అందమైన కలలాంటి ఆ నేలా..గాలీ!

 

  -శివలక్ష్మి

~       

మా కోడలి  అక్కలిద్దరు సంధ్య,రూపల్ ఇండొనేషియాలో టీచర్స్ గా పని చేస్తున్నారు. పదే పదే రమ్మంటున్న వాళ్ళ  ఆహ్వానం మీద  ఇండొనేషియా వెళ్ళాలని అనుకున్నాం. అది ఒక ద్వీప దేశం. చిన్నప్పుడు రామాయణ పాఠాల్లో చదువుకున్న జావా,సుమత్రా దీవులు ఇండోనేషియా లోనివే కనుక చూస్తే బాగుంటుందనుకున్నాం. ఇటీవల మాకుటుంబం లోని – మేమిద్దరం హైదరాబాద్ నుంచి, హిమాన్షి (కోడలు) , శయన్ (మనవడు) డిల్లీ నుంచి , మా బాబు స్వరూప్  లే(లఢక్) నుంచి, రాజ్(రూపల్ భర్త) గౌహతి నుంచి బయల్దేరి, అందరం హైదరాబాద్ లో కలిసి డిసెంబర్ 23 న ఇండొనేషియా రాజధాని జకర్తా చేరుకున్నాం. అక్కడికెళ్ళాక న్యూజీలాండ్ లో చదివే సంధ్య కొడుకు సహర్ష్ జాయినయ్యాడు.అక్కడే ఉంటున్న సంధ్య,రూపల్ ఆమె  కూతురు రసజ్ఞ -ఇదీ మొత్తం 10మంది మాగ్రూప్.

అప్పటికే జకర్తాకి చేరిన సహర్ష్, రూపల్  తో కలిసి మమ్మల్ని జకర్తా ఎయిర్ పోర్ట్ కొచ్చి రిసీవ్ చేసుకున్నాడు. ఇతర దేశాలనుంచి అక్కడి పని చెయ్యడానికొచ్చే ఉపాధ్యాయులకి ఇండొనేషియా ప్రభుత్వం ఉచితంగా ఇల్లు,అవసరమైన గృహోపకరణాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి ప్రభుత్వం సమకూర్చిన ఇళ్ళు కూడా స్కూళ్ళకి నడిచి వెళ్ళేంత దూరంలో, మంచి పరిసరాల్లో, అందమైన ఫర్నిచర్ తో ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయుల  పిల్లలకి ప్రభుత్వమే ఉచిత విద్య నందిస్తుంది. అలా సంధ్య పిల్లలిద్దరూ జునియాలీ, సహర్ష్ 12th క్లాస్ వరకూ ఉచిత విద్య నభ్యసించి ఇప్పుడు పైచదువుల కెళ్ళారు.ఇప్పుడు రూపల్ కూతురు రసజ్ఞ 12th క్లాస్ ఇండొనేషియాలోనే చదువుతుంది. తన క్లాస్ టీచర్సందరూ భారతీయులేనని చెప్పింది. ఈ టీచర్ల పిల్లలందరూ 12th క్లాస్ వరకూ ఇక్కడ చదివి,తర్వాత వాళ్ళ వాళ్ళ అభిరుచుల కనుగుణంగా పై చదువులకు విదేశాలకెళ్తున్నారు.

జకర్తాలో ఉన్న నాలుగు రోజులూ సంధ్య, రూపల్ అత్యంత ఆత్మీయమైన ఆతిధ్యమిచ్చారు. అలాగని వాళ్ళేమీ పదిమంది మున్నామని  హైరానా పడలేదు. వాళ్ళు వంట చెయ్యనే లేదు. అసలా సమాజంలో వంట చేసుకునే కాన్సెప్టే లేదు. ఈ విషయం నాకు భలే నచ్చింది!అమెరికాలో ఇండియాని నెత్తిన మోసుకెళ్ళి ఇక్కడి వంటలతో ఆడపిల్లలందరూ తెగ యాతన పడుతున్నారు! కానీ “రోమ్ లో రోమన్ లా జీవించు” అన్నట్లు మా సంధ్య,రూపల్ ఎంచక్కా వంటలకు గుడ్ బై కొట్టేశారు!!

bali1

“The first condition of understanding a foreign country is to smell it”- అని Rudyard Kipling  అన్నట్లు Food is the best way to represent a country because of its distinctive aromas and flavours. రోడ్ల మీద ఎంతో రుచికరమైన,అత్యంత శుభ్రమైన ఆహారం దొరుకుతుంది.ఏదో అయిందనిపించే టట్లుండదు.నోరూరించే జిహ్వ రుచులతో, స్పైసీగా తిన్నాం.కొంచెం అన్నం, ఒక కప్పు ఆకు కూరా, చికెన్ మూడూ కలిపిన “పడాంగ్” అనబడే భోజనం వేడి వేడిగా దొరుకుతుంది ఆహా!ఎంతో రుచిగా ఉంది! ఎంతో రుచి, ఎంతో రుచి అని పాడుకున్నాం!ఖచ్చితంగా సగం సగం చేసి ఎనిమిది ముక్కలుగా చేసిన, మషాలా దట్టించిన, అద్భుతంగా ఘుమ ఘుమలు వెదజల్లే   నాలుగు పెద్ద పెద్ద చేపల్ని కొనుక్కుని అన్నంతో తిన్నాం.మా షయన్ కి హిమాన్షికి చేపలంటే చాలా చాలా ఇష్టం.అవి తిన్న తర్వాత తీసిన ఫొటోలో వాళ్ళ మొఖాల్లో ఆనందం చూడండి!!

