నేను త్యాగరాయల్ని కాను!

 

 

 

“కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి గదుల్లో బంధించుకున్నారు. మూర్ఛలు తెచ్చుకున్నారు. పిచ్చాసపత్రుల్లో చేరారు. _రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

పైవి, కథా ఖధీరుడి తాజా పుస్తకంలోనివిగా చెప్పబడుతున్న వాక్యాలు. ఆ పుస్తకం నేనింకా చదవలేదు. గొప్పగా ఉంటుందనుకుంటున్నాను. అది నా చేతికంది, చదివాక దానిగురించి వివరంగా ముచ్చటించుకుందాం. ప్రస్తుతానికి పై వాక్యాలు నాలో కలిగించిన స్పందన మాత్రం రాస్తాను.

ఖదీర్ వ్యాఖ్యల్లో నిజమెంత? వృత్తిపరంగా ఉచ్ఛస్థాయికెదిగి వ్యక్తిగత జీవితంలో మాత్రం భ్రష్టుపట్టిపోయినవారు సాహిత్యంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. దానికి కారణాలేంటనేది వేరే చర్చ. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదని సమాధానమొస్తుంది. రచయితల్లోనే తీసుకున్నా ఖదీర్ ప్రస్తావించిన స్థాయిలో చిత్రహింసలు అనుభవించేవాళ్ల శాతం తక్కువ. బహుశా తను చెప్పదలచుకున్న విషయాన్ని ఎంఫసైజ్ చేయటానికి ఖదీర్ బాబు కావాలనే అతిశయీకరించినట్లు నాకనిపిస్తుంది. ఆ అతిశయాన్ని అవతలబెడితే, ఖదీర్ వాక్యాల్లో చివరిది నన్ను అమితంగా ఆశ్చర్యపరచింది.

రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

రచన చేయటం పెద్ద త్యాగమా! అయితే ఆ త్యాగం ఎవరికోసం చేస్తున్నట్లు? ఎందుకోసం చేస్తున్నట్లు?

ఇతరుల సంగతేమో కానీ నా మట్టుకు నేను కథలు రాయటం కోసం చేసిన త్యాగాలు ఏమీ లేవని ఘంటాపధంగా చెప్పగలను.

నా కథాకోడి కూయకపోతే లోకానికి తెల్లారదా? లేదు. నా కథలు చదవకపోతే నిద్రపట్టని పాఠకులున్నారా? లేరు. నన్నెవరన్నా కథలు రాయమని బలవంతపెట్టారా? లేనే లేదు.

మరి నేను కథలెందుకు రాస్తున్నాను? జనాలకి సందేశాలీయటానికా? పాఠాలు నేర్పటానికా? దానికి ఇతర మార్గాలు బోలెడుండగా కథలే ఎందుకు రాయాలి?

ఎందుకంటే కథ రాయాలన్నది నా కోరిక కాబట్టి. కథ రాయటమంటే నాకు ఇష్టం కాబట్టి. కథలు రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. నిజమే. ఆలోచనల్ని మధించాలి. అందులోంచి అమృతం తీయాలి. ఆ క్రమంలో అష్టకష్టాలు పడాలి. అయితే అవన్నీ ఎందుకోసం? ఎవరికోసం? నాకు ఇష్టమైన పని చేసి, నా కోరిక తీర్చుకోవటం కోసం. ఇది నాకోసం నేను చేస్తున్న పని. ఇందులో త్యాగానికి తావెక్కడ?

