రన్ రాజా రన్!

 

                                                  -బమ్మిడి జగదీశ్వరరావు

 

bammidi ఓయ్ హైదరాబాదీ..

నువ్వు అస్కాలో వున్నా బాధలేదు గానీ.. హైదరాబాదులో వున్నావు.. కురుక్షేత్రంలో వున్నట్టే! ఆమాటకొస్తే కురుక్షేత్రం జరిగింది పద్దెనిమిది రోజులే! హైదరాబాదులో వున్నోళ్ళకి నిత్యమూ నిరంతరమూ  కురుక్షేత్ర రణరంగమే! యమగండమే!

ఇక్కడ ‘నా దారి రహదారి’ అని రజనీకాంత్ కూడా అనలేడు! పవన్ కళ్యాణ్ కూడా ట్రెండ్ సెట్ చెయ్యగలడేమో గాని ట్రాఫిక్ సెట్ చెయ్యలేడు!

ఓరే.. నిన్నుగన్న తల్లికి వేయి దండాలు.. ఆ హైదరాబాదు రోడ్లమీద యెప్పుడూ రొండు కాళ్ళు యెడంగా పెట్టి నిలబడకు నాయనా.. నీకాళ్ళ సందున సందు చిక్కిందని ఆటోవాళ్ళు దూరిపోయి వెళ్ళిపోతారు! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

ఫుట్పాత్ మీద నడుస్తాను, నాకేంటి? అనుకోకు.. మన వూళ్ళోలాగ కాదు, ఫుట్పాత్ మీద టూ వీలర్లు నడుపుతారు! ఏమాటకామాట చెప్పుకోవాలి భలే ఫీట్స్ చేస్తారులే! జెమునాస్టిక్స్ టిక్కెట్టు లేకుండా చూడొచ్చు! వాళ్ళయినా యేo చేస్తారు? రోడ్లు ఖాళీ లేవు! వాళ్ళకి మరో దారిలేదు! టైము అంతకన్నాలేదు! ఫుట్పాత్ల మీద ఖాళీ యెక్కడుందీ అంటావా? ఉన్నంత వరకూ వున్నమాట చెపుతున్నా! ఆ తరువాత అర్రంటే కాదు.. బుర్రంటే రాదు!

రోడ్డు దాటేటప్పుడు వన్ వే కదా అని వొక వైపే చూస్తూ దాటేవు.. ‘చూడు.. వొక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు’ అని నందమూరి బాలకృష్ణ చెప్పాడు కదా అని రెండోవైపు చూడకుండా వుండేవు.. ఎట్నుంచి యెవడొస్తాడో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు! అంచేత అటూ యిటూ చూసి వాయువేగంతో రోడ్డు దాటాలి! ఆయువుంటే అవతలికి చేరిపోతావు! లేదంటే నీ పూర్వీకులని చేరిపోతావు!

బస్సు యెక్కడం చేతకావడం లేదని అన్నావు. అదేమీ బ్రహ్మవిద్య కాదు. జనం మధ్యలోకి దూరితే వాళ్ళే నిన్ను బస్సులోకి తోసేస్తారు! దిగాలనుకుంటే కూడా అంతే.. డోరు దగ్గరకు రావడం నీవంతు! మిగతా తంతు మిగతా ప్రయాణీకులు చూసుకుంటారు! కొద్దిగ ఆసుకొని కాసుకోగలిగితే వాళ్ళే తోసేస్తారు! కాకపోతే మధ్యలో సన్నికల్లు తొక్కినట్టు కాళ్ళు తొక్కుతారు! నొప్పి పడకుండా వుండాలంటే పెళ్లి రోజుల్ని తలచుకో! తీయగా అనిపిస్తాది.. తరువాత యింటికెళ్ళి తైలం రాసుకోవచ్చు! కాళ్ళు తొక్కుతున్నావేమి? అని పొరపాటున కూడా అడక్కు నాయినా.. సిటీకి కొత్తనుకుంటారు! అలాగే చెప్పడం మర్చిపోయాను.. సీటు కోసం ఫిల్టీలు పట్టి కుస్తీపట్టులు పట్టకు.. యెంతో అదృష్టముంటే తప్ప అది అందరికీ దొరికేది కాదు! అదేమీ మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల సీటు కాదు! నీ నుదిటన రాస్తే దొరుకుతుంది.. లేదంటే లేదు! ఒళ్ళు హూనమైతే రాత్రికి నిద్ర బాగా పడుతుందని సరిపెట్టుకో!

