కాలాంతరజీవి ఆత్మ సంభాషణ..

 

 

సమకాలీనంగా వస్తున్న కవిత్వంతో పోలిస్తే బొమ్మలబాయిలోని సిద్ధార్థ కవిత్వం విలక్షణమైంది. దానికి కారణం సమకాలీన వైఖరికి భిన్నంగా కవిత్వాన్ని చెప్పేందుకు ఆయన ఎంచుకున్న తీరు. దానికి మూలమైన జీవితం. ప్రధానంగా ఈ రెండు అంశాలను ప్రోది చేసుకున్న ఒకానొక సాంస్కృతిక క్షేత్రం. ఒక జీవితాన్ని సిద్ధాంత సారంగా తీసుకుని వ్యక్తం చేయడానికి,కొన్ని అస్తిత్వ కోణాలను ఆశ్రయించి వ్యక్తం చేయడానికి, జీవితం లోని అణువణువుణు తనలో సంలీనం చేసుకుని ఆయా ఆత్మలతో , ఆ గొంతుకలతో వ్యక్తం చేయడానికి మధ్య వైరుధ్యాలున్నాయి. సిద్ధార్థచేస్తున్నది మూడవ వైపు పద్ధతి. ఒక వర్గపు జీవితాన్ని వ్యక్తం చేయడంలా కనిపించడం వల్ల కొన్ని అస్తిత్వ రూపాలు,ఆ అస్తిత్వ రూపాలను ఆనుకొని చెప్పడం వల్ల సిద్ధాంతాలు కనిపించినా ప్రధానంగా వ్యక్తమౌతున్నది ఇదే. బహుశః సిద్ధార్థ తానుంటున్న కాలాన్ని త్యజించి,ఇంకా చెబితే తనను కూడా త్యజించి కొన్ని జీవితాలను తనలోకి అవలోఢనం చేసుకుని ఒక ఆధునిక దృష్టి నిండిన వచనంతో వ్యక్త మౌతున్నారు.

1
ప్రాకృతంలో “లీలావతీ కథ”ఉంది.అందులో నాయిక ఒక మాటంటుంది.
భణీయంచ పీయతమాయే పియయమ ! కిం తేణ సద్ద సత్థేణ!జేణ సుహాసి మగ్గో భగ్గో అమ్మారిజణస్స,ఉవలబ్బయి జేణ పుఢం అత్థో కయిత్థి ఏణ హయ యేణ,సో చేయ పరో సద్దో ఇఠో కిం  

 లఖ్ఖ ణేణమ్హా?”

(చెప్పు ప్రియతమా !నీశబ్దశాస్త్రం తో పనేముంది.దేనివల్ల అర్థం విష్దం గానూ,దాపరికం లేకేని హృదయాలతో వ్యక్తం అవుతుందో-అదే మాపాలిటి శబ్దం.ఇంకా ఈ శబ్ద శాస్త్రాలతో పనే ముంది.”)

