మెరుపై మెరిసిన మహేంద్ర!

 

కొందరు వ్యక్తులు కొద్దిలోనే అద్భుతాలు చేస్తారు. “అబ్బ,ఎక్కడి నుంచి వచ్చాడితను” అని మనం ఆ చాతుర్యానికి, నైపుణ్యానికి అబ్బుర పడి పలకరించబోయే లోపుగానే  కళ్ళ ముందే అదృశ్యమై పోతారు. అయ్యో ఇలా జరిగిందేంటని మనం ఎంతనుకున్నా లాభం లేదు. అలా వెలుగులు చిమ్ముతూ రాలి పోయిన ఒక నక్షత్రమే మహేంద్ర! మధురాంతకం రాజారామ్ గారి అబ్బాయి! అతను బతికుండగా రచయితగా నాకు పరిచయం కాలేదు. అతను రాసిన ధారావాహిక ఒక వార పత్రిక లో వస్తున్నపుడు కూడా చదవలేదు ! బహుశా  స్కూలు రోజులే కావడం  వల్లనేమో అంత సీరియస్ సాహిత్యం చదివే జ్ఞానం, ఎరుక లేక పోయుండాలి !  1991 లో అది నవల గా వచ్చినపుడు విశాలాంధ్ర లో కొన్నాను!

అంతటి అద్భుతమైన కథని సీరియల్ గా వచ్చినపుడు వారం వారం ఉత్కంఠ గా ఎదురు చూసి చదవలేక పోయానని పశ్చాత్తాప్పడ్డాను

మహేంద్ర గొప్ప కథకుడు! టెక్నిక్ తెల్సిన వాడూ, రచన గమ్యం పట్ల  స్పృహ కల్గిన వాడూ, రాయలసీమ ప్రాంతం పట్ల ప్రేమా, ఆ ప్రాంతపు సమస్యల పట్ల అవగాహన ఆందోళన, ఆ జీవనయానం మీద గౌరవమూ ఉన్నవాడు , ఇంకా ,మనిషి మీద, జీవితం మీద లోతైన ఆలోచన, పరిశోధన ఉన్నవాడు. అందుకే మహేంద్ర రాసిన కవితైనా కథైనా ఒక పట్టాన వదిలి పోదు పాఠకుడిని! జీవితం యవ్వన ప్రాయంలోనే వాడి రాలి పోవడం వల్ల అతను రాసిన కొద్ది రచనలతోనే అభిమాన పాఠకులు సరి పెట్టుకోవాల్సి వచ్చింది గానీ, మరో 20 ఏళ్ళైనా జీవించి ఉంటే ఇంకెన్ని ఆణిముత్యాలు అందించే వాడో అనే ఆలోచన దిగులు పుట్టిస్తుంది  అతని రచనలు చదువుతుంటే !

ఈ నవల “స్వర్ణ సీమకు స్వాగతం” చాలా చిన్న నవలే! కొద్ది గంటల బస్సు ప్రయాణాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తూ సాగే నవల.  పుస్తకం పట్టుక్కూచుంటే గట్టిగా రెండు గంటల్లో చదివేయగలం! కానీ ఆ రెండు గంటల తర్వాత కనీసం రెండు రోజులైనా నవల్లోని పాత్రలూ, మహేంద్ర చెక్కిన వాక్యాలూ మన వెనకాలే మాట్లాడుతూ తిరుగుతాయి.

mahendra

జీవన యానం లో ఎవరి దార్లు వాళ్లవి. ఎవరి గమ్యాలు వాళ్లవి. ఒకరి బాగోగులు మరొకరికి పట్టవు. చూడ్డానికి అందరం ఒకటే దార్లో వెళ్తున్నట్టే ఉంటుంది కానీ మధ్యలోనే దిగి పోయే వాళ్ళు కొందరైతే, చివరి వరకూ ప్రయాణించే వాళ్ళు కొందరు! దారి ఒకటే అయినా గమ్యాలు వేరు! ఈ క్రమంలో సమాజమే పెద్ద పర్తి గుంట బస్సుగా అవతరిస్తుంది నవల్లో!

చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ లో ఎర్రని ఎండలో మొదలయ్యే కథ మరి కొద్ది గంటల్లోనే పెద్దపర్తి గుంట  చేరకుండానే కటిక చీకట్లో ఇసక లో దిగబడి ఆగి పోతుంది. గమ్యం చేరిన వాళ్ళు చేరగా నిమిత్త మాత్రులైన డ్రైవర్, కండక్టర్లు కాక అందులో మిగిలిన ఇద్దరూ గమ్యం చేరని నిర్భాగ్యులై మిగిలి పోతారు.

ఆ ఇద్దర్లో ఒకడు డెబ్భై ఏళ్ళు దాటిన వృద్ధుడు తిమ్మరాయప్ప! యాంత్రిక నాగరికతా ప్రస్థానం లో మానవత్వం అనుభవిస్తున్న సంక్షోభానికి ప్రతీకగా అన్ని రకాలుగానూ దగా పడి ఒట్టి చేతులతో మిగిలి పోయే తిమ్మరాయప్ప!  రెండో వాడు విజయవాడ కు చెందిన జర్నలిస్ట్ రమణ మూర్తి !  ఈ సంక్షోభాన్ని, సుభద్ర  మొదలుకుని దివాణం రాజా వారు వసంత నాయని వారు , తిమ్మరాయప్ప, రమణ మూర్తి,భాగ్యమ్మ , అత్తినీరాలు  ఇంకా ఇతర బలహీన, నిర్భాగ్య  జీవితాల ద్వారా కళ్లకు కట్టినట్టు మహేంద్ర ఆవిష్కరిస్తాడు.