కథలు రాయటం ద్వారా నేను కొన్ని విలువైన స్నేహాలు, మరిన్ని పరిచయాలు సంపాదించాను. పోగొట్టుకుంది మాత్రం ఏదీ లేదు. ఈ సంపాదించటాలూ, పోగొట్టుకోవటాలూ పక్కనపెడితే – కథ రాసే క్రమంలో నేను పడే కష్టం నాకు అమితమైన సంతృప్తినిస్తుంది. “ప్రయాణమే ప్రతిఫలం” అనే అర్ధమొచ్చే ప్రాచీన చైనీస్ నానుడొకటుంది. ఓ కథ రాస్తున్నప్పుడు నేను నేర్చుకున్న కొత్త విషయాలు, పొందిన అనుభూతులు, నాకు లభించే మెంటల్ ఎక్సర్‌సైజ్ – ఇవే ఆ కథ నాకిచ్చే బహుమతులు. తక్కినవన్నీ బోనస్. ఆ కొసరు గురించి ఆలోచించకుండా కథా ప్రయాణమిచ్చే అసలైన ప్రతిఫలాన్ని ఆస్వాదించగలిగిన కథకుడిని పొగడ్తలు, పిచ్చికూతలు, ఉక్రోషాలు, ఉన్మాదాలు … ఇవేవీ తాకలేవని నేను నమ్ముతాను. చప్పట్లు, అవార్డులు, రివార్డుల మాయలో పడ్డ కథకుడు తనకోసం తాను కాకుండా ఇతరులని మెప్పించటం కోసం రాస్తాడు. అది అతనికి మంచిది కాదు. అతని కథకి అంతకన్నా మంచిది కాదు. (కమర్షియల్ రచయితలకి ఇక్కడ మినహాయింపు. వాళ్ల లెక్కలు, కొలతలు వేరే. వారి గురించి వేరెప్పుడన్నా మాట్లాడుకుందాం) ఇతరుల మెప్పు, గుర్తింపు కోసం రాయటం ప్రధానమైపోతే ఎక్కడలేని సమస్యలూ చుట్టుముడతాయి. తన ‘సాహితీ సేవ’ ఎవరూ గుర్తించటం లేదన్న బాధ, పక్కోడిని పొగిడి తనని పట్టించుకోలేదన్న ఏడుపు … ఒకటా రెండా!

ఇతరుల కోసం రాయటంలో ఇన్ని తలకాయ నొప్పులున్నాయి కాబట్టి, మన కోసం మనం రాసుకోవటం ఉత్తమం. మిగతా కథకుల సంగతేమో కానీ నేను మాత్రం కథలు మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను. ఇందులో కొన్ని సౌలభ్యాలున్నాయి. నా కోసం రాసుకోవటం వల్ల నేను నాలాగే రాయగలుగుతాను. మరెవరిలానో రాయను. ఫలానావారికన్నా గొప్పగా రాయాలి, ఇంకెవరికన్నానో తీసిపోకుండా రాయాలి వంటి పోలికల్లేకుండా రాయగలుగుతాను. అది నా ఒరిజినాలిటీని నిలుపుతుంది.

రెండో సౌలభ్యం: నాకోసం నేను రాసుకోవటం వల్ల నా సొంత సమస్యలపైనే కథలు రాస్తాను. ఇక్కడ సమస్యలంటే ఉద్యోగం ఊడిపోవటం, భార్యామణితో గొడవలు, వగైరా మాత్రమే కాకపోవచ్చు. నాకు అమితమైన ఆసక్తి కలిగిన, లోతైన అవగాహన కలిగిన విషయాలు అని అర్ధం చేసుకోండి. ఇతరులకి ఆసక్తిగొలిపే విషయాలు, లేదా ప్రస్తుతం సేలబిలిటీ ఉన్న అంశాల్లోకి పక్కదోవ పట్టకుండా బాగా తెలిసిన విషయాలపైనే కేంద్రీకరించటం వల్ల మనం రాసేదానికి విశ్వసనీయత పెరుగుతుంది.

మూడో సౌలభ్యం: ఇతరుల కోసం రాస్తే – ఏ ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండవు కాబట్టి ఓ కథతో అందరినీ మెప్పించటం ఎన్ని సాముగరిడీలు చేసినా అసాధ్యం. దీనికి బదులు ఒవరో ఒకరినే మెప్పించటం కోసం ఎందుకు రాయకూడదు? ఆ ఒక్కరూ నేనే ఎందుక్కాకూడదు? నా ఇష్టాయిష్టాలు నాకు బాగా తెలుసు కాబట్టి నాకోసం నేను రాసుకోవటం తేలిక.

