రోహిత్ యిప్పుడు రెక్క విప్పిన ఉప్పెన !

 

 

We want solid words
that resist in the middle of the night

rock-hard
unyielding words.

-Roque Dalton

 

1

 

బహుశా వొక లాటిన్ అమెరికా కవో, యింకో ఆఫ్రికన్ కవో, మరింకో  ఇరాక్  కవో, మన దాకా వస్తే కచ్చితంగా ఏ దళిత ముస్లిం కవో యీ మాట యింతగా తెగేసి చెప్పగలరు. మనం వూహించినట్టే Roque Dalton లాటిన్ అమెరికన్  కవి. ఇవాళ రోహిత్ గురించి వెల్లువైన యీ కవిత్వ వుప్పెన మధ్య నిలబడితే, నన్ను Roque Dalton ఆవహిస్తున్నాడు. విప్లవోద్యమ రణక్షేత్రం మధ్యలో నాలుగు పదుల వయసులో రాజ్యానుకూల శత్రువుల చేతుల్లో దారుణ హత్యకి గురైన వాడు Roque Dalton.

మనం యిప్పుడు తలచుకుంటున్న రోహిత్ అతనిలాంటి కవి కాకపోవచ్చు, కాని- అందమైన కల చూస్తూ చూస్తూ బలవంతాన కళ్ళు మూసుకున్న స్వాప్నికుడు. ప్రతి స్వాప్నికుడూ తనదైన వొక కవిత్వ సీమలో జీవిస్తూ వుంటాడు. ప్రతి మాటా, ప్రతి చర్యా కవిత్వ ఉద్విగ్నంగా బతుకుతాడు.

కవిత్వ భాషలోనే చెప్పాలంటే- యీ లాటిన్ అమెరికన్ కవి అన్నట్టు- solid words- లో యీ కాలపు ఉద్యమకారుడూ, ఉద్యమ కవీ బతుకుతాడు. మాటలు సర్రు సర్రున జారిపోతున్న విష సర్పాలు  మాత్రమే అవుతున్నప్పుడు, చలి చీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి! లేని నిశ్శబ్దాన్ని వూహించుకొని, లోపలి labyrinth అడవుల్లో  తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్ మీడియా మాయలో భాష స్పృహ తప్పిన అకాలం,  విపరీత బలవంతపు “ఇష్టాల”, ఇచ్చి పుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం. ఇది కవుల మీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న వొకటికి పది సార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట.

ఇదిగో- యీ కృత్రిమ తగరపు మెరుపుల మధ్య రోహిత్ నిష్క్రమణ వొక విస్ఫోటనం!

 

 

2

రోహిత్ యిప్పుడు వొక phenomenon. రోజూ చస్తూ బతికే రొటీన్ గుండెల మీద పిడుగుపాటు లాంటి phenomenon. దీనికి వొక కులమో యింకో మతమో అక్కర్లేదు. మన వునికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే వొక erasure గా మార్చుకున్నాడు రోహిత్. యిలా అనడం అంటే అతని మరణాన్ని కీర్తించడం కాదు. వొక అధ్యాపకుడిగా నేను అలా నా విద్యార్థిని చూడలేను, లేదూ, వొక స్నేహితుడిగా అతని చివరి చర్యని యెట్లా అయినా సమర్ధించే పని  చేయలేను, లేదూ వొక ఉద్యమ ప్రేమికుడిగా అతని ఆ చివరి నిర్ణయంలో కారణాన్ని వెతకలేను. కాని, ఎన్నింటికి కారణాలు వెతికే శక్తి మనలో వుంది?!

యీ పుస్తకంలోని కవితల్లో కవులు ఏకరువు పెట్టిన అనేక “ఎందుకు” ల వరస క్రమం ఇదీ:

 1. ఎందుకో ఏకాగ్రత శిబిరాలు అని పిలవరుగానీ

మన పెరట్లో పూసిన భావజాల పువ్వులే వధ్యశిలమీద రాలిపోతుంటాయి (విల్సన్ సుధాకర్)

 1. ఏందోగాని అబయా !

