మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు…

 

జుట్టు.
గిరజాల జుట్టు.
రింగు రింగుల జుట్టు.
అందమైన జుట్టు.
ఎంతో అందమైన జుట్టు.
అబ్బబ్బా జుట్టు.
అమ్మమ్మా జుట్టు.
మదిని దోచేసే జుట్టు.
మనసుని గిరజాలుగా తిప్పే జుట్టు.
కళ్ళను రింగుచక్రాల్లా చుట్టేసే జుట్టు.
హృదయాన్ని గిరగిరా తిప్పి గిరవాటు వేసే జుట్టు.
అంత రసికుడు గిరీశానికే వన్నెతెచ్చిన జుట్టు.

గిరజాలు లేపోతే వాడి మొహం మధురవాణి చూసేదీ ?
చస్తే చూసేది కాదు. తన్ని తగలేసేది.
నున్న మొహం, సన్న కళ్ళజోడు, తెల్ల లాల్చీ, గిరజాల జుట్టు.
బండ మొహం, బండ కళ్ళజోడు, పంచె, గిరజాల జుట్టు.
ఇలా ఏ మొహాలతో పని లేకుండా అందాన్ని ఇనుమడింపచేసేది గిరజాలు.
జుట్టున్నవాడి అందం వేరు.
జుట్టులేనివాడి అందం వేరు.
గిరజాల జుట్టున్నవాడి అందం మరీను.
గిరజాలు చూసి చటుక్కున పడిపోని ఆడవాళ్ళు ఉండరని ఎవరిదో ఉవాచ.

ఆ గిరజాలు ఆడవారికుంటే ఆ అందమే వేరు.
కొప్పున్నమ్మ ఏ తిప్పు తిప్పినా అందమే అని ఒక నానుండి.

గిరజాల జుట్టువారికా బాధ లేదు.
ఏ తిప్పు తిప్పినా ఒకే రకంగా రింగులుగా ఉంటుంది.
అదీ సౌలభ్యం.
దువ్వెనతో పనిలేదు.
దువ్వెనతో పని ఉన్నా పనిలేనట్టే. దువ్వినా దువ్వకున్నా ఒకటే
తలంటి పోసుకుంటే ఆరబెట్టినా ఆరబెట్టకున్నా ఒకటే
రింగుల్లో పడి నీళ్ళు తళతళ మెరుస్తుంటే నెత్తి మీద నీళ్ళుంటే ఏమి ? జలుబొస్తే ఏమి ?
ఆ అందం చూట్టానికి కళ్ళు చాలవ్.
ఆమధ్య గిరజాలున్న ప్రతివారు భావకవులైపోయినారు.
భావకవులవాలనుకున్నవారు గిరజాలు తిప్పుకున్నారు.

అలాటి భావకవుల్లో ఒకరు , ప్రముఖులు , దేవులపల్లి కృష్ణశాస్త్రి
ఆయన ఎంత భావకవి అయినా బోలెడంత హాస్యప్రియత్వం ఉన్నది
భావకవుల అతిని చూచి విసుగుపుట్టిందేమో మరి – గిరజాలు ఇరికించిన ఈ ప్యారడీ వచ్చింది

మెరుగుకంటిజోళ్ళు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవిలేవు
కవితయందుతప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ….
మరి ఒక్క భావకవి గారి గురించే మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది.
ఒకసారి జ్ఞానపీఠం గురించి కూడా మాటాడుకుందాం
వారు తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
అదేనండి విశ్వనాథ వారి గురించి-
మరి విశ్వనాథ వారు వారి ఆత్మకథలో ఇలాగంటున్నారు.
నా రెండవ ఫారములో రాగం సత్యనారాయణ యని యొక డుండెడివాడు. అతని తండ్రి ఫారెస్టు ఆఫీసరు. ధనవంతులు వారు. కాపు లనుకొందును. అతడు కొంచెము బొద్దుగా నుండెడి వాడు. జుట్టు మాత్రము- హిందీలో గొప్పకవి సుమిత్రానందన్ పంత్, తెలుగులో నొక గొప్పకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి- వీరి జుట్టువలె నుండెడిది. వీరిద్దఱిని నేను పెద్దనైన తరువాత నెఱుగుదును. ఆ జుట్టు మాత్రము చిన్నప్పుడు యెఱుగుదును. అప్పటి నా వేషము చెప్పినచో మీకిప్పుడు నవ్వు వచ్చు ననుకొందును. ఒక లాగు, ఒక చొక్కా, చేతులకు మురుగులు, కాళ్ళకు కడియాలు, నెత్తిమీద జుట్టు, ముందు వసారా గొఱిగింపు, జుట్టుముడి వెనుక గిరజాలు, ముందు సన్నని గిరజాలు- ఇది నా వేషము. ఆ రాగం సత్యనారాయణ జుట్టు నా కబ్బురము గొల్పెడిది. నా వేషము సహజ మన్నమాట!”

