‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

 

రమణ యడవల్లి 

~

ramanaమన్దేశంలో ఆనేక రంగాల్లో కృషి చేసిన (చేస్తున్న) వారికి ప్రభుత్వాలు పద్మ అవార్డులులిస్తాయి. సినిమా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డునిస్తాయి. ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్‌కి ఈ యేడాది ఫాల్కే అవార్డు లభించింది, అందుగ్గాను మనోజ్ కుమార్‌కి అభినందనలు. గత కొన్నేళ్లుగా ఈ అవార్డులు అనేవి ప్రతిభకి చిహ్నంగా కాకుండా పలుకుబడికి నిదర్శనంగా మారిపొయ్యాయి. ఇందుగ్గానూ ప్రజలు మిక్కిలి చింతించి ఈ అవార్డుల గూర్చి పట్టించుకోవడం మానేశారు.

సినిమా వాళ్లకి ఒక ప్రత్యేకత వుంది. డాక్టర్లు స్పెషాలిటీ కోర్సులు చదువుకుని స్పెషలిస్టులు అవుతారు. సినిమావాళ్ళకి అలా కోర్సులేమీ వుండవు కానీ, వారు ఒకే మూసలో సినిమాలు తీసి స్పెషలిస్టులు అవుతారు. పౌరాణిక జానపదాలు, భక్తి సినిమాలు, ఫైటింగు సినిమాలు, ప్రేమ సినిమాలు, హాస్య సినిమాలు, బూతు సినిమాలు.. ఒక్కొక్కళ్ళది ఒక్కో స్పెషాలిటీ. అలాగే మనోజ్ కుమార్ స్పెషాలిటీ దేశభక్తి!

షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్.. మనోజ్ కుమార్ ఇలా అనేక దేశభక్తి సినిమాలు తీశాడు, విజయాలు సాధించాడు. అందుకే అభిమానులు ఆయన్ని ‘భారత్ కుమార్’ అని పిలిచుకున్నారు. మా మేనమామ ఒకాయనకి సినిమాల పిచ్చి. వరసపెట్టి సినిమాలు చూసీచూసీ సినీ పండితుడైపొయ్యాడు. మనోజ్ కుమార్ తన కెరీర్ అంతా ఒకటే ఎక్స్పెషన్‌తో లాగించేశాడనీ, ఆ వొక్కటైనా దిలీప్ కుమార్ దగ్గర అరువు తెచ్చుకున్నదనీ చెబుతుండేవాడు. నాకైతే నిజానిజాలు తెలీదు.

ఇవ్వాళంటే ‘మేం స్వచ్చమైన దేశభక్తులం’ అని మన శీలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం యేర్పడింది గానీ – నా చిన్నతనంలో ఈ సమస్య లేదు. ఆగస్టు పదిహేనో తారీకున ఒక స్వతంత్ర సమర యోధుడితో స్కూల్లో జాతీయ జెండా ఎగరేయించేవాళ్ళు, బిస్కట్లు పంచేవాళ్ళు. చాలా సినిమాల్లో యేదోక సందర్భంలో ఒక దేశభక్తి పాట వుండేది. ఆ పాటలో కనిపించే గాంధీ తాత, నెహ్రూ చాచా క్లిప్పింగులకి చప్పట్లు కొట్టేవాణ్ని. సినిమా అయిపొయ్యాక తెరమీద ‘జనగణమన’ వేసేవాళ్ళు, చివర్లో ‘జైహింద్’ అంటూ సెల్యూట్ చేసేవాణ్ని. ఈ విధమైన నా దేశభక్తికి నేను చాలా సంతోషించేవాణ్ని.

 ఎందుకంటే – నాకు తెలిసిన చాలామందికి నా మాత్రం దేశభక్తి కూడా వుండేది కాదు! పదో క్లాసు తప్పి పెళ్లి కోసం ఎదురు చూసే అక్కా, ‘ఫలానా ముండమోసినావిడ (సిగ్గు లేకుండా) ఫలానా వాడితో యికయికలు, పకపకలు’ అనే వార్తల్ని అందించే మా రంగమ్మత్తా, ఉద్యోగం కోసం తిరిగి తిరిగి బక్కచిక్కిన మా సూరిమామా – వీళ్ళెవరూ యేనాడూ దేశభక్తి గూర్చి మాట్లాడిన గుర్తులేదు. అంతేనా? సోడాబండి తిరుపాలు, పాచిపని చేసే బతకమ్మ, పాకీపని చేసే పుల్లాయ్ గాడు.. వీళ్ళందరికీ దేశభక్తి సంగతి అటుంచండి, కనీసం దేశం అంటే ఏంటో తెలీదని నాకు తెలుసు.