మన పాలిటనే ఫిర్యాదులన్నీ ఫిరంగులౌతయ్

ఉత్తరాలన్నీ ఉత్తరించే కత్తులౌతయ్

వివక్షరాలే వెలివాడలూ , ఉరితాడులూ

ఇనుప గోరీలుగా మారిపోతయ్ (కృపాకర్)

 1. ఎందుకనుకున్నావ్ ?

నీ రాజీనామా తర్వాత నువ్వుండవని! (మిథిల్)

యిలా యింకా కొన్ని ఎందుకు అన్న శోధనలన్నీ వెతకవచ్చు.

 

ఇలాంటివి జరిగినప్పుడు శుభ్ర స్థిమితంగా, శుద్ధ నిబద్దంగా  కవిత్వం రాయాలనుకునే మనస్తత్వం వున్నవాళ్ళు సందిగ్ధంలో పడిపోతారు. ఎందుకంటే, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో  ఆదర్శంగా నిలబెట్టుకున్న స్థిమిత సందర్భం ఇది కాబట్టి! కళ్ళ ముందు కదులుతున్న వాస్తవికత వాళ్ళని కలవరపరుస్తుందో లేదో కాని, అది వాళ్ళ కవిత్వంలో మాత్రం ప్రతిఫలించదు. కవిత్వ స్వచ్చ స్ఫటికత గురించి ముందే ఏర్పరచుకున్న నిర్వచన నియామాలూ, నిబంధనలూ వాళ్ళ వ్యక్తీకరణని అటకాయిస్తాయి. “ఎందుకు” అన్న ప్రశ్న యిక్కడ నిష్ఫల యాగమై పోతుంది. ఈ సంకలనంలో పలకరిస్తున్న కవులకి అలాంటి సంశయాలు లేవు, తాము రాస్తున్నది కవిత్వమేనా కాదా అన్న విచికిత్సా లేదు. కళ్ళ ముందు జరిగిన వొక  దారుణానికి వాళ్ళ ముఖాల్లోకి పొంగిన నెత్తుటి యేరుని దాచుకోకుండా దాన్ని వాక్యాలలోకి మళ్ళించే restless ప్రయత్నం వీళ్ళది.

అసలు ఇంత Restlessness – అశాంతి- అనేది వుందా అని naïve గా అడిగే వాళ్ళని ఏమీ అనలేం, జాలి పడడం తప్ప! కాసినీ పూలూ రెమ్మలూ ఆకాశాలూ పచ్చని నేలా వూరికే  సోమరిగా తిరిగే మబ్బు తునకలే కవిత్వం అనుకుంటే చేయగలిగేదీ లేదు. అంతకంటే ముఖ్యంగా ఏదో అంటీ ముట్టనట్టుగా నాలుగు వాక్యాలు “శుద్ధం”గా రాసుకొని, జీవితం ఎంత  హాయిగా వుందీ అనుకునే మాయదనమూ వుంది. కాసేపు ఏ యోగినో, మహర్షినో తలచుకొని, కళ్ళు మూసుకునే అంతర్జాల మార్జాల కవులూ వున్నారు. నిజానికి వీళ్ళ లౌకిక జీవితం మూడు సత్కారాలూ ఆరు అవార్డులుగా వర్ధిల్లుతూ వుంటుంది. వీళ్ళ చుట్టూ కవి సమూహాలు మోకరిల్లి వుంటాయి. వొక అబద్దాన్ని శుద్ధ కవిత్వంగా మోసుకుంటూ తిరుగుతూ వుంటారు.  ఇలాంటి వాళ్ళని రోహిత్ చాలా ఇబ్బందిలో పెట్టాడు.

