సామూహిక జ్ఞాపకంలోంచి ….ఒక అన్వేషణ!

 

 

-ఎన్ వేణుగోపాల్

~

(అఫ్సర్ ఆక్స్ ఫర్డ్  ప్రచురణ  “‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్” గురించి యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ లో  మార్చి తొమ్మిదిన జరగబోతున్న ప్రత్యేక చర్చా గోష్టి సందర్భంగా..)

venuప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించిన, కవిమిత్రుడు అఫ్సర్ గ్రంథం ‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’  మన గతం గురించీ వర్తమానం గురించీ అద్భుతమైన పరిశోధన. గూగూడు పీరు స్వామి గురించి వివరిస్తూ, సామాన్యుల మతవిశ్వాసాలనూ ఆచారాలనూ వాటి సామాజిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలను విశ్లేషిస్తూ మతం గురించి కొత్త ఆలోచనలను ప్రేరేపించే పుస్తకం అది. వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ, విశ్లేషిస్తూ మరొక పుస్తకమే రాయగలిగినంత, రాయవలసినంత విలువైన, విశాలమైన, లోతైన పుస్తకం అది. అఫ్సర్ ను ఇంతకాలం కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా చూసినవాళ్లకు ఈ పుస్తకం అఫ్సర్ గురించి ఒక కొత్త తెలివిడిని ఇస్తుంది. అఫ్సర్ లోని నిశితమైన పరిశీలకుడినీ, నిష్ణాతుడైన విశ్లేషకుడినీ, అద్భుతమైన సామాజిక చరిత్రకారుడినీ పరిచయం చేస్తుంది. కవిగా, కథకుడిగా, పాత్రికేయుడిగా తాను ఇదివరకే సాధించిన వివరణాత్మక, వర్ణనాత్మక శైలినీ, విభిన్న పొరల ఆలోచనలు ప్రేరేపించగల శక్తినీ అన్వేషణకూ, ఆ అన్వేషణాసారాన్ని వ్యక్తీకరించడానికీ ఎలా వాడుకున్నాడో ఈ పుస్తకం చూపుతుంది.

‘ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్’ ఏకకాలంలో నన్ను ఎంతో రాయడానికీ పురికొల్పుతున్నది, అసలేమైనా రాయగలనా, ఎంత రాస్తే ఆ పుస్తకానికి తగిన న్యాయం చేయగలను అని భయపెడుతున్నది. ముఖ్యంగా కరడుగట్టిన మతోన్మాదం జడలు విప్పుతున్న నేపథ్యంలో, ఇతర భావాల పట్ల హంతక అసహనాన్ని ప్రదర్శిస్తున్న మత భావజాలాల, మతోన్మాదాల వాతావరణంలో ఈ పుస్తకం అవసరం గురించి చెప్పవలసినది చాల ఉంది. రాయలసీమలో ఒక మారుమూల గ్రామంలో తరతరాలుగా సాగుతున్న హిందూ ముస్లిం మత సామరస్యం (బహుశా మత సామరస్యం కూడ కాదేమో, మత అభేదం, మత సమ్మేళనం అనాలేమో) పునాదిగా మన బహుళత్వ సమాజానికి ఎత్తిపట్టిన దర్పణంగా ఈ పుస్తకానికి ఇవాళ చాల ప్రాసంగికత ఉంది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యమూ, ప్రతి వాదనా, ప్రతి పుటా, ప్రతి అధ్యాయమూ నన్ను గత వర్తమానాల ఆశ్చర్య విషాదాల మధ్య ఊగిసలాడేలా చేశాయి.