చిగుర్ల గుంటలో కొత్తగా మొదలైన బంగారు గనుల గురించి మానవాసక్తి కర కథనాన్ని పత్రికకు రాయాలని విజయవాడ నుంచి వచ్చిన విలేకరి రమణ మూర్తీ, జ్వరం తో ఉన్న బిడ్డను పట్నంలో డాక్టర్ కి చూపించుకోడానికి వచ్చి తిరుగు ప్రయాణమైన సుభద్ర, ఆమె వాలుచూపుల కోసం ,పడిగాపులు కాసే వెంకట పతీ, చితికి పోయిన జమీందారు వసంత రాయని వారూ, అతని సేవకుడైన లింగయ్య , లీడరు అతని అనుచరులు, తాగుబోతు అత్తినీరాలు, భాగ్యమ్మ ఆమె ప్రియుడు వెంకట స్వామి వీళ్లందరి ఎదురు చూపులూ పెద్దపర్తి గుంట బస్సు కోసమే! బస్సు రాక ముందు, వచ్చాక, ఎక్కాక వీళ్ళందరి ప్రవర్తనలూ ఎన్ని రకాలుగా మార్పు చెందుతాయో మహేంద్ర అలవోకగా చిత్రించి ఔరా అనిపిస్తాడు.

Swarnaseemaku Swaagatam_Mahendra1నవలకు ముందు మాట రాసిన ఆర్. ఎస్. సుదర్శనం ఇలా అంటారు.”ప్రగతి అంటే మిథ్య కాదు. అది పెద్దపర్తి గుంట బస్సు. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. తొక్కిసలాటలో కండబలం కలవాళ్ళు సీట్లు సంపాదిస్తారు.కొందరు కిక్కిరిసి నిల్చుంటారు. మరికొందరు టాపు మీదైనా చోటు సంపాదిస్తారు.ఎక్కడ దిగవలసిన వాళ్ళు అక్కడ దిగిపోగా బస్సు గమ్యం చేరుతుందా లేదా ఎవరికీ పట్టదు”.

తిమ్మరాయప్ప తోనే నవల ప్రారంభమై అతనితోనే ముగుస్తుంది. పంటలు పండక, నీళ్ళకోసం సొరంగం లాంటి బావి తవ్వి,దానికోసం ఉన్న డబ్బంతా పోగొట్టుకుని,భూముల్ని పాడుబెట్టి,అప్పులపాలై, అందర్నీ పోగొట్టుకుని చివరికి తాకట్టు పెడదామని కుప్పం తీసుకెళ్ళిన మనవరాలి ఒక్క నగనీ, ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటికి తిరిగొస్తూ కిక్కిరిసిన బస్సు ప్రయాణంలో పోగొట్టుకుని జీవచ్ఛవంలా విలపిస్తూ మిగులుతాడు. అతని బాధకి ప్రత్యక్ష సాక్షిగా ..నాగరిక సమాజంలో నలిగిపోతున్న రమణమూర్తి!

నవల చదువుతున్నంత సేపూ మనసులో ఏ మూలో బాధా వీచికలు కదుల్తూ ఉంటాయి. పాఠకులుగా స్పందిస్తున్నా, నిజానికి ఆ బస్సులో మనమూ ఉంటే ఏ ప్రయాణీకుడికీ భిన్నంగా ప్రవర్తించం! మహేంద్ర రచయిత మాత్రమే కాదు, కవి కూడా!  స్పందన కల్గిన అందరు కవుల్లాగే అతను కూడా యదార్థ జీవిత వ్యధార్త దృశ్యానికి చలిస్తాడు. స్పందిస్తాడు ! అతని  స్పందనను  అద్భుతంగా చిత్రిస్తూ , అసామాన్యమైన మాటల్లో పేనుతూ ,కుప్పం బస్టాండ్ లో పాఠకుడినీ ఒక పక్కగా నిలబెట్టి ప్రత్యక్ష సాక్షి గా చేస్తాడు. వాళ్లందరితో పాటే మనల్నీ బస్ ఎక్కించి అందరూ దిగి పోయాక, బస్సు ఇక ముందుకు కదలనని మొరాయించాక ఆ నిశీధి లో తిమ్మరాయప్ప కీ రమణ మూర్తికీ తోడుగా వదిలి పెడతాడు!!

మహేంద్ర దృష్టి ఎంత సునిశితమంటే, బస్టాండ్ లో గానీ బస్ లో  గానీ ఏ చిన్న అంశాన్నీ వదిలి పెట్టకుండా వర్ణిస్తాడు. టీ బాయిలర్ నుంచి రాలి పడే బూడిద నుంచీ, బస్టాండ్ లోని టాయిలెట్ల మీద ఔత్సాహిక కళాకారులు చిత్రించిన సృష్టి రహస్యాల వరకూ ప్రతి సూక్ష్మాంశాన్నీ ఏ మాత్రం విసుగు పుట్టించకుండా చిత్రిస్తూ పోతాడు. నిత్యం మనం చూసే సన్నివేశాలను మనకే కొత్తగా పరిచయిస్తాడు !

