న్యూటన్ సరికొత్త సిద్ధాంతం!

-బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ప్రియమైన సైంటిస్టులారా..  సైన్సు యిష్టులారా..!

నన్ను క్షమించండి!

“భూమికి ఆకర్షణ శక్తి కలదు!” అని నేను కనుగొని రాసుకున్న సిద్ధాంతాన్ని భేషరతుగా నేనే ఖండించు చున్నాను! నేను యింతకాలం భూమ్యాకర్షణ శక్తి గురించి మానవాళిని తప్పుదారి పట్టించానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను! సైన్సులో ముగింపులు వుండవని- కొనసాగింపులూ చేర్పులూ యెల్లప్పుడూ వుంటాయని విజ్ఞులైన మీకు గుర్తుచేసుకుంటున్నాను! చేసిన ప్రతిపాదిత తప్పు వొప్పుకొని- చెవులు నులుముకొని- గుంజీలు తీసి మరీ క్షమాపణలు చెప్పడానికి ఈ న్యూటన్ సిద్ధంగా వున్నాడు! నేను రాసింది కొట్టేశాను! చేతికి అందినంత వరకు చెరిపేశాను! చరిత్రని తప్పుదారి పట్టించానని తెగ బాధపడి బెంగపడి దుఃఖపడి యేడ్చాను కూడా!

సత్యం యెప్పుడూ వొకేలా వుండదు! అప్పటి పరిశోధనలకు అతీతమైన ఫలితాలు యిప్పుడు రావడాన్ని నేను గమనించాను! ఇందుకు భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలు తాజా ఉదాహరణలుగా నా ముందు మరోసారి నిలబడ్డాయి! ‘ఆపరేషన్ ఆకర్ష్’ ప్రభావాల్ని తోసిపుచ్చలేకపోతున్నాను! తెలివిగల సైంటిస్టుల్లారా తెల్లమొహం వేయకండి! నా ‘న్యూటన్ సిద్ధాంతము’ తప్పే! ముమ్మాటికీ తప్పే!

ఫీల్డ్ రిపోర్టులు పరిశీలించాను! ఆంధ్రప్రదేశ్ లో జనం బతుకుతెరువుకి వూళ్ళు వొదిలి వలస పోతుంటే- కాంగ్రేసూ వైయ్యస్సార్ కాంగ్రేసు ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసలు పోవడం గుర్తించాను! తెలుగుదేశానికి యింత ఆకర్షణ శక్తి వుంటే- అదే నిజమైతే- మరి తెలంగాణలో ఆ పార్టీ యెందుకు పూర్తిగా ఖాళీ అయిందో.. యెందుకు రేపోమాపో అధికార తెరాసలో విలీనం కానుందో.. యెందుకు ఆకర్షణ కోల్పోయిందో ఆరా తీసాను! అదే సమయంలో తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి గల ఆకర్షణ శక్తులను యేకకాలంలో పరిశోధించాను!

‘మా నియోజక వర్గాల అభివృద్ధి మాకు ముఖ్యం..’, ‘మాకార్యకర్తల డిమాండు మేరకే మేం పార్టీ మారాం..!’, ‘ రాష్ట్రాన్ని బాగుచేసే సత్తా ముఖ్యమంత్రిగారికే వుంది..!’, ‘ఉన్న పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు..!’, ‘ పార్టీని వీడడం బాధగా వుంది.. కాని తప్పడం లేదు..!’, ‘రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో వుంచుకొని పార్టీ మారాం..!’, ‘మాపార్టీ నుండి చాలా మంది వొచ్చి చేరబోతున్నారు..!’ – అని పైకి చెప్పిన కారణాలూ…

‘మామీద కేసులు పెడుతున్నారు.. పాతకేసుల్ని తిరగదోడుతున్నారు..!’, ‘మాకు వొక్క కాంట్రాక్టు కూడా రానివ్వడంలా..!’, ‘మళ్ళీ అయిదేళ్ళ తరువాత మా పార్టీ అధికారంలోకి వొస్తుందన్న నమ్మకమూ లేదు..!’, ‘అధికారంలో లేకుండా కార్యకర్తలని పెంచి పోషించడం యెలాగ?’, ‘అధికారంలో లేకపోతే మమ్మల్ని జనం కూడా మరిచిపోతారు!’, ‘అధికారం లేకుండా అర నిముషం బతకడం కష్టమండీ..!’ – అని  పైకి చెప్పుకోలేని కారణాలూ…

ఈ ఆకర్షణ అనేది ఆదినుండీ వుందనీ, లోగడ రాజశేఖరమాత్యులవారు తెరాస నందు గల పదహారు మందిలో ఆరుగురిని లాగేసారని – సదరు తెరాస యిప్పుడు అదేపని చేసిందనీ.. ముగ్గురంటే ముగ్గుర్ని యిప్పటికి మిగిల్చిందని – తెరాసని తిట్టిపోసిన తెలుగుదేశం తెరాస అనుసరించిన దారినే స్పూర్తిగా పూర్తిగా అనుసరించిందని – అంచేత జంప్ జిలానీలతో జగన్ జగడమాడుటకు లేనే లేదని – తండ్రిగారు యిచ్చిన అధ్బుతమైన తర్ఫీదు కొడుక్కి ప్రాణసంకటాన్ని తెచ్చిపెట్టిందని – అనుభవాల అపహరణల సోదాహరణల ఫుట్ నోట్సులూ…

అన్ని అధ్యయన అంశాలనూ గమనించాను!

