అనిల్ ‘కథాయణం’ నుంచి ‘నాగరికథ’ దాకా!

kathayanam

-టి. చంద్రశేఖర రెడ్డి 

~

 

సారంగ-లో కథారచయిత అనిల్ ఎస్. రాయల్ తో వేంపల్లి షరీఫ్ గారి ముఖాముఖీలో ‘కథాయణం’ వ్యాససంపుటి, ‘నాగరికథ’ కథల సంపుటి గురించి ప్రస్తావన ఉంది. కథాయణం చదివింతర్వాత, నేను చదివిన ఇతర కథలను, కథాయణంలో  ఉన్న సూచనల్తో పోల్చి చూస్తే ఆ కథలకూ,  ఈ సూచనలకూ పొంతన లేదనిపించింది. అంతే కాదు. కథాయణంకు అనుబంధంగా కథనకుతూహలం-లో చెప్పిన క్లుప్తత ఆ కథల్లో లేనట్లు కనిపించింది.

కథాయణంలోనూ-కథనకుతూహలంలోనూ ఉన్న సూచనలు మిగిలిన రచయితల కథల్లో ఎందుకు అమలు కాలేదు? అవి అమలు చేయకూడనివా? అమలు చేయలేనంత కష్టమైనవా? అన్న అనుమానం వచ్చింది. నివృత్తి కోసం; ఆ సూచనలిచ్చిన రచయిత వాటిని తన కథల్లో ఎంతవరకు, ఎలా పాటించారో తెలుసుకోవాలని ప్రయత్నించాను. దాని ఫలితమే ఇది.

శీర్షిక గురించి సూచనలు: అవి ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. కథల విషయంలో శీర్షిక వీలైనంత విభిన్నంగా ఉంటే మంచిది.

నాగరికథ-కథ ఒక నాగరికత ఎలా అంతమైందో శాస్త్రీయంగా తెల్సుకోటానికి చేసిన ఒక ఊహ. అందువల్ల కథకి నాగరికత అని కానీ, ఆ పదాన్ని నాగరి’కత’ గా మార్చి ‘కత’ నాగరికత కి సంబంధించిన కథ అనిపించేలా  శీర్షికగా పెట్టుకోవచ్చు. కానీ నాగరి’కత’ లో ఇమిడి ఉన్న ‘కత’ అనే పదం ఎక్కువమంది దృష్టిని  ఆకట్టుకోపోవచ్చు. అందుకనే, కత, కథగా మారి ‘నాగరికథ’ అయింది. కథాంశాన్ని క్లుప్తంగా, గుప్తంగా సూచించింది. విభిన్నంగా ఉంది.

  1. శీర్షికలో నూతనత్వమూ, వైవిధ్యమూ ధ్వనిస్తే మంచిది.

రెండు విరుద్ధ విషయాలని సూచించే పదబంధం వెంటనే ఆకట్టుకుంటుంది. ప్రియశత్రువు అలాంటి రెండు  విభిన్న పదాల మేళవింపు. అందుకే ఆ కథ పేరులో నూతనత్వం, వైవిధ్యం ధ్వనించింది. కథలో ప్రధాన పాత్ర పేరు ‘ప్రియ’ అవటం వలన కథాంశం అంతర్లీనంగా పాఠకుడికి అందింది.

  1. శీర్షిక చూడగానే, అర్థమైనా కాకపోయినా అది కథ చదవమని ప్రేరేపించాలి.

కుంతీకుమారి కథ, మహాభారతంలో కుంతీదేవిలానే కుమారిగానే తల్లిగా మారిన స్త్రీ కథ.  కనుక ఈ కథకి  ‘కుంతీదేవి’ అని పేరు పెట్టొచ్చు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. ఈ కథ కూడా పెళ్లికి ముందే తల్లి అయిన ఒక స్త్రీ కథ అని పాఠకులు  ప్రక్కన పడేయొచ్చు. అలా కాక, కుంతీకుమారి అని కథకి పేరు పెడితే, మహాభారతంలో కుంతికి పుట్టింది కర్ణుడు. కుంతికి కొడుకు కాకుండా కూతురు పుట్టటమేమిటి? అనుకుని కథలోకి పాఠకుడు ఆకర్షించబడొచ్చు. మహాభారతంలో కుంతీదేవి ముందు తల్లి, తర్వాత శ్రీమతి అయింది. కుంతీకుమారి కథలో,  ప్రధానపాత్ర కుమారిగానే మిగిలిపోయింది. కథకి పెట్టిన పేరు పరోక్షంగా కథాంశాన్ని కూడా సూచించింది.