స్కూల్లో సైన్స్ టీచర్ గారు – మనం భారద్దేశంలో పుట్టినందుకు తీవ్రంగా గర్వించాలనీ, మనమందరం భారతమాత సేవలో తరించిపోవాలనీ గంభీరంగా చెప్పేవారు. మన ఉన్నతిని వోర్వలేని పాకిస్తాన్ సాయిబులూ, చైనా కమ్యూనిస్టులూ మన్దేశాన్ని కబళించడానికి నిరంతరం కుట్రలూ, కుతంత్రాలు పన్నుతున్నారని కూడా చెప్పేవారు. ఆయన చెప్పింది సరీగ్గా అర్ధం కాకపోయినా.. ప్రపంచ దేశాల్లో మన భారద్దేశ సంస్కృతి మాత్రమే పవిత్రమైనదీ, గొప్పదీ అనీ.. మిగిలిన దేశాలన్నీ భ్రష్ట సంస్కృతికి, దుర్మార్గాలకీ మాత్రమే నిలయమన్న సంగతి నాకు బాగా గుర్తుండిపోయింది.

దేశభక్తి విషయాల్లో మా సుబ్బు వాదన వేరుగా వుంటుంది. ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ తన అమూల్యమైన అభిప్రాయాల్ని అలవోకగా చెబుతుంటాడు.

“యే దేశంలోనైనా ‘దేశభక్తి’ అనేది రాజకీయ పార్టీల నినాదం మాత్రమే. ఈ నినాదం ఆయా రాజకీయ పార్టీల మెరుగైన భవిష్యత్తు కోసమే గానీ సామాన్య మానవుడి భవిష్యత్తు మెరుగు పడేందుకు మాత్రం కాదు. యే దేశచరిత్రలోనైనా ‘దేశభక్తి’ అనే భావన అణగారిన వర్గాల కష్టాలు కడగళ్ళు తీర్చినట్లుగా గానీ, సామాన్య మానవుడి జీవన స్థితిగతులు మెరుగు పరచినట్లుగా గానీ ఋజువుల్లేవు.” అంటాడు మా సుబ్బు.

“గురజాడ గారు ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్నారు. మనం, మన తోటి మనుషులు – అందరం ఈ దేశంలో భాగమే కదా! మరప్పుడు ఒక దేశపౌరుడు ఇంకో దేశపౌరుణ్ని మోసం చెయ్యకూడదు. భారతీయ పోలీసులు భారతీయ నిందితుల్ని లాకప్ డెత్ చెయ్యకూడదు, భారతీయ అగ్రకులాలు భారతీయ దళితుల్ని హీనంగా చూడకూడదు, భారతీయ సైనికులు భారతీయ ఆదివాసీల అణచివేతకి పాల్పడకూడదు. మరి – ఇవన్నీ జరుగుతున్నయ్యా?” అంటూ ప్రశ్నిస్తాడు మా సుబ్బు.

“గురజాడ వారే ‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా!’ అని చెప్పారు. అయితే వాస్తవానికి ఈ సూక్తి ఎవరికి వర్తిస్తుంది? ప్రజల్ని నిలువునా ముంచేస్తున్న రాజకీయ నాయకులకి వర్తిస్తుంది, పబ్లిక్ బ్యాంకుల్ని పబ్లిగ్గా దివాళా తీయిస్తున్న కార్పోరేట్ సంస్థలకి వర్తిస్తుంది. కానీ ఈ ఉన్నత వర్గాల వారే స్వతంత్ర దినం నాడు భారతమాత విగ్రహానికి దండేసి, జాతీయ జెండాకి దణ్ణం పెట్టి దేశభక్తులైపోతారు! దేశభక్తి గూర్చి ఉపన్యాసాలు దంచుతారు.” అంటూ నవ్వుతాడు మా సుబ్బు.

“ఒక దేశానికి అన్నిరకాల వృత్తులూ అవసరం. కర్షకులు, కార్మికులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పారిశుధ్య పనివారు, సైనికులు.. ఇలా అనేకమంది కలిస్తే గానీ ‘దేశం’ అనే బండి నడవదు. వీరిలో యే ఒక్కరూ ఇంకొకరికన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. పొలం దున్నుతూ పాము కరిచి చనిపొయ్యే రైతూ, ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో చనిపోయ్యే కార్మికుడూ, రోగి నుండి సంక్రమించిన ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయ్యే వైద్యుడూ, మేన్‌హోల్లో కుళ్ళు కంపుకి ఊపిరాడక చనిపోయ్యే పారిశుధ్య కార్మికుడూ, సరిహద్దులో శత్రువు దాడికి చనిపోయ్యే సైనికుడూ.. అందరూ సమానంగా అమరులే (దీని అర్ధం యేమైనప్పటికీ)!” అంటూ బల్ల గుద్దుతాడు మా సుబ్బు.