మనకు తెలిసిన విశ్వనాథ వారికి వాస్తవంగా గిరజాల జుట్టు ఉండెడిది అన్న సంగతి తెలియట్లా? రాజకీయ నాయకులవరకు వస్తే చిలకమర్తి వారు టంగుటూరి వారి గురించి చేసిన వర్ణనలో ఆ అందగాడి గిరజాలను ఇలా వర్ణించారు.
వలె వాటు కండువా వైచినాడు
చెవుల సందున గిరజాలు చిందులాడ
మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త
టంగుటూరి ప్రకాశము రంగు మెరయ
ధవళగిరి తీర్ధము నకును తరలివచ్చె
ఇక జగమెరిగిన చిత్రకారుడు వడ్దాది పాపయ్య గారి చిత్రాల్లోని పురుషులను చూడండి
ఆడవారి అందాన్ని అత్యద్భుతంగా చిత్రించే ఆయన కలం మగవాళ్లను ఎంతో సుకుమారులను చేసి కొసతేలిన ముక్కుతో చక్కగా గిరజాల జుట్టుతో చిత్రించి మనకు వదిలిపెట్టింది
సినిమాల్లో హీరోలకు కూడా గిరజాల జుట్టంటే ఎంత ఇష్టమో.
కృష్ణగారిని, శోభనుబాబుగారిని చూడండి.
మొత్తం గిరజాలున్నా లేకున్నా, ఫాలభాగంలో మటుకు ఒక వంకీ తిరిగి వుంటుంది.
మొత్తంగా లేదే అన్నబాధను అలా ఒకటి తిప్పి ముందుకు పడవేసి కోరిక తీర్చుకున్నారు.
ఇహ కొబ్బరినూనె రాసి నున్నగా దువ్వితే హరోం హరహర.
చేతిలో ఇంత నూనె వేసుకొని గిరజాలకు మర్దన చేస్తూ ఉంటే మాడులో కూసాలు కదిలి జ్ఞానం పదింతలవ్వదూ ?
నూనె రాయకుండా వదిలేస్తే గోధుమరంగులోకి తిరిగి కపీశ్వర దర్శనమవ్వదూ ?
ఎలాగైనా గిరజం గిరజమే! దాని అందం దానిదే! ఆ అందం ఇంకోదానికొస్తుందీ ? దిష్టి కొట్టే పనీ లేదు. పొడుగు జుట్టున్నవారి మీద అనవసరంగా దుర్మార్గపు కళ్ళు పెట్టి నాశనం చేస్తారు కానీ గిరజాలను చెయ్యమనండి చూద్దాం?
జేజమ్మ దిగిరావాలి, గిరజాలకి దిష్టి తగలాలంటే!
అసలు చెప్పాలంటే, గిరజాలు మన పుట్టుకతో ముడిపడి వున్నవి
బిడ్డ పుట్టినప్పుడు చూడండి.
జుట్టు చుట్టలు చుట్టలుగా ఉంటుంది.
దాన్ని సాపు చేసి మంత్రసానో, డాక్టరమ్మో, నర్సమ్మో మనకిస్తుంది.
అలా జననంలోనే గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
దేవుళ్ళకి కూడా గిరజాల జుట్టంటే చాలా ఇష్టం
మన కోరికలు తీర్చి బదులుగా మన జుట్టు పుచ్చుకుంటారు
కొంతమంది పుట్టువెంట్రుకలు తీయించాలని అట్టిపెడతారు.
అప్పుడు చూడండి ఎంత చక్కగా రింగులు రింగులు తిరిగిపోయుంటుందో.
అలా మొక్కుల్లో కూడా గిరజాల ప్రాముఖ్యత ఉన్నది.
ఇక రింగుల గిరజాలు వదలి, ఒకసారి గిరజాల మీద చలామణిలో ఉన్న వాక్ ప్రయోగాలు చూద్దాం
“ఆయన పెద్ద గిరజా పెట్టించినాడులేబ్బా!”
“వాడిది గిరజాలు జుట్టులేయ్యా, తలంటిపొయ్యాలంటే చచ్చేచావు”
“ఇంత పొడుగు జుట్టు ఆరబెట్టుకోలేక చస్తున్నామమ్మా, దాన్ని చూడు కురచగా ఒక్క నిముషంలో ఆరిపోతుంది”
ఇక ఇంకో పక్కకు వస్తే, గుళ్ళో వైష్ణవ సాములు పెట్టించేది గిరజా!
ముందు భాగంలో కాస్త గొరిగేసి ఉంటుందే అదీ గిరజా!
అలా గొరిగిన తరవాత నామం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
ఫాలభాగం ఎక్కువైపోయి ముఖంలోని తేజస్సు చండప్రచండంగా ఉంటుంది.
అదీ లెక్క అన్నమాట.
క్రీడాభిరామంలో వల్లభరాయుడు ఇలా చెప్పిస్తాడు.

