నిర్ముక్తం

 

 

– రాధ మండువ

చిత్రం: నివాస్ 

~

radhaనేను రమణమహర్షి ఆశ్రమంలో లైబ్రరీలో సేవ చేస్తుంటాను. ఆశ్రమానికి దగ్గర్లోనే ఇల్లు కొనుక్కుని తిరువణ్ణామలైలో సెటిలైపోయి పదేళ్ళు కావస్తోంది.

ఆరోజు రమణుడికి మెడిటేషన్ హాల్లో నమస్కరించుకుని మాతృభూతేశ్వరాలయంలో నవగ్రహాల దగ్గర ఊదొత్తులు వెలిగించాలని వెళ్ళాను. వెళుతుండగా ఆలయం ముందున్న హాలులో కిటికీకి దగ్గరగా ఒక విదేశీ జంట ఒకర్నొకరు హత్తుకుని నిలబడి ఉండటం కనిపించింది. ఆమె ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. పొడవుగా సన్నగా ఉన్న అతను ఆమె వీపుని తన అర చేతులతో తడుముతూ ఓదారుస్తున్నాడు. ‘నలుగురూ తిరిగే ప్రదేశాలలో, అందునా గుడిలో ఏమిటీ చర్యలూ, మరీ ఈ మధ్య చీదర పుట్టేట్లు ప్రవర్తిస్తున్నారు’ అని నేను మొదట చూడగానే అనుకున్న మాట వాస్తవం. అయితే వెంటనే అనిపించింది పాపం వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు వెళుతూ దు:ఖిస్తున్నారేమో అని.

నేను ప్రక్కనే ఉన్న రమణుడి విగ్రహానికి నమస్కరించి మళ్ళీ వాళ్ళని చూశాను. ఆమె అతన్నించి విడివడి అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఆమె చాలా పెద్దావిడ! అరె, అతను జాన్ కదూ! అతను దాదాపు సంవత్సరమున్నర నుంచి ఇక్కడే ఉంటున్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారేమో!?

అతడు వెళుతున్న ఆమెకి చెయ్యి ఊపుతూ “బై మమ్” అన్నాడు. ఆమె వెనక్కి తిరిగి చూడకుండా కన్నీళ్ళని తన చేతిలో ఉన్న చిన్న టవల్ తో తుడుచుకుంటూ ఆఫీసులోకి వెళ్ళిపోయింది. అతను కిటికీ చువ్వలను పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు. ఏడుస్తున్నాడా? తెలియట్లేదు. అతని వెనుకగా నాలుగడుగుల దూరంలో నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తున్న నాకు మాత్రం కన్నీళ్ళు తిరిగాయి.

ఏమయిందో తెలుసుకోవాలని నేను ఆఫీసు దగ్గరకి వెళ్ళాను. ఆమె ఆఫీసులో వాళ్ళకి చెప్పి బయటకి రాగానే ఆమె నాకు పరిచయమే అన్నట్లుగా “హలో హౌ ఆర్ యు?” అన్నాను.

“ఓకే – మీరూ….” అంది.

“నా పేరు జానకి. ఆశ్రమం లైబ్రరీలో ఇంకా ఇక్కడ అఫారెస్టే్రషన్ సర్వీస్ ఎన్ జి వో సంస్థ లో వాలంటీర్ గా పని చేస్తుంటాను” అన్నాను.

“హలో, హాయ్, నా పేరు మేరీ” అంది మెహమాటంగా.

“ఇప్పుడే చూశాను మిమ్మల్ని. జాన్ మీ అబ్బాయే కదా!?” అన్నాను.

“ఔను” అంది – దు:ఖపు జీర ఆమె గొంతులో.

“మిమ్మల్ని చూస్తూ నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఆ మధ్య చదివిన ఓ జానపద కథ గుర్తొచ్చింది నాకు” అన్నాను.

“ఫోక్ స్టోరీ!? ఏమిటది? మీకేమీ అభ్యంతరం లేకపోతే చెప్తారా?” అంది.

 

ఇంగ్లీషులో జరుగుతున్న మా సంభాషణ అర్థం అవుతుందో లేదో కాని వరండాలో కూర్చుని ఉన్న ఐదారుగురు భక్తులు మమ్మల్నే చూస్తున్నారు. “ఇక్కడ కూర్చుందాం రండి” అంటూ బుక్ స్టోర్ కి పక్కగా ఉన్న సన్నని వరండా లోకి తీసుకెళ్ళాను. ఇద్దరం గోడకి ఆనుకుని కూర్చున్నాక “కథ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ విన్నాక మీ పట్ల నేను ఊహించింది కరెక్ట్ కాకపోతే మీరేమీ అనుకోవద్దు సుమా! అయినా ప్రయాణమైనట్లున్నారు, సమయముందా” అన్నాను.

ఆమె నవ్వుతూ “చాలా సమయముంది. ఏమీ అనుకోను చెప్పండి, వినాలని ఆసక్తిగా ఉంది” అంది.

Kadha-Saranga-2-300x268

“మాగ్దానా అనే రాణి చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. కుమారుడి మీదే ఆశలన్నీ పెట్టుకుని పెంచి పెద్ద చేసుకుంది. కాని ఆమె కొడుకు యుక్తవయస్కుడయ్యాక అమరత్వాన్ని సాధించాలని తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు. కాలదేవత దగ్గర కాలమనేదే తెలియకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవించాక తల్లిని చూడాలనిపించి వాళ్ళ రాజ్యానికి వస్తాడు. వచ్చాక తెలిసింది – తల్లిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిన కొడుకుగా అతని పేరు చరిత్ర పుటల్లో లిఖించబడిందని. ‘నేను సాధించింది ఇదా?’ అని ఖిన్నుడయిపోతాడు”

కథని వింటున్న ఆమె నిట్టూరుస్తూ “సో శాడ్” అంది.

“మీ అబ్బాయి కూడా మిమ్మల్ని వదిలేసి ఆశ్రమానికి వచ్చాడా అనిపించింది మీరు అతన్ని హత్తుకుని దు:ఖిస్తుంటే” అన్నాను.

“మీరు మా గురించి ఊహించింది కరెక్టే – అయితే నేనే స్వయంగా నా చేతులతో నా బిడ్డ జాన్ ను మహర్షి దగ్గరకి పంపాను. అతనిక్కడకి వచ్చి సంవత్సరం దాటింది. కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉన్నాడా? లేడా? అనేది అర్థం కావడం లేదు” అంది.

“నాకర్థం కాలేదు. మీ అబ్బాయి ఆవేశపరుడా? అది తగ్గించుకోమని చెప్పి పంపారా ఇక్కడకి?”

“చాలా ఆవేశం, తన గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయినంత పని చేశాడు”

“ఏమిటీ? గర్ల్ ఫ్రెండ్ ని చంపబోయాడా? ఎందుకు? ఆమె ఇతన్ని మోసం చేసిందా?”