హెచ్చార్కె అన్నట్టు:

బుద్ధి కేంద్రాలలో కాదు, ఆత్మ క్షేత్రాలలో పోరు

తప్పుడు తర్కాలు, వంచన వ్యూహాలు చాలవు

మనస్సులే ఆయుధాలు. ఒకడు నిలబడింది

ఫెన్సింగ్ కి ఎటు వైపని కాదు, వాడి రొమ్ముల్లో

ఏమైనా కొట్టుకుంటూ వుంటే అది నీ పక్షాననే

అవుతుంది, లేదా వాడొక నడుస్తున్న శవమని

రుజువవుతుంది

ఇవాళ్టి వుద్యమజీవుల కంటే కూడా  సాహిత్య జీవులకి ఇలాంటి “తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు. మనకి తెలియకుండానే పాత సాహిత్య వాదాలన్నీ మళ్ళీ కొత్త చొక్కా వేసుకొని వస్తున్నాయి. అందులో వొకటి: సాహిత్యం సాహిత్యం కోసం మాత్రమే అన్నది! సాహిత్యానికి సామాజిక సందర్భం వుందనడం వీళ్ళ దృష్టిలో విపరీత వాదం అవుతోంది. అలాంటి వాళ్లకి రోహిత్ లాంటి వాళ్ళు ఎంత మంది చనిపోయినా, లేదా, ఎంత మంది అన్యాయంగా చనిపోతూ వున్నా మనసు చలించదు. లేకపోగా, వెంటనే వాళ్ళు చాలా సుఖంగా సాహిత్య శుభ్ర యాగంలో తలమునకలై పోతారు.

యీ బాధల సందర్భంలో యిలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం వుందనే తూనికలూ కొలతలూ అక్కర్లేదు. యీ బాధలో యెంత నిజాయితీ వుందన్నదే ముఖ్యం. యిందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం యెంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గిర సమాధానం లేదు, వాటినలా క్షోభిస్తూ వుంటే చూసి జాలిపడడం తప్ప!

సుబ్బాచారి అన్నట్టు:

ఇక్కడ ఒక జింక కూలిపోతే మాత్రం

చుట్టూ ఉన్న జింకలు కొద్దిగానే ఉన్నాయి.

కాని అక్కడ పులులు, సింహాలదే పెద్దసంఖ్య

సహానుభూతి అనేది కవిత్వ లక్షణం కాకుండా పోతున్న సందర్భం ఇది. సహానుభూతికి బదులు సాహిత్య రాజకీయాలు పెత్తనం చేస్తున్నసందర్భం కూడా- సహానుభూతిని వ్యక్తం చేయడానికి అర్హతల్ని, ప్రవేశ రుసుముల్ని నిర్ణయించి పెట్టిన కాలం ఇది. కొంత మంది మాత్రమే కొన్నీటి గురించి మాట్లాడాలీ అన్నది యిందులో వొకటి. యీ గిరి గీసిన వాళ్ళు కూడా శుద్ధ సాహిత్య వాదులే! మళ్ళీ అదే గిరుల మధ్య మనం విలువల్ని వురేస్తున్నాం, యిన్ని చర్చలూ ఉద్యమ సాహిత్య అనుభవాల తరవాత కూడా! కొత్త ప్రశ్నల్ని కొత్త తలలెత్తకుండా యెప్పటికప్పుడు వుత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని యిప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది నా మటుకు నాకు!

3

 

అరుణ్ బవేరా అన్నట్టు:

త‌ప్పు చేయ‌నివాడినే కాదు..

చెమ్మగిల్లనివాడినీ గురి చూద్దాం

అక్కడ ఈ వాక్యాన్ని ఉరి తీద్దాం..

కవిత్వ నరాల్లో నెత్తురు ఎక్కించాల్సిన కాలం మళ్ళీ వచ్చింది. వాక్యాలకు వాక్యాలనే తిరగరాసుకోవాల్సిన కాలమిది. రోహిత్ మరణం అలాంటి కొత్త కాలానికి వొక ప్రవేశ ద్వారం- ఈ సంకలనంలో అనేక కవితల్ని అనేక ధోరణులకు ప్రతిరూపంగా ఉదాహరించుకుంటూ వెళ్ళవచ్చు. ప్రతి కవినీ ఆత్మీయంగా పలకరించి, ఆ వాక్యాల్ని మళ్ళీ వినిపించమని పదే పదే వినవచ్చు. ఆ వాక్యాల లోతుల్లో ఆరిపోని నిప్పు సెగల్ని తాకి రావచ్చు.