కర్పూర బూచాయ కరమొప్ప నీర్కావి
మడుగుదోవతి పింజె విడిచి కట్టి
గొజ్జంగి పూనీరు గులికి మేదించిన
గంగమట్టి లలాటకమున దీర్చి
వలచేత బంగారు జల పోసనముతోడ
ప్రన్నని పట్టు తోరము ధరించి
జరిగొన్న వెలి పట్టు జన్నిదంబుల లుంగ
యంటులు వాయంగ నరుత వైచి
తళుకు చెంగావి కోకయు వలుదశిఖయు
చిగురు బొమ్మంచు పెదవులు చిన్నినగవు
నంద మొందంగ వచ్చె గోవిందశర్మ
మాధవునిపట్టి యొసపరి మన్మథుండు

వలుదశిఖ అంటే లావుపాటి శిఖ అని అర్థం.
అంతలావు శిఖ కావాలంటే జుట్టు బ్రహ్మాండంగా పెంచాలె, ఆ తర్వాత చటుక్కున గిరజా పెట్టించాలె.
అప్పుడు ఎంతందంగా ఉంటుందీ ?
అందుకు కాదు తన పద్యంలో మన్మథుడిని చేశాడు వల్లభరాయుడు?
అదండీ సంగతి.
ఇక ఇతిహాసాలకు వెళ్లిపోతే బోల్డు చెప్పుకోవచ్చు.
అన్నిటికన్న ప్రముఖమైనవి ఒకటి రెండు మాత్రం చెప్పుకుందాం ఇప్పుడు.
మొదటిది ద్రౌపదికి గిరజాల జుట్టు ఉంటే వాడు, ఆ దుర్మార్గుడు ఆ జుట్టు, అంత కుఱచ వేణి పట్టగలిగేవాడా?
అది లేకపోబట్టి, ఆయమ్మకు ఇంతలావు జడ ఉండబట్టి కాదూ, వాడు జుట్టుపట్టి లాక్కురావటం జరిగింది ?
అందుకు కాదూ మహాభారత యుద్ధం జరిగిందీ ?
అలా గిరజాలు లేకపోబట్టి అంత హననం జరిగింది.
దీన్నే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. గిరజాలు లేకపోబట్టి మహాభారతం మనకు మిగిలింది.