కుప్పం చుట్టు పక్కల పల్లెల జనం అంతా డొక్కు ఎర్ర బస్సు ఎక్కడానికి పడే పాట్లన్నిటినీ మహేంద్ర ఏవగింపుతో కాక ఎంతో గౌరవం తో వారి బతుకు పోరాటం లా అభివర్ణిస్తూ వీరోచిత కార్యం లా భావిస్తూ రాస్తాడు.

ఎంతో ఎదురు చూడగా చూడగా వచ్చిన ఆ బస్సులో కొందరు  సీట్లో చోట్లో సంపాదిస్తారు. తిమ్మరాయప్ప లాంటి నిర్భాగ్యులు సీటు కాదు కదా రెండు కాళ్ల మీద నిలబడేంత చోటు కూడా సంపాదించలేక, ఎవరి సానుభూతినీ పొందక ఎలాగో బస్సులో చేరామనిపించుకుంటారు. నిండుగా జనంతో అటూ ఇటూ ఊగిపోతూ బయలు దేరిన పెద్ద పర్తి గుంట బస్సు బయలు దేరాక దాని ప్రయాణం, అది గమ్యం చేరకుండానే ఆగిపోవడం వరకూ దాని ప్రస్థానాన్ని మహేంద్ర చిత్రించిన తీరు అనన్య సామాన్యం.  అక్కడున్న బస్సుల్లోకెల్లా కాస్త మెరుగ్గా ఉన్న బస్సు ఆగమనాన్ని “సింహమున్న గుహలోకి సింధూరము జోచ్చినట్టు, వీధి నాటకం లోకి కీచకుడు వచ్చినట్టు   ఆరెమ్మెస్  బస్ కుప్పం రాజ వీధుల గుండా వస్తోంది” అని దాని దర్పాన్ని చమత్కరిస్తాడు.

కండక్టర్ ని మహేంద్ర ఎలా వర్ణిస్తాడో చూడండి!

.”ఈ జనసంక్షోభంలో అతడు కొమ్మలమీదినుంచి దూకే కోతిలా, బొరియల్లో దూరే సర్పంలా,గాలిలో వలయాలు తిరిగే తూనీగలా ప్రయాణీకుల్లోకి ప్రవేశించాడు..ఆ సమయంలో సాగర మథనంలో హాలాహలంలా పుట్టుకొచ్చాడు.అతడు మనుషుల శరీరాల మధ్య పాతిపెట్టినట్టుగా ఇరుక్కుపోయి కండరాల మధ్య రక్తనాళంలా కదులుతున్నాడు.అత్యుష్ణ పూరితమైన పరిశ్రమలో పని చేస్తున్నట్లు అతడి శరీరం చెమటతో దొప్పదోగుతోంది.అతడు రెండు చేతుల్తోనూ జనాన్ని వెనక్కి తోసుకుంటూ జనజలధిని ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒక చేత్తో క్రెడిల్ నుంచి టికెట్లను చింపుతున్నాడు. మరో చేత్తో నోట్లను లెక్కెడుతున్నాడు. ఒక చేత్తో టికెట్లను పంచ్ చేస్తున్నాడు. మరో చేత్తో చిల్లరడబ్బులను తోలు సంచీ లోంచి చిల్లర గలగరించి తీస్తున్నాడు. …”

బస్సు బయలు దేరాక ,

“బస్సు మెయిన్ రోడ్డు దిగి పెద్దపర్తి గుంట మట్టిబాట లోకి వెళ్ళే లంబకోణపు మలుపు తిరగడానికి నానా యాతనలూ పడుతోంది. ఈ కార్యక్రమంలో యధావిధిగా మలుపులోని పెంకుటింటి తాలూకు మరో రెండు పెంకులు రాలి పడ్డాయి.ఇంటిగల వాళ్ళు వెలుపలికి వచ్చి ఈ బస్సులకెప్పుడు పోయే కాలం వస్తుందో కానీ తమ ఇల్లు కూల్చకుండా అవి నిద్రోయేటట్లు లేవని పాపాల భైరవుడు సత్తార్ సాహెబ్(బస్సు డ్రైవరు) ని అతడి సకల స్త్రీ జనాల శీలాలను శంకిస్తూ బూతులు తిట్టసాగారు.

“ఇంతలో ఒక స్త్రీ తనకు బస్సెక్కితే వాంతులవుతాయనీ,తనకు సీటు ఇవ్వని పక్షంలో ఎవరి మీదనైనా వాంతి చేసుకోగలననీ భయపెట్టసాగింది.కేవలం సీటుకోసమే ఆమె దొంగెత్తు వేస్తోందని కొందరు ఆమె కోరికను వీటోచేయ జూసారు గానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు ఆమె ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగారు..”