ప్రస్తుతం దేశ పరిస్థితులు బాగాలేవు. దేశభక్తి టాపిక్ చాలా కాంప్లికేట్ అయిపొయింది. ఏదైనా కొంచెం అటూఇటుగా మాట్లాడితే దేశద్రోహులం అయిపొయ్యే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మా సుబ్బు అభిప్రాయాల్తో నాకస్సలు సంబంధం లేదని విన్నవించుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు కొండ వెంకటప్పయ్యగారికి ‘దేశభక్త’ అనే టైటిల్ వుంది. వెంకటప్పయ్యగారి ‘దేశభక్త’ టైటిల్ సినిమావాళ్ళల్లో ఎవరికైనా యివ్వాలంటే మన మనోజ్ కుమార్‌ని మించిన యోగ్యుడు లేడని నా అభిప్రాయం.

చివరగా –

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ‘దేశభక్త’ మనోజ్ కుమార్‌కి అభినందనలు!

*

మీ మాటలు

  1. chandrika says:

    ఫిల్టర్ కాఫీ చప్పరిస్తూ అన్ని బానే చెప్పాడు మీ సుబ్బు. విశ్వవిద్యాలయాల్లో, దేశప్రజ పన్నులు కట్టిన డబ్బులతో చదువుకునే విద్యార్థుల కి ఉండవలిసిన కనీసపు లక్షణాలు తప్ప!! ఏ భస్మాసుర హస్తమో నెత్తిన పడ్డ రోజున అలవోకగా చెప్పే ఈ అమూల్యమైన అభిప్రాయాలు, ఫిల్టర్ కాఫీ చప్పరించడం అన్ని ఆగిపోతాయి పాపం!!

  2. THIRUPALU says:

    బాగుంది ! మీ సుబ్బు తో మీరు ఏకీభవించట్లేదు ! అంత వరకు జాగ్రత్త గా ఉన్నట్లే లెక్క ? దేశ భక్తీ ! దేశ భక్తీ ! అని అరిగి పోయిన రికార్డులా తెగ వినిపిస్తుంది ఈ మధ్య. అంటే ఏమిటీ? మన ఊల్లో మన ఉండటం దేశ భక్తీ కాదా? మనమేమన్న పొరుగు దేశాల్లో లావా దేవీలు పెట్టుకున్నామా? వ్యాపారం చేసే వాల్లే ఆలాంటివి పెట్టుకుంటారు గానీ !
    మీరు గురజాడను గారిని గుర్తు జేశారు బావుంది. పాపం ఆయన ” మతములన్నియు మాసి పోవును జ్ఞానమొక్కటే నిలిచి ఉండును” అన్నాట. అందుకు మీ బోటి పెత్తందారి ఎవరో ‘ వీడు మత వ్యతి రికి వాణ్ణి బొక్కలో తోయండి అన్నాటా .

  3. chandolu chandrasekhar says:

    చంద్రిక గారు అవహేళన కాదు , డిస్కస్ చేయండి . దేశభక్తి ని ఎవరు కాదనరు . అల్లూరి ,భగత్ సింగ్ వీరందరూ దేశభక్తులే . ఈ దేశం నుండి బ్రిటిష్ సామ్రాజాన్ని పారదోలటానికి ప్రయత్నం చేసిన ప్రతివాళ్ళు దేశ భక్తు లే .కాని ఈ వాదాన్ని రాజకీయ పార్టీ లతో ముడిపెట్టకండి .విశ్వ విద్యాలయాలు ప్రజల రెక్కల కష్టంతో కట్టబడ్డై , మట్టి చేతులు నిన్ను మేధావి గా మలిస్తే నువ్వు ఎవరి వైపు నిలబడతావో తెలుచుకో .ఎగతాళి మాటలు కాదు సీరియస్ గా చర్చ చేయండి .ఈ దేశ ప్రజల వైపు నిలబడటం మే దేశభక్తి ని అవహేళన చేయటం హినమే .

    • Chandrika says:

      వేళాకోళం మీకెంత విసుగు గా అనిపిస్తోందో నాకు అంటే చిరాకనిపిస్తున్నది. ఉగ్రవాదం విసిరిన పంజా లో క్షతగాత్రుల కథలు వారి నోటి నుంచీ విని ఉంటే ఈ విధ్యార్థులని సమర్థించరు. అటువంటి వారి కథలు విని ఉన్న నాకు, ఇలా కాఫీలు చప్పరిస్తూ కులాసాగా కబుర్లు చెప్పేవారంటే చిరాకు. ఇందులో చర్చ చేయాల్సిందేమీ ఉంది? ఇంకొకరి జీవితాలు మీ లాంటి వారికి కాలక్షేపం. నాకు కాదు.

  4. chandrika says:

    దేశ భక్తి గురించి నేనేమీ మాట్లడ లేదే. సుబ్బు గారు దేశ భక్తుల గురించే మాట్లాడారు కొన్ని విషయాలు మర్చిపొయారేమో అని. వెటకారం ఎవరిది రచయిత దా వ్యాఖ్య చేసిన నాదా?