పీర్ల పండుగ అనే ఒకానొక గ్రామీణ విశేషాన్ని ఆధారం చేసుకుని అనేక సంక్లిష్ట, సంకీర్ణ, బహుళత్వ ఆలోచనలనూ వాద ప్రతివాదాలనూ ముందుకు తెస్తూ, అంతకన్న లోతైన ఆలోచనలు సంఘర్షించేలా చేస్తూ సాగిన ఈ పుస్తకం గురించి రాసేముందు అసలు ఈ పీర్ల పండుగ గురించి నా అనుభవంతో ప్రారంభిస్తాను. తెలంగాణ అంతటా పీర్ల పండుగ వ్యాపించి ఉంది. నేను మా రాజారంలో ఉన్న నా పన్నెండో ఏటివరకూ ప్రతి ఏటా పీర్ల పండుగ చూశాను. ఇరవయో ఏట ఆ ఊరితో సంబంధం పూర్తిగా తెగిపోయింది గనుక ఆ తర్వాత పీర్లపండుగను పట్టణాల్లో, నగరాల్లో చూశాను గాని ఆ అనుభవాలు కాస్త భిన్నమైనవి. ఇక్కడ పూర్తిగా బాల్యానికి సంబంధించిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను. మా ఊళ్లో పీర్ల పండుగ ఊరందరి పండుగలాగే జరిగేది. ఊళ్లో ఉన్న పీర్ల కొట్టం నుంచి పీరీలను తీసి అలంకరించి, పది రోజులు గద్దె మీద ఉంచేవారు. పదోరోజున ఆ పీరీలను ఎత్తుకుని ఊరివాళ్లందరూ, ప్రధానంగా శూద్రకులాలు, దళితులు కూడ ఊరేగింపు చేసేవారు. ముందర మాదిగడప్పులు మోగుతుండేవి. ఆ పీరీల ఊరేగింపు ఊరంతా తిరిగేది. బ్రాహ్మల, కరణాల, రెడ్ల ఇళ్లు పెద్దవి గనుక వాళ్ల ఇళ్లముందూ, వాడల్లో అక్కడక్కడా ఆగేవి. ప్రతిచోటా ఇళ్లలోంచి ఇంటి పెద్దలు స్వయంగా కుండలతో, బిందెలతో నీళ్లు తెచ్చి పీరీలు ఎత్తుకున్నవాళ్ల కాళ్లమీద గుమ్మరించేవాళ్లు. ఆ పీరీల వెంటనడిచే వాళ్లు ఇచ్చే “విభూతి”ని తీసుకునేవాళ్లు. ఫతేహాలు చదువుతుంటే వినేవాళ్లు. అది “తురక దేవుడి” ఆరాధన అనీ, పీరీలు ముస్లింల ఆచారమనీ, అది ముహర్రం అనే ముస్లిం సంస్మరణ సందర్భమనీ, అందులో ముస్లిమేతరుల పాత్ర ఏమిటనీ ఆలోచనలు ఆ నైసర్గిక గ్రామీణ అవగాహనల్లో ఎంతమాత్రం ఉండేవి కావు. నిజానికి అప్పటికి మా ఊళ్లో ముస్లిం కుటుంబాలు మూడు నాలుగు కూడ లేవు. నాకు తెలిసినవి పోస్ట్ మాన్ లాల్ మియా, చిన్న చిల్లర దుకాణం నడుపుతుండిన అబ్బాస్ అలీ రెండు కుటుంబాలు మాత్రమే. అప్పటికి ఐదారువందల గడప ఉన్న ఊళ్లో నాలుగు కుటుంబాలంటే ఊరి జనాభాలో ఒక్క శాతం కూడ కాదు. కాని ఆ ఒక్కశాతం ప్రజల సంస్మరణ ఆచారం ఊరందరి ఆచారంగా జరిగేది. అదంతా నాలుగున్నర దశాబ్దాల వెనుకటి కథ. ఇప్పుడు మా ఊళ్లో కూడ పీర్ల పండుగ అంత బహుళత్వంతో అంత సామూహికంగా జరుగుతున్నదో లేదో తెలియదు.

కాని అనంతపురం జిల్లాలో గూగూడు అనే చిన్న గ్రామంలో ప్రతి ఏటా పీర్ల పండుగ మహోజ్వలంగా జరుగుతున్నది. ఆ ఊళ్లో ముస్లిం జనాభా స్వల్పమే. మొత్తం జనాభా దాదాపు మూడు వేలు కాగా, ముస్లింలు (దూదేకులు) రెండువందల లోపు. కాని ఆ ఊరు ఊరంతా ఆ పండుగను సొంతం చేసుకుంటున్నది. కనీసం మూడు లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవం మత విభజనలను అధిగమించింది. ఒకానొక మత విశ్వాసపు మౌలిక అంశాల మీద నిర్మాణమైనప్పటికీ ఇతర మత విశ్వాసాలు కూడ కలగలిసినది. ఒక సామూహిక నైసర్గిక సంస్మరణ ఉత్సవం అది. ఆ ఉత్సవం నేపథ్యంగా ‘దక్షిణ భారతదేశంలో జనప్రియ ఇస్లాం – సాముదాయక భక్తి’ అనే విశాలమైన పరిశోధన, అన్వేషణ, వివరణ, విశ్లేషణ సాగించడానికి పూనుకున్న అఫ్సర్ తొమ్మిది నెలల పాటు ఆ గ్రామంలోనూ, సంబంధిత స్థలాల్లోనూ పరిశోధించి ఈ పుస్తకం రాశాడు.

ఈ పుస్తకంలో ఉపోద్ఘాతం, ముగింపు కాక ఐదు అధ్యాయాలున్నాయి. ‘గూగూడు: సాముదాయక భక్తి స్థలం ఆవిర్భావం’ అనే మొదటి అధ్యాయం గూగూడు ప్రాధాన్యత గురించీ, దాని ఆవిర్భావ వికాసాల గురించీ వివరిస్తుంది. ‘టోపీ పెట్టుకున్న పీర్: కుళ్లాయప్ప కథనం’ అనే రెండో అధ్యాయం గూగూడు ప్రాముఖ్యతలోకి రావడానికి మాలమైన కుళ్లాయప్ప అనే పీర్ గురించి ఉన్న కథనాలను వివరిస్తుంది. ‘కుళ్లాయప్ప – ముహర్రం బహిరంగ ఆచారాలు’ అనే నాలుగో అధ్యాయం పదమూడు పరిశుద్ధ దినాలలో రోజువారీ జరిగే కార్యక్రమాలను, ప్రత్యేకంగా ఏడో రోజు, పదో రోజు జరిగే ఆచారాలను వివరిస్తుంది. ‘ఫకీరి: తాత్కాలిక సన్యాస ఆచరణ’ అనే నాలుగో అధ్యాయం కుళ్లాయప్ప భక్తిలో భాగంగా ప్రజలు ఆచరించే ఫకీరి ఉపవాసదీక్ష గురించి వివరిస్తుంది. ‘ఆచారాల చర్చ: ‘శుద్ధ’ ఇస్లాం రాజకీయాలు’ అనే ఐదో అధ్యాయం సమకాలీన మతతత్వ విస్తరణ నేపథ్యంలో గూగూడు ముహర్రంను పోల్చి చూసి విశ్లేషిస్తుంది. దాదాపు ఇరవై పేజీల పాదసూచికలు, నాలుగు పేజీల అర్థ వివరణలు, ఏడెనిమిది పేజీల ఉపయుక్త గ్రంథ సూచి రచన ఎంత పకడ్బందీగా సాగిందో చూపుతాయి. అఫ్సర్ తన కవితల, కథల, సాహిత్య విమర్శ వ్యాసాల నిర్మాణంలో ఎటువంటి శ్రద్ధ చూపుతాడో ఈ రెండు వందల పేజీల రచనలో అంతకు మించిన శ్రద్ధ కనబరచాడు.