  1. కొన్ని సందర్భాల్లో కథాంశాన్ని వివరించేలా పేరు పెట్టటమే మంచిది.

మరో ప్రపంచం కథ,  పారలల్ యూనివర్సెస్ గురించి. తెలుగులో ఆ కథకి పెట్టిన పేరు ఆ కథాంశానికి నిగూఢ సూచన ఇచ్చింది. అలానే మిగిలిన రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, మరపురాని కథ-కథల  పేర్లు కూడా.

  1. కథలకి పేర్లు పెట్టే క్రమంలో చాలా మంది ఔత్సాహిక రచయితలు/రచయిత్రులు చేసే పొరపాటు: కథలో ప్రధాన పాత్ర పేరునే కథ పేరుగా ఎంచుకోవటం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, తొమ్మిదింటికి పాత్రల పేర్లు కథ పేరుగా లేవు. ఒక్క మినహాయింపు ‘కల్కి’ ప్రధాన పాత్ర  అయిన ‘కల్కి’ కథ. ఆ కథకి ‘కల్కి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్న దాని గురించి కథాయణంలో వివరణ ఉంది.

  1. చప్పగా, సర్వ సాధారణంగా అనిపించే పదాలని, వాడీ వాడీ అరగదీసిన సామెతలని కథలకి శీర్షికలుగా ఎంచుకోకుండా ఉండటం ఉత్తమం.

నాగరికథ కథా సంకలనంలో ఉన్న పది కథల్లో, ఏ కథకీ సామెతలు పేర్లుగా లేవు.

  1. ప్రసిద్ధమైన కథల పేర్లని వీలైనంత వరకూ మళ్లీ వాడుకోకుండా ఉంటే మేలు.

నాకు తెలిసి కథలకి పెట్టిన పేర్లు  ప్రసిధ్ధకథల పేర్లు, ఇతర ప్రసిద్ధ సాహితీ ప్రక్రియల పేర్లు కూడా కావు.

  1. కథ పేరు ఎంత పెద్దదిగా ఉందనేది శీర్షికల విషయంలో మరో కీలకమైన విషయం.

నాగరికథ-లో ఉన్న కథల్లో; అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలు, రెండే పదాలు ఉన్న పేరు-‘మరపురాని కథ’.  మిగిలిన తొమ్మిది కథల్లో, ఆరు కథలకు ఒక పదమే పేరు. మిగిలిన మూడిటికీ ఒక పదబంధం శీర్షిక.

  1. శీర్షికలో ఓ రకమైన అర్థాన్ని సూచిస్తూ, కథ పూర్తిగా చదివాక అందులో మరో అర్థం గోచరించేలా పేరు పెట్టటానికి నేను ప్రాధాన్యతనిస్తాను.

కథల పేరుకి వాడిన పదాలు వాటి అసలు అర్థమే సూచించటం; నాగరికథ, ప్రియశత్రువు, కుంతీకుమారి భిన్నమైన పదప్రయోగాలు కావడం; వాటివల్ల అందిన సూచన ప్రకారం కథ ఉండకపోవటం-ఈ కథల కథాంశం, శీర్షికల ద్వారా వేసుకున్న అంచనాకి భిన్నంగా ఉండటం సంబంధిత సూచన అమలుకు నిదర్శనం.