ఇది రోహిత్ సందర్భం కాబట్టి, యీ మరణం నన్నింకా కలవరపెట్టే చేదు పీడకలగానే వుంది కాబట్టి- అతనిలాంటి మరణాన్ని అనుభవించిన  Roque Dalton వాక్యాలతోనే ముగిస్తాను.

The dead are getting more restless each day.

But not anymore
the dead
have changed.

They get all ironic
they ask questions.

It seems to me they’ve started to realise
they’re becoming the majority!

(A Warrior’s Resting Place)

రోహిత్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు యింకా దొరకలేదు. కాని, అనేక మంది రోహిత్ లు మనలో వున్నారు. వాళ్ళందరిలోనూ నిర్జీవ రక్తం గడ్డకట్టక ముందే మనం పలకరిద్దాం. ఆ పలకరింతల్లోంచి కొత్త వాక్యాలు రాద్దాం.

 

మీ మాటలు

 1. buchireddy gangula says:

  సరి కొత్త కుట్రల తో
  సరి కొత్త ఎత్తు గడలతో
  సరికొత్త పన్ను గడలతో
  గలమేత్తిన మేధావుల ను
  యిరికిస్తూ
  న్యాయమని
  సాక్ష్యమని
  రుజువులని —కోర్ట్లుల చుట్టూ తిప్పుతూ
  విసిగిస్తూ
  చికాకులు కల్పిస్తూ
  పబ్బం గడుపుకుంటున్న
  నాయకులు ఉన్న దేశం లో
  ఎంతగా పలుక రించినా ?????? మార్పు అల్లా కు తెలుసు

  సమీక్షా భాగుంది సర్ — మీరే రాయగలరు అలా

  ———————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. బ్రెయిన్ డెడ్ says:

  అక్షర సత్యం “మాటలు సర్రు సర్రున జారిపోతున్న విష సర్పాలు మాత్రమే అవుతున్నప్పుడు, చలి చీమల్లాంటి చురుక్కున కరిచే పదాలు కావాలి, బలవంతమైన సర్పాన్ని బంధించడానికి ” మనం అంతా కలిసి మళ్ళీ ఓ మారు ఆ ప్రయత్నమే చేస్తున్నాం అని ఒక చిన్న నమ్మకమే జీవితాన్ని మళ్ళీ ఆశించేల ఓదార్పు గీతం అవుతుంది . థాంక్స్ ఫర్ అల్ దోస్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ లవ్ సర్ .

 3. రాజశేఖర్ గుదిబండి says:

  చాల గొప్పపని చేస్తున్నారు..
  అవును….
  “యీ కృత్రిమ తగరపు మెరుపుల మధ్య రోహిత్ నిష్క్రమణ వొక విస్ఫోటనం!”
  ఒక్కోసారి చితిమంటలు కూడా దారి చుపిస్తాయేమో ..అంధకారంలో..
  కవిత్వం అంటేనే సహానుభూతి కదా ..

  ‘రో” గురించిన కవిత్వం కేవలం సానుభూతి గానే కాకుండా ఓ ఉత్ప్రేరకం గా పనికొస్తుందని ఆశిస్తాను..

 4. THIRUPALU says:

  /పాత సాహిత్య వాదాలన్నీ కొత్త చొక్కా తొడుగు కొని వస్తున్నాయి /
  ఎంత దురదృష్టం. చరిత్ర వెనుక డుగుగు చేయడం! ఇది గుర్తు ఎరిగిన వారిదే భవిష్యత్తు
  కవులార మేలు కొని మేలు కొలుపు పాడండి.

 5. కె.కె. రామయ్య says:

  “స్వాప్నికుడి మరణం” రోహిత్ నివాళి కవితా సంకలనం సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్నకి దీటైన సమాధానం. బలవంతమైన సర్పాన్ని బంధించడానికి గొంతువిప్పిన పుస్తకంలోని కవులందరికీ సలాం.