ఈ పుస్తకం గురించి చెప్పుకోవలసిన అనేక అంశాలలో ఒకటి, మన గ్రామసీమల్లో హిందూ ముస్లిం సంప్రదాయాలు, బహుశా అవి వేరువేరని కూడ తెలియనంతగా ఎంత గాఢంగా కలిసిపోయాయనేది. ఇవాళ మతోన్మాద రాజకీయాలు చూపుతున్నట్టుగా హిందూ, ముస్లిం అస్తిత్వాలు విభిన్నమైన, ఎదురుబొదురుగా నిలబడిన, నిత్య సంఘర్షణాయుతమైన, వైరి అస్తిత్వాలు అనే ఆలోచన దాదాపుగా లేని సమాజపు ఆచారవ్యవహారాల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. బహుశా భిన్న భావాల పట్ల సహజంగా ప్రజాస్వామిక సహనం పాటించే, ఆదాన ప్రదానాలతో సాగే, బహుళత్వ చిహ్నాలను ఆమోదించే గ్రామీణ సమాజ వివేకపు చిత్రణ ఇది. ఈ వివేకం భాషలో, భావనల్లో, ఆచారాల్లో అన్ని చోట్లా కనబడుతుంది.

అసలు కర్బలా యుద్ధంలో చనిపోయిన మహమ్మద్ ప్రవక్త మనుమల సంస్మరణలో రూపొందిన విషాద సంస్మరణ ఆచరణ ముహర్రం. దానికి షియా ముస్లింల వ్యాఖ్యానం, అది దక్షిణ భారతదేశంలోకి సూఫీల ద్వారా వచ్చిన తీరు, అది చివరికి ప్రధానంగా ముస్లిమేతర (హిందూ కాదు, హిందువులు అనడానికి కూడ వీలులేని అనేక సమూహాలు మన గ్రామసీమల్లో ఉన్నాయి) భాగస్వామ్యంతో, వారి కథలతో, వారి ఆచారవ్యవహారాలతో, వారి ఆదానప్రదానాలతో కలగలిసి ఒక అమాయక సామూహిక మత ఉత్సవంగా మారిందో అఫ్సర్ చాల వివరంగా, విశ్లేషణతో చూపుతాడు.

గూగూడులో ఉన్నది ప్రధానంగా ముస్లిం పీర్ ప్రార్థనాస్థలం. ఆ పీరు పేరు కుళ్లాయప్ప. కుళ్లాయి (తల మీది వస్త్రం – టోపీ) అనే పర్షియన్ మాటకూ అప్ప అనే రాయలసీమ మాటకూ మైత్రి కుదిరి కుళ్లాయి పెట్టుకున్న అప్పగా రూపాంతరం పొందింది. అలా ఆయన పీరు స్వామి అయ్యాడు. ఆయన స్థలం, ఆరాధనా స్థలం, ఆశ్రయం – పీర్, మకాన్ (ఇల్లు) అనే రెండు మాటలు కలిసి, మొదటి మాట అజంతంగా తెలుగీకరణ పొంది, మకానం అనే కొత్త మాట పుట్టుకొచ్చి పీరు మకానం అయింది. నిజంగా ప్రజల సృజనాత్మకత ఎంత విశిష్టమైనది! అలాగే ముస్లిం సంప్రదాయంలోంచి ఒక మాట ముస్లిమేతర, హిందూ సంప్రదాయంలోంచి మరొక మాట కలిసి గూగూడు పదజాలం చాల తయారయింది. జియారతు దర్శనం, ఫతేహా ప్రసాదం, ముజావరు పూజారి, దీన్ గోవిందా, షహర్ గస్తీ – సెరిగట్టి, ఎర్రదారం కట్టుకుని ఫకీరు దీక్షకు పూనుకోవడం, ఫకీరి ఉపవాసాలు, ముహర్రం జాతర, కందూరి సామూహిక భోజనాలు లాంటి ఎన్నో పదాలు పుట్టుకొచ్చాయి. చదివింపులు, ప్రదక్షిణలు, నిప్పుల గుండం నుంచి బూడిద తీసి నుదుటికి, వంటికి రాసుకోవడం, పీరు మకానంలో ఒక పక్కన ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ తీసుకోవడం, పొర్లు దండాలు, విశ్వరూపం, పీర్ ను అవతారం (రాముడి అవతారం)గా, విష్ణువు పదకొండో అవతారంగా భావించడం వంటి ఎన్నో ప్రధానంగా హిందూ లేదా అంతకు ముందరి ఆచారాలు ఈ పీరు ఆరాధనలో కలిసి పోయాయి. బలి ఇవ్వడానికి ముస్లిమేతరులు తెచ్చిన జంతువులను కూడ ముస్లింలు ఫతేహా చదివి బలి ఇచ్చినతర్వాతనే వండుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో అది ఇస్లాం ఆచారమా, హిందూ ఆచారమా, హిందుత్వతో సంబంధంలేని శూద్ర కులాల ఆచారమా చెప్పలేని స్థితి ఉంటుంది. నియ్యా అనే అరబిక్ మాట నియ్యతు (పరిశుద్ధ సంకల్పం) గా మారడం, బర్కత్  (దైవ ప్రసాదం) అనే మాట బర్కతుగా మారడం సరే సరి. ప్రతి ఏటా గూగూడు ముహర్రం ఉత్సవాలు (వాటిని బ్రహ్మోత్సవాలు అనడం కూడ మొదలైంది!) చూడడానికి రావడం తీర్థయాత్రలాగ భావించేవాళ్లూ, పేదవారి హజ్ యాత్రగా భావించేవాళ్లూ కూడ ఉన్నారు. ఇతర చోట్ల ముహర్రం గాథలనుంచి గ్రహించి మార్చుకున్నవీ, సొంతంగా తయారు చేసుకున్నవీ ఎన్నో గూగూడు కథలు, గాథలు, సంగీతం, పాటలు, నమ్మకాలు పుట్టుకొచ్చాయి.