Swarnaseemaku Swaagatam_Mahendra108 - Copyబస్సు అటూ ఇటూ వొరిగినపుడల్లా పక్కన ఉన్న ఆడవాళ్ల మీద పడి అంతటి చెమట, ఉక్క,దుమ్ములో కూడా పర స్త్రీ స్పర్శా సౌఖ్యాలను పొందాలని చూసే వాళ్ల నుంచీ , ఏదో ఒక  రకంగా దిగే లోపైనా సీటు సంపాదించాలని చూసే వాళ్ల వరకూ అందర్నీ మహేంద్ర సహానుభూతి తో పలకరిస్తాడు.  ఎవరి మీదా ఫిర్యాదుగా మాట్లాడడు. వాళ్ల బలహీనతలని, స్వార్థాలను విపరీత ప్రవర్తనలను  సైతం కేవలం ” స్వభావాలు గా, అవసరాలు గా ,సహజ ప్రవర్తనలు గా ”  గుర్తించి అంగీకరిస్తాడు. ఎవరినీ అసహ్యించుకోడు.

ఏ చిన్న విషయాన్నీ వదలక మనిషిగా,పాలకుల నిర్లక్ష్యం వల్ల బీడుగా మారిన ప్రాంతపు మనిషిగా రచయిత పరిస్థితుల పట్ల స్పందించే తీరు భిన్నంగా ఉంటుందిక్కడ!

రైల్వే లైను వద్ద గేటు పడి బస్సు ఆగాల్సి వచ్చినపుడు మహేంద్ర ఆ మామూలు సన్నివేశాన్ని కరువు ప్రాంత ప్రతినిధిగా పరిచయం చేస్తాడు.

రెండు నవ నాగరీక నగరీక నగరాలు బెంగుళూరు, మద్రాస్ నగరాల మధ్య ప్రయాణించే రైల్వే లైను పక్కనే ఉండే  పల్లెలు  మాత్రం అభివృద్ధికి గానీ నాగరికతకు గానీ నోచుకోలేదంటాడు.

“నాగరికతల్ని మోసుకుని రైళ్ళు అయోమార్గం మీద ప్రతి దినం పహారా చేస్తున్నా, మధ్యనున్న గ్రామాలూ పల్లెలూ ఇంకా జడం గానూ నిస్తేజంగానూ అనాగరికంగానూ ఉన్నాయి.దారి పొడవునా వ్యాపించిన వందల వేల బీడు భూములు బహుశా రైలులో ఏసీ కోచ్ ల లోనూ, ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలోనూ ప్రయాణిస్తున్న ఏ రాజకీయ నాయకుడికి గానీ, ఏ విద్యాధికుడైన ఏ  ఉన్నతాధికారికి గానీ ఆనినట్టు లేదు! ఎక్స్ ప్రెస్ రైలు మార్గాల పక్కనే పూడిక పడి పోతున్న బావులున్నాయి. రాత్రింబవళ్ళు పని చేసినా ఆ బావుల నుంచి చాలినంత నీటిని తోడలేని ఏతాలున్నాయి. అర్థ రాత్రి చలి లోనూ మధ్యాహ్నపు టెండల్లోనూ అంతంత మాత్రపు ఆచ్చాదనలతో ఏతాలు తొక్కే బక్క మనుషులున్నారు (రచనా కాలం 1985 అని గుర్తుంచుకోవాలి) ఒకనాడు పట్నాల్లో మంచి బతుకే బతికి, ఇప్పుడు ముసలి వగ్గులైపోయినవై , ఇప్పుడు పూర్వ జన్మ ప్రాప్త స్వీయ దుష్కర్మ ఫలితాలను అతి దారుణంగా అనుభవిస్తూ రైళ్ళ రాక కోసం గంటల తరబడి క్రాసింగుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాసే బస్సులున్నాయి” అంటూ బస్సుల దుస్థితిని  కూడా గుర్తించి  చేసి జాలి పడతాడు.  రైళ్ళలో ప్రయాణించే నాగరీకులకు వీటన్నిటినీ పట్టించుకునే తీరిక లేదంటూ ఆవేదన చెందుతాడు.”వారి కాలక్షేపానికి, జల్లు కురిసిన ఉదయం దిబ్బలపై లేచే పుట్టగొడుగుల్లా దిన వార పక్ష మాస పత్రికలుంటాయి. జోలారు పేట, వైట్ ఫీల్డ్ మొదలైన స్టేషన్లలో లభించే పాప్ కార్న్, బఠాణీలు, శీతల పానీయాలుంటాయి. అపరిచిత వ్యక్తులతో ప్రేమ ప్రహసనాలకిదే సమయం. రాజకీయ నాయకులకు కొత్త పార్టీ ఏర్పాట్లకిది నిరపాయకరమైన చోటు. తత్వ వేత్తలకిది తమ తత్వ జిజ్ఞాసను నిశిత పరచుకోడానికి అనువైన స్థలం ” అని, తత్వ వేత్తలతో సహా ఏ ఒక్కరూ ఆ ప్రాంతాలకు జరిగే అన్యాయాన్ని గురించి ఆలోచించరని ఎత్తి చూపుతాడు.