“మోసం – ఈ మాటకి అర్థం ఏమిటి జానకీ – మీ పేరు జానకీయే కదా?” అని నేను తలూపాక “నీకు మోసమైంది నాకు న్యాయం అవొచ్చు కదా? మా దేశంలో నచ్చితే కలిసి ఉంటారు నచ్చకపోతే ‘నువ్వు నాకు నచ్చలేదు’ అని చెప్పేసే విడిపోతారు. ఆమె వీడిని వదిలి వేరే అతనితో వెళ్ళిపోయిందని కోపం” అంది.

“మరి ఆ అమ్మాయి ‘నేను నీతో కలిసి ఉండలేన’ని మీ అబ్బాయితో చెప్పింది కదా!?” అన్నాను.

“చెప్పింది. ఏం జరిగిందో చెప్తాను మీకు – నేను కమ్యూనిటీ కాలేజ్ లో లెక్చరర్ ని. మాగ్దానా రాణికి లాగే నా భర్త కూడా జాన్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆయన బ్రతికున్నప్పుడు జాన్ ని బాగా చదివించాలని నాతో అనేవాడు. వాడి కాలేజ్ చదువు కోసం బాగా సేవ్ చేసేదాన్ని. మీకు తెలుసు కదా మాకు యూనివర్సిటీ చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. జాన్ యూనివర్సిటీలో చేరాక అతని పుస్తకాలకైనా డబ్బులు వస్తాయని సాయంత్రం ఓ నాలుగు గంటలు బర్గర్ కింగ్ లో పని చేయమని చెప్పాను. అదీ నేను చేసిన తప్పు. పనికి చేర్చకుండా ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో! అక్కడ జాన్ తో పాటు అదే షిఫ్ట్ లో పని చేసే టీనాని ఇష్టపడ్డాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా రాయకుండా ఆమెతో తిరుగుతున్నాడని తెలిసి మందలించాను. దానికే ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు.

అపార్ట్ మెంట్ తీసుకుని ఆమెతో లివ్-ఇన్ రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ‘వేరేగా ఉంటే ఉన్నావు, చదువు మాత్రం మానొద్ద’ని నచ్చ చెప్పాను. టీనా చేత కూడా చెప్పించాను. వినలేదు.

ఏడెనిమిది నెలల తర్వాత హఠాత్తుగా ఒకరోజు రాత్రి పది గంటలప్పుడు ఇంటికొచ్చాడు. తాగి ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వస్తూనే ‘మమ్, ఈరోజు టీనాని చంపేస్తాను, నిన్నొకసారి చూసి నీతో చెప్పి పోదామని వచ్చాను’ అంటూ తన గదిలోకి వెళ్ళాడు.

నిశ్చేష్టురాలినైన నా నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు కాని నా మెదడు మాత్రం చురుగ్గా పని చేసింది. జాన్ గది తలుపులు మూసేసి బయట గడి పెట్టేశాను. తలుపులు బాదుతూ ‘మమ్, తలుపులు తియ్’ అని అరవసాగాడు. ‘జాన్ కూర్చో, అక్కడే కూర్చో, తలుపులు తీస్తాను. ముందు నాతో మాట్లాడు. పెద్దగా అరిస్తే అందరికీ వినపడుతుంది. ఇక్కడేదో జరుగుతుందని పక్కింటి వాళ్ళు పోలీసులకి ఫోన్ చేస్తారు, కామ్ డవున్’ అన్నాను. లోపల నుండి ఏమీ సమాధానం లేదు.

నా సెల్ తో జాన్ సెల్ కి ఫోన్ చేశాను. లోపల ఫోన్ ఎత్తి ‘హలో మమ్, తలుపు తియ్’ అన్నాడు.

‘తీస్తాను బిడ్డా, ఏం జరిగిందో నేను వినాలి కదా! వేరొకరిని చంపేస్తాను – అనే బిడ్డకి నేను జన్మనిచ్చానా!? అని సిగ్గుపడుతున్నాను’ అని భోరున ఏడ్చాను. వాడూ ఏడ్చాడు. ‘పడుకో జాన్, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాను.

ఆవేశంతో జాన్ తనని తాను శిక్షించుకుంటాడేమోనన్న భయంతో మెయిన్ డోర్ లాక్ చేసి బ్యాక్ యార్డ్ లోకి వెళ్ళాను. రాత్రంతా అతని గది కిటికీ లోంచి అతన్నే చూస్తూ వాకింగ్ చేశాను. తలుపు దగ్గరే కార్పెట్ మీద పడి నిద్రపోయాడు జాన్. అప్పటికప్పుడే నా ఫ్రెండ్ శైలజాకి ఫోన్ చేశాను”

“శైలజ!?” అన్నాను.

“అవును మా కాలేజీలో నా తోటి లెక్చరర్, ఇండియనే. నాకు బెస్ట్ ఫ్రెండ్. ఉదయం ఆరుకంతా మా ఇంటికి వచ్చింది. రాగానే గబగబా బ్లాక్ టీ చేసింది. ఇద్దరం టీ తాగుతూ హాలులో కూర్చుని ఉన్నాం. ఎనిమిదవుతుండగా జాన్ లేచి “మమ్!” అని పిలిచాడు తలుపు తడుతూ…

తలుపు తీసి ‘దా జాన్, శైలజ వచ్చింది’ అన్నాను. ఫ్రెషప్ అయి హాల్లోకి వచ్చాడు. శైలజని చూసి చిన్నగా నవ్వాడు. ఆ మాత్రానికే నేను చాలా సంతోషపడ్డాను. భయం పోయింది. మెల్లగా వచ్చి సోఫాలో నన్ను ఆనుకుని కూర్చున్నాడు. శైలజ లేచి జాన్ కి టీ తెచ్చి ఇచ్చింది. అతను టీ తాగిన ఐదు నిమిషాల పాటు శైలజ తన బ్యాగ్ లో నుండి మహర్షి ఫోటో తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది.

 

జాన్ టీ తాగి నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని శైలజనే చూడసాగాడు. నేను కూడా శైలజనే చూస్తూ జాన్ తల నిమురుతూ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాసేపాగాక శైలజ కళ్ళు తెరిచి జాన్ నే నిశితంగా చూస్తూ నిదానంగా ‘జాన్, ఏం జరిగింది?’ అంది.

శైలజ వేసిన ప్రశ్నకి జాన్ చేతులు ఆవేశంతో వణకడం గమనించాను. శైలజ కూడా గమనించి లేచి తన కుర్చీని మా సోఫాకి దగ్గరగా లాక్కుని జాన్ చేతిని పట్టుకుంది. ఆమె కళ్ళు….” అంటూ మేరీ చెప్పడం ఆపి నా కళ్ళల్లోకి చూసింది. “మీ కళ్ళలాగే శైలజ కళ్ళు కూడా దయని కురిపిస్తుంటాయి” అంది.

నేను మెల్లగా నవ్వి ఆమె తడి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు వంగి ఆమె చేతిని పట్టుకున్నాను. దు:ఖాన్ని దిగమింగుకుంటున్నట్లుగా ఆమె గుటకలు మింగింది.