సిద్ధార్థ ఉపయోగించుకుంటున్న భాష ఒక ప్రధాన పరికరం.లక్షణేతరమైన ప్రజామూలం లోని భాషను ఆయన ఉపయోగిస్తున్నారు.ఈ భాష లక్షణేతరమైన మూలద్రవ్యం.వాక్యాలు చాలా పొట్టిగా ఉండటం.పునరుక్తి ఎక్కువగా ఉండటం.ఇవన్నీ ఆనాటి లక్షణాలే.
మల్ల మాపోచారం కుంతలమ్మ గునిగే/అంగజపు మొక్కయ్యిందీ-(పే.69)
పానం బోన మెత్తాలె/తానం జేయించాలే//దొమ్మీకి ముందు గూల్చిన ఇండ్లను జూడు/పగులగొట్టిన బండ మైసమ్మగుండ్లను ను జూడు/గుంబజ్ను జూడు“-(పే.70)
ఉదాహరణలను ఎత్తిపోయాలనుకుంటే ప్రతీవాక్యంలో ఈ దేశీ మెరుపులున్నాయి. ఒక కోణంలో తనుగా వాడుకున్న భాష ఆపాదమస్తకం దేశీలానే కనిపిస్తుంది. జీవితమూ దేశీనే.ప్రాకృత శబ్దానుశాసన వృత్తిలో త్రివిక్రముని అభిప్రాయాన్ని గానీ,దేశీ నామ మాలలోదిగా చెప్పబడే హేమచంద్రుని వాక్యాన్ని పరిశీస్తే ఈ విషయం అర్థ మవుతుంది.-“దేస విదేస పసిది /భణ్ణా మాణా అనంతయా హుంతి/తమ్హా అదాఇ పా ఇతి/పయట్టభాసా విసేస దేసీ“-(దేశ విదేశప్రసిద్ధమైన భాషలు ఎన్నో ఉంటాయి. అనాది ప్రకృతి ప్రవృత్తమే దేశీ)

sidha

సిద్ధార్థలో కనిపించే పదాల్లో దేశీపదాలు ఎక్కువ. ప్రకృతిగతంగా రూపొందించిన పదాలనిర్మాణం ఎక్కువ.ఒక్కోసారి ఈ విషయాలను తానుగా చెప్పిన సందర్భాలూ లేకపోలేదు

పాదాపాదాలు లక్షలు/అదుముకుంటూ తొక్కుకుంటూ/భాషనంతా దులుపుకుంటున్నాను/అతివాస్తవ కాంతిలో జాతరలూగుతున్నాను//అంతటా /నేనొఖ్ఖ ఇద్దరినే కొంత వేల యుగాల దాన్ని/ముడు వేసుకుంటున్నాను జన్మాంగాల్ని/శివసత్తునంటు“(పే.84)

తాను కోరుకుంటున్న భాష ఎక్కడ వుందో సిద్ధార్థకు తెలుసు.దానిజాడనూ తానే చెప్పిన సందర్భాలూ లేకపోలేదు.

కుతి..కుతి..రాతల కుతి/లేని వచనంలో /నేనులేని కథనంలో వాంతి/గోడలింకా రంగుల్లో రెపరెపలాడుతున్నాయ్/తాకగానే మొలుస్తున్నాయ్/ఇంటెనకాలకి పో్ంర్రి బిడ్డా/పిలగాండ్ల దగ్గరికి పో్ంర్రి/పొద్దుగూకినాంక తారాడే ఆడోల్ల/ముచ్చట్ల దగ్గరికి పో్ంర్రి“-(పే.38)

 

అచ్చమైన ప్రకృతిగతమైన భాష,అమ్మభాష అక్కడే దొరుకుతుంది. ఈ వాక్యాన్ని చూసినపుడు ప్రాచీన జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలో రాయడం ,ఆసందర్భంలో ఒక జైన ముని చెప్పిన వాక్యం గుర్తుకొస్తుంది. అందులోనూ స్త్రీలు,పిల్లలు ఉదహరింపబడటం కాకతాళీయం కాదేమో.

మత్తూణ దిట్ఠి వాయుం కాలీయ ఉక్కలియంగ సిద్ధంతం

థీభాలవా యణత్తం పాయియ మయియం జీవరేయిం

(దృష్టి వాదాన్ని వదిలేసి కాలిక -ఉక్కాలికాంగ సిద్ధాంతాలు స్త్రీలు,పిల్లలు చదివే నిమిత్తం జైనాచార్యులు ప్రాకృతంలోనే చెప్పారు)

నిజానికి ప్రాకృత కాలానికి కథల్లో పురుష సంబంధం లేదు. ఆనాటి కథలను మానుషీ కథ,దివ్య మానుషీ కథ,దివ్యకథ అనే విభజన కనిపిస్తుంది. మానుషీ అనే స్త్రీ వాచకమే కాదు చెప్పుకున్న కథలు కూడా ఇలాంటివే.మళ్ళీ లీలావతీ కథలోకే వెళ్లొద్దాం

