రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్!

 

-బమ్మిడి జగదీశ్వర రావు 

~

 

bammidi ఒరే తమ్ముడూ..

నాకో సమస్య వచ్చింది! సమస్య అంటే పెద్ద సమస్య కాదనుకో! అలాగని చిన్న సమస్య కూడా కాదు! పోనీ అని వదిలేద్దామన్నా అది నన్ను వదలడం లేదు! ఇలా యెన్నాళ్ళు అవస్థలు పడాలో అర్థం కావడం లేదు! నీకు కాకపొతే యెవరికి చెప్పుకోను చెప్పు? ఎవరికి చెప్పినా యెవరికి వారే అదో సమస్య కాదన్నట్టు చూస్తున్నారు! ఆ సమస్య తమకీ వుందన్నట్టు మాట్లాడుతున్నారు!

నువ్వు నవ్వకు! ఎందుకంటే నేను యేడుస్తుంటే అందరూ నవ్వుతూ వున్నారు! సమస్యను తీర్చలేనప్పుడు పోనీ దానికి అలవాటు పడాలి కదా? అలా పడిపోదామన్నా అవడం లేదు! పైగా నన్ను చూసి యింటా బయిటా అంతా నవ్వుతున్నారు! నువ్వు హైదరాబాదుకూ ముంబాయికీ తిరుగుతుంటావు కదా?, నీకయితే మంచి డాక్టర్లు తెలుస్తారని! యిదిగో.. నీకిలా మెయిల్ పెడుతున్నప్పుడూ అదే.. ఫోన్ రింగయినట్టు.. రింగు కాకుండానే రింగయినట్టు.. యిదే సమస్య!

అదేమిటోరా.. ఫోన్ రింగవుతుంది! వెళ్లి తీస్తే- యే రింగూ లేదూ బొంగూ లేదు! అంతా బ్రాంతి! భ్రమ! మోగకుండా మోగినట్టు! యెవరూ చెయ్యకుండా చేసినట్టు! చచ్చిపోతున్నాననుకో! అంతా భ్రమని బ్రాంతని ఆగిపోతే, ‘మీ నాన్నకీమధ్య చెముడు వొచ్చినట్టు వుంది..’ అని పిల్లలతో అంటోంది మీ వొదిన! ‘ఫోన్ రింగయినా తియ్యరా? మీకొకరు ఫోన్ వొచ్చిందని చెప్పాలా? ఫోన్ కూడా తెచ్చి అందివ్వాలా? మగ పొగరు!’ అని వున్న గొడవలకి తోడు కొత్త గొడవలు! పోనీ అని ఫోను పట్టుకొనివుంటే – ‘వొచ్చిన ఫోను చూడకపోతే రాదా?’ అంటుంది! మాటిమాటికి ఫోన్ చెక్ చెయ్యక తప్పడం లేదు! చేస్తే నాకేదో కొత్త నెంబర్లు కనెక్ట్ అవుతున్నట్టు.. కొత్త ఎఫైర్లు వున్నట్టు అనుమానిస్తోంది మీ వొదిన!

తమ్మూ.. వూళ్ళో మనింట్లో జరిగింది నీకు గుర్తుంది కదా.. రోజూ లాగే ఆరోజూ అమ్మ సీరియల్ చూస్తూ వంట చేస్తోంది కదా.. ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది! మోగుతూనే వుంది! అమ్మ వంట గదిలోంచి అరుస్తోంది.. ‘ఫోన్ యెత్తండ్రా’ అని! మోగిన ఫోన్ ఆగింది! ‘యెవరు చేసారో యేమో.. యీ ముష్టి మంద ఫోను యెత్తరు కదా..’ అమ్మ తిడుతోంది! ఆగిన ఫోన్ మళ్ళీ మోగింది! మోగుతూనే వుంది! ‘యెత్తండ్రా ఫోను..’ అమ్మ అరుస్తోంది! ఫోన్ మోగుతోంది! ఆఖరికి అమ్మే వొచ్చి ‘ఫోను యెత్తరేమర్రా..’ నోట్లో మాట నోట్లోనే వుండిపోయింది! ‘రింగయిందని టీవీ సీరియల్లో ఫోను యెలా యెత్తేది?’ నాన్న మాటలకు అందరం పడిపడి నవ్వలేదూ?..