“శైలజగారికి సమాధానం చెప్పాడా?” అన్నాను.

మేరీ చెప్పాడన్నట్లుగా తల ఊపి ‘ఆ బిచ్ నన్ను మోసం చేసింది శైలజా, ఇప్పుడు టీనా బర్గర్ కింగ్ లో పని చేయడం లేదు. రెండు నెలల క్రితం విలేజ్ పాయింట్ అపార్ట్ మెంట్స్ రెంటల్ ఆఫీసులో చేరింది. అక్కడ వాళ్ళ ఆఫీసులోని తన కొలీగ్ తో రిలేషన్ షిప్ పెట్టుకుంది’ అన్నాడు జాన్. అతని గొంతు నిండా కోపం. ఆ కోపం వల్ల మాట తడబడింది.

‘నీకు చెప్పి నిన్ను వద్దన్నాకే అతనితో కలిసి ఉంటోంది కదా, అది మోసం ఎలా అవుతుంది?’ అంది శైలజ.

శైలజకి ఎలా తెలుసా? అన్నట్లుగా గభాల్న లేచి కూర్చుని ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు.

‘రాత్రి మీ అమ్మ నాకు ఫోన్ చేసి నీ పరిస్థితి చెప్పాక నేను టీనాకి ఫోన్ చేసి అన్ని విషయాలూ కనుక్కున్నాను. ఆమె తప్పేమీ లేదు, నీతో రిలేషన్ షిప్ కుదరదని చెప్పే అతని అపార్ట్ మెంట్ కి వెళ్ళిపోయింది కదా!? వెళ్ళి కూడా పది రోజులవుతోంది. ఇప్పుడేంటి నీకింత ఆవేశం – అదీ మర్డర్ చేయాలనేంతగా!? అయినా నీ వయసు ఎంతని? నీ వయసుకి తగ్గ పనులు చేస్తున్నావా నువ్వు? ఆలోచించు’ అంది.

జాన్ ఏమీ మాట్లాడలేదు. చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే శైలజని ఏమీ అనలేక ‘సారీ’ అని గొణిగాడు.

radha (1)ఇక ఆమె జాన్ ని రొక్కించకుండా అసలేమీ జరగనట్లూ, అంతా మామూలుగానే ఉందన్నట్లూ ‘గెట్ రెడీ మేరీ, కాలేజ్ కి టైమవుతుంది’ అని వంటింట్లోకి వెళ్ళి గబగబా ప్యాన్ కేక్స్ తయారు చేసింది. నేను ఫ్రెషప్ అయి వచ్చేలోపు కొత్తగా రిలీజైన సినిమాల గురించి మాట్లాడుతూ జాన్ కి ప్యాన్ కేక్స్ పెట్టింది. మేమిద్దరం కూడా తినేసి కాలేజీకి వెళ్ళిపోయాము. సాయంత్రం ఆఫీస్ అయ్యాక కౌన్సిలర్ దగ్గరకి వెళ్ళి మాట్లాడాలని, కౌన్సిలర్ దగ్గరకి జాన్ ని తీసుకెళితే మంచిదని అనుకున్నాం.

మధ్యాహ్నం రెండవుతుండగా టీనా నుండి ఫోన్ వచ్చింది.

జాన్ టీనా ఆఫీస్ కి వెళ్ళి ఆమెని కత్తితో పొడవబోయాడట. ఆమె బాయ్ ఫ్రెండ్, జాన్ ని పట్టుకుని లోపల గదిలో కూర్చోపెట్టి కదలకుండా కాపలా కాస్తున్నాడట. అతను పోలీసులకి ఫోన్ చేస్తానంటే టీనా వద్దని ఆపి నాకు ఫోన్ చేస్తున్నట్లు చెప్పింది. నేను, శైలజ ఇద్దరం హడావుడిగా అక్కడికెళ్ళాం. అదృష్టవశాత్తూ జాన్ టీనా మీదికి దూకినప్పుడు ఆమె, ఆమె బాయ్ ఫ్రెండ్ తప్ప ఆఫీసులో ఎవ్వరూ లేరు. నేను అక్కడికి వెళ్ళగానే టీనాని హత్తుకుని ఏడ్చాను. అనేక కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

శైలజ జాన్ ఉన్న లోపలి గదిలోకి వెళ్ళి అతని చేయి పట్టుకుని బయటకి తీసుకు వచ్చింది. జాన్ వంచిన తల పైకెత్త లేదు. నేను ఏడుస్తూ జాన్ ని వాటేసుకుని బయటకి నడిపించాను. శైలజ వెనుకనుండి మా ఇద్దరి భుజాల మీద చేతులు వేసి మాతో పాటు నడుస్తూ వెనక్కి తిరిగి ‘టీనా, నువ్వు ఈరోజు చేసిన సహాయానికి భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. కృతజ్ఞతలు’ అని ‘మీ పేరేమిటో నాకు తెలియదు టీనా మాట విని పోలీసులకి ఫోన్ చేయకుండా ఆగినందుకు మీకు కూడా వందనాలు’ అంది. టీనా కొత్త బాయ్ ఫ్రెండ్ తో శైలజ ఆ మాటలు అంటున్నదని నాకర్థం అయింది. మమ్మల్నిద్దరినీ తన కారులోకి ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది.

ఆ తర్వాత రోజు నుండి నెల రోజులు లాంగ్ లీవ్ తీసుకుని జాన్ కి కౌని్సలింగ్ ఇప్పించాను. ఆ రోజుల్లో శైలజ మాకు చాలా సహాయం చేసింది. రమణ మహర్షి గురించి ఇంగ్లీషులో ఉన్న దాదాపు అన్ని పుస్తకాలూ శైలజ నాకు తెచ్చి పెడితే, నేను జాన్ కి చదివి వినిపించాను.

ఆరోజు…. శైలజే అడిగింది జాన్ ని – ‘జాన్ రమణాశ్రమానికి ఇండియాకి వెళతావా?’ అని.

వెళతాను అన్నట్లుగా జాన్ తల ఊపాడు. నేను, శైలజా ఇద్దరం చాలా సంతోషపడ్డాం. శైలజ అప్పటికప్పుడే తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి అన్ని ఏర్పాట్లూ చేసింది. జాన్ కి ఆశ్రమంలో భోజన సదుపాయం మాత్రమే ఇచ్చారు. అదే చాలు అని ఆశ్రమానికి దగ్గర్లో అద్దె ఇంట్లో జాన్ ఉండేట్లు ఏర్పాట్లు చేసింది.

జాన్ ఇక్కడకి వచ్చి కూడా రెండేళ్ళవుతోంది జానకీ! నేను పోయిన సంవత్సరం వచ్చాను. ఇది రెండో విజిట్. అతనిలో మాత్రం ఏమీ మార్పు లేదు. ఆ ఆవేశం తగ్గించుకుని నా దగ్గరకి వచ్చి మళ్ళీ యూనివర్సిటీలో చేరి చదువు పూర్తి చేసుకోవాలనీ, ఉద్యోగంలో చేరి పెళ్ళి చేసుకుని హాయిగా జీవిస్తే చాలుననీ ఉంది. మహర్షి…. ఆయన బ్లెస్సింగ్స్ నా బిడ్డకి ఎప్పుడిస్తాడో!?” అంది. ఆ మాటలంటున్నప్పుడు కన్నీళ్ళు ఆమె బుగ్గల మీదుగా జారిపోయాయి.