 6. Jhansi Papudesi says:

  ఇది కవుల మీద ఫిర్యాదు కాదు, మొత్తంగా మన మధ్య మాటలు వొట్టిపోయిన స్థితి మీద ఎలిజీ. సాహిత్యం తన పాత్రని సరిగ్గానే పోషిస్తోందా అన్న ప్రశ్న వొకటికి పది సార్లు ఆలోచనల్లో తూట్లు పొడుస్తున్న గాయాల మధ్య వెతుకులాట…..!
  vivaksha gurinchi thama anubhavaalanu evariki vaaru raasukodam minahaa. ..vaatini pariseelinche sookshmatha vopika andarilo untundani naaku anipinchadam ledu. Kaneesam Rohit laanti jeevithaalu mugisinappudainaa aa chithi velugulo saraina daari vedukkovadam kavithvaaniki ippudu chaala avasaram.

 7. Delhi (Devarakonda) Subrahmanyam says:

  “స్వాప్నికుడి మరణం ” కి ఇంత భావోద్వేకపు ” పరిచయం ఇచ్చిన అఫ్సర్ గారికి చేయెత్తి నమస్కరిస్తున్నాను. ఆయన చెప్పినట్టు”లేని నిశ్శబ్దాన్ని వూహించుకొని, లోపలి labyrinth అడవుల్లో తెలుగు కవులు అదృశ్యమై పోతున్న కాలం ఇది. ఉద్యమం అనేది బహిష్కృత భావన అయిపోతున్న దశ. కవి అంటే కేవలం కవి మాత్రమే అనే archaic ఆలోచన చుట్టుముడుతున్న స్థితి. సోషల్ మీడియా మాయలో భాష స్పృహ తప్పిన అకాలం, విపరీత బలవంతపు “ఇష్టాల”, ఇచ్చి పుచ్చుకునే కామెంట్ల negotiation మాత్రమే మిగిలి ఉంటున్న వ్యాపార కాలం.” లో ఉన్నాము మనము. రోహిత్ తన ప్రాణత్యాగంతో ఈ పరిస్థితి లో మార్పు చేయగలిగాడు. ఫ్సర్ గారి పరిచయం లో “యీ బాధల సందర్భంలో యిలాంటి సంపుటిలో భాగమైన ప్రతి కవినీ మనం అభినందించాలి. ఇందులో ఎంత కవిత్వం వుందనే తూనికలూ కొలతలూ అక్కర్లేదు. యీ బాధలో యెంత నిజాయితీ వుందన్నదే ముఖ్యం. యిందులో కొన్ని కవితలు చదివి, కవిత్వ రూపం యెంత మరకలు పడిందీ అని క్షోభించే కవి హృదయాలకు నా దగ్గిర సమాధానం లేదు, వాటినలా క్షోభిస్తూ వుంటే చూసి జాలిపడడం తప్ప!” చెప్పిన ఈ మాటలు కూడా చాలా విలువయిన మాటలు .

 8. సాయి.గోరంట్ల says:

  బాధల మీద
  బలవంతపు ఇష్టాల మీద
  అణిచివేత మీద
  కవి ఎప్పుడైనా సంసిద్ధంగా వుండాలి
  తన గళాన్ని సమర్థంగా వినిపించటానికి
  నిజం పక్షాన పోరాడటానికి
  ఈ ప్రయత్నం అభినందనీయం..

 9. వృద్ధుల కల్యాణ రామారావు says:

  ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారు అఫ్సర్ గారి పరిచయం గురించి చెప్పిన మాటలతో-(I can’t improve upon them) పూర్తిగా ఏకీభవిస్తున్నాను. “ఇందులో ఎంత కవిత్వం ఉందనే తూనికలూ కొలతలూ అక్కరలేదు.ఈ బాధలో ఎంత నిజాయితీ ఉన్నదన్నదే ముఖ్యం”–hats off అఫ్సర్ గారూ.

 10. గ్రేట్ రైటప్ సర్. సమకాలీన సాహిత్య ధోరణులపై అవసరమైన, ఆలోచనాత్మక వాక్యాలెన్నో ఉన్నాయి ఈ వ్యాసం లో. బహుసా తెలుగు సాహిత్య లోకం ఆత్మ విమర్శ చేసుకొని ముందుకు వెళ్ళటానికి ఇంతకన్న గొప్ప సందర్భం ఉండదు. థాంక్యూ సర్.