పిల్లల చదువుల కోసం మా సంధ్య, రూపల్  డెహ్రాడూన్ నుంచి వెళ్ళి కుటుంబాలకు దూరంగా ఒంటరిగా ఉంటున్నారు. అక్కడ ఈవ్ టీజింగ్లుండవు.అత్యాచారాల చాయలేలేవు.ఆ రకంగా ఇండొనేషియా చాలా సురక్షితమైన దేశమని వాళ్ళిద్దరూ చెప్పారు. అత్యాచారాలతో అట్టుడిగిపోతున్న భారత్ గుర్తొచ్చి వేదన కలిగింది. వాయు కాలుష్యముండదు.పెట్రోల్ చాలా చౌకగా దొరుకుతుంది.అదెలా సాధ్యమని అడిగితే మన దేశంలో సెంట్రల్ ఎక్సైజ్,సర్వీస్ టాక్సులు చాలా ఎక్కువుంటాయని కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ లో పనిచేసిన మా ఆయన చెప్పారు. ఇండొనేషియాలో లీటర్ పెట్రోల్ మన 30రూపాయల కంటే తక్కువే.మనకి 70 రూపాయలు.రిఫైనరీ లీటర్ ధర రూ 16.50, టాక్స్ 11.80%, ఎక్సైజ్ డ్యూటీ 9.75%, వ్యాట్ సెస్ 4%, స్టేట్ టాక్స్ 8%-ఈ మొత్తం కలిసి 50.05. కానీ భారత ప్రభుత్వం ఇంకో 20రూ అదనంగా మన చెవులు పిండి వసూలు చేస్తుంద ! 20రూ దేనికోసం వసూలు చేస్తుందో మాత్రం ప్రజలకు చెప్పదు !!

మన లాగే ఇక్కడి వారివి మామూలు మధ్య తరగతి జీవితాలే! సాదా సీదా జీతాలే!! కానీ మన ఉపాధ్యాయులే కాదు,ఉన్నతోధ్యోగుల జీవితాలతో పోల్చి చూసినా ఈ దేశంలో చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నారనిపించింది.ఏ రకమైన ఒత్తిడీలేదు.ఇందు గల డందు లేదన్నట్లు మనకి యెల్లడలా ప్రత్యక్షమై, పీల్చి పిప్పి చేసి, అనారోగ్యాల పాల బడేస్తున్న దుమ్ము  అస్సల్లేదు.అమెరికాలో దుమ్ముండదనుకుంటారు గానీ అక్కడి  మూల మూలల్లో కనిపించే దుమ్ము లాంటిది కూడా యిక్కడ కనిపించదు.ఎటు చూస్తే అటు పచ్చని చెట్లతో పరిశుభ్రంగా ఉంటుంది. బట్టలు మాయవు. అంత పచ్చదనం నేనెక్కడా చూడలేదు.తాజాగా,నేవళంగా,కళ కళ లాడుతూ చెట్లూ,ఆకులూ,పువ్వులూ ఆహ్లాదం కలిగిస్తాయి. జకర్తా నగర శివార్లలోనూ,బాలీ లోనూ తిరుగుతుంటే రోడ్డు కిరువైపులా వరి పంట పొలాలు కనిపిస్తూ కన్నుల పండుగ చేస్తాయి.కొన్నిచోట్ల లోయల్లాగా ఉండి, లోయ నిండా పరుచుకున్న పచ్చదనంతో కళ కళలాడుతుంటాయి. ఆ వరి పంట నీళ్ళ మధ్య మధ్య లో చిన్న చిన్న చేపల్ని వదుల్తారనీ, ఆ చేపలు తిరుగుతూ,పెరుగుతున్న క్రమంలో వాటి మల మూత్రాలతో పంట బాగా పండుతుందని,ఆ ప్రజల ప్రధాన మైన పంట వరేనని తన పాఠాల్లో ఉందని రసజ్ఞ  మాకు చెప్పింది!