నేను జాన్ తో మాట్లాడుతుంటాననీ, అతని క్షేమ సమాచారాలు వివరంగా మెయిల్ రాస్తానని చెప్పాను. నా మాటలకి ముఖం విప్పార్చుకుని అప్పటికప్పుడే బ్యాగ్ లోంచి తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చింది మేరీ.

 

***

 

ఆ తర్వాత సంవత్సరం పాటు జాన్ ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజూ జాన్ తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాన్ క్షేమ సమాచారాలని మేరీకి తెలియచేస్తున్నాను. శైలజగారు కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు.

జాన్ లో ఆధ్యాత్మికంగా ఏ మాత్రమూ ఎదుగుదల కనపడటం లేదు. ఉదయం 6.30 కి లేచి ఏడు గంటల బ్రేక్ ఫాస్ట్ కి వస్తాడు. తిన్నాక నేరుగా గదికి వెళ్ళి కాసేపు పడుకుంటాడు. అపార్ట్ మెంట్ సర్వీస్ బాయ్ శీనా వచ్చినప్పుడు లేస్తాడు. ఆ అబ్బాయి రూమ్ ఊడ్చి, బట్టలుతికి వెళ్ళాక స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి సమాధి హాల్లో కూర్చుని పూజా కార్యక్రమం చూస్తాడు. 11.30 కి భోజనం చేసి వెళ్ళి మూడు వరకూ నిద్రపోతాడు. మూడుకి లేచి చిన్నగా ఆశ్రమానికి చేరి నాలుగు గంటలకి టీ తాగి బయట కూర్చుని కోతులని, నెమళ్ళని చూస్తూ కాలక్షేపం చేస్తాడు. ఎవరైనా పలకరిస్తే కబుర్లు చెప్తాడు లేకపోతే లేదు. మళ్ళీ హాల్లో కూర్చుని పారాయణం చేస్తుంటే విని ఏడున్నరకి డిన్నర్ చేసి గదికి వెళ్ళిపోతాడు. ఎనిమిది గంటలకి పడుకున్న అతను మళ్ళీ ఉదయం ఆరూ, ఆరున్నరకే లేచేది – ఇదే రోజూ అతని కార్యక్రమం.

ఎప్పుడైనా సాయంకాలం రమణాశ్రమం ఎదురుగ్గా ఉన్న షాపులో టీ తాగుతాడు. కావలసిన వస్తువులు సబ్బులు, పేస్ట్ లాంటివి కొనుక్కుంటాడు – అంతే. ఒక పుస్తకం చదవడమో, ధ్యానం చేసుకోవడమో ఏమీ లేదు. ఇదంతా చూస్తుంటే అతనెందుకు ఇక్కడ ఇలా సమయాన్ని వృథాగా గడుపుతున్నాడో అర్థం కాక బాధ కలుగుతోంది. ఈ విషయాన్ని మేరీకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు.

అతన్ని అతని దేశానికి ఎలా పంపాలా అని ఆలోచిస్తున్న నాకు రమణుడే దారి చూపించాడు. ఇలా నేను అనుకున్న తర్వాత రోజు నుంచే కుంభవర్షం. మా ఆర్గనైజేషన్ వాళ్ళు పనిలోకి దిగారు. జాన్ ని వెంటబెట్టుకుని వెళ్ళాను నేను కూడా కొండ మీదికి. పైనుంచి ఎవరో నీళ్ళని బిందెలతో పోస్తున్నట్లుగా వర్షం. ఆ వర్షంలో తడుస్తూనే చెట్లకి పాదులు తీస్తూ, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా కాలువలను మళ్ళిస్తూ పనులు చేస్తున్న వాళ్ళని జాన్ ఆశ్చర్యంగా చూడసాగాడు.

తర్వాత రోజు కొంతమంది కొండ మీద పని చేస్తారనీ, మరి కొంతమంది ఊళ్ళో లోతట్టు ప్రాంతంలో ఉన్న దినసరి కూలీలకి, వృద్ధులకి భోజన పొట్లాలను పంచడానికి వెళుతున్నారని తెలిసి, జాన్ ని తీసుకుని కావాలనే ఊళ్ళోకి వెళ్ళాను. పొట్లాలను పంచుతున్న జాన్ తో అన్నాను – “చూశావా జాన్ ఎంతో చక్కగా చదువుకునీ, ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటూ, కడుపు నిండిన వీళ్ళు ఒక వర్గం – తాము ప్రశాంతంగా జీవిస్తూ సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నారు – సంతోషం.

ఇక ఈ అభాగ్యులని చూడు. ప్రతి రోజూ కూలి చేస్తే గాని పొట్ట నిండదు వీళ్ళకి పాపం. వీళ్ళొక వర్గం – వాళ్ళూ పని చేసుకుని వాళ్ళ బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఇంకో వర్గం కూడా ఉంది పనీ పాటా లేకుండా పెద్దవాళ్ళు సంపాదిస్తుంటే తిని కూర్చునే వాళ్ళు. వాళ్ళ వల్ల సమాజానికి కీడేగాని ఉపయోగం ఏముంది?” అన్నాను.

జాన్ ఔనన్నట్లుగా తల ఊపుతూ ‘యస్ జానకీ’ అన్నాడు.

వారం రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. అందరం పనులు చేస్తూనే ఉన్నాం. జాన్ లో కూడా హుషారు కనిపించింది. ఎనిమిదో రోజు జాన్ నా గదికి పరిగెత్తుకుంటూ వచ్చి “జానకీ, అమ్మ వస్తోంది ఎల్లుండి” అన్నాడు.

“తెలుసు జాన్, నాక్కూడా ఫోన్ చేసింది” అన్నాను.

 

***

మేరీ వచ్చింది. ఆశ్రమం ఆఫీసు ఎదురుగ్గా పందిరి క్రింద నన్ను హత్తుకుని బోలెడు కృతజ్ఞతలు చెప్పింది. జాన్ మా ప్రక్కనే నిలబడి మమ్మల్నే చూస్తున్నాడు. మేరీ నుండి విడివడి “జాన్, అమ్మని తీసుకుని సాయంత్రం అన్నామలై స్వామి మందిరానికి సాయంత్రం ఐదు గంటలకి రాగలవా? మీతో మాట్లాడాలి” అన్నాను.

“అన్నామలై స్వామి మందిరమా! అదెక్కడ?” అన్నాడు.

