నిలకడగా నాలుగో అడుగు!

 

 

అంత తేలికేమీ కాదు, నాలుగడుగులూ కలిసి నడవడం! కలిసి నడవడం అంటే వొకరి అడుగుల్ని ఇంకొకరు అనుకరించడమూ కాదు, అనుసరించడమూ కాదు. ఎవరి నడక వాళ్ళదే! ఎవరి పాదముద్రలు వాళ్ళవే! ఆ వేరే అడుగుల మీద నమ్మకమూ గౌరవమూ రెండూ మిగుల్చుకుంటూ నడవాలి. ఆగని నడక! నడవడమే కాదు, ఆ నడకలో కొన్ని కట్టుబాట్ల మీద పట్టు సడలని భరోసా కూడా తోడవ్వాలి. ఏ నేల మీద కలిసి నడుస్తున్నామో ఆ నేల మీద కచ్చితంగా కాళ్ళు నిలిపి నడవాలి. ఆ గాలిలో ఊపిరై సాగాలి. అంటే, ఆ నేలలోని ప్రతి పరిమళాన్నీ, ఆ గాలిలోని ప్రతి విసురునీ అనుభవించి పలవరించాలి.

గత ఏడాది తెలుగు వాళ్ళ ప్రపంచం చాలా మారిపోయింది. అనేక కొత్త ఆలోచనల గాలుల మధ్య మనం వుక్కిరి బిక్కిరి అయ్యాం. రెండు రాష్ట్రాల చుట్టూ కన్న కలల్ని సాకారం చేసుకోవాలన్న తపన వొక వైపూ, ఆ కలలకి పుట్టుకొస్తున్న అడ్డంకులు  ఇంకో వైపూ. వీటన్నిటి మధ్యా తమని తాము మళ్ళీ వెతుక్కుంటున్న అస్తిత్వ ఉద్యమాలూ. వీటిని  ప్రతిఫలిస్తున్న సాహిత్య దర్పణాలూ. సాహిత్యమూ, సమాజమూ, సంస్కృతుల కలయికలోంచి పెల్లుబికుతున్న వాదవివాదాలూ. వీటిల్లో ఏ వొక్కటి లోపించినా సాహిత్యం తన కాళ్ళ కింద వున్న నేలని మరచిపోయినట్టే! ఇవన్నీ వొక చోట వొదిగిన కుదురైన సన్నివేశం “సారంగ”.

ఈ ఏడాది మాకు అమితమైన సంతృప్తిని కలిగించిన శీర్షిక “కథా సారంగ.” గత ఏడాది సారంగ ప్రచురించిన కథల్లో కొన్ని కథలకి కథా వార్షిక సంకలనాల్లో విశేషమైన ప్రాధాన్యం దక్కింది. “కథా సారంగ”లో కథ అచ్చు కావడం అంటే తెలుగు కథా ప్రపంచంలో తమకొక గౌరవనీయమైన స్థానం దక్కినట్టే అని చాలా మంది కథకులు సంతృప్తిని వెలిబుచ్చిన దశ ఇది. ప్రసిద్ధులతో పాటు కొత్త తరం రచయితలని కూడా ఈ వేదిక మీదికి తీసుకురావడంలో సారంగ సఫలమైంది. అలాగే, కథనరంగం గురించి చర్చా ప్రాధాన్యం వున్న అంశాలని తీసుకువచ్చి, అర్థవంతమైన దిశ వైపు అడుగులు కదిపేట్టు స్పూర్తినిచ్చింది.

గడిచిన జ్ఞాపకాల పాత సంచికల్ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఈ పన్నెండు నెలల వ్యవధిలో వారం వారం క్రమం తప్పకుండా వెలువడుతూ ఎన్ని శీర్షికలు, ఎన్ని రచనలు ఎన్ని వర్ణాలుగా కనిపిస్తున్నాయో!  ఎంతో మందీ మార్బలంతో పెద్ద సర్క్యులేషన్ వున్న అచ్చు పత్రికలే నాణ్యత వున్న రచనల కోసం అష్ట కష్టాలూ పడుతున్న స్థితిలో ఎలాంటి వనరులూ లేని, కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే వున్న చిన్న అంతర్జాల పత్రిక ఇంత మందిని వొక దగ్గిరకి తీసుకురావడం అంటే అది అంత తేలికేమీ కాదు. అయితే, వొక దశ వచ్చేసరికి రచనల కోసం మేం పదే పదే అడగాల్సిన పరిస్థితి కూడా తొలగిపోయింది. రచయితలే ఇతర రచయితల్ని ప్రోత్సహిస్తూ, సారంగకి రాయించడం మొదలయింది. ఆ కారణంగా ప్రతి వారం కేవలం ఎనిమిది రచనలు మాత్రమే అని మొదట పెట్టుకున్న పరిమితిని దాటి ఇప్పుడు వారానికి పదహారు రచనలు వేస్తున్న సందర్భం కూడా వుంది. ఇక వీటి ఎంపికలో, కూర్పులో మేం ఎంత సమయం పెడ్తున్నామో  అది మీ ఊహకే వదిలి పెడ్తున్నాం. ఒక్క అయిదు నిమిషాలు కూడా వూరికే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేని ప్రస్తుత కాలంలో వారంలో ఎన్ని గంటలు అలా కంప్యూటరు ముందు తదేక దీక్షగా కూర్చొని వుంటే తప్ప ఇది సాధ్యపడదని మీకు తెలుసు.

