు నాప్లియో నుంచి వెళ్ళేటప్పుడు, పోలీసులందరికీ పంచమని కోరుతూ కెప్టెన్ లియోనీదస్ లియొనార్దోకు నలభై ఫ్రాంకులు ఇచ్చారు. కానీ, ఏలినవారినుంచి వెయ్యి ఫ్రాంకులు తీసుకున్నాడంటూ, ఎంతో ఉత్తముడైన ఆ వ్యక్తి మీద నాప్లియో మేయర్ నింద మోపాడు. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతను జైలు పాలు కాకుండా చూడడం కోసం నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. అతను నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఎంతో నిజాయితీపరుడు. కనుక  ఏలినవారు అతనికి వాస్తవంగా ఎంత మొత్తం ఇచ్చారో తెలుపుతూ తంతి పంపవలసిందని, పవిత్ర సత్యమూ, మానవత్వాల పేరిట ప్రార్థిస్తున్నాను.

పోలీస్ కెప్టెన్ కు తను నలభై ఫ్రాంకులే ఇచ్చినట్టు తెలుపుతూ చక్రవర్తి వెంటనే తంతి ఇచ్చాడు. దాంతో లియొనార్దోను తిరిగి ఉద్యోగంలో నియమించారు.

వేసవి గడిచింది. వర్షాలు ముంచెత్తుతుండడంతో తవ్వకాలు జరుగుతున్న ఆగొరా దగ్గర అంతా బురద బురద అయిపోయింది. అయినా పని కొనసాగింది. అక్టోబర్ మధ్యలో ఆగొరాలో లోతుగా తవ్వకాలు జరుపుతుండగా ఒక పెద్ద రాతి వాలుమీద, 20 అడుగుల పొడవూ, 10 అడుగుల వెడల్పుతో మలచిన ఒక సమాధి బయటపడింది. దొంగలు దోచుకున్నారనడానికి గుర్తుగా చెల్లా చెదురుగా పడున్న కొన్ని బంగారు బొత్తాలు, రాతి పలకలు, దంతపు కొమ్ములు కనిపించాయి. అవి సమాధి గది తాలూకు అలంకారసామగ్రి కాబోలని స్లీమన్ అనుకున్నాడు. మరింత దక్షిణంగా, ఆ వలయ కేంద్రానికి దగ్గరగా తవ్వకాలు కొనసాగించారు. 15 అడుగుల లోతున ఒక గులకరాయి పొర తగిలింది. ఆ పొర అడుగున మూడు కళేబరాలు కనిపించాయి. వాటిని మట్టి, చితాభస్మంలా కనిపిస్తున్న బూడిద దట్టంగా కప్పేసాయి.  వాటిలోంచి బంగారపు మెరుపులు తొంగి చూస్తున్నాయి.

చేతికి అందేటంత దూరంలో స్వర్ణనిక్షేపాలు ఉన్న సంగతి స్లీమన్ కు అర్థమైంది. ఇంకోవైపు ప్రభుత్వ అధికారులు నీడలా తనను వెన్నంటి ఉన్న సంగతీ తెలుసు. ట్రాయ్ లో నిక్షేపాలను కనిపెట్టిన క్షణాలలోలానే ఒక్కసారిగా విపరీతమైన ఆందోళనతో, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అప్పటిలానే సహాయం కోసం సోఫియావైపు చూశాడు. అతనెంత ఉద్రిక్తతకు, ఉత్తేజానికీ లోనయ్యాడంటే; ఆ అస్థిపంజరాలను కప్పిన మట్టిని తొలగించడానికి కూడా అతనికి చేతులు ఆడలేదు. చటుక్కున సోఫియాయే వాటి పక్కన ఉన్న ఖాళీ జాగాలోకి దూరి వెళ్ళి జేబుకత్తితో మట్టిని తొలగించింది.