ఏమేయ సుదజుయ ఇమ్మణోహరం పాయియాయి భాసాయే

పవిరళదేసిసులఖ్ఖం కహసు దివ్వమాణుసియం

(పరిశుభ్రమైన విప్పారిన హృదయం గల ఇంపైన కథను విస్తారంగా దేశీమార్గంలో ఒప్పేటట్టు.దివ్య మానుషిలకు చెందే టట్టు చెప్పు)

సిద్ధార్థ చెబుతున్న కవిత్వం కూడా ఈ దివ్య మానుషులకు చెందిందే. “ఆదివాసీ -సంచారదేవతా”-(పే.85),”సంగెం-(పే.39)”మొసాంబ్రం”-(పే.37)”పదసమ్మర్థం”-(పే.33)”లోరీ-దఖ్ఖనీ జోలకథ”-(పే.23)ఇలాంటి కవితలు ఎన్నో ఈ స్పృహకు,అందులోని జీవితానికి నిదర్శనాలుగా ఉంటాయి.

పెద్దపిన్నమ్మలను/చిన్న పిన్నమ్మలను/మేల్పిన్నమ్మలను /పాలిబెట్టి సాకవోసి/బొందలకాడ దీపాలను బెట్టి/పూజలర్పించినాము“(పే.75)

ఎలిసిపోయిండ్రమ్మామ్మలక్కలు/చిలుమెక్కింది బలగమంతా/తోపులబట్టీ..లోయతిరాజమ్మా../ఏడున్నరే.. తోడుకోరేందే..”

దఖ్ఖనీ పీఠమంతా/బొమ్మలబాయిగదనే..చిన్నీ..పెద్దక్కా/దీని కిటికీ తెరుసుకోవాలె/కొత్తగాలి వీయాలె../తాటాకమ్మ చిగురించాలె“-(పే.191/192)

‘నా సమస్త జాతుల పెనురక్త చాపమే ఈ కవిత్వం”ఆ రక్త స్పర్శలో తనలో కలిసిన బొమ్మల ఉనికే సిద్ధార్థ కవిత్వం.  ఇలా సిద్ధార్థ కవిత్వంలో కొన్ని వేల సంవత్సరాల జీవితముంది. లోకముంది.. ఆధునికతదాకా,నాగరికత దాకా పెనుగులాడిన దుఃఖ సంవేదనుంది. ఈ క్రమంలో సిద్ధార్థలో అనాదినుండి ప్రపంచీకరణదాకా తనను తాను కోల్పోయిన అంశాలు కనిపిస్తాయి.

 

