జ్ఞానవృక్ష ఫలాలను కోసుకుందాం రండి!

 

 

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

~

 

ప్రకృతినీ-వినీలాకాశాన్నీ-వింత వింత నక్షత్రాల్నీ

వీక్షించిన బుద్ధి కుశలత ‘హోమో సేపియన్స్’ దే కదా!

విరోధాభాసమంతా  స్వర్గమూనరకాల భ్రమల తర్వాతే !

 

జ్ఞాన వృక్షపు నిషిద్ధ ఫలాల్ని తిన్నతర్వాత

లాటిన్మృతభాషలో పారడైజ్ పిట్టకథలు  తెలిసినట్లు

న్యూటన్గతి సిద్ధాంతపు కక్ష్య యంత్రగతిని జాగ్రత్తగా లెక్కించిన చోటే

ఆధునిక రోదసీ పథనిర్దేశానికి ఇస్రో తిరుపతి కొండలెక్కుతుంది…

 

శాస్త్రీయతను ధ్వనించే  శబ్దాలతో సైంటిస్టులే

సత్తాలేని సరుకుల లేబుళ్ళకు  సైన్స్ నామాలు పెడుతున్న దేశంలో

వేలెడంతలేని  ‘నోబెల్’ రామకృష్ణన్

ఏనుగంత  ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను వింత సర్కస్ అనేశాక

ఆవిరైపోయిన తర్కం గురించి ఎవరితో మాట్లాడతాం !

 

‘కఫాలా’ కు ఆధునిక బానిసత్వం పేరుపెట్టి

భాషరాని శ్రామికులను-మనసు భాషరాని ఇసుక కోతుల మధ్యకు  తరిమినట్లు

భావ దాస్య ముష్కరంగా మార్చిన పుష్కరంలో

జ్ఞానస్నానం పొందాల్సిన తెలుగు జీవితాలు  ఉత్తపుణ్యాన నీటిపాలు..

బౌద్ధభూముల అమరావతిలో భూసూక్తం చదివిన చందాన

అశాస్త్రీయ పద్దతిలోమాయని లాగితే చిట్లిన గర్భకోశంపై ఏం మాట్లాడగలం!

 

‘మాంచెస్టర్ ఆఫ్ ఇండియా’ లా ఫోజులు కొడుతూ

సిలికాన్ మురిక్కాలువలా ప్రవహించే  కొత్త రాష్ట్రంలో

ప్రాంతీయ సామంత రాజొకడి  పిలుపుమేరకు

నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత  పోరాటం

బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం  పాలు..

ఆల్ ఈజ్ వెల్ ! ఆగ్నేయంలో మాత్రం అగ్ని ప్రమాదం..

 

‘అసహనం చెంప దెబ్బకు లక్ష నజరానా’  పొందినంత ఆనందంగా

తెలంగాణ జర్నలిస్టుల జాతరకెళ్ళిన  ప్రెస్ క్లబ్ స్కీటర్లు

సరళాదేశ సంధి జరిగి  ‘సరళమే ఆదేశంగా’ నిష్క్రమించడం విచిత్రం..

సత్యాన్ని ప్రశ్నించని శతాబ్దాల మహాయానంలో

అసత్యం పై ఇండియన్  ఫోరంల మీద  ఏంజెళ్ళలా నటించే

డక్కన్  మేధావుల  వ్యూహాత్మక మౌనం మరీ విచిత్రం..

 

రొట్టెనడిగితే రాయి నిచ్చిన తర్వాత

కట్టని గుళ్ళూమసీదులకు నజరానాల గానా బజానా తర్వాత

నిరసన సమూహాలకు ప్రకటించనున్నది భారీ అసహాయం..

నైరుతి రుతుపవనాల్నీ ఎల్ నినో ‘చేపమందు’లా వేసుకుందని తెలిసి

విత్తిన నేలే  తక్కువని సర్కారే  నట్టూవాంగం వాయించాక

విత్తినవాడి గుండె  పఠాన్ చెరువు కాకుండా ఉంటుందా!

బతికి బట్టకట్టిన రైతుకోసం ఖరీఫ్ పంట కత్తి దూసే ఉండదా!

ఖాళీ కడుపులతో  ఏం ఫిలాసఫీ మాట్లాడతాం !

 

దేశమనే కంద పద్యంలో

దోషమే కనబడని ఆషా వర్కర్లు  నిషిద్ధ గణం

దిశ తెలియని ఆధిపత్యం దిమ్మతిరిగే యాగాలకు ప్రాపకం!

ఆకలి ఆత్మల బుజ్జగింపుకు ఖుర్బానీలుగా- తాయెత్తులు కాశీ తాళ్ళుగా

మారే పేదల సంతలపై ఏ నిషేధాల లాజిక్కులు మాట్లాడతాం!

సంధి కుదరనప్పుడు తప్పదులా వుంది విసంధి  దోషం !

రాష్ట్ర ప్రాయోజిత చీకటిలో ఇప్పుడు తెలుగు జనం !!

 

( హేతువాద ఉద్యమంకోసం తీవ్రంగా కృషి చేసిన దళితనేత  కత్తి పద్మారావుగారికి)

-తుల్లిమల్లి  విల్సన్ సుధాకర్

09538053030

 

మీ మాటలు

  1. chandolu chandrasekhar says:

    విల్సన్ గారు వర్తమాన సామాజిక విశ్లేషణ ,బావుంది కంప్యూటర్ ఓపెన్ చేసి వినాయకుని పూజ ,ఆకాసయానని కి ముందు ,కొబ్బరికాయ .బుద్దుడు నడయాడిన నేలపై భూత ,ధూపా ప్రేత విన్యాసాలు సైన్స్ కుడా ఈవాళ తిరుపతి వెళ్లి గుండు కొట్టించు కుంటుంది

  2. buchi reddy gangula says:

    Wilson గారు
    భాగుంది సర్

    ———————–బుచ్చి రెడ్డి గంగుల

  3. కె.కె. రామయ్య says:

    ” ప్రాంతీయ సామంత రాజొకడి పిలుపుమేరకు
    నాలుగు దశాబ్దాల బహుజన మూలవాసీ అవిశ్రాంత పోరాటం …. నిరర్ధక విప్లవం పాలు.. ”

    బహుజన నాయకత్య వైఫల్యాన్ని నిందించండి కాని, అవిశ్రాంత పోరాటం చేస్తున్న విప్లవాన్ని నిందించకండి విల్సన్ సుధాకర్ గారు.

    • Wilson Sudhakar Thullimalli says:

      విప్లవాన్ని నిందించలేదు. ‘బ్రాహ్మణీయ భావజాలపు ప్రతీఘాత నిరర్ధక విప్లవం’ అని చదువుకోవాలి. నేను అదే రాశాను.

Leave a Reply to buchi reddy gangula Cancel reply

*