నీటి చుక్క దొరకడం కష్టమైన ఆ పల్లెల్లో, రైలు కోసం ఎదురు చూస్తూ బస్సు ఆగిన ఆ చీకట్లో, నిశ్శబ్దంలో ఎవరో ఎక్కడో బోరింగ్ పంపు కొడుతున్న శబ్దం వినగానే ఒంటిపల్లె కోమలమ్మ గుండెల్లో నొప్పి ప్రారంభమయ్యే సన్నివేశం ఆ వూళ్ళలోని దుర్భరమైన కరువుకు అద్దం పడుతూ, గుండె చిక్కబట్టేలా చేస్తుంది . 15 మంది గల ఇంటి నీటి అవసరాల  కోసం నిత్యం గంటల కొద్దీ పంపు కొట్టే కోమలమ్మకు గుండె నొప్పి ఆ బోరింగ్ ప్రసాదించిందే!

బస్సెక్కిన ప్రతి ఒక్కరి గురించీ మహి శ్రద్ధగా పట్టించుకుంటాడు . బస్ లోని ప్రయాణీకులంతా ఒక్కో వర్గానికి ప్రతినిధులు!ఒకరిద్దరు తప్ప అంతా జీవితాన్ని అతి కష్టం మీద ఈదుతున్న వాళ్ళే! వాళ్ళంతా మహేంద్రకు ప్రియమైన వాళ్ళే!

సరే, మరి తర్వాతేంటి?

అనేక విషమ పరిస్థితుల్ని దాటుతూ బస్సు ప్రయాణిస్తుంది. ఒకరి బాగు,సంక్షేమం మరొకరికి పట్టని ఈ ప్రయాణంలో , ఒకరినొకరు దగా చేసుకోడానికి సీటు సంపాదించడానికి అందరూ శాయ శక్తులా ప్రయత్నిస్తారు.  కొన్ని పల్లెలు దాటాక చాలా మంది దిగిపోయాక పెద్దపర్తి గుంటదాకా పోని బస్సు ఒక ఇసగవాగులో దిగబడి ఆగిపోగా అందులో మిగిలిన ప్రయాణీకులు విలేకరి రమణమూర్తి, దగాపడ్డ వృద్ధుడు తిమ్మరాయప్ప.

బంగారు గనులు మైనింగ్ కాంప్ గురించి ఎటువంటి సమాచారమూ దొరకని రమణమూర్తి చివరకు ఆ బస్సులో మిగిలిన తిమ్మరాయప్ప మీదే ఆధారపడతాడు. అరిచి గీపెట్టి అధికార పక్షం తరహాలో “బంగారు గనులిక్కడ పడటం వల్ల మీ బతుకులు బాగుపడ్డాయి కదూ? మీకు జీవనోపాధి దొరుకుతోంది కదూ”అని “హింట్” ఇస్తూ అడుగుతాడు. దానికి తిమ్మరాయప్ప ఇచ్చిన సమాధానమే ఈ నవల ఆత్మ!

“అదేమో సామీ, ఈ నేల్లో బంగారం దొరకతాదని శానా మంది కార్లలో జీపుల్లో వచ్చి పొతా ఉండారు!  ఈ నేల్లో బంగారు గన్లు వాళ్ళే పెట్నామంటూ మా దగ్గర ఓట్లేసుకోని పోతా ఉండారు. ఇంకొంత మంది ఈ నేల్లోనుంచి బంగారం దీస్తామని ఇనప రేకుల్తో ఇండ్లేసుకుని ఈడనే కాపురం పెట్టేసి మా దగ్గర అన్ని కూలి పన్లు చేయించుకుంటా ఉండారు. వాళ్ళొచ్చిన కాడ్నించి మా సేద్యాలు మూల బడి పోయినాయి!పోన్లే ఆ గెన్లో పనికే పోనీ అనుకుంటే,ఆ గెనిలో  పని అంటే మిత్తవ తో పోరినట్టే!  పోయిన పండగ నెల్లో ఆ సొరంగల్లో నేల ఉల్లుకోని ముగ్గురు ఒకేనాడు కాలమై పోయిరి!

Swarnaseemaku Swaagatam_Mahendra72ఈ నేల్లోనే మేము పుట్నాము. మా తాతల కాలం నుండీ ఈ నేలనే నమ్ముకోని బతకతా ఉండాము! . ఆ గెన్లో  పడే  కష్టం బూమ్మీదనే పడితే రాజనాలు పండు.అయినా బంగారం మీద జనాలకెందుకింత బ్రెమో తెలవటం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తాదా,కూర్లోకి వస్తాదా? సేతుల కష్టంతో వడ్లు పండించు, టెంకాయ చెట్లు బెట్టు,మామిడితోపులు పెట్టు, ఊరు నాడంతా పచ్చగ కళ కళ లాడతాది. గురిగింజంత బంగారం కొసం ఎకరాలు ఎకరాలుగా బీడుపెట్టేసినారు. ఈడకొచ్చిన ప్రతి మనిషీ ఈడ బంగారం దొరకతాదా అని అడగతాడే గానీ ఈడ తాగేదానికి నీళ్ళు దొరకతా ఉండాయా అని ఒక్కడైనా అడగతా ఉండాడా?భూమండలానికి సొరంగాలు యోజనాలుగా తవ్వి కేజీ ఎఫ్( కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ) కి దీసుకోని బోతా ఉండారే గానీ మంచినీళ్ళు తాగను సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారా? నీటికరవు లేని కాలాల్లో పైర్లు పండే కాలంలో మా ఆడోళ్లంతా బంగారం నగలు దిగేసుకోనుండ్రి. ”  అంటూ బంగారమంటే లోహం కాదనీ, పచ్చని పంటలనీ , జనం మొహాన కదలాడే చిరునవ్వులని తనకు తెలీకుండానే నిర్వచిస్తాడు. కష్టంలో పుట్టి, కష్టంలో బతికి, కష్టం లోనే చావుకు దగ్గరయ్యే వయసు దాకా ఈదిన అతని ప్రసంగం ఆవేదన పొర్లుతూ సాగుతుంది !