2

ఒక అనాది కాలానికే పరిమితమైతే సిద్ధార్థ కవిత కొంత వెనకబడేది. జీవితాన్ని, కోల్పోయినదాన్ని వెదుక్కునే విషయంలో ఎంత అనాది కాలానికి,పురా జ్ఞాపకాలకు వెళ్లారో,అంతే నిక్కచ్చిగా అత్యంత ఆధునికుడుగా కూడా నిలబడ్దారు.దీన్ని ఆయన కవిత్వీకరించిన తీరు,వ్యక్తికరణ మార్గాలు చెబుతాయి.మనోవైజ్ఞానిక శాస్త్రంలో టోల్  మన్ సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రాన్ని(Cognitive psychology)ని పరిచయం చేసాడు.ఇది సంవేదన,ఆలోచన,ప్రత్యక్ష్యం,జ్ఞాపకంలాంటి అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.ఈసిద్ధాంతం ప్రవర్తనను వివరించడంలో కేంద్రప్రక్రియలకు (Central processes)ప్రాముఖ్యతనిచ్చే సామాన్య అభివిన్యాసం(Orientation)ను చర్చించింది.తనలో ని ఆలోచనను సంవేదనను,ఉద్వేగాన్ని వ్యక్తం చేసేందుకు సిద్ధార్థ ఎన్నుకున్న కొన్ని మార్గాలు ఉన్నాయి.అయనకుండే కళాత్మకదర్శనం(Aesthetic Perspective),నాటకీయ స్వగతం (Dramatic monologue),వాక్యాలను తీర్చి దిద్దే తీరు(Verse design)గమనించదగ్గవి. యాకోబ్‌సన్(Roman jokobson)కవిత్వభాషను అధిభాష(Meta lingual)అన్నాడు.సిద్ధార్థలో అనేకకాలాలను ముడివేసే ఒక అధిభాష ఉంది.ఇందులో మూడు భాగాలను ఉరామరికగా గుర్తుంచవచ్చు.1.తాను చెప్పాలనుకున్న సాంస్కృతిక క్షేత్రాన్ని ప్రసారం చేసేభాష.పైన చెప్పుకున్న దేశీ పదజాలం ఇలాంటిదే.2.నాటకీయ మైన సంభాషణ;సంవేదనను చెప్పడానికి ఆ ఉద్వేగాన్ని ప్రసారం చేయడానికి ఒక నిర్దిష్ట నాటకీయభాషను సిద్ధార్థ వాడుకుంటారు.ఒక ఊహాహాత్మక పాత్రను దృష్టిలో ఉంచుకుని మాట్లాడటం,ఆకస్మిక ప్రారంభం(Abrupt beginning)అనేకమైన సంబోధనలను చేర్చి చెప్పటం. అనేక భాషలకు హింది,ఉర్దూ,తెలుగు,ఒక్కోసారి సంస్కృతం మొదలైన పదాలను గంభీరత కోసం చెప్పడం ఇవన్నీ అలాంటివి.3.కళాత్మకత అందమైన పద చిత్రాలను,భావ చిత్రాలను నిర్మించడం.వీల్ రైట్ కవితా భాషను బిగుతైన  భాష(Tensive language)అన్నాడు. అనేకాకోణాలలో భాష కుండే శక్తి సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోవడం వల్ల ఈ కవిత్వంలో ఆ బిగువు కనిపిస్తుంది.

 

స్నిగ్ధ శీతలంగా/స్పర్శాపూరితంగా /మాట్లాడాలనే ఉంది“-(పే.106)

చెకుముకి వానా కమ్మిందిక/వొక్కపాటనొక్కిన జలదరింపులో/చాల్చాలు నిలబడలేను“-(పే.133)

లేత జాబిలి కిటికీ వెనుక అతని గుసగుసలేనా-(పే.159)

ఇలాంటి వాక్యాలన్నీ ఆకస్మికంగా ఎలాంటిప్రతిపాదనలు లేకుండా ప్రారంభమవుతాయి…ప్రారంభానికి ముందే గతాన్ని ధరించడం,ఆగతం తాలుకు ఆవేశ సంవేదనలను ప్రసారం చేయడం ఆకస్మికతకు నిదర్శనం.ఈ వాక్యాలు ఎంత ఆకస్మికాలో అంతే కళాత్మకాలు కూడా.వాక్యాల్లో ధ్వనించే గంభీర్యత,దాని తాలూకు రూపాన్ని మోసే పదాలు ఇందులో కనిపిస్తాయి.

సిద్ధార్థ వచనంలో ఎక్కువగా నాటకీయ సాంద్రతను కూర్చేది అనుకరణ(Mimeses)..సాధారణంగా సంభాషణకు నాటకీయ సంభాషణకు ఇక్కడే తేడా కనిపిస్తుంది.