కొసమెరుపు:

  1. నాగరికథ కథాసంకలనంలో ఉన్న పది కథల్లో అయిదు కథల పేర్లు; రహస్యం (1967), మరపురాని కథ (1967)), మరో ప్రపంచం (1970), శిక్ష (1985), కల్కి (1997) కథలు ప్రచురించబడటానికి ముందే విడుదలైన తెలుగు చలనచిత్రాల పేర్లు. ఇది యాదృచ్ఛికం కావచ్చు-కాని గమనార్హం. కుంతీకుమారి లాగే ధ్వనించే కుంతీపుత్రుడు 1993 లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రళయం కథ ముద్రితమైన తర్వాత 2015 లో అదే పేరుతో ఒక తెలుగు సినిమా విడుదలైంది. రీబూట్ కంప్యూటర్ కే కాదు చలనచిత్రరంగానికి కూడా చెందిన ప్రక్రియ.

ఎత్తుగడ పై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

  1. అత్యవసరమైతే తప్ప కథని వర్ణనలతో మొదలు పెట్టను. అత్యవసరమైనా కూడా కథని సర్వసాధారణమైన సన్నివేశంతో మొదలు పెట్టను.

నాగరికథ, మరో ప్రపంచం, కల్కి,  ప్రియశత్రువు కథలు ఒక సంభాషణతోనే మొదలవుతాయి. శిక్ష కథ  కథాయణంలో ఒప్పుకున్నట్లు ఒక వర్ణనతో, వైవిధ్యం కోసం  ప్రాస ఉన్న పదాల్తో మొదలైంది. ప్రళయం కథ సంభాషణతో కాకుండా ఒక గమనికతో మొదలవుతుంది.  రీబూట్, రహస్యం, మరపురాని కథలు భిన్నంగా మొదలయ్యాయి. మరపురాని కథ ఒకటే ఒక సాధారణమైన సన్నివేశంతో మొదలయినట్లనిపిస్తుంది.  కుంతీకుమారి అనువాదకథ. దాని ఎత్తుగడ మీద అనువాదకుడికి స్వేచ్ఛ లేదు.

  1. మొదటి పేరా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. వీలైతే మూడు నాలుగు లైన్లకు మించకుండా. అంతకన్నా చిన్నగా ఉంటే మరీ మంచిది.

నాగరికథ కథలో ఈ సూచన ఏడు లైన్లతో కొంచెం దారి తప్పింది. మరో ప్రపంచం, రీబూట్, రహస్యం, శిక్ష, ప్రళయం, కుంతీ కుమారి; రెండు లైన్లతో; కల్కి, ప్రియశత్రువు, మరపురాని కథ ఒక లైనుతో మొదలయ్యాయి.

  1. మొత్తమ్మీద, ఎత్తుగడ అనేది వీలైనంత క్లుప్తంగా ఉండి చదవబోయే కథపై ఉత్సుకత కలిగించాలి.

ఎత్తుగడతో ఉత్సుకత ఎలా కలిగించవచ్చో అన్నదానికి, నాగరికథ కథ మొదలే ఒక ఉదాహరణ. అది  కథాయణంలో ప్రస్తావించబడింది. కల్కి కథ అయితే మరీ క్లుప్తంగా రెండు పదాల్తోనే పాఠకుడ్ని కథలోకి లాక్కు వెళుతుంది. ఆ రెండు పదాలూ “ఇద్దర్ని చంపాలి.”

ముగింపుపై సూచనలు: ఎలా, ఎంతవరకు పాటించబడ్డాయి

1.A.      ఎత్తుగడ భాగంలో, ‘కథని ఎలా మొదలెట్టినా ఆ ప్రారంభ వాక్యాలు పాఠకుల్లో ప్రశ్నలు రేపెట్టేలా చెయ్యాలి’ అని ఉంది. ముగింపులో ఆ ప్రశ్నలకి జవాబులు దొరకాలి అని చెప్పబడింది.

1.B.      అవి అరటిపండు వొలిచి పెట్టినంత విపులంగా ఉండనక్కరలేదు. కనీసం ఆ సమాధానాలు తామే వెతుక్కోవటానికి అవసరమైనంత సమాచారమన్నా కథలో లభించాలి.