లేదూ నేనూ మార్గదర్శిలో చేరాను.. అని మోపెడ్ కొనుక్కున్నావనుకో- మోపెడు కష్టాలు.. తడిపి మోపెడు అనుభవాలు! ఇన్సూరెన్సూ ఆర్సీ లైసెన్సూ పొల్యూషనూ అన్నీ వున్నా హెల్మెట్ యేది అంటాడు, వెయ్యి బాత్తాడు! అది నిన్నటి మాట. ఇప్పుడు ఫస్ట్ టైం వంద, సెకండ్ టైం మూడొందలు చలానా ప్లస్ చార్జిషీట్.. ఆపైన వొక్క చాన్సు యిచ్చి జైలు.. వెహికల్ సీజ్.. చాలదని టూవీలర్ వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట గదా? నయం.. రోడ్డుమీద నడిచేవాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టుకోమనలేదు.. అని అనుకోకు! ఔనుమరి.. నడిపేవాళ్ళకీ వెనక కూర్చొనేవాళ్ళకేనా తలలుండేది? నడిచే పాదచారులకి తలలుండవా? తలసరి లెక్కల్లో ప్రతి తలా కౌంటబులే కదా? ఆ లెక్కన హెల్మెట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది.. రావల్సినోళ్ళకి కావలసినంత పర్సెంటేజీ.. యిప్పటికే హెల్మెట్ల షార్టేజీ.. రెట్టింపు ధరలకి కొనాల్సిందే.. కాదంటే ట్రాఫిక్ పోలీసులకి అమ్యామ్యాలు యివ్వాల్సిందే.. దొరికినోళ్ళకి దొరికినట్టు చలానాలు రాయడంలో ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకోవడం మాత్రం అభినందించాల్సిందే! దారుల్లో వాహనదారుల్ని ఆపడం చూసి దోపిడీ దొంగల్ని చూసి హడలిపోయినట్టు హడాలిపోతున్నారట గదా? ఏమైనా నాలుగేళ్ళలో నూటరవై కోట్లు ప్రభుత్వానికి చేరిన ఆదాయమట! జేబుల్లో చేరిన డబ్బుల లెక్కలు ఏ పేపరోళ్ళూ యివ్వలేదు!?

అయినా అన్నిటికీ యిక మీ ఆవిడ్నో పిల్లల్నో బండిమీద తిప్పాల్సిన పనిలేదు. ఇంకో హెల్మెట్ లేదని చెప్పి యెంచక్కా నువ్వొక్కడివే టింగురంగా అంటూ తప్పించుకు తిరగొచ్చు! ఇవన్నీ సరేనని హెల్మెట్ పెట్టుకున్నావే అనుకో జట్కా గుర్రానికి గంతలు కట్టినట్టే, ముందున్నదే కనిపిస్తుంది తప్ప పక్కనున్నదేదీ కనిపించదు! అసలు యాక్సిడెంట్లు అప్పుడే అవుతాయి! జుట్టు రాలిపోయి నెత్తిమీద చంద్రుడు వొస్తే వొచ్చాడు, పక్కనుంచు! హెల్మెట్ పెట్టుకుంటే ముఖానికి రాసుకున్న పౌడర్ చెక్కు చెదరదు గానీ కాళ్ళూ చేతులే మనవి కావనుకోవాల!