ఆ గిరజాల మహత్యం పరమాత్మకు తెలిసే తనకు గిరజాలు అట్టిపెట్టుకుని మిగిలినవారికి లేకుండా చేశాడు.
పరమాత్మ గిరజాల జుట్టు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవది
పోతన తన భాగవతంలో యుద్ధ సమయంలో నల్లనయ్య జుట్టుని వర్ణిస్తాడు.
ఎలా ? ఇలా – ఒక చక్కని పద్యంతో
“హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
……
“సూక్ష్మంగా దీని అర్థమేమమనగా అర్జునిడి రథానికి సారథి అయినా పరమాత్మ నుదిటి మీద పట్టిన చెమటకు, ఆ నుదుటి మీద ముంగురులు గుండ్రంగా రింగులు తిరిగిపోయి గిరజాలు గిరజాలుగా అతుక్కుని పోయి ఆ నుదురు చెప్పలేనంత అందంగా ఉందిట. గుర్రాల డెక్కల వల్ల రేగిన దుమ్ము బూడిదవర్ణపు రంగుతో మరింత అందంగా ఉన్నాడట పరమాత్మ. మరి అంత అందగాడిని వర్ణించడం పోతన గారికి తప్ప ఎవరికి సాధ్యం?
సరే, అది అలా పక్కనబెడితే గిరజాల జుట్టుకు ప్రత్యేకంగా ఒక జీన్ ఉన్నది.
గుర్రపు జీను, తొడుక్కునే జీను కాదండి, మానవ జీను.
దాన్ని ట్రైకోహ్యాలిన్ జీన్ అని అంటారు.
ఈ జీన్ ఉన్నవాళ్ళ సంతానం ఆ జీను నుంచి తప్పించుకోలేరుట.
అంత శక్తివంతమైంది ఆ గిరజ జీను.
తెల్లవారిలో గిరజాలు తక్కువ.
నల్లవారిలో గిరజాలు ఎక్కువ.
క్రౌంచద్వీపంలో సలూనుల నిండా గిరజాలు తిప్పే యంత్రాలే.
గిరజాలను సరిచేసే యంత్రాలే.
అదో పెద్ద బిజినెస్సు కూడాను.
ఎన్ని కుటుంబాలు బతుకుతున్నయ్యో ఆ గిరజాల ఆదాయమ్మీద.
అయ్యా, ఇలా బోల్డు చెప్పుకుంటో పోవచ్చు, ఆ గిరజాల జుట్టు మీద. ఇహ ఇక్కడికాపి వచ్చే జన్మలోనైనా గిరజాల జుట్టు కావాలని, ఆ గిరజాలతో ఏ దేశానికి లేని అందం మన దేశానికి సొంతం కావాలని అందరూ ఆ పరమాత్మను కోరుకోవాలని నే కోరుకుంటూ
శలవు

* * *

పేరడీ

 

చిట్టిగారె – ఆనందభైరవి – రూపకం

పల్లవి:

వలలా యీ అన్న – మేలరా ఈ వేళ నాకు తనువేల తరుణులేల – ధనమేల ధామమేల ॥వలలా॥

చరణం:

ఆకులేల పోకలేల – కూరలేల పప్పులేల

చిట్టిగారె రాకయుండి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

సొగసేల సొమ్ములేల – అగరేల గంధమేల

చిట్టిగారె దయలేక మేను – సగమై యున్నట్టివేళ ॥వలలా॥

అరిటాకు వడ్డనలేల – వంటలేల వార్పులేల

చిట్టిగారె కోర్కె బాసి – ఆశలుడిగి యున్నవేళ ॥వలలా॥

 

*

జంటకవిత్వం – కుదరని జంట

జంటకవిత్వం, జంటకవులు మనకు కొత్తకాదు. అలాటి జంటల్లో ఒక జంట అవుదామని, జంటకవిత్వం రాద్దామని దీపాల పిచ్చయ్య శాస్త్రి, గుఱ్ఱం జాషువా కలిసి అనుకున్నారట. తిరుపతి వేంకట కవుల్లాగా ఒక మంచి పేరు పెట్టుకుందామనుకున్నారు కూడాను. అలా పేరు కోసం ఆలోచిస్తే వచ్చినవి ఇవిట. “దీపాల జాషువా, గుఱ్ఱం పిచ్చయ్య, పిచ్చయ్య జాషువా, గుఱ్ఱం దీపాల, గుఱ్ఱం శాస్త్రి” . ఇలా నానా రకాలుగా చూస్తే సరైన పేరే కుదరలేదు కనక మనకు జంటకవిత్వం ఎందుకులే అనుకొని మానేశారుట!

2

అపురూప చిత్ర సౌజన్యం :

సర్వ శ్రీ నండూరి శశిమోహన్, నండూరి ప్రభాకర్, తుర్లపాటి స్వాతి. ఈ ఛాయాచిత్రం వివరాలు శ్రీ నండూరి శశిమోహన్ గారి మాటల్లో “ధర్మసందేహాలు” శీర్షిక ఆరంభించినప్పుడు శ్రీ ఆమంచర్ల గోపాలరావు, నండూరి, సి.రామమోహనరావు. ఆమంచర్ల గోపాలరావుగారు పరమపదించాక ఉషశ్రీ, ఏ.బి.ఆనంద్ నిర్వహించారు

మీ మాటలు

*