భూమికి ఆకర్షణ శక్తి వున్నప్పటికీ.. అది వొస్తువులకు మాత్రమే పరిమితం! భూమికంటే ఆకర్షించేవి కూడా వున్నాయి! అధికారపార్టీ ఆయస్కాంతము వంటిది! టోర్నడోలు అంత శక్తిమంతమైనది! అధికారంలేని ప్రజాప్రతినిధులు గాలివాటంగా వుండక తప్పదు! మనగలగక తప్పదు! లేదంటే యేటికి యెదురీదడమే! అమ్ముడుపోవుటకు అందుబాటులో వుండడంవల్ల ‘సంతలో పశువులు’గ  యీ ప్రజా ప్రతినిధులని కీర్తిస్తారు! వీరు అన్ని వేళలా అమ్ముడుపోవుటకు అత్యంత అనుకూలముగా వుందురని అర్థమయినది!

ఎన్నికలు ముగిసిన వెంటనే- ప్రతీ ప్రతిపక్షమూ ప్రతీ అధికారపక్షంలో విలీనము చేయుట యెంతో మంచిది! ఉత్తమం కూడానూ! ఆమాటకొస్తే పాలకపార్టీ సభ్యులందరూ వొకే పార్టీ సభ్యులు కానే కారు! అనేకానేక సమీకరణల వల్ల వేరు వేరు పార్టీలలో పోటీ చేయుట యెంత సహజమో.. గెలుపు గుర్రాలన్నీ వొకే చోట చేరడమూ అంతే సహజము! అధునాతన రసాయన సమ్మేళనము! ఆమాటకొస్తే అధికార పార్టీలో చేరకపోతే గెలిచినా వోడినట్లే! వోడినవాళ్ళు రేపటికో మాపటికో గెలవాలన్నా అధికారపార్టీ అండ వుండాల్సిందే!

ఏ విధముగా  చూసినా భూమికి మించిన ఆకర్షణ శక్తి అగుపించు చున్నది!

అధికారపార్టీ ఆకర్షణకు ప్రతిపక్షపార్టీ దూరంగా వుండి బతికి బట్టకట్టుట అసాధ్యము! అందువల్ల పాలక పక్షము ప్రతిపక్షము కలిసివుంటే కలదు సుఖము! పాలకపక్షమునకు ప్రతిపక్షపు తలనొప్పులు వుండవు! ప్రజల తలనొప్పులు ప్రజలు పడుదురు, అవి అత్యంత సహజమైనవి! అలాగే అధికారం వొచ్చునంతవరకూ ప్రతిపక్షములో వుండుట, ప్రతిపక్షమును నడుపుట బహుకష్టము! పాలకపక్షమూ ప్రతిపక్షమూ యేకపక్షమయినచో తిప్పలు, తలనొప్పులు తప్పును! ఎలక్షన్ల సమయంలో మాత్రమే యెవరి పార్టీ వారిది! ఎలక్షన్ల అనంతరం అన్ని పార్టీలు వొక్కటే! అందరి ద్యాసా భాషా ఘోషా వొక్కటే.. ప్రజాసేవ! ప్రజల అభివృద్ధి!

అధికారపార్టీ ఆకర్షించినంతగా భూమి కూడా ఆకర్షించలేదన్న సత్యాన్ని అనేకానేక ఆధారాలతో కనుగొన్నాను! సైన్సు సైన్సుగా వున్నప్పుడు ఫలితాలు వేరు! సైన్సు సోషల్ తో కలిసినప్పుడు వొచ్చే ఫలితాలు వేరు! అంచేత కొన్ని సవరణలు అవసరమని మీకు అర్థమయిందని నాకు అర్థమైనది!

మన్నింపులు కోరుతున్నాను!

యిట్లు

మీ

న్యూటన్

మీ మాటలు

 1. B. Narsan says:

  Good satire.

 2. చందు తులసి says:

  ఝళిపించారు కొరడా

 3. VASANTHRAO DESHPANDE says:

  ఈ ఫటాక రన్ రాజారన్ లా పేల లేదు. ఈ కుళ్లుకంపు రాజకీయాల మధ్యకు న్యూటన్న్ని అనవసరంగా లాగి నట్లనిపించింది. గతవారం రాసిన రన్రాజ రన్ సూపర్. రాస్తే ఆస్థాయిలో రాయండి …లేకపోతే ….

 4. buchireddy gangula says:

  పార్టీ లు మారడం —ఏళ్ళ తరబడి చూస్తున్న డ్రామా —
  పదవుల కోసం
  సంపాదన కోసం
  తిరిగి ఎన్నిక కావడం కోసం
  గుర్తింపుల కోసం ——————మారడం //// సేవ –అబివృద్ది అన్ని దొంగ మాటలు
  అమెరికా అయినా –అమలాపురం అయినా వారసత్వ రాజకీయాలు లే నిదేక్కడ ??

  రావు గారు — చక్కగా రాశారు

  రాస్తే అ స్థాయి లో రాయండి ?? లేకపోతే –???వసంతరావు మీరు అలా రాయడం సబబు
  ఏనా సర్>>>>>>>>>>>
  ———————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 5. Delhi (Devarakonda) Subrahmanyam says:

  మంచి వ్యంగ్యాత్మక రచన abhinandanalu

మీ మాటలు

*