వాళ్ళ ప్రధానమైన ఆహారం మనలాగే అన్నం.రోజులో నాలుగైదుసార్లు అన్నం తింటారు.కానీ మనుషులు ముఖ్యంగా స్త్రీలు సన్నగా, నాజూగ్గా, చలాకీగా, బలంగా ఉంటారు. మీరు చెప్తే నమ్ముతారో లేదో గానీ నిజంగా నా సైజ్ ప్యాంట్ అక్కడి షాపుల్లో దొరకలేదు.మనదేశంలో నైతే నేనసలు లావే కాదు. నాక్కోపమొచ్చి ఇక్కడ కూడా అక్కడక్కదా లావాటి వాళ్ళున్నారు కదా వాళ్ళకెలా?అని అడిగాను.వాళ్ళకి బిగ్ సైజ్ షాపులుంటాయని చెప్పారు.సిగ్గేసింది కానీ ఒక విషయం తెలిసొచ్చింది. అదేమిటంటే  వాళ్ళు నాలాగా ఆవకాయ-ముద్దపప్పు లేకపోతే రోటి పచ్చడితో ఒక వాయి,కూరతో ఒక వాయి, సాంబారు,రసాలు వగైరాలతో ఒక వాయి,పెరుగుతో చివరి వాయి లాగించరు.ప్రతి సారీ రెండే రెండు స్పూన్ల (మళ్ళీ స్పూన్ అంటే  మన హస్తం కాదు,నిజంగా టేబిల్ స్పూన్ కన్న కొంచెం పెద్ద స్పూన్) అన్నం తింటారు అని. ఈ రహస్యాన్ని మా సంధ్య,రూపల్ దగ్గర ఉన్న మెయిడ్స్ నుంచి రాబట్టాను. మెయిడ్స్ అంటే గుర్తొచ్చింది (పని మనిషి పదం కంటే మెయిడ్ పదం కొంచెం బాగుంది) సంధ్య ఇంట్లో అమ్మాయి పేరుపార్వతి,రూపల్ ఇంట్లో అమ్మాయి పేరు మీనా.ఇంతకీ వాళ్ళు ముస్లిం స్త్రీలు.అచ్చం మన తెలుగు పేర్లు! వాళ్ళు చాలా హుందాగా,సమర్ధంగా ఉన్నారు. చక్కగా టూ వీలర్ల మీద వస్తారు. ఒకరి మీద ఒకరికి ఎంతో నమ్మకం, గౌరవం. వీళ్ళు తాళాలిచ్చి ఉదయాన్నే స్కూళ్ళకెళ్ళిపోతారు! వాళ్ళు ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి మడతలు పెట్టడం మొదలైన పన్లు చక్క బెట్టి వెళతారు!

ముస్లిం అమ్మాయిలకు తెలుగు పేర్లు ఎందుకున్నాయో తెలుసుకోవాలనే  ప్రయత్నంలో   జకార్తా చరిత్ర గురించి చదివితే 14 వ శతాబ్దంలో “జకార్తా” జావా అనే హిందూ రాజ్యంలో ఒక చిన్న నౌకాశ్రయం పట్టణంగా ఉండేది. 1527లో “ఫతాహిల్లా” అనే ముస్లిం మత పాలకుడు స్వాధీనం  చేసుకుని “జయకార్తా” (Victory City) అని పేరు మార్చాడు.1619 లో డచ్ వాళ్ళు స్వాధీనం చేసుకుని, ఒక కొత్తనగరంగా నిర్మించి, ‘బటావియా’ అని పేరు మార్చి, ఆగ్నేయాసియాకి అధికార కేంద్రంగా  చేసి 300 ఏళ్ళు పరిపాలించారు. 1941 లో జపాన్ సామ్రాజ్య వాదులు ముట్టడించి పాత పేరు జయకార్తాని జకార్తాగా మార్చేశారు. డచ్ పాలకులు మళ్ళీ ఇంకోసారి జకార్తాని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్య పోరాటాలు మొదలయ్యాయి. ఈ లోపల ఇండోనేషియన్ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష ఉధృత మైంది . ప్రజల విముక్తి పోరాటాల ఫలితంగా 1945, ఆగష్టు 17 న ఇండోనేషియన్ నాయకులు జకార్తాలో విదేశీ పాలన నుంచి స్వాతంత్ర్యం ప్రకటించారు.

ఇక్కడ శతాబ్దాలుగా హిందూ,ముస్లిం,యూరోపియన్,డచ్,జపనీస్ ప్రజలు సహజీవనం చెయ్యడం వల్ల అన్ని జాతుల మిశ్రమ సంస్కృతి కలగాపులగమైందని అర్ధమైంది. హిందూ, బౌద్ధం,  కన్ఫ్యూషియనిజం, ఇస్లాం, క్రైస్తవ  మతాల సమూహాలతో కలిసిన ఒక సంక్లిష్టమైన సాంస్కృతిక జీవనం ఆశ్చర్యం కలిగిస్తుంది. మన “భాష” లాగే వాళ్ళు మాట్లాడే భాష పేరు “భాస”. స్త్రీలను వనిత (wanita) లంటారు. సరస్వతి, రాముడు,సీత,శివ-పార్వతులు,అర్జునుడు లాంటి అనేకమైన మన పదాలుండడం వల్ల వాళ్ళ భాష (భాస) కొంచెం అర్ధమవుతుంది.అర్ధం కాకపోయినా సైగలతో,హావభావాలతో వాళ్ళతో చక్కగా మాట్లాడొచ్చు. పోయిన సంవత్సరం హాంకాంగ్, మకావ్ లకు వెళ్ళాం. అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఏ షాపుకెళ్ళినా,బజార్ల లో ఏమైనా తినాలని అడగబోయినా, సైగలు చేద్దామన్నా మొఖాలు చిట్లించుకుని విదిలించి పారేసేవారు. చాలా ఇబ్బంది పడ్డాం! ఇండోనేషియా మనుషులు ఎక్కడున్నా మనందరం మనుషులమే అన్నట్లు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. ప్రేమాభిమానాలు చూపించారు. ఆ నేలలో మనుషులందర్నీ కలగలిపే గొప్పతనమేదో ఉందనిపించింది!