“దాదాపు రెండున్నరేళ్ళు అవుతుంది కదా నువ్వు ఇక్కడకి వచ్చి? ఆశ్రమం క్యాంపస్ లోనే ఉన్న ఆ మందిరం ఎక్కడుందో నువ్వే కనుక్కొని, వీలైతే అన్నామలైస్వామి గురించిన పుస్తకం కొనుక్కుని చదువుకుని రా” అన్నాను నవ్వుతూ. నా పెదవులు నవ్వుతున్నాయి కాని నా కళ్ళల్లోని తీక్షణతని గమనించినట్లున్నాడు – అతని ముఖం అప్రసన్నంగా మారింది. నేను పట్టించుకోకుండా మేరీకి పని ఉందని చెప్పి ఆఫీసులోకి వెళ్ళిపోయాను.

 

***

radha (1)సాయంత్రం ఐదయింది. నేను వెళ్ళేప్పటికి జాన్, మేరీ అన్నామలైస్వామి మందిరం ముందున్న వరండాలో కూర్చుని ఉన్నారు. నేను అన్నామలైస్వామి మందిరం తలుపు తీస్తూ “నిత్యకృషీవలుడు అన్నామలైస్వామి రమణుడిని సేవించి రమణుడంతటి వాడయ్యాడు మేరీ” అన్నాను. మేరీ ఆయన ఫోటోను చూస్తూ నమస్కరించింది. ఆయన సమాధి మీదున్న శివలింగానికి కూడా నమస్కరించుకున్నాక డాబా మీదకి తీసుకు వెళ్ళాను. అక్కడకి చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్న కొండని చూపిస్తూ “చూశారా మేరీ, పనే దైవం అని నమ్ముకున్న అన్నామలై స్వామిని రమణుడే కాదు సాక్షాత్తూ ఆ శివుడే దగ్గరగా వచ్చి ఆశీర్వదిస్తున్నట్లుగా లేదూ!?” అన్నాను.

మేరీ అవునన్నట్లుగా తల ఊపుతూ ఆ కొండని నిశ్శబ్దంగా చూడసాగింది.

నేను జాన్ వైపుకి తిరిగి “జాన్, అన్నామలైస్వామి గురించి చదివావా?” అన్నాను.

లేదన్నట్లు తలూపాడు. అతని ముఖంలో ఏమిటీవిడ టీచర్ లాగా ప్రశ్నలు అనుకుంటున్నట్లు అనిపించింది.

నేనదేమీ గమనించనట్లుగా “జాన్, నువ్వేమీ అనుకోనంటే నేను నీకు నీ గురించి చెప్పాలనుకుంటున్నాను” అన్నాను. నా నుండి ఊహించని ఆ సంభాషణకి విస్తుపోయినట్లుగా చూశాడు. మేరీ కూడా నా వైపు ఆశ్చర్యంగా చూసింది.

“నేను నిన్ను పరిశీలించి తెలుసుకున్నదే కాకుండా నీ గురించి ఇక్కడి వాళ్ళు – ఇతరులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్తున్నాను. అలా అని ఇతరులు చెప్పేదే కరెక్ట్ అని కాదు” అన్నాను.

 

“చెప్పండి” అన్నాడు. ఆసక్తి కనిపించింది అతని గొంతులో.

“నేను చెప్పడం ఎందుకులే జాన్, నాలుగు రోజుల క్రితం నువ్వు అభాగ్యులకి అన్నం పొట్లాలను పంచుతున్నప్పుడు నేను చెప్పిన మూడు వర్గాలలో నువ్వు ఏ వర్గానికి చెందిన వాడివో నువ్వే తెలుసుకోలేదా?” అన్నాను.

అతను గభాల్న నా వైపు చూసి వెంటనే తల వంచుకున్నాడు. మేరీ ఏదో మాట్లాడబోయింది కాని నా కనుసైగతో ఆపేసింది.

“నువ్వు ఒట్టి సోమరివి” అని అతని రెస్పాన్స్ కోసం ఆగాను.

జాన్ వంచిన తల ఎత్తలేదు. మేరీ ఆందోళనగా నన్నే చూస్తోంది. నేను అదేమీ పట్టించుకోకుండా “కాబట్టే మీ అమ్మ చదువుకోమని బ్రతిమలాడుతున్నా చదువుకోకుండా ఏదో చిన్న పనిలో ఇరుక్కున్నావు. నీలో ఏ మాత్రమూ ఎదుగుదల ఉండదని గమనించింది కనుకనే టీనా నిన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆశ్రమంలో ప్రశాంతంగా ఉంటావనీ, మరిన్ని పుస్తకాలు చదువుకుని ‘నిన్ను నీవు’ తెలుసుకుని మీ దేశానికి తిరిగి వెళ్తావని శైలజ గారు నిన్ను ఇక్కడకి పంపారు. కాని నువ్వు ఇక్కడ మరింత సోమరివిగా మారుతున్నావు” అన్నాను.

అతనేమీ మాట్లాడలేదు. అలాగే పిట్టగోడకి ఆనుకుని కూర్చున్నాడు. మేరీ కూడా గబగబా వెళ్ళి అతన్ని ఆనుకుని పక్కనే కూర్చుంది.

“వెళ్ళిపో జాన్, ఇక్కడ నుండి మీ దేశానికి వెళ్ళిపో. మీ అమ్మని ఇంకా బాధపెట్టకు. యూనివర్సిటీలో చేరి చదువుకుని ఉద్యోగం సంపాదించి నీ మొదటి జీతంలో కొంత భాగం మహర్షికి ఇవ్వడానికి ఇక్కడకి రా, సరేనా?” అన్నాను.

కళ్ళెత్తి నన్ను చూస్తున్న అతని కళ్ళు చెమ్మగిల్లడం చూశాను.

అతనికి దగ్గరగా నడిచి “జాన్, ఇలా ఏమీ మొహమాటం లేకుండా ఈ కష్టజీవి అన్నామలై స్వామి మందిరంలో మాత్రమే నీకు చెప్పగలననిపించింది. అందుకే ఇక్కడకి రమ్మన్నాను. చెప్పగలిగాను. ఏమీ అనుకోలేదు కదా!?” అన్నాను.

అతను ఏమీ అనుకోలేదు అన్నట్లుగా తల ఊపాడు.

నేను మేరీ వైపు చూసి “మేరీ, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మౌనంగా ఉంటారు? మీ బాధ మీ బిడ్డకి కాక మాలాంటి వాళ్ళకి చెప్పుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి?” అన్నాను.

మేరీ కూడా నిజమేనన్నట్లు తల ఊపింది. కాసేపు అందరం నిశ్శబ్దంగా ఉన్నాక నేనిక అక్కడ ఉండనవసరం లేదనిపించి “బై మేరీ, తర్వాత కలుద్దాం” అంటూ వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మెట్లు దిగి వచ్చేశాను.

 

***

 

 

ఆరోజు మేరీ, జాన్ లు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళేరోజు. మాతృభూతేశ్వరాలయంలో కిటికీకి దగ్గరగా మొదటిసారి జాన్ మేరీని హత్తుకుంటుండగా నేను చూసిన ప్రదేశంలో కూర్చుని ఉన్నాను.