ఆరోజు అలాగ నవ్వాననే యిలాగ యీరోజు అందరూ నన్ను చూసి నవ్వుతున్నారా? మెలకువలోనే కాదురా, నిద్రలోనూ ఫోన్ రింగయినట్టే గబుక్కున లేచి కూర్చుంటాను! ఫోను చూస్తాను! అర్ధరాత్రీ ఆపరాత్రీ లేదా అని ఆవిడ అపర కాళీ అయిపోతుంది! నా వాలకం చూసి లేనిపోనివి అన్నీ వూహిస్తోంది! పోయేకాలం వొస్తే.. అన్నీ పాడుబుద్దులే పుడతాయట! మగనాకొడుకులంతా చిత్తకార్తె కుక్కలట! ఇన్నాళ్ళూ నోట్లో వేలు పెడితే కొరకలేని వాణ్నని అనుకుందట! నేను వాళ్ళ మాంగారి వారసత్వం నిలిపేస్తానట! డౌటూ అనుమానమూ రెండూ లేవట! అగ్గి ఫైరయిపోతోంది! అప్పటికీ యెందుకు పెంట అని- ఆవాళ రాత్రి ఫోను మోగితే మోగనీ అని వొదిలేశా! వొకటికి నాలుగు సార్లు రింగవుతూనే వుంది! అప్పటికీ అడిగా! ‘మీ ధ్యాస వల్ల మీకు అలా అనిపిస్తోంది గాని మోగలేదు.. చెయ్యాలనుకుంటే వెళ్లి ఫోను చేసుకోండి.. నేనేమనుకోను..’ అంది మీ వొదిన! తెల్లవారి ఆఫీసులో బాసు యెక్కి తొక్కి నామీద డాన్సు చేసాడు! నాలుగుసార్లు ఫోను చేసినా యెత్తవా? అని! బాధ్యత లేదని!

మా ఫ్రెండ్ కు చెప్పాను! వాడు నాకు టెస్టు పెట్టాడు! నా సెల్ కు రింగిచ్చాడు! రింగయింది అన్నాను! కాసేపు ఆగి యిప్పుడో? అడిగాడు! లేదన్నాను! ప్రాబ్లం లేదన్నాడు! కాసేపటికే రింగు వొచ్చినట్టు అయ్యి కంగారుగా తడుముకున్నాను! చూసి- ‘అర్జెంటుగా రింగ్ టోన్ మార్చు’ అన్నాడు! నా కిష్టమయిన రింగ్ టోన్.. ‘సడిచేయకే గాలి.. సడిచేయబోకే..’ అన్నాను! అలవాటు కూడా పోరపాటే అన్నాడు! గ్రహపాటు అనుకున్నా! మన పెద్దోడు ‘రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్’ పాటని నా సెల్లో రింగ్ టోన్ గా పెట్టాడు! అదిమొదలు మాబాస్ తో అందరితో తిట్లే తిట్లు! నేనెవరి ఫోనూ యెత్తడం లేదని కంప్లైంట్! నిజమే! రింగయినా యెత్తలేదు! యెవరిదో ఫోను మోగుతోంది అని అనుకొనేవాడిని! నాది కాదనుకొనేవాడిని! యెక్కడ ‘సడిచేయకే గాలి..’ అన్నా నేను నా ఫోను యెత్తేవాణ్ని! కొన్నాళ్ళకి గాని రింగ రింగ.. రింగ రింగ.. రింగా రింగా రేయ్ – రింగు టోన్ కు అలవాటు పడలేదు! యిప్పుడు యెక్కడ ‘రింగ రింగా’ అన్నా నాఫోనే రింగయినట్టు వుంటోందిరా! ఒకటి చెప్పనా.. నాకులాగే ఒక్క ఫోను మోగితే పదిమంది తమ సెల్లులు తీసి చూసుకుంటున్నారు తెలుసా? నిజంరా!

ఎప్పటికప్పుడు.. కనీసం మూడు నెలలకి వొకసారి రింగు టోను మార్చుకోవాలని సైక్రియాట్రిస్ట్ చెప్పాడు! నాకు ముచ్చెమటలు పోశాయి! రింగు టోన్ మార్చినపుడల్లా యింట్లో ఆఫీసులో గొడవలే గొడవలు! పిర్యాదులే పిర్యాదులు! అలవాటు పడడానికి అష్ట కష్టాలు! ఆ అలవాటు లోంచి మళ్ళీ బయిట పడడానికి తిప్పలే తిప్పలు! కొత్త టోన్ కు అలవాటు పడడానికి పాట్లే పాట్లు!

ఫోను కొన్నాళ్ళు మానేయమన్నాడు డాక్టరు! ఒక్క రోజు మరిచిపోయి వెళ్తేనే వెలితి! మనసులో మనసుండదు! తలకాయ తీసి యింట్లో వొదిలి వొచ్చినట్టే! నిలవ నియ్యదు! కొంపలు మునిగినట్టుగా వుంటుంది! యింటికొచ్చి ఫోను తీసికెళితే- మీ వొదిన ‘వోడల వర్తకం గాని ఆగిపోతోందా..?’ అని ఆడుకుంటుంది! పగ పెట్టేసుకొని బాతురూములో వున్నా తలుపు కొట్టి మరీ ఫోను తెచ్చి యిచ్చేస్తుంది! అడగకముందే ‘అదెంత అర్జెంటో’ అంటుంది! ఆగక ‘ఆ అన్నయ్య ఫోను చేసినప్పుడు యెత్తేస్తే వొక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాడు.. లేదూ అని మనం చేసామో- సరిగ్గా రొండు గంటలు మాట్లాడుతాడు..’ అంటుంది! రీజనింగులో మా యింటావిడకి వందకి వంద మార్కులు.. నీకు తెలియందా?