ఇక కరెన్సీ విషయానికొస్తే మన రూపాయికి 210 ఇండొనేషియన్ రూపయ్యాలు. ఒక డాలర్ కైతే 13,600 రూపయ్యాలు. అందుకే డాలర్లున్న విదేశీయుల ఎద్దడి సర్వకాలాల్లోనూ ఉంటుందట! పది వేల రూపాయిల్ని మార్చుకుంటే నాకు 20 లక్షల రూపయ్యాలొచ్చాయి. ఆర్టిస్ట్ మోహన్ అప్పుడప్పుడూ  ఆయన జేబులో కాసిని డబ్బులుంటే చాలు “I am Stinkingly Rich” అని అంటుంటారు, అలా ఫీలైపోయాను. తీరా ఒక కాఫీ మేకర్ కొనుక్కుంటే 2 లక్షలైపోయాయి. పిల్లలకిష్టమైన  బ్రాండ్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.కానీ అవి ఇండొనేషియన్ బ్రాండ్స్.ఏమైనా రెండు మూడు వస్తువులు కొందామనుకున్నప్పుడు మిలియన్లలో లెక్క తేలేది.ఇక నా లెక్కలు రాని బుర్రకి తాళం పడిపోయేది.కౌంటర్ లో అమ్మాయి ఎంత చెప్తే అంతా ఇవ్వడం, అదీ రాకపోతే రూపల్ హెల్ప్ చేసేది.

bali2

జాతీయవాదం తీవ్రంగా ప్రబలిన  సుకర్ణో కాలంలో నిర్మించిన స్మారక చిహ్నం “మోనాస్”. ఇది 35 కిలోల బంగారపు పూతతో,137 మీటర్ల పొడవైన పాలరాయి కీర్తి స్తంభం. ఆగ్నేయాసియాలో అతి పెద్దదైన ఈ మసీదుని నిర్మించడానికి 17 సంవత్సరాలు పట్టింది.ఇది ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదైన ఒక చారిత్రాత్మక మ్యూజియం.”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం”,అన్న మాహాకవి మాటలు గుర్తొచ్చాయి. కానీ పరపీడన పరాయణత్వం నుంచి ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులకూ, స్వేచ్ఛకూ, వారి స్వావలంబనకూ ప్రతీకగా నిలుస్తున్న మ్యూజియం గోడలు, గోపురం మసీదు వైభవాన్ని, ఐశ్వర్యాన్నే గాక ప్రజల గొప్పతనాన్నీ,హుందాతనాన్నీ,స్వావలంబననీ చాటి చెప్తున్నాయి. పాలకుల దగ్గర యుద్ధ టాంకులుంటే ప్రజల దగ్గర చిట్టి చిట్టి  ఆయుధాలుంటాయి.  ఒకసారి ప్రజలకు రాజకీయ స్పష్టత వచ్చిందంటే ఎంత కౄరమైన సామ్రాజ్య వాదాలైనా కాగితప్పూలలాగా ఎగిరిపోయి, ప్రజలే అంతిమ విజయం సాధిస్తారని చరిత్రలో రుజువైన సత్యాన్ని ఇండోనేషియన్ ప్రజలు  మరోసారి నిరూపించారు.

భాలికల విద్య,ఆధునికత  విషయంలో ” బి యూ కార్టిని (IBU Kartini)” అనే ఒక పేరు ప్రముఖంగా వినబడింది. కార్టిని పేరుతో ఇండోనేషియాలో చాలా స్కూళ్ళు, స్థలాలు ఉన్నాయి.ఏమిటని సంధ్య నడిగితే ఆడపిల్లల చదువుల కోసం కృషి చేసిన కార్టిని అనే ఒక అద్భుతమైన మహిళ గురించి చెప్పింది. కార్టిని 1789 లో ప్రస్తుత ఇండోనేషియాలో ఒక కులీన జావనీస్ కుటుంబంలో జన్మించింది. 1904 వరకూ జీవించింది. ఆమెకు చదువు పట్ల విపరీతమైన  ఆసక్తి ఉండేది. 12 సం.ల లోపే ఆమె డచ్ భాష నేర్చేసుకుంది. జావనీస్ సమాజంలో అమ్మాయిలను ప్రాధమిక పాఠశాల, అంటే 12 సం.ల వరకే పాఠశాలకు వెళ్ళనిచ్చేవారు. ఆ కాలంలో బహుభార్యాత్వ ముండేది. బాలికల వేషధారణ మీద అనేకరకాలైన కౄరమైన ఆంక్షలుండేవి.ముక్కుపచ్చలారని పసిపిల్లలను గృహనిర్భంధంలో ఉంచి, మొఖం తెలియని ముసలివాళ్లతో రెండో,మూడో పెళ్ళికి సిద్ధం చేసేవారు.ఈ బాలికల దుర్భర పరిస్థితులకు కలత చెందిన కార్టిని వారి ఏకాంత బాధలను అధ్యయనం చేసి “Out of Darkness to Light” అనే పుస్తకం డచ్ భాషలో రాసింది. “Letters of a Javanese Princess” అని ఆమె భావాలను వ్యక్తపరిచే కొన్ని ఉత్తరాలు కూడా డచ్ భాషలోనే  రాసింది. అందులో ఆమె బహు భార్యాత్వాన్ని వ్యతిరేకించింది. ఇండోనేషియా యువత యూరోపియన్ యువతలా ఉండాలనే ఆశాభావం వ్యక్తం చేసింది. స్త్రీల చదువుల కోసం, హక్కుల కోసం ,రకరకాల పీడనలనుండి విముక్తి కోసం న్యాయపోరాటాలను సూచించింది. డచ్, నెదర్లాండ్స్, యూరోపియన్  దేశాల పౌరులను ఆకర్షించి, గొప్ప ఆసక్తిని  రేకిత్తించడం ద్వారా  విదేశీ  ప్రముఖుల  మద్దతును కూడగట్టగలిగింది. విద్యా రంగంలో మార్గదర్శకురాలైంది. ఇండొనేషియా స్వాతంత్ర పోరాటంలో కూడా దేశ నాయకులకు ఆమె ఆలోచనలు   ప్రేరణ నిచ్చాయి. కార్టిని జన్మదినం ఏప్రిల్ 21 ని జాతీయ సెలవు దినంగా, ఆమెను జాతీయ నాయకురాలిగా ప్రకటించింది ప్రభుత్వం. ఇండొనేషియా స్మారక చిహ్నం “మోనాస్”. తో పాటు, కార్టిని విగ్రహాన్ని కూడా చూశాం.