అందువల్ల, నేను ప్రధానంగా నాకోసమే కథ రాసుకుంటాను. నా మొదటి కథ రాసినప్పుడు వేరే దారెటూ లేదు. అప్పట్లో నాకీ కథాలోకం గురించి ఏమీ తెలీదు. ఇప్పుడున్న పరిచయాలు, స్నేహాలు లేవు. కథని ఎలా అచ్చుకు పంపాలో, ఎవరికి పంపాలో తెలీదు. ఒకవేళ పంపినా దాన్నెవరన్నా స్వీకరిస్తారో లేదో తెలీదు. అదృష్టవశాత్తూ అచ్చైనా దాన్ని పాఠకులు ఎలా ఆదరిస్తారనే అంచనా అసలుకే లేదు. కాబట్టి అచ్చు గురించిన ఆలోచనా బాదరబందీలూ, అంచనాల బంధనాలూ లేకుండా స్వేఛ్చగా కేవలం నన్ను నేను మెప్పించుకోటానికి రాసుకున్న కథ అది.

ఒకవేళ నా తొలికథ (ఆనాటికింకా) అఖండాంధ్ర ఆంధ్ర పాఠకదేవుళ్లని ఆకట్టుకోవాలన్న కృతనిశ్చయంతో రాసి ఉన్నట్లైతే?

అది కచ్చితంగా ఎడిటర్‌గారి చెత్తబుట్టలోకి చేరుండేది.

ఆ కథని నాకోసం రాసుకోవటం ఓ కథకుడిగా నాకు నేను చేసుకున్న గొప్ప ఉపకారం. ఆ తర్వాతి కథలకీ అదే పద్ధతి పాటించటం అలవాటుగా మారింది.

ఇదంతా చదివాక – మీరూ నాలాంటివారైతే – వెంటనే ఓ ప్రశ్నేస్తారు. “నీ కోసం నువ్వు రాసుకుంటే దాన్నలాగే దాచుకోక అచ్చోసి మా ముఖాన కొట్టటమెందుకు?”

మీరో కథ చదివారు. లేదా ఒక సినిమా చూశారు. అది మీకు బాగా నచ్చింది. ఆ కథ/సినిమా మీక్కలిగించిన అనిర్వచనీయానుభూతిని లోలోనే దాచుకుంటే మీ శరీరం విస్ఫోటిస్తుందేమోననే సందేహంతో సతమతమౌతారు. మరో పదిమందితో ఆ కథ చదివించటం/సినిమా చూపించటం చేసేదాకా మీరు ఊరుకోలేరు. అవునా? మనోల్లాసం  కలిగించే విషయాలు, మనసుకి నచ్చిన సంగతులు ఇతరులతో పంచుకోవటం మానవనైజం. కళాకారులు తమ సృజనని బహిరంగపరచటమూ అందుకేనని నేననుకుంటాను. (చప్పట్ల కోసమూ కావచ్చు. అందులో తప్పేమీ లేదు. అవే ప్రధానమైనప్పుడే తేడాలొస్తాయి). నా కోసం నేను రాసుకున్న కథని నలుగురి కోసం అచ్చు వేయటానికి అంతకన్నా పెద్ద కారణం లేదు.

అయితే – నా కోసం నేను రాసుకునే దశలో కథ అచ్చమైన స్వచ్ఛమైన కళా రూపం. ఎప్పుడైతే దాన్ని ఇతరులకోసం బహిరంగపరచాలనుకున్నానో అప్పుడా కథ కళా పరిధి దాటి క్రాఫ్ట్ ఇలాకాలోకి అడుగు పెడుతుంది. వేరేవాళ్ల కోసం అనేసరికి కథని కాస్త ముస్తాబు చేయాల్సొస్తుంది. మెరుగులు దిద్దాల్సొస్తుంది. ఇంట్లో మనమే ఉన్నప్పుడు దాన్నెలా పెట్టుకున్నా, అతిధుల్ని పిలిచినప్పుడు ఇల్లు కాస్త పొందిగ్గా సర్దుతాం చూడండి. అలాగే కథకి పబ్లిక్ అప్పీల్ పెంచటం కోసం దానిక్కాస్త క్రాఫ్టింగ్ తప్పనిసరి. హీరోగారికి క్రాఫింగ్‌లా కథకి క్రాఫ్టింగ్ అన్న మాట! (ప్రాస కుదిరిందని వాడేశా. ఈ పోలిక గురించి మరీ ఇదైపోకండి). క్రాఫ్టింగ్ అనేది ఇతరుల కోసం తిరగ రాసే దశ. లక్ష్యిత పాఠకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే దశ. ఈ దశ దాటకుండా కథని అచ్చుకి పంపటం నేనైతే చేయను. “మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను” అనటం వెనక అర్ధం ఇదే.