ఉదాహరణకు-నాగరికథ కథ తీసుకుందాం. దీనిలో ‘ఎత్తుగడ’ టైమ్ మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణం చేయడం గురించి. హైస్కూలు విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇస్తున్న ఓ అణుశాస్త్రవేత్త వివరణతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత తాత గారు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే కాలంలో వెనక్కెళ్లి ఆయన్ను చంపెయ్యడం గురించి ఒక ప్రస్తావన ఉంటుంది. కాలయంత్రం ద్వారా కాలప్రయాణం  గురించి  పాఠం చెపుతున్నపుడు అణుశాస్త్రవేత్తకి వాళ్ల తాతగారి గురించి సెల్ ఫోన్ ద్వారా ఒక వార్త వస్తుంది. క్లాసు అర్ధంతరంగా ఆగిపోతుంది. తాతయ్య దగ్గరకి హడావిడిగా మనవడి ప్రయాణం మొదలవుతుంది. దీంతో పాఠకుడి మెదడులో టైమ్ మెషీన్ గురించీ, అందులో వెనక్కి వెళ్లడం గురించీ, తాతయ్య గురించి వచ్చిన వార్త ఏమిటనే దాని గురించీ ప్రశ్నలు మొదలవుతాయి.

ఆ ప్రశ్నలకు సమాధానాల కోసం పాఠకుడు తప్పనిసరిగా మిగిలిన కథలోకి వెళతాడు. కథనంలో టైమ్ మెషీన్ ఉందా? లేదా? ఉంటే ఎలా తయారయింది? దాన్ని ఎవరు తయారు చేశారు? అందులో కాలంలో ఎవరైనా వెనక్కి ప్రయాణం చేశారా? వెళ్లింది ఎలా? వెళ్లింది ఎవరు? ఆ ప్రయాణఫలితం ఏంటి? అనే దాని మీద తగినంత సమాచారం ఒక దాని తర్వాత ఒకటి కథకుడు అందిస్తాడు.

ఈ ప్రశ్నల్లో కొన్నిటికి జవాబులు కథలో నేరుగా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటానికి అవసరమైన ఆధారాలు కథలో ఉంటాయి. ప్రధాన పాత్ర ప్రత్యక్షపద్ధతిలో తెలిసిన వాటిని మొదట నమ్మదు. కాని నమ్మక తప్పదు. పరోక్షంగా తెలిసిన వాటిని మనవడు నమ్ముతాడో లేదో రచయిత స్పష్టంగా చెప్పడు.  నమ్మాలో వద్దో విశ్లేషించి తెలుసుకోవాల్సింది మనవడూ, అతడితో పాటు మనమూ.

  1. A. కథలకి రెండు రకాల ముగింపులుంటాయి-ప్రధానపాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో చూపటం ఒక రకం ముగింపు. ఇది క్రైమ్, సస్పెన్స్, డిటెక్టివ్, హారర్ కథలకి వర్తిస్తుంది.

2.B. పాత్రల అంతఃసంఘర్షణ చిత్రణపై దృష్టి కేంద్రీకరించే లిటరరీ ఫిక్షన్ కోవకి చెందిన కథలైతే ప్రధానపాత్ర వ్యక్తిత్వంలో వచ్చే మార్పు, ఆలోచనావిధానంలో కలిగే పరిణతి, లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం…ఇలాంటి విషయంతో ముగుస్తాయి.

నాగరికథ కథ పై రెండు వర్గాల్లో ఏ విభాగానికి చెందినది అనేది అప్రస్తుతం అనుకుంటే; ప్రధాన పాత్ర తనని వేధిస్తున్న సమస్యని ఎలా పరిష్కరించిందో; లేదా ఆ పాత్ర కనుగొన్న సత్యం ఏమిటో; కథ ముగింపు చెప్పాలి.

