దొంగ 

 

 

– రమణ యడవల్లి 

~

ramanaఅది ఆంధ్రదేశంలో ఒక పట్టణం. ఆ వీధి ఎప్పుడూ రద్దీగానే వుంటుంది గానీ – ఇప్పుడు మిట్టమధ్యాహ్నం కావడం వల్ల ఆట్టే సందడి లేదు. ఇద్దరు కుర్రాళ్ళు నడుచుకుంటూ అటుగా వెళ్తున్నారు. ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు, చిన్నప్పట్నుండీ స్నేహితులు. కొన్నాళ్లుగా వారిద్దరు రాజకీయంగా గొడవలు పడుతున్నారు. కారణం – ఆంధ్రరాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు (ఎవరెన్ని కబుర్లు చెప్పినా) రెండు కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నయ్. దురదృష్టవశాత్తు – స్నేహితులిద్దరూ చెరోకులానికి చెందినవారైపోయినందున అనివార్యంగా తమతమ కులపార్టీల తరఫున వాదించుకోవాల్సి వస్తుంది!

ఇవ్వాళకూడా (రోజూలాగే) ఇద్దరి మధ్యా చర్చ చిన్నపాటి వాదనగా మొదలైంది. ఆ తరవాత ఇద్దరిలో ఆవేశం ఉప్పొంగింది. ఫలితంగా పెద్దపాటి కేకలు, అరుచుకునే స్థాయిదాకా వెళ్ళింది.

“మీ నాయకుడు రాజధాని పేరు చెప్పి వేల కోట్లు కాజేస్తున్నాడు.”

“మీ నాయకుడు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు కాజెయ్యొచ్చు.”

“మీ నాయకుడి కొడుకు మాత్రం తక్కువా? ఇప్పటికే రెండు లక్షల కోట్లు కాజేశాడు.”

“మా నాయకుడికి అభివృద్దే ఊపిరి. మీ నాయకుడు అడ్డు పడకపొతే ఈ పాటికి మన రాష్ట్రం సింగపూరుని మించిపొయ్యేది.”

“అవును, మా నాయకుడు అడ్డు పడకపొతే  ఈ పాటికి రాష్ట్రం అమ్ముడుపొయ్యేది.”

స్నేహితులిద్దరూ బుసలు కొట్టారు, ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకున్నారు.

ఇంతలో –

“దొంగ! దొంగ!” అంటూ పెద్దగా అరిచారెవరో. స్నేహితులిద్దరూ తలతిప్పి అటుగా చూశారు.

ఎదురుగా – బడ్డీకొట్ట్టు ముందు కూల్ డ్రింక్ తాగుతున్నాడో నడివయసు బట్టతల పెద్దమనిషి. అతని జేబులోంచి పర్స్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడో కుర్రాడు. చెరుకు రసం బట్టతలాయన తన జేబులో చెయ్యి పెట్టిన ఆ కుర్రాడి చెయ్యి చటుక్కున పట్టేసుకుని ‘దొంగ దొంగ’ అంటూ అరుస్తున్నాడు.

స్నేహితులిద్దరూ సింహాల్లా లంఘించారు, క్షణంలో దొంగని దొరకబుచ్చుకున్నారు. ఆ కుర్రాడికి సుమారు పదహారేళ్ళు ఉండొచ్చు. నల్లగా, సన్నగా వెదురుబద్దలా ఉన్నాడు. మాసిన బట్టలు, చింపిరి జుట్టు. మన స్నేహితుల పట్టు విడిపించుకోడానికి గిలిగిలలాడుతూ మెలికలు తిరిగిపోతున్నాడా కుర్రాడు.

స్నేహితులిద్దరూ ఆ దొంగ కుర్రాణ్ణి బోర్లా పడేసి మోకాళ్ళతో తొక్కిపట్టి కదలకుండా చేశారు. ఆ పక్కనే కొబ్బరి బొండాలు అమ్మేవ్యక్తి దగ్గర కొబ్బరితాడు తీసుకున్నారు. తాడుతో ఆ కుర్రాడి పెడరెక్కలు బలంగా వెనక్కి విరిచి కట్టేశారు. ఆపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రోడ్డు వారాగా ఉన్న కరెంటు స్తంభానికి కట్టేశారు.

ఇంక విడిపించుకోలేనని గ్రహించాడా కుర్రాడు. “అన్నా! వదిలెయ్యన్నా! ఇంకెప్పుడూ చెయ్యనన్నా! నీ కాల్మొక్తా అన్నా!” అంటూ ఏడవసాగాడు. ఈలోపు చుట్టూతా పెద్ద గుంపు తయారయ్యింది.

ఎర్రటి ఎండ. తారు రోడ్డు పెనంలా కాలిపోతుంది. కరెంటు స్తంభం నిప్పుల కొలిమిలో కాల్చి తీసినట్లు మండిపోతుంది. గుంపులో ఒకరు అతని చొక్కాని, పేంటుని చింపేసారు. చిరుగుల డ్రాయర్ అతగాడి నగ్నత్వాన్ని కప్పలేకపోతుంది.

స్నేహితులిద్దరూ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. కొద్దిసేపటికి చేతులు నొప్పెట్టాయి. మోకాళ్ళతో డొక్కల్లో కుమ్మారు. కొద్దిసేపటికి మోకాళ్ళు నొప్పెట్టాయి. అంచేత ఎగిరెగిరి కడుపులో తన్నారు.

ఈ ‘నేరము – శిక్ష’ దృశ్యానికి ఉత్తేజితులైన ఇంకొందరు యువకులు వారికి జత కూడారు. వంతులవారీగా దొంగని తన్నటం మొదలెట్టారు. తరవాత దొంగని తన్నే పవిత్ర కార్యానికి వారిలో పోటీ మొదలైంది. అటు తరవాత గుంపుగా తన్నారు.