అదండీ సంగతి. త్యాగం దగ్గర మొదలెట్టి ఎక్కడెక్కడో తిరిగొచ్చాం. చెప్పొచ్చేదేమంటే, కథలు రాయటం నన్నేమీ త్యాగమయుడిగా మార్చదు. ఎందుకంటే అది నాకోసం నేను ఇష్టంగా చేస్తున్న పని. ఇష్టమైన పని కాబట్టి అది కష్టంగానూ అనిపించదు.

ఇది చదువుతున్న వారిలో వర్ధమాన రచయితలుంటే, వాళ్లు స్వీకరించదలిస్తే, నా కొద్దిపాటి అనుభవంలోని ఇచ్చే చిన్న సలహా. మీకోసం మీరు కథలు రాసుకోండి. అది మీ దేహానికి, మనసుకి, అన్నిటికీ మించి మీ కథకి చాలా మేలు చేస్తుంది.

*

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    నమస్తే! వైద్యశాల పదానికి బదులు ఆసుపత్రి అనెడి పడికట్టు పదం ప్రసార
    మాధ్యమాలలో విపరీతంగ ప్రచారంలోనికి వచ్చింది. వైద్యులు, రచయితలు, భాషా
    నిపుణులు కూడ గుడ్డిగ అనుకరిస్తున్నరు. ఆసుపత్రి అసలైన తెలుగు పదమైనట్లు
    భావిస్తున్నరు. పాశ్చాత్య పాలనలో క్రిస్టియన్ మిషనరీలు ప్రజల లోనికి చొచ్చుక
    పోయెటానికి కొన్ని విదేశి పదాలను దేశి పదాల వలె మార్పు చేసినయి. అందులో
    హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన ‘ఆస్పతాల్’ అని, దక్షిణాదిన ‘ఆసుపత్రి’ అని మార్పు
    చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు.
    కాని, స్వచ్ఛమైన పదం ‘వైద్యశాల’ ఉండంగ ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో
    ఔచిత్యం ఎంత మాత్రం లేదు. ‘వైద్య కళాశాల’ ను వ్రాస్తున్నట్లె, ‘వైద్యశాల’ ను
    వ్రాయాలె. హాస్పిటల్ నాలుక తిరుగని కఠిన పదమేమి కాదు. కనుక, యధాతథంగ
    ‘హాస్పిటల్’ అని కూడ ఉచ్ఛరించ వచ్చు; లిప్యంతరీకరణ చేయవచ్చు. కమ్యూనిజం
    ప్రభావిత వైద్యులు, డెంటిస్ట్ లు మాత్రం హాస్పిటల్ లకు ‘ప్రజా వైద్యశాల’,
    ‘దంత వైద్యశాల’ అని పేరు పెట్టుకొంటున్నరు. ప్రజల మీద రుద్దబడిన అవకర పదం
    ఆసుపత్రి ని పరిహరించాలె. అచ్చమైన పదం ‘వైద్యశాల’ మాత్రమే వ్యవహారంలో ఉండెడి
    విధంగ ప్రత్యేక శ్రద్ధ తీసికోవాలె. వైద్యశాల, హాస్పిటల్, దవాఖాన ఉపయోగించ దగిన
    సరియైన పదాలు!
    ~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ

    • అజిత్ కుమార్ says:

      డా.రాపోలు సత్యనారాయణ గారూ… వైద్యశాల అనేది తెలుగు పదం కాదు. సంస్కృత పదం. హాస్పటల్ అనే ఇంగ్లీషు పదం తెలుగులోకి మార్చితే ( తర్జుమా చేస్తే) ఆసుపత్రి.