గూగూడుకు దానిదైన ఒక ప్రత్యేక స్థల పురాణం కూడ ఉంది. అది దండకారణ్యలో భాగమైన ప్రాంతమని, అది సీతారామలక్ష్మణులకు ఆతిథ్యం ఇచ్చిన గుహుడి గూడు అని ఒక కథనం. కాలక్రమంలో అది చంద్రాయణపేట అయింది. ఆ గ్రామం ఏ కారణం వల్లనో దగ్ధమైపోయింది. ఆ గ్రామదహనం, కొత్త గ్రామ పునర్నిర్మాణం బహుశా మారుతున్న నాగరికతలకు, పాత గ్రామాలు విధ్వంసమై కొత్త గ్రామాలు రూపొందడానికి ప్రతీకలు కావచ్చు. పాత గ్రామంలో పోషణ లేని చెన్నకేశవస్వామి ఆలయం ఇంకా ఉంది. ఆ దగ్ధమవుతున్న గ్రామం నుంచి బైటపడడానికి చేసిన ప్రయత్నమే తరతరాల సంచిత జ్ఞాపకంలో నిప్పుల గుండం మీద నడకగా మారి ఉండవచ్చు. అక్కడి నుంచి జనాన్ని కుళ్లాయప్పే ఇక్కడికి తీసుకువచ్చి తన మకానం చుట్టూ కొత్త ఊరు ఏర్పరచాడు. కుళ్లాయప్ప వాస్తవానికి ముస్లింల పవిత్ర ప్రతీక అయిన పంజా. పాత గ్రామం తగులబడిపోయినప్పుడు కంసాలులు బావిలో పడేసిన ఆ ప్రతీకను కొండన్న అనే వ్యక్తి తీసుకువచ్చి పీరు మకానంలో స్థాపించాడు. ఇప్పటికీ కొండన్న వారసులే ఈ ఉత్సవంలో ప్రధానభాగం వహిస్తారు. ఇది చదువుతున్నప్పుడు నాకు బుద్ధుడు మొట్టమొదట తన బోధనలను వినిపించిన ఐదుగురు శిష్యులలోని కొండన్న గుర్తుకు వచ్చాడు. ఒక విశ్వాసం నుంచి మరొక విశ్వాసానికి మారడానికి, లేదా రెండు విశ్వాసాల సమ్మేళనానికి కొండన్న ప్రతీక కావచ్చునా?

ఈ క్రమంలో గూగూడు ప్రాదేశిక సరిహద్దులు, గూగూడు భూగోళం కూడ కొత్త అర్థాలు సంతరించుకున్నాయి. కొత్త వ్యాఖ్యానాలు పొందాయి. “పీరు రాకముందు ఇదంతా దట్టమైన అరణ్యం. పీరు రాకతోనే ఇది సంపన్నమైంది” అంటాడు హుస్సేనప్ప. కర్బలా యుద్ధం వాస్తవంగా ఇవాళ్టి ఇరాన్ లో జరగలేదని, గూగూడు సరిహద్దులలోనే జరిగిందని, అందులో ప్రవక్త మనుమలతో పాటు కుళ్లాయప్ప కూడ పోరాడి అమరుడయ్యాడని, కర్బలా అమరులు హసన్, హుసేన్ లు కుళ్లాయప్ప తమ్ములని ప్రజల విశ్వాసం. అలాగే వాస్తవ కర్బలా గాథలో హసన్, హుస్సేన్ లను చంపిన యాజిద్, గూగూడు గాథలో మొఘల్ చక్రవర్తికి సామంతుడైన స్థానికుడిగా మారిపోతాడు. మొఘల్ చక్రవర్తి కుళ్లాయప్పతో సహా తొమ్మిదిమంది పీర్లను నిర్బంధించడానికి ప్రయత్నించినప్పుడు వారందరూ ఆ పోరాటంలో చనిపోయారని స్థానిక కథనం చెపుతుంది. నిజానికి కథనం అని ఏకవచనంలో చెప్పడం కూడ సరికాదు. పునాదిగా ఒక మౌలికాంశం ఉండవచ్చు గాని దాని మీద లేచి నిలిచిన అనేక కథనాలున్నాయి. కులం, లింగం, ప్రాంతం, సాన్నిహిత్యం, ఆరాధనాపద్ధతి, సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలు ఆ కథనాలకు కొత్త కోణాలను కలుపుతున్నాయి. ఏకీకృత, శిలాసదృశ, సార్వజనిక మత విశ్వాసం గురించి ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు గూగూడు సూక్ష్మ ఉదాహరణ నుంచి పరిశీలిస్తే భారత సమాజంలో మతవిశ్వాసాల బహుళత్వాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది.