అర్రన్నా బుర్రన్నా ఆపలేం.. హైదరాబాదు రోడ్లు అలాంటివి! రోడ్ల మీద యెక్కడ గొయ్యుoటాదో.. యెక్కడ నుయ్యే వుoటాదో నీకు తెలీదు.. నీకు తెలిసిందల్లా నీకు స్పాండిలైటీసా లేకపోతే వెన్నులో పూసలేమైనా రాలిపోయాయో కదిలిపోయాయో తెలుస్తుంది! రోడ్ల దయవల్ల డాక్టర్లకి మరింత ఆదాయం కలిసొస్తోంది! అన్ని సినిమాలు ఒకేలా వుండవు!’ అన్నట్టు రోడ్లన్నీ ఒకేలా వుండవు! పెద్దలున్న రోడ్లు ఒకలా వుంటాయి! తార్రోడ్డులు తల తలా కొత్తగచ్చులా మెరుస్తాయి! వొడ్డించిన వాళ్ళకే వొడ్డించినట్టు.. పోసిన రోడ్లమీదే రోడ్లు పోస్తారు! అయినా జూబ్లీహిల్స్ రోడ్లూ బంజారాహిల్స్ రోడ్లూ వున్నట్టు- కృష్ణానగర్ రోడ్లూ అమీర్ పేట రోడ్లూ యెందుకుంటాయి? రోడ్లకి కూడా వర్గముందని కమ్యూనిస్టులే చెప్పాలా?, మనకి తెలీదా?! రోడ్లు బాగుచెయ్యకుండా హెల్మెట్లతో పాటు బులెట్ ప్రూఫ్ తొడుక్కున్నా సేఫ్ గా నువ్వు యింటికి తిరిగి చేరుతావన్న గ్యారంటీ లేదు! అందుకే దానికి కూడా యిన్సూరెన్స్ సదుపాయముందని సంబరపడి సరిపెట్టుకోవాల!

సరే, లోను పెట్టి కారే కొన్నా.. గంటకు పదమూడు కిలోమీటర్లు కన్నా వేగంగా వెళ్ళమను.. నిన్ను గిన్నీసు బుక్ యెక్కించకపొతే అడుగు? పెట్రోలు పదహారు కాదు, పదకుండు కూడా రాదు! ఆటో యెక్కితే నగర సంకీర్తనమే! రోడ్డు మరమ్మత్తులని మూడు కిలోమీటర్లకి తొమ్మిది కిలోమీటర్లు చుట్టిరావలసిన పరిస్థితి! ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గరే సగం జీవితం సంకనాకిపోయే పరిస్థితి! అయితే వొక్కటి నిజం.. మనం ట్రాఫిక్ లో అలవాటు పడితే యెక్కడాలేని వోపికా సహనమూ సొంతమవుతుంది! దాంతో ఆఫీసులో బాసు తిట్టినా రుషి మాదిరి నీక్కాదని దులిపేసుకొని యెంచక్కా వుండిపోతావు! మీయావిడతో కూడా గొడవలు తగ్గిపోతాయి!

ఈ ట్రాఫిక్ లో పడి ఆఫీసుకు రావడమే పెద్ద డ్యూటీ! విడిగా డ్యూటీ చెయ్యక్కర్లేదు! సీటుల్లో కూర్చొని నిద్రపోవడాన్ని ట్రాఫిక్ని అర్థం చేసుకున్న యెవరన్నా అర్థం చేసుకొనే తీరుతారు!

కిరోసిన్ తో ప్రయోగాత్మకంగా బళ్ళు నడిపే ఆటో సైంటిస్టులూ.. పదకుండో శతాబ్దంనాటి ప్రభుత్వవాహనాలూ.. పగలే నల్ల మేఘాలు వొదిలే వాళ్ళను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు! జలుబూ జ్వరాల్లా కేన్సర్లూ ట్రీట్మెంట్లూ.. కార్పోరేట్ హాస్పిటల్లకి- రెండు చేతులా ఆదాయం వొస్తుందనుకో! ట్రాఫిక్ యిన్స్పెక్టర్లు తమ కండిషనేగాని బండి కండిషన్ చూడరు! లంబుగాడికి జంబుగాడు తోడన్నట్టు మెట్రో వర్క్స్.. మున్సిపల్ వర్క్స్.. పోటీపడి పురావస్తు శాఖలోళ్ళు తవ్విపారేసినట్టు తవ్విపారేస్తున్నారు!