సాయంత్రం నాలుగవుతోంది. సమాధి హాలులో వేదపఠనం కోసం సన్నాహాలు చేస్తున్నారు. చల్లని గాలి పైన తిరుగుతున్న ఫాన్ గాలితో చేరి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఎదురుగ్గా నిలువెత్తు గోడ మీద రమణుడు పులి చర్మం పైన ఆశీనుడై దయామృతం కురిపిస్తున్నాడు. వాకిలికి కుడి వైపు కొంతమంది భక్తులు – అక్కడే ఆశ్రమంలో ఉండేవారు కూర్చుని కుంకుమ, విభూతి పొట్లాలు కడుతున్నారు.

జాన్, మేరీ నన్ను వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. లేచి నిలబడ్డాను. జాన్ “బై జానకీ” అంటూ నాకు షేక్ హాండిచ్చాడు. అతని కళ్ళల్లో సంతోషం తొణికిసలాడుతోంది. లోలోపలి అతని ఉత్సాహపు మెరుపు అతని చేతి ద్వారా నన్ను తాకి అతను ఆనందామృత హృదయుడై ఉన్నాడని కనుగొనగలిగాను.

మేరీ నన్ను ఆప్యాయంగా హత్తుకుంది. కృతజ్ఞతతో ఆమె ఏడుస్తోంది. అప్పుడు జాన్ ఆమెని ఓదార్చినట్లుగా నేను ఆమె వీపుని నిమురుతూనే ఉన్నాను – టాక్సీ డ్రైవర్ వచ్చి “మేడమ్, టైమవుతోంది వెళ్ళాలి” అన్నాడు.

మేరీ విడివడి నాకు నమస్కరించి జాన్ చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ఇద్దరినీ కిటికీ చువ్వలు పట్టుకుని చూస్తూ నిలబడ్డాను. గేట్ దగ్గరకి వెళ్ళిన జాన్ టాక్సీ స్టాండ్ వైపుకి మలుపు తిరుగుతూ వెనక్కి తిరిగి నవ్వుతూ చెయ్యి ఊపాడు.

నా పెదవులు ఆనందంతో విచ్చుకోగా నేను కూడా చెయ్యి ఊపాను.

 

 

******

 

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    టచింగ్ .. రాధ గారు . సోమరిగా ఉండేవారిని ఎవరూ భరించలేరు . తల్లి తప్ప . జాన్ పట్ల జానకి కురిపించిన అసలైన దయ నాకు చాలా నచ్చింది. మీ ద్వారా మీ కథల ద్వారా అరుణాచలం,రమణాశ్రమం, రమణుడిని గూర్చి చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. కథలోని పాత్ర జాన్ కి ఒక ఆధ్యాత్మిక చిరునామా ఆచూకీ లభించడం బావుంది. కథ చాలా బావుంది. థాంక్ యూ !

    • రాధ మండువ says:

      వనజగారూ, సారీ.. కథ వచ్చినట్లు చూసుకోలేదు. ఇప్పుడే అఫ్సర్ గారు మెసేజ్ పెడితే తెలిసింది. (పరీక్షల హడావుడి ఏమిటో చాలా పని, వయసు మీద పడినట్లవడం, ఏమిటో ముందంత యాక్టివ్ గా లేకపోవడం వల్ల సారంగకి, వాకిలికి, ఈమాటకి, ప్రాతినిధ్య, కథ – ప్చ్! ఏదీ చూడలేకపోతున్నాను) థాంక్ యు వెరీ మచ్.. మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  2. msk krishna jyothi says:

    దయ ప్రేమ మనిషి నుండి మనిషికి ప్రవహించి ప్రపంచాన్ని శాంతిమయం చేయునుగాక

  3. Ram mohan rao says:

    కథకు ఎంచుకున్న వాతావరణం బాగుంది.ఇలాంటి సోమరి మనుషులు తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెట్టడం కళ్లారా చూసి ఏ పరిష్కారము దొరకక ఉన్న సమయంలో ఈ కథ చదవటం జరిగింది. జానకి వంటి సహన శీలురైన కౌన్సిలర్లు దొరికితే బాగుండుననిపించింది.మంచి కథ.అభినందనలు రాధ మండువ
    గారికి.

  4. jaya reddy boda says:

    సోమరుల గురించి బాగుంది కథ మేడం

  5. రమణ మహర్షి ఆశ్రమం గురించి ఏమీ తెలీదు గనుక ఈ కథ గురించి కాదు. కానీ, అసలు అన్ని ఆశ్రమాలూ సోమరుల కోసం , సోమరుల చేత స్తాపించబడిన సోమరుల స్థావరాలు కాదా? ముఖ్యంగా శ్రమ చేసే వాళ్ళ నుంచి కొల్లగొట్టిన నిధులతో నడిచే ఆశ్రమాలన్నీ – అవే మతానికి చెందినా? ఏ స్వామీజీ , బాబా అయినా?

    -శశాంక

    • రాధ మండువ says:

      మీరన్నది కరెక్టే, ఒప్పుకుంటున్నాను. సోమరుల స్థావరాలు ఆశ్రమాలు అనేది పచ్చి నిజం. అక్కడ కొచ్చిన వాళ్ళ మైండ్ అత్యధికమైన శాంతినిస్తూ యాక్టివ్ అయితేనే అది నిజమైన ఆశ్రమం అని కూడా ఒప్పుకోవాలి మరి మీరు శశాంక్ గారూ… :) ఈ వాక్యంలోని సత్యం / ట్విస్ట్ మీకు అర్థమయిందనుకుంటాను :)

  6. చొప్ప వీరభధ్రప్ప says:

    అమ్మ ఏదేశస్థురాలయినా అమ్మే..కొడుకు తప్పు తోవలో నడుస్తున్నాడని తెలిసి ,అతన్ని సరైన మార్గంలో పెట్టడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది.కొందరు ప్యాసివ్ మూడ్ వుంటారు.అట్టి వారిని మార్చడానికి మాటలద్వారా కొన్నిసంఘటనలు చూపించడంద్వారా మార్పు తీసుక రావచ్చు నని ఆశ్రమ వాతావరణ కల్పన చేసి చూపించారుజాన్ .గర్ల్ ఫ్రెండ్ ను చంపబోయినా ఆమె కంప్లైంటు చేయకుండా కొత్త బాయ్ ఫ్రెండ్ తోకలసి కూడా.. అతడుబాగుండాలని చేసిన ప్రయత్నం బాగుంది.జాన్ ఆశ్రమంలో చేరినా సోమరిగా వున్నాననే విషయం సున్నితంగా చెప్పడం ఇంకా బాగుంది.వాచ్ కు కీ ఇచ్చేవరకే మనపని. ఇక అది తన పని తానే చేస్తుంది .రచయితగారు అనుకున్న లక్ష్యం సాధించారు.శైలజ,జానకి రెండు పాత్రలు కథకు ప్రధాన భూమికలు.కథ స్ఫూర్తి దాయకం.