కొద్దిసేపటికి దొంగ కళ్ళు తేలేశాడు. నోట్లోంచి నెత్తురు కారసాగింది. శరీరం మాంసం ముద్దలా మారిపోయింది. ఇంకొద్దిసేపటికి తల వాల్చేశాడు.

రొప్పుతూ రోజుతూ చెమటలు గక్కుతూ శ్రమిస్తున్న ప్రజానీకం ఓ క్షణం ఆగింది.

“మాస్టారు! ఈ మధ్యన తన్నులు తప్పించుకోడానికి దొంగలు దొంగేషాలేస్తున్నారండీ! అదంతా యాక్షన్ సార్! కుమ్మండి కొడుకుని!”

మళ్ళీ తన్నులు మొదలు. ఈసారి కర్రలు వచ్చి చేరాయి. ధనా.. ధన్ .. ఫటా.. ఫట్.. దొంగవేషాలు వేసే దొంగలూ, అసలు యే వేషాలు వెయ్యలేని దొంగలూ.. వందసార్లు చచ్చేంతగా నిరంతరాయంగా కొనసాగిందా హింసాకాండ.

ఇది పుణ్యభూమి, ఇక్కడ చట్టం తనపని తను చేసుకుపోతూనే ఉంటుంది. అంచేత కొంతసేపటికి చట్టబద్దులైన పోలీసులొచ్చారు. దొంగ కట్లిప్పదీశారు. దొంగ రోడ్డుమీదగా వాలిపోయ్యాడు. తల పగిలింది, దవడలు విచ్చిపొయ్యాయి. నెత్తురు కమ్మిన ఎర్రటి కళ్ళు ఈ ప్రపంచాన్ని అసహ్యంగా, కోపంగా చూస్తున్నట్లు వికృతంగా వున్నాయి.

చచ్చాడా? చచ్చే ఉంటాళ్ళే, దొంగ ముండాకొడుకు. మురికిలో పుట్టి మురికిలోనే కలిసిపొయ్యాడు. మాస్టారూ! ఎందుకలా ఫీలవుతున్నారు!? మీరెవరో మరీ అమాయకుల్లా వున్నారే! యేదీ – ఓ సిగరెట్టిలా పడెయ్యండి. థాంక్యూ! పరాయి సొత్తు నిప్పుతో సమానం. నన్ను చూడండి! ఆకలేస్తే చావనైనా చస్తాగానీ, దొంగతనం చేస్తానా? ఈ నేరస్తుల్ని జైల్లో వెయ్యడం, వాళ్ళు బయటకొచ్చి మళ్ళీ నేరం చెయ్యడం – మన టాక్స్ పేయర్స్ మనీ ఎంత వృధా! అంచేత దొంగతనం చేసే లమ్డీకొడుకుల్ని ఇలా చావ చితక్కొట్టేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏవఁంటారు?

రాష్ట్ర రాజకీయాల పట్ల వైరుధ్యం వున్నా, దొంగని శిక్షించే విషయంలో ఒకటవ్వడం స్నేహితులకి సంతోషం కలిగించింది. బాధ్యత కలిగిన పౌరులుగా సమాజానికి మొదటిసారిగా సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉంది. ‘ఈ దేశంలో అందరూ తమలా నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను!’

స్నేహితులిద్దరు మళ్ళీ కబుర్లలో పడ్డారు.

“మా నాయకుడి ప్రజాసేవకి అబ్బురపడి మీ పార్టీ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు.”

“అది మీ నాయకుడి ప్రతిభ కాదు, అధికారం అనే బెల్లం!”

ఈ విధంగా తమ కబుర్లు కొనసాగిస్తూ ఇంటిదోవ పట్టారు.

మీ మాటలు

 1. వనజ తాతినేని says:

  రాష్ట్రంలో రెండు పార్టీల అభిమానులు తప్ప మిగిలిన ప్రజలందరూ నాకు దొంగల్లా కనబడుతున్నారండీ. :(

  • Ramana Yadavalli says:

   అలాగా! నాకు ఈ రెండు పార్టీల అభిమానులు దొంగల్లా, మిగిలినవారు అమాయకుల్లా కనిపిస్తుంటార్లేండి :)

 2. THIRUPALU says:

  // నేరం చేసినవాడికి శిక్ష పడేట్లు చేస్తే నేరాలే ఉండకపోను! //
  ఆ పని మీదనే ఇపుడు అందరు ఒకటవుతున్నారు. అయినా ఆ దొంగకి ఎంత దైర్యం! అందరు ఉన్న పళంగా సంపాదించాలని కలలు కంటున్నారు. మంచి చాస్తే జరిగిందిలే ! సౌదీ అరేభియ ను చూసైనా నేర్చు కోమని చెపితే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు! త్వరలో మన దేశం బాగు పడె లక్షణాలతో కేరింతలు కొడుతుంది. మంచి కధ! ???? మీ సుబ్బు ను చూపించలేదు కనుక నేను కధ అనుకుంటున్నాను. :)

  • Ramana Yadavalli says:

   అవును. సమాజంలో lynch mob mentality ఎక్కువవుతుంది. నేరస్తులకి సౌదీ అరేబియా తరహా ఘోరమైన శిక్షలు విధించాలని కోరుకునే మధ్యతరగతి మేధావులు తయారయ్యారు.

   మన సమాజంలో చిన్నదొంగల పట్ల కాఠిన్యం, ఘరాన దొంగల పట్ల సున్నితత్వం వెనుక – ‘క్లాస్ బయాస్’ వుందని నా అభిప్రాయం.

మీ మాటలు

*