pirsఅసలు కుళ్లాయప్ప “ఆరాధన”లో కొంత అధిభౌతిక శక్తి ఆరాధన, కొంత హేతురహితమైన విశ్వాసం కూడ ఉండవచ్చుగాని అంతకన్న ముఖ్యంగా అది ఒక గ్రామీణ సమాజ సామూహికతా చిహ్నం. అది వ్యవస్థీకృతం కానంతవరకు అమాయకంగా, బహుళత్వంతో, ప్రజాస్వామికంగా కూడ ఉన్నది. మత విశ్వాసం వల్ల గూగూడు జన్నత్ కా దర్వాజా (స్వర్గ ద్వారం) అని ముస్లింలు భావించవచ్చు, వైకుంఠం అని ముస్లిమేతరులు భావించవచ్చు. కాని గూగూడు నుంచి నలబై ఐదు సంవత్సరాల కింద కర్నాటకకు వలస వెళ్లిపోయి, ప్రతి సంవత్సరం ముహర్రంకు మళ్లీ గూగూడుకు వచ్చే మదార్ సాహెబ్ మాటల్లో, “కుళ్లాయప్ప గాని, ముహర్రం గాని లేకపోతే మేం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి, సంబంధంలో ఉండడానికి అవకాశమే దొరకదు” అన్నట్టు ఇది సామూహిక కలయిక వేడుక.  ఈ సామూహికతలో హిందూ బ్రాహ్మణీయ మత కార్యక్రమాలకు భిన్నంగా శూద్ర, దళిత, మహిళా భాగస్వామ్యానికి అవకాశం ఉంది. విభిన్న కులాల వ్యక్తులు, ముస్లింలు, మహిళలు, ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులు, చిరు వ్యాపారస్తులు, ఇతర ప్రాంతాలలో ఉన్న కుళ్లాయప్ప భక్తులు వంటి ఎంతో మంది అభిప్రాయాలు ఈ సంకీర్ణతను వివరిస్తాయి.

అట్లని ఇది మత రహితమైన, అంధవిశ్వాస రహితమైన సామాజిక ఉత్సవం మాత్రమే అనడానికీ వీలులేదు. ఇక్కడ మహత్యాలున్నాయి. నాదస్వర వాద్యాలున్నాయి. స్వర్గపు ఆలోచనలు, పునర్జన్మ ఆలోచనలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే, అసలు పీరు మకానంలోనే ఆంజనేయ విగ్రహం ఉంది. పక్కనే పెద్దమ్మ ఆరాధన ఉంది. పొరుగున పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం బోధించిన కొండ ఉంది. హిందూ బ్రాహ్మణీయ మడి – వెలికి సమానమైన నిరంకుశత్వంతో కాకపోయినా పవిత్రత – అపవిత్రత ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలకు సమాంతరంగానే శూద్రకులాల సమైక్యత ఉంది.  అందువల్ల, ఈ ముహర్రంలో ప్రవక్త, అమరులైన ప్రవక్త కుటుంబసభ్యులు, ఖురాన్ ఫతేహా, జియారత్, నియ్యత్, బర్కత్ వంటి భావనలు ఉన్నప్పటికీ దీన్ని పూర్తిగా ముస్లిం ఉత్సవంగా చెప్పడానికీ వీలులేదు.

అసలు పీర్ల పండుగ అనడమే ముస్లిం మౌలిక ఆచారానికి భిన్నమైనది. పీర్లు కర్బలా యుద్ధంలో మరణించిన హసన్, హుసేన్ ల ప్రతిరూపాలు. విగ్రహారాధనను వ్యతిరేకించే ఇస్లాంలో ఆ మృతవీరుల చిహ్నాలను స్మరించడం, ఆరాధించడం కూడ “అనాచారాలే”. అలాగే మరణాన్ని సూచించే రోజును పండగగా జరపడం మరొక “అనాచారం.” కాని వాటిని అనాచారాలు అనడం కూడ ప్రామాణికత వైపు నుంచి, ఛాందస ఆచారాల వైపు నుంచి, ఆచారాలలో మార్పులేనితనం వైపు నుంచి చూసినప్పుడే గాని, మత విశ్వాసాలూ, ఆలోచనలూ, ఆచారాలూ ప్రజల నిత్యజీవిత వ్యవహారంలో, సంబంధాలలో, ఆచరణలో రూపొంది తలెత్తి లేచి నిలుస్తాయని, నిత్యం మార్పులకు లోనవుతాయని కూడ గుర్తించవలసి ఉంది.