  7. Bhavani Phani says:

    బావుందండీ . ధన్యవాదాలు

  8. BHUVANACHANDRA says:

    రాధ మండువగారూ , అన్ని పాత్రల్నీ కళ్ళముందు ఉంచారు …కధని చదవలా..,.చూశాను.రమణా శ్రమాన్ని కళ్ళకి కట్టించడమే కాక ..కధకి బాక్ గ్రౌండ్ గా వాడుకోవడం అద్భుతం .సంభాషణలు కూడా ”తూచినట్టు ” వున్నాయి .చాలా చాలా సంతోషం . ఇంకా ఇంకా రాస్తారని ఆశిస్తూ …………………………………….భువనచంద్ర

    • రాధ మండువ says:

      సర్, బావున్నారా? మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. థాంక్ యు.

  9. Idhi ikkadi vidya vyavastha lo koodaa undhi anukuntaanu. Pillalanu somari cheyadam. Frndscheputhuntaaru vere desaallo konni hours social service cheyaali thappanisariga . Kashtam Dunham spirituality chinnappude teliyaali .nenu school pillala kosame leadindia training teesukunnanu .
    Really nice point nice narration . Keep writing mam

    • రాధ మండువ says:

      థాంక్ యు శశికళ గారూ, మీరు చెప్పింది కరెక్టే, విద్యావ్యవస్థలో అన్నిటికంటే ముఖ్యమైన టీచర్ సోమరి అయినప్పుడు పిల్లలు కూడా అలాగే మారతారు. కాబట్టి టీచర్ ని బట్టే పిల్లలూ ఉంటారు. ఇక కథలు ఇప్పుటికి నేను చాలానే రాశాను. బహుశా ఇది నా యాభై ఆరో కథేమో! :)

  10. బాగా రాసారు రాదగారూ

    • రాధ మండువ says:

      ఇదేమిటండీ ‘కె’ అన్నారు, పూర్తి పేరు రాయకుండా!? సరే పోన్లెండి. కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. థాంక్ యు అండీ!

  11. Aranya Krishna says:

    ఆశ్రమానికి ఒళ్ళు దాచుకోకుండా సేవ చేసిన అన్నామలై పాత్ర ద్వారా అతనిలో మార్పు వచ్చిందేమో కానీ అక్కడున్న ఆధ్యాత్మిక వాతావరణం జాన్ అక్కడున్న మూడేళ్ళలో అతనిని మరింత సోమరినే చేసింది. ఇదే కదా అసలు సారాంశం! బాగుంది. కథనం ఆసక్తికరంగా సాగింది.

    • రాధ మండువ says:

      బహుశా ‘నువ్వే వర్గానికి చెందినవాడివో అని ఆలోచించు’ అన్న మాటకి రియలైజ్ అయ్యాడేమో! ఇంకో విషయం ప్రశాంతత మనిషిలో మార్పు తెస్తుంది కూడా కదా!? తల్లిదండ్రులు సంపాదిస్తుంటే తిని, తాగుతూ, ఇంకా ఇంకా డబ్బు కావాలని బెదిరించే వాళ్ళు కొందరైతే, దానికి కావాలి దీనికి కావాలి అని పచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళు మరి కొందరు. ఈ సోమరిపోతులు పని చేయరు కాని ఆధునిక పోకడలన్నీ పోవాలి. సో అలాంటి వాళ్ళని చూసి వ్యథతో రాసిన కథ. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ కృష్ణ గారూ… థాంక్ యు

  12. రాధ మండువ says:

    నివాస్ గారూ, మీరు వేసిన బొమ్మ, ముఖ్యంగా రమణుడిని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. థాంక్ యు, థాంక్ యు సో మచ్.

  13. Sasikala Volety says:

    మంచి కధండి. సింగిల్ మదర్ గా మేరీ అసహయత చాలా బాగా చూపించారు. అలాగే పాశ్చాత్య దేశాల్లో, పిల్లలు తల్లి తండ్రుల మీద సరయిన ప్రేమాభిమానాలు లేకుండా, భవిష్యత్తు మీద ఫోకస్ లేకుండా, చిన్నతనంలోనే ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కుని, అక్కర లేని ఆవేశాలతో జీవితాలను ఎలా పాడు చేసుకుంటారో బాగా మీ పాత్రల ద్వారా చూపించారు. అయితే ఇలాంటి జీవన శైలి ఉన్న పిల్లాడు ఇండియా రావడానికీ, అందునా ఆశ్రమ వాసానికి ఒప్పుకున్నాడంటే కొంత నమ్మశక్యంగా అనిపించలేదు. మే బీ అది రమణుని లీల అనుకుంటా. ఆ అబ్బాయిలో శ్రమైక జీవనర సౌందర్యం చూపించి మార్పు తేవడం ముదావహం. మొత్తం మీద ఒక నీతి ఉన్న మంచి కధ. మీకు అభినందనలు.

  14. రాధ మండువ says:

    థాంక్ యు శశికళ గారూ… రమణాశ్రమంలో ఇలాంటి పిల్లలు కనీసం ఓ ఇరవై మంది ఉంటారండీ నేను వెళ్ళినప్పుడంతా చూస్తుంటాను ప్రతిసారీ కొత్తవాళ్ళని. అందరూ ఇలా బర్గర్ కింగ్ ల్లో పని చేసి వచ్చేవాళ్ళే. ఈ విషయం మీకు చెప్పాలనిపించింది. మీకు కథ నచ్చినందుకు కృతజ్ఞతలు

  15. తిరువణ్ణామలైలో జరిగే నాల్గు కార్యక్రమాలు,ఆశ్రమ వర్ణనకు ఇంత సోది అవసరమా?పాపం అంతపెద్ద దేశంలో కౌన్సెలర్స్ చెయ్యలేని హితోపదేశం ఏం చేసారో?నువ్వు సోమరివని చెప్పి వెనక్కు పంపడమా?అర్ధంపర్ధంలేని చెత్త కథ.

  16. అసలీ కథ ద్వారా ఏం చెప్పారో,చెప్పదలుచుకున్నారో అర్ధం కాలేదు.పేరంట్స్ పంపితే ఆశ్రమాలకు రావడం ఏంటో,ఏళ్ల తరబడి సోమరులుగా కూర్చోవడం ఏంటో?అమెరికాలో కౌన్సెల్లింగ్స్ కాదని లైబ్రేరియన్ చేసిన జ్ఞానోదయం ఏముందో?ఆశ్రమాల వర్ణన కోసం రాసిన ఒక అసంబద్ధమైన,చెత్త కథ.

    • రాధ మండువ says:

      :) దూరంగా తొలగిపోవాలి సుమా చెత్త దగ్గర్నుండి.. కామెంట్ ఎందుకు దండగ కదా!? :) వాసన పూసుకోవడనికి తప్పితే… :)

    • Aranya Krishna says:

      మీ అభిప్రాయం ఏదైనా చెప్పిన విధానం బాగుండ లేదు రంగా గారూ! అలా మొరటుగా చెప్పటాన్ని సాహిత్య విమర్శ అనలేం. అర్ధం చేసుకోగలరు.