bali5

ఇండోనేషియా ఒక ముస్లిం మతం దేశం అయినప్పటికీ బయట పరిశీలకులు సమాజం లో ముస్లిం మహిళల హోదా, హక్కులు, వారి స్థా నాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు. సమాజంలో మహిళలు పాటిస్తున్న మంచి విలువలే సమాజానికి వెన్నెముకలా పనిచేస్తున్నాయని పరిగణిస్తారు. సుకర్ణో కూతురు మేగావతి అధ్యక్ష అభ్యర్థిగా  నిలబడితే ముస్లిం మత నాయకులు ఒక మహిళ అధ్యక్ష పదవిలో ఉండడమేమిటని వ్యతిరేకించారు. కాని ఆమె 1999 జాతీయ ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో గెలుపొంది, ప్రముఖంగా నిలిచింది. అక్కడి ముస్లిం మహిళలు బురఖాలు వదిలేశారు. చిన్న చిన్న అతి సుందరమైన స్కార్ఫ్ లను తల చుట్టూ మాత్రం ధరిస్తున్నారు.అవి కూడా మహిళల అందాన్ని పెంచుతున్నాయి. కొందరు అవి కూడా వదిలేశారు.అమ్మాయిలు రాత్రుళ్ళు స్వేచ్చగా తమ తమ పనుల మీదే కాకుండా రాత్రంతా తెరిచి ఉండే నైట్ మార్కెట్లలో నిర్భయంగా తిరుగుతున్నారు.వారికి సౌకర్యవంతంగా ఉండే అన్ని రకాల ఆధునికమైన దుస్తులను ధరిస్తూ అత్యాధునికంగా కనిపించారు. ఇండియాలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మేము “బిలియన్ రైజింగ్” ల పేరుతో ‘పగలే కాదు,రాత్రుళ్ళు కూడా మావి కా వాలనే డిమాండ్ తో ఇంకా ఉద్యమాలు చేసే స్థితిలోనే ఉన్నాం! ఈ ఆధునికత వెనక కార్టినికి స్త్రీజాతి పట్ల ఉన్న ఆర్ధ్రత ఎంతైనా అభినందనీయం!!

ఇండోనేషియా నిత్య జీవితంలో ఆహారంలో, సంస్కృతిలో కూడా  దేశీయ ఆచారాలూ, విదేశీ ప్రభావాల కలయికలూ కనిపిస్తాయి. బాలినీస్ నృత్యాల్లో  పురాతన బౌద్ధ, హిందూ మత రాజ్యాల గురించి కథలున్నాయి. బాలిలో అచ్చు తెలంగాణ బోనాల పండుగలో మహిళలు తీసికెళ్ళే బోనాల్లాంటివే బాలి మహిళలు పెద్ద పెద్ద బుట్టలలో రకరకాల పళ్ళు అందంగా పేర్చుకుని తీసికెళ్ళడం చూశాం.

బాలి లో హోటెల్ Kuta Central Park లో దిగాం .అక్కడినుంచి ఒక టాక్సీ తీసుకుని ఊరంతా తిరిగాం. ఒక టాక్సీ డ్రైవర్ ని నీ పేరేమిటని అడిగితే “ఒయాన్” అని చెప్పాడు.మీరు ముస్లింలా?అనడిగితే “No,I am a real Hindu” అని చెప్పాడు.నిజమైన హిందువంటే ఏమిటంటే రోజుకి ఐదు సార్లు పూజ చేస్తారట!ఆ పూజలు ఇంటి బయటి ప్రవేశ ద్వారం దగ్గరే చేస్తారు. ఇంటి ఆవరణమంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు.మనవాళ్ళలాగా పక్కింటివాళ్ళ గుమ్మాల్లో చెత్త పారబొయ్యరు! ప్రవేశ ద్వారం దగ్గరే  ఎందుకు పూజలు చేస్తారంటే సకల దేవుళ్ళూ,పంచ భూతాలూ ఇంటికి కాపలా ఉండి ఎటువంటి చెడునీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడతాయని, తమను కాపాడతాయని వాళ్ళ నమ్మకం! నాకిది కూడా భలే నచ్చింది.పూజల పేరిట ఇక్కడి ఆడవాళ్ళకు ఇరుకు ఇళ్ళలో చచ్చేంత చాకిరీ ఉంటుంది.ప్రతిసారీ దేవుడి విగ్రహాలు తోమి,వాడిపోయిన పువ్వులూ,పాచిపోయిన నైవేద్యాలూ అన్నీ శుభ్రం చెయ్యాలి.బయటంటే స్త్రీలూ-పురుషులూ కలిసి చెయ్యడం చూశాం ! నడి రోడ్ల కూడళ్ళలో పెద్ద పెద్ద కృష్ణార్జునులూ,శివ-పార్వతులూ మొదలైన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చూశాం!

ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం  వరకూ రంజాన్ సందర్భంగా నిష్టగా నెలంతా ఉపవాసం చేస్తారు. ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా ప్రత్యేక వంటకాలతో వేడుకగా భోజనం చేస్తారు. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, సహచరులకు  ఆహార పదార్థాలను పంచిపెడతారు. వారికి ఆతిథ్య సామర్ధ్యం చాలా ఎక్కువని, రంజాన్ సమయంలో మాకు విందులే విందులని మా సంధ్య,రూపల్ చెప్పారు.

రాజకీయ వ్యవస్థ, శాస్త్ర,సాంకేతిక సమస్యలు, వినోదం, సినిమా, టెలివిజన్ కార్యక్రమాలు మొదలైన విషయాల్లో పాశ్చాత్య సంస్కృతి ఇండోనేషియాను గొప్పగా ప్రభావితం చేసింది. అరబ్, మలయ్, భారత్ ల జానపద సంగీతాల మేళవింపుతో తయారైన సంగీతం ఇండోనేషియాలో బహుళ ప్రజాదరణ పొందింది.

డచ్, చైనా, యూరోపియన్లు ఆధిపత్యం చెలాయించడం వల్ల ఇండోనేషియాలో ఇప్పటికీ “ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ.”  ఉంది. దేశీయ వినియోగం కోసం జనాభాలో 60 శాతం వ్యవసాయం చేసి, వరి పండిస్తారు. మధ్య భూభాగంలో ఉండడం వల్ల ఇండోనేషియా వేడి ప్రదేశమే. వాతావరణ పరిస్థితుల్ని బట్టి జీవనోపాధికి కూరగాయలు, పండ్లు, టీ, కాఫీ, పంచదార,  సుగంధ ద్రవ్యాలు మొదలైన మార్కెట్ ఆధారిత పంటలు పండించే రైతులున్నారు. అందమైన చెక్క బొమ్మలు చేసే కళలో ఇక్కడి ప్రజలు మంచి నైపుణ్యం సంపాదించారు. బంగారం, చమురు, సహజ వాయువు, తగరం, రాగి, అల్యూమినియం, ఆయిల్ పామ్, రబ్బరు, చక్కెర, ఇండోనేషియా ఎగుమతుల్లో ముఖ్యమైనవి. ఇండోనేషియాలో దొరికే కలప నుపయోగించి ప్రాసెస్ చేసిన చెక్క కూడా ఎగుమతుల్లో ప్రధానమైనది.

గ్రామాల్లో వ్యవసాయపు పనుల్లో స్త్రీ-పురుషుల భాగస్వామ్యం ఉంటుంది. సాధారణంగా పురుషులు పొలం దున్నితే, మహిళలు సేద్యం చెయ్యడం, కోతలు కొయ్యడం,పంటల్ని భద్రపరచడం వంటి అనేక పన్లు చేస్తారు. ఆ స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలుగా దర్శనమిస్తారు. విదేశీ సంస్కృతి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని మారుమూల ఇండోనేషియన్ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యేక మూలవాసీ సంస్కృతి భద్రపరచబడింది. ఆ  మహిళల సాంప్రదాయ దుస్తుల్ని మేము చాలా ఇష్టంగా  కొనుక్కున్నాం !

bali4నిర్ణయాత్మక స్థానాల్లో,అధికారా హోదాల్లో ఎక్కువగా పురుషులే ఉంటారు. మహిళలు పురుషుల కంటే తక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉద్యోగాల్లో దుకాణాలు, పరిశ్రమలు, మార్కెట్లలో  సేల్స్ గళ్స్ గా కనిపిస్తారు. మాధ్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కాలేజ్ లెక్చరర్లుగా,విశ్వ విద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా పురుషులే ఉంటారు గానీ మహిళలు మాత్రం ప్రాధమిక స్కూలు ఉపాధ్యాయుల వరకే పరిమితమవుతారని సంధ్య,రూపల్ చెప్పారు.కానీ ప్రాధమిక పాఠశాలల్లో బాల-బాలికల సంఖ్య సమానంగా ఉంటుందని చెప్పారు! రాచరిక పాలనే అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ఒకటి,రెండు దశాబ్దాలకే చదువు మీద అమితాసక్తి కలిగి,ఉచిత విద్యను అమలు చేసింది ఇండోనేషియన్ ప్రభుత్వం. అదీ గాక, ఈ దేశంలో కార్టిని పాఠశాలల ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి కొద్ది కాలంలో చదువుల్లో ఉద్యోగాల్లో స్త్రీలు కూడా పురుషులతో సమానంగా ఎదుతారని ఆశించవచ్చు!!

bali6

Taman Safari, Kidzania, Kuta Beach, Kuta Square,Tanah lot Temple,Tanjung Benua in Nusa Dua Beach for water sports,Sukhawati Art Market,Drive in Ubud,Ubud Art Market,Ubud Rice Fields, Zimbaran Beach and Sea Food Dinner, Legian Street,Seminyak area,Sanur Beach,Uluwatu Temple మొ.వాటిని జకర్తా,బాలి లలో మేము చూశాం. రెండు దేవాలయాల బయట సముద్ర తీరాలు,తనివి తీరని దృశ్యాల సౌందర్యాన్నే చూడగలిగాం.సాంప్రదాయ దుస్తులు లేనందుకు మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.