అది  చదివాక, ఇక ముందుకు పోబుద్ధి పుట్టదు. తిమ్మరాయప్ప మాటల్లోని కఠోర సత్యాన్ని, ఆ అతి చేదు నిజాన్ని ఇష్టంగా ఆస్వాదించడానికి సిద్ధమై, కళ్ళలో నిండే చెమ్మను రెప్పలు టప టప లాడించైనా విదుల్చుకోవాలనే స్పృహ కూడా తెలీదు.

రమణమూర్తి పరిస్థితి వర్ణనాతీతం! అనేక వ్యయ ప్రయాసలకోర్చి  మట్టిలో నుంచి బంగారం తీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చెయ్యడం కోసం వందలాది కార్మికులు నవీన యంత్రాల తోడ్పాటు తో కఠోర శ్రమ సల్పుతున్న ఆ భూమి లోనే ఒక నిర్భాగ్యుడైన ముసలి వాడు విగత జీవిగా మారిపోతున్న అతడి మనసుని కలచి వేస్తుంది. అతడి మెదడు నిండా మానవ సమాజం, దాని ప్రస్తానం, దాని వికటాట్ట హాసాల గురించిన ప్రశ్నలే !

ఆదిమ శిలా యుగం నుంచీ అంతరిక్షం దాకా విస్తరిల్లిన మానవ నాగరికతా ప్రస్థానానికి గమ్యం ఏమిటి?

ఈ నిరంతర స్పర్థాయుత క్షణ క్షణ సంఘర్షణామయ సతత అనిషిత అపాయకర సుదీర్ఘ పథంలో చివరకు దొరికేదేమిటి? అది మిగిలేదెవరికి? అన్న అంతుచిక్కని ప్రశ్నలతో నవల ముగుస్తుంది.

Swarnaseemaku Swaagatam_Mahendra40 - Copy

రాయల సీమ రచయితల సాహిత్యం లో ఈ నవలది ఒక ప్రత్యేక స్థానం గా తోస్తుంది. మహేంద్ర కథకుడు గా మాండలికం జోలికి పోడు. కథను ప్రామాణికమైన తెలుగులో చెప్తూనే, పాత్రల చేత చిత్తూరు మాండలికం మాట్లాడిస్తాడు . అంతే కాదు, ప్రతి అధ్యాయానికీ తనదైన శైలి లో చమత్కారంగా శీర్షికలు పెట్టాడు.

“శంకా-సువార్త”

“ది కంగుంది టైంస్ ”

“గుణ సంగ్రామ పరిషత్”

“లీడరోద్యోగ పర్వము”

“ఇతి మనుష్యాణాం”

ఇలా సాగించి  చివరి అధ్యాయానికి “స్వర్ణ సీమకు స్వాగతం”  పెట్టి అని ముగిస్తాడు.

మహేంద్ర ప్రామాణిక మైన తెలుగుగా  స్థిర పడిన  భాషను  నేరేషన్ కి వాడటానికి కారణం ఆ రోజుల్లో మాండలికాలకు ఇప్పుడున్న ఆదరణ లేక పోవడమే కావొచ్చేమో!  రచయిత సింగమనేని నారాయణ ఒక వ్యాసంలో ఇలా అంటారు ” రాయలసీమ రచయితలకు  తమ ప్రాంతపు మాండలిక భాష పట్ల తమకే అనుమానం. దీనికి సాహిత్య గౌరవం లభించదేమోనన్న భయం! ఇక కథ రాయటానికి కొత్తగా ఒక భాషను నేర్చుకోవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. అప్పటికే పత్రికా భాషగా, రచనా భాషగా స్థిరపడివున్న కోస్తాంధ్రభాషను నేర్చుకొని కథలు రాయాల్సిరావటం వల్ల కూడా, రాయలసీమలో కథావేగం కొంత మందగించింది.”   ఆయన మాటల్లో నిజముంది ! ఇది కోస్తాయేతర రచనలన్నిటికీ వర్తిస్తుందేమో కూడా !

మహేంద్ర మరణించిన తర్వాత అతను డైరీలో రాసుకున్న కవితలన్నీ ఆయన సోదరుడు మధురాంతం నరేంద్ర “పర్వవేలా తరంగాలు”  ( పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఆటు పోట్ల వల్ల వచ్చే ఉధృతమైన తరంగాలు )  అనే పేరుతో  సంకలనంగా ప్రచురించారు. వివిధ పత్రికల్లో వచ్చిన మహేంద్ర కథలు “కనుపించని కోయిల” పేరుతో కథా నిలయం లో అందుబాటులో ఉన్నాయి. కథా నిలయం వెబ్ సైట్  లో ఒక కథ మాత్రం (అతడి పేరు మనిషి)  PDF గా చదవడానికి దొరుకుతుంది.