  2. చొప్ప.వీరభద్రప్ప says:

    పొలం దున్నితే చాలదు.వేసేవిత్తనాల నా ణ్యత, నేలస్వరూప స్వభావాలు,కాలం, వాతావరణ పరిస్థితి, నీటి స్థితి గతులు,ఆర్థిక పరిస్థితులు, అన్ని అయిన తర్వాత మార్కట్,ఇవన్నీ ఇంకా ఎన్నో మెలకువలు నాగలి పట్టేవాడు జాగ్రత్తగా చూస్తేనే పొలం దున్నినందుకు అర్థ చరితార్థ చేకూరుతుంది.రాయకుంటే నాకు నిద్ర రాదనుకుంటే.ఎలా? రచయితలు అన్నివిధాల బాగుంటే వారి ఊహలు, చెప్పే మాటలు నీతులు ఆదర్శంవంతంగా వుంటాయి. మార్గదర్శనం గా
    గ్రహించవచ్చు..3రోజులు నిద్రాహారాలు మాని రచన చేసి ఏమో అయినా డంటే …2రోజులకు అందరు మరచి పోతారు. ఏమో అట్లా పద్ధతి బాగుండ దనిపిస్తుంది.నా కోసం రాసుకున్నా ననడంలో ఔచిత్యముందనిపిస్తుంది. దాన్నే పలుమార్లు చదువుకున్న తర్వాత మార్పు చేర్పులు చేసుకొని ఇది నలుగురికి ఉపయోగ పడుతుందనిపిస్తే అప్పుడు ఏ ఎడిటర్ చూచినా మురిసిపోతాడు. వర్తమాన రచయిత లకు మీ సూచనలు శిరోధార్యాలగా వున్నా యనిపిస్తుంది.అభినందనలు

  3. Ram Mohan Rao Thummuri says:

    ‘మనోల్లాసం కలిగించే విషయాలు, మనసుకి నచ్చిన సంగతులు ఇతరులతో పంచుకోవటం మానవనైజం. కళాకారులు తమ సృజనని బహిరంగపరచటమూ అందుకేనని నేననుకుంటాను’. బాగుంది మీ స్పందన.

  4. BUCHHI REDDY GANGULA says:

    రాయడం — త్య్గాగ మా ???? BIG.JOKE…????
    అయినా యి వ్యవస్థలో తెలుగు కథలు –చదివే వాళ్ళ సంఖ్యా ఎంత శాతం ??

    అనిల్ గారు —చక్కగా చెప్పారు సర్

    ** గుర్తింపు కోసం అడుక్కునేవాడు అధమ స్థాయి బిచ్చగాడు ****** పతంజలి

    ———————–బుచ్చి రెడ్డి గంగుల

  5. Mohammed Khadeerbabu గారి పుస్తకం చదవకుండా కేవలం పై post చదివి నా అభిప్రాయం రాసే సాహసం చేస్తున్నాను … కథా ప్రతినిధులమని ముఖాలు పెట్టుకు తిరిగే వారెవరో నాకు తెలియదు, కానీ అలాటి వారుండడాన్ని ఊహించగలను, వారి మీద విముఖతే నాకూ కలుగుతుంది,
    కాకపొతే నాకో చిన్న సందేహం, కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితలు, కథ రాయకుండా ఉండలేనంత నిబద్ధత కలిగిన వారు … “చివరికి పొగడ్తలు లేకుండా ఉండలేని స్థితికి” వచ్చేస్తారా?
    ఏమో … అది సాధ్యమే ఐతే ఇక ఆ రచయిత సమాజానికీ, తన స్వంతానికీ కూడా ఉపయోగపడే శక్తిని కోల్పోవడం తథ్యం.