ఎటు చూస్తే అటు కనుచూపు మేరా కనిపించే ఇండియన్ ఓషన్ పులకింపజేసేది! మన దేశం పేరుతో ఒక మహా సముద్రముండడ మనే భావన మరీ మరీ పరవశింపజేసింది !! దానికి తోడు ఉడుకు రక్తంతో అత్యుత్సాహంగా ఉరకలు వేసే పిల్లలు.ఒకటే కేరింతలు!వాళ్ళ సాంగత్యంతో మాకూ యవ్వనం వచ్చేసింది!

ఆధునిక జీవితం అర్ధం కావాలన్నారు శ్రీ శ్రీ. వేష భాషల్లోనే కాదు,ఆలోచనల్లోనూ శ్రీ శ్రీ చెప్పిన ఆధునికతను వంట బట్టించుకున్న మా అమ్మాయిలు, ఒకరు కాదు,ఇద్దరు కాదు, ముగ్గురు సమర్ధులైన, అతి చలాకైన,ఆధునిక యువతులు నిర్వహించిన ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప సంబరంగా సాగింది!

         *

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. చాలా వివరాలతో ,బహు ఆసక్తి దాయకంగా ఉందీ ..మీ ఇండోనేషియా టూర్ వ్యాసం ..నాకు ఇప్పటికిప్పుడు బయలుదేరి చూసేయాలని ఘాడం గా అనిపించింది ..కిందటేడాది బాంకాక్ వెళ్ళాం ,ఈ ఏడాది ఇండొనేషియా చలో అని నిర్ణయానికి వచ్చేసాను .. థాంక్యూ ..మాతో ఈ వివరాలు పంచుకున్నందుకు .
  వసంత లక్ష్మి .

 2. amarendra dasari says:

  ఇచ్చిన వివరాలు, చెప్పిన పధ్ధతి = హాట్స్ ఆఫ్!!

 3. బి.అనూరాధ says:

  మీతో పాటు నేను కూడా జకార్తా అంతా తిరిగేసినట్టుంది. ఎంత బాగా, హాయిగా రాశారో. ముఖ్యంగా చరిత్ర అంత వివరంగా రాసినందుకు అందులోనూ మహిళా కోణం లో రాసినందుకు మీకు అభినందనలు. మీరు ఇలా ఎక్కడికి వెళ్ళినా నా (మా) లాంటివాళ్ళకోసం ఇలాగే విపులంగా రాయండి. (నా లాంటి వాళ్ళు అంటే విదేశీ ప్రయాణాలు చేసే స్థోమత లేని వాళ్ళు అని) నిజంగా చాలా lively గా రాశారు.

 4. Sivalakshmi says:

  వసంత,అమరేంద్ర,అనూరాధ గార్లకు కృతజ్ఞతలు! మీ స్పందన శక్తినీ,స్పూర్తినీ ఇస్తోంది.వసంత గారూ నిజంగా మీరెళ్ళేటట్లయితే మా సంధ్య,రూపల్ కి చెప్తా!

 5. కొండేపూడి నిర్మల says:

  ట్రావెలాగ్ రాయడం నావరకు నాకు చాలెంజ్ . చూడాలి. అనుభూతిని మనసులో నింపుకోవాలి . తిరిగి నెమరు వేసుకోవాలి. అదే ఎమోషన్ లో అక్షరీకంరీకరి౦చాలి . ఇదంతా ఒకదానిక్కటి చైన్ యాక్షన్. శివలక్ష్మి ఈ పనంతా అద్భుతంగా చేస్తోంది .అనలైజింగ్ , రిపోర్టింగ్ , టోపోగ్రఫీ స్కిల్స్ ని సమాంతరం ప్రదర్శిస్తుంది వెరీ గుడ్ టాస్క్. లవ్లీ అండ్ లైవ్లీ .
  శివ ఏది రాస్తున్నా ఈ ఒక్కటీ మిస్ కాదు. దాదాపు మనల్ని కూడా తనతో తీసుకెళ్ళిన౦త దృశ్య గమన౦తో వుంటుంది.
  ప్రతి యాత్రా ప్లస్ సినిమా రివ్యూ ఒక సజీవ చిత్రం .
  అభినందనలు శివా /

 6. Sivalakshmi says:

  ధాంక్స్ నిమ్మీ!
  నీ అభినందనలు మండు వేసవిలో చిరుజల్లుల్లా మనసుకి ఆహ్లాదం కలిగిస్తున్నాయి!

 7. కె.సుభాషిణి says:

  చాలా బాగు౦ది. వ౦ట చేసుకోనక్కరలేదు అన్న విషయ౦ వినటానికే ఎ౦త బాగు౦దో !ఎ౦త సమయ౦ ఆదా అవుతు౦దో ! భారతీయ స్త్రీల జీవిత౦ సగ భాగ౦ వ౦టిళ్లళ్ళోనే గడిచిపోతో౦టు౦ది. అ౦దరికి ఆహార౦ అ౦దుబాటులో వు౦టే యి౦కే౦. ఒ౦టరి వ౦టిళ్లను కూల్చేసినట్టే.

 8. N Venugopal says:

  శివక్కా,
  చాల చాల బాగుంది. చదువరులకు కూడ ఇండొనేషియాలో, జకార్తా, బాలి వీథుల్లో తిరుగుతున్నట్టు అనిపించేలా రాశావు. అభినందనలు. కృతజ్ఞతలు.