మహేంద్ర మరి కొన్నేళ్ళు జీవించి ఉంటే, రాయల సీమ వెతలగురించి అసంఖ్యాకంగా కథలు రాసిన రాజారాం గారి వారసుడి గా ఎన్నో రచనల్ని అందించి ఉండేవాడనే విషయం స్పష్టం!

ఈ నవలను తిరిగి సరి కొత్తగా, చక్కటి రూపం లో ప్రచురిస్తామని మధురాంతకం నరేంద్ర అంటున్నారు. దీనితో పాటే మహేంద్ర కథా సంకలనాన్ని కూడా!

మహేంద్ర రచయిత, కవి మాత్రమే కాదు, చిత్ర కారుడు కూడా! ఈ నవలకు వేసిన ఇలస్ట్రేషన్స్ మొత్తం ఆయనవే.

చదివి తీరవలసిన ఈ నవల కోసం ,మధురాంతకం  నరేంద్ర గారు తిరిగి ప్రచురించే వరకూ ఎదురు చూడటమే మార్గం.

 

(మహేంద్ర ఫొటో అడగ్గానే ఇచ్చినందుకు నరేంద్ర గారికి ధన్యవాదాలు )

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    చదివి తీరవలసిన “స్వర్ణ సీమకు స్వాగతం” నవలను మధురాంతకం నరేంద్ర గారు తిరిగి ప్రచురించే వరకూ ఎదురు చూడటం ఒక మార్గం అయితే …. ప్రచురించే వరకూ పట్టుకు పీడించటం మరో మార్గంగా కనపడుతోంది సుజాత గారు. మహేంద్రను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  2. buchireddy gangula says:

    పరిచయెం భాగుంది సుజాత గారు
    అంత తొందరగా స్వర్గ సీమ కు — వెళ్ళిపోవడం తెలుగు సాహితీ లోకాని కి
    తీరని లోటే —-
    we.all.miss.him..
    ———————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  3. Kuppilipadma says:

    సుజాత గారు, నాకు చాలా నచ్చే రచయితల్లో మహేంద్ర వొకరు. మహేంద్ర గారి కథలు కవిత్వం విలువైనవి. యీ నవల చదివిన తరువాత బస్సు లని చూస్తె యీ నవల్లో పాత్రలు గుర్తు వచ్చేవారు. కథల్లో కూడా అతని పాత్రలని వొక పట్టాన మరచి పోలేము. వొక సారి తిరుపతికి వొక సభలో పాల్గునడానికి వెళ్ళినప్పుడు సభా ప్రాంగణం ఆవల మహేంద్ర గారిని మొదటి సారి చూసాను. ఆ కొద్ది సమయంలోనే వారి రచనల్లో పాత్రలు ఆ స్వభావాలు భలే గుర్తుండి పోతాయని చెప్పినప్పుడు మొహమాటంతో కూడిన చిరునవ్వు వారి నుంచి. ఆ నాటి ఆ మృదు సంభాషణ. చమత్కారం నాకు గుర్తుండి పోయాయి. మానవ స్వభావంలోని అన్ని రకాల షేడ్స్ ని లోతుగా అర్ధం చేసుకొన్నరచయిత కథలో పాత్రలతో చదువరి మమేకమై ప్రయాణించటం మహేంద్ర గారి రచనల్లో వుంటుంది.
    యీ నవలని మీరు పరిచయం చేసిన తీరు అద్భుతం. మీకు హృదయ పూర్వక అభినందనలు. Thank you Sujatha gaaru.

  4. Sathyavathi says:

    మహేంద్ర జర్తి అని ఒక అద్భుతమైన కథ రాశాడు ఆకథని అతని ముత్యాల వంటి దస్తూరీ లో మొట్టమొదట చదివే అవకాశం నాకు దక్కింది వెతుక్కుని తప్పకుండా చదవవలసిన కథ one of the best stories in Telugu

  5. Bhavani Phani says:

    ఎంత చక్కని శైలి !! పరిచయం చేసిన మీ వాక్యాలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి . ధన్యవాదాలు సుజాత గారూ

  6. కె.కె. రామయ్య says:

    మానవ సంబంధాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కధలు రాసిన మహా రచయిత, మట్టి మనిషి, అచ్చ తెలుగు కధకు నిలువు తద్దం మధురాంతకం రాజారాం మాస్టారు ( గబ్బిట దుర్గా ప్రసాద్ గారి మాటల్లో ) గారి “కమ్మతెమ్మెర” కధ మీద మాస్టారు ఆటోగ్రాఫ్ తీసుకున్నాం మా అనంతపూర్ కాలేజీ రోజుల్లోనే. ఆ దామెర్ల చెరువు మధురాంతకం రాజారాం మాస్టారు గారబ్బాయి మహేంద్ర మీకు నచ్చే రచయితల్లోని వొకరు అని క్లియర్ గా చెప్పలేదు మీరు కుప్పిలి పద్మ గారూ.