ఒక్కో కళేబరం దగ్గరా అయిదేసి స్వర్ణకిరీటాలు ఉన్నాయి.  రెండు కళేబరాల దగ్గర అయిదేసి బంగారు శిలువ ఆకృతులూ, ఇంకో కళేబరం దగ్గర అలాంటివే నాలుగూ ఉన్నాయి.  వాటి చేతులను పొన్న ఆకుల రూపంలో మలచారు.  ట్రాయ్ లో దొరికిన స్వర్ణహార కిరీటాలు విస్తారమైన నగిషీపనులతో అట్టహాసంగా ఉంటే; పలచని బంగారు రేకుల మీద వలయాలు, గుబ్బల వంటి అలంకారాలను చెక్కిన మైసీనియా స్వర్ణకిరీటాలు సీదా సాదాగా ఉన్నాయి.

వాటి దగ్గరే చిన్న చిన్న లావా కత్తులు, తొడుగులు  చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక వెండి పాత్ర ఉంది. అక్కడ అగ్నికి సంబంధించిన ఆధారాలను చూసిన స్లీమన్, మృతదేహాలను దహనం చేశారా, లేక కాల్చారా అన్న సందేహానికి లోనయ్యాడు. సమాధికి అడుగున ఉన్న గులకరాళ్ళు చితికి గాలి, వెలుతురు ప్రసరించడం కోసమే ననుకున్నాడు.  మృతదేహాన్ని దహనం చేయడం కాక; కాల్చి ఎముకలనుంచి మాంసాన్ని వేరు చేయడం మైసీనియన్ల ఆచారంగా నిర్ణయానికి వచ్చాడు.  ఆ తర్వాత మరో పురావస్తునిపుణుడు విల్హెమ్ డార్ఫెల్డ్ (1853-1940) కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. స్లీమన్ చూసే నాటికి ఆ మూడు కళేబరాల తాలూకు అస్థిపంజరాల ఆకృతులు స్పష్టంగా గుర్తించేలా ఉన్నా, తేమ వల్ల దెబ్బతిని త్వరలోనే వాటి రూపు చెడింది. మైసీనియా నిక్షేపాలు ప్రస్తుతానికి పదిహేను స్వర్ణకిరీటాలుగా, పద్నాలుగు బంగారు శిలువలుగా లెక్క తేలాయి.

OLYMPUS DIGITAL CAMERA

ఈసారి స్లీమన్ సింహద్వారా(Lion Gate)నికి మరింత దూరంగా, సమాధి కేంద్రానికి పక్కనే తవ్వకాలు జరపాలని నిర్ణయించాడు. 9 అడుగుల లోతున మరికొన్ని అస్థిపంజరాలు, వాటి దగ్గరే లావా కత్తులు కనిపించాయి కానీ; నిక్షేపాలేవీ కనిపించలేదు. ఒకింత విస్తుపోతూనే తవ్వకాలను కొనసాగించాడు. మొదటి సమాధి దగ్గర ఏమీ దొరకకపోయినా, రెండో సమాధి దగ్గర కొద్దిపాటి నిక్షేపాలు కనిపించాయి. అయితే, మూడో సమాధి దగ్గర కొంచెం తవ్వేసరికే అస్థిపంజరాల అడుగున అనూహ్యమైన స్వర్ణసంపద కళ్లను జిగేలుమనిపించింది.  మొత్తం గది అంతా ఎర్రటి కాంతులు విరజిమ్మే స్వర్ణాభరణాలతో కిక్కిరిసిపోయింది.