    ఇది కాక anil s రాయల్ గారి ఆర్ట్ ..క్రాఫ్ట్ గా మారడం మీద నాకు అభ్యంతరం ఉంది, మన కోసమైనా, ఎదుటివారి కోసమైనా మనకెంత చాత నైతే అంతే సద్దగలం, లేనివి సృష్టించి అమర్చలేం. నా ఉద్దేశం ఏమిటంటే చెప్పదలుచుకున్న విషయం ‘ఆర్ట్’ అనుకుంటే …అది పాఠకుడికి హత్తుకునేంత బాగా చెప్పడం ‘క్రాఫ్ట్’ అని నా నమ్మకం. అది (ఆ క్రాఫ్ట్ రూపం) ఎవరి (రచయిత) శక్తి యుక్తులను బట్టీ, చెప్పదలుచుకున్న విషయమే డిసైడ్ చేస్తుంది అనుకుంటాను

  6. Mohammed Khadeerbabu గారి పుస్తకం చదవకుండా కేవలం పై post చదివి నా అభిప్రాయం రాసే సాహసం చేస్తున్నాను ..
    కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితలు, కథ రాయకుండా ఉండలేనంత నిబద్ధత కలిగిన వారు … “చివరికి పొగడ్తలు లేకుండా ఉండలేని స్థితికి” వచ్చేస్తారా? అనే సందేహం కలిగింది నాకు.
    ఏమో … అది సాధ్యమే ఐతే ఇక ఆ రచయిత సమాజానికీ, తన స్వంతానికీ కూడా ఉపయోగపడే శక్తిని కోల్పోవడం తథ్యం.
    తనకోసం తాను రాసుకోడం జరిగితే అటువంటి ప్రమాదం ఉండదన్నారు అనిల్ గారు, అది నిజమనిపిస్తోంది.
    కానీ, anil s రాయల్ గారి ఆర్ట్ ..క్రాఫ్ట్ గా మారడం మీద నాకు అభ్యంతరం ఉంది, మన కోసమైనా, ఎదుటివారి కోసమైనా మనకెంత చాత నైతే అంతే సద్దగలం, లేనివి సృష్టించి అమర్చలేం. నా ఉద్దేశం ఏమిటంటే చెప్పదలుచుకున్న విషయం ‘ఆర్ట్’ అనుకుంటే …అది పాఠకుడికి హత్తుకునేంత బాగా చెప్పడం ‘క్రాఫ్ట్’ అని నా నమ్మకం. అది (ఆ క్రాఫ్ట్ రూపం) ఎవరి (రచయిత) శక్తి యుక్తులను బట్టీ, చెప్పదలుచుకున్న విషయమే డిసైడ్ చేస్తుంది అనుకుంటాను

    • >> “నా ఉద్దేశం ఏమిటంటే చెప్పదలుచుకున్న విషయం ‘ఆర్ట్’ అనుకుంటే …అది పాఠకుడికి హత్తుకునేంత బాగా చెప్పడం ‘క్రాఫ్ట్’ అని నా నమ్మకం”

      వాక్యాలు వేరైనా – నేననేదీ అదే.

      >> “అది (ఆ క్రాఫ్ట్ రూపం) ఎవరి (రచయిత) శక్తి యుక్తులను బట్టీ, చెప్పదలుచుకున్న విషయమే డిసైడ్ చేస్తుంది అనుకుంటాను”

      Can’t disagree with that.

  7. తహిరో says:

    ఖ”ధీరుడి” తాజా పుస్తకం లోని వాక్యాలను (పుస్తకం విడుదల కాకముందే ) మీకు (ఉప్పు) అందించిన మహానుభావులు ఎవరండీ :)
    ఇంతకీ ఎవరికోసం వాళ్ళే రాసుకోవాలని మీరు ఘంటాపథంగా గంట కొట్టి చెప్పారని స్పష్టంగా అర్థమయ్యింది అనిల్ గారూ. కథలు రాసి అచ్చోసి వదలడం వలన కొన్ని లాభాలున్నాయి. అప్పటికీ ముక్కూ , మొఖం , వీపు, మెడ, తొడ – తెలియని వారు మిత్రులుగా లభించడం. అయితే అందులో చెత్తా చెదారం ఉండదని కాదు, అలాంటివి ఉంటే గింటే ముందే గ్రహించి వాటిని మనమే ఏరి పారేయాలి – చాకచక్యంగా .
    మీ సలహాలు ఈ వారం మరింత కుతూహలంగా ఉన్నాయి – ధన్యోస్మి !