 

అల్లా అలలల్లా..లల్లా/రావేయమ్మా“-(పే.85)

ల్లొల్లొల్లొల్లొల్లో..అంటూ/పాటలు పాడాము“-(పే.75)

ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం/ఢిల్లం భల్లం“-(పే.64)

అన్ని పురుగులు నేనే నేన్నేన్నేన్నేనే..-(పే.24)

 

అనుకరణల్లో అంతర్గతవచనం ఎక్కువ.అందులోనూ అనిర్దిష్టత కొన్నీటీలో కనిపిస్తుంది.పై శబ్దాల్లో చివరిదాంట్లో ఉద్వేగ సంబంధమైన మానసిక ప్రకంపనలు(psychic vibrations)కనిపిస్తాయి.మిగతావాక్యాలు కూడా ధ్వనిగతంగా అనుకరణలా,ఉపయోగ గతంగా నాటకీయంగా కనిపిస్తాయి. నిజానికి ఈవాక్యాలను చూస్తే నాటకాల్లో వచనశైలి(Diction)లో చెప్పే Imply Attitude(సూచనా ప్రవర్తన..?అనవచ్చేమో..?)కు సమాంతరంగా కనిపిఒస్తుంది..తన స్థితిని,అనుభవాన్ని.వ్యక్తం చేయడానికి సిద్ధార్థ ఇలాంటి నాటకీయ పద్ధతులను బాగావాడుకుంటారు.నాటక విమర్శ “డిక్షన్”లో Revel character(ప్రకటనాపాత్ర)Convey action (ప్రసార చేష్ట) Identify Themes(గుర్తింపు ప్రసంగాలు)లాంటివాటిని గమనిస్తుంది.

సిద్ధార్థ (సుమారుగా)ప్రతీకవితలో తనదైన వర్గాన్ని పాత్రను గుర్తించే సంబోధనలు చెప్పడం..ఆ మాధ్యమంలో చేష్టలు(Gesture) చేయడం..”పసుపు పూసిన గుండ్లు”లాంటి సంకేతాలనివ్వడం మొదలైన వన్నీ నాటకీయతను పట్టుకొని చూపుతాయి..ఒక దశలో ఈ వాక్యాలన్నీ దృశ్యాన్ని (అందులోని రస స్థితి ని)ప్రసారం చేస్తాయి.ప్రధానంగా తనతో తాను ,తన వర్గంతో తానుగా మాట్లాడుకుంటున్నట్టుగా ఉండే ఏకాత్మ సంభాషణ/ఏ కాంత సంభాషణ..అనేక కవితల్లో కనిపిస్తుంది.జర్మన్ నవలా రచయిత ఫ్రైటగ్ (Gustav Freytag)నాటకంలోని అంశాల నిర్మాణాన్ని ఒక పిరమిడ్ ద్వారా సూచించాడు.బొమ్మల బాయిలోని కవితల్లోకూడా ఒక వ్యాఖ్యానం తో మొదలయి కొన్ని అంశాలను ముడి వేయటం లాంటి చేష్ట(Gesture)లను అనుసరించి ఈ లక్షణాలను  విశ్లెషించుకోవచ్చు..

దళిత, బహుజన, ఆదివాసీ జీవితాలను దీనికి ప్రాదేశికంగా తెలంగాణాను ,దాని ఉద్వేగాన్నీ,రూపంగా ఆధునిక కవితానిర్మాణాలను,శిల్పంలో నాటకీయతను ,ప్రసరణ రూపంగా వేదాంతం ధ్వనించే బైరాగుల తత్వ జిజ్ఞాసను పొదవిపట్టుకున్న కవిత సిద్ధార్థ బొమ్మలబాయి.ఇది ఒక కాలాంతరజీవినిశ్చల తపస్సులోని ఆత్మసంభాషణ.