దారీతెన్నూ తెలీని అడవిలో వొదిలేసినా హాయిగా యింటికి వొచ్చేయొచ్చు.. కానీ రోడ్లో వొదిలేస్తే యెలా వొస్తావు తమ్మీ? రాలేవు! తుఫాను భాదితుల్ని పట్టించుకుంటారు గాని ట్రాఫిక్ భాదితుల్ని పట్టించుకుంటారా? కోరు! అలవాటు పడకపోతే- ట్రాఫిక్ లోంచి వొచ్చినవాడు టెర్రరిస్టులా వుండక సౌమ్యంగా సున్నితంగా పెళ్ళాం బిడ్డలతో యెలా వుంటాడు? మన ఆడవాళ్లకే కాదు, మనకయినా సంసారం చెయ్యబుద్దవుతుందా? మా ఆయన కాపురం చెయ్యడం లేదని కోర్టుల కెక్కితే జడ్జిగారికి యేo చెప్పేది? విడాకుల కారణాల్లో ట్రాఫిక్ ని కూడా చేర్చాలి!

డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో చెకింగ్ లు యెక్కువయ్యాయి! తాగినందుకే ఖర్చు! మళ్ళీ తాగినడుపుతున్నావని ఫెనాల్టీ! రెండువిధాలా చిక్కే! బొక్కే! అయితే అదో కిక్కే! తాగకుండా ట్రాఫిక్ లో నడపడం ఆషామాషీ కాదు అని యీ ప్రభుత్వాలు యెప్పుడు గుర్తిస్తాయో యేమో? ఓ విషయం చెప్పనా.. యీ రోడ్లకి యీ ట్రాఫిక్కి తాగి నడుపుతున్నాడా?, తాగకుండా నడుపుతున్నాడా? తేడా యెవడూ కనిపెట్టలేడు!, బ్రీత్ అనలైజెర్ తో టెస్టు చేస్తే తప్ప! ఇవన్నీ సరే.. టీవీల్లో చూపించడం వల్ల యిలా కూడా కొన్నాళ్ళకి నువ్వు పాపులర్ కాగలవు!

ప్రతిదాన్లోనూ పాజటీవ్ యాటిట్యూడ్ అవసరం! ట్రాఫిక్ ని కూడా పాజిటీవ్ గా చూడడం వల్ల మాత్రమే నువ్వు ట్రాఫిక్ ని అధిగమించగలుగుతావు!

విష్ యూ హ్యాపీ జర్నీ!

మీ

పూర్వ హైదరాబాదీ

మీ మాటలు

  1. Buchireddy gangula says:

    ట్రూత్ రావు గారు
    Excellent .వన్. సర్
    /-/-//////—
    Buchi reddy గంగుల

  2. హ హ నైస్ …

  3. Manasara haiga navvanu.

  4. Delhi (Devarakonda) Subrahmanyam says:

    గొప్ప సరదాగా రాసీసినావ్ బావ్. వయితే నోక్కసోట మాతురం నేనొప్పుకోను. హెల్మెట్ గురించి రాసినది మాతరం కొంత సరిగ్గనేడు బావ్. హెల్మెట్ వల్ల 36 వయసున్నప్పుడు బకెట్ తన్నేకుండా వింకో 35 ఏళ్ళు బతికిసినాను. వదోక్కటే పైన రాసిన మంచి దానిలో విబ్బంది.

  5. కె.కె. రామయ్య says:

    ” అర్రన్నా బుర్రన్నా ఆపలేం.. హైదరాబాదు రోడ్ల మీద ట్రాఫిక్ ని. యీ రోడ్లకి యీ ట్రాఫిక్కి తాగి నడుపుతున్నాడా?, తాగకుండా నడుపుతున్నాడా? తేడా యెవడూ కనిపెట్టలేడు! ” మంచిగా చెప్పినవ్ తమ్మీ.

    తరతరాల వారసత్వ హైదరాబాదు సిటీ ట్రాఫిక్ ని ( గోల్కొండ ఖిల్లాలా, సాలార్జంగ్ మ్యూజియంలా , మూసీ నదిలా ) ఇన్నాళైనా ఇంకా నిలుపుకోస్తున్నందుకు సంబరపడి పోతున్నా ~ ఓ పూర్వ హైదరాబాదీ

మీ మాటలు

*