  17. ఎవడి కంపు వాడికి ఇంపు.ఆ కంపులో అలాగే ఉండిపోతామంటే,ఊ కానివ్వండి.

    • కంపా!? ఎక్కడ నుండొచ్చిందో ఆ మాట రంగా గారూ… మీరేదంటే అది రైటనుకుంటూ శ్రీరంగా రంగాయనుచు శ్రీరామ రామ యనుచు ఉండమంటారా? నాకర్థం కావడం లేదు. :)

  18. THIRUPALU says:

    శ్రమ నుండి పుట్టిన జీవితం శ్రమను మరిచి పోయినపుడు అది మానసిక వైకల్యానికి కూడా తీస్తుంది అనేది చాల వాస్తవం! పని పాట లేకుండా తిరుగుతుంటే మనసు అన్నీ దుర్వసనాలకు భానిస అవుతుందనేది చాలా బాగా చెప్పారు! శ్రమనే జీవిత సాకల్యానికి రాచ బాట వేస్తూ ఉందనేది ముగింపులో సందేశం కూడా ఇచ్చారు.

    • తిరుపాలు గారు, మనిషి శ్రమ జీవి గా ఉండటాని కన్నా బుద్ది జీవిగా ఉండటానికి ఇష్టపడుతాడు. పని లేకపోతే పుస్తకాలు,నాటకాలు,సినేమా, పాటలు వినటం, ప్రపంచ లో జరిగేది తెలుసుకొని తెలివితేటలు పెంచుకొవటానికి ప్రాముఖ్యతనిస్తాడు. ఒకప్పటి తోపోలిస్తే స్రీలకి పని భారం ఎంతో తగ్గింది. వాళ్ళు చేసే ప్రతిపనిలో వాషింగ్ మిషన్, గాస్,కుక్కర్,మిక్సి మొదలైనవి వచ్చి పని భారం తగ్గింది. సమయం ఆదా అయ్యింది. మిగిలిన ఖాళి సమయాన్ని ఎలా ఉపయోగించుకొంటారో అన్నది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంట్టుంది. ఇది ప్రగతే కదా! శ్రమ అని పొయ్యి విసురుకొంట్టు,చెమటలలో మగ్గుతూ వంటచేస్తేనే గొప్ప కాదు. ఇప్పుడే ఎమైంది. ఇంకొక పదేళ్లలో మొత్తం ఆటొమేషన్ జరుగుతుంది. డ్రోన్ లు,రోబోలు, 3డి ప్రింతింగ్ మొదలైనవి సామాన్య ప్రజల అందుబాటులోకి ఇప్పుడు మొబైల్ వలే రావచ్చు. అప్పుడు మనిషికి నేడు మమ అనుకొనే పనే ఉండకపోవచ్చు. భవిషత్ లో మనిషి ప్రిపేర్ కావలసినది పని పాటా లేకుండా ఎలా జీవించాలి అనే అంశంపైనే.

  19. THIRUPALU says:

    మానవ జీవితానికి మేదో శ్రమ ఎలా దోహదం చేసౖుందో శారీరక శ్రమ కూడా అలా నే దోహదం చేసౖుంది. మీ దృష్టి లో కాక పోవచ్చును.

  20. THIRUPALU says:

    మనిషి యంత్ర నాగరికత కు అలవాటు పడటంతో తన వినాశనాని తానే కొని తెచ్చు కొంటునాడనేది నిర్వివాదాంశం. ఇక్కడ కాథాంశం యాంతిరిక నాగికతలో అది తయారు చేసిన సైకో పాత్ ను అందరూ వెతుక్కున్నటుల గానే ఓ ఆశ్రమాన్ని వెతుక్కుంటు వెల్లిన ఇతనికి అక్కడా తనకు లేక ఇతని శ్రేయేాభి లాషులు అనుకున్న ట్లుగా శాంతి దొరకక చివరకు చదువు, లేక పని చేసుకోవటం లోనే శాంతియుత జీవితాన్ని వెతుక్కుంటు వెల్లటం కధకు ముగింపు. ఇదే నాకు నచ్చింది. వాస్తవ ప్రపంచం అర్ధం కాక, ఆశ్రమాలవెంట, బాబాలవెంట తిరుగుతూ అందులో శాంతి ని వెతుక్కుంటు న్న కులీన వర్గాల మేదో జీవులు ఈ బాబాల మహిమలకు దాసోహం అనటం మనము ఎరిగిన విషయమే.

    • మీ విశ్లేషణ బావుంది తిరుపాలు గారూ… థాంక్ యు వెరీ మచ్. అద్వితీయమైన శాంతినిస్తూ అత్యధికమైన చురుకుదనం / అవేర్ నెస్ ఇచ్చే ఆశ్రమమే ఆశ్రమం. ఆ ప్రశాంతతో మనల్ని గురించి మనకో ఎరుక కలుగుతుంది. అందుకు వెళుతుంటారు ఆశ్రమాలకి. ఎవరికైనా (బాబాలు / స్వాములు) దాసోహం అంటూ వాళ్ళేం చేసినా తలాడించే “ఎరుక” కాదు అది. కదా!? (నేను రాసిన కొన్ని కథల కంటే ఇది ‘పెద్ద గొప్ప కథ’ కాదు, అదీగాక అన్నిసార్లూ గొప్ప కథలే రాయాలంటే కూడా సాధ్యం కాదు కదా, ఫరవాలేదనిపించే అఫ్సర్ గారికి పంపించాను :)) మీకు, ఇంకా కొంతమందికి నచ్చినందుకు సంతోషంగా ఉంది.

      అందరికీ ధన్యవాదాలు
      :)

      స్వస్తి

    • వాస్తవ ప్రపంచం అర్ధం కాక, ఆశ్రమాలవెంట, బాబాలవెంట తిరుగుతూ

      ప్రపంచంలో ఎవరి అనుభావాలు వారివి,మెట్యురిటి అందరికి సమానం గా ఉండదు. మనిషి ఏ అనుభవం వృథా కాదు. నిరర్దకం కాదు. ఆశ్రమాలవెంట, బాబాలవెంట తిరుగే వారికి వాస్తవ ప్రపంచం మీద అవగాహన లేదనుకోకండి. హుగో చావేజ్ తరువాత వెనిజుల అధ్యక్షుడైన నికోలస్ మర్డో భగవాన్ సత్యసాయి బాబా భక్తుడు. సత్య సాయి బాబాను కుటుంబ సమేతంగా వచ్చి కలసి వెళ్ళాడు. షాపింగ్ మాల్ లో ఉండే వస్తువులను సైనిక సహాయం తో ప్రజలకి పంచి పెట్టిన కమ్యునిస్ట్. ఎన్నో మానవీయ తీర్పులను ఇచ్చిన సుప్రీం కోర్ట్ జడ్జ్ జస్టిస్ భగవతి కూడా బాబా భక్తుడే.

      http://www.hindustantimes.com/world/maduro-is-a-sai-baba-devotee/story-435NGFPN2tNpPujyLXuOhP.html

Leave a Reply to K Cancel reply

*