  8. ఈ వ్యాసానికి మూలకారకమైన “రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….” అనే వ్యాఖ్య ఖదీర్ బాబు గారిది కాదని ఓ మితృని ద్వారా తెలిసింది. పొరపాటుగా దాన్ని ఆయనకి ఆపాదించినందుకు బహిరంగ క్షమాపణలు తెలియజేస్తున్నాను. (మొదటి పేరాలో ప్రస్తావించిన మిగతా వ్యాక్యాలు మాత్రం ఖదీర్ బాబు గారి పుస్తకంలోనివే)

    కథలు రాయటం త్యాగమనే మాట ఎవరిదయినప్పటికీ, ఈ వ్యాసంలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు మాత్రం యధాతధం.

  9. Sashanka says:

    కథలు రాయడం ఒక పిచ్చి… నుంచీ పిచ్చాసపత్రుల్లో చేరారు వరకూ- కొంత మంది రచయితల్లో కళాకారుల్లో నిజమే అయి ఉండే అవకాశం ఉంది. కాగితం ముందేసుకు రాయటం అనే పని నిత్యజీవితానికి సంబందించిన సాధారణ మయిన ప్రక్రియ కాదు. అందులో ఏదో అతి ఉంది. ఇక రాయటమే పనిగా పెట్టుకోవటం ఇంకా అతి. దానికి పరాకాష్ట పిచ్చాసుపత్రి .

    పిచ్చివారి వారి సామర్ధ్యాన్ని బట్టి ఉందని ఉంటుందని ఈ వ్యాస రచయిత సమర్ధ వంతంగా రాశారు.

    ఆ అతికి వాళ్ళా చివర ఉంటే ఈ వ్యాస రచయితల్లాంటి వాళ్ళు ఈ చివర ఉన్నారు.

    ఇంతకూ “రచయితలు ఇంత త్యాగం చేసి” అనేదాన్ని బాగా ఊహించి తెలుసుకుని సుదీర్ఘ వ్యాసం రాశారు కనుక ఈ వ్యాస రచయిత కూడా…
    -శశాంక

  10. అజిత్ కుమార్ says:

    కధలు వ్రాయడం అంటే ఓ ఉపాధ్యాయునిలా పాఠకులలో కొన్ని అభిప్రాయాలు ఏర్పరచడం. కధలనేవి భావవాదపు శక్తివంతమైన ఆయుధాలు. అయితే వాటిలో నిజాల నిరూపణలకోసం చేసుకునే ప్రయోగాలవల్ల మానసిక సమస్యలు ఏర్పడడం సహజం. చిత్త చాంచల్య స్థాయీబేధాల వల్ల కొన్ని కధలు కొందరికి నచ్చడం, నచ్చకపోవడం వంటి భావనలు కలుగుతాయి. కనుక శాస్త్రీయత, సత్యము వంటి వాటికోసం చూడకుండా కేవలం ఆనందం/జ్ఞానం కోసం అని అనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు తగ్గుతాయి.

  11. చెప్పదలుచుకున్న విషయం ‘ఆర్ట్’ అనుకుంటే …అది పాఠకుడికి హత్తుకునేంత బాగా చెప్పడం ‘క్రాఫ్ట్’ అని నా నమ్మకం” – నాది కూడా :)

  12. “పో ” కి పిచ్చి ఎక్కింది కథల వలన కాదు . వ్యసనాల వలన. “కామూ” దిమ్మరి. ఖదీర్ గారి మాటలు కేవలం సొంత డబ్బా మరింత ఘట్టిగా కొట్టుకోవడమే . శ్రీ శ్రీ కి పిచ్చి లాగ అనిపించినది కవిత్వం రాయడం వలన కాదు . ఎండలని లెక్క చెయ్యక ఆరోగ్యం పట్టించుకోక పార్టీ ప్రచారం చెయ్యడం . సాహిత్యం వలన పిచ్చి ఎక్కిన వాళ్ళ పేర్లు ఖదీర్ ఇస్తే మంచిది. శారద , కుటుంబరావు లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి కూడా రాసారు. చెరబండరాజు ఒక మంచి ఉదాహరణ . చేతిలో పెన్నూ జేబులో పత్రిక ఉంటె ఏదైనా రాస్తారు. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు మైకు పెడితే చాల మాటలు ఆడతారు . లైట్……….

Leave a Reply to BUCHHI REDDY GANGULA Cancel reply

*