“హిందువులు లేరు, ముస్లింలు లేరు. అందరిదీ ఒకటే మతం. దానిపేరు కుళ్లాయప్ప భక్తి” అని సత్తార్ సాహెబ్ అన్నమాట ఇవాళ్టి వివాదాల నేపథ్యంలో మతాన్ని కొత్తగా అర్థం చేసుకోవలసిన అవసరాన్ని సూచిస్తున్నది. అలాగే గూగూడులో ఈ పీర్ల పండుగ, ముహర్రం జరిపే పద్ధతి కూడ ఇతర ప్రాంతాలకూ, హైదరాబాద్ కూ భిన్నంగా ఉన్నదని సత్తార్ సాహెబ్ ఎత్తి చూపుతాడు. హైదరాబాద్ లో మాతం పేరుతో కొరడాలతో, ముళ్ల గొలుసులతో శరీరాల మీద కొట్టుకుంటూ నెత్తురు కార్చే ఆధారం ఉంది. గూగూడు నిప్పుల గుండంలో నడక దాని స్థానంలోనే వచ్చి ఉండవచ్చు.

ఈ మొత్తంలో కనబడేది స్థానిక ఆరాధనా పద్ధతులు, ఆచారాలు పెద్ద ఎత్తున సంలీనం కావడం, ప్రతి ఆచారమూ పునర్నిర్వచనానికి, భిన్నమైన ఆచరణకు గురికావడం. మొత్తం మీద కుళ్లాయప్పకు ఉన్న అనేక వ్యాఖ్యానాలలో, అర్థాలలో గ్రామదేవత, ముస్లిం ఆరాధనా చిహ్నం, కుల దైవం, అమరుడైన మహాత్ముడు అనే నాలుగు ప్రధాన అర్థాలున్నాయి. ఈ నాలుగు భిన్న నిర్వచనాలకు భిన్నమైన సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక, చారిత్రక మూలాలున్నాయి.

ఇవాళ్టి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వాతావరణంలో హిందూత్వవాదులు చెపుతున్నట్టు ఇస్లాం అనేది పరాయి నేల నుంచి వచ్చిన దురాక్రమణ మత విశ్వాసమే అయితే అది ఒక స్థానిక బహిరంగా ప్రజాస్థలంలో ఎటువంటి పరివర్తన పొందిందో, ఎంతగా స్థానికతతో మమేకమైందో, ఎంతగా స్థానికమైందో అనే ఆసక్తిదాయకమైన చర్చకు గూగూడు పరిశీలన వీలు కల్పిస్తుంది. అయితే సమస్య కేవలం హిందూత్వ వాదుల ‘వాతాపిజీర్ణం’ వాదానిదో, గుత్తాధిపత్యానిదో మాత్రమే కాదు. గూగూడు మార్పు చేర్పులను ఇస్లాం కూడ సమాదరించడం లేదు. అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు.

ఈసందర్భంగానే కుల విభజనలు లేని, సార్వజనిక సోదరత్వాన్ని ప్రతిపాదించే ఇస్లాం, కుల విభజనల, అంతరాల హిందూ సమాజంలో ప్రవేశించినప్పుడు ఎలా మారుతుంది, దేన్ని మారుస్తుంది, ఏ కొత్త రూపాలను సంతరించుకుంటుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు అఫ్సర్ విశ్లేషణలు దారితీస్తాయి. తాత్విక పరిభాషలో చెప్పాలంటే సాధారణత్వానికీ ప్రత్యేకతకూ, సార్వజనీనతకూ నిర్దిష్టతకూ మధ్య ఐక్యత, ఘర్షణలు ఎలా ఉంటాయో విస్తృత చర్చ చేయడానికి నమూనాగా నిలుస్తుంది గూగూడు గాథ.

ఇక్కడ అఫ్సర్ స్థానిక ఇస్లాం, స్థానికీకృత ఇస్లాం అనే విశ్లేషణా పరికరాలతో ఈ సమస్యను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. ‘స్థానిక ఇస్లాం’ గురించి గతంలోనే కొందరు పరిశోధకులు చర్చించి ఉన్నప్పటికీ గూగూడు దృశ్యం మరింత సంక్లిష్టమైనదనీ, దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో సూక్ష్మాంశాలను, మరెన్నో పొరలను విప్పిచూసే పరిశోధనాపద్ధతి అనుసరించాలని అఫ్సర్ అంటాడు. స్థానిక ఇస్లాం అనేది గూగూడు లాగ అనేక మత విశ్వాసాల సమ్మేళనం కాగా, ‘స్థానికీకృత ఇస్లాం’ విశ్వవ్యాప్త, ఏకశిలా సదృశ మత విశ్వాసాన్ని మాత్రమే అస్లీ ఇస్లాంగా అభివర్ణిస్తుంది. దాన్నే గీటురాయిగా పెట్టుకుని స్థానిక ఆచారాలను పరిశీలిస్తుంది. అందువల్ల సహజంగానే గూగూడు ‘స్థానికీకృత ఇస్లాం’కు విమర్శనీయ ఉదాహరణగా కనబడుతుంది. గూగూడు ముహర్రం విశ్వాసాలను సంస్కరించవలసి ఉందని అన్నవారిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. దేవుడు ఒక్కడే, మరెవరినీ దేవుడితో సమానం చేయగూడదు అని భావించే ఇస్లాం కుళ్లాయప్ప స్థానాన్ని ప్రశ్నిస్తున్నదని అఫ్సర్ చూపాడు. చివరికి కుళ్లాయప్ప పేరు మీద ప్రచారంలో ఉన్న మహిమలను విమర్శిస్తూ, ఆ విమర్శకు హేతుబద్ధతను తోడు తెచ్చుకున్న ఒక మతాధిపతిని కూడ అఫ్సర్ ఉటంకించాడు. ఈ అస్లీ ఇస్లాం ప్రభావం యువతరం మీద ఎక్కువగానే ఉన్నదని, అందుకు ఇస్లామిక్ గ్రంథాలు స్థానిక భాషల్లో విరివిగా వెలువడడం కూడ దోహదం చేస్తున్నదనీ వివరంగా చర్చించి, ఈ ఆలోచనలు ముందుకుసాగితే, గూగూడు ముహర్రం ఉత్సవాలలో ముస్లింల పాత్రకు ఏమవుతుంది అని కూడ ఆలోచనలు చేస్తాడు.