  7. Rambabu Kopparthy says:

    మధురాంతకం మహేంద్ర గారి స్వర్ణ సీమకు స్వాగతం చాలా ఏళ్ళ క్రితం చదివాను. మూడు దశాబ్దాల నించి ఆయన్ని అడపా దడపా తలచుకుంటూ బాధపడుతూ, ఇవాళ ఆయన్ని మరోసారి తల్చుకుంటున్నాను.ఆయనతో నాకు 1981లో ఆయన రాసిన స్వర్ణ సీమలోనే పరిచయం.ఆయన రూపం, మాట, భాషా లీలగా గుర్తున్నాయి.35 ఏళ్లక్రితం చిత్తూరులో ఒక రాత్రి మా రూంలో కలిసి కబుర్లు చెప్పుకున్నాము.నేను ఇండియన్ బ్యాంకు లో 1981 లో గుమస్తా గా చేరిన రోజుల్లో ,ఆయన మా బ్యాంకు ప్రాయోజితమయిన శ్రీ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు లో ఆఫీసర్ గా పనిచేశారు.. ఆరాత్రి గడిపి ఇంటికి వెళ్ళాక దామల్ చెరువు నించి వెన్నెలరాత్రిని అనుభవిస్తూ ఒక లేఖ రాసారు నాకు. ముత్యాలముగ్గు సినిమాలో గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాసిన “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ” అనే గీతం తనకు ఇష్టం అని రాసారు.సాహిత్యాభిమానం ఉన్నా, నేను పాఠకుడినే గాని రచయితని కాక పోవడంవల్ల ఆయనతో పెద్దగా పరిచయం పెంచుకోలేక పోయాను 1982 లోనే ఉద్యోగరీత్యా నేను గోదావరి జిల్లాకి మారిపోయాను..ఆ తర్వాత మా మధ్య పరిచయం తెగిపోయింది.ఆయన మరణవార్త తెలిసి బాధ పడ్డం మినహా ఏమీ చెయ్యలేక పోయాను.ఆయన సోదరుడు నరేంద్ర గారు శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ఎం ఫిల్ పరిశోధన చేస్తుండగా ఒకటి రెండు రోజుల పరిచయం.ఆచార్య తుమ్మల రామకృష్ణ, వీరపల్లె వీణా వాణి (అసలు పేరు ఆంజనేయులు నాయుడు అనుకుంటాను ) మరొక ఆర్కి యాలజి పరిశోధన విద్యార్ధి (అప్పుడు) పేరు గుర్తులేదు, వడ్డెర చండీ దాస్ గారికి ఈయన దగ్గరవాడు.ఇలా ….ఏవో జ్ఞాపకాలు.మీ నవలా పరిచయం బాగుంది,నా పాత జ్ఞాపకాల్ని తవ్వి వెలికి తీయించింది.

    • సుజాత says:

      రాంబాబు గారూ, మీ స్పందన చాలా ప్రత్యేకం ఈ వ్యాసానికి ! ఈ నవలా పరిచయం మీకు మహేంద్ర గారితో మీ పరిచయాన్ని గుర్తు చేసిందన్నమాట! వెన్నెల రాత్రి సౌందర్యాన్ని అనుభవిస్తూ మహేంద్ర రాసిన ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నారని అనుకుంటున్నా! జ్ఞాపకాలే కొన్ని సార్లు ఓదార్పులవుతాయి కదా!

      -సుజాత

  8. సుజాత says:

    కె.కె రామయ్య గారూ, నిజానికి ఈ నవలను నేను మళ్ళీ వస్తుందో రాదో అని స్కాన్ చేసి ఉంచుకున్నాను. కానీ నరేంద్ర గారు వేస్తానంటున్నారు కాబట్టి, ఎవరికీ పంచలేదు. ఆయన వేయక పోతే..అప్పుడు ఇచ్చేస్తా అందరికీ :-)

    బుచ్చి రెడ్డి గారూ, అవును సరిగా చెప్పారు,స్వర్ణ సీమను మనకు పరిచయం చేసి స్వర్గ సీమకు మహేంద్ర వెళ్ళి పోడం అన్యాయమే!

    పద్మ గారూ, మహేంద్ర గురించి తల్చుకున్నపుడలా నరేంద్ర అతడు నిన్ననే నిష్క్రమించినంత షాక్ తో మాట్లాడతారు. బహుశా మహేంద్ర వ్యక్తిత్వమే అంతటిదేమో! మీరంతా అదృష్ట వంతులు, జీవించి ఉండగా ఆయన్ని కలిశారు, గడిపారు

    సత్యవతి గారూ, జర్తి కోసం వెదికి సంపాదిస్తాను ఎలాగైనా !

    భవాని గారూ, అవును, మహేంద్ర శైలి అద్భుతమే! కథా నిలయం వెబ్ సైట్ లో ఒక కథ ఉంది, ఆయనది, చదవండి

  9. రజని says:

    సుజాత గారూ మీ మాటల్లో మెరుపై మెరిసారు మహేంద్రగారు. బాగుంది మీ విశ్లేషణ

Leave a Reply to buchireddy gangula Cancel reply

*