 11. “కొత్త ప్రశ్నల్ని కొత్త తలలెత్తకుండా యెప్పటికప్పుడు వుత్తరించడం అనేది శుద్ధ వాదపు అబద్ధపు పునాది. ఆ పునాదిని యిప్పటికీ బలపరిచే వాదాలు ప్రత్యామ్నాయ శిబిరాల్లోనూ వినిపించడం అసంబద్ధంగా కనిపిస్తుంది!”

  “ఇవాళ్టి వుద్యమజీవుల కంటే కూడా సాహిత్య జీవులకి ఇలాంటి “తప్పుడు తర్కాలూ, వంచన వ్యూహాలూ” పెద్ద సవాల్ అవుతున్నాయి. వీళ్ళు ఎంత దూరం వెళ్తారంటే రోహిత్ మరణం మీద కవిత్వం ఏమిటీ అని అసింటా వెళ్ళిపోతారు.”

  చాలా బాగా చెప్పారు అఫ్సర్ సర్!

 12. Sivalakshmi says:

  “మన వునికి రాహిత్యాన్ని చెరిపేయాల్సిన అవసరాన్ని చెప్పడం కోసం తనని తానే వొక erasure గా మార్చుకున్నాడు రోహిత్ ”
  ప్రేగ్ మహానగరంలోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో జాన్ పాలక్ (Jan Palach) అనే 20-ఏళ్ల చేకోస్లొవేకియా విద్యార్థి “అలెగ్జాండర్ డబ్ చెక్” (Alexander Dubcek) అనే నాయకుని ఆద్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ అకృత్యాలకు నిరసనగా జనవరి 19, 1969 లో ప్రేగ్ వెన్సెలాస్ స్క్వేర్ వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించు కొని ఆత్మాహుతి చేసుకోవడం ద్వారా తన రాజకీయ నిరసనను తెలిపాడు. జాన్ పాలక్ చెక్ ప్రజల మత్తు వదలగొట్టడానికి కాల్చుకుంటే, ఆ వార్త చెకొస్లవేకియా లోనే కాకుండా, ప్రపంచం మొత్తాన్నీ కుదిపేసింది. అలాగే రోహిత్ కూడా హైదరాబాద్ నగరంలోని కేంద్ర విశ్వ విద్యాలయంలో తన మరణం ద్వారా దీర్ఘ నిద్రలో ఉన్న దేశాన్ని చైతన్య పరచడానికి గొప్ప సాహసం చేశాడు! జాన్ పాలక్ ప్రేగ్ నగరంలోని ప్రముఖులందరికీ అప్పటి పరిస్థితుల గురించి వివరిస్తూ ఉత్తరాలు రాశాడు.రోహిత్ అతన్ని చదివాడో లేదో తెలియదు గానీ, వైస్ చాన్స్ లర్ కి రాసిన ఉత్తరం ద్వారా మనందర్నీ అలారం మోగించి అలర్ట్ చేశాడు. అధిష్టానం నుంచి అధికార హోదాల్లో ఉన్నవారందరూ కమిటీలు వేసి,10 మీటింగులు పెట్టి పేద,దళిత విద్యార్ధుల కనుకూలంగా ఒక చిన్న ఫైల్ కదపడానికి కూడా వణికిపోతూ తాత్సారం చేసే ఈ రోజుల్లో అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అత్యంత దిగ్భ్రాంతికరంగా అధికార యంత్రాంగాన్ని, కుంభ కర్ణుడి గాఢనిద్రలో మునిగిపోయిన వ్యవస్థనీ అపహాస్యం చేస్తూ “నన్ను చూడండి,నా జాతి కోసం, భావి తరాలకోసం నా త్యాగంతో నిప్పు రాజేస్తున్నానని” చేతల్లో చూపించాడు రోహిత్ !
  నిజం అఫ్సర్ వ్యవస్థ చేస్తున్న దుర్మార్గాలతో పాటు మన స్పందనా రాహిత్యాన్ని మనకి వేలెత్తి చూపించాడు రోహిత్!!

 13. editor@saarangabooks.com కు మీ రచనలు ,అభిప్రాయాలు పంపవచ్చు. వ్యక్తిగత ఈమైల్స్ kalpana.rentala@gmail.com , afsartelugu@gmail.com .

మీ మాటలు

*