మొత్తానికి ఫోను రింగవకుండా అయినట్టు అనిపిస్తుంది! రింగయినాసరే కాదు నా భ్రమ అనిపిస్తుంది! చెప్పుకుంటే చాలా చిన్న సమస్యలా అనిపిస్తుంది! అనుభవిస్తే చాలా పెద్ద సమస్యలా తోస్తుంది! వైబ్రేషన్లో కూడా పెట్టి చూసా.. శరీరమంతా చెవులవడమూ కష్టమేరా..!? సేం టు సేం ప్రాబ్లం..!!

ఏదయితే అదే కానివ్వమని ఫోను వాడడం మానేసా! ‘పోన్లెండి.. రేడియేషన్ బారి నుండి మీరయినా తప్పించుకున్నారు..’ మీ వొదిన మెచ్చుకుంది! ‘వెనకటికి నీలాంటివాడే సిగరెట్లు తాగడంలేదని సంబరపడ్డాడట.. యాక్టివ్ స్మోకర్ వొక సిగరెట్ కాలిస్తే.. పాసీవ్ స్మోకర్ పద్దెనిమిది సిగరెట్లు కాల్చినట్లు.. యింటి చుట్టూ ఆఫీసుల చుట్టూ నీ చుట్టూ టవర్లే టవర్లు పెట్టుకొని.. రేడియేషన్లోనే రేయింబవళ్ళు రొస్టవుతూ రోస్టు అవుతూ.. చాల్లేరా.. ఫోను వాడకపోయినా రేడియేషన్ నిన్ను ఫుల్లుగా వాడుకుంటుంది..’ అని బావగాడి వెర్షన్! ఎవడి వెర్షన్ యెలా వున్నా నేనయితే ఫోను వాడడం మానేసా! జేబులో ఫోను లేదు! లేదని తెలిసినా రింగు వినిపించేది?! లేని ఫోను తడుముకొనే వాణ్ని! అలవాటుగా పక్కవాడి ఫోను రింగయితే నాఫోనే అని నేనే యెత్తేసా! ఇంతకన్నా నా ఫోను నేను యెత్తుకోవడం బెటరనిపించింది! ‘రావుగారూ.. ఫోనేం వాడడం లేదూ?’ అని ప్రతొక్కడూ అడిగేవాడే! నేనొక కథ చెపితే- జనంలో పది రకాలు కాదు, వంద రకాల కథలు వినిపించాయి! నాకే తెలియని నా ఫోను గురించి కథలు కథలుగా విని యింతకన్నా ఫోనుతో యెన్నెన్ని తిప్పలు పడుతూ నయినా ఫోను వాడడమే బెటరున్నర బెటరనిపించింది!

సో.. నేనిప్పుడు ఫోను వాడుతున్నాను! అష్టకష్టాలు పడుతున్నాను! మర్చిపోకు.. నాసమస్యకు పరిష్కారం చూపించే మంచి డాక్టర్ని చూడు! చచ్చి నీ కడుపున పుడతాను!

ఫోను రింగవుతున్నట్టుంది.. వుంటానురా..

ఫోనుతో- సారీ ప్రేమతో-

మీ

అన్నయ్య

మీ మాటలు

 1. గోర్ల says:

  చాలా బాగుంది. చెప్పిన విదానం సూపర్. ఫోన్ పెట్టుకోవడం అంటే ఎవ్వరికి వారు లాఠీ ఛార్జీ చేసుకున్నట్లే. కాదు కాదు…అంతకంటే ఎక్కువ. అది లేక పోతే…. నిజంగనే ఏదో పోయినట్లు అన్పిస్తుంది. జనాలను సమ్మెహితులను చేసి. పరేషాన్ చేసిన, చేస్తున్న వస్తువు ఇదే కావొచ్చు. మాంచి ఫీల్ తో రాశారు.

 2. చొప్ప వీరభధ్రప్ప says:

  అందరికీ తెలసిన కష్ట నష్టాలను చాల చక్కగా నవ్వుతూ చెప్పిన ట్లనిపిస్తూంది. అన్న నిజాలు అక్షర సత్యాలు.చెప్పిన తీరు బాగుంది

 3. Prasuna.B.N. says:

  హహహ… మంచి సున్నితమైన హాస్యంతో మంచి కథ చెప్పారు . చాల మంది ఎవరి ఫోన్ మోగినా మందేనేమో అని చూడడం కద్దు. అలంటి వారిలో నేను వున్నాను .

 4. రజని says:

  బజరా గారు మీ ఫోన్ మా చెవుల్లో కూడా మోగుతూనే ఉంది. ఇప్పటి మొబైల్ ఫోన్ లపై మంచి హాస్య రచన.

మీ మాటలు

*