చిట్టచివరిగా, ముగింపులో భారత సమాజం వంటి మత బాహుళ్య సమాజాలలో ఎటువంటి సమన్వయ, సర్వాంగీణ, సమ్యగ్ దృక్పథం ఉండాలో చర్చించే ప్రాతిపదికను సూచించడానికా అన్నట్టు గురజాడ వంద సంవత్సరాల వెనుక రాసిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ లో పీర్ల ప్రస్తావనతో వచ్చిన చర్చను ప్రస్తావిస్తాడు. వంద సంవత్సరాల తర్వాత నిసార్ రాసిన ‘ముల్కీ’ కథను ప్రస్తావించి సమకాలీన సమస్యలనూ సూచిస్తాడు.

మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.

*

available at: http://www.amazon.in/Festival-Pirs-Popular-Shared-Devotion/dp/0199997594/ref=sr_1_1?s=books&ie=UTF8&qid=1457107819&sr=1-1&keywords=afsar%20mohammad

http://www.flipkart.com/festival-pirs-english/p/itmdhsyu8e4cknhg?pid=9780199997596&ref=L%3A2859794214406078613&srno=p_1&query=afsar%20mohammad&otracker=from-search

మీ మాటలు

  1. rani siva sankara sarma says:

    మంచి పుస్తకానికి మంచి పరిచయం

  2. Kuppilipadma says:

    విలువైన పుస్తకానికి విలువైన పరిచయం. మీ యిద్దరికి అభినందనలు.

  3. chandolu chandrasekhar says:

    n .వేణుగారు బావునారా! ఇటువంటి పరిస్తితితులలో మీ పుస్తక పరిచయము ఎంతో అవసరం .హిందూ ,ముస్లింల భావ సమైకయత తెలియజేసారు మంచి పరిచయం

  4. Delhi Subrahmanyam says:

    ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం అని వేణు తన అద్భుతమయిన విశ్లేషణ చివరలో చెప్పినట్టు, తన విశ్లేషణ చదవడం కూడా గొప్ప అనుభవం. ఇంత మంచి పుస్తకం రాసిన అఫ్సర్, అంతే మంచి విశ్లేషణ రాసిన వేణు అభినందనీయులు. ఒకవిధంగా ఇంతమంచి విశ్లేషణ ఒక వేణు మాత్రమే ఇవ్వగలడని నాకనిపించింది. అఫ్సర్ గారూ, మతం పేరిట ఇవ్వాళ జరుగుతున్న దుర్మార్గానికి మీ పుస్తకమ ఒక విలువయిన జవాబు కావాలి. వేణు చెప్పినట్టు “తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.” ఇది అందరూ, ప్రత్యేకించి మతం పేరా దుర్మార్గం చేస్తున్న వారు తప్పక చదవాలి.

  5. “మొత్తానికి ఈ పుస్తకం చదవడం ఒక గొప్ప అనుభవం. తరతరాల సామూహిక జ్ఞాపకం ఒక సమకాలీన బహుళత్వ ఉత్సవంగా మారి ఏకీకరణ, గుత్తాధిపత్య ఆలోచనలకు ఎదురుగా ఎలా నిలుస్తున్నదో ఒక సజీవ ఉదాహరణనుంచి చూపడమే ఈ పుస్తకపు విశిష్టత.”
    మంచి విశ్లేషణ చేసారు వేణుగోపాల్ గారు.
    ఈ పుస్తకం దొరికితే చదవాలని ఉంది.
    అఫ్సర్ గారికీ వేణుగోపాల్ గారికీ అభినందనలు

  6. Jaya Reddy Boda says:

    చాలా బాగుంది సార్ విశ్లేషణ మరియు అఫ్సర్ సార్ కి అభినందనలు, మా ఊరిలో కూడా పీర్ల పండుగ గ్రామ ప్రజలందరూ కలిసి బాగా చేసుకుంటారు పీర్ల పండుగ మూడు రోజుల ముందునుండే ముస్లిమేతరులు పులి వేషం కట్టి వాడ వాడ తిరిగి అందరిని ముఖ్యంగా పిల్లల్ని ఎంటర్ టైన్ చేస్తారు డప్పుల చప్పుళ్ళతో, పండుగ రోజు రాత్రి నుండి మరుసటి రోజు తెల్లవారు నాలుగు గంటల వరకు గోచి పెట్టుకొని రకాల రకాల విన్యాసాలు చేస్తూ,చుట్టూ చలిలో కూర్చున్న జనాన్ని కచీర్ బంగ్లా పైనుండి చూసే పిల్లల్ని పెద్దల్ని మా జమాల్ మామ తన కామెడితో నవ్వించేవాడు(నా చిన్నతనంలో) కానీ ఆయన వెళ్ళిపోయాడు చాలా కాలం తర్వాత మొన్న పోయిన పీర్ల పండుగ చూసాను ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇక్బాల్ చేస్తున్నాడు,వాళ్ళ నాన్న ద్వార వచ్చిన సుంకరి పని చేసుకుంటూ..మా ఊరి ” మన పోరుమల్ల” యఫ్ బి పేజీలో ఫోటోలు పెట్టాను కొన్నిఫోటోలు ,దసరా అయినా గుడి జాతర అయినా అందరు కలిసే చేసుకుంటున్నారు మత సామరస్యం పల్లెల్లో ఇంకా దెబ్బతినలేదు అని నాకు అన్పించింది..ధన్య వాదాలు