*

 

మీ మాటలు

 1. renuka ayola says:

  .3.కళాత్మకత అందమైన పద చిత్రాలను,భావ చిత్రాలను నిర్మించడం.వీల్ రైట్ కవితా భాషను బిగుతైన భాష(Tensive language)అన్నాడు. అనేకాకోణాలలో భాష కుండే శక్తి సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోవడం వల్ల ఈ కవిత్వంలో ఆ బిగువు కనిపిస్తుంది.,
  అంటూ బొమ్మల బాయి గురించి అద్భుతమైన విశ్లేషణ అందించిన శర్మగారి శ్రమ
  గురించి ,కవిత్వమీద వున్న అభిమానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే ….
  ధన్యవాదాలు చెప్పడం రొటీన్ మాట అయిన చెప్తున్నాను …..

  • siddhartha kavivaaggeya says:

   నారాయణ శర్మ గారు మీ
   వ్యాసం చదివి ఎంతో ఆనందానికీ,ఉద్వేగానికీ,
   గొప్ప
   వచనానుభవానికి లోనయ్యాను
   .బొమ్మలబాయిలోకి
   దూకి
   పురానవ జల సత్సంగం
   చేసినందుకు
   కృతజ్ఞుడిని
   ……సిద్ధార్థ

  • narayana sharma says:

   ధన్య వాదాలు రేణుకా అయోల గారు..

 2. siddhartha kavivaaggeya says:

  నారాయణ శర్మ గారు మీ
  వ్యాసం చదివి ఎంతో ఆనందానికీ,ఉద్వేగానికీ,
  గొప్ప
  వచనానుభవానికి లోనయ్యాను
  .బొమ్మలబాయిలోకి
  దూకి
  పురానవ జల సత్సంగం
  చేసినందుకు
  కృతజ్ఞుడిని
  ……సిద్ధార్థ

 3. Sashanka says:

  సిద్ధార్థ కవిత్వం విలక్షణమైంది. సిద్ధార్థ తానుంటున్న కాలాన్ని త్యజించి,ఇంకా చెబితే తనను కూడా త్యజించి —-
  అంటూ నారాయణ శర్మ.
  నారాయణ శర్మ గారి వ్యాసం చదివి ఎంతో ఆనందానికీ,ఉద్వేగానికీ, గొప్ప వచనానుభవానికి లోనయ్యాను —
  అంటూ సిద్దార్ధ.
  మీ పరస్పర పొగడ్తల్లో మాకేం పని అంటూ పాఠకులు.
  పాఠకులతో పనేముందని కవులూ విమర్సకులూ

 4. m s naidu says:

  శశాంక్ గారు.
  “మీ పరస్పర పొగడ్తల్లో మాకేం పని అంటూ పాఠకులు,పాఠకులతో పనేముందని కవులూ విమర్సకులూ” అని అంటూ ఉండే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ మీ ఈ చిన్న అసంతృప్తి కారణాలు, కారకాలు, కారణజన్ములు అవి ఎవరి కవులో, అవి ఎవరి విమర్సకులో చెబితే ఇంకా బాగుంటుందేమో. తెలుగులో సాధ్యమైతే చెప్పండి, లేకపోతె, ప్రాకృతంలోనైనా.
  శర్మ గారి దిష్టి దృష్టి ‘కాలాంతరజీవి నిశ్చల తపస్సులోని ఆత్మసంభాషణ’ అంత అనుచితంగా లేక కాదు కాని కాజాలదు. ఆయనే
  ‘దేశీపదాలు ఎక్కువ. ప్రకృతిగతంగా రూపొందించిన పదాలనిర్మాణం ఎక్కువ’ అన్నప్పటికీ ఏ కవిత్వదేశం గురించి మాట్లాడాయో మరిచి మరీ విడమరిచి మరిచి మరిచిపోయారు.కవి లేదిక్కడ. కవి లేడిక్కడ. కవి కాదిక్కడ. పై పై wi-fi or lie-fi మాటల్లో, మిగిలి, పొంగిపోయే పాటకులు, పాఠకులు మీరూ కాదనుకుంటా.

 5. విలాసాగరం రవీందర్ says:

  లోతైన పరిశీలన చేసి చేసిన విశ్లేషణ .

మీ మాటలు

*