  అయితే జకార్తా గురించి ఒక మహావిషాదాన్ని కూడ పంచుకోవాలి: ‘వివాలా శాంటియాగో’ లో శివసాగర్ చిలీ రాజధాని శాంటియాగోను ఉద్దేశించి ‘ఏ విద్రోహం నీ నుదుటిపై జకార్తా జకార్తా అని క్రూరంగా రాసింది?’ అని రాశారు. లక్షలాది మంది కమ్యూనిస్టులు ఊచకోతకు గురైన మహా విషాద చరిత్ర జకార్తాది, ఇండోనేషియాది. 1965 నాటికి ఇండొనేషియా కమ్యూనిస్టు పార్టీ రష్యా, చైనా పార్టీల తర్వాత అతి ఎక్కువమంది సభ్యులున్న పార్టీ. ముప్పై లక్షల సభ్యులుంటారని అంచనా. సైనికులు, భూస్వామ్య వర్గాలు, అమెరికన్ రాయబార కార్యాలయం, సి ఐ ఎ, ముస్లిం మతోన్మాదులు కలిసి, 1965 అక్టోబర్ లో ప్రారంభించి 1966 మార్చ్ వరకూ ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల మంది కమ్యూనిస్టులను, చైనీయులను, వామపక్ష సానుభూతిపరులని అనుమానం ఉన్నవాళ్లను, భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్లను ఊచకోత కోశారు. బలమైన పార్టీగా ఉన్నప్పటికీ ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ ఈ హత్యాకాండను ప్రతిఘటించలేకపోయింది. తుడిచిపెట్టుకుపోయింది. జకార్తా విలాపగీతం అది…..

 9. హాయ్ శివ
  నీ ఇందోనసియా టూర్ లో నీ తో బాటు ప్రయాణించినట్లు గా ఆనందించాను
  కాని ఒకటే నీతో బాటు రుచులని ఆస్వాదించ లేక పోయాను

 10. devika rani says:

  శివలక్ష్మి గారూ… అంతమైన కలలాటి ఆ నేలగురించి ఎంత కళాత్మకంగా వర్ణించారండీ. మీ ప్రయాణపు అనుభూతుల్ని ఎంత చక్కగా వివరించారు. చదువుతుంటే ఇండోనేషియాలో విహరించిన అనుభూతి కలిగింది. ఉన్నపళంగా అక్కడ వాలిపోవాలనిపిస్తోంది.

 11. హాయ్ శివ ,మీ ఇండోనేషియా ట్రిప్ చా బాగా రాసావు కంగ్రాట్స్ నువ్వు ఏదైనా బాగా రాయగలవు….కాని కదలవు…అక్కడి అన్ని విశేషాలని చాలా ఇవరంగా ఇచ్చావు…థాంక్స్ .ఇంకా raayi

 12. Sivalakshmi says:

  సుభాషిణీ,
  నిజంగా వంట లేనందువల్లే విహారం బాగుంది.పూర్తి సమయాన్ని కేటాయించి, మనసు పెట్టి చూడగలిగాం. ఆడవాళ్ళ సగం జీవితంతో పాటు మెదళ్ళు కూడా వంటకే అంకితం! Fritz లో ఆకుకూరలు,కొత్తిమిర లాంటివి పాడవుతున్నా మనకి బాధే! ఎన్నెన్ని అల్పమైన విషయాలకో మన సమయం వృధా అవుతూ ఉంటుంది కదా?
  Dear P.B,
  అస్తమానం ఆవకాయలూ,ముద్దపప్పు తోటకూర పులుసులు కావాలంటే కుదరదు!బెంగాల్ లో ప్రతి ఇంట్లో ఒక చిన్నపాటి మడుగు (pond) లుంటాయట!అందులో చేపల్ని పెంచేవారట! ఆమ్మాయిలకి పెళ్ళి చేసే ముందు pond ఉందా లేదా అని చూసుకుని అది ఉన్న ఇంటికే ఆడపిల్ల నిచ్చేవారట! అన్నీ తినడం నేర్చుకుంటేనీలాంటి వాళ్ళందరూ ప్రపంచమంతా చూడొచ్చు!
  దేవిక గారూ,
  మీరిస్తున్న ప్రోత్సాహానికి చాలా చాలా థాంక్సండీ!
  ప్రతిమా,
  థాంక్స్!
  నువ్వు చెప్పినట్లే రాయడానికి ప్రయత్నిస్తా!
  వేణూ,
  నీకు టైం దొరికి చదివినందుకు,నేను రాసింది నీకు నచ్చినందుకు నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది.
  నువ్వు చెప్పిన శివసాగర్ గారు రాసిన విషయం నాకు తెలియదు.చైనా,ఇండియా,అమెరికా తర్వాత జనాభాలో ఇండినేషియా పెద్దది. 20 లక్షలమందిని ఊచకోత కొయ్యడం నిజంగా గొప్ప విషాదం! నువ్వు చెప్పింతర్వాత జకార్తా విషాదం గురించి చదవాలనుంది! థాంక్స్ వేణూ!

 13. Challapalli Swaroopa Rani says:

  ట్రావెలాగ్ అందర్నీ ఇండోనేషియా కి తీసుకెళ్లింది. ఆ దేశానికి సంబందించిన అన్ని అంశాలు ఆసక్తికరంగా చెప్పారు. బోరోబొదూర్ వెఌనట్టులేదు. మీ నర్రెషన్ బాగుంది. కంగ్రాట్స్ !

  స్వరూప

మీ మాటలు

*