  7. s.haragopal says:

    మనిసంటేనే ఒక సమూహం.సామూహిక జీవనోత్సవాలను, ఉత్సాహాలను బలిపెట్టి ఎదుగుతున్నాననుకున్న మూఢపు మనుషులకు అసీమితప్రేమ తత్వం ఎట్ల బోధపడుతుంది.అఫ్సర్ రాసింది చదువలేదు కాని,వేణుగోపాల్ సమీక్ష,పరామర్శ ఇష్టంగా సాగింది. సామూహికజీవనోత్సవం జ్ఞాపకంగా ఈ సజీవోదాహరణం ఎంత మేలైనదిపుడు.అఫ్సర్ పుస్తకానికి ఆహ్వానం.వేణుగోపాల్ గారికి నమస్తే

  8. విలాసాగరం రవీందర్ says:

    వేణుగోపాల్ గారు చక్కటి విశ్లేషణ అందించారు. నాకూ పుస్తకం చదవాలని బలమైన కోరిక ఏర్పడింది

  9. సాయి.గోరంట్ల says:

    నేను గూగూడును ఎన్నోసార్లు దర్శించాను.
    ఈ ప్రాంతంలో కుళ్ళాయిస్వామి పేరంటేనే జనం భక్తితో పులకరిస్తారు.ఎంతో మంది తమ పిల్లలకు ఈ పేర్లు పెట్టుకుంటారు.
    కుల,మతరహితంగా అనంతపురం జిల్లానే కాక చుట్టుపక్కల రాష్ర్టాలనుంచి కూడా భక్తులు తరలివస్తారు.
    కాని అఫ్సర్ అన్న విశ్లేషణాత్మకమైన రచనను వేణుగారి పరిచయంలో చదివాక ఇంతమంచి పుస్తకం ఈ కాలంలో ఓ “అవసరం”అనిపించింది.
    సమాజం వర్గాలుగా విడిపోతున్న ఇలాంటి స్థితిలో ఇలాంటి రచనలు ఎంతో అవసరం కూడా
    మీ ఇద్దరికీ ప్రత్యేక అభినందనలు.
    ఈ పుస్తకాన్ని ఈ సం,,గూగూడులో ప్రజలకు అందుబాటులో వుంచే ఏర్పాటు చేయగలరేమో ఆలోచించమని మనవి

  10. Krishna Mohan babu says:

    ఓ చక్కటి పుస్తకానికి , సరైన పరిచయం .

  11. janardhana rao says:

    నా చిన్నపుడు , అంటే , అరవైలు , డెబ్భైలలో , అనంతపురములో అనేకసార్లు పీర్ల పండగను చూశాను.. నాకు అప్పట్లో ఏమీ అర్థము అయ్యేదికాదు.. కానీ , అందంగా అలంకరించిన ఆ పీరీలను పట్టుకొని కొందరు వెళుతుంటే అనేకులు ఊరేగింపుగా కూడా వెళ్ళడము , పాదాలపై నీరు పొయ్యడము , పులివేషాలు , అన్నీ గుర్తున్నాయి. ఒకోసారి పీర్లపండగ దసరాలో వచ్చేది.. అప్పుడు పండగే పండగ.

    తర్వాత్తర్వాత నేను అనంతపురానికి ఎప్పుడో గానీ వెళ్ళేవాణ్ణి కాదు. ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు చేశారు వేణుగోపాల్ గారు.

    అయితే , ఆ చిన్న వయసులో , ఏమీ అర్థము కాకున్నా , ’ అది మన పండగ కాదు ’ అన్న ఊహ అయితే ఉండేది… కారణము తెలీదు… బహుశః , మిగతా హిందువుల పండగల్లాగా అందరూ ఇళ్ళలో చేసుకోకపోవడము వల్ల కావచ్చు.

    అదొక సామూహిక సాంఘిక పండుగ .. మనుషులను కులమతాలకతీతముగా కలిపే పండుగ.. ఆ పరంపర ఇంకా కొనసాగుతున్నదని తెలిసి సంతోషముగా ఉంది… గూగూడు పేరు ఎన్నిసార్లో విన్నాను , చదివాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు.. ఆకాలములో ఒక్కసారయినా వెళ్ళుంటే బాగుండేదని ఇప్పుడనిపిస్తోంది.. ఇప్పటికీ అనంతపురములో , ఆ ఉత్సవాల గురించి , పాతరోజుల్లాగానే కరపత్రాలు గోడలపైన కనబడతాయి. ముఖ్యముగా పాతవూరు కూరగాయల మార్కెట్టు దగ్గర.

  12. Vageeshan says:

    “అసలు వ్యవస్థీకృత మతాలకు ప్రజల అవ్యవస్థీకృత, ప్రజాస్వామిక, నైసర్గిక ఉమ్మడి మత జీవనం గిట్టదు”. వెల్ said

Leave a Reply to s.haragopal Cancel reply

*