నిష్కర్షగా వుండడం కష్టం. లేదా, వొక కట్టుబాటుతో వుండడం అంత కంటే కష్టం. ఏదో నాలుగు కవితలూ రెండు కథలూ వొకటో వొకటిన్నరో వ్యాసమూ వేసి, ఎలాంటి రంగూ రుచీ లేని నిర్గుణ వ్యక్తిత్వంతో నిలబడడం సారంగకి సాధ్యపడడం లేదు. అవసరమైన సందర్భాల్లో ముక్త కంఠం పూరించి వున్నమాటని నీళ్ళు నమలకుండా చెప్పే ప్రజాస్వామిక/ నిర్మొహమాట సంస్కృతి సారంగ జీవలక్షణం. నిర్జీవమైన కేవల సాహిత్య కాలక్షేపం మీద మాకు నమ్మకమూ లేదు, గౌరవమూ లేదు. వొక మాట మీద నిలకడగా నిలబడినందుకు కొందరు రచయితల్ని సారంగ కోల్పోవాల్సి వచ్చింది కూడా- “ఇంత activism సాహిత్య పత్రికకి అవసరమా?” అంటూ పంపిన రచనల్ని వెనక్కి తీసుకున్న ప్రముఖులూ వున్నారు. వాళ్ళ అభిప్రాయ స్వేచ్చని చిర్నవ్వుతో గౌరవించాం. సారంగ “కేవలం సాహిత్య” పత్రిక కాదు అన్న విషయం ఇప్పటికే స్పష్టంగా అర్థమైంది అందరికీ- బహుశా, ఈ ఏడాది ఆ విధంగా సారంగకి బలమైన మైలురాయి!  ఈ మైలురాయి దాకా మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించిన రచయితలకూ, చదువరులకూ మా కృతజ్ఞతలు. ఈ దారిని ఇలా సాగిపోవడానికి, ఈ నడక ఆగకుండా వుండడానికి మీ తోడు వుంటుందని నమ్ముతూ…

  • -సారంగ సంపాదకులు

 

మీ మాటలు

  1. తహిరో says:

    నాలుగవ అడుగే కాదు 40 వ అడుగు వరకూ నిలకడగా, నిబ్బరంగా మీరు ఉండి “సారంగ”ను నడిపించాలని కోరుతున్నాను – అభినందనలు.

  2. ఎదుగుతూ ఎదుగుతూనే సారంగ, మాలాంటి కొందరికి రాయగలమన్న ఆత్మ విశ్వాసాన్ని కూడా కలిగించింది . అభినందనలతో పాటుగా ధన్యవాదాలు కూడా .

  3. ఎ.కె.ప్రభాకర్ says:

    నిజమే ఇది కేవలం సాహిత్య పత్రిక మాత్రమె కాదు. మనిషి జీవితం లో కూడా నాలుగేళ్ళు వచ్చేసరికి గుణాలు స్థిర పడతాయి అంటారు . సారంగ విషయం లో కూడా అది నిజమైంది. ఈ ప్రయాణం ఇలాగే నిలకడ గా సాగాలని కోరుతూ… అభినందనలతో …

  4. rani siva sankara sarma says:

    కేవలం అకడమిక్ వాసన కొట్ట కుండా సీరియస్ చర్చా వేదికగా కొనసాగుతోంది సారంగ.

  5. B.Narsan says:

    A unique success of saaranga team..wishing more and more successful steps….

  6. chandolu chandrasekhar says:

    సారంగ సంపాదక మండలికి , నమస్తే నిలకడగా సాగుతున్న సారంగ నడక ప్రజాస్వామము ,అభ్యుదయం రెండు పాదాలతో ముందుకు సాగాలని ….

  7. sasi kala says:

    అభినందనలు . సాహిత్య చరిత్ర మీ కష్టాన్ని తప్పక గుర్తించు కుంటుంది

  8. balasudhakarmouli says:

    అభినందనలు…

  9. అభినందనలు, అఫ్సర్

  10. సారంగ శబ్ధ సౌందర్యానికి ముగ్ధులం !