ఈ కథలో ప్రధాన పాత్ర అణుశాస్త్రవేత్త. అతడిని వేధించే సమస్యా, పాఠకుడిని వేధించే ప్రశ్నల సారాంశం ఒకటే. సూచన 2-A ప్రకారం, ఆ పాత్ర తన సమస్యని పరిష్కరించుకోవాల్సింది, సూచన 2-B ప్రకారం ఇవ్వాల్సిన  సమాచారం. దాన్ని కథకుడు తాత ద్వారా, మనవడికి అందిస్తాడు. దాన్ని విశ్లేషించి మనవడు ఒక నిర్ధారణకి వస్తాడు. కాని, అదేంటో రచయిత పాఠకులకి చెప్పడు. దాన్ని కథ ముగింపిడికిట్లో పెట్టి, తెరిచి ఏముందో చూసే బాధ్యత పాఠకులకే వదిలేస్తాడు. అది సవ్యమా, సంభావ్యమా అన్నది వదిలేస్తే, అదిక్కడ చెప్పటం భావ్యం కాదు.

  1. రచయిత అనేవాడు ఎన్ని తిప్పలైనా పడి కథని కంచికి చేర్చాల్సిందే. కాడి మధ్యలో వదిలేస్తే కుదరదు.

నాగరికథ కథలో రచయిత కాడిని పాఠకులతో పాటు తాను కూడా మోసి కంచికి కూతవేటు దూరం దాకా  వచ్చాడు. ఊరు బయట తాను కాడిని వదిలేసి పాఠకులకి మిగిలిన ప్రయాణం ఎలా చెయ్యాలో, గమ్యస్థానం ఎలా చేరాలో చెప్పాడు. తమంతట తాము గమ్యం చేరిన తృప్తి కలగాలంటే ఆ కాస్త దూరం ప్రయాణించాల్సింది పాఠకులే.

  1. కాబట్టి ముగింపు అనేది తప్పనిసరిగా చిన్నదో పెద్దదో ఓ మార్పుని సూచించాలి.

ఈ సూచన కథలో ఎలా పాటించబడిందో చెపితే, కథ ఇంకా చదవని పాఠకులకి కథ చదువుతున్నపుడు కలిగే ఉత్సుకత మిగలదు.

  1. మీరనుకున్న ముగింపు కోసం ప్రధాన పాత్ర (లేదా ఇతర ముఖ్య పాత్రల) స్వభావాన్ని ఉన్నపళాన మార్చేయటం సరైన పద్ధతి కాదు.

నాగరికథ కథ లో అలాంటి మార్పేదీ లేదు.

  1. ముగింపు ఎలా ఉండబోతోందో కథనిండా క్లూస్ వదులుతూనే, మరో వైపు పాఠకుడిని మాయచేసి పెడదారి పట్టిస్తూ, చివర్లో అతన్ని ఆకస్మికంగా అసలు దారికి మళ్లించేదే అసలు ఊహాతీతమైన ముగింపు.

నాగరికథ కథలో మనవడికి కలిగిన అనుమానాల ద్వారా పాఠకులు పొందింది, వాళ్లకు అందిందీ అదే.

తుది మాట:

మిగిలిన తొమ్మిది కథల్లో ఏం జరిగిందో ఎలా జరిగిందో చూడాల్సింది పాఠకులే.

*

 

మీ మాటలు

  1. మంచి విశ్లేషణ సర్, ధన్యవాదాలు

  2. Yalla Atchuta Ramayya says:

    చంద్రశేఖర రెడ్డి గారూ, మంచి వ్యాసం అందించి నందుకు ధన్యవాదాలు. చాలా మంది తెలుగు రచయితలు కథలు రాయడం గురించి వ్యాసాలు రాసారు. వాళ్ళెవరూ ఆ సలహాలను పాటించిన పాపాన పోయినట్లు అనిపించదు, వాళ్ళ కథలను చదివితే! అనిల్ గారు అందుకు మినహాయింపు అని మీరు నిరూపించారు. అనిల్ గారి కథలనీ , ‘కథాయణం’ వ్యాససంపుటిని మరోసారి సీరియస్ గా చదవాలనిపిస్తూంది – యాళ్ల అచ్యుత రామయ్య

  3. Vijaya Karra says:

    రచయత కథని కథాయణానికి అన్వయించి చేసిన విశ్లేషణ – చాలా బావుందండి !

Leave a Reply to Yalla Atchuta Ramayya Cancel reply

*