అప్పటికి పనివాళ్లను చాలామందిని పంపేశారు. నాటి కోశాగారాలుగా భావించిన తావుల వద్ద సైనికులు కాపలా కాస్తున్నారు. మరోసారి సోఫియా ఆ అస్థిపంజరాల మధ్యకి, స్వర్ణ సంపద మధ్యకి దూరి వెళ్లి, ఆ రాచ సమాధులను కప్పిన మట్టిని తొలగించింది. పలచని బంగారు రేకుల మీద సున్నితంగా మలచిన ఆకృతులు ఎక్కడ తింటాయోనన్న భయంతో ఎంతో జాగ్రత్తగా, ఓపికగా, నెమ్మదిగా ఆ పని చేసింది. రెండో సమాధిలో ఉన్నట్టే ఇందులోనూ మూడు కళేబరాలు ఉన్నాయి. అందులో ఒకటి స్వర్ణకిరీటాన్ని ధరించి ఉంది. ముప్పైకి పైగా బంగారపు ఆకులు దానికి వేళ్ళాడుతున్నాయి. రాజు ఆ కిరీటాన్ని ధరించినప్పుడు ఈ బంగారపు ఆకులు చంచలిస్తూ ప్రకాశిస్తూ ఉంటాయి. ఇది గాక మరో ఎనిమిది స్వర్ణకిరీటాలు, ఆరు బంగారు శిలువలూ(వీటిలో కొన్ని విపరీత అలంకారం కలిగిన రెండుపేటల శిలువలు), వెండి కాడకు అమర్చిన బంగారు పువ్వు కనిపించాయి. ఆపైన కొన్ని స్వర్ణ హారాలు, గుండ్రని పాత్రలు, కలశాలు, మద్యం జారీలు కనిపించాయి. వీటిలో కొన్నిటికి చక్కని బంగారు తీగలు తాపడం చేసిన బంగారు మూతలు ఉన్నాయి. అలాగే, ప్రకాశించే రాతి స్ఫటికగోళాలు కొన్ని కనిపించాయి. బహుశా రాజుల కరవాలాలకు పిడులుగా వాటిని ఉపయోగించి ఉండవచ్చు.

                                                                                                               (సశేషం)

*ఇది THE GOLD OF TROY  రాసిన ROBERT PAYNE చేసిన వ్యాఖ్య. కొమ్ము పురుషుడి శృంగార సామర్థ్యానికి, అంటే పుంస్త్వానికి కూడా చిహ్నమన్న పరోక్షసూచన ఇందులో ఉంది. ఇదే శీర్షిక కింద నేను రాసిన ‘గణపతి కొమ్ము కిరీటం చెప్పే ‘శృంగార’గాథ’(సారంగ/21-05-2015) చూడగలరు. ‘శృంగం’ (కొమ్ము) అనే మాట నుంచే ‘శృంగారం’ అనే మాట పుట్టిందని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు.

** పైన వివరించిన సైనికుల చిత్రం గ్రీసు పురాచరిత్రను చెప్పడంతోపాటు, పురాతన భారతదేశంలో, ఉదాహరణకు కురుక్షేత్రయుద్ధంలో సైనికులు ఎలాంటి ఆహార్యం ధరించేవారన్న ఆసక్తికర ప్రశ్నను ముందుకు తెస్తోంది. కవిత్రయభారతంలో కానీ, సంస్కృతభారతంలో కానీ సైనికుల ఆహార్యం గురించిన చిత్రణ ఉందేమో  పరిశీలించాలి. చరిత్రకారుల అంచనా ప్రకారం ట్రోజన్ యుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 1334-1184ల మధ్య జరిగింది. కురుక్షేత్రయుద్ధం(జరిగి ఉంటే) క్రీ.పూ. 15-10 శతాబ్దుల మధ్య జరిగింది.  ఈ అంచనాలే నిజమైతే రెండు యుద్ధాలూ అటూ ,ఇటూ ఒకటి రెండు వందల ఏళ్ల తేడాతో జరిగి ఉండాలి. సైనికుల ఆహార్యమూ, ఆయుధాల విషయంలో రెంటి మధ్యా పోలికలు ఉన్నా ఆశ్చర్యం లేదు. అయితే, ఇది ప్రస్తుతానికి ఊహ మాత్రమే.

 

 

 

మీ మాటలు

*