  11. సాయి.గోరంట్ల says:

    సారంగ ఓక బ్రాండ్..ఇపుడు
    ఓక గౌరవం
    అంతటి స్థాయిలో తెలుగు సాహిత్యంలో సారంగ ఓక ప్రత్యేకం..
    అభినందనలు..సారంగ సంపాదక వర్గానికి.
    ఇంకా ఎన్నో అడుగులు ముందుకు సాగాలని కోరుకుంటూ

  12. నాలుగు అదుగులే కాదు — మీరు-మేము కలిసి వేస్తున్న ఈ అడుగులు చివ్వరి శ్వాస వరకు ఇలగే సాగిపోవాలని కొరుకుంటూ–అభినందనలతోఒక మౌన పాఠకురాలు—–

  13. THIRUPALU says:

    సంపాదక వర్గానికి అభినందనలు .

  14. Prasuna says:

    Hearty congratulations….

  15. అభినందనలు …ఒక అభిమాని.

  16. Jaya Reddy Boda says:

    శుభాభినందనలు

  17. Anil battula says:

    అభినందనలు…”చాయ” కి మీ సహకారం మరువలేనిది…అఫ్సర్ గారు…

  18. వనజ తాతినేని says:

    సారంగ టీమ్ కి హృదయపూర్వక అభినందనలు.

  19. aBinandanalu.

  20. Krishna Veni Chari says:

    మీరు ఎదుగుతూ, మాలాంటి వారికి రాసే అవకాశం ఇచ్చిన సంపాదకవర్గానికి అభినందనలు.

  21. Delhi (Devarakonda) Subrahmanyam says:

    అఫ్సర్ గారికి మిగతా సారంగ మిత్రులకూ హార్దిక అభినందనలు. తెలుగు సాహిత్యం లో సారంగ ప్రముఖ పత్రికే కాకా మంచి సాహిత్య చర్చకు ఒక మార్గదర్శి అయింది. కేవలం సాహిత్యం ఆస్వాదించే నాలాంటి వారికీ కూడా భావాలూ రాయడంలో ఎంతో సహకరిస్తున్న సారంగ మిత్రులకు ప్రత్యేక నెనర్లు. సారంగ నడపడం లో ఒక వేల ఆర్ధిక అవసరం ఉంటె అందరమూ తలో చేయ వేద్దాము. ఇంకొక సరి అభినందనలతోనూ , సుభాకంక్షలతోనూ.

  22. MV Rami Reddy says:

    మూడు స్తంభాలపై సారంగను నిలబెట్టడం అంత తేలిక కాదు. ఆ పనిని విజయవంతంగా నిర్వహిస్తున్న మీకు హృదయ పూర్వక అబ్నినందనలు.

  23. సారంగ నిర్వాహక మిత్రులకు అభినందనలు. ఈ విజయ యాత్ర కొనసాగాలని కోరుకుంటున్నాను.

  24. కె.కె. రామయ్య says:

    సాహిత్యమూ, సమాజమూ, సంస్కృతుల కలయికలోంచి పెల్లుబికుతున్న వాదవివాదాలకు వేదికగా నిలిచిన “సారంగ” అంతర్జాల పత్రిక 4వ వసంతం లోకి అడుగిడుతున్న శుభసందర్భంలో అఫ్సర్ గారికి మిగతా సారంగ సంపాదక వర్గానికి హార్ధిక అభినందనలు.

    “కథా సారంగ.”, రామిండ్రి సిన్నయ్యగోరి ( దాట్ల లలిత గారి ) యీదేశిన గోదారి; పి. లలిత గారి అద్భుతం సినిమా పరిచయాలు; అరుణ్ సాగర్, రోహిత్ వేములకు స్పాంటేనియిటీ తో వెల్లువెత్తిన నివాళులు; జి. ఎస్‌. రామ్మోహన్‌ గారి సంవేదనలు; మరో సారి కా.రా. కథల్లోకి శీర్షిక; పి. మోహన్ గారు అనువాదం చేసిన వోల్టేర్ సుప్రసిద్ధ నవలిక ‘కాండీడ్’; మనసుపై చెరగని ముద్రవేసినవి ఎన్నెన్నో. ఇంత activism, ఇంత విసృతమైన content ఎలా సాధించగలిగారా అని ఎప్పుడూ ఆశ్చర్యమే. ఈ సాహిత్య ఉద్యమస్పూర్తి ఇలాగే పదికాలాలు కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  25. kurmanath says:

    విష్ యు ఆల్ ది బెస్ట్, సారంగ టీం

  26. చందు తులసి says:

    ఒక నిబద్ధత తో ముందుకు సాగుతున్న సారంగ బృందానికి అభినందనలు..
    అటు ప్రమాణాలకు రాజీపడకుండానే…కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత సారంగకే దక్కుతుంది.
    పది కాలాలు నిలబడాలని…తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ
    సారంగ బృందానికి మరోసారి అభినందనలు

  27. leela gopaluni says:

    మార్చ్ 11, 2016 పత్రిక లోని శివలక్ష్మి గారి అందమైన కలలాంటి ఆ నేల గాలి చాల బావుంది . భావ వ్యక్తీ కరణ బావుంది . చదువు తుంటే ఆ ప్లేస్ కి వెళ్ళిన అనుభూతి వస్తోంది.

మీ మాటలు

*