  5. రవి బడుగు says:

    దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా దేశభక్తికి ఇస్తారన్నమాట..!

  6. chandolu chandrasekhar says:

    చంద్రిక గారు ,muslim communalism is in its nature as bad as hindu communalism ,and even be stronger among muslim than its counterpart within the majority –nehru .మతొఉన్మాదమ్ ఏదైనా , హర్షనియం కాదు .తరాల నుండి దళితులు అవమానాలకి గురైన దేశ వ్యతిరేక చర్యలు చేయలేదు.. ఎ ప్రార్దన మందిరాలలో బాంబులు పెట్టిన చరిత్ర లేదు . ఇంకో దేశానికి చెయెత్తిన చరిత్ర లేదు , ఈ దేశం వాళ్ళది దీనికి కోసం ప్రాణాలు ఇస్తున్న ,ఇచ్చిన చరిత్ర వాళ్ళది .ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్య కోసం ,secular system పోరాటం చేసిన వాళ్ళు ,వాళ్ళని మతాల రొంపి లోనికి లాగకండి .

  7. తను రాసిన ఇన్ని పోష్టులలో ప్రతిచోటా ఎంతో నిష్ఠగా “మందేశం”,”భారద్దేశం” అని తప్ప ఏనాడూ “మన దేశం”,”భారత దేశం” అని రాయలేని వ్యక్తిలో మనోజ్ కుమారర్ అను దేశభక్తుడికి అవార్డు ఇస్తే ఆనందించేటంత దేశభక్తి ఉందంటే చాలా హాశ్చెర్యంగా ఉందిస్మీ?!

    • విన్నకోట నరసింహారావు says:

      హరిబాబు గారూ….హరిబాబు గారూ….., Let bygones be bygones మాస్టారూ. అదీగాక స్పెల్లింగ్స్ విభిన్నంగా వ్రాసేవారికి కూడా దేశభక్తి ఉండచ్చుగా, ఆశ్చర్యమేముంది.

      • అప్పటికే జిలేబీ ఒక పోష్టు వేసి ఎన్నో జోకులు వేసింది.నేను కామెటు వేసిన చోట కూడా నాకన్నా ముందు ఇంకో ఇద్దరు కూడా జోకులు వేశారు.అకానీ అదే ఫ్లోలో జోకేసిన నామీద మాత్రం ఎంత విషం కక్కాడు?

        అదీ,అంతకౌ కొద్ది రోజుల ముందే,”నేను మొదట వాడిన మాట కన్నా కామెంటులో మీరు వాడిన మాటే బాగుంది” అని పోష్టులో కూడా మార్చిన మనిషి అంత భీకరంగా రెచ్చిపోవడం?!

        నేను నా జీవితంలో చెయ్యని తప్పుకి నమస్కారం చెప్ప్పి క్షమాపణ చెప్పింది ఈ పెద్దమనిషికే!అయినా పూచీక్పుల్ల కింద తీసేశాడు – నేనిందుకు పోనివ్వాలి?

  8. శ్రీనివాసుడు says:

    ’’జంబూ‘‘,
    – ‘‘వై జియా?’’
    ‘‘పాండవులు అస్మదీయులు, అంటే, మనవాళ్ళు. ఊ… చెప్పు‘‘
    – ’’ప…అ..అ….ఆండవులు అసమదీయులు‘‘.
    ’’అసమ‘ కాదు ‘అస్మ, అస్మ‘ అనాలి‘‘.
    – ’’అసమ కాదు. అసమ… అసమ అనాలి‘‘.
    ’’వీడు నాకే విద్య నేర్పుతున్నాడు నాయకా.. ‘అస్మ‘ అనమనండి‘‘.
    – ‘‘హిహిహీ.. ఎందుకు? ఆ మాటతో మనవాళ్ళని తెలుసుకుంటాం నాయకా?‘‘.
    ‘‘చాలు….. చిన్నమయా!.పాండిత్యము కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వీరతాడు‘‘
    ’’ఆఁ.. వేయ్…,.. ఒరేయ్ లంబూ, పాండవులు అస్మదీయులు. మరి, వారి విరోధులు కౌరవులని ఏమనాలో చెప్పు‘‘
    – ’’తసమదీయులు… తసమదీయులు… తసమదీయులు‘‘
    ‘‘హోరి, నీ తెలివీ, నువ్వూ! అస్మదీయులకు విరోధులు తస్మదీయులని వీడు పుట్టించాడు ప్రభూ!‘‘
    ‘‘అవునవును. ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి. వేయ్… వీడికి రెండు…‘‘

Leave a Reply to విన్నకోట నరసింహారావు Cancel reply

*